బొత్స చేరితే బొబ్బిలి రాజాలు వైకాపా నుండి జంప్?

  కొత్తవాళ్ళ కోసం పార్టీకి, తనకు అత్యంత విశ్వాసపాత్రులయిన నేతలను వదులుకోవడం లేదా బయటకు పంపడం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తేమి కాదు. ఇదివరకు తెదేపా నేత దాడి వీరభద్రరావుని పార్టీలో చేర్చుకోవడం కోసం అత్యంత నమ్మకస్తుడయిన కొణతాల రామకృష్ణను దూరం చేసుకొన్నట్లే ఇప్పుడు వైకాపాలో చేరడానికి ప్రయత్నిస్తున్న బొత్స సత్యనారాయణ కోసం బొబ్బిలి యం.యల్యే సుజయ్ కృష్ణ రంగా రావు, ఆయన సోదరుడు బేబీ నాయనలను వదులుకొనే సూచనలు కనబడుతున్నాయి. గత పదేళ్ళుగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విభజన కార్యక్రమం మొదలయిననాటి నుండి క్రమంగా ఆయన ప్రతిష్ట మసకబారడం మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పీసీసీ అధ్యక్ష పదవిలో నుండి తప్పించి ఆ స్థానంలో రఘువీరారెడ్డిని నియమించడంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎటువంటి ప్రాధాన్యం లేదని స్పష్టమయిపోయింది.   ఆ తరువాత ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా అందరికీ తెలిసిన కొన్ని కారణాల వలన ఇంతవరకు ఆ పార్టీలో చేరలేకపోయారు. ఇక ఏకైక ప్రత్యామ్నాయం మిగిలిన వైకాపాలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.   కొద్ది రోజుల క్రితం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజయనగరంలోపార్టీ నేతలతో నిర్వహించిన ఒక సమావేశంలో బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోనే విషయంలో పార్టీ నేతల అభిప్రాయం కోరగా వారిలో చాలా మంది ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, ముఖ్యంగా బొబ్బిలి రాజాలుగా పిలువబడే సుజయ్ కృష్ణ రంగా రావు, ఆయన సోదరుడు బేబీ నాయన బొత్స సత్యనారాయణ చేరికను తీవ్రం వ్యతిరేకిస్తున్నారు. బొబ్బిలి రాజాలిరువురు ఇదివరకు కాంగ్రెస్ పార్టీని వీడటానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణే అని వారి అనుచరులు చెపుతుంటారు. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు బొత్సను వైకాపాలో చేర్చుకొంటే వారికి మళ్ళీ ఆయనతో ఇబ్బందులు తప్పకపోవచ్చును. కనుక వారు ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.   అయితే ఆయనకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినా వైకాపా నేతలు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను పార్టీలో చేర్చుకోవడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ చేరికను వ్యతిరేకిస్తున్న వారినందరినీ ఈ నెల 30న హైదరాబాద్ కి పిలిపించి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి మాట్లాడబోతున్నారు. కానీ వారందరూ బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకొన్నట్లయితే పార్టీని వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణను వైకాపాలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయనను వ్యతిరేకిస్తున్న వారి వాదన.   ఒకప్పుడు దాడి వీరభద్రరావు చేరికతో వైకాపాలో ఎటువంటి సంక్షోభం ఏర్పడిందో మళ్ళీ బొత్స సత్యనారాయణ చేరినట్లయితే అటువంటి సంక్షోభమే ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బొత్స సత్యనారాయణ చేరిక వలన వైకాపా విజయనగరం జిల్లాలో బలపడుతుందా లేక ప్రజలలో ఆయనకున్న వ్యతిరేకత కారణంగా కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిపోయినట్లుగా జిల్లా నుండి వైకాపా తుడిచిపెట్టుకుపోతుందా అనేది కాలమే చెప్పాలి.

కేసీఆర్ కల నిజమయ్యేనా?

ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టేసి అక్కడ ఆకాశహర్మాలు నిర్మించాలని,  పనిలోపనిగా ఎర్రగడ్డలో వున్న చెస్ట్ ఆస్పత్రిని కూల్చేసి అక్కడ తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న ఒక కల. తెలంగాణ రాష్ట్రానికి నూతన సచివాలయాన్ని నిర్మించడం కోసం ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనే ఆయన ప్రయత్నాన్ని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. నిజాం కాలం నాటి చెస్ట్ ఆస్పత్రిని కూల్చడానికి ఒప్పుకోమని, వాస్తు పేరుతో ఇప్పుడున్న సచివాలయాన్ని తరలిస్తే ఉపేక్షించమని హెచ్చరించాయి. ఎవరు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా నేను సచివాలయాన్ని మార్చడం ఖాయం అని కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు. దీనికోసం నిధులు కూడా విడుదల చేశారు. ఈ విషయంలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. చెస్ట్ ఆస్పత్రిని కూల్చేసి సచివాలయాన్ని నిర్మించే విషయం ఇప్పుడు కోర్టులో వుంది. కోర్టు అనుమతి ఇస్తేనే అక్కడ సచివాయం నిర్మించే అవకాశం వుంది. ఇదిలా వుంటే, ఈలోగా ఎర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మించే విషయంలో కేసీఆర్‌కు మరికొన్ని అడ్డంకులు ఎదురైనట్టు తెలుస్తోంది. ఎర్రగడ్డలో సచివాలయ నిర్మాణానికి పౌర విమానయాన శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయానికి వచ్చే విమానాలన్నీ ఎర్రగడ్డ ప్రాంతంలో వున్న రన్ వే మీదుగానే వెళ్తాయి. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంపై నిషేధం వుంది. కేసీఆర్ సచివాలయం నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతానికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. దాంతో కేసీఆర్ అక్కడ బహుళ అంతస్తుల కట్టడాలు కాకుండా, తక్కువ ఎత్తు వున్న భవనాలు నిర్మిస్తామని చెప్పినప్పటికీ పౌర విమానయాన శాఖ  వెనక్కి తగ్గనట్టు తెలుస్తోంది. దాంతో కేసీఆర్ కొత్త సచివాయాన్ని నిర్మించడానికి కొత్త ప్రదేశాన్ని వెతికారు. ఆ కొత్త ప్రదేశం మరెక్కడో లేదు. సికింద్రాబాద్‌లో వున్న పరేడ్ గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్‌లో సచివాలయాన్ని నిర్మించాలన్న ఆలోచన కేసీఆర్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ రెండు గ్రౌండ్స్  రక్షణశాఖ అధీనంలో వున్నాయి. ఇక్కడ సచివాలయం నిర్మించాలంటే రక్షణ శాఖ అనుమతి అవసరం. దీంతో కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్ళి రక్షణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రక్షణ శాఖ ఈ రెండు గ్రౌండ్స్‌ని తమకు ఇచ్చేపక్షంలో, రక్షణ శాఖకు హైదరాబాద్ నగర శివార్లలో భారీ వైశాల్యంలో స్థలాన్ని ఇవ్వడానికి కేసీఆర్ సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, కేసీఆర్ సచివాలయాన్ని తరలించే కల కన్నారు.. అయితే ఆ కల అంత సులభంగా నిజమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చెస్ట్ ఆస్పత్రి హెరిటేజ్ భవనం అనే కేసు కోర్టులో వుంది. దానికితోడు పౌర విమానయాన శాఖ నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. అలాగే కేసీఆర్ ఆశిస్తున్నట్టుగా సికింద్రాబాద్‌లోని రెండు గ్రౌండ్స్‌ని రక్షణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం సందేహాస్పదంగానే వుంది.  ఏరకంగా చూసినా కొత్త సచివాలయాన్ని కట్టాలన్న కేసీఆర్ కల నిజమవుతుందా  లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

పాపం... నేపాల్!

