సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాష్

      కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ప్రతి ఒక్కరూ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుందని భావించారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో తమకు బోలెడంత బలముందని బిల్డప్పులు ఇస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో అసలు సీనే లేదని మునిసిపల్ ఎన్నికలు నిరూపించాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాష్ అని చెప్పేశాయి. మునిసిపల్ ఎన్నికలలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైకాపాల మధ్య కొససాగుతోంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీయే సీమాంధ్ర అంతటా ఆధిపత్యంలో వుంది. వైకాపా చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితిలో వుంది. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీని చాచిపెట్టి కొట్టారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఛైర్మన్, మేయర్ స్థానాలను దక్కించుకునే మాట దేవుడెరుగు.. వార్డులు, కార్పొరేషన్ స్థానాలలో రెండు అంకెలను కూడా అందుకోలేకపోయింది.

ఎవరికీ దక్కని ఆధిపత్యం

      సీమాంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని మునిసిపల్ స్థానాల్లో ఎవరికీ ఆధిపత్యం దక్కని విధంగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయిన రెండు స్థానాల్లో ఏ పార్టీకీ ఆధిపత్యం దక్కలేదు. ఏ పార్టీ సొంత బలంతో మునిసిపల్ ఛైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్రలో ప్రకాశం జిల్లా చీరాలలో మొదట వైకాపా ఆధిపత్యం కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ వెనుకబడిపోయి తెలుగుదేశం ముందడగు వేసింది. మొత్తం మీద ఈ రెండు పార్టీలకూ ఈ స్థానంలో ఆధిపత్యం దక్కలేదు. అలాగే వరంగల్ జిల్లా మహబూబాబాద్ మునిసిపల్ స్థానంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 28 వార్డుల్లో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ ఏడు, టీడీపీ మూడు, సీపీఎం ఐదు, సీపీఐ మూడు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లోనూ ప్రలోభాలు పనిచేసే అవకాశం వుంది.

రాహుల్‌కి సన్నాయి ఊదిన బిస్మిల్లాఖాన్ కుటుంబం

  ప్రముఖ షహనాయ్ విద్వాంసుడు దివంగత బిస్మిల్లాఖాన్‌ని యావత్ భారతదేశం గౌరవిస్తుంది. కానీ, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆ గౌరవాన్ని నిలుపుకునేలా ప్రవర్తించలేదు. వీళ్ళు షహనాయ్ ఊదడంలో ఎంత ప్రతిభావంతులో తెలియదుగానీ, అబద్ధాలు చెప్పడంలో మాత్రం ఘనాపాటీలన్న విషయం తెలిసిపోయింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తూ స్థానికులైన బిస్మిల్లాఖాన్‌ కుటుంబ సభ్యులు తనను ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేస్తూ సంతకాలు చేస్తే బాగుంటుందని ఆశించారు. ఆ విషయాన్ని బిస్మల్లాఖాన్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకుని వెళ్ళారు. దానికి వాళ్ళు బీజేపీ అంటేనో, మోడీ అంటేనో తమకు ఇష్టం లేదు కాబట్టి సంతకాలు చేయడానికి రాలేం అని చెబితే ఇబ్బంది వుండేది. కానీ బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు ఏమీ ఎరుగని పత్తిత్తుల్లాగా మాట్లాడారు. మా నాన్నగారికి (బిస్మి్ల్లాఖాన్‌కి) రాజకీయాలంటే అస్సలు ఇష్టం వుండేది కాదు. మమ్మల్ని కూడా రాజకీయాల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అందువల్ల మేం రాలేం అని చెప్పారు. పాపం పెద్దాయన చెప్పిన మాటకి కట్టుబడి వున్నార్లే అని అందరూ ఊరుకున్నారు. అప్పుడు మోడీ నామినేషన్‌కి స్థానికులైన కొందరు కార్మికులు సంతకాలు చేశారు. అక్కడితో ఈ ఇష్యూ ముగిసింది. అయితే తాజాగా వారణాసిలో రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోకి బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భుజాల మీద కాంగ్రెస్ కండువాలు వేసుకుని, షహనాయ్‌‌లు ఊదుతూ రాహుల్‌కి స్వాగతం పలికారు. మరి రాజకీయాల జోలికి వెళ్ళొద్దని బిస్మిల్లాఖాన్ చెప్పిన (?) మాటని వీళ్ళు మరచిపోయారో లేక అబద్ధం చెప్పారో ఆ పైనున్న బిస్మిల్లాఖాన్‌కే ఎరుక. మొత్తానికి రాహుల్‌కి వీళ్ళు సన్నాయి ఊదుతూ స్వాగతం చెప్పడం కోసం రాహుల్‌ వీళ్ళదగ్గర ఎన్ని ‘లక్షల’ సన్నాయిలు ఊదాడో మరి!

