నిధుల కోసం నిలదీసేవరకు వేచి చూడటం ఎందుకు?

  తెదేపా, బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రానికి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేకహోదా, వివిధ ప్రాజెక్టుల మంజూరు, నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో తెదేపా నేతలు, మంత్రులు కేంద్రంపై కొంచెం గుర్రుగా ఉన్నారు. కానీ వారు స్నేహధర్మం పాటిస్తూ ఇంతకాలం మౌనంగా ఎదురుచూసారు. కానీ కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడంతో వారి ఆగ్రహం బయటపడింది.   కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో తెదేపా విఫలమయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల వలన పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందనే భయంతోనే ఇంతకాలం పాటిస్తున్న మిత్రధర్మాన్ని కొంచెం పక్కనబెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించక తప్పలేదు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమయిన ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుదామని భావిస్తున్న బీజేపీపై కూడా ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది గనుక కేంద్రం పునరాలోచించుకొని రాష్ట్రానికి తొలివిడతగా రూ.3, 000 కోట్లు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది, అంతే కాదు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.   బహుశః ఈ సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముందుగానే అంది ఉండవచ్చును. అందుకే ఆయన నిన్న ప్రధాని మోడీని ఆయన పాలనను ప్రసంశలతో ముంచెత్తారు. కానీ కేంద్రం ఇదేపని ఇంతకు ముందే చేసి ఉంటే అప్పుడు కేంద్రానికి, బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా గౌరవంగా ఉండేది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీల అమలుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్రం పదేపదే చెపుతున్నప్పుడు, ప్రజలు, ప్రతిపక్షాలు చివరికి మిత్రపక్షం కూడా నిలదీసే పరిస్థితి కల్పించుకొనే బదులు వాటిని అమలుచేసేందుకు ప్రయత్నించి ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషించేవారు. కానీ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనలను పట్టించుకోకపోవడం వలన బీజేపీకి, తెదేపాకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, చివరికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా కొంత నష్టం జరిగింది. ఆ పార్టీలు, ప్రభుత్వాలు, వాటి అధినేతలపై ప్రజలలో కొన్ని అపోహలు ఏర్పడ్డాయి.   ఇటువంటి పరిణామాలు ఎవరికీ కూడా మంచిది కాదు. కనుక ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టుల విషయంలో ప్రతీసారి ఇదేవిధంగా ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆ తరువాత నిధులు మంజూరు చేయడం, మళ్ళీ ప్రసంశలు కురిపించుకోవడం, ఆ తరువాత ఇరుపార్టీల నేతలు తమ మధ్య దృడమయిన స్నేహ సంబంధాలున్నాయంటూ ‘సెల్ఫ్ డిక్లరేషన్’ ఇచ్చుకొంటూ నవ్వులపాలవడం కంటే ఇక ముందు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఆ చేసేపనులేవో అన్నీ సకాలంలో చేయగలిగితే వారికే మంచిది.

తెలంగాణాలో విద్యుత్ సంక్షోభానికి ఎవరు బాధ్యులు?

  చంద్రబాబు నాయుడు ఇచ్చే కరెంట్ మాకు అక్కరలేదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న శాసనసభలో తెగేసి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తెలంగాణాకు రావలసిన విద్యుత్ ఇవ్వడం లేదని ఇంతవరకు ఆయనే వాదిస్తున్నారు. ఇప్పుడు అసలు అక్కరలేదని చెపుతున్నారు. ఆయన కత్తికి రెండు వైపులా పదునుంటుందని నిరూపిస్తూ చంద్రబాబు విద్యుత్ ఇవ్వలేదని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే, ఆ విధంగా చేసి తమకు మహోపకారం చేసారని చెప్పడం విశేషం. ఆయన విద్యుత్ ఇవ్వకపోబట్టే తాము ఈ విద్యుత్ సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కోగలిగామని చెపుతున్నారు. అంటే చంద్రబాబుదే తప్పు కానీ దానిని తానే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నానని చెపుతున్నారు.   ఆయన ఆవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? దాని వలన ఏమి జరుగుతుంది? అని ఆలోచిస్తే ఇప్పుడప్పుడే ఈ విద్యుత్ సంక్షోభం పరిష్కారం కాదని ఆయన కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నప్పటికీ అందుకు ప్రజలు ఆయనను కాక చంద్రబాబునే దోషిగా భావించే అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణాలో బలపడాలని ప్రయత్నిస్తున్న తెదేపాపట్ల ప్రజలలో విముఖత ఏర్పడేందుకు ఎంతో కొంత అవకాశం ఉంది.   తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడే మూడు నెలలలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు మరో ఒకటి రెండేళ్ళపాటు ఓపిక పట్టమని, అంతవరకు రైతులు, పరిశ్రమలు విద్యుత్ సమస్యలు ఎదుర్కోక తప్పదని చెపుతూనే, వారి ఆ కష్టాలకు చంద్రబాబే కారణమని చెపుతున్నారు. అంతేకాదు ఈలోగా ఎన్ని కష్టాలు ఎదురయినా ఆంధ్రప్రదేశ్ నుండి విద్యుత్ తీసుకోబోమని కూడా ఆయనే చెపుతున్నారు. అందుకు బలమయిన మరో కారణం కూడా ఆయనే చెప్పారు. ఆంధ్రా నుండి విద్యుత్ తీసుకొంటే, తిరిగి సగం ధరకే ఆంధ్రాకి విద్యుత్ ఈయవలసివస్తుందనే తాము ఆంధ్రా నుండి విద్యుత్ తీసుకోవడంలేదని చెప్పారు. మరి అటువంటప్పుడు చంద్రబాబుని ఎందుకు నిందిస్తున్నారు?   ఆయన తెలంగాణా రాష్ట్రానికి వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి ఆయన విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెపుతున్నారు. కానీ తెలంగాణా రాష్ట్రంతో పూర్తిగా అనుసంధానమయున్న విద్యుత్ సరఫరా వ్యవస్థలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ తీసుకొనేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఎందుకు?   తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 330 మెగావాట్స్ విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆయన తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కనీసం ఆయన ప్రతిపాదనపై స్పందించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఎందుకు?   తెలంగాణా రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమలకు వారానికి రెండేసి రోజులు పవర్ హాలీ డే విధించడంతో చిన్న,మద్యతరగతి పరిశ్రమలు అనేకం తీవ్రంగా నష్టపోయాయి. వాటి మీద ఆధారపడిన వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఒకమెట్టు దిగివచ్చి చంద్రబాబుతో ఈ విషయంపై నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఎందుకు?   ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం కనబడుతోంది. తెదేపాతో ఉన్న రాజకీయ వైరమే బహుశః అందుకు కారణం అనిపిస్తోంది తప్ప మరే ఇతర కారణాలు కనబడటం లేదు. అసలు రెండు రాజకీయ పార్టీల, వాటి అధినేతల మధ్య ఉన్న రాజకీయ వైరానికి మధ్యలో ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి? అనే ప్రశ్నకు జవాబు కోసం ఎవరిని అడగాలి?

భారత్-శ్రీలంక మళ్ళీ దగ్గరయ్యే అవకాశం?

