బొకేల వ్యాపారులకు బ్యాండ్ పడింది!

  ఎలక్షన్లు అయిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేసేశారు. వారందరికీ అభినందనలే అభినందనలు.. దండలే దండలు.. బొకేలే బొకేలు.. దాంతో తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు దండల మాదిరిగా వర్ధిల్లుతుందని ఆశించిన హైదరాబాద్‌లోని ఫ్లవర్ బొకేల వ్యాపారుల ఆశల మీద రాజకీయ నాయకులు నీళ్ళు చల్లారు. మామూలుగా గతంలో అయితే అయినదానికీ, కానిదానికీ రాజకీయ నాయకుల దగ్గర బొకేల హడావిడి వుండేది. అయితే తాజాగా అటు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకులు, ఇటు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పొదుపు మంత్రాలు పఠిస్తున్నారు. తమ దగ్గరకి వచ్చేవారు బొకేలు, దండలు పట్టుకురావద్దని స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో అందరూ పొదుపు చేయాల్సిన అవసరం వుందని, దుబారా ఖర్చు చేయకూడదని అందుకే తాము బొకేలకి, దండలకి దూరంగా వుంటున్నామని చాలామంది రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. తాము దుబారా ఖర్చులని ఎలా అదుపు చేస్తున్నారో బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఏనుగులు వెళ్ళే దారి వదిలేసి, చీమలు వెళ్ళే దారిలో కాపలా పెట్టినట్టు... మిగతా దుబారా ఖర్చులన్నీ యథావిధిగా జరిగిపోతున్నప్పటికీ, బొకేలు, దండల విషయంలోనే రాజకీయ నాయకులు పొదుపు పాటించేస్తూ దేశాన్ని కాపాడేస్తు్న్నారు. రాజకీయ నాయకుల దగ్గరకి వెళ్లేవాళ్ళు కూడా హమ్మయ్య ఖర్చు తగ్గిందనుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు. రాజకీయ నాయకుల పొదుపు సంగతేమోగానీ, వీళ్ళను నమ్ముకుని హైదరాబాద్‌లో పూల వ్యాపారాలు పెట్టుకున్నవాళ్ళు మాత్రం నష్టపోతున్నారు. ఈ సీజన్‌లో బొకేలు, దండల వ్యాపారం బాగా వుంటుందని బోలెడు పూలు తెప్పించామని అయితే, రాజకీయ నాయకుల అతి పొదుపు కారణంగా తమకు బ్యాండ్ పడిందని సదరు వ్యాపారులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం-1

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మాణం చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులందరూ కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసారు తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను పెద్దగా పట్టించుకోలేదు. వివిధ జిల్లాలకు చెందిన మంత్రులు, యం.యల్.ఏ.లు, యంపీలు కనీసం తమతమ జిల్లాలను నియోజక వర్గాలను అభివృద్ది చేసుకొనేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు వంటి ఏ కొద్దిమందో ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజక వర్గానికి, జిల్లాకు పరిశ్రమలు, మౌలిక వసతులు వంటివి ఏర్పాటు చేసుకొన్నారు. అందువల్ల రాష్ట్ర విభజన తరువాత వైజాగ్, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి నాలుగు నగరాలు మాత్రమే ఎంతో కొంత అభివృద్ధి చెందినట్లు కనబడుతున్నాయి తప్ప అభివృద్ధి విషయంలో మిగిలిన ప్రాంతాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ లోటు రాష్ట్ర విభజన తరువాత మరీ కొట్టవచ్చినట్లు కనడుతుంటే, రాజకీయ నేతలు సైతం తాము చేసిన పొరపాటుకు చింతిస్తున్నారు. అందుకే ఇప్పుడు 13 జిల్లాలకు అభివృద్ధిని సమానంగా వ్యాపింపజేయాలనే ఆలోచన వారిలో కూడా మొదలయింది.   మన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను చూసినట్లయితే అవి మొదటి నుండి కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేసినట్లు అర్ధం అవుతుంది. అందుకే వాటికి ఇటువంటి సమస్య ఎదురవలేదు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎదురయినా అవి ఇంత దైన్యస్థితిలో మాత్రం ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చును. తమిళనాడు రాజధాని చెన్నైతో సమానంగా మదురై, సేలం, కోయంబత్తూర్ జిల్లాలు అభివృద్ధి చెందాయి. అవికాక కన్యాకుమారి, తిరుపూర్, వెల్లూరు వంటి జిల్లాలు వివిధ రంగాలలో ఎంతో కొంత అభివృద్ధి సాధించాయి. అందువల్ల అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నందున ప్రజలు రాజధాని చెన్నైపై ఆధారపడటం తక్కువ. అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరు నగరాన్ని మనదేశ సాఫ్ట్ వేర్ రాజధానిగా అందరూ భావిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో కూడా షిమోగా, బళ్ళారి, కోలార్, దావణగేరే వంటి జిల్లాలకు అభివృద్ధి వ్యాపించి ఉంది. అందువల్ల ఇప్పుడు మన రాష్ట్రం కూడా అదేవిధంగా అభివృద్ధిని అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయవలసి ఉంది. మన నేతల ప్రయత్నలోపం లేకపోతే కేంద్రప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించేందుకు సిద్దంగా ఉంది గనుక అభివృద్ధి సాధించడం అసాధ్యమేమీ కాదు.

తెదేపా-వైకాపాల రాజకీయ యుద్ధం మళ్ళీ షురూ

  ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెదేపా, వైకాపాలు రెండూ కూడా ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకోకుండా నిన్న మొన్నటి వరకు సంయమనం పాటించాయి. ఎప్పుడూ చంద్రబాబును తిట్టిపోసే జగన్ కు చెందిన సాక్షి మీడియా కూడా చంద్రబాబు కార్యక్రమాల వివరాలు ప్రసారం చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ మళ్ళీ జగన్ చంద్రబాబుపై వ్యవసాయ రుణాల విషయంలో యుద్ధం ప్రకటించగానే సహజంగానే సాక్షి మీడియా కూడా ఆయనను అనుకరిస్తూ యధాప్రకారంగా చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టేసింది. కానీ మోడీ ప్రభుత్వం గురించి మాత్రం నేటికీ సాక్షి మీడియా నాలుగు మంచి ముక్కలే చెపుతోంది. ఓటమిపాలయిన జగన్మోహన్ రెడ్డే స్వయంగా తమ ప్రభుత్వంపై యుద్ద శంఖం పూరించడంతో, విజయోత్సాహంతో ఉన్న తెదేపా నేతలు కూడా వైకాపాతో యుద్దానికి ‘సై’ అనడంతో రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ క్రమంగా వేడెక్కసాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ బహిరంగ లేఖలు వ్రాస్తుంటే దానికి సాక్షి మీడియా వంత పాడుతోంది. అందుకు తెదేపా నేతలు కూడా అంతే ఘాటుగా ప్రతివిమర్శలు చేయడమేకాక, పరిటాల సునీత, గాలి ముద్దుకృష్ణం నాయుడు వంటివారు తమ ప్రభుత్వం త్వరలోనే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వివిధ కేసులను వేగవంతం చేస్తుందని స్పష్టం చేసారు. వారు చెపుతున్నట్లుగా ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తే ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మళ్ళీ పతాకస్థాయికి చేరుకోవడం ఖాయం.   ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తమపై తెదేపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా ఆరోపిస్తే, తెదేపా నేతలు చట్టం తనపని తాను చేసుకుపోతుందనో లేకపోతే చట్టం నుండి ఎవరూ ఎల్లకాలం తప్పించుకోలేరనో ‘స్టాండర్డ్ సమాధానం’ చెప్పవచ్చును. దానితో ఆ రెండు పార్టీల యుద్ధం మళ్ళీ పతాక స్థాయికి చేరవచ్చును. ఏమయినప్పటికీ, అవినీతి విషయంలో మోడీ ప్రభుత్వం తన స్వంత మంత్రులనే ఉపేక్షించేందుకు సిద్దంగా లేదని స్పష్టమవుతోంది గనుక అనేక కేసులలో A-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మున్ముందు మళ్ళీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పకపోవచ్చును. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెదేపాపై తన యుద్ధం కొనసాగిస్తూనే ఉండవచ్చును. తెదేపా కూడా అంతే ధీటుగా బదులివ్వకామానదు. అయితే రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవలసిన సమయంలో ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు ఈవిధంగా రాజకీయ యుద్ధం చేయడాన్ని ప్రజలు మాత్రం హర్షించరనే సంగతి అవి గ్రహిస్తే బాగుంటుంది.