తెదేపాకు కూడా ‘అపాయింటడ్ డే’ పరీక్ష ఎదుర్కోక తప్పదా

  కేంద్రప్రభుత్వం జూన్ 2న (అపాయింటడ్ డే) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుందని ప్రకటించి చాలా కాలమే అయింది. అయితే అప్పుడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కానీ ఆ పార్టీ నేతలు గానీ అందులో మర్మం కనిపెట్టలేకపోవడంతో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఎన్నికల ఫలితాలు ఈనెల 16న వెలువడబోతుంటే, దాదాపు రెండు వారాల వ్యవధి మధ్యలో ఉంచుతూ జూన్ 2న ‘అపాయింటడ్ డే’ గా నిర్ణయించడం తమ పార్టీ కొంప ముంచేందుకేనని కేసీఆర్ కి ఇప్పుడు అర్ధమయింది. దానితో అపాయింటడ్ డేని మే17కి మార్చవలసిందిగా హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.   మజ్లిస్, సీపీఐ, స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడగట్టుకొని తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు టీ-కాంగ్రెస్ నేతలు తెరాసలో గెలుపు గుర్రాలకు వలవేసి తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురం చేయడంతో ఆయనకు కంగారు మొదలయింది. తెరాస టికెట్ పై పోటీ చేసి యం.యల్.ఏలుగా ఎన్నికవ్వగల 20మంది రెడ్డి కులస్తులు తమతో పూర్తి టచ్చులోఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం, టీ-కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం వారిలో వారు కుమ్ములాడుకోవడం గమనించిన తెరాసకు, కాంగ్రెస్ మాటలను అంత తేలికగా తీసుకోరాదని అర్ధమయింది.   తెలంగాణా రాష్ట్రం ఇచ్చినట్లయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లుగా, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి సైతం నిరాకరించారు. సర్వే నివేదికలన్నీ తెరాసకే పూర్తి మెజార్టీ వస్తుందని సూచించడంతో, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని అధికారంలో భాగం ఎందుకు పంచి ఇవ్వాలి? అనే దురాశతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. కానీ ఎన్నికల ముగిసిన తరువాత ఇప్పుడు తమకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనబడకపోవడంతో కేసీఆర్ కి గుబులు పుట్టుకొంది. పైగా ఈరెండు వారాల వ్యవధిలో కాంగ్రెస్ గనుక తెరాస యంయల్యేలను తనవైపు తిప్పుకొనగలిగితే, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణాను ఏలాలనే కేసీఆర్ కలలు పగటికలలుగానే మిగిలిపోతాయి. అందుకే తెరాస టికెట్ పై పోటీ చేసిన అభ్యర్దులందరితో కేసీఆర్ మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి, తమ ప్రభుత్వం ఏర్పడితే వారికి మంత్రి పదవులు వగైరాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం తెరాస గెలుపు గుర్రాలను తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసారు.   జూన్ 2న అధికారికంగా తెలంగాణా ఏర్పడేవరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు గనుక, ఇదే సమస్య అక్కడ కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి బదులు వైకాపా అటువంటి ప్రయత్నాలు చేయవచ్చును. ఈసారి ఎన్నికలలో తెదేపా, వైకాపాలలో దేనికో ఒకదానికి స్పష్టమయిన మెజార్టీ వస్తే పరువాలేదు. కానీ, రెండు పార్టీలకు సరి సమానంగా లేదా ఏదో ఒకదానికి ఎక్కువ మరొక దానికి కొంచెం తక్కువ వచ్చినా ఇదే పరిస్థితి తలెత్తడం ఖాయం. ఈసారి ఈ రెండు పార్టీలు కూడా తమకే స్పష్టమయిన మెజార్టీ రాబోతోందనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ కూడా ఇదేవిధంగా చాలా ధీమా వ్యక్తం చేసారు. కానీ పరిస్థితులు ఇప్పుడు తారుమారు అయ్యాయి. అందువలన ఈ రెండు వారాల వ్యవధి విజయావకాశాలున్న తెదేపాకు అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది.

జగన్ పార్టీ అల్లర్ల వెనుక అసలు కారణమేంటి?

      బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగు ప్రజలకి తమ విశ్వరూపం చూపించారు. జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో అయితే నాలుగైదు విశ్వరూపాలు ఒకేసారి చూపించారు. ఇక సీమాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ వైకాపా కార్యకర్తలు హింసాకాండకు పాల్పడటం, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం చేశారు.   వైకాపా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటర్లు మాత్రం విజ్ఞతతో వ్యవహరించి తెలుగుదేశం పార్టీకే మద్దతు  ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ వైకాపా రాష్ట్రమంతటా ఎందుకు అరాచకం సృష్టించిందనే దానిమీద రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈసారి సీమాంధ్రలో 70 శాతానికి మించి పోలింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. లగడపాటి రాజగోపాల్‌ కూడా విలేకరుల సమావేశం పెట్టిమరీ  ఈ విషయాన్ని చెప్పారు. దాంతో వైకాపా పోలింగ్ శాతం తగ్గించడానికే అల్లర్లు సృష్ఠించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు జరుగుతున్నాయన్న వార్తలు ప్రబలిన పక్షంలో ఓటింగ్‌కి బయల్దేరేవారు సహజంగానే ఎందుకొచ్చిన గొడవ అని ఆగిపోతారు. ఈ వీక్నెస్‌ని అర్థం చేసుకున్న వైకాపా సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో అల్లర్లు సృష్టించి వుండవచ్చని భావిస్తున్నారు. అయితే వైకాపా చేసిన అల్లర్ల కారణంగా కొంతమంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోయి వుండొచ్చు, కానీ భారీ పోలింగ్ మాత్రం జరిగింది. పోలింగ్ శాతం తగ్గించడానికి వైకాపా వేసిన పథకం పారలేదు  

సిగ్గొదిలేసిన సీమాంధ్ర కాంగ్రెస్

      సీమాంధ్ర కాంగ్రెస్ సిగ్గూ, ఎగ్గూ వదిలేసినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు చంపేశారు. అయినప్పటికీ ఆశ చావని కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ముందుకు తోసి సీమాంధ్రలో ఎంతోకొంత లాభం పొందాలని ప్రయత్నించింది. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసే సీమాంధ్రని అభివృద్ధి చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పింది.   అయితే సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహ్యంగా చూడటం మానలేదు. ఆ విషయం బుధవారం జరిగిన సీమాంధ్ర పోలింగ్‌లో కూడా స్పష్టమైంది. ఓటింగ్ జరిగిన పరిస్థితిని చూస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాపం వైకాపా తాను అధికారంలోకి వస్తానని బిల్డప్పులు ఇచ్చుకుంటోంది. జై సమైక్యాంధ్ర పార్టీ కిక్కురుమనడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను సీమాంధ్రలో అధికారంలోకి వస్తానని చెప్పేంత సాహసమైతే చేయలేదుగానీ, సీమాంధ్రలో తాము చాలా సీట్లు గెలుచుకుంటామని, సీమాంధ్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ  పార్టీ మద్దతు తీసుకోవలసి వస్తుందని చెబుతోంది. గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మాటలే చెప్పారు. ఆ మాటలు చెబుతున్నప్పులు సదరు నాయకుల ముఖంలో ఎంతమాత్రం సిగ్గు కనిపించకపోవడం విశేషం. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ, ఒక్క పార్లమెంట్ సీట్ అయినా దక్కే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారంటే, సదరు పార్టీలో సిగ్గు అనే మెటీరియల్ మాయమైపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు.

సీమాంధ్రలో కూడా హంగ్ తప్పదా?

  నిన్న జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తే తెదేపా, వైకాపాలు రెండూ కూడా సమవుజ్జీలుగానే నిలిచినట్లు కనబడుతోంది. కానీ రెండు పార్టీల నేతలు తమకే పూర్తి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   తాజా సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నగరాలు, పట్టణాలలో మంచి ఆధిక్యత కనబరచగా, వైకాపా గ్రామీణ ప్రాంతాలలో ఆధిక్యత కనబరిచినట్లు తెలుస్తోంది. నగరాలలో, పట్టణాలలో నివసించే ప్రజలు రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాటం చెప్పేందుకు తెదేపావైపు మొగ్గు చూపగా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ పధకాలు, రుణాల మాఫీలకి ఆకర్షితులయ్యి వైకాపా వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అదేవిధంగా కులం, మతం, డబ్బు, మద్యం వంటి అనేక అంశాలు కూడా నగర ప్రజల కంటే గ్రామీణ ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపగలవు గనుక అక్కడి ప్రజలను వైకాపా చాలా సులువుగా ఆకర్షించి ఉండవచ్చును.   ఇక నగరాలలో నివసించే ప్రజలు కూడా ఈ ప్రలోభాలకు, బలహీనతలకు అతీతులు కాకపోయినప్పటికీ, అంతిమంగా అభివృద్ధి, సమర్ధతకే మొగ్గుచూపడంతో అది తెదేపాకు లబ్ది చేకూర్చవచ్చని సమాచారం. ఇక ఈసారి కొమ్ములు తిరిగిన రాయపాటి వంటి కాంగ్రెస్ నేతలు అనేక మంది తెదేపా అభ్యర్ధులుగా పోటీ చేయడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా మారింది. కానీ, కాంగ్రెస్ పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేఖత కారణంగా, వారిని చేర్చుకొన్నందుకు తెదేపాకు పడవలసిన ఓట్లు, చిన్న పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులకు పడే అవకాశం ఉంది.   తెదేపా బీజేపీతో పొత్తు పెట్టుకొన్న కారణంగా ముస్లిం, మైనార్టీ ప్రజలను వైకాపా ఆకర్షించగలిగింది. కానీ ఆ పొత్తుల కారణంగానే నగర ప్రజలు తెదేపావైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ ప్రభావం, విజయావకాశాలున్నఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్న తెదేపావైపు నగర ప్రజలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులకు చాలా కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి యువ ఓటర్లు ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేయడం, వారి ఓటింగు శాతం గతంలోకంటే బాగా పెరగడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును.   వివిధ అంశాలు, సమీకరణాలు, ప్రజల బలహీనతలు, పార్టీల ప్రలోభాల కారణంగా ఓట్లు ఈ రెండు పార్టీల మధ్య చీలినప్పటికీ, అర్బన్, రూరల్ ఓట్లు ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చీలినట్లయితే దేనికీ స్పష్టమయిన మెజార్టీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చును. నిన్న జరిగిన ఎన్నికలలో 13జిల్లాలలో కూడా చాలా అత్యధిక శాతం పోలింగు నమోదు అయింది. అందువల్ల ఓట్లు కూడా అదే స్థాయిలో చీలే అవకాశం ఉంది. ఒకవేళ పోలింగు 70 శాతం దాటినట్లయితే తెదేపా విజయావకాశాలుంటాయని ఇటీవల లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం నిజమనుకొంటే, నిన్న పోలింగు ఏకంగా 80శాతం జరిగింది గనుక తెదేపా విజయం తధ్యం అనుకోవచ్చును. కానీ గ్రామీణ, పట్టణ ఓటర్లు ఈ రెండు పార్టీల మధ్య చీలినట్లయితే దేనికీ మెజార్టీ రాకపోవచ్చును. ఏమయినప్పటికీ మరొక వారం రోజుల్లో ప్రజాభిప్రాయం ఎవరికి అనుగుణంగా ఉందో తేలిపోతుంది.

రిగ్గింగ్ చేస్తే తప్ప జగన్ గెలవలేడా?

      సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ నియోజకవర్గంలో వైపాకా కార్యకర్తలు స‌ృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. ఓటర్లను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి బూత్‌ల్ని ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయడం వరకు అన్ని ఎలక్షన్ల అవలక్షణాలను ప్రదర్శించారు. వీటిలో ఇతర పార్టీల నాయకుల మీద దాడి చేయడం, పోలింగ్ సిబ్బంది మీద దాడి చేయడం లాంటి ఘనకార్యాలు కూడా వున్నాయి. అయితే ఇవన్నీ జగన్ పార్టీ ఎందుకు చేయించిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలా మిగిలింది.   పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలవడనే అనుమానం ఎవరికీ లేదు. ఈ నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబ నియోజకవర్గంగా పేరు పొందింది. ఇక్కడి నుంచి వైఎస్సార్ కుటుంబీకులు ఎవరు పోటీ చేసినా సునాయాసంగా గెలుస్తారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మరి సులభంగా గెలిచే స్థానం అయినప్పటికీ ఇక్కడి వైకాపా కార్యకర్తలు ఎందుకు హడావిడి చేశారో అర్థం కాని విషయం. ఒకవేళ వైఎస్ జగన్‌కి ఇక్కడి నుంచి ఓడిపోతానేమోనన్న భయం పట్టుకుందేమోనని అనుమానాలు వస్తున్నాయి. తాను పులివెందులలో రిగ్గింగ్ చేస్తే తప్ప గెలవలేనన్న భయంతోనే ఇక్కడ హడావిడి చేయించాడా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానని ఉబలాటపడినట్టు.. తన  కుటుంబ నియోజకవర్గంలోనే గెలవననే అనుమానం వున్న జగన్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడమేంటో ఆయనకే తెలియాలి.

జగన్‌కి ఓటింగ్ రూల్స్ తెలియవా?

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి అర్జెంటుగా ఏదో ఒక స్టేట్‌కి ముఖ్యమంత్రి అయిపోవాలన్న తహతహే తప్ప మరే నాలెడ్జీ వున్నట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కూడా ‘ఆంధ్రప్రదేశ్’కి ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక సీమాంధ్రని ఎలా డెవలప్ చేయాలనే విషయం మీద విదేశాల నుంచి కన్సల్టెంట్స్ ని పిలిపించడం తెలుసు. సీఎం అయ్యాక ఐదు సంతకాలు ఎక్కడెక్కడ చేయాలో తెలుసు. కానీ ఈ పెద్దమనిషికి ఓటు ఎలా వేయాలో మాత్రం తెలియకపోవడం బాధాకరం.   బుధవారం నాడు పులివెందుల నియోజకవర్గంలో జగన్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. పోలింగ్ బూత్‌లో జగన్ ఓటు వేస్తున్నప్పుడు ఆయన వెనుకే ఓ పోలింగ్ అధికారి, వైసీపీ పోలింగ్ ఏజెంట్ నిల్చుని జగన్ ఓటు వేయడాన్ని తనివితీరా చూసి తరించిపోయారు. ఇది రూల్స్ కి విరుద్ధం. ఓటరు ఓటు వేస్తూ వుండగా ఎవరూ చూడటానికి వీల్లేదు. తన పార్టీ కార్యకర్తల, ఓ పోలీసు అధికారి తన వెనుకే నిల్చుని తాను ఎవరికి ఓటు వేస్తున్నదీ కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తుంటే ఘనత వహించిన జగన్‌గారికి వారించాలని అనిపించలేదా? అక్కడే వున్న పోలింగ్ అధికారులు జగన్ వెనుక వున్న ఇద్దర్ని అక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోవాలని చెప్పడం మరచిపోయారా? చంద్రబాబు నాయుడు ఓటు వేసిన తర్వాత బయటకి వచ్చి, పోలింగ్ బూత్‌కి చాలా దూరంలో వుండి బీజేపీకి ఓటు వేశానని చెబితే జగన్ పార్టీ నాయకులు గగ్గోలు పెట్టారు. ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కూడా చంద్రబాబు ఓటు చెల్లదని చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు ఓటు చెల్లుతుందని చెప్పి భన్వర్ లాల్‌కి మొట్టికాయ వేయడంతో సైలెంటైపోయాడు. మరి చంద్రబాబు విషయంలో రూల్స్ మాట్లాడిన భన్వర్ లాల్, వైకాపా నాయకులు జగన్ ఓటేసిన విధానం చూసి ఏమంటారు? ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఏమంటారు? అన్నట్టు, బుధవారం ఉదయం నుంచే సాక్షి ఛానల్‌లో ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి ఓటు వేసిన విజువల్ పదేపదే చూపిస్తున్నారు. ఈ విజువల్స్ లో వైఎస్సార్ ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి అర్థమవుతున్నది ఏంటంటే, అవినీతి అక్రమాల విషయంలో మాత్రమే కాకుండా నలుగురికీ కనిపించేలా ఓటు వేయడంలో జగన్ తండ్రి బాటలో నడుస్తున్నాడు.  

సీఎం రమేష్ కు భన్వర్‌లాల్ వార్నింగ్

      క్రమశిక్షణకు మారుపేరులా వుండే తెలుగుదేశం పార్టీలో పానకంలో పుడకలా వుండే వ్యక్తి సీఎం రమేష్. మొన్నామధ్య సమైక్య ఉద్యమం సందర్భంగా రాజ్యసభలో ఈయనగారు చేసిన హడావిడి చూసి తెలుగువారందరూ తలలు దించుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ పెద్ద తలనొప్పిలా మారాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.   సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా  తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ పట్ల సీఎం రమేష్ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. రమేష్ తీరు పట్ల రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. జమ్మలమడుగు నియోజకవర్గంలో పక్క గ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకునే విషయంలో హైకోర్టు తీర్పుకు సంబంధించి సీఎం రమేష్ భన్వర్‌లాల్‌ని నిలదీశారు. అది తమ పరిధిలోకి రాదని భన్వర్‌లాల్ చెప్పడంతో సీఎం రమేష్ అసహనంగా, దురుసుగా మాట్లాడారని తెలుస్తోంది. సీఎం రమేష్ ప్రవర్తన పట్ల భన్వర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అంటూ, సీఎం రమేష్ తన తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.  

హలో చంద్రబాబూ.. ఏంటీ సంగతి?

        సీమాంధ్రలో పోలింగ్ చకచకా జరుగుతోంది. చంద్రబాబుకి పట్టం కట్టడానికి సీమాంధ్ర ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బుధవారం పదకొండు గంటల సమయానికి సీమాంధ్ర వ్యాప్తంగా 20 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే పోలింగ్ ముగిసే సమయానికి భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యే అవకాశం వుంది. ఇది తెలుగుదేశం పార్టీకి శుభ సూచకంగా భావించవచ్చు. సీమాంధ్ర పోలింగ్ మీద జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొని వుంది. సీమాంధ్రలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే చంద్రబాబు నాయుడికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నుంచి ఫోన్ వచ్చింది. సీమాంధ్రలో జరుగుతున్న పోలింగ్ సరళికి సంబంధించిన వివరాలను నరేంద్రమోడీ చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు. సీమాంధ్రలో పోలింగ్ టీడీపీ, బీజేపీ కూటమికి అనుకూలంగా జరుగుతోందని చంద్రబాబు నరేంద్రమోడీకి చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్ర బీజేపీకి చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ బీజేపీ, టీడీపికి ఎక్కువ ఎంపీ స్థానాలు అవకాశం వుంది. ఇవి కేంద్రంలో నరేంద్రమోడీకి బలాన్నిచ్చే అవకాశం వుంది. అందుకే నరేంద్రమోడీ సీమాంధ్ర పోలింగ్ మీద ఆసక్తిగా వున్నారు.

సీమాంధ్రకి చెత్త ఈవీఎంలు పంపించారు

      సీమాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం, దాని కనుసన్నల్లో నడిచే ఎన్నికల కమిషన్‌కి వున్న నిర్లక్ష్య ధోరణి మరోసారి బయటపడింది. తెలంగాణలో పోలింగ్ జరిగినప్పుడు ఈవీఎంలు మొరాయించిన సంఘటనలు చాలా తక్కువగా జరిగాయి. అయితే సీమాంధ్రలో మాత్రం ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఈవీఎంలు మొరాయిస్తూనే వున్నాయి.   సీమాంధ్ర అంతటా కొన్ని వందల పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అంటే సీమాంధ్రకు చెత్త ఈవీఎంలను పంపారని అర్థమవుతోంది. ఈవీఎంలు అసలు పనిచేయకుండా చచ్చిపోయిన సంఘటనలు అనేకం వున్నాయి. వీటితోపాటు ఈవీఎంలు అనేకరకాల లీలలు బయటపడుతున్నాయి. ఒకచోట ఒక ఓటు వేస్తే పదిహేను ఓట్లు పడుతున్నాయి. మరోచోట ఎవరికి ఓటు వేసినా ఫ్యాన్ గుర్తుకే పడుతున్నాయి. ఇంకోచోట పోలింగ్ ప్రారంభం కాగానే ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ అధికారిణికి బీపీ పెరిగిపోయి స్పృహ తప్పి పడిపోయారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల సీమాంధ్రలో ఉదయం పదకొండు గంటల వరకూ కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా పెట్టుకున్న ఈవీఎంలు కూడా పనిచేయకుండా మొరాయిస్తున్నాయంటే సీమాంధ్రకు ఎన్నికల కమిషన్ ఎంత చెత్త ఈవీఎంలు పంపిందో అర్థం చేసుకోవచ్చు. ఈవీఎంల సాంకేతిక సమస్యలు ఇలా వుంటే కొన్ని చోట్ల ఒక పార్టీ అభ్యర్థి పేరు ముందు మరో పార్టీ గుర్తు వుండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.  