  ప్రధాని మోడీ ఈరోజు విదేశీపర్యటనకు బయలుదేరుతున్నారు. ఐదు రోజులపాటు సాగే ఈ పర్యటనలో ఆయన షెల్లాస్, మారిషస్ మరియు శ్రీ లంక పర్యటిస్తారు. ఇదివరకు భారత్-శ్రీలంక దేశాల నడుమ మంచి సంబంధాలే ఉన్నప్పటికీ యల్.టి.టి.యి. కారణంగా క్రమంగా రెండు దేశాల మధ్య దూరం పెరగసాగింది. యల్.టి.టి.యి.ని నియంత్రించడంలో శ్రీలంకకు సహాయపడేందుకు భారత్ శాంతి సేనలను పంపడం, అందుకు ప్రతీకారంగా యల్.టి.టి.యి.కి చెందిన కొందరు వ్యక్తులు భారత ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేయడం వంటి సంఘటనలతో రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది.   ఆ తరువాత శ్రీలంక దేశాధ్యక్షుడిగా అధికారం చేప్పట్టిన మహింద రాజపక్సే యల్.టి.టి.యి.ని తుడిచిపెట్టేసే ప్రయత్నంలో వేలాది మంది తమిళ ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులను అతికిరాతకంగా చంపించడంతో అప్పటి నుండి భారత్ తో సహా ప్రపంచదేశాలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. భారత్-శ్రీలంకలు దూరం అవడంతో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా దేశం ఇదే అదునుగా శ్రీలంకలో కోట్ల డాలర్లు కుమ్మరించి దానికి దగ్గిర కాగలిగింది. భారత్ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా చైనాకు చెందిన రెండు అణ్వాయుధ జలాంతర్గాములను తన పోర్టులో నిలిపి ఉంచేందుకు శ్రీలంక అధ్యక్షుడు అనుమతించారు. మోడీ ప్రభుత్వం మళ్ళీ శ్రీలంకతో సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ఈ తొమ్మిది నెలలలో చాలా కృషి చేసింది. కానీ చైనా ప్రభావంలో ఉన్న రాజపక్సే, ప్రధాని రనీల్ విక్రమే సింఘే సానుకూలంగా స్పందించలేదు.   ఈ పరిస్థితులలో శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం అందులో మైత్రీపాల సిరిసేన విజయం సాధించి శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టడంతో మళ్ళీ రెండు దేశాల నడుమ స్నేహ సుమాలు విరిసే అవకాశం కలిగింది. ఆయన అధికారం చేప్పట్టగానే మొట్టమొదట భారత్ పర్యటించి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరుచుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం అభినందనీయం. ఆయన ఆహ్వానాన్ని మన్నించి భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంకలో పర్యటించేందుకు బయలుదేరుతున్నారు.   కానీ చైనావైపు మొగ్గు చూపుతున్న ఆ దేశప్రధాని ప్రధాని రనీల్ విక్రమే సింఘే ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ సముద్ర జలాలలో ప్రవేశిస్తున్న తమిళ జాలారులను కాల్చి చంపే హక్కు తమకు ఉందని, శ్రీలంకలో ఉన్న తమిళులు (ఆయన దృష్టిలో శరణార్ధులు) అందరూ భారత్ తిరిగి వెళ్లి పోవలసిన సమయం వచ్చిందని చెప్పడం భారత్ లో కలకలం సృష్టించింది. ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనకు బయలుదేరుతున్న ఈ సమయంలో శ్రీలంక ప్రధాని ఈవిధంగా మాట్లాడటం ఇరు దేశాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయి. అయినా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపరుచుకోవాలని భావిస్తున్న ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకోకుండా శ్రీలంకకు వెళుతున్నారు.   నేపాల్, శ్రీలంక వంటి చిన్నచిన్న దేశాలకు కూడా భారత్ ఇంత అలుసయిపోయిందంటే అందుకు కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అనుచిత విదేశీ విధానమే. మోడీ ప్రభుత్వం ఆ విధానాలను పూర్తిగా మార్చి ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క అవసరమయినప్పుడు చాలా దృడంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనలో ఇరు దేశాల మధ్య అనేక కీలకమయిన ఒప్పందాలు జరగనున్నాయి. అవి ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పునరుద్దరించబడేందుకు సహాయపడవచ్చును.

ఇచ్చట ఉచితంగా ప్రజాసేవ చేయబడును

  అదేమిటి...ప్రజాసేవ...ఉచితంగానా..ఏమిటీ అర్ధంపర్ధం లేని మాటలు అనేసుకోవద్దు. కొందరు సామాజిక న్యాయం చేయడానికే పుట్టినవారున్నారు. మరికొందరు ప్రశ్నించాడానికే పుట్టినవారున్నారు. ఇంకొందరు జనాలని ఓదార్చడానికే పుట్టినవారున్నారు. వారిలో ఎవరికీ అధికార దాహం లేదు. ఎందుకంటే వారి కడుపులు ముందే నిండాయిట. పాపం ప్రజల కష్టాలను చూసి జాలిపడి వారిని తాము కాకపోతే మరెవరు కాపాడుతారు? అది తమ సామాజిక బాధ్యత కూడా అనుకొంటూ వారందరో వెరైటీ రాజ్యాలు స్థాపించి తమ తమ సైన్యాలతో జనాల ముందుకు వచ్చేరు. మరి అది ఉచిత ప్రజాసేవే కదా...అదెలా సాగిందో అందరికీ తెలుసు.   వారిలో సామాజిక న్యాయం చేస్తానంటూ బయలుదేరిన చిరంజీవి తనను నమ్ముకొని వచ్చిన అభిమానులను, పార్టీ కార్యకర్తలను, చివరికి హేమాహేమీలయిన సీనియర్ రాజకీయ నేతలను కూడా హ్యాండిచ్చేసి తన (ప్రజా) రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కేంద్రమంత్రి పదవి పుచ్చుకొని సామాజిక న్యాయం సాధించి చూపారు. సామాజిక న్యాయం చేస్తానన్న పెద్దమనిషి ప్రస్తుతం 150 సినిమాని తీసుకొనేపనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారని జనాలు గొణుక్కోవచ్చు గాక కానీ ఆయన నేటికీ జనాల సంతృప్తి కోసం రాజ్యసభకి ఓ రౌండేసి వస్తూనే ఉంటారు.   తమ్ముడు పవన్ కళ్యాణ్ 'నేను వచ్చింది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి మాత్రమే' అనే సరికొత్త సబ్ టైటిల్ తో రాజకీయాలలోకి వచ్చేరు. "ఆ...అలాగంటాడు కానీ...ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటాడా?" అనుకొంటూ ఆయన చుట్టూ ఓ పెద్దమనిషి చాలా రోజులు తిరిగాడు. "వెయ్యెకరాల మాగాణీ పోతే పోయింది గానీ చట్టం గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగాను" అని వెనకటికొకడు తృప్తిపడినట్లు ఆయన కూడా తన మూనెల్ల రాజకీయనుభావంతో తృప్తిపడి మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయాడు. ఆయనతో బాటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు. ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పిన పెద్దమనిషి కనీసం ఆ చిన్న పని కూడా చేయకుండానే సినిమాలతో కాలక్షేపం చేసుకొంటున్నారు.   సినిమాకి సినిమాకి మధ్యలో కొంత టైం దొరికినప్పుడు తను జనసేన పార్టీ పెట్టాననే సంగతి జ్ఞాపకం రాగానే ఆవేశం తెచ్చుకొని ట్వీటర్ లో ఏదో ఒకటి గెలికి పడేస్తుంటారు. ఇంకా టైం మిగిలి ఉంటే తుళ్ళూరులో అలా ఓ రౌండేసి వెళ్ళిపోయారు. ఈసారి టైం దొరికితే కొంచెం పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ గెయిన్ చేయడానికి జి.హెచ్.యం.సి.ఎన్నికలను కూడా ఓసారి ట్రై చేద్దామనుకొంటున్నట్లు ప్రకటించేసారు.   ఇక మడమ తిరగని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం బాగుపడాలంటే దానికి సర్వ రోగ నివారిణి వంటి ఒకే ఒక్క పరిష్కారం ఉందని చెపుతుంటారు. అదే తను ముఖ్యమంత్రి అయిపోవడం. తను ముఖ్యమంత్రి అయిపోతే ఇక రాష్ట్ర ప్రజలు చీకు చింత లేకుండా జీవించేసుకోవచ్చని చెపుతుంటారు. అంతేకాదు..తను ముఖ్యమంత్రి అయిపోగానే తుళ్ళూరులో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ వంటి ఎన్ని పెద్ద పెద్ద భవనాలు కట్టిపడేసినా సరే వాటి క్రింద నుండి రైతుల భూమిని భద్రంగా ఎలా తీసుకొన్నది అలాగ బయటకి తీసిచ్చేయగల అత్యాధునిక టెక్నాలజీ తన దగ్గర ఉందని చెపుతుంటారు. కనుక ఆ భూమి కావాలనుకొంటే తనను గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకొనే బాధ్యత మీదేనని పదేపదే చెపుతుంటారు.   మెగాస్టారు కాకపోతే పవర్ స్టారు ఆయన ఏమీ చేయలేకపోతే జగనన్న మనకి ఉండనే ఉన్నాడని జనాలు అనుకొన్నారు. కానీ ముగ్గురు ముగ్గురేనని నిరూపించారు. ఇక తాజాగా మరొక కొత్త పుకారొకటి పుట్టుకొచ్చింది. అదేమిటంటే బాబాయ్ పెట్టిన జనసేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ "లైక్" చేసాడుట! హైదరాబాద్ నడిరోడ్డు మీద చేతికి మట్టి అంటకుండా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను అలఓకగా ఉతికి ఆరేయించిన మన చినబాబు కూడా రాజకీయాలలోకి వస్తే ఆ..రేంజ్ ఒక తుఫానులా ఉంటుందని జనాలు అప్పుడే ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. నిప్పు లేనిదే పొగ రాదనే సిద్దాంతం నిజంగా కరెక్టయితే జనసేన మెగాసేనగా మారి జనాల ముందుకి వచ్చినా ఆశ్చర్యం లేదు.

