వైఎస్సార్ పేరుకు మంగళం.. శుభం...

ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఒక మంగళకరమైన ఆలోచన జరుగుతోంది. అది కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలనేది. ఇటీవల జరిగిన తెలుగుదేశం మినీ మహానాడులో దీనికి సంబంధించిన చర్చ జరిగింది.  ఈ చర్చ అనంతరం కడప జిల్లాకు వున్న వైఎస్సార్ పేరును తొలగించాలనే తీర్మానాన్ని ఆమోదించారు. మినీ మహానాడులో ఆమోదించిన ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించవచ్చు.. లేక ఆమోదించకపోనూ వచ్చు. అయినప్పటికీ, కడప జిల్లా పేరులోంచి వైఎస్సార్ పేరుకు మంగళం పలకడం అనేది ఒక మంగళకరమైన ఆలోచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు నిరంకుశంగా పరిపాలించిన సమయంలో తీసుకున్న అనేక అనవసర నిర్ణయాలలో ఒకటి కడప జిల్లాకు వైస్సార్ పేరు అతికించి ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేరును మార్చడం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయిపోయిన కాంగ్రెస్ నాయకులు జిల్లాల పేర్ల మార్పు తమ జన్మహక్కు అన్నట్టుగా కడప జిల్లా పేరుకు వైఎస్సార్ పేరును అతికించారు. కడప జిల్లాలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. కడప జిల్లాకు ఎంతో సేవ చేసిన గొప్పవారు వున్నారు. వారెవరి పేరునూ ఈ జిల్లాకు పెట్టాలన్న ఆలోచన రాని కాంగ్రెస్ నాయకులకు వైఎస్సార్ చనిపోగానే ఆయన పేరును పెట్టేశారు. ఈ అంశం మీద అప్పట్లోనే వివాదం చెలరేగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాను ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని చాంతాడంత పొడవుగా మార్చినప్పటికీ జనం మాత్రం చక్కగా ‘కడప జిల్లా’ అంటూ పాత పేరునే ఉపయోగిస్తూ వస్తున్నారు. మీడియాలో కూడా ‘కడప జిల్లా’ అంటూ వస్తోంది. ఒక్క జగన్ మీడియా మాత్రం ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేర్కొంటూ వస్తోంది. ‘పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా’ అనే పేరును ఉపయోగించినట్టుగా కడప జిల్లా విషయంలో జరగలేదు. అంటే కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టడం జనానికి కూడా ఇష్టం లేదని స్పష్టమవుతోంది. పైగా ముఖ్యమంత్రిగా పనిచేయడమే జిల్లాకు పేరు పెట్టడానికి అర్హత కాదు. అదే అర్హత అయితే ఏ జిల్లాకి చెందిన వారు ముఖ్యమంత్రి అయితే  ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టేస్తారా? ఈ నేపథ్యంలో కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలన్న ఆలోచనలు రావడం శుభప్రదం.

కాంగ్రెస్‌వి దిక్కుమాలిన రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలు తరిమి కొట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఆ పార్టీ నాయకులు దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానలేదు. అడ్డగోలు విభజన కారణంగా దారుణంగా మోసపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ప్రత్యేక హోదా మీద తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రత్యేక హోదా లభించినట్టయితే ఆంధ్రప్రదేశ్‌కి ఊరటగా వుంటుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడటానికి ఒక మార్గం దొరికినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు, ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో వుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ విషయంలో దిక్కుమాలిన రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు కీలకమైన అంశం. ఏపీకి ప్రత్యేక హోదా రావడం వల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది ఊహాజనితమైన అంశమే తప్ప మరేదీ కాదు. ఏ రాష్ట్రంలోని నాయకులైనా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని అనడం మాత్రం న్యాయం కాదు. కాంగ్రెస్‌కి చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ మధ్య కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరాదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందనేది ఆ లేఖ సారాంశం. పైగా లేఖ రాసిన తర్వాత ఆయన సదరు లేఖను తాను వ్యక్తిగతంగా రాశానని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆంధ్రకు మంటపెట్టే లేఖ రాయగానే, ఏపీ కాంగ్రెస్ నాయకులు కస్సుమంటూ లేచారు. గుత్తా ఇలా లేఖ రాయడం అన్యాయం, అక్రమం, దారుణం అంటూ ఆవేశపడిపోయారు. ఇప్పటికే ఏపీలో సర్వనాశనమైపోయిన పార్టీని తిరిగి నిలబెట్టడానికి తాము నిద్రాహారాలు మాని ప్రయత్నిస్తుంటే గుత్తా ఇలాంటి లేఖలు రాయడం అన్యాయమని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ, ఏపీ నాయకులు ఇస్తున్న ఈ రాజకీయ కటింగులు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని అనడం ద్వారా తెలంగాణలో ప్రజల మెప్పు పొందాలని గుత్తాగారు ప్రయత్నిస్తారు. గుత్తా మాటలను ఖండించి ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ నాయకులు ఏపీ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వున్న ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే దిక్కుమాలిన రాజకీయాల నమూనా అని ప్రజలు అంటున్నారు.

