డ్రగ్స్ దందాలో కొత్తరకం మాఫియా

  పుష్ప సినిమా ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే... అదే తరహాలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు కూడా సంచలనం సృష్టి స్తున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. ఓ మాఫియా కొత్తరకం డ్రగ్స్ దందాకు తెరలేపారు. ఈ ముఠాలు పుష్ప సినిమాను మించి.. కొత్త కొత్త తరహాలో  డ్రగ్స్ సరఫరా చేస్తు న్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికా రులు పూర్తిస్థాయిలో కృషి చేస్తూ ఉంటే... మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలు రకరకాల వస్తువుల మాటున వివిధ రకాల డ్రగ్స్ లను ఏదేచ్ఛగా సరఫరా చేస్తున్నారు  ప్రముఖ యూనివర్సిటీ లో 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఈగల్ టీమ్ గుర్తించి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో కీలక పాత్ర వహించిన ముగ్గురు విద్యార్థు లను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ యూని వర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలమైన విష యాలు బయట పడ్డాయి. ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతుం దని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా... కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్న ట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 10 కొరియర్ సంస్థల నుంచి 100 కోట్ల రూపాయల డ్రగ్స్ తరలించినట్లుగా అధికారులు గుర్తించారు.  ఈ డ్రగ్స్ ముఠాలు నగర శివారు ప్రాంతాల్లో  ఉన్న మెడికల్ కాలేజీలు మరియు ఇంజ నీరింగ్ కాలేజీల విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ విక్రయాలు జరుపు తున్నారు అయితే ఈ డ్రగ్స్ ముఠాలు పుష్ప సినిమా తరహాలో పుస్తకాలు, గాజులు, మెడిసిన్, ఆయుర్వేద ఉత్పత్తులు ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాలు మొత్తం 36 రకాల వస్తువుల తినుబండారాల మాటున డ్రగ్స్ ని హైదరాబాదు నగరానికి పంపిస్తున్నారు. కొరియర్ సర్వీసులలో డ్రగ్స్ తో కూడిన వస్తువులను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు పుస్తకాల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.  ఈ ముఠాలు ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా యూనివర్సిటీ హాస్టల్ లోపలికి మారుతి కొరియర్స్ ద్వారా ఓజీ డ్రగ్స్ పుస్తకాల మధ్యలో పెట్టి పంపిస్తు న్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థులకు కాస్మెటిక్ డబ్బాలో డ్రాప్స్ పెట్టి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా మల్నాడు డ్రగ్స్ నిందితులకు ఫుడ్ ఆర్టికల్స్ రూపంలో డ్రస్ సరఫరా చేశారు.. అంతేకాకుండా పలువురు వ్యాపారవేత్తలకి ఫుడ్ ఆర్టికల్స్ మధ్యలో డ్రగ్స్ పెట్టి పంపిస్తున్నారు. మరికొందరికి మట్టి గాజుల మాటున ఎఫిడ్రిన్ పొట్లాలను కొరియర్ ద్వారా డ్రగ్స్ తరలిస్తు న్నారు. కొరియర్ సంస్థలు కమిషన్కు కక్కుర్తి పడి డ్రగ్స్ ముఠాలకు సహక రిస్తున్నట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కొరియర్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు..

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నిట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బే అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. ఆయన హతమార్చేందుకు కొందరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు విశాఖ జైలు ఖైదీ శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడని జగదీశ్ అని సమాచారం.  ప్రస్తుతం ఈ వీడియోపై ఎస్పీ శ్రీకాంత్ విచారణ జరుపుతుమన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి చర్చిస్తున్న రౌడీషీర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో అంశం తన దృష్టిలో ఉందని ఎస్పీ.  విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నని ఎస్పీ తెలిపారు

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని సుప్రీంలో పిటిషన్

  లంబాడీలను, బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు పిటిషన్ వేశారు. 1976కు ముందు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.1976కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలలో వీరిని ఎస్టీలుగా పరిగణించలేదని, వేరే రాష్ట్రల నుండి వచ్చి గిరిజనుల హక్కులను కొల్లగొడుతున్నారని  ఎమ్మెల్యే తెల్లం  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఆదేశాలు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. బంజారాలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మిగిలిన ఎస్టీ కులాలతో పోలిస్తే  మెరుగైన స్థానంలో ఉన్నారని ఆ పిటీషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అలాంటి వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అన్ని రకాలుగా వెనుకబడిన కోయ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి విచారణ జరిపే అవకాశం ఉంది.

