తెలంగాణాలో విద్యుత్ సంక్షోభానికి ఎవరు బాధ్యులు?
posted on Mar 11, 2015 @ 12:32PM
చంద్రబాబు నాయుడు ఇచ్చే కరెంట్ మాకు అక్కరలేదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న శాసనసభలో తెగేసి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తెలంగాణాకు రావలసిన విద్యుత్ ఇవ్వడం లేదని ఇంతవరకు ఆయనే వాదిస్తున్నారు. ఇప్పుడు అసలు అక్కరలేదని చెపుతున్నారు. ఆయన కత్తికి రెండు వైపులా పదునుంటుందని నిరూపిస్తూ చంద్రబాబు విద్యుత్ ఇవ్వలేదని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే, ఆ విధంగా చేసి తమకు మహోపకారం చేసారని చెప్పడం విశేషం. ఆయన విద్యుత్ ఇవ్వకపోబట్టే తాము ఈ విద్యుత్ సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కోగలిగామని చెపుతున్నారు. అంటే చంద్రబాబుదే తప్పు కానీ దానిని తానే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నానని చెపుతున్నారు.
ఆయన ఆవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? దాని వలన ఏమి జరుగుతుంది? అని ఆలోచిస్తే ఇప్పుడప్పుడే ఈ విద్యుత్ సంక్షోభం పరిష్కారం కాదని ఆయన కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నప్పటికీ అందుకు ప్రజలు ఆయనను కాక చంద్రబాబునే దోషిగా భావించే అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణాలో బలపడాలని ప్రయత్నిస్తున్న తెదేపాపట్ల ప్రజలలో విముఖత ఏర్పడేందుకు ఎంతో కొంత అవకాశం ఉంది.
తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడే మూడు నెలలలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు మరో ఒకటి రెండేళ్ళపాటు ఓపిక పట్టమని, అంతవరకు రైతులు, పరిశ్రమలు విద్యుత్ సమస్యలు ఎదుర్కోక తప్పదని చెపుతూనే, వారి ఆ కష్టాలకు చంద్రబాబే కారణమని చెపుతున్నారు. అంతేకాదు ఈలోగా ఎన్ని కష్టాలు ఎదురయినా ఆంధ్రప్రదేశ్ నుండి విద్యుత్ తీసుకోబోమని కూడా ఆయనే చెపుతున్నారు. అందుకు బలమయిన మరో కారణం కూడా ఆయనే చెప్పారు. ఆంధ్రా నుండి విద్యుత్ తీసుకొంటే, తిరిగి సగం ధరకే ఆంధ్రాకి విద్యుత్ ఈయవలసివస్తుందనే తాము ఆంధ్రా నుండి విద్యుత్ తీసుకోవడంలేదని చెప్పారు. మరి అటువంటప్పుడు చంద్రబాబుని ఎందుకు నిందిస్తున్నారు?
ఆయన తెలంగాణా రాష్ట్రానికి వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి ఆయన విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెపుతున్నారు. కానీ తెలంగాణా రాష్ట్రంతో పూర్తిగా అనుసంధానమయున్న విద్యుత్ సరఫరా వ్యవస్థలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ తీసుకొనేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఎందుకు?
తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 330 మెగావాట్స్ విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆయన తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కనీసం ఆయన ప్రతిపాదనపై స్పందించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఎందుకు?
తెలంగాణా రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమలకు వారానికి రెండేసి రోజులు పవర్ హాలీ డే విధించడంతో చిన్న,మద్యతరగతి పరిశ్రమలు అనేకం తీవ్రంగా నష్టపోయాయి. వాటి మీద ఆధారపడిన వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఒకమెట్టు దిగివచ్చి చంద్రబాబుతో ఈ విషయంపై నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఎందుకు?
ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం కనబడుతోంది. తెదేపాతో ఉన్న రాజకీయ వైరమే బహుశః అందుకు కారణం అనిపిస్తోంది తప్ప మరే ఇతర కారణాలు కనబడటం లేదు. అసలు రెండు రాజకీయ పార్టీల, వాటి అధినేతల మధ్య ఉన్న రాజకీయ వైరానికి మధ్యలో ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి? అనే ప్రశ్నకు జవాబు కోసం ఎవరిని అడగాలి?