ఆ ముగ్గురిపై రేపు కోర్టులో తెదేపా పిటిషన్

  రాజకీయ నాయకులు అధికారం కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు. కాకపోతే పార్టీలు మారిన తరువాత పాత పార్టీ శాసనసభ్యులుగానే కొనసాగడం లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవలసి వస్తోంది. అనేక ఏళ్లపాటు తెదేపాలో కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, ధర్మారెడ్డి వంటి ప్రజాప్రతినిధులు అందరూ ఆ కోవకు చెందినవారే. వారు తెదేపా నుండి తెరాసలోకి వెళ్ళినా నేటికీ తెదేపా శాసనసభ్యులుగానే కొనసాగుతున్నారు. ఈ విషయం సాక్షాత్ శాసన సభ కార్యదర్శి ఈరోజు విడుదల చేసిన శాసనసభ సభ్యుల జాబితాలోనే పేర్కొనబడింది. పార్టీని వీడినప్పుడు ఇంకా ఆ పార్టీ శాసనసభ్యులుగానే ఎందుకు కొనసాగుతున్నారనే ప్రశ్నకు వారే జవాబు చెప్పాలి. కానీ వారు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలాగని పదవులను వాదులుకోవడానికి వారు ఇష్టపడటం లేదు. అందుకే ఆ ముగ్గురిని యం.యల్సీ. ఎన్నికలలో ఓటు వేయకుండా దూరంగా ఉండమని ఆదేశించాలని కోరుతూ తెదేపా హైకోర్టులో సోమవారంనాడు ఒక పిటిషను వేసింది. శాసనసభ కార్యదర్శి ఈరోజు విడుదల చేసిన శాసనసభ సభ్యుల జాబితాను కూడా రేపు కోర్టుకి సమర్పించి, వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరబోతున్నట్లు సమాచారం. శాసనసభ్యుడిగా దక్కే అధికారం కోసం, జీతభత్యాలకు ఆశపడుతున్న వారిపై ఒకవేళ కోర్టు అనర్హత వేటువేస్తే వారి పరిస్థితి ఏమిటో?

ఒకే అంశం...రెండు రకాల కధనాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం పశ్చిమ గోదావరి జిల్లానే కాకుండా కర్నూలుపై కూడా దృష్టి కేంద్రీకరించాలని ఉపముఖ్యమంత్రి కేఈ. కృష్ణమూర్తి చేసిన విజ్ఞప్తిని పట్టుకొని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక పార్టీకి చెందిన మీడియాలో  ‘ముఖ్యమంత్రితో ఉపముఖ్యమంత్రి డిష్యుం డిష్యుం’ అని హెడింగ్ తో హడావుడిగా ఓ కధనం ప్రచురించేసింది. అయితే అధికార పార్టీలో జరగరానిదేదో జరిగిపోతోందని వ్రాసేపడేసినప్పటికీ, తను ప్రచురించిన కధనం వలన చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారని స్వయంగా ద్రువీకరించినట్లయిందని ఆలశ్యంగా గ్రహించి, మళ్ళీ మర్నాడు అంటే ఈరోజు సంచికలో ‘ఏమిటో ఈ మాయ’ అంటూ మరో కౌంటర్ కధనం ప్రచురించి చేతులు దులుపుకొంది. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాను మాత్రమే అభివృద్ధి చేస్తునందుకు ముఖ్యమంత్రిపై ఉపముఖ్యమంత్రి ఆగ్రహం అంటూ ఏదేదో వ్రాసేసిన ఆ చేత్తోనే ఈరోజు పత్రికలో “పశ్చిమ గోదావరి జిల్లాను ఏ మాత్రం అభివృద్ధి చేయకపోయినా తెదేపా నేతలు అక్కడ ఏదో చాలా అభివృద్ధి జరిగిపోతోందన్నట్లు ప్రజలను మభ్యపెట్టడానికి మరో సరికొత్త డ్రామాకి తెర లేపారు” అంటూ కధనం ప్రచురించడం గమార్హం.   నిన్న వ్రాసిన కధనంలో అధికార పార్టీలో పెద్దపెద్ద గొడవలయిపోతున్నాయని అనే అంశంపై హైలైట్ చేసి, ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి డ్రామా జరుగుతోందని వ్రాయడం మరెవరికీ సాధ్యం కాదేమో? ఈవిధంగా ప్రతీ అంశాన్ని కేవలం తన రాజకీయ కోణం నుండే ప్రజలకు చూపించడం ఎవరూ హర్షించరు. అద్దాల మేడలో కూర్చొని దారిన పోయే వాళ్ళ మీదకి రాళ్ళు విసురుతుంటే, దాని వలన చివరికి నష్టపోయేది అద్దాల మేడలో కూర్చొన్న వాళ్ళేనని గ్రహిస్తే చాలు.