ప‌వ‌న్ ధ‌రించిన... ఈ ఉంగ‌రంలో ఇంత అర్ధ‌ముందా?

  విశాఖ సేన‌తో సేనాని విస్తృత స్థాయి స‌మావేశాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు అటు ఇటు ఆడిస్తూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వేలికి ప్ర‌త్యేకించి ఒక ఉంగ‌రం ధ‌రించిన‌ట్టు క‌నిపించింది. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌క‌ర‌కాల ఉంగ‌రాలు ధ‌రిస్తూ క‌నిపిస్తున్నారు. వాటిలో ప‌గ‌డం.. ఉంగ‌రం ఆపై మేరు కూర్మ‌ ఉంగ‌రం.. ప్ర‌స్తుతం చూస్తే నాగ‌బంధ ఉంగ‌రం క‌నిపించించింది. దీని అర్ధ‌మేంట‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. గ‌తంలో ఆయ‌న కూర్మం ఉండే మేరు ఉంగ‌రం ధ‌రించేవారు. మాములుగా ఇది ఎందుకంటే మేరు  ప‌ర్వ‌తాన్ని పాల స‌ముద్రంలో వేసి వాసుకి ద్వారా చిల‌క‌డానికి ప‌నికొస్తుంద‌ని అంటారు. ఆ ప‌ర్వ‌తం మ‌రీ స‌ముద్రంలోప‌ల మునిగి పోకుండా ఆపడానికి పుట్టుకొచ్చిందే కూర్మావ‌తారం. ఆ అవ‌తారం అర్ద‌మేంటంటే ఏదైనా స‌రే మునిగిపోకుండా ఆపేద‌ని అర్ధం. దాని ప్ర‌కారం కూట‌మిలో తానొక కూర్మావ‌తారం దాల్చి ఎలాగోలా గ‌ట్టించ‌గ‌లిగిన పేరు సాధించారు ప‌వ‌న్. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ప్ర‌భుత్వం 15 ఏళ్ల వ‌ర‌కూ ఉండాల్సిందే అంటున్నారు. కార‌ణం.. ఇటు రాజ‌ధాని అమ‌రావ‌తి కానీ, అటు రాష్ట్రం కానీ స్థిర‌ప‌డి అభివృద్ది చెందాలంటే.. ఈ మాత్రం స‌మ‌యం అవ‌స‌రం అన్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న‌. ఈ విష‌యంపై నేరుగా జ‌న‌సైనికులు నాగబాబునే మొహాన్నే అడిగేసిన ప‌రిస్థితి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అధినేత తీస్కున్న నిర్ణ‌యాన్ని మ‌నం ఎవ్వ‌రం మార్చ‌లేము అని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేస్తున్నారు నాగ‌బాబు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ ధ‌రించిన ఈ నాగ‌బంధ ఉంగ‌రంలో ఒక బంధం ఉంటుంది. రెండు పాములు పెన‌వేసుకున్న దృశ్యం క‌నిపిస్తోంది. ఇది టీడీపీ కూట‌మితో త‌న పార్టీ బంధం ఇలాగే పెన‌వేసుకోవాల‌న్న కోణంలో ప‌వ‌న్  క‌ళ్యాణ్ ఇలాంటి ఉంగ‌రం ధ‌రించిన‌ట్టుగా భావిస్తున్నారు ప‌లువురు అభిమానులు.  

పిన్నెళ్లి సోదరుల బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ లను పరిశీలించిన ఏపీ హైకోర్టు ఈ కేసులో   పిన్నెల్లి బ్రదర్స్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో ఏకీభవించింది. వారి బెయిలు పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వారికి బెయిలు ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదరించే చాన్స్ ఉందని  కోర్టుకు తెలిపారు. ఆగస్టు 21న ఈ కేసులో విచారణ జరుగగా.. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును  రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.  పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం (ఆగస్టు 29) తీర్పు వెలువరించింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు.  ఇంతకీ కేసేమిటంటే.. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో పిన్నెల్లి బ్రదర్స్‌ సహా హత్యతో ప్రమేయం ఉన్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్‌ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు.   

డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  ఏపీ టూరిజం ఆధ్వర్యంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భారత్‌కు టెక్నాలజీ హబ్‌గా వైజాగ్ నగరం ఎదుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటకులు విశాఖను పర్యావరణరహితంగా మార్చాలి తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం కోరారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.  వైజాగ్‌లో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తామని.. ఈ కేబుల్ ద్వారా ఈ నగరంతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని తెలిపారు. అలాగే మహిళలకు సురక్షితమైన నగరంగా వైజాగ్ ఎంపికైందని గుర్తు చేశారు. ఈ విశాఖ నగరం.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందని వివరించారు. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని.. ఇది మనమంతా గర్వపడే అంశమని సీఎం తెలిపారు. హాప్ ఆన్ హాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు 16 కి.మీ మేర పరుగులు పెట్టనున్నాయి. రూ. 250తో రోజాంతా ప్రయాణించవచ్చు.

మూసీ వరద.. జంటనగరాల్లో పలు చోట్ల రాకపోకలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు పైకెత్తి 4100 క్యూసెక్కుల నీటినీ, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 23వందలక్యూసెక్కుల నీటిని మూసిలోకి వదలడంతో మూసీనది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో  బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద ధాికి  బ్రిడ్జ్ పిల్లర్లు  డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జిని మూసివేయడంతో అంబర్ పేట, దిల్ షుక్ నగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.  

కామ్రేడ్ల కుర్చీ పోరు

  క్రమశిక్షణకు మారుపేరైన కమ్యూనిస్టుల్లో , ప్రజాసామ్యయుతంగా నడిచే ప్రజా ఉద్యమాల పార్టీ సీపీఐలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. నాయకులు చెప్పినట్లు నడుచుకునే సీపీఐ నేతల్లో పదవీ కాంక్షలు మొదలయ్యాయి. అందుకోసం గ్రూపులు కట్టే పరిస్ధితి ఏర్పడింది. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు ప్రారంభించారు. దాంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక అర్ధంతరంగా ఆగిపోయింది.   కౌన్సిల్, కార్యదర్శివర్గం ఎన్నిక జరిగినా..కార్యదర్శి ఎన్నిక మాత్రం జరగకుండానే ఒంగోలులో జరిగిన 3 రోజుల మహసభలను ముగించేశారు. ఆల్ ఇండియా మహాసభ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుందామంటూ దాట వేశారు. మూడు రోజుల పాటు ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను చర్చించుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యచరణపై చర్చ జరిగింది. దానితో పాటు నూతన సారథిని ఎన్నుకోవాల్సి ఉంది.  పార్టీ నిబంధనల ప్రకారం ఒక కామ్రేడ్ మూడు పర్యాయాలు కంటే ఎక్కువ సార్లు పార్టీ కార్యదర్శిగా పనిచేయాడానికి వీలు లేదు.  రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన నేపధ్యంలో ఇప్పుడు కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇదే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో విభేదాలను, పదవిపై ఉన్న మోజు తో పాటు, పార్టీ నాయకత్వంపై క్యాడర్ మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టింది. మహాసభ చివరిరోజు గందరగోళానికి గురైంది. రామకృష్ణ తరువాత రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా  పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉండాంటూ ప్రస్తుత కార్యదర్శి రామకృష్ణ ప్రతిపాదనలు పెట్టారు. అయితే పార్టీ నిబంధల ప్రకారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎవరైన పోటీ పడవోచ్చు. దాంతో ముప్పాళ్ల పేరు ప్రతిపాదించగానే మరో లీడర్ ఈశ్వరయ్య తాను కార్యదర్శి స్ధానానికి పోటీగా ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా పార్టీ లీడర్స్ అవ్వాకయ్యారు. అయితే అప్పటికే ఈశ్వరయ్య కార్యదర్శి అవుతారని మహాసభకి హాజరైన ప్రతినిధులు భావించారంట.  అయితే రామకృష్ణ ముప్పాళ పేరు తెరమీదకు తీసుకురావడంతో ఈశ్వరయ్య పోటీకి రావడం, ప్రజాస్వామ్య యుతంగా పోటీ పెట్టాలని కోరడంతో చేసేది ఏం లేక ఈశ్వరయ్య ను సమూదాయించే పనికి పార్టీ లీడర్స్ దిగారు. ముప్పాళ వయస్సులో పెద్దవారు. పార్టీ నిబంధన ప్రకారం 75ఏళ్లు వరకు మాత్రమే పార్టీ రాష్ట్ర పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒక్క సారి ముప్పాళ నాగేశ్వరరావుకి అవకాశం ఇద్దాం.. తరువాత నువ్వు సెక్రటరీ అవ్వవచ్చు అంటూ ఈశ్వరయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారంట. ప్రజాస్వాయ్యపద్దతిలో ఎన్నిక జరగాలి, తాను పోటీలో ఉంటానని ఈశ్వరయ్య తెగేసి చెప్పడంతో కార్యదర్శి పదవి తరువాత చూద్దాం అంటూ ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది. మరోపక్క ఈశ్వరయ్య అనుచర వర్గం కూడా ఓటింగ్ పెట్టాలని ఓటింగ్ నిర్వహిస్తే ఈశ్వరయ్యే గెలిచే అవకాశం ఉందని డిమాండ్ చేశారంట. అదే కనుక జరిగితే ప్రస్తుత సెక్రటరీగా ఉన్న రామకృష్ణ ప్రతిపాదన వీగిపోతే పరువు పోతుందని భావించిన సిపిఐ ఆగ్రనాయకత్వం కార్యదర్శి ఎన్నికలను వాయిదా వేసిందంటున్నారు.  ఇప్పటి వరకు ఇటువంటి పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ సీపీఐ చరిత్రలో లేదంటున్నారు సీనియర్ నాయకులు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ లీడర్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని, దాని ప్రభావం కారణంగానే ముప్పాళ పేరు తెరమీదకు వచ్చిందనే అభిప్రాయం కూడా కొంతమంది క్యాడర్ వ్యక్తం చేస్తోంది.  బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు పదవి వస్తుందనే  కారణంతోతే వాయిదా వేశారనే వాదన వినిపిస్తుంది. ఒంగోలులో జరిగిన మహసభలో ఆ జిల్లా క్యాడర్ కూడా పార్టీ అగ్రనాయకత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా నినదించడంతో పార్టీ చరిత్రలో ఒంగోలు సభ నిలిచిపోతుందని, ఇటువంటి మహసభ ఇప్పటివరకు చూడలేదంటూ నాయకత్వం కూడా అసహనం వ్యక్తం చేసిందంట. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో దాదాపు 10 మంది జిల్లా కార్యదర్శులు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ప్రతిపాదనను వ్యతిరేకించారంటే నాయకత్వానికి క్యాడర్‌కి మధ్య దూరం ఏవిధంగా పెరుగుతుందో అర్థమవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కమ్యూనిస్టుల్లో కూడా అంతర్గత కుమ్ములాటల ఇప్పుడు బహిర్గతం అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.. పదవీ కాంక్షకు కమ్యూనిస్టులు కూడా అతీతులు కాదన్న విమర్శలు వస్తున్నాయి.  

తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు.. మరో ఆరు రోజులు వానలే వానలు

ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వదలడం లేదు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మరో ఆరు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలు, ఉత్తర తెలంగాణలకు వర్షం ముప్పు అధికంగా ఉందని పేర్కొంది.  ఏపీలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇలా ఉండగా ఏపీలోని ఆరు ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ  కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

కొనసాగుతున్న లేడీ డాన్ అరుణ విచారణ

  లేడీ డాన్ నిడిగుంట అరుణను ఒంగోలు జైలు వద్ద కోర్ట్ అనుమతులతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఒంగోలు జైలు నుండి  కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అరుణను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు  విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం సాయంత్రం అరుణను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తారు.  ఈ విచారణ లోనే అరుణ నుండి మరిన్ని విషయాలు రాబట్టడం తో పాటు ఆమె ఫోన్ లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీంతో అరుణ ఫోన్‌లో  ఎలాంటి సమాచారం ఉంది. ఆ సమాచారం బయట వస్తె ఎలాంటి  రహస్యాలు బయటకు వస్తాయి. అనేది తీవ్ర ఉత్కంఠ  నెలకొంది. ఇదే సమయంలో లేడీ డాన్ అరుణ తో సన్నిహితంగా వున్న అనేక మంది పెద్దలు గుండెల్లో గుబులు మొదలైంది. రాబోయే మూడు రోజులు కొందరికి అగ్నిపరీక్ష కానుంది

రిషికొండ ప్యాలెస్‌‌లో ఊడిన పెచ్చులు..పరిశీలించిన డిప్యూటీ సీఎం

  విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్యాలెస్‌‌లో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. కాన్ఫరెన్స్ హాల్, మరో రెండు గదుల్లో ఫాల్స్ సీలింగ్ షీట్లు విరిగిపడినాయి. పైకప్పు లోపాలతో లోపలికి వర్షం నీరు వచ్చింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  విశాఖపట్నం పర్యటనలో ఉన్నడిప్యూటీ సీఎం ... మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పవన్ కల్యాణ్‌కు వివరించారు.  గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ నూతన భవనాల నిర్వహణకే దాదాపు కోటి రూపాయల బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని అధికారులు పవన్‌కు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది" అని వ్యాఖ్యానించారు.  రుషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను  పవన్ ఆదేశించారు.