శనివారం నేపాల్ దేశంలోనే అత్యంత దురదృష్టకరమైన రోజు. శనివారం నాడు మధ్యహ్నం 12 గంటల ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ప్రశాంతంగా ఉండే నేపాల్ దేశంలో కల్లోలం సృష్టించింది. ఊహించని భారీ నష్టాన్ని కలిగించింది. కొండలు, లోయలతో వుండే ఈ దేశంలో ఎన్నో పురాతన కట్టడాలు వున్నాయి. వాటిలో చాలావరకు ఈ భూకంపం ధాటికి కూలిపోయాయి. రిక్టర్ స్కేలు మీద 8.1గా భూకంపం నమోదైంది. నేపాల్‌లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. అనేక రకాలుగా భారతదేశం మీద ఆధారపడి వున్న దేశం నేపాల్. ఇప్పుడు నేపాల్‌ని ఆదుకునే బాధ్యత ఇండియా మీదే వుంటుంది. ఇండియా నుంచి నేపాల్‌కి వెళ్ళాలంటే సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కొండ చరియల మీద నుంచే ప్రయాణించాలి. అనేక రోడ్డు మార్గాలు ఘాట్ రోడ్లుగానే వుంటాయి. అక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా సరైన రోడ్డు మార్గం నిర్మించుకోవడానికి అనుకూలంగా వుండదు. అందుకే భారత ప్రధాని నరేంద్రమోడీ ఆమధ్య నేపాల్ దేశానికి వెళ్ళినప్పుడు నేపాల్‌కి తక్షణం కావలసింది సరైన రోడ్డు మార్గమని చెప్పారు. ఇప్పుడు నేపాల్‌కు సహాయ కార్యక్రమాలు అందించడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం కూడా ఒక ఇబ్బందిగా మారింది. నేపాల్‌లో పురాతన భవనాలతోపాటు అనేక కొత్త భవనాలు కూడా ఈ భూకంపం ధాటికి కూలిపోయాయి. నేపాల్ చరిత్రకు ప్రతీకగా నిలిచే అనేక ప్రసిద్ధ కట్టడాలు కూడా నేలమట్టమయ్యాయి. వాటి కింద ఎంతోమంది చిక్కుకుపోయారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఇప్పటికే 2100 మంది మరణించారు. అనేకమంది శిథిలాల క్రింద కూరుకుని పోయారు. వారికి రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇతర దేశాల నుంచి సహకారం అందాలంటే విమాన మార్గం ద్వారా మాత్రమే వీలవుతుంది. అయితే ఎయిర్‌పోర్టులు కూడా బాగా దెబ్బతినడంతో విమానాలు వెళ్ళడం కూడా ఇబ్బందికరంగా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండూలో కూడా పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నేపాల్ ప్రజలు కూడా ఊహించని విధంగా క్షణాల్లో వచ్చిన ఈ పెను విపత్తు తెచ్చిన షాక్‌లో వున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి నేపాల్ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

మరోసారి మోసపోయావ్ తెలుగోడా

తెలుగువాడు మరోసారి మోసపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి అన్యాయం జరిగింది. ఇప్పటికే అన్యాయంతో, అవమానాలతో క్రుంగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద మరో పిడుగు పడింది.  కేంద్ర ప్రభుత్వం ఆ పిడుగును జాగ్రత్తగా తెలుగువాడి నడినెత్తిన పడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఇక ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆనాడు రాష్ట్ర విభజన జరిగే సమయంలో దుష్ట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మాయమాటలు చెప్పింది. ఆ విషయాన్ని విభజన చట్టంలో మాత్రం పొందుపరచలేదు. కాంగ్రెస్ ఐదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తానంటే... కాదు కాదు పదేళ్ళు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎంచక్కా చేతులు ఎత్తేసింది. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పేసింది. ఆనాడు విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పార్లమెంట్‌లో ఎంతో కరుణ రసాత్మకంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ప్రస్తావన తెస్తేనే చిరాకు పడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అన్యాయాన్ని నిరసించాలి.. ఎదిరించాలి... మోసం చేసినవాళ్ళకి గుణపాఠం చెప్పాలి.

పాపం... మంచిరెడ్డికి తప్పలేదు..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుకున్నంతపనీ చేస్తున్నాడు. టీడీపీకి గుడ్‌బై కొట్టేసి టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారు.  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయోగించిన ‘ఆకర్ష’ అస్త్రం విజయవంతంగా పనిచేసి మరో లక్ష్యాన్ని ఛేదించింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడాన్ని తెలంగాణ టీడీపీ లైట్‌గా తీసుకున్నట్టుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది. పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా టీటీడీపీ నాయకులు ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకేమీ ఢోకాలేదు అనే స్టేట్‌మెంట్ టీడీపీ నుంచి  వస్తూ వుంటుంది. అయితే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీ మారిపోవడం అనేది టీటీడీపిని మరింత కలవరపెట్టే అంశమే. అయినప్పటికీ ఆ కలవరపాటును బయటకి కనిపించనీయకుండా టీటీడీపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. తెలంగాణ టీడీపీ దృష్టిలో, రాజకీయాలను గమనించేవారి దృష్టిలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేసింది తప్పుగా అనిపించవచ్చు. అయితే ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే మాత్రం.. మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసింది తప్పు కాదని... తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన పార్టీ మారాల్సి వచ్చిందనే విషయం ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదుర్కొన్న పరిస్థితులు, నియోజకవర్గంలోని పరిస్థితులను చూసిన వారికి అర్థమవుతుంది. మంచిరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఇప్పటివాడేమీ కాదు... 30 సంవత్సరాలుగా పార్టీలో వున్నవాడు. పార్టీకి ఎంతో సేవ చేసినవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదుర్కొని నిలబడి విజయాన్ని సాధించినవాడు. తెలంగాణలో అధికారం ఎలాగూ రాలేదు.. పార్టీలో అయినా గౌరవనీయమైన పదవి వస్తుందేమోనని ఆశించాడు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి అడిగాడు. లేదన్నారు. విప్ పదవి అడిగాడు. లేదన్నారు. పోనీ టీటీడీ బోర్డు సభ్యుడి పదవైనా ఇవ్వండి మహప్రభో అని అడిగాడు.. కుదరదని చెప్పేశారు. దాంతో ఆయన ఒక విధమైన నైరాశ్యంలోకి వెళ్ళిపోయాడు. దీనికితోడు టీఆర్ఎస్ పకడ్బందీగా ప్రయోగించిన ‘ఆకర్ష’ పథకం కూడా ఆయన మీద బాగా ప్రభావం చూపించింది. ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో టీఆర్ఎస్ ఇప్పటికే బాగా చొచ్చుకుపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచుల లాంటి స్థానిక నాయకులు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటికే దాదాపుగా ఖాళీ అయిపోయింది. పాపం మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఒక్కడే ఒంటికాయ శొంఠికొమ్ములా మిగిలిపోయాడు.  ఆయన మాట వినేవాళ్ళుగానీ, వెంట నడిచేవారుగానీ లేకుండా పోయారు. అధికారులు కూడా మంచిరెడ్డి చెప్పిన పనులు చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇక నిధుల సంగతికి వస్తే సరేసరి. ఇలా ‘ఆకర్ష’ పథకానికి ఆద్యుడైన వైఎస్సార్ కంటే మరింత పర్‌ఫెక్ట్‌గా టీఆర్ఎస్ ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడంతో ఇక మంచిరెడ్డికి పార్టీ మారక తప్పని పరిస్థితులు వచ్చేశాయి. కార్యకర్తలే వెంట లేకుండా వుంటే నాయకుడు ఎమ్మెల్యే అయినా ఉపయోగం లేదు... సీఎం అయినా ఉపయోగం వుండదు. ఈ ఒత్తిడిని భరించలేక మంచిరెడ్డి టీఆర్ఎస్‌లోకి జంప్ కాక తప్పలేదు.  ఇదిలా వుంటే, ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటున్న మరో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా త్వరలో టీఆర్ఎస్‌లోకి వెళ్ళే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది.