ఏపీ రాజధాని ప్లానింగ్ సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో అన్న విషయంలో అందరూ చాలా ఉత్కంఠంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు అందరూ రాష్ట్ర రాజధాని విషయంలో పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అంతకు ముందు సింగపూర్ వాళ్లు ఏపీ రాజధాని ప్లానింగ్ ఇచ్చినా దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని 'మాస్టర్ ప్లాన్' ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందింది. అయితే ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజధాని మస్టార్ ప్లాన్ ను అందజేశారు. తూళ్లూరు - మందడం మధ్య ఏపీ నూతన రాజధానిని(కోర్ కాపిటల్) రూపొందించనున్నారు. అయితే ఈ రాజధాని ప్లానింగ్ లో అనేక ఆసక్తికర అంశాలు పొందుపరిచారు. సింగపూర్ బృందం ఇచ్చిన ప్లానింగ్ లో ఎక్కువశాతం పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 7,068 ఎకరాలలలో 58 మండలాలతో 220 కిలోమీటర్ల పరిధిలో రాజధాని విస్తరణ ఉంటుంది. ఇండిస్ట్రియల్ పార్కులు, వినోదకేంద్రాలు, తాగునీరు, విద్యుత్‌, రవాణా, మౌలికసదుపాయాల అభివృద్ధి, ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య, నివాసేతర భవనాలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించబడింది. నడక సైకిళ్లు ద్వారా కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భనవ్ లాంటి ప్రభుత్వ సంబంధిత కార్యలయాలన్నీ ఇక్కడే రానున్నాయి. అయితే సింగపూర్ ప్రతినిధులతో రాజధాని అంశాలపై చర్చించిన చంద్రబాబు ఈ 'మాస్టర్ ప్లాన్' లో కొన్ని సూచనలు చేశారు. చంద్రబాబు చేసిన సూచనలకు అనుగుణంగా తొలి దశ తుది మాస్టర్ ప్లాన్ మరో ఆరు వారాల్లో సర్కారు చేతికి అందజేయనుంది. అంటే జులై 15 నాటికి సీడ్‌ కేపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌ ను సింగపూర్‌ బృందం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అది వచ్చిన వెంటనే ఏపీ రాజధానికి పునాది పడటమే తరువాయి.  

జగన్ ముద్దులు పెట్టడం మానాలి

  వైసీపీ నాయకుడు జగన్‌కి ఒక విచిత్రమైన అలవాటు వుంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ముద్దులు పెట్టేస్తూ వుంటారు. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచీ జగన్‌ది ఇదే వరస. ఎదుట వున్నవాళ్ళు ఎవరు... ఆడా... మగా అనేది కూడా ఆలోచించకుండా తల నిమురుతూ, ముద్దులు పెడుతూ ఓదారుస్తూ వుంటారు. ఓదార్పు యాత్ర అయినా, మరే యాత్ర అయినా ముద్దులు పెట్టే సీన్ మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. ముద్దులు పెట్టీ పెట్టీ ఆయనకు ఆ పద్ధతి అలవాటు అయిపోయింది. జగన్ ముద్దుల గురించి జనాలు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నా జగన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలోనే వెళ్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ సార్ ఈ ముద్దుల పద్ధతిని మానుకుంటే మంచిదని భావిస్తు్న్నప్పటికీ ఆ విషయాన్ని జగన్‌కి చెప్పే ధైర్యం లేక ఊరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్ ముద్దుల మీద కామెంట్లు చేస్తు్న్నారు. జగన్ ఏదైనా యాత్రను చేపట్టారంటే జనం భయంతో పారిపోతున్నారని, జగన్ అంత దూరంలో వుంటే జనం ఇంకొంచెం దూరంగా పారిపోతున్నారని వ్యంగ్యంగా అంటున్నారు. ఎందుకంటే, జగన్ దగ్గరకి వెళ్తే ఎక్కడ ముద్దులు పెట్టేస్తారోనని జనం భయపడుతున్నారని చెబుతున్నారు. జగన్‌ని చూసి స్త్రీలు జగన్ ముద్దు పెట్టకుండా చూడు దేవుడా అని ప్రార్థిస్తున్నారని, పెళ్ళికాని ఆడపిల్లలయితే జగన్‌ని చూడగానే తుపాకీ పేలినప్పుడు పారిపోయే పక్షుల తరహాలో గల్లంతు అయిపోతున్నారని కామెడీగా అంటున్నారు. ఇలాంటి కామెడీ కామెంట్లకు ఆస్కారం ఇస్తున్న తన ముద్దుల ప్రహసనానికి జగన్ ఇప్పటికైనా తెర దించితే బావుంటుందేమో. మన అమాయకత్వం గానీ, జగన్ ఒకరు చెబితే విని మారే రకమా!?

ఏపీ టీ షర్టులకు యమాక్రేజ్

ఇప్పుడు అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ మీదే. ఒకవేళ ఆ ‘దృష్టి’లో ఏవైనా దోషాలు వుంటే తొలగిపోవుగాక. ఏపీ రాజధానికి సంబంధించిన కొన్ని విషయాలు ఒక్కొక్కటి వెల్లడి అవుతుంటే, తెలుగువారి కళ్ళు జిగేల్‌మంటున్నాయి. రాజధాని తీరు తెన్నులు, ప్లానింగ్, రాజధాని ఎలా వుండబోతుందన్న విషయాలు దేశవ్యాప్తంగా ‘అమరావతి’ మీద ఆసక్తి పెరుగుతోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవాలన్న  ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదల కూడా ఇప్పుడు అమరావతి అందరి దృష్టినీ ఆకర్షించడానికి ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో అమెరికాకి చెందిన ఓ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భాగంగా వున్న విజయవాడ, గుంటూరు పేర్లతోపాటు ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ఆంధ్రప్రదేశ్ లోగో ముద్రించిన టీ షర్టులను రూపొందించి అమెరికాలో విక్రయించడం ప్రారంభించింది. ఈ టీ షర్టులకు అమెరికాలోని తెలుగువారి నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ టీ షర్టులను రూపొందించిన సంస్థ వీటిని ఒక ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లో వీటిని అమ్మకానికి వుంచింది. 22 డాలర్ల నుంచి 39 డాలర్ల వరకు వీటిని ధరను నిర్ణయించింది. ఈ టీ షర్టులకు ఆన్‌లైన్లో అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని తెలుగువారు మాత్రమే కాకుండా... ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారు ఈ టీ షర్ట్‌లను మక్కువతో కొనుగోలు చేస్తున్నారట. వీటిని కొనుగోలు చేసిన వారు ఆ విషయాన్ని ఫేస్ ‌బుక్ తదితర సోషల్ మీడియాలో ఆ విషయాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నారు.

వారిద్దరినీ వైకాపా రంగంలో ఎందుకు దింపినట్లో?