పిడిపితో బీజేపీ పొత్తు దేశానికి మంచిది కాదు: శివసేన

  జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాశ్మీరు వేర్పాటువాదులను జైలు నుండి విడుదల చేయడంపై ప్రతిపక్షాలతో బాటు బీజేపీకి మిత్రపక్షమయిన శివసేన పార్టీ కూడా తీవ్రంగా విమర్శించింది. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుపనిచ్చినందుకు పాకిస్తాన్ తీవ్రవాదులకు, కాశ్మీర్ వేర్పాటువాదులకు కృతజ్ఞతలు తెల్పిన ముఖ్యమంత్రి సయీద్, మొన్న శనివారం రాత్రి కొందరు కరడుగట్టిన వేర్పాటువాదులను జైలు నుండి విడిచిపెట్టారు.   దానిపై శివసేన అధినేత ఉద్దావ్ థాక్రే స్పందిస్తూ, తన సామ్నా పత్రికలో అటువంటి పార్టీతో బీజేపీ కలిసిపనిచేయడాన్ని తప్పుపట్టారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సయీద్ తన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి కానీ భారత ప్రభుత్వానికి గానీ తెలియజేయకుండా వేర్పాటువాదులను జైలులో వదిలివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన చర్యలు దేశాన్ని అవమానపరిచేవిగా, భారత ప్రభుత్వానికి సవాలుచేస్తునట్లున్నాయని శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ థాక్రే అభిప్రాయపడ్డారు. కనుక సయీద్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆయన ప్రభుత్వంలో కొనసాగడంపై బీజేపీ పునరాలోచించుకోవాలని ఉద్దావ్ థాక్రే బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసారు.

ఎంత పనిచేశావు గోపాలా?

  చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములిరువురూ సినీ రంగంలో ఎంత గొప్ప పేరు సంపాదించుకొన్నారో, రాజకీయాలలో చేరిన తరువాత అంత అప్రదిష్టపాలయ్యారు. చిరంజీవి రాజకీయ ప్రస్తానం గురించి అందరికీ తెలిసిందే గనుక మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ నిన్న తుళ్ళూరులో పర్యటించినపుడు ఒకలాగా, హైదరాబాద్ తిరిగి రాగానే మరొకలా మాట్లాడి అభాసుపాలయ్యారని చెప్పక తప్పదు. అసలు ఇన్ని రోజులు మౌనంగా కూర్చొని ఆయన ఇప్పుడు ఇంత హటాత్తుగా తుళ్ళూరు పర్యటనకు ఎందుకు బయలుదేరారో, వెళ్లి వచ్చిన తరువాత మళ్ళీ అక్కడి ప్రజలు పిలిచినందునే వెళ్లాను...ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్దేశ్యం లేదని మళ్ళీ ఎందుకు అన్నారో తెలియదు కానీ పొంతనలేని మాటలు మాట్లాడి తన రాజకీయ అపరిపక్వతను మరొకమారు బయటపెట్టుకొని అభాసుపాలయ్యారు.   ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ విశ్లేషకులు ఆయన పర్యటన వెనుక మర్మం ఏమిటి? ఎవరి ప్రోద్బలంతో పర్యటనకు బయలుదేరారు? అంటూ అన్ని కోణాలలో నుండి చేసిన విశ్లేషణల వలన రాజకీయ వర్గాలలో మరింత చులకనయ్యారు. పైగా ఒకపక్క పార్టీ నిర్మాణం చేసుకోలేదని ఒప్పుకొంటూనే త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. లేదా ఉపఎన్నికలలో తన పార్టీ పోటీ చేయవచ్చని చెప్పుకోవడం హాస్యాస్పదం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇరువురూ రాజకీయాలలో రాణించలేరనే సంగతి కళ్ళకు కట్టినట్లు కనబడుతూనే ఉంది. కానీ వారిరువురూ ఇంకా రాజకీయాలకు అంటిపెట్టుకొని ఉండేందుకు ప్రయత్నిస్తుండటం వలన అభాసుపాలవుతున్నారని చెప్పవచ్చును.   రాజకీయలలో తల బొప్పి కట్టిన చిరంజీవి మెల్లగా మళ్ళీ సినీరంగం వైపు అడుగులు వేస్తుంటే, పవన్ కళ్యాణ్ తన కెరీర్ పతాక స్థాయికి చేరుకొన్న ఈ సమయంలో సినీరంగాన్ని వదిలిపెట్టి తనకు ఏమాత్రం అనుభవం లేని రాజకీయాల వైపు తప్పటడుగులు వేస్తున్నారు. జీవితంలో అత్యంత అమూల్యమయిన సమయంలో ఇటువంటి ప్రయోగాలు చేయడంకంటే తమ పరిధిలో సామాజికసేవ చేసినా అదే స్థాయి సంతృప్తి పొందవచ్చును.

యాదగిరి గుట్ట పేరు ఎందుకు మార్చుతున్నారో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతికి ఏ మాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు నడుం కట్టారు. అందుకోసం భారీగా ప్రణాళికలు సిద్దం చేసి నిధులు కూడా కేటాయించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అయితే అచ్చమయిన తెలంగాణా బాషకు అద్దం పడుతూ సామాన్య ప్రజలకు అర్ధమయ్యే ‘యాదగిరి గుట్ట’ పేరును వైష్ణవ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామి ‘యాదాద్రి’ మార్చడం విమర్శలకు తావిస్తోంది. చుట్టుపక్కల మూడు నాలుగు రాష్ట్రాలకు సుపరిచితమయిన యాదగిరి గుట్ట అనే పేరులో వారిరురువురికీ ఏమి లోపం కనబడిందో మరి తెలియదు. తిరుమల కొండను వెంకటాద్రిగా పిలుచుకొంటారు గనుక యాదగిరి గుట్టకు యదాద్రి అని పేరు పెట్టారేమో?   యాదగిరి గుట్ట ఆనుకొని ఉన్న మరో ఎనిమిది కొండలను కలుపుకొని ‘నవగిరులు’ అని పేరుతో వాటినీ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఆ ఎనిమిది కొండలకు కూడా చిన జీయర్‌ స్వామి పేర్లు పెడతారుట. తిరుమలకు ఏడు కొండలున్నాయి గనుక వాటి కంటే మరో రెండు కొండలు ఎక్కువే ఉండాలనుకొంటే అది చాలా హాస్యాస్పదమయిన ఆలోచన. అటువంటి ఆలోచనకు వైష్ణవ పీఠాధిపతి అయిన చిన జీయర్‌ స్వామి ఏవిధంగా ఆమోదం తెలిపారో మరి? యాదగిరి గుట్టను, దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ కొండ దిగువన ఉన్న ఊరుని వదిలిపెట్టి చుట్టుపక్కల కొండలను అభివృద్ధి చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం గురించి, అందులో వెలసియున్న లక్ష్మీ నృసింహ స్వామి వారి మహత్యం గురించి తెలుగు ప్రజలకు మళ్ళీ కొత్తగా ఎవరూ పరిచయం చేయనవసరం లేదు. ఆ పవిత్ర క్షేత్రాన్ని ఇన్నేళ్ళుగా ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా నిత్యం వేలాదిమంది భక్తులు దేశం నలుమూలల నుండి వచ్చి దర్శించుకొని వెళుతూనే ఉన్నారు. కనుక ఇప్పుడు యాదగిరి గుట్టకి మరో కొత్తపేరు పెట్టడం, దానికి మరో ఎనిమిది కొండలు కొత్తగా అనుసంధానం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే ఆలోచించాలి.   యాదగిరి గుట్టతో సహా దేశంలో ఏ పవిత్ర పుణ్యక్షేత్రాలయినా సరే అక్కడ సహజంగా వెలసిన దేవతామూర్తుల కారణంగానే వాటికి ఆ ప్రశస్తి, మహత్యం కలిగిఉన్నాయి. కానీ ఆ తరువాత కోట్లాది రూపాయలు కుమ్మరించి కట్టబడిన ఏ దేవాలయాలు కూడా అంతటి ప్రశస్తి, మహత్యం పొందలేదనే సంగతి గ్రహిస్తే ఇటువంటి ప్రయత్నాల వలన కొత్తగా ఎటువంటి ప్రయోజనము ఉండబోదని అర్ధం అవుతుంది. రాజకీయ నాయకులు తమ అజెండాలను అనుసరించి ఏవేవో నిర్ణయాలు తీసుకొంటుంటారు. అవి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవయితే మత గురువులను సంప్రదించడం సహజమే. అప్పుడు వారు తమ దృక్కోణంలోనే ఆలోచించి మార్గదర్శనం చేయాలి తప్ప వారే రాజకీయ నాయకుల ప్రభావానికిలోనయి వారికి అనుకూలంగా మాట్లాడటం ప్రజలు కూడా జీర్ణించుకోలేరు.   కనుక యాదగిరి గుట్టపై వేంచేసి ఉన్న నృసింహస్వామి వారికి నిత్య దూపదీప నైవేద్యాలు, ఇతర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయా లేదా? మాడవీధుల విస్తరణ, గుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యాలు వంటి వాటిపై ప్రభుత్వం,మటాధిపతులు దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది.

ప్రశ్నించడానికి ఇంత టైం తీసుకొంటే ఎలా పవనూ?