మెంటలెక్కిస్తున్న మంచిరెడ్డి

  ఇబ్రహీంపట్నం తెలుగుదేశం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జనానికి మెంటలెక్కించేలా వున్నాడు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న ‘ఆకర్ష’ పథకంలో భాగంగా ఇతర పార్టీల్లో వున్న ఎమ్మెల్యేలకు ఎర వేసి లాక్కోవడం కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విడిచి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు చూసి ఎవరూ పెద్దగా షాక్ అవలేదు. కేసీఆర్ తలచుకుంటే ఎవరైనా పార్టీ మారాల్సిందేనని అందరూ మామూలుగా వున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చక్కగా టీఆర్ఎస్‌లో చేరిపోతే సరిపోయేది. కానీ ఆయన బుధవారం ఉదయం తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ, తన కంఠంలో ప్రాణం వుండగా తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పాడట. అది విని టీటీడీపీ వర్గాలు ‘మంచి’ మనిషిని అపార్థం చేసుకున్నామని అనుకున్నారట. ఆ తర్వాత గంటసేపటికే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలసి చాలాసేపు సమావేశమయ్యారు. రేపో ఎల్లుండో టీఆర్ఎస్‌లో చేరడానికి ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. మరి చేరేదేదో చేరిపోకుండా జనానికి మెంటలెక్కించే పనులేంటి మంచిరెడ్డీ?

హైదరాబాద్... ఓ 'గులాబీ' వనం

  హైదరాబాద్ మొత్తం గులాబీ రంగులో మునిగిపోయింది. ఇప్పుడు కానీ ఉపగ్రహం ఒక ఫోటో తీస్తే పింక్ కలర్ తప్ప ఏం కనిపించదేమో. హైదరాబాదా లేక గులాబీ వనమా అని అనిపిస్తుంది. త్వరలో టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి గాను ఆ పార్టీ సభ్యులు పెద్ద పెద్ద హోర్డింగులు, చిన్న చిన్న పోస్టర్లు అన్ని సైజులలో ఎక్కడ పడితే అక్కడ అతికించారు. పార్టీ నాయకులంతా పోటీ పడి మరీ ఎక్కడ చిన్న గోడలు కనిపించినా వదల్లేదు. ఆఖరికి మెట్రో రైలు పిల్లర్లకు కూడా అతికించేశారు. ప్లీనరీ నిర్వహించనున్న లాల్ బహదూర్ స్టేడియం, పబ్లిక్ మీటింగ్  నిర్వహించనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పోస్టర్లతో నిండిపోయింది. మంత్రులు పద్మారావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్లీనరీ ఏర్పాటు కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రి పద్మారావ్ సికింద్రాబాద్ ఏరియా మొత్తం కట్ ఔట్స్ తో నింపేశారు. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొనాలని టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించారు. ప్రతి ఒక్క పోస్టర్లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కొడుకు ఐటీ మంత్రి కేటీఆర్, కూతురు ఎంపీ కవిత, మేనల్లుడు నీటిపారుదుల శాఖ మంత్రి హరీష్ రావ్ నలుగురు ఫోటోలు మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి ఈ ప్లీనరీ పుణ్యమా అని హైదరాబాద్ లో పండుగు వాతావరణం కనిపిస్తోంది. 

స్మగ్లర్ ముదిరి ప్రొడ్యూసరయ్యాడు

తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. మరి స్మగ్లర్ ముదిరితే... ఏమైనా కావచ్చు.. ఎంత ఎత్తయినా ఎదగవచ్చు. సదరు స్మగ్లర్ గారికి రాజకీయ నాయకుల అండ కూడా వుంటే... ఎక్కడికో ఎదిగిపోవచ్చు... ఈ సూత్రానికి అనుగుణంగానే మస్తాన్ వలి అనే ఎర్రచందనం స్మగ్లర్ ఎక్కడికో ఎదిగిపోయాడు. కోట్లకు కోట్లు సంపాదించాడు.. ప్రొడ్యూసర్ అయి ఓ సినిమా కూడా తీశాడు. చివరికి పోలీసుల చేతిలోపడ్డాడు... మొన్నామధ్యే మూడు నెలలపాటు జైల్లో గడిపి బయటకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో  బిజీగా వున్నాడు. కర్నూలు జిల్లా చాగలమర్రి ప్రాంతానికి చెందిన మస్తాన్ వలి మొదట్లో ఆటో నడిపేవాడు. కూరగాయలు అమ్మేవాడు. ఇలా ఎంతకాలం బతకాలని అనుకున్నాడో ఏమోగానీ, ఒక్కసారిగా ఎర్రచందనం స్మగ్లర్ అవతారం ఎత్తాడు. పెట్రోలుకు నిప్పు తోడైనట్టుగా ఈయనకి రాజకీయంగా కూడా అండ దొరికింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మస్తాన్ వలి ఇటు రాజకీయంగాను, అటు స్మగ్లర్‌గానూ ఎదిగాడు. ఆటో నడుపుకునే వ్యక్తి అతి కొద్దికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. కార్లు, బిల్డింగ్స్, విలాసాలు, దర్జాలు... గట్రా.. గట్రా అతని జీవితంలో మామూలు విషయాలైపోయాయి. అప్పుడు అయ్యగారికి సినిమా ఇండస్ట్రీ మీద మోజు పుట్టింది. అంతే ఎంటర్ ద టాలీవుడ్ అన్నాడు. టాలీవుడ్‌లోకి ఎంటరైపోయిన మస్తాన్ వలి తన స్మగ్లర్ ప్రయాణంలో సంపాదించిన డబ్బుతో ‘ప్రేమ ప్రయాణం’ అనే సినిమా మొదలుపెట్టాడు. కొన్నాళ్ళపాటు షూటింగ్స్, ‘మీటింగ్స్’, ఆడియో ఫంక్షన్లు... ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు అని బాగానే కాలక్షేపం చేశాడు. చేతికి ఎముక లేనట్టుగా డబ్బు ఖర్చు పెడుతున్న మస్తాన్ వలీని చూసి టాలీవుడ్ జీవులు అబ్బ.. మన ఇండస్ట్రీకి మరో ‘మంచి’ ప్రొడ్యూసర్ వచ్చేశాడని మురిసిపోయారు. ఆ తర్వాత సదరు సినిమా విడుదలవటం, బాక్సాఫీసు దగ్గర ఢమాల్ అనడం సహజంగానే జరిగిపోయాయి. దాంతో మస్తాన్ వలీ మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ స్మగ్లింగ్‌లో బిజీ అయిపోయాడు. ఇవన్నీ కర్నూలు జిల్లా పోలీసులు తెలిపిన విషయాలు.

