27 రోజులలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
posted on Aug 21, 2025 @ 10:02AM
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం(ఆగస్టు 20) అధికారులు లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో 4 కోట్ల 51 లక్షల 62 వేల 522 రూపాయల వచ్చాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు 164.500 గ్రాముల బంగారం, 5.840 కేజీల వెండి వస్తువులు కూడా మల్లన్నకు కానుకలుగా అందాయని వివరించారు. ఇవే కాకుండా..
598 అమెరికా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 100 న్యూజిలాండ్ డాలర్లు, పది ఇంగ్లండ్ పౌండ్స్, 100 సింగపూర్ డాలర్లు, 100 ఈరోస్, 115 సౌదీ అరేబియా రియాల్స్, 102 కత్తార్ రియాల్స్, 300 ఒమన్ బైసా, ఒకటి కువైట్ దినార్ కూడా మల్లన్న సమేత భ్రమరాంబికా దేవికి భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారని తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా నేత్రాల పర్యవేక్షణలో చంద్రావతికల్యాణ మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు శివసేవకుల సహాయంతో ఈ లెక్కింపు లెక్కింపు జరిగినట్లు తెలిపారు.