  నిజమే! పవన్ కళ్యాణ్ నిజాయితీని శంఖించడానికి వీలులేదు. ఆయన ఏది మాట్లాడిన చాలా నిజాయితీగా హృదయంతోనే మాట్లాడుతారు తప్ప సగటు రాజకీయ నాయకుడిలా ఎన్నడూ వ్యవహరించరని అందరికీ తెలుసు. ఆ కారణంగానే ఆయన రాజకీయాలకి అసలు సరిపోరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి నేటి వరకు కూడా సందిగ్ధంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన సోదరుడు చిరంజీవి ఎదుర్కొన్న చేదు అనుభవాలను చూసిన తరువాత కూడా ఆయన ఎంతో అట్టహాసంగా జనసేన పార్టీని స్థాపించారు. కానీ రెండో సమావేశంతోనే దానిని అటకెక్కించారు. అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పి అభిమానులను నిరాశపరిచారు.   తరువాత అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలిసి ఆయనకి మద్దతు తెలిపారు. అయితే బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ దానితో పొత్తులు పెట్టుకొన్న తెదేపా గురించి మాట్లాడకుండా చాలా రోజులు మౌనం వహించారు. కానీ తరువాత తెదేపాకు కూడా మద్దతు ఇచ్చేరు. ఆ రెండు పార్టీల తరపున ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో గట్టిగా ప్రచారం చేసారు. అవసరమయితే వాటినీ ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి ఆ తరువాత మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయారు.   గత తొమ్మిది నెలలుగా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. ఇరు రాష్ట్రాలు విభిన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయాలలో ఉండాలనుకొన్న ఏ వ్యక్తి అయినా ఇటువంటి సందర్భాలలో తప్పనిసరిగా స్పందిస్తాడని ప్రజలు ఆశిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు ఏ విషయంపైనా స్పందించలేదు. ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టి ఉండవచ్చును. కానీ సమయం కాని సమయంలో ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.   తుళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినపుడు అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి ఒక్క జనసేన తప్ప. భూసేకరణ విషయంలో కూడా అన్ని పార్టీలు స్పందించాయి. ఒక్క జనసేన తప్ప. పవన్ కళ్యాణ్ తెదేపాకు మద్దతు ఇస్తున్నారు గనుకనే స్పందించడం లేదని జనాలు సరిబెట్టుకొన్నారు. అందుకే ఆయనను ఎవరూ కూడా ప్రశ్నించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం పూర్తయిందని ప్రకటించి, రాజధాని నిర్మాణానికి శంఖు స్థాపన తేదీలను కూడా ఇంచుమించు ఖరారు చేసిన తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా ఊడిపడి భూసేకరణను తను వ్యతిరేకిస్తున్నానని, అవసరమయితే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని తను మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనే యుద్దం ప్రకటించడంతో ఆయన అభిమానులు, ప్రజలు, రాజకీయ నేతలు కూడా విస్తుపోయారు.   ఆయన భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్లయితే మరి ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉండిపోయారు. ఆ ప్రక్రియ ముగిసిన తరువాత ఇప్పుడు వచ్చి ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఒకవేళ ఆయన ఈ ప్రక్రియ ఆరంభం కాక మునుపే వచ్చి అడ్డుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే, బహుశః రాష్ట్ర ప్రజలు చాలా మంది ఆయనకు మద్దతు పలికేవారేమో. కానీ అంతా పూర్తయిన తరువాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడం వలన ఆయన ఏమి సాధించదలచుకొన్నారు?   రైతుల భూములు తిరిగి ఇప్పించాలని భావిస్తే, అదిప్పుడు సాధ్యమేనా? సాధ్యమేననుకొంటే రాజధాని నిర్మాణం నిలిపివేయాలా...లేక రాజధానిని వేరే చోటికి తరలించాలా? అనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.   ఇక ఇంతకాలం రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల గురించి కేంద్రప్రభుత్వం రేపు...మాపు...అంటూ  తిప్పిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? మోడీతో తనకున్న పరిచయాన్ని ఉపయోగించుకొని ఎందుకు ఆయనపై ఒత్తిడి చేయకుండా మౌనంగా ఊరుకొన్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత వచ్చి ఆయనని ప్రశ్నించడం వలన ఏమి ప్రయోజనం? కేంద్రాన్ని ఒప్పించే భాద్యత యంపీలదేనని ఒకపక్క చెపుతూనే మళ్ళీ మధ్యలో తను కలుగజేసుకోవడం ఎందుకు? తను కలుగజేసుకొన్నా ఎటువంటి ప్రయోజనమూ ఉండదని మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు?   రాజకీయాలలో ఉండదలచిన వ్యక్తులు ఎవరయినా సరే ఏ అంశంపైనైనా సరయిన సమయంలో స్పందించినపుడే దానికి ఒక విలువ, ప్రజల మన్ననలు ఉంటాయి. కానీ ఆనాడు నేను తెలంగాణా ఉద్యమాలకి ఎందుకు మద్దతు పలకలేదంటే...ఆనాడు నేను ఎన్నికలలో ఎందుకు పాల్గొననలేదంటే...ఆనాడు నేను భూసేకరణ గురించి ఎందుకు పోరాడలేదంటే...ఆనాడు నేను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించలేదంటే....అని సంజాయిషీలు చెప్పుకోవడాన్ని ఎవరూ హర్షించరు. రాజకీయాలలో అది పద్ధతి కాదు కూడా. కనుక ఇప్పుడు ఆందోళనకు, నిరాహార దీక్షలకు దిగడం కంటే, అటు రైతులు నష్టపోకుండా, రాజధాని నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించవచ్చో ఆలోచించి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇస్తే బాగుంటుంది.

పవన్ యాక్టింగ్ చూతము రారండీ...

  ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయింది. పవర్ స్టార్ వెండితెర మీద మాత్రమే కాదు... జీవితంలో కూడా బాగా నటించగలడని ఈ పర్యటన చెప్పింది. పవన్ కళ్యాణ్ తన పర్యటన సందర్భంగా ఆస్కార్ తరహా యాక్టింగ్ ప్రదర్శించి అక్కడి అమాయక జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం విజయవంతంగా చేశారు. అసలు పవన్ కళ్యాణ్ పర్యటనే ఒక గజిబిజి గందరగోళం నిండిన ప్లానింగ్ లేని పర్యటన. దీనికి తోడు వేలంవెర్రిగా పవన్ కళ్యాణ్ చుట్టూ మూగి గోలగోల చేసిన జనం... దానికి తోడు సుదీర్ఘ నటనానుభవం వున్న పవన్ కళ్యాణ్ గొప్ప నటన... ఇవన్నీ చూడటానికి రెండు కళ్ళుబదులు నాలుగు కళ్ళు వుంటే బాగుండనిపించేలా వున్నాయి.   పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రతి ఊరిలోనూ ఏదో హడావిడిగా రావడం, నిమిషానికి నాలుగుసార్లు తలని సవరించుకోవడం, ఏదో హడావిడిగా మాట్లాడేసి వెళ్ళిపోవడం. దీనికితోడు ఆయన మీద మీద పడిపోయే జనం. ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి తంటాలుపడేవాళ్ళు మరికాస్త గందరగోళం సృష్టించడం. ఇవి ఇలా వుంటే, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ తనకు కాస్త తిక్కుందని.. కానీ దానికో లెక్కుందనీ అంటూ వుంటారు. రాజధాని గ్రామాల్లో పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తుంటే తిక్క వరకు ఓకేగానీ, లెక్క విషయంలోనే ఏదో లెక్క తేడా వున్నట్టు అనిపిస్తోంది. పవన్ ప్రసంగంలో ఏదో ఆషామాషీగా మాట్లాడిన మాటలే తప్ప పకడ్బందీగా, అధ్యయనం చేసిన మాటలేవీ వినిపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదో భూ సేకరణ చట్టాన్ని తెచ్చిందట.. దాని గురించి ఆయనకి తెలియదట. తెలియకపోతే జనాల దగ్గరకి వచ్చేటప్పుడు దాని గురించి తెలుసుకుని వచ్చి మాట్లాడాలి.... ఏదో గాల్లో దీపం పెట్టినట్టు తెలియదంటే సరిపోతుందా? ఆయన రైతుల ఇబ్బందులను చూడ్డానికి వచ్చాడట. రైతుల ఇబ్బందుల గురించి మంత్రులకు చెప్తాడట. దారినపోయే దానయ్య లాంటి పవన్ కళ్యాణ్‌కే రాజధాని గ్రామాల రైతుల ఇబ్బందుల గురించి అర్థమైపోయినప్పడు, ఎప్పుడూ ఆ గ్రామాల్లోనే పర్యటిస్తూ అక్కడి రైతులతో మమేకమై వున్న రైతులకు వారి ఇబ్బందులు తెలియవా? పవన్ ప్రసంగంలో లోపాలు వెతికి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు.   ఇక పవన్ గారి యాక్టింగ్ గురించి వస్తే, ఒక వేదిక మీద ఆయన కోసం ఓ కుర్చీ వేశారు. ఆయన దాని మీద కూర్చోకుండా కింద చతికిలబడ్డారు. ఓ మహిళ తెచ్చిన సంచిలోంచి వాటర్ బాటిల్ తీసి తాగారు. ఆమె తెచ్చిన బాక్స్‌లోంచి ఆహారం తీసుకుని తిన్నారు. పాపం మధ్యలో బాగా చెమట పోస్తే ఓ రైతు భుజం మీద వున్న టవల్ తీసుకుని ముఖాన్ని తుడుచుకున్నారు. జనాల్లో కలిసిపోయినట్టు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తన మనసును కలచివేస్తున్నట్టు కటింగులు బాగానే ఇచ్చారు. అయితే ఇలాంటి కటింగులు జనాన్ని తాత్కాలికంగా మురిసిపోయేలా చేస్తాయి. జనానికి అసలైన ఆనందాన్ని ఇచ్చేది ఆచరణ.. ప్రాక్టికల్‌గా వారికి జరిగే న్యాయం ఆనందాన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లోనే వుంది. ఆ విషయాన్ని గ్రహించకుండా పవన్ చేసిన పర్యటన లేనిపోని గందరగోళాన్ని సృష్టించడం తప్ప సాధించిందేమీ లేదు.

