అడుగడుగునా అడ్డంకులు.. రైల్లోనూ వెంటాడిన నిఘా.. హైదరాబాద్ లోనే రైలు దిగేసిన రఘురామకృష్ణంరాజు

కోర్టులు ఆదేశించినా, ఏకంగా పీఎంవో నుంచే అవరోధాలు సృష్టించవద్దంటూ ఆదేశాలు వచ్చినా జగన్ సర్కార్ నర్సాపురం ఎంపీ రఘురామరాజును వదలడం లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకుండా చేయాలని ‘ఔట్ ఆఫ్ ది వే’ ప్రయత్నాలను ఆపడం లేదు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్నారు. ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అందుకు ఎంపి రఘురామకృష్ణం రాజు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి.. కోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ చేసుకున్నారు. కోర్టు ఎంపీని అరెస్టు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన భీమవరం వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను భీమవరం కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకోవాలనే నిర్ణయించింది. దీంతో కోర్టు తీర్పును లెక్క చేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపించింది. ఎంపీ ని వేధించడానికే రోడ్డు తవ్వేశారన్న ప్రచారం జరిగింది. దానితో స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. తవ్వేసిన రోడ్డు ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దానితో  స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం, వెంటనే దానిని సీఎంవో కు పంపటంతో రోడ్డును క్లియర్ చేశారు. దీన్నిబట్టి కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణం రాజును మోడీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తోందని అవగతమౌతోంది.   ఇలా ఉండగా   ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు రాకుండా, ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు  ప్రచారం జరుగుతోంది. రాజు సభకు వస్తే.. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని, ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి, స్థానిక నేతలతో చెప్పినట్లు సమాచారం.  వీటి వేటినీ లెక్క చేయకుండా భీమవరం వెళ్లడానికే నిర్ణయించుకున్న రఘురామ కృష్ణం రాజును నిఘా బృందాలు వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. నిఘా బృందాలు అనుసరిస్తున్నట్లు గుర్తించడంతో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరం బయలుదేరిన రఘురామకృష్ణం రాజు బేగంపేట రైల్వే స్టేషన్ లోనే దిగిపోయి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు బయలు దేరిన ఆయన బృందం కూడా బేగంపేట రైల్వే స్టేషన్ లోనే దిగిపోయారు. అయితే అప్పటికే రఘురామ రాజును సమర్ధిస్తూ ఆయనకు అండగా నిలుస్తున్న కొందరు నేతలపై కేసులు పెట్టారు. అలాగే భీమవరంగా రఘురామకృష్ణం రాజుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

వెల్లంపల్లి గోడ దూకేస్తారా?.. జోగి మాటల మర్మమేమిటి?

వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తున్నది. ముఖ్యంగా వైసీపీ ప్లీనరీకి ముందు జిల్లాలలో జరుగుతున్న సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఆ సమావేశాలలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాల గుట్టు రట్టు చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు.  మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారితో పాటు కార్యకర్తలు ఖంగుతిన్నారు. జోగి రమేష్ ఒక్కరే కాదు మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీ నుంచి క్యాడర్ జారిపోతోంది.. జాగ్రత్త పడకుంటే కష్టం అన్న రీతిలో మాట్లాడారు. నెల్లూరు జిల్లా నేతలైతే తమ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. మంత్రి బాలినేని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆయన పలు సందర్భాలలో బహిరంగంగా చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అయితే గన్నవరం, బందర్ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించేసి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఉన్న గ్రూపు తగాదాలకు అజ్యం పోశారు. ఇలా ఇక్కడ ప్రస్తావించిన జిల్లాలలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీలో గ్రూపు తగాదాలు శృతి మించి రాగానపడ్డాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. దీనికి కారణం విజయసాయి, సజ్జలలే కారణమని పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  తాడేపల్లి ఫ్యాలెస్‌లోకి  విజయసాయి రీ ఎంట్రీ  తర్వాతే  జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల   రచ్చ పెచ్చరిల్లిందని అంటున్నారు.  వైయస్ జగన్ ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు విజయసాయిరెడ్డి  పాత్ర పార్టీలో అత్యంత కీలకం.. నాడు ఆయన ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక లగాయతు.. జగన్ తొలి కేబినెట్ కూర్పు  జరిగింది.  ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైజాగ్ వెళ్లిపోయారు.. ఆ తర్వాల అంతా  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలోని పదవులు రాని కీలక నేతలంతా ఆయన చుట్టూ  చేరారు. అక్కడ నుంచి ఏ జిల్లాలో జిల్లాల్లో ఎక్కడ ఏ నాయకుల మద్య అసంతృప్తి జ్వాలలు  ఎగిసినా   సజ్జల రామకృష్ణరెడ్డి  డైరెక్ట్‌గా రంగంలోకి దిగి.. సముదాయించడం జరుగుతూ వస్తోంది.   అయితే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి.. జిల్లా అధ్యక్షులు, సమన్వయ కర్తల బాధ్యతలు అప్పగించడంతో జిల్లాల్లో రచ్చకు అంకురార్పణ జరిగిందని అంటున్నారు. సజ్జల, విజయసాయి రెండు అధికార కేంద్రాలుగా మారడంతో జిల్లాల్లో పార్టీ నేతలు, క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.. సజ్జల, విజయసాయి మధ్య విడిపోయిన జిల్లాల నేతల పంచాయితీ ఇప్పుడు వారు కూడా తీర్చలేని స్థితికి చేరుకుందనీ, దీంతో ఇవన్నీ   జగన్ వద్దకు చేరుతున్నాయనీ పార్టీ కేడర్ చెబుతున్నారు.   అదే సమయంలో జనంలో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుంటే.. మరోవైపు తెలుగుదేశం, జనసేనలు బలోపేతం అవుతున్నాయి. ఆ రెండు పార్టీలు బలోపేతం అవుతున్నాయనడానికి జనసేన సభ, తెలుగుదేశం మహానాడుల సక్సెసే తార్కాణమని వైసీపీ క్యాడరే బహిరంగంగా చెబుతోంది. కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేన సభ సక్సెస్ అయ్యింది.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. మరి   151 ఎమ్మెల్యేలు ఉండి, అధికారంలో ఉన్న వైసీపీ ప్లీనరీ ఎంత బ్రహ్మాండంగా జరగాలి అని జగన్ అంటుంటే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని వైసీపీ క్యాడర్ అంటున్నారు.  