వైజాగ్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు తన మొట్ట మొదటి మంత్రివర్గ సమావేశం విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రవిశ్వవిద్యాలయంలో రెడ్డి ఆడిటోరియంలో జూన్ 12న ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఇంతకాలం ఇటువంటి కార్యక్రమాలన్నీ కేవలం హైదరాబాదుకే పరిమితంయ్యేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విశాఖలోనే జరగబోతుండటంతో విశాఖ నగరవాసులు చాల సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.   కానీ నాలుగైదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలందరూ కలిసి నిర్మించుకొన్న హైదరాబాదు నగరాన్ని వదులుకొని, ఇటువంటి అతి ముఖ్యమయిన అధికారిక కార్యక్రమాలను కూడా విశ్వవిద్యాలయాలలో నిర్వహించుకోవలసిరావడం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాత్కాలికంగా మరొక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసుకోవలసి రావడం చూస్తే ఆంధ్రప్రజల హృదయాలు బాధతో కలుక్కుమనక మానవు. ఇందుకు కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు.   కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలని చూసుకొని, హైదరాబాదును 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించేసి హడావుడిగా రాష్ట్రవిభజన కానిచ్చేసింది. హైదరాబాదులో రెండు ప్రభుత్వాలకు భవనాలను కేటాయించింది. ఇంతవరకు రాష్ట్రమంతా ఒక్కటే గనుక హైదరాబాదులో ప్రభుత్వం కొలువై ఉండటం ఎవరికీ వింతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత, రాష్ట్రంతో భౌగోళికంగా ఏవిధంగానూ సంబందమూ లేని హైదరాబాదు నుండి రాష్ట్ర పాలన చేయడం అంటే చాలా వింతగా ఉంటుంది.   హైదరాబాదులో ముఖ్యమంత్రికి, రాష్ట్రమంత్రులకు, ఉన్నత పోలీసు అధికారులకి కార్యాలయాలు ఉండవచ్చు గాక కానీ అవేవీ మనవి కావనుకొన్నపుడు, అక్కడ ఉండటం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడో అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుండే ప్రభుత్వ పాలన సాగించుకోవడమే ఉత్తమం. అయితే దానికీ మరికొంత సమయం అవసరం గనుక అంతవరకు ప్రభుత్వానికి ఈ తిప్పలు తప్పవు. అందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు.

మంత్రిపదవి వద్దన్న బాలకృష్ణ.. అభిమానుల నిరాశ!

  నందమూరి బాలకృష్ణలో ఆయన అభిమానులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావునే చూసుకుంటూ వుంటారు. ఎన్టీఆర్ సాధించిన ఘనతలన్నీ ఆయన కూడా సాధిస్తారన్న నమ్మకాన్ని పెంచుకుంటూ వుంటారు. కథానాయకుడిగా తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా నెరవేర్చిన బాలకృష్ణ రాజకీయంగా కూడా తన తండ్రి అంతా స్థాయికి ఎదగాలని కోరుకుంటూ వుంటారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ ఆశలు మరింత పెరిగాయి. ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ మంత్రి కూడా అవుతారని అభిమానులు ఆశించారు. అయితే ఈనెల 8న ఆయన పేరు మంత్రివర్గంలో కనిపించలేదు. అది బాలకృష్ణ అభిమానులలో నిరాశ కలిగించింది. మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నప్పటికీ బాలకృష్ణను మంత్రిగా చూడలేకపోతున్నందుకు వారు బాగా ఫీలయ్యారు. ఈ ఫీలింగ్ రాష్ట్రవ్యాప్తంగా వున్న అందరి అభిమానుల్లోనూ వుండి. తన అభిమానులు తాను మంత్రి కాలేదని ఫీలవుతున్నారని బాలకృష్ణ అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే తన పుట్టినరోజు నాడు మంత్రి పదవికి సంబంధించిన తన అభిప్రాయాలను బాలకృష్ణ స్పష్టంగా చెప్పారు. తనకు మంత్రి పదవి మీద ఆసక్తి లేదని పదవులు లేకుండానే సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను వుంటానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రిపదవి కోరుకోకపోవడం బాలక‌ృష్ణలోని పరిణతికి అద్దం పడుతోంది. కానీ, ఆయన అభిమానులు మాత్రం నిరాశ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాత అయినా సరే బాలకృష్ణని మంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు.

కొండను తవ్వి ఎలుకను పట్టిన రాజధాని కమిటీ

        యూపీఏ ప్రభుత్వం ఏదయినా ఒక క్లిష్టమయిన అంశాన్ని పరిష్కరించవలసి వస్తే, ముందుగా దానికొక ఒక కమిటీ వేసి చేతులు దులుపుకొనేది. అందుకు ఉదాహరణగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని చెప్పుకోవచ్చును. దాదాపు రూ.60కోట్లు పైగా ఖర్చుచేసి రాష్ట్రవిభజనపై ఆ కమిటీ తయారు చేసిన నివేదికను చెత్తబుట్టలో పడేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత చాలా హడావుడిగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన యూపీఏ ప్రభుత్వమే స్వయంగా రాజధాని ఎక్కడ ఏర్పరచాలో నిర్ణయం తీసుకొని ఉండవచ్చును. కానీ ఆవిధంగా చేసినట్లయితే, మిగిలిన ప్రాంతాలలో ప్రజలు తమ పార్టీని తరిమి కొడతారని భయపడి దానికీ ఒక కమిటీని వేసి చేతులు దులుపుకొంది.   ఆ కమిటీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి వివరాలు సేకరించింది. అందుకు ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో తెలియదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ప్రకటించడంతో వారి పని కొండను తవ్వి ఎలుకని పట్టినట్లయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చెప్పట్టగానే కేంద్రానికి గుదిబండగా మారిన ఇటువంటి అనేక జీ.ఓ.యం.(కమిటీ)లను రద్దు చేసి, తిరిగి కేంద్రమంత్రి వర్గానికే సర్వాధికారాలు కట్టబెట్టారు.   ఆవిధంగా చేయడం వలన మంత్రులు త్వరగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ఖజానాపై భారం తగ్గుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో అదే పద్ధతి అవలంభిస్తే బాగుంటుంది. అనవసరమయిన కమిటీలను రద్దు చేసి, కొన్ని మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకు రాగలిగితే ప్రభుత్వంపై కొంత ఆర్ధికభారం తగ్గించుకోవచ్చును. అదేవిధంగా పార్టీలో అందరినీ సంతృప్తి పరిచేందుకు అందరికీ మంత్రి పదవులు లేదా నామినేటడ్ పదవులో కల్పించే ఆలోచన కూడా విరమించుకొంటే బాగుంటుంది. ప్రతీసారి ప్రజలనే త్యాగాలు చేయమని కోరకుండా మంత్రులు, పార్టీ నేతలు కూడా స్వయంగా కొన్ని త్యాగాలు చేసి, రాజధాని నిర్మాణం కోసం భారీగా విరాళాలు ఇచ్చినట్లయితే వారిని చూసి ప్రజలు కూడా మరింత స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది.