సింగపూర్ అనుభవం.. ఏపీలో అద్భుతం

సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే తొలిదశ ప్లాన్ అందింది. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ జూన్ నాటికల్లా అందే అవకాశం వుంది. పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ అందిన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణం పనులను ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది మనసులో వున్న ఒక సందేహానికి సమాధానం ఇవ్వాల్సి వుంది. అది... ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ ప్రభుత్వమే ఎందుకు చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సి.ఎల్.సి.) అనే సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సింగపూర్ నగరాన్ని ఈ సంస్థ చేసిన ప్లానింగ్ ప్రకారమే అభివృద్ధి చేశారు. ఇప్పుడున్న సింగపూర్ నగరం రూపొందడానికి యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది. ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ ఇప్పుడున్న అద్భుత నగరాన్ని సీఎల్‌సి సంస్థ రూపొందించింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో ఈ సంస్థకున్న సుదీర్ఘ అనుభవాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. రాజధాని నిర్మాణం అంటే ఒక బృహత్కార్యం. ఆ కార్యాన్ని సాధించడంలో సిఎల్.సి. సంస్థ తీరే ప్రత్యేకం. నగరాలను ప్లాన్ చేయడంలో ఆ సంస్థ సాధించిన నైపుణ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడబోతోంది. ఏ నగరాన్నయినా ప్లాన్ చేసే సమయంలో ఈ సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏపీ రాజధానిని కూడా ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రూపకల్పన చేస్తోంది. రాజధానిని మూడు దశల్లో అభివృద్ధి చేసుకునేలా ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. తొలిదశలో జరిగే అభివృద్ధికి కొనసాగింపుగానే రెండో దశ, మూడో దశలో జరిగే అభివృద్ధి వుంటుంది. ఏ దశలో జరిగే అభివృద్ధి అయినా మరో దశకు ఎలాంటి ఆటంకం కలిగించదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంలో వ్యవసాయం చాలా విస్తృతంగా జరుగుతోంది. భవిష్యత్తులో రాజధాని ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయ ప్రయోజనాలు దెబ్బతినకుండా వుండే విధంగానే ఈ సంస్థ తన మాస్టర్ ప్లాన్‌ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సంస్థ రాష్ట్రానికి పంపించిన తొలి విడత నమూనా ప్లాన్‌లోనే వ్యవసాయ భూములకు ఈ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టంగా అర్థమైంది. మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి.. సీఎల్‌సి సంస్థ అందించే పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ ‘ఆకుపచ్చగా’ ఉండబోతోందన్న అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి.

ఈ మృగాళ్లు మారరా?

  ఎన్నిచట్టాలొచ్చినా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మాత్రం ఆగటంలేదు. ఎంతో మంది యువతులు ప్రేమోన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనల గురించి వింటుంటే అసలు ఆడపిల్లలుగా పుట్టడమే తప్పా? అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, మనుషుల మధ్యనే ఉన్నామా అన్న సందేహం వస్తుంది. కొంతమంది ప్రేమించలేదని చంపేస్తారు, కొంతమంది ప్రేమించి చంపేస్తారు. మొత్తానికి ఆడవాళ్లను మాత్రం చంపకుండా ఉండట్లేదు ఈ ప్రేమోన్మాదులు. వాళ్లలో ఉన్న రాక్షసత్వానికి ఆడపిల్లలు బలైపోతున్నారు. అలా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించట్లేదని చంపడానికి వెళ్లి తనే ఆ అమ్మాయి తండ్రి చేతిలో చనిపోయాడు.     హైదరాబాద్ నగరం కూకట్ పల్లిలో ఓ కన్నతండ్రి ఓ ప్రేమాన్మాదిని కొడవలితో నరికి చంపిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఆ ప్రేమోన్మాది యువతిపై కొడవలితో దాడి చేసినప్పుడు ఆమె తండ్రి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కూతుర్ని కాపాడుకోవడం కోసం అతనిని చంపాడు. ఒకవేళ ఆ సమయంలో ఆ తండ్రి అక్కడ లేకపోతే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోంది. కుటుంబం మొత్తం అతని రాక్షసత్వానికి బలైపోయి ఉండేది.   సమాజంలో చైతన్యం ఎంత పెరిగినా కొంతమంది మృగాళ్ల మనసు మాత్రం మారటంలేదు. నిర్భయ చట్టం, షీ టీమ్ అంటూ ప్రభుత్వాలు ఆడపిల్లలకు ఎన్ని రకాలుగా రక్షణ కల్పించినా అవి ప్రేమోన్మాదుల్లో భయాన్ని మాత్రం కలిగించలేకపోయాయి. అసలు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిస్థితి మారేదెన్నడో... ఆడపిల్లలకు మంచి రోజులు వచ్చేదెప్పుడో.

ఇప్పుడేమంటారు... మిసెస్ సుహాసినీ మణిరత్నం?