పంజాబ్ కేబినెట్ విస్తరణ.. కొత్తగా ఐదుగురికి చాన్స్

పంజాబ్ లో తొలి సారిగా అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొత్తగా ఐదుగురిని తన కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. రెండు రోజుల కిందట హస్తిన వెళ్లిన మాన్ అక్కడ ఆఫ్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అప్పట్లోనే మాన్ కేబినెట్ విస్తరణపై ఆయనతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని మాన్ అప్పుడు ఖండించారు. పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా పంజాబ్ లోనే తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించారు. ఇంత హఠాత్తుగా అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు పూనుకోవడానికి ఇటీవల పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. అధికారం చేపట్టిన మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో జరిగిన ఒక ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి పరాజయం పాలు కావడంతో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరుపుకోవలసిన అవసరాన్ని గుర్తించిన మాన్.. కేబినెట్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావించారు. అందుకే కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. కొత్తగా ఐదుగురిని కేబినెట్ లోకి తీసుకోనుండడంతో పంజాబ్ లో సీఎం సహా  మంత్రుల సంఖ్య 15కు పెరుగుతుంది. సోమవారం సాయంత్రం పంజాబ్ రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

టెర్రరిస్టులను జనమే పట్టుకున్నారు.. రివార్డులు అందుకున్నారు!

జమ్మూ కాశ్మీర్ లో  పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయనడానికి తాజా ఉదాహరణ గ్రామస్తులే టెర్రరిస్టులను పట్టించిన సంఘటన. ఇప్పటి వరకూ కేంద్రం, భద్రతా బలగాలూ కూడా గ్రామాల్లో టెర్రరిస్టులకు షెల్టర్ లభిస్తోందనీ, అక్కడ నుంచి వారు సైన్యం, పోలీసులు, ప్రజలు లక్ష్యంగా దాడులకు పాల్పడి.. గ్రామ స్థుల రక్షణతో సులభంగా తప్పించుకు పారిపోతున్నారనీ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడా పరిస్థితి మారుతోంది. గ్రామాలలో టెర్రరిస్టులకు షెల్టర్ దొరకడం లేదు.  తాజాగా ఆదివారం   రియాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి  రెండు ఏకే రైఫిళ్లు, 7 గ్రానెడ్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాదులను ఫైజల్ అహ్మద్ దార్, తాలిబ్ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఇటీవల కాలంలో చినాబ్ లోయ, రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించడానికి ఎల్ఈటీ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గమనించామని.. ఇందులో భాగంగానే కొంతమందిని తీవ్రవాదులుగా చేర్చుకుని రెండు టెర్రర్ మాడ్యుళ్లను ఏర్పాటు చేసుకున్నారని  పోలీసులు వెల్లడించారు. ఇందులో మొదటి మాడ్యుల్ నెల క్రితం ఉదంపూర్ లో జరిగిన బాంబు పేలుడుతో, రెండవది పదిరోజుల క్రితం రాజౌరిలో జరిగిన పేలుడుతో సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ప్రధాన ఉగ్రవాది తాలిబ్ హుస్సెన్ పరారీలో ఉన్నారని.. తాజాగా ఈ రోజు గ్రామస్తుల సాయంతో పట్టుకున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులకు ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామస్తుల ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తుక్సాన్ గ్రామ ప్రజలకు రూ. 5 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఇదే విధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల తరుపున డీజీపీ మరో రెండు లక్షలు  రివార్డు ప్రకటించారు.