భవిష్యత్ కు భరోసా ఇస్తున్న మోడీ ప్రభుత్వం

        కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా మంచి అనుబంధం గల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, నిన్న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధి అయిన బీజేపీ ప్రభుత్వాన్ని ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ ప్రసంగించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికి రాష్ట్రపతే సర్వోన్నతాధికారి గనుక ఆయన సాంప్రదాయం ప్రకారం మోడీ ప్రభుత్వాన్ని కూడా ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ తన ప్రభుత్వ లక్ష్యాలను, చెప్పట్టబోయే పధకాలను వివరించారు.   అదేవిధంగా ఈసారి ఎన్నికలలో ప్రజలు మార్పు కోరుకోన్నారని, అందుకే చాలా సానుకూల దృక్పధంతో ఓట్లు వేసారని, దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని భరోసా ఇచ్చారు. ఇంతవరకు యూపీఏ ప్రభుత్వం ఎన్నడూ కలలో కూడా ఆలోచించని ‘గంగా ప్రక్షాళనం’ రాష్ట్రాల మధ్య స్పీడ్ ట్రైన్స్ ఏర్పాటు, దేశంలో కొత్తగా వంద ప్రపంచ స్థాయి నగరాల ఏర్పాటు, నగరాలతో సమానంగా పల్లెలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతీ పొలానికి సాగు నీరు, బహిరంగ ప్రదేశాలలో వైఫీ సదుపాయం వంటివి అనేకం ప్రకటించారు. మోడీ ప్రభుత్వం ముఖ్యంగా దేశంలో ఉన్న మానవ వనరులను పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా భారీ ఎత్తున అభివృద్ది కార్యక్రామాలు చెప్పట్టడం, తద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించడం, మౌలిక వసతులు, విద్యా, వైద్య, విద్యుత్, ఉత్పత్తి రంగాలకు పెద్ద పీట వేయడం వంటివి చెప్పట్టబోతున్నట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరించారు.   గత అరవై ఏళ్లుగా పడికట్టు పదాలతో రాష్ట్రపతులు, ప్రధానులు చేసే ప్రసంగాలు వినివినీ చెవులు తుప్పు పట్టిపోయిన భారత ప్రజలు, వారి ప్రతినిధులు కూడా నిన్న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం విని పులకించిపోయారు. ఇవ్వన్నీ నిజంగా సాకారమయినట్లయితే, భారత్ కూడా అగ్రదేశాల సరసన నిలబడటం ఖాయం. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇరువురి ఆలోచనా విధానం ఒకటే గనుక బహుశః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి అభివృద్ధి సాధ్యమేనని భావించవచ్చును. దానికి కావలసిందల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులలో సంకల్ప బలం, నిబద్దత. ఆ రెండు ఉంటే అన్ని సమస్యలను అవలీలగా అధిగమించవచ్చును. మోడీ తన మంత్రివర్గానికి నిర్దిష్ట లక్ష్యం, కాలపరిమితి నిర్దేశించి ఏవిదంగా పరుగులు తీయిస్తున్నారో, అదేవిధంగా చంద్రబాబు కూడా తన ప్రభుత్వాన్ని పరుగులు తీయించలసి ఉంటుంది.

ఇదంతా ప్రజాసేవ కోసమే...

    ప్రజాసేవ అంటే మన రాజకీయ నాయకులకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ అవకాశం కోసం వారు ఎన్నికలలో తమ కష్టార్జితాన్ని శనక్కాయలు పంచినట్లు జనాలకు చాలా ఉదారంగా పంచిపెట్టేస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆంధ్ర, తెలంగాలో పట్టుబడిన రూ.125కోట్లే అందుకు ఒక గొప్ప ఉదాహరణ. అంత ఖర్చు చేసి ఎలాగో ఎన్నికలలో గెలిచిన తరువాత ఏదో ఒక మంచి మంత్రి పదవి చేప్పట్టి మరింత ప్రజాసేవ చేసేయాలని తపించిపోతారు. కానీ ఆవిధంగా తపించేవారు అధికార పార్టీలో చాలా మందే ఉంటారు గనుక ప్రజాసేవ చేసేందుకు కూడా పాపం వారు చాలా పోటీ ఎదుర్కోవడం తప్పడం లేదు.   ఇక విషయంలోకి వస్తే, చంద్రబాబుతో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 19 మందిలో తమపేర్లు కనబడకపోవడంతో ఒకరికి మనసు పాడయిపోయింది. మరొకరికి మనసుతో బాటు ఆరోగ్యం కూడా పాడయిపోయింది. వారిలో మనసు మాత్రమే పాడుచేసుకొన్న పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ, ప్రజాసేవ చేసేందుకు చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చినప్పటికీ, ప్రజలకు మరింతగా సేవ చేసుకొనేందుకు తనకు మంత్రి పదవి ఇవ్వందదుకు నిరసనగా తెదేపా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.   ఇక కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు , తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాగిత వెంకటరావు, తనకు ప్రజాసేవ చేసే భాగ్యం దక్కనందుకు మనసుతో బాటు ఆరోగ్యం కూడా పాడుచేసేసుకొన్నారు. నాలుగు సార్లుగా ఎన్నికవుతున్న తనను కాదని, మొదటి సారిగా ఎన్నికైన కొల్లు రవీంద్రకు మంత్రి పదవి ఇవ్వడం వల్లనే ఆయన ఆరోగ్యం మరింత పాడయినట్లు తెలుస్తోంది. కానీ బీపీ, సుగర్ వ్యాధులు ఉన్నఆయన నిన్న ఉదయం నుండి సరయిన ఆహారం, విశ్రాంతి తీసుకోకుండా, ప్రమాణ స్వీకారోత్సవానికి అతిగా శరమించడం కాగిత వెంకట్రావుకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం వల్ల గుండెపోటు వచ్చిందని ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వలననే ఆరోగ్యం పాడయింది తప్ప, ప్రత్యర్ధ పార్టీకి చెందినా పత్రిక వర్నిస్తున్నట్లు మంత్రి పదవి రాకపోవడం వలన ఆరోగ్యం పాడవలేదని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. తమ నాయకుడి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏమయినప్పటికీ ఆయన ఆరోగ్యం పాడవడం మాత్రం వాస్తవమేనని వారు కూడా అంగీకరిస్తున్నారు. మనసు పాడయితే మంత్రి పదవితో దానిని మళ్ళీ బాగు చేసుకోవచ్చును. కానీ ఆరోగ్యం పాడయితే వైద్యం చేయించుకోక తప్పదు గనుక, ఆయనను బందరు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.   అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఓదార్పు యాత్రలు ఆరంభించవలసి వస్తోంది. ప్రజాసేవ చేసే భాగ్యం దక్కక మనసు, ఆరోగ్యం పాడు చేసుకొన్న వారినందరినీ ఓదార్చేందుకు పార్టీ సీనియర్ నేతలను పంపినట్లు సమాచారం. త్వరలోనే మరోసారి మంత్రివర్గ విస్తీర్ణం ఉంటుంది గనుక, అప్పుడయినా తమకు మంత్రివర్గంలో దక్కితే ప్రజలకు భారీగా సేవచేసే అవకాశం దక్కకపోతుందా? అని చాలామంది తెదేపా నేతలు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. గనుక చంద్రబాబు ఏకంగా అప్పుడే ఈ ఓదార్పు కార్యక్రమామేదో పెట్టుకొంటే బాగుండేది కదా? అని దానిపై పేటెంట్ హక్కులున్న ప్రతిపక్షాల వారు సూచిస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ కు మోడీ సర్కార్ పవర్ ఫుల్ గిఫ్ట్