ఆ మంత్రులకు త్వరలో మూడనుందా?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అంటే అది అందరి వల్ల అయ్యే విషయం కాదు. ఆలోచనల్లోగానీ, ఆచరణలోగానీ చంద్రబాబుతో సమానంగా కాకపోయిన ఆయనకు సంతోషం కలిగించే స్థాయిలో అయినా పని చేయగలగాలి. అలాంటి వారికే చంద్రబాబు నుంచి గౌరవం లభిస్తుంది. ఏదో ఆషామాషీగా వుండేవారికి పదవులు గట్రా దక్కినా ఆ తర్వాత అవి ఎలాగూ ఊడిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో వున్న కొంతమంది మంత్రుల పరిస్థితి ఇలాగే వుంది. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ‘రిజర్వేషన్లతో’ మంత్రిపదవులు పొందిన కొంతమంది చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా పనిచేయడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనించారు. పాత చంద్రబాబు అయితే వీరిని ఏనాడో ఇంటికి పంపించి వుండేవారు. కాకపోతే ఇప్పుడు ఆయన తన ‘కరడుగట్టిన క్రమశిక్షణ’ను కొంత సడలించుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా పదవుల్లో వున్నారు. తన అంచనాలకు తగ్గట్టుగా పని చేసి తీరాల్సిందేనని, మీ పని తీరు మార్చుకోవాల్సిందేనని చంద్రబాబు ఆ మంత్రులకు ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ కొంతమంది మీద పనిచేసింది. కొంతమంది ఎన్ని తంటాలు పడినా చంద్రబాబు అంచనాలకు చేరుకోలేక సతమతమైపోతున్నారు. మరికొందరు అలాంటి ప్రయత్నాలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వున్నారు. అలాంటి వారికి త్వరలో భారీ షాక్ తగలబోతోంది.   ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత సదరు మంత్రివర్యుల మీద వేటు వేసే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తమ సత్తా నిరూపించుకున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాంటి నాయకులు మంత్రి పదవులు లేకుండా వున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో వున్న ప్యాసింజర్ రైళ్ళ లాంటి వారిని లూప్ లైన్లో పెట్టేసి ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి నుంచి వారి వారి శాఖలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్న తర్వాత, ఈమధ్యకాలంలో వారు పనిచేసిన తీరును తెలుసుకున్న తర్వాత చంద్రబాబు సదరు మంత్రుల విషయంలో ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేసి, మార్పులు చేర్పుల్లో భాగంగా ‘ప్యాసింజర్ మంత్రులు’ అందరికీ విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ధీటుగా సమాధానం

  తుళ్ళూరు రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, రైతుల అభీష్టానికి విరుద్దంగా ప్రభుత్వం భూసేకరణ చేయవద్దని, అవసరమయితే తను వారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్దమని ప్రకటించారు. దీనిని మీడియా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చి దానిపై స్పందించవలసిందిగా కోరగా ఆయన ఈ విధంగా అన్నారు.   “రాజకీయ పార్టీలకు ప్రత్యేక ఎజెండాలుండవచ్చును. గానీ దూరదృష్టి కూడా ఉండాలి. అందునా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీకి మరింత దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. భూసేకరణ విషయంలో మేము అన్ని విషయాలను చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించిన తరువాతనే రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదో అదే చేస్తున్నాము. రాజధాని అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు. అదే అయితే ఒక ఐదు, పదెకరాల స్థలంలో కూడా కట్టుకోవచ్చును. అదీ కుదరదనుకొంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకొని అందులోను పెట్టుకోవచ్చును. కానీ అది రాజధాని అనిపించుకోదు. అటువంటి రాజధాని వలన రాష్ట్రానికి, ప్రజలకి చివరికి తుళ్ళూరు ప్రజలకి కూడా ఎటువంటి ప్రయోజనం చేకూరదు. మేము ప్రజలందరికీ, తుళ్ళూరు రైతులకి, భావితరాలకి కూడా ఉపయోగపడేవిధంగా ఒక గొప్ప ప్రజా రాజధానిని నిర్మించాలనుకొంటున్నాము."   "మా ఆశయం మంచిది గనుక రైతులు కూడా దానిని గుర్తించి ప్రభుత్వానికి తమ భూములను ఇచ్చి తోడ్పడ్డారు. ప్రపంచంలో మరెక్కడా కనీవినీ ఎరుగని విధంగా మన రైతులు ఏకంగా 32, 000ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించి అందులో రాజధాని నిర్మాణం చేయమని కోరారు. మేము రైతులను కన్నీళ్లు పెట్టించి తీసుకోలేదు. వారే స్వయంగా ముందుకు వచ్చి తమ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారికి మంచి భవిష్యత్ కల్పించే బాధ్యత నేను తీసుకొంటున్నాను."   "నిజమే! కొంత మంది రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాగని వారికి రాజధాని అవసరం లేదా? అంటే వారు కూడా రాజధాని తుళ్ళూరులోనే పెట్టమని అడుగుతారు. కానీ దాని కోసం తమ భూములు మాత్రం ఇవ్వబోరు. చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరూ త్యాగాలు చేసి అక్కడ రాజధాని నిర్మించబడితే, ఆ కొందరు రైతులు మాత్రం తమ భూములను అట్టేపెట్టుకొని, మిగిలిన గ్రామాల రైతులు చేసిన ఆ త్యాగాలకు ఫలితాలు పొందాలని ఆశిస్తున్నారు. ఇది న్యాయమేనా? కొందరికి ఒక న్యాయం మరి కొందరికి ఒక న్యాయం మంచి పద్ధతేనా?"   "వ్యక్తులు, రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత ఎజెండాలకు, రాజకీయ లబ్ధికి అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచించాలి. మా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన నిర్ణయాలు తీసుకొంటూ ముందుకు సాగుతోంది. మా ప్రయాత్నాలలో ఇప్పటికే అనేక అవరోధాలు ఎదురయ్యాయి. వాటినన్నీ దాటుకొని ముందుకు సాగాగలుగుతున్నాము అంటే రైతులు, ప్రజలు మాకు అండగా ఉన్నందునే. రాజకీయ పార్టీలదేముంది...తమ కార్యాలయాలకయితే కనీసం పదెకరాల స్థలం కావాలంటాయి, కానీ రాజధానికి మాత్రం వందో వెయ్యో ఎకరాలలో కట్టుకోమని ఉచిత సలహాలు ఇస్తుంటాయి. మేము అటువంటి వారి విమర్శలను, సృష్టించే అవరోధాలను చూసి భయపడి వెనక్కు తగ్గబోము."   "నాకివన్నీ అక్కరలేదు అనుకొంటే ఓ ఐదేళ్ళు పరిపాలన చేసుకొని దిగివెళ్లిపోవచ్చును. కానీ రాష్ట్రానికి, ప్రజలకు ఏదో మేలు చేయాలనే దృడ సంకల్పం ఉండబట్టే ఇంత తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా నిబ్బరంగా అడుగులు వేస్తూ ముందుకే సాగిపోతున్నాను. నా ఆలోచనలను, రాష్ట్ర ప్రజల కోసం నేను కంటున్నా కలలను అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు, రైతులు కూడా సహృదయంతో అర్ధం చేసుకొని సహకరించవలసిందిగా మరో మారు అందరినీ వినమ్రంగా కోరుతున్నాను,” అని అన్నారు.

భూసేకరణపై పవన్ కళ్యాణ్ వైఖరేమిటో?

