"కార్పోరేట్" వ్యవసాయం
posted on May 7, 2013 @ 11:19AM
భారత దేశం వ్యవసాయాధారిత దేశం. దేశానికి రైతే వెన్నెముక. కానీ ఈనాడు ఆ రైతుకే వెన్నెముక విరిగిపోతున్న పరిస్థితి. నానాటికీ క్షీణించిపోతున్న వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ రంగంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం తో ఈ వ్యవసాయ కార్యక్రమాన్ని 17 రాష్ట్రాలలో అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో మన ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒకటిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రూ. 7,000 కోట్లు ఖర్చుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం రైతులు ఏ పంటలు వేయాలి, ఏ విత్తనాలు వాడాలి దగ్గరనుంచి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం వరకు ఈ కార్పోరేట్ కంపనీల ద్వారానే జరుగుతుంది.
ఆహార భద్రత అంటూ వల్లె వేసే ప్రభుత్వాలు... ఆ ఆహార భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజెప్పే ప్రయత్నం చెయ్యరు. క్షీణిస్తున్న భూసారాన్ని అరికట్టాలి. విచక్షణారహితంగా ఎరువులు వాడటం తో పాటు, సేంద్రీయ ఎరువుల ఉపయోగం, సాంద్రీకరణ వ్యవసాయం తక్కువ స్థాయిలో ఉండటం వలన భూములు నిస్సారమైపోతున్నాయి. ఆ నేలల్లో ఉత్పాదకత పూర్తిగా పడిపోతోంది. చివరకు అవి పంటల సాగుకే పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.
సరియైన మౌలిక వసతులు లేకపోవడం,పండిన పంటలు నిల్వచేసుకోవడానికి సరియైన సీతలగిడ్డంగులు లేకపోవడం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో తరలించేందుకు సరియైన రవాణా సదుపాయాలు లేకపోవడం, నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి తీవ్రమైన నిధుల కొరత ఉండటం, సకాలం లో సేంద్రీయ ఎరువులు లభించకపోవడం, పాత పద్ధతులను అనుసరించడం వలన భూసారం తగ్గిపోవటం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడానికి సరియైన భీమా సౌకర్యం లేకపోవడం వంటి మొదలైన కారణాల వల్ల వ్యవసాయ రంగం నానాటికి కుంటుపడుతోంది.
ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వనిర్లక్ష్యం మరియు వారు చేసిన తప్పులకు ఈనాడు రైతు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టటం ఆహ్వానించదగిన పరిణామం. పైన చెప్పిన సమస్యలకు ఈ కార్పోరేట్ వ్యవసాయం వలన చాలా వరకు పరిష్కారం దొరకవచ్చు. కాని ఈ కార్పోరేట్ రంగం వలన కొన్ని కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవి ఏమిటంటే:
1. ఏ పంటలు వేయాలో ఈ కంపనీలు నిర్ణయించడం వలన లాభదాయకమైన వాణిజ్య పంటలను వేయడం ద్వారా మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ.
2. పెట్టుబడి ప్రభుత్వానిదే అయినా పెత్తనం కార్పోరేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుంది.
3. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు బ్రతుకు భారంగా మారుతుంది.
4. యంత్రాల వినియోగం పెరిగి నిరుద్యోగం పెరుగుతుంది.
5. ధరల నియంత్రణ ప్రభుత్వం నుంచి కార్పోరేట్ రంగం చేతిలోకి వెళ్ళిపోతుంది.
ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రస్తుత రైతుసమస్యలను ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమం ఎలా పరిష్కరిస్తుందో ప్రభుత్వం విపులంగా రైతులకు తెలియజేయవలసిన అవసరం ఉంది. అంతే కాకుండా కొత్త సమస్యలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వివరించవలసి ఉంది. వీటన్నిటి కంటే ముఖ్యంగా క్షీణిస్తున్న భూసారాన్ని రక్షించే విధంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. దీన్ని దీర్ఘకాలిక వ్యవహారంగా ముందుకి తీసుకు వెళ్ళాలి. సేంద్రీయ, జీవ ఎరువులను సైతం రసాయన ఎరువులతో కలిపి శాస్త్రీయంగా వాడేలా చూడాలి. దాని వల్ల నెల ఆరోగ్యం మెరుగు పడి అన్ని రకాల పోషకాల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ఇది వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం.