దిక్కుమాలిన సలహాలు ఇవ్వొద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య తరచుగా వివాదాలు జరుగుతున్నాయి. తలమాసిన వాళ్ళు రూపొందించిన విభజన చట్టం కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరు సమస్యలు క్రియేట్ చేస్తున్నారో, ఎవరు వాటిని ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా పేర్లు చెప్పకపోయినా, జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరికైనా ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరు ఎలాంటివారో అర్థమవుతూనే వుంటుంది. అయితే, వివాదాలు జరిగిన ప్రతిసారీ, కొంతమంది రాజకీయ నాయకులు చక్కగా గట్టుమీద కూర్చుని ఉచిత సలహాలు ఇస్తూ వుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సంయమనంతో వ్యవహరించాలని దిక్కుమాలిన సలహా ఒకటి పారేసి వినోదం చూస్తూ వుంటారు. చివరికి ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తడానికి మూల కారకులైన కాంగ్రెస్ నాయకులు కూడా చాలా హుందాగా ముఖాలు పెట్టి, ఇద్దరు ముఖ్యమంత్రులూ సంయమనం పాటిస్తే బావుంటుందని గంభీరంగా మాట్లాడుతూ వుంటారు. అసలు వివాదాల్లో మునిగి తేలుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల కంటే, ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇస్తూ వినోదం చూస్తున్న వారే రెండు రాష్ట్రాలకు నిజమైన ప్రమాదకారులు.
ఆంధ్రప్రదేశ్‌లో వున్న రాజకీయ నాయకులుగానీ, తెలంగాణలో వున్న రాజకీయ నాయకులుగానీ డిప్లొమాటిక్‌గా సలహాలు ఇవ్వడమేగానీ, రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందే సూచనలు చేసినవారు ఎవరైనా వున్నారా? ప్రతి రాజకీయ నాయకుడూ రెండు రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలను, ముఖ్యమంత్రులను తిట్టడం ద్వారా తమ పార్టీకి లాభం చేకూర్చాలని చూస్తున్నాడే తప్ప నిస్వార్థంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నవారే లేరు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ గొడవలు పడుతూ వుంటే, ఆ గొడవల ద్వారా తామెంత లాభం పొందవచ్చన్న ఆలోచనే పార్టీల్లో వుంది. ఈ గొడవలు తగ్గడం కాకుండా ఇంకా పెరిగితే బావుంటుందనేది ఆ పార్టీల మనసులలో వున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సింది ఎందుకూ పనికిరాని దిక్కుమాలిన సలహాలు ఇవ్వడం కాదు... రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం. అయితే ఇది అత్యాశే.