అపాయింటెడ్ డే విషయంలో టీఆర్ఎస్ హడావిడి ఇందుకే...

  తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. జూన్ 2 అపాయింటెడ్ డే విషయంలో స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. ఇక జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడటం ఖాయం. అయినప్పటికీ టీఆర్ఎస్‌లో ఏదో టెన్షన్ వుంది. అపాయింటెడ్ డే‌ని జూన్ 2న కాకుండా మే 16 వ తేదీకి మార్చాలని కొత్త పాట అందుకుంది. ఎన్నికల ప్రక్రియ మే 15వ తేదీతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజుకే అపాయింటెడ్ డేట్ వుండాలని టీఆర్ఎస్ అంటోంది. ఈ మేరకు హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పదిహేను రోజులకు అపాయింటెడ్ డేట్ వుంటే నష్టమేంటి? వచ్చిన తెలంగాణని ఎవరైనా లాక్కెళ్తారా? తెలంగాణని ఎవరూ లాక్కెళ్ళరుగానీ, అధికారాన్ని మాత్రం తమ చేతుల్లోంచి కాంగ్రెస్ పార్టీ లాక్కెళ్తుందని టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని టీఆర్ఎస్ నాయకులు నమ్ముతున్నారు. అలాగే సర్వేల స్పెషలిస్టు అయిన లగడపాటి రాజగోపాల్ కూడా తెలంగాణ కుర్చీ టీఆర్ఎస్‌దేని తేల్చి చెప్పాడు. ఇన్ని అనుకూల అంశాలున్నా టీఆర్ఎస్ అసాయింటెడ్‌ డే ముందుకు జరపాలని హడావిడి చేస్తున్నది ఎందుకంటే, కాంగ్రెస్ బారి నుంచి తప్పించుకోవడానికే. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి, కొత్త రాష్ట్రం ఏర్పడటానికి మధ్య 17 రోజుల వ్యవధి వుంది. ఈ వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాజకీయాలైనా చేయగలదు. టీఆర్ఎస్‌ని చీల్చే అవకాశాలు కూడా వున్నాయి. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగల సత్తా వున్న కాంగ్రెస్ పార్టీకి 17 రోజులు దొరికాయంటే టీఆర్ఎస్‌ని కకావికలు చేసి, అధికారం చేజిక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కాంగ్రెస్‌కి అంత టైమ్ ఇవ్వకుండా మే 16నే అపాయింటెడ్ డేట్ వుండేలా చేసి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

పొన్నాల, జానా పనికిమాలిన పంచాయితీ

      ఏదైనా పనికొచ్చే విషయం మీద పంచాయితీ పెట్టుకుంటే, సదరు పంచాయితీ పెట్టుకున్నవాళ్ళతోపాటు చూసేవాళ్ళకి కూడా ఒక పద్ధతిగా వుంటుంది. కానీ, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి మధ్య జరుగుతున్న పంచాయితీని చూస్తే ఎవరైనా సరే ఇది పనికిమాలిన పంచాయితీ అని డిసైడ్ చేస్తారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పంచాయితీ ఏంటంటే, తెలంగాణకి కాబోయే సీఎం నువ్వా? నేనా? అని! తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబట్టి తానే సీఎం అయిపోతానని పొన్నాల కలలు కంటున్నారు. కానీ జానారెడ్డి మాత్రం తానే సీఎం కాబోతున్నానని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.   ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి పేరు మరొకరు చెప్పకుండా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వీళ్ళని చూసి దామోదర రాజ నరసింహ లాంటి సీఎం పోస్టుని ఆశిస్తున్న వారు ఏం చేయాలో అర్థంకాక ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌కే మెజారిటీ దక్కుతుందన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినా కాంగ్రెస్ చేతికి చిప్పే దక్కుతుందని తెలుస్తోంది. అసలు అధికారం వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వుంటే, మధ్యలో ముఖ్యమంత్రి సీటు గోలేంటని కొందరు కాంగ్రెస్ వాదులు చిరాకు పడుతున్నారు. అలాగే యువరాజు రాహుల్ గాంధీ తెలంగాణకి మహిళని ముఖ్యమంత్రిని చేస్తానని ఆల్రెడీ చెప్పేశారు. అలాంటప్పుడు ఈ ఇద్దరు మగానుభావులు తెలంగాణ పోస్టుకోసం పోటీ పడటం ఏంటని కొందరు కాంగ్రెస్ మహిళా నాయకులు బాధపడిపోతున్నారు.

పవన్ ప్రశ్నలకు వైకాపా జవాబు ఇవ్వలేదేమి?