  ప్రముఖ నటుడు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. రాజధాని భూసేకరణ విషయంలో ఆయన కూడా అభ్యంతరం చెప్పారు. కానీ ఆయన తెదేపాకు మద్దతు తెలుపుతున్నారు. గనుక ఈరోజు ఆయన చేయబోయే పర్యటనకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను, అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకొంటారు. కానీ ఆ తరువాత ఆయన ఈ వ్యవహారంపై ఏవిధంగా స్పందిస్తారనేదే చాలా ఆసక్తికరంగా మారింది.   ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తరువాత తుళ్ళూరు గ్రామాలలో పర్యటిస్తారని వార్త వెలువడగానే వైకాపా షాక్ తింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా అయన పర్యటిస్తే రైతులు మనసులు మార్చుకొంటారనే భయం కావచ్చును. లేదా ఈ అంశం నుండి రాజకీయ లబ్ది పొందేందుకు ఇంతకాలంగా చేస్తున్న తన పోరాటాన్ని ఆయన ఎక్కడ హైజాక్ చేసుకుపోతాడో అనే భయం కావచ్చును. అందుకే ఆయన చంద్రబాబు తరపున రైతులకు నచ్చజెప్పేందుకే తుళ్ళూరు పర్యటనకి బయలుదేరుతున్నారని ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఆయన పర్యటన ఉద్దేశ్యం ఏమిటో..ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో తెలియకుండానే చేతిలో బలమయిన మీడియా ఉంది కదాని ప్రచారం చేయడం అవివేకం.   మరికొద్ది సేపటిలో ఆయన తూళ్ళురు గ్రామాల రైతులతో మీడియా సాక్షిగానే మాట్లాడబోతున్నారు. మరి అటువంటప్పుడు తినబోతూ గారెల రుచి ఎలా ఉంటుందని ఆలోచించడం ఎందుకు?

జగన్ ట్విట్టర్‌కి దిక్కూమొక్కూ లేదు...

  అయ్యలారా.. అమ్మలారా.. అక్కలారా.. చెల్లెళ్ళారా.. మీకు దణ్ణం పెడతాం.. మా జగనన్న ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి.. ప్లీజ్.. అని జనాన్ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జగన్ మీడియాలో పనిచేస్తున్నవారికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, మొన్నీమధ్య జగన్ ప్రారంభించిన ట్విట్టర్ అకౌంట్‌కి ఫాలోవర్లు ప్రస్తుతం కొన్ని వేలల్లో మాత్రమే వున్నారు. ఇప్పటి వరకూ తన మీడియా ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నది చాలదన్నట్టు జగన్ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించి అందులో కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జగన్ సార్ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించడం ఆలస్యం ప్రపంచ వ్యాప్తంగా వున్న లక్షలాది మంది ఆయన ఫ్యాన్స్ ఆయన అకౌంట్‌ని ఫాలో అవుతారని, అతి కొద్దికాలంలోనే లక్షలాది మంది ఫాలో అయిన రాజకీయ నాయకుడిగా జగన్ నిలిచిపోతారని జగన్‌తో పాటు ఆయన మద్దతుదారులు కూడా భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి సీట్లు ఎక్కువ రాకపోయినా ఓట్లు బాగా వచ్చాయని జగన్ వర్గం ప్రచారం చేసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ట్విట్టర్లో చంద్రబాబు, లోకేష్ కంటే మా జగనే కింగ్ అని చెప్పుకునే ప్లాన్ వేశారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి ఆ ప్లాన్ తుస్సుమంది. జగన్ ట్విట్టర్ అకౌంట్ మొదలుపెట్టి వారాలు గడిచిపోయినా ఫాలో అయినవాళ్ళు కేవలం వేలల్లోనే వున్నారు. దాంతో జగన్ పార్టీ వర్గాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టాయి.   జగన్ మీడియాలో పనిచేస్తున్న వారందరూ జగన్ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవడంతోపాటు తమకు తెలిసినవాళ్ళందరి చేతా జగన్ ట్విట్టర్ అకౌంట్‌ని ఫాలో అయ్యేలా చేయించాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. అలాగే జగన్ పార్టీకి చెందిన వారందరూ తమకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా కొత్తగా క్రియేట్ చేసుకుని అయినా జగనన్న అకౌంట్ని ఫాలో అవ్వాలని కూడా ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. అలాగే బ్రదర్ అనిల్ కుమార్ కూడా జగన్ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్లను పెంచే విషయంలో తనవంతు కృషిని చేస్తున్నట్టు సమాచారం. ఇలా దిక్కూ మొక్కూ లేకుండా పోయిన జగన్ ట్విట్టర్ అకౌంట్‌ని పైకి లేపి నిలబెట్టడానికి ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తూ వున్నారు.

జనం కోసమే జీవిస్తున్న జగనన్ననే అనుమానిస్తే ఎలా?

  ఏమిటో...ఈ పాడు లోకం ఎప్పుడూ మంచి వాళ్ళనే అనుమానిస్తుంటుంది. నీతి నిజాయితీ, మడమ తిప్పని గుణం, ఇచ్చిన మాట కోసం ఎన్ని లక్షల మందినయినా ఓదార్చే ఓర్పు, నేర్పు అన్నీ ఉన్నా కూడా పాపం జగన్మోహన్ రెడ్డిని జనాలు ఇంకా అనుమానిస్తూనే ఉంటారు. తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రాప్రభుత్వంతో చెడుగుడు ఆడేసుకొంటుంటే మధ్యలో దూరడం భావ్యం కాదు కనుక ఆయన దూరంగా కూర్చొని చూస్తుంటే, దానికి జనాలు తప్పు పడతారు. ఆంద్ర ప్రయోజనాలు కాపడవలసింది పోయి ఆంధ్రాలో తెరాస ఏజంటుగా వ్యవహరిస్తున్నావంటూ దెప్పిపొడుస్తుంటారు. ఆంధ్రా ప్రయోజనాలను కాపాడటం లేదని ఆయనని ఆడిపోసుకొన్న వాళ్ళే, ఆయన రాష్ట్రానికి నిధులు విడుదల చేయమని అడిగేందుకు డిల్లీ వెళ్లి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిస్తే అనుమానంగా చూస్తూ ‘సీబీఐ కేసులు మాఫీ చేయించుకోవడానికే వెళ్ళేరేమో...ఏమో ఎవరికీ తెలుసు? అంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రజల కోసమే కేటాయించిన ఆయన సున్నితమయిన మనసుని కుళ్ళబొడిచేసి ఆనందిస్తుంటారు.   పోనీ డిల్లీ వెళ్ళకుండా పక్కనే ఉన్న తుళ్ళూరు వెళ్ళినా రాజధాని కట్టనీయకుండా సైంధవుడిలా అడ్డుతగులుతున్నాడు” అని ఆక్షేపిస్తారు జనాలు. కేంద్రం రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదు? పోలవరం కోసం, రాజధాని కోసం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? అని రాష్ట్రంలో జనాలు అందరూ గగ్గోలు పెట్టేస్తుంటే ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదంటూ జనాలు ఆయనను ప్రశ్నించడం మరీ అన్యాయం. ఎందుకంటే ఆయన ప్రశ్నించడం కోసం రాజకీయాలలోకి రాలేదు. ఏదోలాగ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకే జగన్ రాజకీయాలలోకి వచ్చిన సంగతి మరిచిపోయి, ఇలా మరొకరు చేయవలసిన పనిని ఆయనని చేయమనడం ఏమి బావుంది? ప్రశించడం కోసం వేరే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయనకు అధికారం అక్కరలేదు. అతనిని వదిలిపెట్టి మళ్ళీ రాష్ట్రానికి స్వర్ణ యుగం తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకొన్న వ్యక్తిని పట్టుకొని జనాలు ఇలా ప్రశ్నించడం ఏమీ బాలేదు.   ఏ రాజకీయ నాయకుడయినా ఏ అంశంపైనైనా స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయాడంటే అది కూడా వ్యూహాత్మకమేనని కొత్త సూత్రం కనుగొన్న తరువాత కూడా ఇలా జనాలు అపార్ధం చేసేసుకోనవసరం లేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిపోతోందని అందరూ గగ్గోలు పెడుతున్నప్పటికీ జగన్ సైలంట్ గా ఉండిపోతే దానినీ సీబీఐ కేసులకి లింక్ పెట్టేయడమేనా? ఎంత అన్యాయం? అయినా ఇప్పుడు మౌనంగా ఉండిపోయినంత మాత్రాన్న సీబీఐ కేసులు మాఫీ అయిపోతాయా...? అని కూడా ఆలోచించకుండా జనాలు నోటికి వచ్చినట్లు ఏవేవో చెప్పేసుకొంటుంటారు. ఈరోజు కాకపోతే రేపయినా బీజేపీతో జత కట్టేందుకే జగన్ బాబు వ్యూహాత్మకంగా సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నాడంటూ జనాలు తమ రాజకీయ పరిజ్ఞానం ప్రదర్శించేసుకొంటుంటే పాపం జగన్ మాత్రం ఏమి చేయగలడు?   డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిస్తే ఒక తప్పు. కేంద్రాన్ని ప్రశ్నించకపోతే మరో తప్పు అంటే ఇంకా ఎలాగా బ్రతాకాలి? మంచి వాళ్ళకే అన్ని కష్టాలు వస్తాయి. నీతి నిజాయితీని నమ్ముకొన్నవాళ్ళకే ఈ నీలాపనిందలు భరించవలసివస్తుంది. మడమ తిప్పలేని వాళ్ళకే ఆ నొప్పి ఏమిటో తెలుస్తుంది...కానీ జనాలకి ఇవేమీ అర్ధం కావు. కనుక ముఖ్యమంత్రి అయ్యే వరకు మౌనంగా భరించక తప్పదు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు? అనే ప్రశ్నకు ఆయనే జోస్యం చెప్పాలి. ఎందుకంటే అందులో ఆయనకు ఆయనే సాటి.   కానీ ఇంతకు ముందు ఎన్నికలలో చెప్పుకొన్న జోస్యాలేవే ఎందుకో ఫలించలేదు. ఎందుకేమిటి...తను నీతి నిజాయితీకి కట్టుబడిపోవడం వలననే ఓడిపోయాడు...లేకపోతేనా...అప్పుడు ఎన్నికల హడావుడిలో ఏవో తప్పు లెక్కలు కట్టుకోవడం వలన జోస్యం ఫలించలేదేమో గానీ ఇప్పుడు మరే పని లేదు కనుక ఈసారి చెపుతున్న జోస్యం ఫలిస్తుందని జగన్ తన చిలక సాక్షిగా చెపుతున్నాడు. కానీ ఇప్పుడు కూడా ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలిపోతుందో జోస్యం చెప్పగలుగుతున్నాడు గానీ తను ఎప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడో, తన భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు పాపం.