భర్త సక్సెస్‌లో వుండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. భర్త ఫెయిల్యూర్స్‌లో పడిపోతే  ఏ భార్య అయినా విలవిలలాడిపోతుంది. ఆయన మళ్ళీ విజయాలు సాధించాలని కోరుకుంటుంది. ఈ సైకాలజీకి సినీనటి సుహాసిని కూడా అతీతమేమీ కాదు. తన భర్త మణిరత్నం ఎప్పుడూ సూపర్‌హిట్ సినిమాలు తీయాలని, ఆ సినిమాల రివ్యూలు రాసే మీడియావాళ్ళు అదరహో, బెదరహో అని పొగడాలని కోరుకోవడం న్యాయమే. అయితే పాపం మణిరత్నం ఈమధ్యకాలంలో అలా పొగిడించుకునే సినిమాలు తీయలేదు. మొన్నీమధ్య వరకూ ఈ సినిమా మణిరత్నమే తీశాడా... లేక తన అసిస్టెంట్ డైరెక్టర్‌తో తీయించాడా అనే సందేహం వచ్చే సినిమాలే తీశాడు. ఈమధ్యకాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తాపడటమే కాదు... విమర్శకుల నుంచి కూడా అక్షింతలు జల్లించుకున్నాయి. ఇది సుహాసిని మణిరత్నానికి ఎంతమాత్రం నచ్చలేదు. తన భర్త గొప్ప కళాఖండాలు తీస్తున్నప్పటికీ మీడియావాళ్ళు, రివ్యూలు రాసేవాళ్ళు వాటిని కావాలనే చెత్తసినిమాలని రాస్తున్నారని అపోహ పడిపోయారు. మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘ఓకే బంగారం’ మీద కూడా అలాగే బ్యాడ్ రివ్యూలు రాసేస్తారని ఆమె భయపడిపోయారు. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భర్త సినిమాల రివ్యూలు ‘క్వాలిఫైడ్ క్రిటిక్స్’తోనే చేయించాలని షరతులు విధించారు. అనర్హులు రివ్యూలు చేయడం వల్లే మంచి సినిమాలు అన్యాయమైపోతున్నాయని ఫీలయ్యారు. సుహాసిని మేడమ్ అలా అంటే, మణిరత్నం మాత్రం సుహాసిని ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడింది... రివ్యూలు ఎవరైనా చేయొచ్చు... రివ్యూలు ఫలానావాళ్ళే రాయాలని చెప్పడం న్యాయం కాదు అంటూ మీడియా దాడి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. మణిరత్నం ‘ఓకే బంగారం’  శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా చాలా బాగుందని రివ్యూలు వచ్చాయి. ఎవరు రివ్యూ రాసినా ‘ఓకే బంగారం’ బాగుందనే రాశారు. తమిళనాడులో మాత్రమే కాదు.... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సినిమా బాగుందనే రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి రివ్యూలు రాసినవాళ్ళందరూ గతంలో రివ్యూలు రాసినవాళ్ళే. సుహాసిని మేడమ్ గారు చెప్పారు కదా అని ఎక్కడినుంచో ‘క్వాలిఫైడ్ క్రిటిక్స్’ వచ్చి రివ్యూలు రాయలేదు. గతంలో మణిరత్నం సినిమాలు బాగాలేదని రివ్యూలు రాసినవాళ్ళే ఇప్పుడు ‘ఓకే బంగారం’ సినిమా బాగుందని రివ్యూలు రాశారు. మరి ఇప్పుడు సుహాసిని గారు ఏమని సమాధానం చెబుతారు? రివ్యూలు ఫలానావాళ్ళు రాస్తేనే బాగా రాస్తారనే అపోహలను ఆమె ఇప్పటికైనా వదిలించుకుంటారా? రివ్యూలు రాసేది ఎవరైనా సినిమా ఎలా వుంటే అలాగే రాస్తారు. మణిరత్నం మీదో, సుహాసినిమీదో, మరో సినీ ప్రముఖుడి మీదో కోపమో, ద్వేషమో పెట్టుకుని రివ్యూలు రాయరు. పాపం రివ్యూలు రాసేవాళ్ళమీద సుహాసిని పెట్టుకున్న అపనమ్మకం నిజమే అయితే ‘ఓకే బంగారం’ సినిమా కూడా బాగాలేదని రాసేవాళ్ళే కదా! ఏమంటారు సుహాసిని గారూ? అంచేత సుహాసిని గారూ... మణిరత్నం గారు కావచ్చు... మరే సినిమా మేకర్ అయినా కావచ్చు... మంచి సినిమాలు తీయండి... మంచి రివ్యూలు అందుకోండి.. అంతేతప్ప మీ సినిమాకు మీరు కోరినట్టుగా రివ్యూలు రాయాలని, ఫలానా వాళ్ళే రివ్యూలు రాయాలని కోరుకోవడం అత్యాశ మాత్రమే కాదు.. దురాశ కూడా అవుతుంది. మీడియాతో ఎలా మెలగాలో మీ భర్తగారికి తెలిసిన దాంట్లో మీకు కొద్దిగా కూడా తెలిసినట్టు లేదు... కొంచెం ఆయన్ని అడిగి తెలుసుకోకూడదూ!?

కేజ్రీవాల్... ఇంత దుర్మార్గుడివా...

మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కినప్పటికీ ఆయన మీద దేశ రాజకీయ వర్గాల్లో సదభిప్రాయం లేదు. ఢిల్లీ ప్రజలు ఆయన్ని గుడ్డిగా నమ్మేశారనే ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మూణ్ణాళ్ళ ముచ్చటగా ఆ పదవిలో వుండి, చేతులారా రాజీనామా చేసి, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాడు. ఆ సమయంలో అందరూ ఇక కేజ్రీవాల్ పని అయిపోయినట్టే అని భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తామని హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పటి వరకూ ఒరగబెట్టింది శూన్యం. పార్టీలో అంతర్గత విభేదాలు, పగలు, ప్రతీకారాలతోనే కాలం గడిచిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేధావుల కూటమి అని జనం భావించడం వల్లే జనం అధికారం ఇచ్చారని, కేజ్రీవాల్ ముఖం చూసి ఓట్లు వేయలేదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే ఇప్పుడు ఆ మేధావులు అనుకున్నవారే ఆధిపత్యం కోసం, అధికారం కోసం తిట్టుకుంటూ రోడ్డుమీదకు ఎక్కుతున్నారు. ఢిల్లీ ప్రజలు పశ్చాత్తాపపడేలా చేస్తున్నారు. ఇదంతా ఇలా వుంటే, అరవింద్ కేజ్రీవాల్ దుర్బుద్ధి, దుర్మార్గపు బుద్ధి ఇటీవల బయటపడింది. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కేజ్రీవాల్ మీద చేసిన ఆరోపణలు దేశ రాజకీయ రంగం మొత్తం నివ్వెరపోయేలా చేశాయి. అసలు అరవింద్ కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చింది సమాజసేవకుడు అన్నా హజారే కారణంగానే. అలాంటి అన్నా హజారే చనిపోవాలని కేజ్రీవాల్ కోరుకున్నాడంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు.. ఎందుకంటే ఈ ఆరోపణ చేసింది ఏ రాజకీయ ప్రత్యర్థో కాదు... ఏ పార్టీకీ చెందని స్వామి అగ్నివేష్. లోక్‌పాల్ బిల్లుకు అనుకూలంగా అన్నా హజారే నిరాహారదీక్ష చేసిన సమయంలో ఆయన చనిపోతే బావుండని కేజ్రీవాల్ భావించారట. ఆయన నిరాహారదీక్ష చేస్తూ చనిపోతే ఆ సందర్భంగా వచ్చే సానుభూతి పవనాలను తనకు అనుకూలంగా మలచుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారట. అందుకే అన్నాహజారే ఆరోగ్య పరిస్థితి విషమించినప్పటికీ, ఆయన దీక్షను మరో పదిహేను రోజుల పాటు పొడిగించేలా చేయడానికి ప్రయత్నించాడట. హమ్మ కేజ్రీవాలూ.. నువ్వు మరీ ఇంత దుర్మార్గుడివా..?

జగన్‌ ఖేల్ ఖతమయ్యేదే.. జస్ట్ మిస్....