  తెదేపా-బీజేపీ అభ్యర్ధుల తరపున పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంతో వైకాపాకు ఎంతో కొంత నష్టం జరగడం తధ్యమని చెప్పేందుకు పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. రాజకీయాలలోకి అకస్మాత్తుగా ఊడిపడిన అయన, తమ ఐదేళ్ళ శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేయబోతుంటే వైకాపా కన్నీరు పెట్టుకోవడం, ఆ ఆవేదన ఆగ్రహంగా మారడం కూడా అంతే సహజం.   అందుకే షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేకుండా ఏదేదో వాగుతున్నాడని, ఆయన మాటలు పట్టించుకోవద్దని ప్రజలకు హితవు చెపుతున్నారు. అయితే నేటికీ కూడా పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వారిరువురూ కూడా జవాబే చెప్పలేకనే, వారు విషయం పక్క దారి పట్టిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది.   సీమంధ్ర ప్రజలను నోటికి వచ్చినట్లు కేసీఆర్ తిడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయనని ఎదుర్కోలేదు? ఎందుకు ఆయనను పల్లెత్తు మాట అనలేదు? కేసీఆర్ ని చూసి ఎందుకు జగన్ భయపడుతున్నారు? వారిరువురి మధ్య ఉన్న అనుబందం ఏమిటి? తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి అక్కడ నివసిస్తున్నసీమాంధ్రులను ఏవిదంగా కాపాడగలరని ప్రశ్నించారు. సీమాంద్ర ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా తాను వారికీ ముఖ్యమంత్రి అవుదామని భావిస్తున్నారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు జగన్ కానీ షర్మిల గానీ నేరుగా ఇంతవరకు జవాబు చెప్పలేకపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ పిచ్చిపిచ్చిగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని షర్మిల, జగన్ ఎదురుదాడికి దిగారు.

ఆంధ్రాని సింగపూర్ చేసే సంగతి తర్వాత...

      రాజకీయ నాయకుడు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్ చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. వైసీపీ అధినేత అయితే సీమాంధ్రని అంతర్జాతీయ స్ఘాయిలో, సింగపూర్‌కి దీటుగా డెవలప్ చేయడానికి విదేశాల నుంచి కన్సల్టెంట్స్ ని కూడా పిలిపించి ప్లాన్లు వేయిస్తున్నాడంట. ఆంధ్రని సింగపూర్ చేసే సంగతి తర్వాత.. ప్రస్తుతం సింగపూర్లో ఇండియా వాళ్ళకి ఇళ్ళు రెంట్‌కి ఇవ్వమని చెప్పేస్తున్నారట. టు లెట్ బోర్డు వున్న ఇంటికి వెళ్ళి పోర్షన్ చూపిస్తారా? అని అడిగితే మీరు ఇండియన్సేగా.. మీకు ఇల్లు అద్దెకి ఇవ్వమంటూ ముఖంమీదే చెప్పేసి తలుపులు వేసుకుంటున్నారట. సింగపూర్ మొత్తంలే ఇదే పరిస్థితి వుందట. దాంతో సింగపూర్‌లో అద్దె ఇళ్ళు దొరక్క ఇండియన్స్ బోలెడంత ఇబ్బంది పడుతున్నారట.   ఇంతకీ సింగపూరోళ్ళు ఇండియన్స్ ని ఎందుకు ఛీ పొమ్మంటున్నారో తెలుసా? ఇండియన్స్ వంటలు ఘాటైన మసాలాలు ఉపయోగించి వండుతారట, అసలు వంట చేసేటప్పుడే చుట్టుపక్కల అంతా ఆ మసాలా ఘాటు వ్యాపిస్తూ వుంటుందట. అది బల్లులు, పాములు తినే సింగపూరోళ్ళకి ఇబ్బందికరంగా వుందట. అంతేకాకుండా ఇండియన్స్ తమ ఇళ్ళని అపరిశుభ్రంగా వుంచుతారట. ఇల్లు శుభ్రంగా వుంచుకోండని ఎన్నిసార్లు చెప్పినా లైట్‌గా తీసుకుంటారట. అదీ సమస్య. ఫ్యూచర్లో మన సీమాంధ్ర సింగపూర్‌లా మారొచ్చేమోగానీ, మనుషుల అలవాట్లు మారతాయా? సీమాంధ్రని సింగపూర్‌లా మార్చే నాయకులు మనుషుల అలవాట్లని కూడా మార్చగలరా?

