కొవిడ్ తో కొలువులు ఖాళీ.. ఆల్ టైమ్ గరిష్టానికి నిరుద్యోగం
posted on May 13, 2021 @ 4:01PM
కొవిడ్’తో సంబంధం లేకుండానే దేశంలో నిరుద్యోగం రేటు పతాక స్థాయికి చేరుకుంది. రేడు సంవత్సరాల ముందు 2019 లోనే, దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. అదలా ఉంటే, మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లుగా, కొవిడ్ మహమ్మారి విరుచుకు పడడంతో ఉన్న ఉద్యోగాలు పోయి, ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడంతో పరిస్థితి మరింతగా విషమించింది.అలాగే, కరోనా కారణంగా ఒకదాని వెంబడి ఒకటిగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం లేదా ఇతర అక్షలు విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా కుంట పడ్డాయి. ఫలితంగా పట్టణ నిరుద్యోగం ఒకసారిగా 12 శాతానికి చేరింది.
దేశంలో చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ లేదా ఇతర ఆంక్షలు విధిస్తున్న నేపధ్యంలో ఉద్యోగ మార్కెట్’పై మరింత ఒత్తిడి పెరిగిందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పాటుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడి పోతున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ)డేటా ప్రకారం, పట్టణ నిరుద్యోగం ఏప్రిల్ 25తో ముగిసిన వారంలో 9.55% నుండి మే 9 వరకు వారంలో 11.72 శాతానికి చేరుకుంది. ఇది ఏప్రిల్ నెలవారీ సగటు 9.78% కంటే దాదాపు రెండు శాతం ఎక్కువ.
జాతీయ స్థాయిలో మే 9తో ముగిసిన వారంలో నిరుద్యోగం రేటు 8.67 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో గ్రామీణ నిరుద్యోగం కూడా 6.37% నుండి 7.29%కి పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ, గ్రామీణ నిరుద్యోగం రేట్లు కూడా ఏప్రిల్ నెలవారీ నిరుద్యోగ రేటు కంటే ఎక్కువగానే ఉన్నాయి.
అయితే, దేశంలో నిరుద్యోగం పెరగడానికి, కరోనా, లాక్ డౌన్ మాత్రమే కారణం కాదని, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి పేరున కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు కూడా ఉద్యోగ, ఉపాధి రంగంపై వ్యతిరేక ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే సారి లాక్ ద్వోన్ విధించింది. అయితే సంవత్సరం ఆరంభంలో ప్రారంభమైన సెకండ్ వేవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో రాష్ట్రాలకు నిరనయదికారం ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితుల ఆధారంగా లాక్ డౌన్ లేదా ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు సక్రమంగా సాగక, అనేక కంపెనీలు, పరిశ్రమలు పాక్షికంగా మూత పడుతున్నాయి. నిరుద్యోగం రేటు పెరుగుతోంది.
నిరుద్యోగం ప్రభావం ఆర్థిక వ్యవస్థ అంతటా ప్రభావం చూపుతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ ఎదుర్కుంటున్న ఆటుపోట్ల ప్రభవంతో జీడీపీ ఇతర ఆర్ధిక ప్రమాణాలు తీవ్ర వడిదుడుకులకు గురవుతున్నాయి. కార్మిక, ఉపాధి మార్కెట్ మన మొత్తం ఆర్థిక వ్యవస్థ పనితనం తెలపడానికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. అనేక బ్రోకరేజ్ మరియు ఆర్థిక సంస్థలు జీడీపీ అంచనాను తగ్గించాయి. బలమైన ఆర్థిక పునర్‌జ్జీవనానికి భారత్ ఎంత త్వరగా ఈ వైరస్‌ను అరికట్టగలదో అన్నదానిపై ఆధారపడి ఉన్నట్లుగా కనపడుతుందని ఇండియన్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన ఆర్థికవేత్త సునీల్ కుమార్ సిన్హా అన్నారు.