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులకు ఎలా ఆటంకం కలిగించాలా ఆన్న ఆలోచనలో ప్రస్తుతం  వైసీపీ అధినేత జగన్ వున్నారు. దానికోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలోని ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నాన్ని మొదలెట్టారు. దానికోసం ప్రాజెక్టుల యాత్రని చేపట్టారు. అయితే మంగళవారం నాడు వైసీపీలో జరగాల్సిన పరిణామాలు చివరి క్షణంలో ఆగిపోయాయి. ఆ పరిణామాలే కనుక జరిగి వుంటే, జగన్ పొలిటికల్ ఖేల్ ఖతమ్ అయిపోయి వుండేది. అప్పుడాయన ప్రాజెక్టుల యాత్రని పక్కన పెట్టి, రాజకీయ పతన యాత్రని  చేయాల్సి వచ్చేది. అసలింతకీ చివరి క్షణంలో ఆగిపోయిన ఆ పరిణామాలేంటి? జగన్ వ్యవహార శైలి ఆ పార్టీలో వున్న ఎమ్మెల్యేలకు మొదట్నుంచీ నచ్చడం లేదు. జగన్ నుంచి దూరంగా పారిపోవాలన్న ఆలోచనలు ఎమ్మెల్యేలలో ఎప్పటి నుంచో వున్నాయి. ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తు్న్న అడ్డగోలు పోరాటం చాలామంది ఎమ్మెల్యేలకు ఎంతమాత్రం నచ్చడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలుగా వున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిల్లో జగన్‌ వెనుక నిలబడి అరుస్తున్నారు అంతే! ఇటీవలి కాలంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరు వారికి ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల విషయంలో జగన్ వైఖరిని బాహాటంగానే ఖండించారు. జగన్ వ్యవహారశైలితోపాటు, ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం చాలామంది ఎమ్మెల్యేలకు ఇబ్బందిగానే వుంది. వైసీపీ నుంచి విముక్తి లభించే ముహూర్తం ఎప్పుడొస్తుందా అని వారంతా ఎదురుచూస్తున్నారు. ఆ దివ్యమైన ముహూర్తం మంగళవారం నాడు రానే వచ్చింది. మంగళవారం నాడు జగన్ ప్రాజెక్టుల వ్యతిరేక యాత్ర కోసం బస్సు ఎక్కి వెళ్ళగానే, వైసీపీకి మంగళం పలుకుదామని 40 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. జగన్ బస్సు యాత్రకి సన్నాహాలు చేసుకుంటూ వుంటే, ఈ 40 మంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి బయటకి వెళ్ళిపోయే సన్నాహాలు ముమ్మరం చేసుకున్నారు. జగన్ అలా బస్సు ఎక్కగానే ఇలా పార్టీని చీల్చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీకి ఉన్న మెజారిటీలో సగానికి పైగా వున్న ఈ 40 మంది జగన్‌కి జలక్‌ ఇచ్చారంటే అది జగన్‌కి రాజకీయంగా పెద్ద షాక్. ఆయన పెట్టిన పార్టీ ఆయన చేతుల్లోంచి జారిపోయే అవకాశాలు కూడా వున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది తనకు షాక్ ఇవ్వబోతున్నారన్న విషయం ఎలా తెలిసిందోగానీ జగన్‌కి తెలిసింది. దాంతో ఆందోళనకు గురైన ఆయన ఆ ఎమ్మెల్యేలతో టచ్‌‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు తమకు జగన్ని కలిసే ఉద్దేశం లేదని, పార్టీని చీల్చడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. దాంతో జగన్ ఆపద్బంధువు వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి 40 మంది ఎమ్మెల్యేల కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని జగన్‌కి వారికి భేటీని ఏర్పాటు చేశారు. ఆ భేటీలో జగన్ వాళ్ళని ప్రాధేయపడిన తీరు చూస్తే శత్రువులకు కూడా కన్నీరు వచ్చేదట. ఆ స్థాయిలో బతిమాలడంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు శాంతించి తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నామని చెప్పారట. మీరు తలపెట్టిన ప్రాజెక్టుల యాత్ర పూర్తి చేసుకుని రండి... మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నారట. అప్పటికీ జగన్‌కి భయం తగ్గలేదు. తాను అలా బస్సు ఎక్కి వెళ్ళగానే, ఇక్కడ వీళ్ళు ఇలా ప్లేటు ఫిరాయిస్తే ఎలా అనే సందేహం ఆయన్ని పీడించింది. దాంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు కూడా తనతోపాటు ప్రాజెక్టుల యాత్రకి రావాల్సిందేనని బతిమాలి ఒప్పించాడట. ఇలా జగన్‌కి ప్రస్తుతానికి ఒక గండం గడిచింది. వైసీపీలో బద్దలు కాబోయే అగ్ని పర్వతం ప్రస్తుతానికి శాంతించింది. ఆ అగ్నిపర్వతం ఎప్పటికైనా బద్దలయ్యేదే!

తెరాస ప్రభుత్వంపై వైకాపా విమర్శలు!!!

  రాష్ట్ర విభజన తరువాత నుండి నేటి వరకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు, గొడవలు తలెత్తాయి. కానీ ఏనాడు కూడా వైకాపా ఏ అంశం మీద గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరాస అనధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ ఏదో ఒక అంశం తీసుకొని ధర్నాలు, బస్సు యాత్రలు చేసే వైకాపా ఏనాడు కూడా ఆంద్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీయలేదు. అందుకు కారణం ఆ రెండు పార్టీల మధ్య ఎవరికీ అర్ధం కాని అనిర్వచనీయమయిన అనుబంధమే. బహుశః ఆ రెండు పార్టీల ఉమ్మడి శత్రువు తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కారణంగానే తూర్పు పడమర వంటి ఆ రెండు పార్టీలు దగ్గరయ్యాయో లేక ఇంకేమయినా బలమయిన కారణాలున్నాయో వారే చెప్పాలి.   అయితే ఇంతవరకు ఆ రెండు పార్టీలు ఒకదానినొకటి విమర్శించుకోకుండా చాలా జాగ్రత్తగా రైలు పట్టాల మాదిరిగా సమాన దూరం పాటిస్తు పయనిస్తున్నాయి. కానీ ఇప్పుడు వైకాపా తిరిగి తెలంగాణా రాష్ట్రంలో పునః ప్రవేశం చేయాలనుకోవడంతో అధికార తెరాసపై బాణాలు ఎక్కుపెట్టక తప్పడం లేదు. నిన్న ఇల్లెందులో జరిగిన వైకాపా కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.   తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను, రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.   అయితే ఆయన చేస్తున్న ఈ విమర్శలు తెలంగాణాలో మళ్ళీ పార్టీ ఉనికిని చాటుకొనేందుకా లేక త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. ఎన్నికలలో హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను బుట్టలో వేసుకోవడానికా అనేది ఎన్నికల తరువాత గానీ తెలియదు.   పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అధికార దాహంతోనే కొంతమంది నేతలు పార్టీని వీడిపోయారని ఆరోపించారు. కానీ కొండా సురేఖ వంటి అనేకమంది తెలంగాణా నేతలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే ఆయన మరణించిన తరువాత తమ పదవులు, అధికారం అన్నీ వదులుకొని వైకాపాలో చేరారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణాలో చాలా ఉదృతంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కూడా వారు వైకాపానే అంటిపెట్టుకొని ఉన్నారు తప్ప పార్టీ మారాలనుకోలేదు. కానీ ‘మడమ తిప్పను మాట తప్పను’ అని నిత్యం గొప్పలు చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరుగబోతోందనే విషయం పసిగట్టి తననే నమ్ముకొని వచ్చిన వారినందరినీ నడిరోడ్డు మీద వదిలేసి రాత్రికి తెలంగాణానుండి జంప్ అయిపోయారు. తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసిన కొండా సురేఖ వంటి అత్యంత విశ్వసనీయులకే హ్యాండిచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు పొంగులేటి వంటి మిగిలిన నేతలకి హ్యాండివ్వకుండా ఉంటారా? అని ఎవరికయినా సందేహం కలుగకమానదు.   ఈరోజు పొంగులేటి వంటి నేతలు తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు తెరాస ప్రభుత్వాన్ని విమర్శించవచ్చును. కానీ రేపు జి.హెచ్.యం.సి. ఎన్నికలు ముగిసిన తరువాత మళ్ళీ అదే తెరాసతో అంటుకడదామని జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?అని వారే ఆలోచించుకోవలసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్ - లోకేశ్ యాత్రల ఆంతర్యం ఏమిటి?

