అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దు సాధారణ విషయమా?
posted on Jan 24, 2015 @ 4:03PM
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భద్రతా కారణాల దృష్ట్యా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకొన్నారని ఆయన యొక్క భద్రతా సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేసింది. కనుక ఆయన పర్యటన మూడు రోజులకు బదులు ఇప్పుడు రెండు రోజులతోనే ముగుస్తుంది. ఇది చాలా సాధారణమయిన వార్తలా పైకి కనిపిస్తున్నప్పటికీ, చాలా తీవ్రమయిన విషయంగా పరిగణించవలసి ఉంటుంది.
ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తిమంతుడు, అత్యాధునిక భద్రతా సౌకర్యాలు గల అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఆగ్రాలో తాజ్ మహల్ ని సందర్శించేందుకు వెనకాడవలసి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా పాక్ ఉగ్రవాదులు భారత్ లో ప్రధాన నగరాలలో ఎక్కడయినా ఎప్పుడయినా దాడులకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని భారత, అమెరికా నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ చాల కట్టుదిట్టమయిన భద్రత గల అమెరికా అధ్యక్షుడు కూడా ఉగ్రవాదుల దాడులకు భయపడి తన పర్యటనను రద్దు చేసుకోవడం ఆయనకు, ఆయనకు రక్షణ కల్పించలేని భారత ప్రభుత్వానికీ, ఆయనను కంటికి రెప్పలా కాపాడుకొంటున్న అమెరికా భద్రతా దళాలకు కూడా ఇది సిగ్గు చేటే.
అంతేకాదు భారత్ పై ఉగ్రవాదుల నీడలు ఎంతగా కమ్ముకొన్నాయనే విషయం ఇప్పుడు ఆయనకు కూడా బాగానే అర్ధమయ్యే ఉండాలి. ఆయన నేల మీద కాలు మోపక ముందే నేల మీదే కాకుండా నింగిలో కూడా అత్యాధునిక విమానాలు వేసుకొని డేగ కళ్ళతో పహారా కాసే అత్యాధునిక రక్షణ కవచం కలిగి ఉన్న అమెరికా అధ్యక్షుడే ఆగ్రాలో అడుగుపెట్టే సాహసం చేయలేకపోయారంటే ఇక దేశంలో ఎటువంటి రక్షణ లేనీ సాధారణ పౌరుల మాటేమిటి?
అమెరికా అధ్యక్షుడికి అపారమయిన భద్రతా వ్యవస్థ ఉంది కనుక ఉగ్రవాదులు ఆ పరిసర ప్రాంతాలను కన్నెత్తి చూడలేకపోవచ్చును. కానీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పరుచుకొని ఉన్న విశాలమయిన భారత దేశంలో ఉగ్రవాదులు దాడి చేయకుండా అడ్డుకోగల శ్రద్ధ, నేర్పు, నైపుణ్యం, అత్యాధునిక పరిజ్ఞానం భారత భద్రతా దళాలకు ఉందా? ఉంటే అమెరికా అధ్యక్షుడు ఆగ్రా ఎందుకు సందర్శించేందుకు వెనుకాడుతున్నారు?
ఉగ్రవాదంపై పోరు కోసం అంటూ అమెరికా ప్రతీ ఏటా కొన్ని లక్షల డాలర్లు పాకిస్తాన్ కి అందజేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ బయలుదేరే ముందు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని ఒక హుకూం కూడా జారీ చేసారు. కానీ ఈ పరిస్థితి చూసకయినా పాకిస్తాన్ తన దుశ్చర్యలు మానుకోదని, దాని ఆగడాలకు గత ముప్పై ఏళ్లుగా భారత్ ఎన్ని బాధలు పడుతోందనే విషయం ఆయనకి అర్ధం అయితే చాలు.