కోమటిరెడ్డి కుయ్యో మొర్రో

  హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మురికి గుంట హుస్సేన్ సాగర్‌ పూర్తిగా క్లీన్ అయిపోయి, మంచినీటి సరస్సుగా మారిపోయిందంటే నమ్మొచ్చుగానీ, కాంగ్రెస్ పార్టీ బాగుపడిందంటే మాత్రం ఎంతమాత్రం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడటం అనేది అసంభవం... అసంభవం.. అసంభవం. ఈ పార్టీ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల విషయం, అవినీతి, అక్రమాల సంగతి అలా వుంచితే, పార్టీలో లుకలుకల విషయంలో ఇలాంటి పార్టీ యావత్ ప్రపంచంలో మరొకటి వుండదు. పదవిలో వున్నవాడి మీద నిరంతరం ఏడ్చేవాళ్ళు పక్కనే వుంటారు. పదవి పొందినవాడి సీటు కిందకి నీళ్ళు తేవడానికి శాయశక్తులా ప్రయత్నించేవాళ్ళూ తక్కువమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప పార్టీ కాబట్టే ఇక ఈ పార్టీని ఇండియాలో ఉండనిస్తే లాభం లేదని దేశ ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ పార్టీని సాగనంపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. తెలంగాణ ఇచ్చిందన్న కృతజ్ఞత కూడా చూపించకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారు. ఇంత జరిగినా స్థానిక కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు రాకపోవడమే సహజమైన విషయం.   పొన్నాల లక్ష్మయ్య నిన్నటి వరకూ పీసీసీ అధ్యక్షుడిగా వుండేవారు. ఆయన పదవిలో ఉన్నంతకాలం ఆయన్ని ఎవరూ మనశ్శాంతిగా పనిచేయనివ్వలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పొన్నాల పీసీసీ అధ్యక్ష పదవికి అనర్హుడని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే విమర్శించేవారు. అలాంటివారిలో మొదటి వరసలో నిలిచిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అర్హులకే ఆ పదవి ఇవ్వాలని ఆయన గాఠ్ఠిగా చెప్పేవారు. అంటే నేనే అర్హుడిని కాబట్టి ఆ పదవి తనకే ఇవ్వాలన్నది ఆయన చెప్పకనే చెప్పేవారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన ఆవేదనలో సగాన్నే పట్టించుకుంది. మిగతా సగాన్ని వదిలేసింది. పీసీసీ అధ్యక్షుడిని మార్చాలన్న డిమాండ్‌ని నెరవేర్చింది. అయితే ఆ స్థానంలో కోమటిరెడ్డిని కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టింది. దాంతో అలిగిన కోమటిరెడ్డి తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఏకపక్షంగానే చేస్తుందన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్టున్నారు. పీసీసీ అధ్యక్షుడిని నియమించే ముందు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాలను తీసుకుని వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అంటే, అలా అభిప్రాయాలు తీసుకుని వుంటే అందరూ తనపేరే చెప్పేవారన్న అమాయకత్వంలో కోమటిరెడ్డి ఉన్నారన్నమాట. చాలామంది కాంగ్రెస్ నాయకులు కొత్త పీసీసీ అధ్యక్షుడికి సహకరించరని ఆయన అన్నారు. అంటే కాంగ్రెస్‌లో కుమ్ములాటల కుంపటి ఆరదన్న నిజాన్నే ఆయన నోటితో చెప్పారన్నమాట. కుమ్ములాడుకోండి.. మీ ఇష్టం వచ్చినట్టు కుమ్ములాడుకోండి.. మీరెంత కుమ్ములాడుకున్నా కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే చెడిపోయేదేమీ లేదు!

ఏపీకి మరో వెయ్యి కోట్లు?

  అడిగితే గానీ అమ్మ కూడా అన్నం పెట్టదని ఎవరు అన్నారో గానీ అది అక్షరాల కేంద్రప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుంది. బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకు కూడా కేంద్రం బడ్జెట్ లో పెద్ద షాక్ ఇవ్వడంతో వారి ఆగ్రహం ఎలా ఉంటుందో కేంద్రం రుచి చూడవలసి వచ్చింది. పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎన్డీయే ప్రభుత్వాన్ని రోజూ కడిగిపడేస్తుంటే, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, మీడియా మూకుమ్మడిగా బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి తలంటేస్తున్నారు. దానితో దిగివచ్చిన కేంద్రం హడావుడిగా రాష్ట్రానికి మరో వెయ్యి కోట్లు అధనంగా విడుదల చేసేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం.   కానీ రాష్ట్ర బడ్జెట్ లోటే వేల కోట్లు దాటిపోయున్నప్పుడు ఇప్పుడు అదనంగా మరో వెయ్యి కోట్లు విదిలించినంత మాత్రాన్న రాష్ట్రం ఒడ్డున పడుతుందా? ఇంత అరిచి గ్గీ పెట్టిన తరువాత మరో వెయ్యి కోట్లు విదిలిస్తున్న కేంద్రం, లక్షల కోట్లు వ్యయం అయ్యే పోలవరం ప్రాజెక్టు, రాజధాని, మెట్రో రైల్, అనేక ఉన్నత విద్యా వైద్య సంస్థలు, విమానాశ్రయాల నిర్మాణం కోసం ఎప్పుడు ఎంత ఇస్తుందో ఎవరికీ తెలియదు. కనుక కేంద్రంపై భారీ ఆశలు పెట్టుకోవడం వలన ఇదేవిధంగా తీవ్ర నిరాశ, నిస్పృహలే తప్ప మరేమీ ఉండక పోవచ్చును.

మరీ ఇంత అధికార దాహమా జగన్?

  ‘ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే...కంగారుపడకు నుయ్యి తవ్వడం మొదలుపెట్టేశా’ అన్నట్లుంది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు. తుళ్ళూరు రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్న ఆయన రైతులను ఓదార్చుతూ “తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల దగ్గర నుండి ప్రభుత్వం తీసుకొన్న భూములను తిరిగి ఇచ్చేస్తానని” లాంగ్ టర్మ్ హామీ ఒకటి ఇచ్చేసారు. అంతే కాదు “మరో రెండు మూడేళ్ళలో ఈ ప్రభుత్వం కూలిపోతుందని” జోస్యం కూడా చెప్పారు. రైతులు తమ గోడు వినిపించేందుకు వస్తే వారిని ఓదార్చివారి తరపున శాసనసభలో పోరాడుతానని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ అటువంటి సమయంలో కూడా తను అధికారంలోకి రావడం గురించే మాట్లాడటం, అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రభుత్వం కూలిపోతుందని కలలుగనడం చూస్తుంటే ఆయన అధికారం కోసం ఎంతగా తపించిపోతున్నారో, ముఖ్యమంత్రి కావాలని ఎంతగా ఆరాటపడుతున్నారో అర్ధమవుతోంది.   ఈ ఐదేళ్ళలో రైతుల దగ్గర తీసుకొన్న భూములలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరం నిర్మిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇస్తున్నారు? అని ప్రశ్నించుకొంటే ఆ హామీలో డొల్లతనం, అది ప్రజలకు ఆకట్టుకోనేందుకేనని అర్ధం అవుతుంది. ఇదివరకు ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ, తనకు 30 యంపీ సీట్లు, 125 యం.యల్యే. సీట్లు ఇచ్చినట్లయితే రాష్ట్రాన్ని కలిపి ఉంచుతానని హామీ ఇచ్చేరు. ఆయనకు అధికారం కట్టబెడితే విడిపోయిన రాష్ట్రాన్ని ఏవిధంగా కలుపుతారో ఎవరికీ తెలియదు. కానీ ఎన్నికల సమయం నాటికే ఆయన సమైక్యగానం పాడటం ఆపేశారు. ఆ తరువాత మళ్ళీ ఏనాడు ఆ ప్రసక్తి ఎత్తలేదు కూడా.   మళ్ళీ ఇప్పుడు కూడా అప్పటిలాగే తనకు అధికారం కట్టబెడితే, రైతుల భూములపై రాజధాని నగరం నిర్మించబడినప్పటికీ వారి భూములు వారికి తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇస్తున్నారు. అదెలాసాధ్యమో మళ్ళీ ఆయనే వివరిస్తే బాగుంటుంది. రైతులకు భూములు కావాలనుకొంటే తమ పార్టీకే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ ముందుగానే ప్రచారం మొదలుపెట్టేసినట్లుంది.   రాజకీయ పార్టీలన్నీ ప్రజాసేవే తమ పరమార్ధం అంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా చాలా సూటిగా అధికారమే తన పరమార్ధం, ముఖ్యమంత్రి కావడమే తన జీవిత లక్ష్యం అని ప్రతీ సభలో, సమావేశంలో, చివరికి ఓదార్పు యాత్రలలో కూడా చెప్పుకొంటుంటారు. రాజకీయ పార్టీలు, నేతలు అధికారం తపించిపోవడం సహజమే. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళిక, వ్యూహం వంటివి అవసరం. కానీ ఇల్లు కాలి ఏడుస్తున్న వారిని ఓదార్చి అధికారంలోకి వచ్చేయవచ్చని పగటికలలు కంటే అది ఆయనకే కాదు ఆయనని నమ్ముకొన్న పార్టీ నేతలకి, వేలాదిమంది కార్యకర్తలకీ కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది.