మోడీ రిటైర్మెంట్ చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లేనా?

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో 75వ పడిలో అడుగుపెట్టనున్నారు. బీజేపీ తనంతట తానే విధించుకున్న నిబంధన మేరకు మోడీ ఇక రిటైర్ కావలసిందే. మోడీ ప్రధానిగా తొలి సారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ పార్టీలోని సీనియర్లను వయస్సు కారణంగా చూపుతూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంచే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు.. చేసి చూపించారు కూడా. బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకులైన ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు వారికి 75 ఏళ్లు వచ్చాయన్న ఒకే ఒక కారణంతో పార్టీలో క్రియాశీలక పాత్ర లేకుండా చేశారు. వారికి కనీసం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. బీజేపీ అంగీకరించకపోవచ్చు కానీ ఆ సీనియర్లిద్దరినీ అత్యంత అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు.  ఇప్పుడు అదే పరిస్థితి మోడీకి వస్తుందని చాలా మంది భావించారు. కానీ ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన ఈ దశాబ్దంపైగా కాలంలో మోడీ పార్టీపైనా, ప్రభుత్వంపైనా కూడా పూర్తి పట్టు సాధించారు. మోడీ కాకపోతే మరెవరు? అన్న పరిస్థితి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏర్పడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే మోడీ 75 ఏళ్ల వయస్సు వచ్చినా ప్రధానిగానే కొనసాగే పరిస్థితి కల్పించుకున్నారు. కానీ అనుకోని విధంగా మోడీ ఓవర్ డూయింగ్స్ పార్టీ మెంటార్ గా భావించే ఆర్ఎస్ఎస్ ఒకింత ఆగ్రహంగా ఉందన్న వార్తలు గుప్పుమనడం.. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొంత కాలం కిందట 75 ఏళ్లకే రిటైర్మెంట్ అంటూ నొక్కి వక్కాణించడంతో మోడీ కొనసాగింపు ఎండమావే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఇందుకు తోడు అంతకు ముందు అంటే మోడీ ముచ్చటగా మూడొ సారి ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత హుటాహుటిన నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్ సహా సంఘ్ ప్రముఖులతో భేటీ అవ్వడం కూడా ఆర్ఎస్ఎస్, మోడీల మధ్య కుచ్ కుచ్ హోతా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత మోహన్ భగవత్ 75 ఏళ్ల నిబంధన గురించి లేవనెత్తడం కూడా మోడీ పదవికి ఇక ఎసరు వచ్చినట్లేనన్న వార్తలు గుప్పుమన్నాయి. దేశ వ్యాప్తంగా మోడీ వారసుడెవరన్న చర్చ సైతం జోరుగా సాగింది. అయితే ఈ వ్యవహారం అంతా టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. 75 ఏళ్ల వయస్సు నిబంధనపై అంత గట్టిగా మాట్లాడిన మోహన్ భగవత్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. వయస్సు పైబడినా ఉత్సాహంగా పని చేసే వారికి ఆ నిబంధన వర్తించదంటూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ మోడీ పదవీ కాలం ఇక నెలలే అంటూ జరిగిన చర్చకు తెరపడింది. మరో సారి కూడా మోడీయే అన్న భావన బలపడింది. ఆర్ఎస్ఎస్ ను కూడా తన దారికి తెచ్చుకున్న మహాలుడిగా మోడీని కమలం శ్రేణులు కీర్తిస్తున్నాయి. మోడీ ముందు ఆర్ఎస్ఎస్ తలవంచినట్లైందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పదును పెడుతున్నారు. 