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కోబోతున్న అనేక సమస్యలలో విద్యుత్ లోటు కూడా ఒకటి. రాష్ట్ర విభజనలో భాగంగా రెండు రాష్ట్రాల నడుమ జరిగిన అనేక పంపిణీలలో, విద్యుత్ విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మిగిలిన అన్ని పంపకాలు కూడా జనాభా ప్రాతిపదికన జరిగితే, ఒక్క విద్యుత్ పంపకాలు మాత్రం వినియోగం ప్రాతిపదికన జరగడంతో, ఏ విషయంలో నష్టపోయినా కనీసం విద్యుత్ అయినా మిగులుతుందనే ఆశ కూడా అడియాసే అయింది. ఏకంగా 1500 మెగావాట్ విద్యుత్ తెలంగాణకు కోసం వదులుకోవలసి రావడంతో రాష్ట్రానికి విద్యుత్ విషయంలో కూడా లోటు తప్పలేదు.   అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాల ఆదుకొంటామని భరోసా ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తమ కూటమిలో మరియు ప్రభుత్వంలో కూడా భాగస్వామి అయిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేస్తున్నసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం ఒక ‘పవర్ ఫుల్’ బహుమానం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేప్పట్టబోతున్న ‘నిరంతర విద్యుత్ సరఫరా (24X365) పైలట్ ప్రాజెక్టు’ పధకం అమలుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న ప్రకటించారు. ఈ పదకం అమలుకు అవసరమయిన నిధులు, మార్గదర్శకాలు, ఏర్పాట్లు వగైరాల వివరాలన్నీ త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఈ పధకం విజయవంతం అయినట్లయితే క్రమంగా దానిని దేశమంతటికీ విస్తరిస్తామని ఆయన తెలిపారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితంగా అభివృద్ధి సాధించాలంటే అందుకు విద్యుత్ చాలా అవసరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉన్నట్లయితే అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. ఇప్పుడు కేంద్రమే నిరంతర విద్యుత్ కు భరోసా ఇస్తోంది గనుక ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు దిగులు చెందవలసిన అవసరం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టక మునుపే ప్రధానితో సహా కేంద్రమంత్రులందరినీ కలిసి, రాష్ట్ర పరిస్థితి వారికి మరొకమారు వివరించి, వారి సహాయ సహకారాలు అర్ధించినందునే కేంద్రం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఇంత ఉదారంగా వ్యవహరిస్తూ ఇటువంటి నిర్ణయం తీసుకొందని చెప్పవచ్చును. అందుకు కారకుడయిన చంద్రబాబును అభినందించవలసిందే.   గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రప్రభుత్వం ఏనాడు కూడా రాష్ట్రం పట్ల ఇంత త్వరగా, ఇంత ఉదారంగా సహాయ సహకారాలు అందించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో రెండు వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, ఊహించనత వేగంగా పనులు జరుగుతున్నాయి. ఊహించని విధంగా రాష్ట్రానికి వరాలు దక్కుతున్నాయి. అందుకు తెదేపా, బీజేపీలను వాటినెన్నుకొన్న ప్రజలను అభినందించవలసిందే. ఆ రెండు పార్టీల నేతలు రానున్న ఐదేళ్ళు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుకోవడమే కాకుండా అన్ని రంగాలలో తప్పకుండా తిరుగులేని అభివృద్ధి సాధించడం తధ్యం.

నిర్లక్ష్యం ఖరీదు 24 నిండు ప్రాణాలు

  ఆంద్ర, తెలంగాణాలలో నిన్న మంత్రుల ప్రమాణ స్వీకారాలు, పదవీ బాధ్యతల స్వీకారాలతో రెండు ప్రాంతాలలో పండుగ వాతావరణం నెలకొని ఉండగా, తెలంగాణకు చెందిన 24మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లా వద్ద బియాస్ నదిలో కొట్టుకుపోవడం తెలుగు ప్రజలందరి హృదయాలు కలచివేసింది. కేవలం మానవ తప్పిదం కారణంగానే 24మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం చాలా దారుణం. విహారయాత్రతో ఉత్సాహం ఉరకలు వేస్తున్న విద్యార్ధులు నదీతీరంలో నిలబడి ఫోటోలు తీసుకొంటుంటే, ఎటువంటి హెచ్చరికలు చేయకుండా ఎగువనున్న లాజ్రీ హైడ్రో ప్రాజెక్టు డ్యాం గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో, అకస్మాత్తుగా ఉదృతంగా వెలువడిన నీటి ప్రవాహంలో విద్యార్ధులు అందరూ కొట్టుకుపోయారు. ఇప్పటికి ఐదు మృతదేహాలు బయటకు తీసారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి.   మన దేశంలో రకరకాల ప్రమాదాలలో నిత్యం వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో అనేకమంది చిన్నారులు బోరు బావులలో పడి అత్యంత దయనీయంగా చనిపోవడం చూసాము. వోల్వో బస్సులలో, రైలు ప్రమాదాలలో నిత్యం ప్రాణాలు కోల్పోతున్నవారినీ చూస్తూనే ఉన్నాము. ఉగ్రవాదుల దాడుల్లో అమాయకులయిన ప్రజలు దుర్మరణం పాలవడం చూస్తూనే ఉన్నాము. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ అడ్డుఅడుపు లేకుండా సాగుతున్న సామూహిక అత్యాచారాలు చూస్తూనే ఉన్నాము.   ఇటువంటి ప్రమాదాలను, దాడులను అరికట్టే వ్యవస్థలను, పద్దతులను మనం ఏర్పాటు చేసుకొన్నప్పటికీ, ప్రమాదాలను తగ్గించలేకపోతున్నాము. అందుకు ప్రధాన కారణం ఆ వ్యవస్థలలో పనిచేసే వ్యక్తుల నిర్లక్ష్యమేనని చెప్పవచ్చును. ఇటువంటి ప్రమాదాలు జరిగిన తరువాత ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా హడావుడి చేయడం ఆనక ఆవిషయం అందరూ మరిచిపోవడం షరా మామూలయిపోవడం చూస్తుంటే మనలో మానవత్వం నానాటికీ అడుగంటిపోతున్నట్లు అర్ధమవుతోంది.   గతం నుండి ఎటువంటి గుణపాటాలు నేర్చుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకపోగా తమ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతారని తెలిసినా కూడా తమ కర్తవ్యాన్నిసక్రమంగా నిర్వర్తించని వారిని చూస్తే ఎవరికయినా కడుపు రగిలిపోతుంది. వారి నిర్లక్ష్యానికి నిత్యం ప్రజలు బలయిపోతుంటే, వారిలో ఎటువంటి అపరాధ భావం కలగకపోవడం ఒక విచిత్రమయితే, అటువంటి వారిని సస్పెండ్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వాలు భావించడం చాలా దారుణం.   ప్రభుత్వాల ఈ ఆలోచన తీరు మారనంత కాలం సదరు వ్యవస్థలలో పనిచేసే వ్యక్తుల తీరు మారుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది.

