రూల్ ఈజ్ రూల్.. కొడుక్కి ఫైన్ వేసిన సీఐ
posted on May 13, 2021 @ 3:25PM
రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్.. చట్టం ముందు అందరూ సమానులే.. అది ఎప్పుడో విన్న మాట అని అనుకుంటున్నారా..? అయినా ఎప్పుడు ఎవరు ఆ ఆర్టికల్ ని ఫాలో అవుతున్నదని అనుకుంటున్నారా..? అలా అనుకుంటే అదే పొరపాటే. అలా చట్టాన్ని ఫాలో అయ్యేవాళ్లు, ఆ చట్టాన్ని అమలు చేసేవాళ్ళు ఇంకా లేకపోలేదు. అక్కడక్కడా మానవత్వం మనుషులు బతికి ఉన్నట్లు, ఇలా చట్టానికి గౌరవించేవాళ్ళు కూడా ఉన్నారు. నమ్మడం లేదు కదా..! అయితే మీరే చూడండి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి కఠినమైన కర్ఫ్యూ అమలవుతోంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రజలు రోడ్లపై తిరగకుండా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేవలం అత్యవసర వాహనాలు, వైద్య సేవల నిమిత్తం వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. అయినా సరే కొందరు చిన్నచిన్న పనులపై బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది సిల్లీ రీజన్స్ చెప్పి రోడ్లపై జులాయిగా తిరిగేస్తున్నారు. వీరిలో కొందరు కరోనా పేషెంట్లు కూడా ఉంటున్నారు. ఇదిలా ఉంటే కర్ఫ్యూ సమయంలో తమ పలుకుబడి ఉపయోగించి బయటతిరిగేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలు రూల్స్ పాటించకుండా బయట తిరగడం పోలీసుల తనిఖీల్లో తమ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖుల పేర్లు చెపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వారిపట్న పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
ఐతే ఓ పోలీస్ అధికారి మాత్రం కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న తన సొంత కుమారుడికి ఫైన్ వేశారు. బయటతిరిగితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరులో కర్ఫ్యూ సందర్భంగా జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలమనేరు సీఐ జయరామయ్య కూడా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ బయట తిరుగుతున్న ఓ కుర్రాడిని సీఐ జయరామయ్య వద్దకు తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆ అబ్బాయి... సీఐ జయరామయ్య కుమారుడు, బీటెక్ స్టూడెంట్ రాహుల్. ఇది తెలిసిన కానిస్టేబుల్ సారీ సర్.. మీ అబ్బాయి అని తెలియక తీసుకొచ్చా అని బదులిచ్చాడు.
దీనిపై స్పందించిన సీఐ జయరామయ్య.. చట్టం ముందు అందరూ సమానమేనని.. కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్నందుకు రూ.125 జరిమానా విధించారు. బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన మన అనే బేధం లేదని.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇంట్లోనే ఉండాలని ఆయన అన్నారు. ఈ రోజుల్లో కొందరు ప్రముఖులు తమ పిల్లలు తప్పులు చేసినా చూసీచూడనట్లు వదిలేస్తుంటారు. అంతేకాదు వారిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ సీఐ జయరామయ్య మాత్రం.. చట్టంముందు అందరూ ఒకటేనని నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు. కర్ఫ్యూ అమలులో ఉండగా ప్రజలు బయటకురాకుండా కరోనాను అరికట్టాలని పిలుపునిస్తున్నారు.
సీఐ జయరామయ్య చేసిన పనికి డిపార్ట్మెంట్ లో అందరూ షాక్ అయ్యారు. స్థానికులు సైతం ఎస్ఐ జయరామయ్య ని జై అంటున్నారు. నిజంగా గ్రేట్ కాదా.. అలా అందరూ ఉండలేరూ.. ఆకాశం లో చుక్క తెగిపడేట్లు ఎక్కడో అక్కడ అక్కడ కొందరు మాత్రమే సిన్సియర్ గా ఉంటారు.