థాంక్యూ టెర్రరిస్టులూ... కాశ్మీర్ సీఎం...

  దాదాపు రెండు నెలల పాటు ఎడతెగని చర్చలు జరిపిన తరువాత ఎట్టకేలకు బీజేపీ, పిడిపి పార్టీలు కలిసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. భిన్న దృవాలవంటి తమ రెండు పార్టీల కలయికను తూర్పు పడమరలు కలిసిన వేళ అంటూ రెండు పార్టీల నేతలు వాటేసుకొని మరీ పొగుడుకొన్నారు. ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పిడిపి పార్టీ అధినేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.   అనంతరం ప్రధాని మోడీ సమక్షంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎన్నికలు ఇంత సజావుగా జరిగాయంటే అందుకు కారణం ఉగ్రవాదులు, కాశ్మీర్ విభజన వాదులు హుర్రియత్ నేతలు సహకరించడం వలననేని చెప్పక తప్పదు. అదే విషయం నేను ఇదివరకు ప్రధాని మోడీకి చెప్పాను. ఇప్పుడు అధికారికంగా మీకు కూడా చెపుతున్నాను. సరిహద్దుకి అవతల ఉన్నవారు మనకు సహకరించబట్టే ఇంత సజావుగా ఎన్నికలు నిర్వహించుకోగలిగాము. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలసిందే. ఎన్నికలను భగ్నం చేయడానికి ఒక చిన్న సంఘటన చాలు. కానీ వారు అటువంటి పనికి దేనికీ పూనుకోకపోవడం వలన మనం ఎన్నికలు నిర్వహించుకోగలిగాము. కాశ్మీర్ వేర్పాటువాదులు (హురియత్) నేతలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో శాంతి సుస్థితరతలు నెలకొల్పవలసి ఉంది. అందుకు భారత ప్రభుత్వం సహకారం కూడా కోరుతున్నాను,” అని అన్నారు.   ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నప్పుడు ప్రధాని మోడీ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన తక్షణమే ధీటుగా స్పందించి ఉండి ఉంటే బాగుండేది. కానీ ఆయన సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ మౌనం వహించినట్లున్నారు. ఆ తరువాత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయన మాటలను ఖండించారు. ఆ ఘనత అంతా భారత సైనిక దళాలకి, ఎన్నికల కమీషన్ కే చెందుతుందని, ముఫ్తీ సయీద్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు.   కానీ భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని, దేశ సమగ్రతను కాపాడుతానని కొద్ది సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ముఫ్తీ సయీద్, ప్రధాని సమక్షంలోనే పాక్ ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు ధన్యవాదాలు తెలుపుతుంటే, ఆయన మౌనం వహించడమే కాకుండా అటువంటి వ్యక్తి నడిపిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగడం ఏవిధంగా సమంజసమో బీజేపీయే చెప్పవలసి ఉంటుంది.   తమ ప్రభుత్వానికి అన్నిటికంటే మొదట భారతదేశానికి, రాజ్యాంగానికే ప్రాధాన్యత ఇస్తుందని, వాటి పరిరక్షనకే కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ లోక్ సభ సాక్షిగా కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పుడు పాక్ తీవ్రవాదులను, వేర్పాటువాదులను వెనకేసుకు వస్తున్న ఒక ముఖ్యమంత్రికి ఏవిధంగా మద్దతు ఇస్తున్నారు? అతనితో కలిసి ఏవిధంగా పనిచేస్తున్నారు?” అని ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రవాదులను వెనకేసుకు వస్తున్నప్పుడు ఇక తీవ్రవాదులను దేశంలో జొరబడకుండా అడ్డుకోవడం భద్రతాదళాలకు సాధ్యమేనా? అటువంటి పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి దానితో అధికారం పంచుకొంటే రేపు దేశంలో ఏ అనర్ధం జరిగినా అందుకు బీజేపీని కూడా ప్రజలు నిందించక మానరు. ఒకవేళ ఇప్పటికి ఎలాగో సర్దుకుపోయినా, ఉగ్రవాదులు, వేర్పాటువాదుల తరపున ఇంత నిర్లజ్జగా వాదిస్తున్న ముఖ్యమంత్రి రేపు వారితో సరిహద్దు భద్రతాదళాలు గట్టిగా వ్యవహరింబోయినప్పుడు అడ్డుపడితే అప్పుడయినా బీజేపీ, పిడిపీల మధ్య సంఘర్షణ చెలరేగి ప్రభుత్వం కుప్పకూలిపోక తప్పదు. కనుక బీజేపీ అధిష్టానం పిడిపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపే విషయంలో పునరాలోచించుకొంటే మంచిది.

పవన్ కళ్యాణ్ రాజకీయ ట్రిక్కు?

  ‘పవర్ స్టార్’, జనసేన పార్టీ అధ్యక్షుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వుండే రాజకీయ నాయకుడని ఇప్పటి వరకూ అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా సగటు రాజకీయ నాయకుడికంటే ఎంతమాత్రం వైవిధ్యం కాదని, ఆయన కూడా రాజకీయ ట్రిక్కులు ప్రదర్శించడం ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదివారం నాడు కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మీద, బడ్జెట్‌లో జరిగిన కేటాయింపుల మీద వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. మరోవైపు త్వరలో ప్రధానమంత్రిని కలిసేందుకు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు అంశాలు ఇలా వుండగా, ఆయన పనిలోపనిగా రాజకీయ ట్రిక్కులు కూడా ప్రదర్శించారని పరిశీలకులు అంటున్నారు. సోమ, మంగళవారాల్లో పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పర్యటించాల్సి వుంది. అయితే ప్రధానిని కలిసిన తర్వాతే ఆ గ్రామాలకు వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటనకు ముందు పవన్ కళ్యాణ్ సగటు రాజకీయ నాయకుడిగా ఒక వ్యూహం పన్నారని పరిశీలకులు అంటున్నారు.   మొన్నామధ్య పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలని, అన్నదాతకు అన్యాయం జరగకుండా చూడాలని ట్విట్టర్లో కామెంట్లు చేసి సంచలనం సృష్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుదారుడైన పవన్ కళ్యాణ్ అలాంటి ట్విట్లు చేయడం చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ ఇలా ట్విట్ చేశాడో లేదో అలా రాజధాని ప్రాంత రైతులు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుని ఒక ప్రదర్శన నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తమ ప్రాంతంలో పర్యటించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వాళ్ళు అలా డిమాండ్ చేశారో లేదో పవన్ కళ్యాణ్ ఇలా రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి డిసైడ్ అయ్యారు. అయితే సాధారణ ప్రజలందరికీ ఈ పరిణామాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి కాకతాళీయంగా జరిగిపోయినట్టు అనిపిస్తాయిగానీ, ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్ ఒక క్రమ పద్ధతిలో జరిగేలాచేసినవేనని పరిశీలకులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు తనను ఆహ్వానించడం వల్లే తాను ఆ గ్రామాల్లో పర్యటించానన్న ‘కలరింగ్’ రావడానికే పవన్ ఇదంతా చేశాడని చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ ఇష్యూని చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ చతురతను ప్రదర్శించడం మొదలుపెట్టారని అర్థమవుతోందని పరిశీకులు అంటున్నారు.