ప్రశ్నించడానికి ఇంత టైం తీసుకొంటే ఎలా పవనూ?
posted on Mar 5, 2015 @ 8:07PM
నిజమే! పవన్ కళ్యాణ్ నిజాయితీని శంఖించడానికి వీలులేదు. ఆయన ఏది మాట్లాడిన చాలా నిజాయితీగా హృదయంతోనే మాట్లాడుతారు తప్ప సగటు రాజకీయ నాయకుడిలా ఎన్నడూ వ్యవహరించరని అందరికీ తెలుసు. ఆ కారణంగానే ఆయన రాజకీయాలకి అసలు సరిపోరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి నేటి వరకు కూడా సందిగ్ధంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన సోదరుడు చిరంజీవి ఎదుర్కొన్న చేదు అనుభవాలను చూసిన తరువాత కూడా ఆయన ఎంతో అట్టహాసంగా జనసేన పార్టీని స్థాపించారు. కానీ రెండో సమావేశంతోనే దానిని అటకెక్కించారు. అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పి అభిమానులను నిరాశపరిచారు.
తరువాత అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలిసి ఆయనకి మద్దతు తెలిపారు. అయితే బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ దానితో పొత్తులు పెట్టుకొన్న తెదేపా గురించి మాట్లాడకుండా చాలా రోజులు మౌనం వహించారు. కానీ తరువాత తెదేపాకు కూడా మద్దతు ఇచ్చేరు. ఆ రెండు పార్టీల తరపున ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో గట్టిగా ప్రచారం చేసారు. అవసరమయితే వాటినీ ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి ఆ తరువాత మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయారు.
గత తొమ్మిది నెలలుగా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. ఇరు రాష్ట్రాలు విభిన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయాలలో ఉండాలనుకొన్న ఏ వ్యక్తి అయినా ఇటువంటి సందర్భాలలో తప్పనిసరిగా స్పందిస్తాడని ప్రజలు ఆశిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు ఏ విషయంపైనా స్పందించలేదు. ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టి ఉండవచ్చును. కానీ సమయం కాని సమయంలో ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
తుళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినపుడు అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి ఒక్క జనసేన తప్ప. భూసేకరణ విషయంలో కూడా అన్ని పార్టీలు స్పందించాయి. ఒక్క జనసేన తప్ప. పవన్ కళ్యాణ్ తెదేపాకు మద్దతు ఇస్తున్నారు గనుకనే స్పందించడం లేదని జనాలు సరిబెట్టుకొన్నారు. అందుకే ఆయనను ఎవరూ కూడా ప్రశ్నించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం పూర్తయిందని ప్రకటించి, రాజధాని నిర్మాణానికి శంఖు స్థాపన తేదీలను కూడా ఇంచుమించు ఖరారు చేసిన తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా ఊడిపడి భూసేకరణను తను వ్యతిరేకిస్తున్నానని, అవసరమయితే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని తను మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనే యుద్దం ప్రకటించడంతో ఆయన అభిమానులు, ప్రజలు, రాజకీయ నేతలు కూడా విస్తుపోయారు.
ఆయన భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్లయితే మరి ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉండిపోయారు. ఆ ప్రక్రియ ముగిసిన తరువాత ఇప్పుడు వచ్చి ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఒకవేళ ఆయన ఈ ప్రక్రియ ఆరంభం కాక మునుపే వచ్చి అడ్డుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే, బహుశః రాష్ట్ర ప్రజలు చాలా మంది ఆయనకు మద్దతు పలికేవారేమో. కానీ అంతా పూర్తయిన తరువాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడం వలన ఆయన ఏమి సాధించదలచుకొన్నారు?
రైతుల భూములు తిరిగి ఇప్పించాలని భావిస్తే, అదిప్పుడు సాధ్యమేనా? సాధ్యమేననుకొంటే రాజధాని నిర్మాణం నిలిపివేయాలా...లేక రాజధానిని వేరే చోటికి తరలించాలా? అనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇక ఇంతకాలం రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల గురించి కేంద్రప్రభుత్వం రేపు...మాపు...అంటూ తిప్పిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? మోడీతో తనకున్న పరిచయాన్ని ఉపయోగించుకొని ఎందుకు ఆయనపై ఒత్తిడి చేయకుండా మౌనంగా ఊరుకొన్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత వచ్చి ఆయనని ప్రశ్నించడం వలన ఏమి ప్రయోజనం? కేంద్రాన్ని ఒప్పించే భాద్యత యంపీలదేనని ఒకపక్క చెపుతూనే మళ్ళీ మధ్యలో తను కలుగజేసుకోవడం ఎందుకు? తను కలుగజేసుకొన్నా ఎటువంటి ప్రయోజనమూ ఉండదని మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు?
రాజకీయాలలో ఉండదలచిన వ్యక్తులు ఎవరయినా సరే ఏ అంశంపైనైనా సరయిన సమయంలో స్పందించినపుడే దానికి ఒక విలువ, ప్రజల మన్ననలు ఉంటాయి. కానీ ఆనాడు నేను తెలంగాణా ఉద్యమాలకి ఎందుకు మద్దతు పలకలేదంటే...ఆనాడు నేను ఎన్నికలలో ఎందుకు పాల్గొననలేదంటే...ఆనాడు నేను భూసేకరణ గురించి ఎందుకు పోరాడలేదంటే...ఆనాడు నేను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించలేదంటే....అని సంజాయిషీలు చెప్పుకోవడాన్ని ఎవరూ హర్షించరు. రాజకీయాలలో అది పద్ధతి కాదు కూడా. కనుక ఇప్పుడు ఆందోళనకు, నిరాహార దీక్షలకు దిగడం కంటే, అటు రైతులు నష్టపోకుండా, రాజధాని నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించవచ్చో ఆలోచించి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇస్తే బాగుంటుంది.