గురువింద సామెతను గుర్తు చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తీరు

జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అనాచారాలకు అంతే లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకా, కాదా అన్నది పక్కన పెడితే ఆయన హిందువు అయితే కాదు. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావు లేదు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవుళ్లకు, ఆలయాలకు, హిందూ ధర్మానికి జరిగిన అపచారాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సంఘటనలే ఆయన హిందూ వ్యతిరేకా అన్న అనుమానాలు బలపడేలా చేశాయి.   ఒక విధంగా చెప్పాలంటే హిందూ సమాజం వ్యక్తం చేసిన ధర్మాగ్రహమే ఆయనను అధికారం నుంచి దించేసిందని చెప్పవచ్చే. హైందవ ధర్మం పట్ల , మరీ ముఖ్యంగా తిరుమల విషయంలో ఆయన హయాంలో జరిగిన అనాచారాలు, అపచారాలు   జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీకి సైతం ఆగ్రహం తెప్పించాయి.  జగన్ హయాంలో సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై ఆయన మీడియా ముఖంగా వ్యక్తం చేసిన ఆగ్రహమే అందుకు నిదర్శనం.   జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటనకోకొల్లలు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరిగాయో తెలియంది కాదు.  అంతెందుకు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని నల్లరాతితో పోల్చిన నాస్తికుడు భూమన కరుణాకరరెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నియమించడం ద్వారా జగన్ తన తీరు ఏమిటో? వైఖరి ఏమిటో ఎటువంటి దాపరికం లేకుండా చాటుకున్నారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న కాలంలో వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురి చేశాయి.   ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారింద విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు భూమన టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా  మారిపోయిందన్న ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.   గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం  ఇచ్చాయి.   ఇంతగా తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డి ఇప్పుడు హైందవ ధర్మపరిరక్షకుడి అవతారం ఎత్తినట్లుగా...టీటీడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉండగా మొదలై, ఆ తరువాత కూడా కొనసాగిన అవకతవకలు, అక్రమాలు, అధర్మాలను... రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత బాధ్యతలు చేపట్టిన తిరుమల తిరు పతి దేవస్థానం బోర్డు సభ్యులు సరిదిద్దుతూ, తిరుమల పవిత్రత పెంచేలా చర్యలు తీసుకుంటుంటే.. భూమన విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఆరోపణలతో రెచ్చిపోతున్నారు.  తప్పులన్నీ తాను చేసి.. ఇప్పుడు భూమన టీటీపై ఆరోపణలతో ఎందుకింతగా రెచ్చిపోతున్నారు? జనం విశ్వసిస్తారని ఎలా భావిస్తున్నారు? అంటే తిరుమలలో వర్షం పడితే... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు తడిసి ముద్దౌతారు. తిరుమలలో జరిగే ఏ చిన్న సంఘటన అయినా భక్తులు, హిందూ ధార్మిక సంస్థల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే.. తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భూమన ఈ రకంగా టీటీడీపై విమర్శల దాడికి దిగుతున్నారు. తద్వారా తాను తిరుమల పవిత్రతను కాపాడటానికి కంకణం కట్టుకున్న వ్యక్తిగా జనం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలకు సంబంధించిన అంశం అంటే మీడియా వాస్తవమా? అవాస్తవమా? అన్న శోధనలోకి పోకుండా ప్రాధాన్యత ఇచ్చి ప్రాచుర్యం కల్పిస్తుందన్న భావనతో భూమన ఇలా రెచ్చిపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి జనం మెమరీ చాలా తక్కువ అన్నభ్రమల్లో భూమన తన హయాంలో జరిగిన అపచా రాలను ప్రజలు మరిచిపోయి ఉంటారనుకుంటున్నారు.  ఇపుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల ప్రతిష్టను దెబ్బతీయాలంటే ఇలాంటి ఎదురుదాడే శరణ్యమని భ్రమిస్తున్నారు.  అయితే భూమన రీతి గురివింద చందంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. భూమన ప్రతి విమర్శపైనా మీ హయాంలో చేసిందేమిటి? అంటూ జనం చర్చించుకుంటున్నారు. 

ఏపీకి బుల్లెట్ ట్రైన్ : సీఎం చంద్రబాబు

  అమరావతి మీదగా ఆంధ్రప్రదేశ్‌‌కి బుల్లెట్ రైలు రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఏపీ నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి గంటకు ఫ్లైట్ ఉండేలా ఎయిర్ ఫోర్టులు తీర్చిదిద్దబోతున్నామని పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాదిని కలిపే మార్గాలన్నీ  ఏపీ నుంచే వెళ్తుంటాయి. అమరావతి- చెన్త్నె- బెంగళూరు నగరాల మధ్య బుల్లె రైళ్లు రానున్నాయి సీఎం తెలిపారు.ఇందుకోసం హైదరాబాద్ – చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి  మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్‌డీఏ గుండా వెళ్తుంది.