చంద్రబాబు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉండబోతున్నారా?

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు బదులు విజయవాడ-గుంటూరు మధ్యగల నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రమాణ స్వీకారం చేయాలని భావించడం, అక్కడే తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే పరిపాలన సాగించాలనుకోవడంతో, అక్కడే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు అవుతుందని అందరూ భావిస్తున్నారు. అందువల్ల రాజధాని నిర్మాణానికి అనువయిన ప్రాంతాన్ని కనుగొనేందుకు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనలు చెత్తబుట్ట పాలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రభుత్వ శాఖలను కూడా వీలయినంత త్వరగా అక్కడికే తరలించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అంటే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయబోతునప్పటికీ ప్రభుత్వం మాత్రం గుంటూరుకు తరలివస్తున్నట్లు భావించవచ్చును.   అయితే నిన్నతెదేపా తెలంగాణా శాసనసభ్యులతో సమావేశమయిన చంద్రబాబు నాయుడు, తెలంగాణాలో కూడా తెదేపాను అధికారంలోకి తెచ్చేవరకు తాను హైదరాబాదు విడిచివెళ్లనని అనడం యాదృచికమా లేక నిజంగానే చంద్రబాబు తన మనసు మార్చుకొని ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుండే రాష్ట్ర పాలన చేయాలని భావిస్తున్నారా? అనే ధర్మసందేహం పార్టీ నేతలలో తలెత్తింది.   ఆంధ్రప్రదేశ్ లో తెదేపా అధికారంలోకి వచ్చింది గనుక అక్కడ పార్టీ ఇప్పుడు చాలా బలంగా, ఉత్సాహంగా ఉంది. కానీ తెలంగాణాలో ఓటమి కారణంగా చాలా డీలా పడిపోయుంది. పైగా చంద్రబాబు ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నందున, ఇక తెలంగాణాను, అక్కడ తమ పార్టీని పట్టించుకొనే అవకాశాలు తక్కువ అని వార్తలు, విశ్లేషణలు వినబడుతుండటంతో తెలంగాణా నేతలు మరింత డీలాపడిపోయారు. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణా నేతలకే చంద్రబాబు అండ చాల అవసరం. అందుకే ఆయన ఇకపై వారంలో ఒకరోజు పూర్తిగా తెలంగాణాకే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. బహుశః అందుకే తాను హైదరాబాదు విడిచివెళ్లనని అని ఉండవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు.   కానీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీ నేతలు మాత్రం దానికి మరో కొత్త భాష్యం చెపుతున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వాన్నిపూర్తిగా తరలించేవరకు హైదరాబాదులోనే ఎందుకు ఉండాలనుకొంటున్నారు అంటే ఆయన హైదరాబాదులో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీలను, ప్రైవేట్ పరిశ్రమలను, ఉన్నత విద్యా, వైద్య సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించేందుకేనని చెపుతున్నారు. అదీగాక సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయంగా పేరుపొందిన హైదరాబాదుకు నిత్యం అనేకానేక విదేశీ సంస్థల ప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. వారందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించాలంటే ముఖ్యమంత్రి వారికి అందుబాటులోనే ఉండటం చాల అవసరమని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు కొంచెం కష్టమయినా మరికొంత కాలం హైదరాబాద్ నుండే పరిపాలన సాగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.   తద్వారా ఆయనను తెలంగాణాలో పార్టీ నేతలందరూ సులువుగా కలిసేందుకు వీలుపడుతుంది, ఆయన కూడా తెలంగాణాలో తరచూ పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశం ఉంటుంది అని వారు అభిప్రాయపడుతున్నారు.   ఏమయినప్పటికీ ఆయన హైదరాబాద్ నుండి ఎంతో కాలం ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని పరిపాలన చేయడం కష్టమనే చెప్పవచ్చును. సచివాలయానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు కొందరు హైదరాబాదులో, మరికొందరు గుంటూరులో ఉంటూ పరిపాలనకొనసాగించడం వలన వారి మధ్య సమన్వయం లోపించి ఊహించని కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చును. రాష్ట్ర రాజధానితో సహా పూర్తి స్థాయిలో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో, ఆయన రాష్ట్రానికి దూరంగా హైదరాబాదులో ఉండటం అంత సమర్ధనీయం, ఆచరణీయం కూడా కాదు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన నిత్యం హైదరాబాద్, గుంటూరు మద్య హెలికాఫ్టార్లలో ప్రయాణాలు చేయడం కూడా ప్రమాదకరం. పైగా దానివలన ఆయనకు మరింత శారీరిక శ్రమ, రాష్ట్రానికి మరింత ఆర్ధిక భారం తప్పదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్వహణకు అవసరమయిన హంగులన్నీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి రాష్ట్రానికి తరలివచ్చేయడమే మేలు.

