గంగా ప్రక్షాళనకు సిద్దమవుతున్న మోడీ సర్కార్
హిందువులందరికీ పరమ పవిత్రమయినది గంగానది. జీవితంలో ఒక్కసారయినా గంగా నదిలో స్నానం చేసి పూజిస్తే చాలనుకోనేవారు కోకొల్లలు. తమ జీవిత అంతిమ యాత్ర గంగానదిలోనే పూర్తిచేయాలని అక్కడికి తరలివెళ్ళేవారూ చాలా మంది ఉన్నారు. ఆ నదిని ఆనుకొని ఉన్న అనేక నగరాలు, పరిశ్రమలు గత అనేక దశాబ్దాలుగా మురికి నీటిని, పారిశ్రామిక వ్యర్ధాలను, ప్రమాదకరమయిన రసాయనాలను పవిత్రమయిన గంగానదిలోకి విడిచి పెడుతూ పూర్తిగా కలుషితం చేసాయి. తత్ఫలితంగ నదిలో అనేక జీవరాసులు చనిపోతున్నాయి. వాటిపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారు. ఆ నీటిని త్రాగిన వారు రోగాల పాలవుతున్నారు. గంగలో మునిగితే పాపాలు పోవచ్చునేమో కానీ కొత్త రోగాలు రావడం తధ్యం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఈ సమస్య పరిష్కారం కోసం గంగానదిని సమూల ప్రక్షాళన చేయాలని చాలా ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు, మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ దానిపై వందల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు ఇంతకాలం వెనుకాడుతున్నాయి. కానీ, నరేంద్ర మోడీ తన ప్రభుత్వంలో జలవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన ఉమా భారతికి, గంగా ప్రక్షాళణా కార్యక్రమం కూడా ప్రత్యేకంగా అప్పజెప్పారు. ఆమె ఈరోజు ‘గంగా మదన్’ (నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా) (ఎన్‌ఎంసీజీ) అనే ఒక జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అందులో మేధావులు, పర్యావరణవేత్తలు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు, జల వనరుల శాఖ, షిప్పింగ్ అండ్ టూరిజం శాఖ, గంగా నది ప్రవహించే రాష్ట్రాలకు చెందిన అధికారులు మరియు మరికొన్ని ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. వారి నుండి సలహాలు, సూచనలు తీసుకొన్న తరువాత, ఈ ప్రక్షాళన కార్యక్రమానికి అధికారులు, నిపుణులు, మేధావులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ లేదా సంఘాన్ని ఒక దానిని ఏర్పరచి దాని ఆధ్వర్యంలో పని మొదలుపెట్టే అవకాశం ఉంది.
ఈ సమావేశానికి సాధువులను కూడా ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెపుతోంది. గంగా మదన్ కార్యక్రమాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలి తప్ప ఒక హిందూ కార్యక్రమంగా నిర్వహించడం సరికాదని కాంగ్రెస్ అభిప్రాయ పడింది. ఏమయినప్పటికీ గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని, చేయని పనిని బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. గంగా నదితో బాటు యమునా నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి ఉమాభారతి తెలిపారు.