మోడీ చతురత ముందు కేసీఆర్ వ్యూహాలన్నీ తుస్సు..!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచీ, ప్రదాని మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మూడు రోజులు భాగ్యనగరంలో బస చేస్తారని ఖరారైన క్షణం నుంచీ కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలను, ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ ప్రసంగాన్నీ కూడా బీజేపీ వర్సెస్ తెరాసగా మార్చేందుకు శతథా ప్రయత్నించారు. ప్లెక్సీల వార్ నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే.. మోడీ హైదరాబాద్ వచ్చే రోజే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఆహ్వానించి రాజకీయ వేడి రగిల్చే ప్రయత్నం చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపడం సంగతి అటుంచితే.. ఆయనను హైదరాబాద్ ఆహ్వానించి.. ఆ సందర్భాన్ని మోడీపై విమర్శల వర్షం కురిపించేందుకు అనువుగా వాడుకున్నారు. అంతే కాకుండా.. ఆ మరుసటి రోజు విజయ సంకల్ప్ సభలో మోడీ ప్రసంగం ఎజెండాను కూడా తానే నిర్ణయించేశారా అనేలా కేసీఆర్ యశ్వంత్ తో సమావేశంలో ప్రసంగించారు. ఇన్ని చేసినా ఆయన వ్యూహాలు పలించలేదు. కేసీఆర్ ను మించిన చతురతను మోడీ ప్రదర్శించారు. మోడీ ఏం ప్రసంగించాలో చెప్పేశానని సంబరపడిన కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్ సభలో మోడీ ప్రసంగం తరువాత డిఫెన్స్ లో పడ్డారు. తన సవాళ్లుకు మోడీ జవాబిచ్చుకునే పరిస్థితి కల్పించానని సంబరపడిన కేసీఆర్ ఇప్పుడు మోడీ ప్రసంగం అనంతరం ఆయన ఆ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై  తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితిలో పడ్డారు. ఇంతకీ యశ్వంత్ సిన్హా కోసం కేసీఆర్ జల విహార్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభలో తనపై విమర్శల వర్షం కురిపిస్తారు అంటూ జోస్యం చెప్పేశారు. కానీ మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు కాదు కదా..అసలు కేసీఆర్ ప్రస్తావనే తీసుకురాలేదు. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న విషయాన్నే గుర్తించనట్లుగా ఆయన ప్రసంగం సాగింది.  తెరాస ప్రభుత్వంపై ఒక్క విమర్శ లేదు. రాష్ట్రంలో అవినీతి పాలన అన్న మాటే లేదు. కుటుంబ పాలన గురించి అసలు మాట్లాడనే లేదు. అలా అని ఆయన రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా ఉందన్న విధంగా మాట్లాడారా అంటే అదీ లేదు. కేంద్రం నుంచి ఇసుమంతైనా సాయం అందడం లేదంటూ ఊదరగొట్టేస్తున్న తెరాస ప్రభుత్వం విమర్శలన్నీ అవాస్తవాలని ప్రజలకు అర్ధమయ్యేలా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాన్నీ,  తెలంగాణ ప్రజలకు అందుతున్న కేంద్ర పథకాల గురించి  వివరించారు. తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని చెప్పారు. భవిష్యత్ లో  తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తథ్యం అని నొక్కి వక్కాణించారు. మోదీ ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం, అదే సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదంటూ చేస్తున్న తెరాస సర్కార్ ప్రచారమంతా అబద్ధమని తేల్చేసేలా మోడీ ప్రసంగం సాగడం తెరాస శ్రేణులను డిఫెన్స్ లో పడేసింది. సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం, హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్రం నిధులు అంటూ ఆయన చేసిన ప్రసంగంతో ఇప్పుడు తెరాస సర్కారే మోడీ ప్రసంగంలోని అంశాలకు స్పందించాల్సిన పరిస్థితిలో పడింది. అదే సమయంలో దేశ్ కీ నేతా అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలతో చేసుకున్న ప్రచారం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందం అయిపోయింది. దేశ్ కీ నేతాగా కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణకీ నేతాగా కూడా మోడీ గుర్తించడం లేదని తన ప్రసంగంతో మోడీ తేల్చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా   పోటీగా పోస్టర్లు.. ఫ్లెక్సీలతో సొంత ప్రచారం,   బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడం వంటి రెచ్చగొట్టే వ్యూహాలను అమలు చేసినా  మోడీ వాటిని వేటినీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. మోడీ నోట తనపై విమర్శల వర్షం కురిస్తే అది తనకు దేశ వ్యాప్త ప్రచారంగా ఉపకరిస్తుందని ఆశించిన కేసీఆర్ కు ఆశాభంగం కలిగించేలా మోడీ ప్రసంగం ఉంది. అన్నిటికీ మించి తెలంగాణ గడ్డపై ముఖ్యమంత్రి పేరును కూడా ప్రస్తావించకుండా మోడీ చేసిన ప్రసంగం.. వచ్చే ఎన్నికలలో తెరాస అసలు పోటీలోనే ఉండదన్న సందేశాన్ని బీజేపీ శ్రేణులకు ఇచ్చినట్లు పరిశీలకులు వివ్లేషిస్తున్నారు. మోదీ కేసీఆర్ ను పట్టించుకోకుండా, ఆయనపై విమర్శలు చేయకుండా చేసిన ప్రసంగంతో తెరా శ్రేణులే నిరాశకు గురయ్యాయని చెప్పాలి. కేసీఆర్ పై మోడీ విమర్శలు గుప్పిస్తే.. దేశవ్యాప్తంగా మోడీకి దీటైన నేత కేసీఆరే అన్న ఫోకస్ వస్తుందని తెరాస నేతలు ఆశించారు.  అయితే అసలు కేసీఆర్ ను గుర్తించని విధంగా మోడీ ప్రసంగం సాగడంతో కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ ఫ్లాప్ అయ్యాయన్న వ్యాఖ్యలు తెరాస శ్రేణుల నుంచే వినవస్తున్నాయి. 

మోడీ భీవవరం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి.. భారీ బందోబస్తు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సోమవారం భీమవరం రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోడీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం దాదాపు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయిందా అన్నట్లు ఏర్పాట్లు ఉన్నాయి. రేవుకాళ్ల మండలం నుంచి భీమవరం వైపు ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుంచి బయలు దేరి 10.10 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో 10.55 గంటలకు భీమవరం చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభలో జాతి నుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 12.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

రాజుగారి ఇంటి ముందు రోడ్డు తవ్వేశారు.. అందుకేనా?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన సొంత నియోజకవర్గ పరిధిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరౌతారా? ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ లతో ఒకే వేదిక పంచుకుంటారా? ఆయన వద్దామనుకున్నా.. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా చేయాలన్న జగన్ సర్కార్ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఓ కేంద్ర మంత్రి రాఘురామకృష్ణం రాజును ఏపీకి వెళ్లొద్దని సూచించిన మాట నిజమేనా? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. సీఎం జగన్ పై తిరుగుబావుటా ఎగురవేసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేధింపులను ఎదుర్కొంటున్న రఘురామ కృష్ణం రాజును గతంలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి భౌతికంగా హింసించిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయన ఏపీ వస్తే అరెస్టు చేయించి తమ ప్రతాపం చూపాలన్న ప్రభుత్వ ప్రణాళికలకు హైకోర్టు తీర్పు గండి కొట్టింది.  దీంతో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రఘురామకృష్ణం రాజు రావడానికి లైన్ క్లియర్ అయ్యిందనే అంతా భావించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు రావాల్సి ఉంటుంది. రఘురామకృష్ణం రాజు కూడా ఈ సభకు ఎలాగైనా రావాలన్న పట్టుదలనే ప్రదర్శిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొంటారు.ఇక్కడే రఘురామ కృష్ణం రాజును ఈ కార్యక్రమానికి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. జగన్ కు రఘురామకృష్ణం రాజుతో వేదిక పంచుకోవడం ఇష్టం ఉండదు. రఘురామకృష్ణం రాజు సభకు వస్తే జగన్ ఏం చేస్తారు. కార్యక్రమానికి గైర్హాజరు అవుతారా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ప్రధాని మోడీ హాజరుకానున్న అల్లూరి విగ్రహావిష్కరణకు తాను హాజరుకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేసే కుట్రలు చేస్తోందంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు, గత వారం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం తోపాటు, కేంద్ర హోమ్ , పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శులకు లేఖలు కూడా రాశారు. అక్కడ నుండి తగిన స్పందన లేకపోవడంతో,  హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురాం కృష్ణంరాజు ను అరెస్టు చేయవద్దని ..అవసరమైతే కేసులు పెట్టుకోవచ్చు తప్ప, అప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది . ఈ పరిణామాలతో ఎంపీ రాజు భీమవరం టూర్ కు , రూట్ క్లియర్ అయింది. కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపించింది. ఎంపీ ని వేధించడానికే రోడ్డు తవ్వేశారన్న ప్రచారం జరిగింది. దానితో స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. రోడ్డు ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దానితో ఆగమేఘాలపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం, వెంటనే దానిని సీఎంవో కు పంపటం.. ఆ తరువాత రోడ్డును క్లియర్ చేయడం ..చక చకా జరిగిపోయాయి. దీన్నిబట్టి కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణం రాజును మోడీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తోందని అవగతమౌతోంది.    ఇలా ఉండగా   ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు రాకుండా, ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు  ప్రచారం జరుగుతోంది. రాజు సభకు వస్తే.. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని, ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి, స్థానిక నేతలతో చెప్పినట్లు సమాచారం.    