కాంగ్రెస్ లో ప్రియాంకా భజన షురూ

  ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలే కారణమని ఆరోపిస్తున్నవారు కాంగ్రెస్ పార్టీలో క్రమంగా పెరుగుతున్నారు. ఆవిధంగా ఆరోపించిన వారినందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేసి, తమపై మరింత ఒత్తిడి పెరగకుండా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తపడుతోంది. కానీ వారిరువురిపై కాంగ్రెస్ నేతల విమర్శలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో ఏదో ఒక మూల నుండి ఎవరో ఒక కాంగ్రెస్ నేత వారిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.   ఇంతవరకు రాహుల్ గాంధీ ని జోకర్ అని, పదవి నుండి తప్పుకోమని మాత్రమే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్రమంగా ప్రియాంక గాంధీ భజన అందుకోవడంతో, సోనియాకు వారితో ఏవిధంగా వ్యవహరించాలో పాలుపోవడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి కేవీ థామస్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రియాంక గాంధీలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్ల ఆమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని తాను కోరుకొంటున్నానని అన్నారు. అలాగని తాను రాహుల్ గాంధీని తన పదవి నుండి తప్పించమని కోరడం లేదని, కేవలం ప్రియాంకా తన సోదరుడికి అండగా నిలవాలని మాత్రమే కోరుకొంటున్నానని ఆయన అన్నారు. అంటే దానర్ధం అసమర్ధుడు, నాయకత్వ లక్షణాలు లేనివాడయిన రాహుల్ గాంధీకి ప్రియాంకా గాంధీ తోడ్పాటు అవసరమని ఆయన అధిష్టానానికి పరోక్షంగా చెపుతున్నట్లే భావించవచ్చును. కాంగ్రెస్ పార్టీని స్వయంగా నడిపించలేని వ్యక్తి, 120 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయి దేశాన్ని ఏవిధంగా నడిపించాలని భావించారో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు కూడా సోదరి ప్రియాంకా గాంధీ మద్దతు ఆయనకు అవసరమయితే, అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆమె చేతిలోనే పెడితే కనీసం వచ్చే ఎన్నికల నాటికి ఆమె పార్టీని బలోపేతం చేయగలదు కదా? అని థామస్ అభిప్రాయం కావచ్చును. అయితే ఆమాటను నేరుగా చెప్పలేక ఈవిధంగా డొంక తిరుగుడుగా చెపుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఈవిధంగా మాట్లాడి సోనియా, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెట్టినందుకు బహుశః ఆయనపై కూడా త్వరలోనే సస్పెన్షన్ వేటు వేస్తారేమో!   అయినా రాహుల్ గాంధీ అసమర్థత గురించి ఇంత స్పష్టంగా రుజువయిన తరువాత కూడా, అతనినే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొంటే వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా కనుమరుగయిపోవడం తధ్యం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల తరువాత, కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. కనీసం అప్పుడయినా సోనియా, రాహుల్ గాంధీలు తమ పదవుల నుండి తప్పుకొని, పార్టీ పగ్గాలు సమర్ధులకు అప్పగిస్తారో లేక షరా మామూలుగా పార్టీలో అటువారిని ఇటు, ఇటువారిని అటు మార్చి ప్రక్షాళన కార్యక్రమ తంతుని మమ అనిపిస్తారో చూడాలి.

వారంలో ఒకరోజు తెలంగాణాకు: చంద్రబాబు

  ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన తెదేపా తెలంగాణా శాసనసభ్యుల సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. తెదేపా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించినప్పటికీ, తెలంగాణాలో ఓడిపోవడంతో డీలాపడిపోయున్న పార్టీ తెలంగాణా నేతలలో చంద్రబాబు దైర్యం, ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు. తాను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలతో తీరికలేకపోయినప్పటికీ వారంలో ఒక రోజు తెలంగాణాకి, పార్టీకే పూర్తిగా కేటాయిస్తానని చెప్పారు. అంతే గాక ఇదివరకు కంటే ఇకపై తరచుగా తెలంగాణాలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రా, తెలంగాణాలు రెండుగా విడిపోయినప్పటికీ తనకు రెండూ కూడా రెండు కళ్ళతో సమానమని, అందువల్ల రెండు రాష్ట్రాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టి రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా ఉంటూ, ప్రజల తరపున నిలబడి పోరాటం చేయాలని ఆయన వారిని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపడుతోంది గాబట్టి, అక్కడ నేతలు పూర్తి ఆత్మవిశ్వాసంతోనే ఉంటారు. కానీ తెలంగాణాలో మరో ఐదేళ్ళ వరకు అధికారానికి దూరంగా ఉంటూ, అధికార తెరాస ఒత్తిళ్లను తట్టుకొంటూ నిలబడటం సామాన్య విషయమేమీ కాదు. పైగా ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా పార్టీ రెండు రాష్ట్రాల మధ్య విడిపోయి తెలంగాణాలో చాల బలహీనంగా ఉంది. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణాలో పార్టీని బలంగా నిలబడేలా చేయడం చాలా అవసరం. అందుకే చంద్రబాబు వారికి దైర్యం, ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేసారు. తెలంగాణాలో పార్టీ అధ్యక్షుడిగా యల్. రమణను నియమిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అదే నిజమయితే, ఇకపై ఆయనే పార్టీ సీనియర్లందరినీ కలుపుకొని, పార్టీని మరింత పటిష్టపరుచుకోవలసి ఉంటుంది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ హాజరవుతారా?

  చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్రమంత్రులను, జాతీయ నేతలనే కాక తన రాజకీయ ప్రత్యర్దులయిన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈవిషయంలో కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోయినా, వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం గవర్నర్ అధ్వర్యంలో ఒక పద్దతి ప్రకారం అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తే తప్పకుండా హాజరవుతానని, కానీ దానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఒక రాజకీయ సభగా నిర్వహించాలని చూస్తే మాత్రం తను హాజరుకానని తెలిపారు.   తెలుగుదేశం పార్టీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించబోతున్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇది అధికారిక కార్యక్రమం గనుక ఎక్కడా పార్టీ జెండాలు, తోరణాలు పెట్టరాదని చంద్రబాబు తన పార్టీ నేతలను ముందే ఆదేశించారు. అయితే ప్రమాణ స్వీకారం జరుగుతున్న మైదాన పరిసర ప్రాంతాలలో పార్టీ జెండాలు, తోరణాలు ఉండకపోవచ్చునేమో కానీ, విజయవాడ-గుంటూరు నగరాలు మొత్తం ఈ సందర్భంగా తెదేపా జెండాలు, తోరణాలు, భారీ స్వాగత తోరణాలతో కళకళలాడటం ఖాయం. మళ్ళీ పదేళ్ళ తరువాత తెదేపా అధికారంలోకి వస్తునందున తెదేపా ఇంత భారీ ఎత్తున ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం అసహజమేమీ కాదు.   తెదేపా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి మరో కారణం ఏమిటంటే, ఇంతవరకు వైకాపాతో అలుపెరుగని పోరాటం చేసి డీలాపడిన తెదేపా కార్యకర్తలు, నేతలకు దైర్యం కలిగిస్తూ వారిలో మళ్ళీ సమరోత్సాహం కలిగించానికి, అదేసమయంలో ఓటమితో బాగా క్రుంగిపోయున్న వైకాపా నేతల, కార్యకర్తల మనోధైర్యం మరింత దెబ్బతీయడానికేనని భావించవచ్చును.   నిజానికి జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పుడే ముఖ్యమంత్రి అయిపోదామని చాలా ప్రయత్నాలు చేసారు. కానీ అవి అప్పుడు ఫలించలేదు. అప్పటినుండి ఇప్పటివరకు ఎంత ప్రయాసపడినా ఓటమి తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం తధ్యం అని చాలా గట్టిగా ప్రచారం చేసుకొన్నారు. అయినా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ముఖ్యమంత్రి కావాలని ఆయన ఎంతగా తపించిపోయారో ప్రజలందరికీ తెలుసు. అటువంటప్పుడు తనకు దక్కవలసిన ఆ అవకాశాన్ని ప్రజలు చంద్రబాబు నాయుడుకి కట్టబెడితే దానిని ఆయన జీర్ణించుకోవడం కష్టమే. పైగా చాలా అట్టహాసంగా నిర్వహింపబడుతున్న ఈ కార్యక్రమం వలన తనపార్టీ నేతల, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నపుడు అటువంటి దానికి జగన్ హాజరవుతారని భావించలేము.   అయినప్పటికీ తెదేపా ఇంత అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరయితే, ఆయన పరిస్థితి మయసభలో దుర్యోధనుడి పరిస్థితే అవుతుంది. గనుక ఏదో ఒక సాకుతో దీనికి హాజరు కాకుండా తప్పుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఆ ప్రయత్నంలోనే ఆయన ఈవిధంగా అని ఉండవచ్చును. మహా అయితే ఆయన తన పార్టీ ప్రతినిధులను పంపవచ్చును.

