చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ హాజరవుతారా?
posted on Jun 6, 2014 9:03AM
చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్రమంత్రులను, జాతీయ నేతలనే కాక తన రాజకీయ ప్రత్యర్దులయిన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈవిషయంలో కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోయినా, వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం గవర్నర్ అధ్వర్యంలో ఒక పద్దతి ప్రకారం అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తే తప్పకుండా హాజరవుతానని, కానీ దానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఒక రాజకీయ సభగా నిర్వహించాలని చూస్తే మాత్రం తను హాజరుకానని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించబోతున్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇది అధికారిక కార్యక్రమం గనుక ఎక్కడా పార్టీ జెండాలు, తోరణాలు పెట్టరాదని చంద్రబాబు తన పార్టీ నేతలను ముందే ఆదేశించారు. అయితే ప్రమాణ స్వీకారం జరుగుతున్న మైదాన పరిసర ప్రాంతాలలో పార్టీ జెండాలు, తోరణాలు ఉండకపోవచ్చునేమో కానీ, విజయవాడ-గుంటూరు నగరాలు మొత్తం ఈ సందర్భంగా తెదేపా జెండాలు, తోరణాలు, భారీ స్వాగత తోరణాలతో కళకళలాడటం ఖాయం. మళ్ళీ పదేళ్ళ తరువాత తెదేపా అధికారంలోకి వస్తునందున తెదేపా ఇంత భారీ ఎత్తున ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం అసహజమేమీ కాదు.
తెదేపా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి మరో కారణం ఏమిటంటే, ఇంతవరకు వైకాపాతో అలుపెరుగని పోరాటం చేసి డీలాపడిన తెదేపా కార్యకర్తలు, నేతలకు దైర్యం కలిగిస్తూ వారిలో మళ్ళీ సమరోత్సాహం కలిగించానికి, అదేసమయంలో ఓటమితో బాగా క్రుంగిపోయున్న వైకాపా నేతల, కార్యకర్తల మనోధైర్యం మరింత దెబ్బతీయడానికేనని భావించవచ్చును.
నిజానికి జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పుడే ముఖ్యమంత్రి అయిపోదామని చాలా ప్రయత్నాలు చేసారు. కానీ అవి అప్పుడు ఫలించలేదు. అప్పటినుండి ఇప్పటివరకు ఎంత ప్రయాసపడినా ఓటమి తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం తధ్యం అని చాలా గట్టిగా ప్రచారం చేసుకొన్నారు. అయినా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ముఖ్యమంత్రి కావాలని ఆయన ఎంతగా తపించిపోయారో ప్రజలందరికీ తెలుసు. అటువంటప్పుడు తనకు దక్కవలసిన ఆ అవకాశాన్ని ప్రజలు చంద్రబాబు నాయుడుకి కట్టబెడితే దానిని ఆయన జీర్ణించుకోవడం కష్టమే. పైగా చాలా అట్టహాసంగా నిర్వహింపబడుతున్న ఈ కార్యక్రమం వలన తనపార్టీ నేతల, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నపుడు అటువంటి దానికి జగన్ హాజరవుతారని భావించలేము.
అయినప్పటికీ తెదేపా ఇంత అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరయితే, ఆయన పరిస్థితి మయసభలో దుర్యోధనుడి పరిస్థితే అవుతుంది. గనుక ఏదో ఒక సాకుతో దీనికి హాజరు కాకుండా తప్పుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఆ ప్రయత్నంలోనే ఆయన ఈవిధంగా అని ఉండవచ్చును. మహా అయితే ఆయన తన పార్టీ ప్రతినిధులను పంపవచ్చును.