నడ్డా పాతపాటే.. మోడీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించడమే!
posted on Jul 3, 2022 9:09AM
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాత పాటనే వినిపించారు. ప్రధాని మోడీనీ, బీజేపీని వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించడమేనని సూత్రీకరించారు. మోడీ హయాంలో దేశం అన్ని రంగాలలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి 6 శాతం ఉంటే మనదేశ ఆర్థిక వృద్ధి 8.7 శాతం ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అధ్యక్షోపన్యాసం చేసిన ఆయన విపక్షాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని వ్యతిరేకిస్తున్నామంటూ విపక్షాలు దేశాన్ని వ్యతిరేకిస్తున్నాయని మండి పడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్, రఫెల్ విమానాల కొనుగోలుపై విపక్షాల ఆరోపణలను ఆయన ఇందుకు ఉదాహరణగా చూపారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ పాలనపై, అవినీతిపై విమర్శలు గుప్పించారు.
ఎస్టీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడమే నిదర్శనమని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 352 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో నడ్డా దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై, పార్టీ బలోపేతంపై మాట్లాడారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని.. జన్‌ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాలు పేదల సాధికారత కోసం ఉద్దేశించినవేనన్నారు. పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే యూపీ, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు రాంపూర్, అజాంగఢ్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు.ఇక పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికిగాను ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నామనీ, దేశ వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 200 మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి, వారితో ప్రత్యేక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే 30 కోట్ల మంది లబ్ధిదారులతో పార్టీ కేడర్ సమావేశమై, పథకాల వారీగా వారి అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలను పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకతను పార్టీ గుర్తించిందన్నారు.