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వర్గాలు నారా లోకేశ్ చేస్తున్న పరామర్శ యాత్ర, జగన్ చేపట్టిన ప్రాజెక్టుల యాత్రల పై ఆసక్తిగా చూస్తున్నాయి. ఇద్దరూ ఒకేసారి  యాత్రలు చేపట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాయి.   చంద్రబాబు బాటలోనే నారా లోకేష్ కూడా పయనిస్తున్నారు. ఎలాగైతే చంద్రబాబునాయుడు కార్యకర్తల మనిషిగా పనిచేసి ఇంతటి స్థాయికి ఎదిగారో అలాగే నారా లోకేశ్ కూడా కార్యకర్తల మనిషిగా ఉండి ఎదగాలనుకుంటున్న విషయం అర్ధమవుతోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఓవరాక్షన్ చేయడంతో అతను పార్టీకి దూరమయ్యాడు. బాలకృష్ణ కూడా తన సినిమాలు, ఎమ్మెల్యే పదవితో బిజీగా ఉన్నారు. అందువల్ల బయటి ప్రచారాలలో ఎక్కువగా కనిపించని లోకేశ్ ఈ సమయంలో కార్యకర్తలు, పార్టీ నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బలంతోనే తను 2019న జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవి చేపట్టాలనే చూస్తున్నారని అంటున్నారు. తను దీనిలో భాగంగానే ఆయన కడపజిల్లాలో పర్యటించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు నారా లోకేశ్ కు ఘన స్వాగతం అందించి, ప్రజల మనిషి అయిన చంద్రబాబులాగానే నారా లోకేశ్ కూడా కార్యకర్తలతో కలిసి పోతున్నందుకు చాలా సంతోషం వ్యక్త పరిచారు. తండ్రిలా చురుకైన మాటలు మాట్లాడుతూ, అప్పుడప్పుడు జగన్ పై చురకలు వేస్తుంటే కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలు వేశారు.   మరోవైపు ప్రజలలో తన ఉనికి తగ్గిపోతోందని జగన్ భయపడుతున్నాడో ఏమో ప్రాజెక్టుల యాత్ర పేరిట యాత్ర ప్రారంభించాడు. అప్పుడు రాజధాని భూముల మీద పేచీ పెట్టి, నానా రభన చేసి చంద్రబాబు ప్రభుత్వానికి జోరీగ లాగా తయారయిన జగన్ ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులంటూ వాటి మీద పడ్డాడు. పట్టిసీమ ప్రాజెక్టు మీద ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. పట్టిసీమ వద్దంటే ఒకవైపు రాయలసీమ ప్రజల నుండి వ్యతిరేకత, ప్రాజెక్టు కాంట్రాక్టర్ నుండి వ్యతిరేకత ఇలా కక్కలేక మింగలేక అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే ఏదో ఒక రకంగా జనాలను రెచ్చగొట్టి వారిలో తన ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   అయితే నారా లోకేశ్, జగన్ చేసే యాత్రలు రాజకీయ మైలేజ్ పెంచుకోవడానికే అని అందరికీ తెలుసు. రాజకీయం పరంగా ఎదగాలనుకునే వారు ప్రజలలోకి వెళ్లడం తప్పనిసరి. నారా లోకేశ్ రాజకీయ పరంగా ఎదగడానికి, ప్రజలలో మన్నన పొందడానికి చేస్తుంటే, జగన్ మాత్రం ప్రజలను రెచ్చగొట్టడానికే యాత్ర చేపట్టాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ యాత్ర చేయడం తప్పుకాదు కానీ.. ఇది సరైన సమయం కాదు. ఏదో వాళ్లు యాత్ర మొదలుపెట్టారు కదా అని నేను కూడా యాత్ర చేస్తా అన్నట్లు ఉంది జగన్ వ్యవహారం.

కోర్టు దృష్టిలో ఆయన దోషి కానీ ప్రజల దృష్టిలో...

  జీవితంలో అందరూ తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ వారిలో రామలింగ రాజులా పశ్చాతాపం చెంది, తన తప్పులను నిర్భయంగా ఒప్పుకొనేవారు ఎక్కడో గాని కనబడరు. ఆర్ధిక నేరాలకు పాల్పడినందుకు రామలింగ రాజును కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ళ జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా కూడా విధించి ఉండవచ్చును. కానీ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు దేశంలో అత్యంత నీతివంతుడయిన రాజకీయ నాయకుడు కూడా చేయలేడని ఖచ్చితంగా చెప్పవచ్చును.   రామలింగ రాజు గత ఏడాది బెయిలుపై జైలు నుండి విడుదలయయి బయటకు వచ్చినప్పుడు, ఈ కేసుల నుండి ఏవిధంగా తప్పించుకొందామాని ఆలోచించలేదు. గతంలో తను ప్రవేశ పెట్టిన 108 ఉచిత అంబులెన్స్ సేవలను ఏవిధంగా మరింత విస్తరించాలా అని ఆలోచించారు. ఆ ఆలోచనలో నుండి పుట్టినదే ‘కాల్ హెల్త్’ సేవలు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఆయన ఇరువురు కుమారులు రామరాజు, తేజ రాజు ‘కాల్ హెల్త్ సర్వీసస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఉచిత విద్యసేవా సంస్థను స్థాపించారు.   హైదరాబాద్, జీడిమెట్ల వద్ద గల తమ బైర్రాజు ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ సంస్థ ద్వారా జంట నగరాలలో మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూడా ద్విచక్ర త్రిచక్ర వాహనాల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సంస్థకు మరో రెండు కార్యాలయాలు ఒకటి ఫిలిం నగర్ వద్ద మరొకటి జూబిలీ హిల్స్ వద్ద ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థలో ఇప్పటికే సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ ఏర్పాటుకి, నిర్వహణకు సుమారు నెలకు ఒకటిన్నర కోట్లు వరకు రాజు సోదరులు తమ స్వంత నిధుల నుండి ఖర్చు చేస్తున్నారు. మరొకటి రెండు నెలలలో ఈ సంస్థ మొదటగా జంట నగరాలలో తన సేవా కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. రామలింగ రాజుకి కోర్టు దోషిగా నిర్ధారించి జైలుకి పంపినా ఈ సేవా కార్యక్రమాలు ఆపబోమని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

ఎంత మాటన్నారు స్వామిగౌడ్ సార్...