నేడు తెరాస, రేపు తెదేపా వంతు

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కి ఆంధ్ర ప్రజలను తిట్టడం ఇష్టమయితే, ఆయనను విమర్శించడం తెదేపా తెలంగాణా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకి చాలా ఇష్టం. కేసీఆర్ ని విమర్శించడానికి వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన ఎన్నడూ వదులుకోలేదు. ఇక రైతుల రుణమాఫీలో కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేసినప్పుడు మాత్రం ఎందుకు ఊరుకొంటారు? ఈరోజు తెదేపా ప్రధాన కార్యాలయం యన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన “కేసీఆర్ వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని ప్రజలకు భూటకపు హామీలిచ్చి వారిని మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచారు. ఇప్పడు అధికారం చేజిక్కించుకొన్నాక మాట మార్చడం ప్రజలను మోసం చేయడమే. అందువల్ల కేసీఆర్ ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా మొత్తం వ్యవసాయ రుణాలన్నిటినీ బేషరతుగా మాఫీ చేయాలి. వ్యవసాయ రుణాలు ఒక్కటే కాదు, ఆయన ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసి తీరాలి. లేకుంటే ఆయనను ప్రజలలో నిలదీస్తాను,” అని హెచ్చరించారు.   మోత్కుపల్లి ఆవిధంగా కోరడంలో తప్పేమీ లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నారు. అయితే ఈరోజు ఆయన కేసీఆర్, తెరాసల గురించి ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారో, తెదేపా గురించి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధమయిన ఆరోపణలు చేస్తున్న సంగతి మరిచిపోకూడదు. ఈరోజు ఆయన కేసీఆర్ ని నిలదీస్తున్నట్లే రేపు చంద్రబాబుని కూడా రుణమాఫీలపై వెనుకంజ వేస్తే నిలదీసేందుకు కాంగ్రెస్, వైకాపాలు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాయనే సంగతిని కూడా ఆయన గుర్తుంచుకోవడం మంచిది. వ్యవసాయ రుణాలు, ఎన్నికల హామీల విషయంలో తెరాసకో రూలు, తెదేపాకో రూలు ఉండబోదు గనుక రేపు చంద్రబాబుకి ఇటువంటి పరిస్థితే ఏర్పడవచ్చును.   అందువల్ల ఈ రుణాలమాఫీల వ్యవహారం అన్ని రాజకీయ పార్టీలు ఒక గుణపాటంగా స్వీకరించడం మంచిది. అధికారం చేజిక్కించుకోవడం కోసం వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి, తీరాచేసి అధికారం దక్కించుకొన్న తరువాత ఇలా ఆపసోపాలు పడటమెందుకు? ప్రతిపక్షాల చేత, ప్రజల చేత తిట్లు తినడం ఎందుకు? అసలు మనకు అన్నం పెట్టేందుకు రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేయవలసిన దుస్థితి కలుగుతున్నందుకు రాజకీయ నేతలు సిగ్గుపడాలి. వారికి ఈ కష్టం నుండి బయటపడేసి మళ్ళీ ఈవిధంగా అప్పులు చేయవలసిన పరిస్థితి రాకుండా చేసేందుకు ప్రయత్నించాలి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కావలసింది రాజకీయ నేతల సానుభూతి కాదు. ఇటువంటి పరిస్థితులు దాపురించకుండా వారికి ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఇస్తే చాలు.

కేసీఆర్ ప్రభుత్వానికి నమస్తే తెలంగాణా గుడ్ బై చెప్పెసిందా?

  తెలంగాణా ఉద్యమాలలో కేసీఆర్ కు, తెరాసకు ‘నమస్తే తెలంగాణా’ పత్రిక మరియు న్యూస్ ఛానల్ కొండంత అండగా నిలబడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలు కూడా ‘నమస్తే తెలంగాణా’ను తెరాస గొంతుగానే భావిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాం అధికారంలోకి వచ్చిన తరువాత ‘నమస్తే తెలంగాణా’ కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్దిస్తూ వార్తలు ప్రచురిస్తోంది గనుక దానిని అధికారిక మీడియాగా ప్రజలు భావించడం సహజమే. కానీ ‘నమస్తే తెలంగాణా’ మీడియా చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన సి.యల్. రాజం అందరినీ ఆశ్చర్య పరుస్తూ, నిన్న డిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఇంతకాలంగా తాను సమర్దిస్తూ వచ్చిన కేసీఆర్ అధికార పగ్గాలు చేప్పట్టిన తరువాత, ఆయన తెరాసలో చేరినట్లయితే ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ ఆయన తెరాసను వ్యతిరేఖిస్తున్న బీజేపీలో చేరడం నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటని అందరికీ అనుమానాలు కలగడం సహజమే.   నరేంద్ర మోడీని చూసి చాలా స్ఫూర్తి పొందినందునే తాను బీజేపీలో చేరానని, ఆయన నేతృత్వంలోనే దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని, ఆయన ప్రభుత్వం తెలంగాణాకు అన్నివిధాల అండగా నిలబడుతుందని నమ్మకంతోనే తాను బీజేపీలో చేరినట్లు ఆయన చెప్పుకొన్నారు. బీజేపీలో చేరడం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని దానివెనుక ఎటువంటి ప్రత్యేక రాజకీయ కారణాలు లేవని ఆయన అన్నారు.   మోడీని చూసి స్ఫూర్తి పొందడం మంచిదే కానీ దాని కోసం పనిగట్టుకొని డిల్లీ వెళ్లి బీజేపీలో చేరవలసిన అవసరం లేదు. ఆపని తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో హైదరాబాదులో కూడా చేయవచ్చును. కానీ ఆయన పనికట్టుకొని డిల్లీ వెళ్లి రాజ్ నాథ్ సమక్షంలో బీజేపీలో చేరారంటే ఏదో బలమయిన కారణం ఉండే ఉండాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   కేసీఆర్ ప్రభుత్వం రైతుల రుణమాఫీలపై వెనక్కి తగ్గడంతో, తెలంగాణా బీజేపీ నేతలు తెరాస ప్రభుత్వంపై యుద్దానికి సిద్దం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు తెరాసను, కేసీఆర్ ను గట్టిగా సమర్దిస్తూ వచ్చిన నమస్తే తెలంగాణా మీడియా, ఇప్పుడు బీజేపీకి వంతపాడుతూ తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేయవలసి వస్తుంది. ప్రజల తరపున నిలిచి పోరాడాల్సిన మీడియా కూడా సాధారణ రాజకీయ పార్టీల్లాగే తన వైఖరి మార్చుకొంటే అదొక విపరీత పరిణామమే అవుతుంది. అలాగని ‘నమస్తే తెలంగాణా’ ఇప్పటిలాగే తెరాస ప్రభుత్వాన్ని సమర్దిస్తే, తెలంగాణా రాష్ట్ర బీజేపీ నేతలకు ఆగ్రహం కలిగించడం ఖాయం.   స్వయంగా ఒక పత్రికను, న్యూస్ ఛానల్ ను నడిపిస్తున్న సి.యల్. రాజం తను బీజేపీలో చేరడంవలన ఇటువంటి సంక్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని తెలియదనుకోలేము. కనుక ఆయన ఏదో బలమయిన కారణంతోనే బీజేపీలో చేరి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కారణాలు ఏమిటనే సంగతి త్వరలోనే క్రమంగా బయటపడవచ్చును.  