బడంగ్ పేట్ మేయర్ టీఆర్ఎస్ కు గుడ్ బై

తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బడంగ్ పేట్ మేయర్ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న కాక మొన్న బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాస గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బడంగ్ పేట మేయర్ రాజీనామా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని ఆ లేఖలో పారిజాత నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాగా తన రాజీనామా విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపిన పారిజాత నర్సింహారెడ్డి పార్టీకి అంకిత భావంతో సేవలందించినా, ఇటీవలి కాలంలో పార్టీలో గుర్తింపు కరవైందనీ, అవమానాలు ఎదురౌతున్నాయనీ పేర్కొన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.  ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. పార్టీలో సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు.

శివసేన కార్యాలయం మూత

మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయం మూతపడింది. థాకరే నేతృత్వంలోని వర్గం, షిండే నేతృత్వంలోని వర్గం కూడా అసలైన శివసేన తమదంటే తమదని చెపుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలోని శివసేన కార్యాలయానికి ఆదివారం సీల్ వేశారు. సీల్ వేసిన కార్యాలయం బయట శివసేన లెజిస్లేటివ్ పార్టీ ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేసినట్లు నోటీసు అతికించారు. సలైన శివసేన తమదేనంటూ ఇటు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన వర్గం, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెండో వర్గం క్లెయిమ్ చేస్తుండటంతో మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి ఆదివారంనాడు సీల్ వేశారు. కార్యాలయం వెలుపల నోటీసు అంటించారు. ''శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేశాం'' అని ఆ నోటీసు ;పెట్టారు.   కాగా   షిండే వర్గం నేతలు తాము శివసేనను విడిచి పెట్టలేదని, మెజారిటీ సభ్యులు తమవైపే ఉన్నందున తమదే అసలైన శివసేన అని చెబుతుంటే.. షిండే వర్గం వాదన చెల్లదని, పార్టీ లోగో, గుర్తింపు పొందిన ధనుస్సు, బాణం గుర్తు వారికి ఎంతమాత్రం చెందదని ఉద్ధవ్ థాక్రే వర్గం వాదిస్తోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కిషోర్ తివారి సహా పలువురు పార్టీ నేతలు ఇదే విషయంపై ఢంకా బజాయిస్తున్నారు. ఎవరుపడితే వారు వెళ్లిపోవడం, పార్టీని తన్నుకుపోవడం అంత సులభం కాదని, చాలా లీగల్ అంశాలు కూడా ముడిపడి ఉంటాయని  అంటున్నారు. ఇరు వర్గాల మధ్యా వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలోని శివసేన కార్యాలయానికి సీలు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