బీహార్‌లో జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

  బీహార్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా కొట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్రలో ఓ వ్యక్తి ప్రధాని మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసన బీజేపీ ర్యాలీ చేపట్టగా దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు ఎదురుపడిన సమయంలో పార్టీ జెండాలతో పరస్పరం దాడి చేసుకున్నారు.విపక్ష నేత రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి నిర్వహించిన 'ఓటర్ అధికార యాత్ర' కార్యక్రమంలో కొందరు వ్యక్తులు.. నరేంద్ర మోదీ సహా ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఈ కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం.. మోఈ ఘటనపై స్పందించారు. ప్రధాని మోదీని క్షమించమని అడిగారు. తప్పుడు వ్యాఖ్యలను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ తెలిపారు  

అనుమానాస్పదస్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మరణించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగింది. కాటారం జాతీయ రహదారి పక్కన కమలాపూర్ క్రాస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతి చెందిన యువతిని ఒడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. ఆమె మృతదేహం పక్కనే ఆధార్ కార్డు, నిమ్మకాయలు, కుంకుమ ఉన్నాయి.    వర్షిణి తండ్రి చనిపోయిన బాధతో ఈ నెల 3 న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం తల్లి వెతికి జాడ తెలియకపోవడంతో చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో  గురువారం కమలాపూర్ క్రాస్ అటవీ ప్రాంతంలో యువతి మృత దేహం ఉందన్న సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆధార్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా యువతి చిట్యాల మండలానికి చెందిన వర్షిణిగా గుర్తించారు.  

టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష

టీవీ నటుడు లోబోకు ఏడాది  జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2018 టీవీ నటుడు లోబో,  అతని టీమ్  2018 లో వీడియో చిత్రీకరణలో భాగంగా వరంగల్ కు వెళ్లారు. అక్కడ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు ప్రాంతాల్లో పర్య టించి వీడియోలు చిత్రీకరించారు. చిత్రీకరణ పూర్త యిన అనంతరం అదే సంవత్సరం మే 21వ తేదీన లోబో టీమ్ మొత్తం కారులో అత్యంత వేగంగా వరంగల్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా యాక్సిడెంట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారు  రఘు నాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద  ఆటోని ఢీ కొంది. ఈ ప్రమా దంలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన  రఘునాథపల్లి పోలీసులు ఈ కేసు విచారించిన జనగామ జిల్లా కోర్టుకు సక్ష్యాలు సమర్పించారు. కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్నతరువాత  లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

హైడ్రాపై హైకోర్టు ప్రశంసల వర్షం!

కోర్టుల నుంచి చీవాట్లు తినడమే పరిపాటి అన్నట్లుగా మారిన హైడ్రాకు తొలి సారిగా ప్రశంసలు లభించాయి. ఔను నిజమే తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంత కాలం కోర్టులంటే లెక్కలేదా? మా ఆదేశాలను ఖాతరు చేయరా?  కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ హెచ్చరికలు, మొట్టికాయలతో తలబొప్పి కట్టేలా చీవాట్లు పెట్టిన హైకోర్టు తొలి సారిగా గురువారం (ఆగస్టు 28) హైడ్రాను ప్రశంసించింది.   హైదరాబాద్ నగరంలో రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంలో  హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందంటూ పొగడ్తల వర్షం కురిపించింది. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చేస్తున్న కృషిని అభినం దించింది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో హైడ్రా సేవలు  భేష్ అంటూ జస్టిస్ బి. విజయ్‌ సేన్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసం పేర్కొంది.  విషయమేంటంటే.. రాంనగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య భవనాన్ని  స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్  ఫిర్యాదు మేరకు హైడ్రా తొలగించింది.  దీంతో తన భవనాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయ నిర్మాణదారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం (ఆగస్టు 28) విచారించిన హైకోర్టు  పై వ్యాఖ్యలు చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

లాంగ్ లీవ్ పై ఐఏఎస్ స్మితా సబర్వాల్

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు అమె సెలవు పెట్టారు. సెలవుకు ఆరోగ్య కారణాలు చూపినప్పటికీ.. గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో కూడా స్మితా సబర్వాల్ పై చర్యలకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆమె తన సెలవుకు కారణం గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆమె సెలవును ప్రభుత్వం మంజూరు చేసింది.