గుడివాడ బరిలో కొడాలి నాని, రావి ఢీ అంటే ఢీ

  ఈసారి గుడివాడలో పోటీ ప్రధానంగా వైకాపా అభ్యర్ధిగా దిగిన కొడాలి నాని, తెదేపా అభ్యర్ధి రావి వెంకటేశ్వర రావుల మధ్యే ఉన్నప్పటికీ నానిదే పైచేయిగా కనిపిస్తోంది. కారణం ఆయన గత పదేళ్లుగా నియోజక వర్గాన్నిఅంటిపెట్టుకొని ఉంటూ ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉండటమే. ఒకప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నకారణంగా, నందమూరి కుటుంబంతో, ముఖ్యంగా జూ.యన్టీఆర్ ఆయనకున్న సాన్నిహిత్యం వలన ప్రజలలో మంచి పేరు సంపాదించుకొన్నారు. నాని తెదేపా నుండి బయటకు వచ్చిన తరువాత గుడివాడపై పట్టు సాధించేందుకు చాలా తీవ్రంగా కృషిచేసారు. ఆయన తమ ప్రత్యర్ధ తెదేపా నుండి వచ్చినవారు కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను ప్రోత్సహిస్తూ గుడివాడలో బలపడేందుకు అన్ని విధాల సహకరించారు. కొడాలి నాని స్వయం కృషికి పార్టీ సహకారం కూడా తోడవడంతో గుడివాడలో ఆయన బలంగా నిలద్రోక్కుకోగాలిగారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం ఈ ఎన్నికలలో ఆయనకు కలిసి వచ్చింది. అందువల్ల ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా విజయం సాధించగలనని కొడాలి నాని గట్టి నమ్మకంతో ఉన్నారు.   ఇక ఆయనపై తెదేపా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రావి వెంకటేశ్వరరావు రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినవారే. ఆయన తండ్రి శోభనాద్రి చౌదరి గుడివాడ నుండి రెండు సార్లుఎన్నికయ్యారు. ఆయన తరువాత ఆయన కుమారుడు రావి హరగోపాల్ 1999 ఎన్నికల్లో గుడివాడ నుండి ఎన్నికయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఆయన సోదరుడయిన రావి వెంకటేశ్వర రావు 2000 సం.లో జరిగిన ఉప ఎన్నికలలో గుడివాడ నుండి పోటీ చేసి గెలిచారు. రావివెంకటేశ్వర రావు కూడా తన గెలుపుపై అంతే ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, తమ పార్టీ విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, మోడీ, బాబు, పవన్ ఉదృత ప్రచారంతో తాను అవలీలగా గెలుస్తానని చెపుతున్నారు. ఈ ఇద్దరు బలమయిన అభ్యర్ధులలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో తెలుగుదేశం: లగడపాటి

      సర్వేల స్పెషలిస్టు లగడపాటి రాజగోపాల్ తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తి మెజారిటీ సాధిస్తుందని, సీమాంధ్రలో తెలుగుదేశం పూర్తి మెజారిటీ సాధిస్తుందని లగడపాటి చెప్పారు. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోతే టీడీపీ, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.   సీమాంధ్రలో 70 శాతానికి మించి పోలింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని వివరించారు.   కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీని సాధిస్తాయనేది తన అంచనా అని చెప్పారు. ఎన్డీయే 272 స్థానాల మార్కు దాటుతుందని అన్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తనకు బాధ కలిగించే విషయమని అన్నారు. తనకు రాజకీయంగా జన్మను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తనకు రాజకీయగా మరణాన్ని కూడా ఇచ్చిందని లగడపాటి వ్యాఖ్యానించారు.  తనపేరుతో వచ్చే ఇతర సర్వేలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా లగడపాటి ప్రకటించారు. తాను కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి నైతికంగా మద్దతు ఇస్తున్నానే తప్ప ఏ పార్టీలోనూ లేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు తాను చెబుతున్నది తన అంచనాలు మాత్రమేనని, శాస్త్రీయంగా చేసిన ఎగ్జిట్ పోల్ వివరాలను మే 12వ తేదీ తర్వాత ప్రకటిస్తానని లగడపాటి వెల్లడించారు.

కొత్త కూటమిని సృష్టించిన టీఆర్ఎస్

      ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి ఎన్ని లోక్‌సభ సీట్లు వస్తాయో ఏమో తెలియదుగానీ, టీఆర్ఎస్ మాత్రం కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అనే విషయం మీద తెగ టెన్షన్ పడిపోతోంది. చాలాకాలం నుంచి యుపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ రాష్ట్ర విభజన తర్వాత యుపిఎ భజన చేయడం ఆపేసింది. కొంతకాలం బీజేపీ భాగస్వామి అయిన ఎన్డీయే వైపు చూసిన టీఆర్ఎస్ బీజేపీ, టీడీపీ మద్దతు కుదరడంతో ఎన్టీయేకి పచ్చి కొట్టేసింది. ఆ తర్వాత కొంతకాలం థర్డ్ ఫ్రంట్‌ అనే మాటని పట్టుకుని వేలాడింది. కొంతకాలం తర్వాత థర్డ్ ఫ్రంట్ మీద మోజు తీరిపోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాలి కాంగ్రెస్ పార్టీ మీదకి మళ్ళింది. అందుకే మొన్నీమధ్యే ఆయన రాహుల్ గాంధీ కోరితే యుపీయేకి మద్దతు ఇస్తానని ప్రకటించారు. భూమి గుండ్రంగా వున్నట్టు టీఆర్ఎస్ మళ్ళీ యుపీఏ దగ్గరకి వచ్చింది కాబట్టి అక్కడితో ఆగుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు చేస్తే అది టీఆర్ఎస్ ఎందుకవుతుంది? ఇప్పుడు టీఆర్ఎస్ కొత్త కూటమిని సృష్టించింది. ఆ కూటమి పేరు ‘లౌకిక కూటమి’. ఈసారి తమ పార్టీ మద్దతు లౌకిక కూటమికే వుంటుందని టీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఊహల్లో పుట్టిన ఈ లౌకిక కూటమిని టీఆర్ఎస్ ఎంతకాలం లవ్ చేస్తుందో చూడాలి.