ఉద్యమాలు చేసే సమయంలో ఎలాంటి మాట మాట్లాడినా చెల్లుతుంది. ఎంత ఘోరంగా మాట్లాడినా చెలామణి అయిపోతుంది. ఎవర్ని నోటికొచ్చినట్టు తిట్టినా నడుస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవులు అనుభవిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం వుంది. ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కి కూడా వర్తిస్తుంది. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో స్వామిగౌడ్ మాట్లాడిన ఘాటు మాటలు విని అందరూ తరించారు. ఆంధ్రప్రాంత ప్రజల్ని, నాయకులని మాగ్జిమమ్ ఏ స్థాయిలో తిట్టచ్చో ఆ స్థాయిలో ఆయన తిట్టేశారు. ఆ స్థాయిలో తిట్టడం వల్లే ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. శానసమండలి ఛైర్మన్‌ స్థానం మీద కూడా కూర్చోబెట్టారు. అత్యంత గౌరవనీయమైన స్థానంలో కూర్చున్న ఆయన తన ఫ్లాష్‌బాక్‌ మరచిపోకుండా పాత స్థాయిలోనే మాట్లాడ్డం బాధాకరం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి స్వామిగౌడ్‌ని పెద్దమనిషి హోదాలో పిలిచారు. అక్కడ ఆయన చేయాల్సిన పని నాలుగు మంచి మాటలు మాట్లాడ్డం. కానీ ఆయన మాట్లాడిన మాటలు మంచి మాటలు కాదు... దారుణమైన మాటలు. ‘‘హిందువులు నలుగురేసి పిల్లల్ని కనడం ద్వారా ముస్లింలను డామినేట్ చేసేయాలి’’ అని అన్నారు. ఏమైనా అంటే, ఫీలవుతారుగానీ, విధానమండలి స్పీకర్ హోదాలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఇలా మాట్లాడిన ఆయన తన తప్పు తెలుసుకుని, వెంటనే నాలుక కరుచుకుని తన తప్పును సరిదిద్దుకుంటే సరిపోయేది. కానీ, ఆయన ఆ పని చేయలేదు. ఈ వ్యాఖ్యల మీద టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సమాజంలో బాధ్యత వున్నవారు విమర్శించేసరికి రెండ్రోజుల తర్వాత దార్లోకి వచ్చారు. తాను అన్న మాటల వెనుక అసలు ఉద్దేశం వేరని, కన్నబిడ్డలున్నా తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో ఉండటం చూసి తన హృదయం చలించిపోయి... గుండె కరిగిపోయి... బాధతో ఆ మాటలు అన్నానని సెలవిచ్చారు. మీరు ఏ ఉద్దేశంలో ఆ మాటలు అన్నా, మీ అసలు ఉద్దేశం ఏమిటో జనానికి అర్థమైపోయింది గౌరవనీయులైన స్వామిగౌడ్ గారూ.

జగన్ బస్సు యాత్ర తుస్సుమంటుందా?

మొన్నటి వరకూ రాజధాని భూముల విషయంలో రచ్చ చేయడానికి ప్రయత్నించి విఫలమైన వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో రచ్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భవిష్యత్ తరాలు ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకునే విధంగా రాజధానిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, ఆ ప్రయత్నాలకు అడ్డు పడటానికి జగన్ శాయశక్తులా కృషి చేశారు. దొనకొండలో రాజధాని పెట్టలేదన్న బాధ ఒకవైపు, చంద్రబాబుకు మంచి పేరు వచ్చేస్తోందన్న కడుపు మంట మరొకవైపు జగన్ సారుని రాజధాని భూముల విషయంలో రచ్చ చేయడానికి ప్రేరేపించాయి. అయితే స్థానిక రైతులు జగన్ అండ్ బ్యాచ్‌ని రచ్చ చేయనిచ్చీ చేయనిచ్చీ చివరికి చాల్చాల్లే వెళ్ళవయ్యో అనేశారు. దాంతో జగన్ బృందం తోకముడిచేసింది. ఇప్పుడేం రచ్చ చేయాలా అన్న ఆలోచనలో జగన్ సార్‌కి పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు దొరికాయి. పోలవరం ప్రాజెక్టుగానీ, పట్టిసీమ ప్రాజెక్టుగానీ పూర్తి కావడం, రైతులు బాగుపడటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా వుండటం జగన్‌ గారికి ఇష్టం ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకేనేమో పనిగట్టుకుని మరీ ప్రధాని దగ్గరకి వెళ్ళి ఈ ప్రాజెక్టుల గురించి చెప్పాల్సిన చెడు అంతా చెప్పారు. ఇతర రాష్ట్రాలు ఎలా ఈ ప్రాజెక్టులకు అడ్డు తగలచ్చో ఉప్పు ఇచ్చే విధంగా కూడా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయా ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాలకు బస్సు యాత్రని చేపట్టి, అక్కడి రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకి ఒరిగేదేమీ లేదంటూ మొన్నటి వరకూ పాడిన జగన్, ఆ పాటకు తన పార్టీకి చెందిన రాయలసీమ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత రావడంతో ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలు నష్టపోతాయట. ఉభయ గోదావరి జిల్లాల రైతులేమో సముద్రంలోకి పోయే నీటిని తరలిస్తే మాకేం ప్రాబ్లం అని స్పష్టంగా చెబుతున్నారు. అయినప్పటికీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జగన్ మహాశయుడు బస్సు యాత్ర చేపట్టారు. అయితే జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర తుస్సుమనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టిసీమ ప్రాజెక్టు మీద ఎంతమాత్రం వ్యతిరేకత లేదు. ఎవరో తన పార్టీకి చెందిన వారిని నలుగుర్ని వెంటేసుకుని వెళ్ళి అక్కడ హడావిడి చేసినంత మాత్రాన ఒరిగేదేమీ వుండదని అభిప్రాయపడుతున్నారు. అసలు ఎవరికీ సమస్య లేని అంశం మీద బస్సు యాత్ర చేపట్టిన జగన్ తాను అనుకున్న ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదని వారు అంటున్నారు. రాజధాని భూముల విషయంలో జగన్‌కి ఎలాంటి పరాభవం జరిగిందో, అలాంటి పరిస్థితే పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో జగన్‌కి ఎదురయ్యే అవకాశం వుండొచ్చని భావిస్తున్నారు.  తన మీటింగ్‌కి వచ్చే తన సొంత పార్టీ వారికే ప్రసంగాలు వినిపించి జగన్ వెనుదిరగాల్సి రావచ్చని భావిస్తున్నారు.

కేసీఆర్ వారసుడు ఎవరు? కె.టీ.ఆర్. లేక హరీష్ రావు?

  ఈనెల 24వ తేదీన హైదరాబాద్, లాల్ బహద్దూర్ స్టేడియంలో తెరాస ప్లీనరీ సమావేశాలు చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెరాస అధికారంలోకి మొట్ట మొదటిసారి జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు కనుక రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవికి జరుగబోయే ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంచనప్రాయమే.   కానీ ఈసారి జరుగబోయే ప్లీనరీ సమావేశాలలో కేసీఆర్ కుమారుడు కె.తారక రామారావుని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం తగినంత సమయం కేటాయించలేకపోతున్నందున, ఆ బాధ్యతలు తన కుమారుడికి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సమావేశాలలో కేసీఆర్ తన కుమారుడు కె.తారకరామారావునే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించినట్లయితే, అతనే తన వారసుడని ప్రకటించినట్లే భావించవచ్చును. కానీ అదే జరిగితే ఆయన తన మేనల్లుడు హరీష్ రావు కంటే కుమారుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లువుతుంది.   నీటి పారుదల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న హరీష్ రావు తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టును చాలా సమర్ధంగా నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకొన్నారు. హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడయిన డా. రాజయ్యను చాలా అవమానకరంగా మంత్రిపదవిలో నుండి తప్పించినందుకు ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్లీనరీ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు తారక రామారావుకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లయితే హరీష్ రావుకి ఇక పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఎప్పటికీ మూడవ స్థానానికే పరిమితం కావలసి ఉంటుంది. మరి దీనిని ఆయన జీర్ణించుకోగలరో లేదో?