కేటీఆర్ దూకుడు.. నేతల్లో వణుకు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెరాస అధ్యక్షుడు ఎవరు? గత కొద్ది రోజులగా ఇక్కడా అక్కడ వినిపిస్తున్న ఈ  ప్రశ్న, ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా  తెరాస వర్గాల్లోనే వినిపించడం విశేషం. అవును, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైన వరకు దూరంగా ఉంటున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో గానీ, ఇటు ప్రభుత్వ వ్యవహార్ల్లో అయినా చుట్టపు చూపుగా పాల్గొంటున్నారే తప్ప మునుపటిలా మనసు పెట్టడం లేదని తెరాస నాయకులు, కార్యకర్తలు కొంత బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందులా క్రియాశీలంగా వ్యవహరించడం లేదని, పరిపాలనను పెద్దగా పట్టించుకోవడం లేదని అధికార వర్గాల్లోనూ చాల కాలంగా చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారులు కూడా ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయవలసి వస్తోందని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎక్కువకాలం ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడం, రోజులు, వారాల తరబడి అధికారులు ఎవరికి అందుబాటులో  లేకపోవడంతో కీలక నిర్ణయాలను కూడా వాయిదా వేసుకోవలసి వస్తోందని మాట అధికార వర్గాల్లో వినవస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాజకీయాలు మునుపటిలా రుచించడం లేదనే మాట  అంతటా వినిపిస్తోంది.  మరోవంక, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జోరు పెంచారు.ఇటు ప్రభుత్వ వ్యవహరాలలో అటు, పార్టీ కార్యక్రమాల్లో అయన సర్వం తానే అన్నట్లుగా దూసుకు పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలలో కేసీఆర్ ను పక్కన పెట్టి తానే స్వయంగా చక్రంతిప్పుతున్నారని,అంతరంగిక వర్గాల సమాచారంగా తెలుస్తోందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పేరున వెలువడుతున్న నిర్ణయాలు అన్నీ ఆయన స్వీయ  నిర్ణయాలు కాకపోవచ్చని, కేటీఆర్ నిర్ణయాలు కేసీఆర్ పేరున వెలువడుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.   ఇందుకు సంబంధించి, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు,నిర్ణయాలు కేటీఆర్  తీసుకుంటారు, కేసీఆర్, మమ అంటారు అంటూ మర్మగర్భంగా వ్యంగ బాణాలు సంధించారు. అలాగే,  ఒక విధంగా చూస్తే, కర్తగా కేసీఆర్ ను పెట్టి కార్యం కేటీఆర్ కానిస్తున్నట్లుగా ఉందని పార్టీలోని మరి  కొందరు నాయకులు అంటున్నారు.  ప్రతిపక్షాల రాష్ట్రపతి  అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపే విషయంలోనూ, కేసీఆర్  కు తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదని, అయితే, కేటీఆర్ పట్టు పట్టుపట్టి, స్వయంగా సిన్హా నామినేషన్ కార్యక్రమాలో పాల్గొన్నారని అంటున్నారు. నిజానికి, అదే నిర్ణయం స్వయంగా కేసీఆర్ తీసుకుని ఉంటే స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి సిన్హా నామినేషన్ కార్యక్రంలో పాల్గొనే వారని, అయన వెళ్ళ లేదంటే అది అయన తీసుకున్న నిర్ణయం కాదని, అంటున్నారు. నిజానికి, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన మహిల ద్రౌపతి ముర్ము పేరును ప్రకటించిన నేపధ్యంలో, కేసీఆర్ తటస్థ వైఖరి తీసుకోవాలని అనుకున్నారని, పోలింగ్ కు ముందు వరకు మౌనంగా ఉండి చివర్లో ‘ఆత్మ ప్రభోదం’ మేరకు ఓటు వేయాలని, నిర్ణయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వదిలేయాలని, తద్వారా దళితులు, గిరిజనులకు తెరాస వ్యతిరేకం కాదనే సందేశం ఇవ్వాలని కేసేఅర్ ఆలోచన చేశారు. అందుకే, యశ్వంత్ సిన్హా పర్యటన సందర్భంగానూ, ఆయన చెప్పవలసింది అంతా చెప్పి చివరకు, మనసులో ఉన్న. ఆత్మ ప్రభోదం మంత్రాన్నే బయట పెట్టారని, తెరాస నాయకుల సమాచారంగా ఉందని అంటున్నారు.  ఇదలా ఉంటే, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ కూల్చివేస్తుందనే భయం మొదలైందని అంటున్నారు. అందుకే యశ్వంత్ సిన్హా ప్రచార సభలో కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూల్చివేస్తే, తాము కేంద్ర సర్కార్ ను పడగొడతామని  హెచ్చరించారని  అంటున్నారు.అంటే, మహారాష్ట్ర పరిణామాలు తెలంగాణాలోనూ సంభవించే ప్రమాదం లేక పోలేదని, కేసేఆర్, అనుకుంటున్నారా? అనుమానిస్తున్నారా?  పార్టీలో చీలికకు అవకాశం ఉందనే అనుమానం ఏదైనా వుందా? అందుకే ఈ హెచ్చరిక చేశారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి, కేటీఆర్  దూకుడుకు కళ్ళెం వేసేందుకు అవసరం అయితే తిరుగుబాటు చేసేందుకు కూడా ఒకవర్గం సిద్ధంగా ఉందని అంటున్నారు. మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో,  కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వలన రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ  కూడా నష్టపోవలసి ఉంటుందని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు భయపడుతున్నారు. అవునన్నా కాదన్నా, మనకు ఇష్టం ఉన్న లేకున్నా బీజేపీ జాతీయ పార్టీ,, కేంద్రంలో. సగానికి పైగా రాష్ట్రాల్లో ,అధికారంలో ఉన్న పార్టీ, అన్నిటినీ మించి బీజేపీ  ప్రస్తుత నాయకత్వం, మోడీ, షా జోడీ ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టి ముందుకు దూసుకు పోతోంది. ఆ ఇద్దరి కన్ను పడితే, ఇక అంతే సంగతులు ... అనే భయం పార్టీలో కొందరు ముఖ్య నేతలు వ్యక్త పరుస్తున్నారు. తెలంగాణపై మోడీ, షా కన్ను పడింది అనే విషయంలో సందేహం లేదు.. ఇప్పటికే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు మొదలయ్యాయి. అంతేకాదు, ఓ వంక  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపధ్యంగా బీజేపీ, తెరాసల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న సమయంలోనే  లోక్ సభలో తెరాస పక్ష నేత నామ నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్ కంపెనీఆస్తులు రూ.92 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది. కేటీఆర్ బీజేపీ జాతీయ నాయకుల్ని ఇలాగే  రెచ్చ గోడితే అటు నుంచి  ఇలాంటి దాడులు, జప్తులు  ఇంకా చాలా జరగుతాయని, దీనికి తెరాస ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తి తోడైతే, తెరాసను చీల్చడం పెద్ద పని కాకపోవచ్చని అంటునారు. అందుకే కేటీఆర్ దూకుడు తగ్గించుకోవడం మంచిందని, లేదంటే  అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అంటున్నారు.

బీజేపీ విజయ సంకల్ప సభకు వరుణ గండం

బీజేపీ విజయ సంకల్ప సభకు వరుణ గండం పొంచి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించతలపెట్టిన ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అంతే ఇంత భారీగా నిర్వహించతలపెట్టిన సభకు వరుణ గండం పొంచి ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన, టెన్షన్ నెలకొంది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన మోడీ కటౌట్ కూలిపోవడంతో సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వరకూ ట్రాఫిక్ ను నిలిపివేశారు. వాతావరణ శాఖ హైదరాబాద్ లో ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యలో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.  ప్ర‌ధాని మోడీతో పాటు కేంద్ర కేబినెట్.. ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం ఈసభకు హాజరవుతుండడంతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా తమ బలాన్ని ప్రధానమంత్రి ముందు ఈ సభ ద్వారా ప్రదర్శించేందుకు ప్రయత్నం చేసిన‌, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సభపై ఆందోళన ఏర్పడింది. ఇక బీజేపీ విజయ సంకల్ప సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.   పలు రూట్లలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. హెచ్ఐసీసీ  మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ – పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ చుట్టు పక్కల రోడ్లలో ప్రయాణించడం నివారించారు. అలాగే టివోలి క్రాస్ రోడ్ నుండి ప్లాజా క్లాస్ రోడ్ మధ్య రహదారి మూసివేశారు. అలాగే  చిలకలగూడ  క్రాస్ రోడ్,  అలుగడ్డబాయి క్రాస్ రోడ్,   సంగీత్ క్రాస్ రోడ్,  వైఎంసీఏ క్రాస్ రోడ్,  ప్యాట్నీ క్రాస్ రోడ్, ఎస్బీహెచ్ క్రాస్ రోడ్,  ప్లాజా,  సీటీవో జంక్షన్,   బ్రూక్‌బాండ్ జంక్షన్,  టివోలి జంక్షన్,  స్వీకార్‌ఉప్‌కార్ జంక్షన్,  సికింద్రాబాద్ క్లబ్,   తిరుమలగిరి క్రాస్ రోడ్,  తాడ్‌బండ్ క్రాస్ రోడ్  సెంటర్ పాయింట్,  డైమండ్ పాయింట్  బోయినపల్లి క్రాస్ రోడ్,  రసూల్‌పురా, బేగంపేట్   ప్యారడైజ్ మార్గాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకూ ప్రయాణాలు వద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.  

భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన యోగి.. పాతబస్తీలో టెన్షన్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పాత బస్తీలో టెన్షన్ వాతావరణానికి కారణమయ్యాయి. ఔను నిజమే. హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఉదయం పాత బస్తీ చార్మినార్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకు కారణం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన కోసం అక్కడకు రావడమే ఈ టెన్షన్ కు కారణం. భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన కోసం యోగి ఆదిత్యనాథ్ రావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పలు ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. యోగి ఆలయ సందర్శన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకున్న యోగి ఆదిత్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా    చార్మినార్, మక్కా మసీద్, గుల్జర్ హౌస్, లాడ్ బజార్, హుసేనీ అలం, మొఘల్‌పుర, సర్దార్ మహల్ రోడ్, చౌమహల్ కిల్వట్ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతోపాటు ప్లాటూన్ టీమ్స్‌ను మోహరించారు. సౌత్ జోన్ డీసీపీ భద్రతను పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్, 3 ప్లాటూన్ మహిళా పోలీస్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

బెజవాడ కనక దుర్మమ్మకు తెలంగాణ బంగారు బోనం

తెలుగు రాష్ట్రాల అవినాభావ సంబంధానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయానికి నిదర్శనం ఏటా బెజవాడ కనకదుర్గమ్మ  అందుకునే తెలంగాణ బంగారు బోనం. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే అనడానికి రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ సంప్రదాయం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుండటమే నిదర్శనం. హైదరాబాద్ లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున బెజవాడ కనకదుర్గమ్మకు ఈ రోజు బంగారు బోనం అందింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తెలంగాణలో ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది. ఆ పండుగ సందడి ఏపీలో కూడా ప్రతిఫలిస్తుంది. అందులో భాగమే తెలంగాణలో తొలి బోనం సమర్పించే రోజునే బెజవాడ కనకదుర్గమ్మకూ బోనం సమర్పించడం. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతి ఏటా ఆషాఢమాసంలో విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడు కూడా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించినట్లు మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారుజ.  అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికిపైగా కళాకారులు విజయవాడకు చేరుకుని ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించి  బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, తీన్‌మార్‌ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  

కేసీఆర్ భయానికి ఇదే నిదర్శనం.. ఖుష్బూ

తెలుగు సినిమాలలో నటించిన ఖుష్బు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ నాయకురాలిగా ఆమె తెలుగువారికి కొత్తే. రాజకీయవేత్తగా మారిన ఖుష్బు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఆమె బీజేపీకి కీలక నేత. హైదరాబాద్ లో జరగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆమె కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు వారితో తనకు ఉన్న అనుబంధం కారణంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా కొన్ని ఘాటు విమర్శలూ చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా చేస్తున్న అతిని ఆమె కేసీఆర్ లోని భయానికి దర్పణం పడుతోందని పేర్కొన్నారు. నగరంలో బీజేపీ ఫ్లెక్సీలకు చోటు దొరకనంతగా టీఆర్ఎస్ ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఆమె ఎత్తి చూపారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడమే మోడీ అంటే, బీజేపీ అంటే కేసీఆర్ ఎంతగా భయపడుతున్నారో తెలియజేస్తోందని ఖుష్బూ అన్నారు. ఇక రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ రాకపోవడం ఆయన ఆలోచనా ధోరణికి, లెక్కలేని తనానికీ, ఫెడరల్ విధానం పట్ల విముఖతకు నిదర్శనంగా ఖుష్బూ పేర్కొన్నారు.

ప్లీనరీ ముంగిట వైసీపీలో గ్రూపుల రచ్చ

ఎప్పుడో 2017లో వైసీపీ  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ప్లీనరీ... మళ్లీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత జరగ బోతోంది.  ప్లీనరీ బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని ఇప్పటికే సీఎం జగన్  పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు  ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు ప్లీనరీ సన్నాహాలు ప్రారంభించేశారు. స్థల పరిశీలన చేశారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హడావుడి అయితే పడుతున్నారు కానీ  ప్లీనరీకి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. అలాంటి సమయంలో వివిధ జిల్లాల్లో నేతల మధ్య గ్రూప్ తగాదాలు .. రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వ్యవహారం రచ్చకెక్కింది. హఠాత్తుగా ఇరువురు నేతలూ   ఎందుకు బరస్ట్ అయ్యారన్న చర్చ పార్టీలో ఓ రేంజ్ లో జరుగుతోంది. గతంలో కూడా జిల్లాల్లో నేతల మధ్య గ్రూప్ తగదాలు ఉన్నా అవి ఇలా రచ్చకెక్కిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు  మాత్రం అవి వీధి తగాదాలుగా మారిపోయాయి. మీడియా ముందు, టీవీ డిబెట్లలో కూడా కోటం రెడ్డి, బాలినేని రచ్చ ఓ రేంజ్ లో సాగుతోంది. విజయసాయిరెడ్డే బాలినేని, కోటంరెడ్డిల మధ్య చిచ్చుకు సూత్రధారి అన్న చర్చ వైసీపీ కేడర్ లో జోరుగా సాగుతోంది. వారిద్దరి మధ్యే కాదు.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైసీపీలో గ్రూపుల తగాదాలు పరిధిమీరి రచ్చకెక్కుతున్న పరిస్థితి ఉంది.  తాడేపల్లి ఫ్యాలెస్‌లోకి  విజయసాయి రీ ఎంట్రీ  తర్వాతే  జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల   రచ్చ పెచ్చరిల్లిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.    వైయస్ జగన్ ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు విజయసాయిరెడ్డి  పాత్ర పార్టీలో అత్యంత కీలకం.. నాడు ఆయన ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక లగాయతు.. జగన్ తొలి కేబినెట్ కూర్పు  జరిగింది.  ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైజాగ్ వెళ్లిపోయారు.. ఆ తర్వాల అంతా  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలోని పదవులు రాని కీలక నేతలంతా ఆయన చుట్టూ  చేరారు. అక్కడ నుంచి ఏ జిల్లాలో జిల్లాల్లో ఎక్కడ ఏ నాయకుల మద్య అసంతృప్తి జ్వాలలు  ఎగిసినా   సజ్జల రామకృష్ణరెడ్డి  డైరెక్ట్‌గా రంగంలోకి దిగి.. సముదాయించడం జరుగుతూ వస్తోంది.  అయితే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి.. జిల్లా అధ్యక్షులు, సమన్వయ కర్తల బాధ్యతలు అప్పగించడం రచ్చకు కారణమైందని అంటున్నారు. సజ్జల, విజయసాయి రెండు అధికార కేంద్రాలుగా మారడంతో జిల్లాల్లో పార్టీ నేతలు, క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.. సజ్జల, విజయసాయి మధ్య విడిపోయిన జిల్లాల నేతల పంచాయితీ ఇప్పుడు వారు కూడా తీర్చలేని స్థితికి చేరుకుందనీ, దీంతో ఇవన్నీ   జగన్ వద్దకు చేరుతున్నాయనీ పార్టీ కేడర్ చెబుతున్నారు.  అదే సమయంలో జనంలో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుంటే..  మరోవైపు తెలుగుదేశం, జనసేనలు బలోపేతం అవుతున్నాయి. ఆ రెండు పార్టీలు బలోపేతం అవుతున్నాయనడానికి జనసేన సభ, తెలుగుదేశం మహానాడుల సక్సెసే తార్కాణమని వైసీపీ క్యాడరే బహిరంగంగా చెబుతోంది. కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేన సభ సక్సెస్ అయ్యింది.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. మరి   151 ఎమ్మెల్యేలు ఉండి, అధికారంలో ఉన్న వైసీపీ ప్లీనరీ ఎంత బ్రహ్మాండంగా జరగాలి అని జగన్ అంటుంటే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని వైసీపీ క్యాడర్ అంటున్నారు.  