అట్టహాసంగా ప్రమాణ స్వీకారం ఎందుకంటే

  తెదేపా ఎన్నికలలో ఘనవిజయం సాధించినప్పటి నుండి చంద్రబాబు పదేపదే చెపుతున్న మాట ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని. మరి అటువంటప్పుడు కోట్లు ఖర్చుచేసి అంత అట్టహాసంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు? అని ప్రతిపక్షాల ప్రశ్న. వారి ప్రశ్నకు పార్టీ సీనియర్ నేతలు గాలి ముద్దు కృష్ణం నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చాలా ఆశ్చర్యకరమయిన జవాబు చెప్పారు.   రాష్ట్ర విభజనతో డీలాపడిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో మళ్ళీ నూతనోత్సాహం నింపి, వారికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి క్లిష్టపరిస్థితులనయినా దైర్యంగా ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించగలదనే నమ్మకం కలిగించడానికే చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పదేళ్ళ సుదీర్గ విరామం తరువాత మళ్ళీ తెదేపా అధికారంలోకి వస్తున్నందున ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించినంత మాత్రాన్న, తెదేపా కార్యకర్తలలో, నేతలలో ఉత్సాహం నింపవచ్చేమో కానీ ప్రజలందరిలో ఏవిధంగా దైర్యం, ఉత్సాహం కలుగుతుందో వారికే తెలియాలి.   ఒకవేళ వారు చెప్పినట్లుగా ప్రజలందరిలో తెదేపా పట్ల నమ్మకం మరింత బలపడినట్లయితే, అప్పుడు ప్రజలలో తెదేపా ప్రభుత్వంపై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రజల కళ్ళ ముందు సింగపూర్ ను ఆవిష్కరించారు. రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీలు, పెన్షన్లు వంటి వాగ్దానాలు చాలా చేసారు. తెదేపా నేతలు చెప్పినట్లుగా ప్రజలు ఆలోచిస్తే, చంద్రబాబు తన మంత్రదండం తిప్పేసి రాత్రికి రాత్రే తమ సమస్యలన్నీపరిష్కరించేస్తారని మరిన్ని ఆశలు పెంచుకొనే ప్రమాదం ఉంది. అంటే గాలి, బొజ్జల చెప్పినట్లుగా ప్రజలలో ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగితే, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందన్నమాట.   ఇక ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేవని చెపుతూనే, ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడం వలన, రేపు చంద్రబాబు ప్రభుత్వం తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఏమాత్రం వెనుకంజ వేసినా, అప్పుడు ప్రతిపక్షాలు ఈ భారీ కార్యక్రమాన్ని ఎత్తి చూపి చంద్రబాబును దెప్పి పొడవకమానరు. ఏమయినప్పటికీ, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా జరిగిపోతున్నాయి గనుక, ఈ భారీ కార్యక్రమ ప్రభావం ప్రజల మీద ఏవిదంగా ఉండబోతోందో త్వరలోనే అందరూ చూడవచ్చును.

కేసీఆర్ గుండె గుభేల్‌మంది! ఎందుకు?

  తన మాటలతో అందరి గుండెల్లో మంట పుట్టించే కేసీఆర్ గుండె గుభేల్‌మన్నట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి బుధవారం నాడు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. బ్యాంకుల్లో రైతుల రుణాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు రకరకాల లెక్కలు వేసి, కూడికలు, తీసివేతలు చేసి చివరికి రైతుల రుణ మాఫీకి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం వుందని తేల్చి చెప్పారు. ఈ ఫిగర్ విన్న కేసీఆర్ గతుక్కుమన్నట్టు సమాచారం. ఈ 12 వేల కోట్లు కూడా 2013-2014 ఆర్థిక సంవత్సరం రుణాలు మాత్రమే. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరాల రుణాలను, రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా అడ్డంగా ఆరిపోయే అవకాశం వుందని తెలిసి కేసీఆర్ కంగు తిన్నట్టు సమాచారం. దాంతో తీవ్రంగా ఆలోచించిన కేసీఆర్ 2013-2014 ఆర్థిక సంవత్సరం రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని, అది కూడా లక్ష రూపాయల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించారు. అంతకుముందు సంవత్సరాల రుణాలతో తమకు సంబంధం లేదని డిసైడ్ చేశారు. అలాగే రైతులు బంగారం బ్యాంకుల్లో పెట్టి తీసుకున్న రుణాలకు కూడా తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా నిర్ణయించారు. మొత్తమ్మీద 2013-2014 ఆర్థిక సంవత్సరానికి రూ. లక్ష లోపు రుణమాఫీకి సహకరించాలని బ్యాంకర్లను ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. మరో వారంరోజుల్లో మరోసారి భేటీ కావాలని కేసీఆర్ కోరారు.

పొన్నాలపై నైతిక విజయం: జానా ఆత్మానందం!

  తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అడ్డగోలుగా తెలంగాణ ఇచ్చేశాం కాబట్టి తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీ కాంగ్రెస్ నాయకులు కలలు కన్నారు. తీరా ఎన్నికలలో తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌ని చావగొట్టి చెవులు మూశారు. టీఆర్ఎస్‌కి అధికారం కట్టబెట్టారు. టీ కాంగ్రెస్‌లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కన్న మహామహులైన నాయకులందరూ ఓడిపోయారు. దాంతో టీ కాంగ్రెస్ నాయకులు ఎవరిలోనూ కత్తివాటుకు నెత్తురు చుక్క కూడా లేకుండా పోయింది. అయితే తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలని కలలు కని, ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో విభేదాలు పెంచుకున్న పొన్నాల మాత్రం ప్రస్తుతం చాలా ఆత్మానందంలో వున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఓడిపోయిందన్న బాధ ఆయనలో వున్నప్పటికీ, తాను పొన్నాల లక్ష్మయ్య మీద సాధించిన నైతిక విజయం ఆయనకి ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలంగాణ సీఎం నువ్వా నేనా అని జానా, పొన్నాల ఇద్దరూ విభేదించుకున్నారు. చివరికి ఇద్దరూ సీఎం కాకుండా పోయారు. కాకపోతే చివరికి ఈ ఇద్దర్లో జానాదే పైచేయి అయింది. ఎన్నికలలో పొన్నాల ఓడిపోతే, జానా మాత్రం గెలిచారు. పొన్నాల గాంధీ భవన్‌లో కూర్చుని ఈగలు తోలుకునే పరిస్థితిలో వుంటే, జానా మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌కి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎంపికయ్యారు. ఈ రకంగా పొన్నాల మీద నైతిక విజయాన్ని సాధించిన జానా మనసులో పులకరించిపోతున్నట్టు తెలుస్తోంది.