నడ్డా పాతపాటే.. మోడీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించడమే!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాత పాటనే వినిపించారు. ప్రధాని మోడీనీ, బీజేపీని వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించడమేనని సూత్రీకరించారు. మోడీ హయాంలో దేశం అన్ని రంగాలలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి 6 శాతం ఉంటే మనదేశ ఆర్థిక వృద్ధి 8.7 శాతం ఉందని చెప్పుకొచ్చారు.  బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అధ్యక్షోపన్యాసం చేసిన ఆయన విపక్షాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని వ్యతిరేకిస్తున్నామంటూ విపక్షాలు దేశాన్ని వ్యతిరేకిస్తున్నాయని మండి పడ్డారు.  సర్జికల్ స్ట్రైక్స్, రఫెల్ విమానాల కొనుగోలుపై విపక్షాల ఆరోపణలను ఆయన ఇందుకు ఉదాహరణగా చూపారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ పాలనపై, అవినీతిపై విమర్శలు గుప్పించారు. ఎస్టీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడమే నిదర్శనమని చెప్పారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 352 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో నడ్డా దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై, పార్టీ బలోపేతంపై మాట్లాడారు.  మోదీ ఎనిమిదేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని.. జన్‌ధన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌ వంటి పథకాలు పేదల సాధికారత కోసం ఉద్దేశించినవేనన్నారు. పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే యూపీ, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు రాంపూర్‌, అజాంగఢ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు.ఇక పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికిగాను ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నామనీ, దేశ వ్యాప్తంగా  ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 200 మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి, వారితో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే   30 కోట్ల మంది లబ్ధిదారులతో పార్టీ కేడర్‌ సమావేశమై, పథకాల వారీగా వారి అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కమిటీలను పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకతను పార్టీ గుర్తించిందన్నారు.  

వైసీపీ ప్లీనరీ వేదికపై విజయమ్మ కనిపించేనా?

అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జూలై 8, 9 తేదీల్లో జరగనుంది. అందుకు సన్నాహాలు మొదలైనాయి. అయితే ఈ ప్లీనరీని సక్సెస్ చేసేందుకు పార్టీలోని కీలక నేతలంతా రంగంలోకి దిగారు. భారీగా నిర్వహించే ఈ ప్లీనరీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరవుతారా? ఆమె ఆ పదవిలోనే కొనసాగుతారా? లేక ఆ పదవికి రాజీనామా చేసి.. మళ్లీ కుమార్తె వైయస్ షర్మిల వద్దకు వెళ్లిపోతారా? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో హాట్‌హాట్‌గా నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌కి ఆయన తల్లితో చెల్లితో బాగా గ్యాప్ పెరిగింది. ఇందుకు తార్కానమే షర్మిల  వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం, తల్లి విజయమ్మ ఆమెతోనే ఉండటం. వైఎస్సార్టీపీ  అధ్యక్షరాలిగా   షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  పాదయాత్ర చేస్తున్నారు. ఆమె పాదయాత్ర ఇటీవలే వంద రోజులు సైతం పూర్తి చేసుకొంది. అయితే తెలంగాణలో పార్టీ వద్దన్నా వినకుండా  పార్టీ పెట్టడంపై సీఎం జగన్ .. రగిలిపోతున్నారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  వైఎస్సార్ టీపీ కారణంగానే  జగన్‌కు  విజయమ్మ, షర్మిలలతో సంబంధాలు చెడ్డాయని కూడా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.   ఈ పరిస్థితుల్లో  ఈనెల 8,9 తేదీలలో జరగనున్న వైసీపీ ప్లీనరీకి  వైయస్ విజయమ్మ అయినా హజరవుతారా?అన్న సందేహాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి.  2017లో నాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు.. అదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే.. జగన్ పరిపాలన ముచ్చటగా మూడేళ్లు నిండిన తర్వాత నిర్వహిస్తున్నది.   విపక్ష నేతగా జగన్   ఎప్పుడు దీక్షలు చేసినా.. ఎప్పుడు సభలు, సమావేశాలు నిర్వహించినా..   విజయమ్మ.. షర్మిల జగన్ కు అండగా నిలిచారు. ముగ్గురూ ఒకే వేదికపై కూర్చుని ముచ్చట్లాడుకునే వారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  ముందు ముందు కూడా ఉంటుందన్న నమ్మకం లేదు.   అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్న సమయంలో.. జగనన్న వదిలిన బాణాన్నంటూ  షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. అలాగే రాజన్న రాజ్యం కోసం.. తన బిడ్డకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ.. ఎన్నికల ప్రచారంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా  విజయమ్మ కోరారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కూడా వైసీపీతో కానీ, అధినేత జగన్ తో కానీ కనీసం కలవడానికి ఇష్టపడటం లేదు. జగన్ తో తల్లీ, సోదరిల విభేదాలు పార్టీకి ఒక విధంగా పెద్ద దెబ్బేనని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  

ఈటలకు హై కోర్టులో ఊరట.. జమునా హేచరీస్ భూముల్లో జోక్యం వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు

ఈటలకు హైకోర్టులో ఊరట లభించింది.   మెదక్‌ జిల్లా   అచ్చంపేటలోని సర్వే నంబరు 130లో జమునా హేచరీ్‌సకు ఉన్న మూడు ఎకరాల భూమి విషయంలో వచ్చే నెల   1 వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.   ఇటీవల భూములు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెదక్‌ కలెక్టర్‌, స్థానిక ఆర్డీవో, మాసాయిపేట తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీచేసింది.  ఈ మూడెకరాలు ప్రభుత్వ భూములని, వాటిని ఆక్రమించడంపై వివరణ ఇవ్వాలంటూ గత నెల 25న మాసాయిపేట తహసీల్దార్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ జమునా హేచరీస్‌, ఆ సంస్థ డైరెక్టర్‌ ఈటల నితిన్‌రెడ్డి, ఈటల జమున   హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. గతంలో కలెక్టర్‌ ప్రాథమిక సర్వే పూర్తిచేశారని, పూర్తిస్థాయి సర్వే కొనసాగుతోందని వివరించారు. సర్వే పూర్తికాకముందే.. భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందని ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ వాదనతో విభేదించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఆగస్టు 1 వరకు ఆ భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. కాగా రైతులకు ప్రభుత్వం కేటాయించిన అస్సెన్డ్ భూములను కబ్జా చేసి ఈటల ఆ భూములలో జమునా హేచరీస్ నడుపుతున్నారన్న ఆరోపణలపై గత కొంత కాలంగా ప్రభుత్వం, ఈటల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలపైనే ఈటలను టీఆర్ఎస్ పక్కన పెట్టింది. కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది. దీంతో ఈటల తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ గూటికి చేరి..తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే భూముల విషయంలో మాత్రం తన న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.  

అన్నదాతకు సంకెళ్లా.. తెలంగాణలో రైతు సంక్షేమం ఇదేనా?

దేశానికి అన్నం పెట్టేది రైతు. ఆరుగాలం కష్టపడి తన శ్రమకు ఫలితం దక్కకపోయినా తాను పస్తులుండి కూడా ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలనేది రైతు నైజం. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతకు ఆత్మగౌరం లేకుండా పోతోంది. వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుల కోసం తాము తమకు బదుకు దెరువు చూపే భూములను ఇచ్చిన రైతులు పరిహారం కోసం ఏళ్లుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి. పోరాడినా న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు. నిరన తెలిపినందుకు, కడుపు మండి రోడ్డు ఎక్కినందుకు చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. చివరకు సంకెళ్లు వేసుకుని ఉగ్రవాదుల్లా కోర్టు మెట్లు ఎక్కాల్సి దుస్థితి నెలకొంది. రైతు, రైతుబాంధవుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రైతుల బతుకులు బాగవుతున్నాయని ప్రచారం చేసుకునే అధికార పార్టీ నేతలు, మంత్రులు, రూ.50 వేల కోట్లు రైతు బంధు ఇచ్చామని యాసంగిలో సంబరాలు చేసుకున్న నేతలు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు వేసిన బేడీలపై నోరు మెదపడం లేదు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరిచారు. పరిహారం కోసం జూన్‌ 14న హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు గుడాటిపల్లికి చెందిన 17 మంది నిర్వాసిత రైతులపై కేసులు పెట్టారు. వీరిలో నలుగురిని అదేరోజు అరెస్టు చేయగా.. మిగిలిన వారు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు. నలుగురిని అదే రోజు రిమాండ్‌చేసిన పోలీసులు, 14 రోజుల తర్వాత గురువారం హుస్నాబాద్‌ కోర్టుకు తీసుకొచ్చారు. తమ వారిని సంకెళ్లతో చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. 2017 ఏప్రిల్‌లో ఖమ్మంలోనూ మద్దతు ధర కోసం ఆందోళన చేసిన పది మంది రైతులను ఇలాగే సంకెళ్లతో కోర్టుకు తీసుకురావడం అప్పట్లో దుమారం రేపింది. తాజాగా మరోసారి రైతులకు సంకెళ్లు వేయడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఓమైనర్‌ బాలికపై అధికార పార్టీకి చెందిన నేతల కొడుకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో సాక్షాధారాలు బయటకు వచ్చే వరకు కూడా పోలీసులు నేతల కొడుకులు లేరని చెప్పుకొచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన రెండు రోజులకు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. చివరకు అరెస్ట్‌ చేసిన తర్వాత కూడా నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేయడం, ఇళ్ల నుంచి, హోటళ్ల నుంచి బిచార్యనీలు తెప్పించి ఇచ్చారు. పరిహారం అడిగిన పాపానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు మాత్రం ఇలా సంకెళ్లు వేశారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిపాటు పంజాబ్‌ రైతులు డిల్లీలో ఉద్యమించారు. ఈ పోరాటంలో పంజాబ్‌కు చెందిన రైతులు చనిపోయారు. రైతు ఉద్యమంతో ప్రధాని నరేంద్రమోదీ దిగివచ్చారు. చట్టాలను ఉపసంహరించుకుని దేశ రైతులకు క్షమాపణలు చెప్పారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ రైతు బాంధవుడని రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పంజాబ్‌కు వెళ్లి మరీ పరిహారం అందించారు. సొంత రాష్ట్రంలో రైతులు అన్నమో రామచంద్రా అని అంగలారుస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కడుపు మండి పోరాటం చేస్తే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిస్తున్నాడు సదరు రైతు బాంధవుడు. ఇదేనా బంగారు తెలంగాణ అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.