  ఆంధ్రాలో ఉన్న నాలుగు యం.యల్సీ. స్థానాలకు నలుగురే నామినేషన్లు వేయడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కానీ తెలంగాణాలో ఉన్న ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేస్తున్నందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈరోజే చివరి రోజు కనుక తన ఐదవ అభ్యర్ధిని తెరాస పోటీలో ఉంచుతుందా లేక ఉపసంహరించుకొంటుందా? అనేది మరి కొన్ని గంటలలో తేలిపోతుంది.   యం.యల్యే. కోటా క్రింద జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ ముగియక ముందే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే తన అభ్యర్ధుల పేర్లను వైకాపా ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును గుంటూరు నుంచి ప్రముఖ నటుడు కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత జి.అదిశేషగిరిరావు ను కృష్ణ జిల్లా నుంచి బరిలోకి దింపుతోంది. ఆ రెండు జిల్లాల స్థానిక సంస్థలలో తనకు అవసరమయిన బలం లేకపోయినప్పటికీ వారిని పోటీలో నిలబెట్టడం వలన వైకాపా ఏమి నిరూపించదలచుకొందో తెలియదు కానీ వారు ఓడిపోతే వ్యక్తిగతంగా వారికీ, పార్టీకి కూడా అవమానమే అవుతుంది.

ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిన ప్రత్యేక హోదా

  ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం గురించి కేంద్రమంత్రులు చెపుతున్న మాటల వలన ఎన్డీయే ప్రభుత్వానికి మేలు కంటే కీడే ఎక్కువ జరురుగుతోందని చెప్పవచ్చును. ఈ అంశం మీద వారు మాట్లాడే ప్రతీ వాక్యం కూడా ప్రతిపక్షాలకు సరికొత్త ఆయుధం అందిస్తోంది. ఉదాహరణకు ఈరోజు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అదనపు నిధులు ఇస్తున్నందునే పద్నాల్గవ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా గురించి గట్టిగా ప్రస్తావించడం లేదని అన్నారు. విభజన హామీలను చాలా వరకు నేరవేర్చామని మిగిలినవి కూడా త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని అన్నారు.   యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో చేసిన అనేక హామీలలో కొన్నిటిని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న మాట వాస్తవం. కనుక మిగిలినవి కూడా అమలుచేస్తుందని నమ్మవచ్చును. కానీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎదురవుతున్న అడ్డంకుల వలన ఆ ఒక్క హామీని నెరవేర్చలేకపోతోందనేది కూడా వాస్తవం. కానీ పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించేటపుడు, ఆ తరువాత ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ గట్టిగా నొక్కి చెప్పడం వలననే ఇప్పుడు ఆ హామీని వెనక్కు తీసుకోలేక ఇబ్బంది పడుతోంది.   ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు, ఇతర అవరోధాల గురించి, అదేవిధంగా ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంకట పరిస్థితి గురించి దాని కోసం పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలకీ బాగా తెలుసు. అందుకే అవి తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన బీజేపీని అది నడిపిస్తున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఈ అంశం మీద ఇరుకున పెట్టి రాజకీయంగా దానిపై పై చేయి సాధించాలని చూస్తున్నాయి తప్ప నిజంగా వాటికి ఆంద్రప్రదేశ్ అభివృద్ధి జరిగిపోవాలనే తపనతో మాత్రం కాదు. అయితే వారికి ఆ అవకాశం కల్పిస్తున్నది మాత్రం కేంద్రమంత్రులేనని చెప్పకతప్పదు.   వారికి, ముఖ్యంగా దీనిని ఆయుధంగా చేసుకొని ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాష్ట్రంపై అంత ప్రేమ కారిపోతూ ఉంటే, అది పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించినప్పుడే అభివృద్ధి చేసి ఉండేది. కానీ అప్పుడు ఏమీ చేయకుండా కేవలం కుంభకోణాలు మాత్రమే చేస్తూ పదేళ్ళూ కాలక్షేపం చేసేసి ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం మోసలి కన్నీళ్ళు కార్చుతోంది. అయితే ఈ విషయం ఇంకా ఎంత కాలం సాగుతుందో తెలియదు కానీ అది సాగినంత కాలం ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి విమర్శలు ఎదుర్కోక తప్పదు. కనుక ఈ సమస్యను మరింత కాలం నాన్చకుండా దీనిని ఏవిధంగా పరిష్కరించాలో గట్టిగా ఆలోచిస్తే మంచిదేమో.

తెరాసను ప్రత్యర్ధ పార్టీగానే భావిస్తాము: బీజేపీ

  ప్రధాని మోడీ ఆహ్వానిస్తే కేంద్రమంత్రిగా చేరేందుకు సిద్దమని తెరాస యంపీ కవిత ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు అటువంటి ఆలోచనలేవీ లేవని ఆమె వాదించినప్పటికీ మెల్లగా తన మనసులో మాట బయటపెట్టారు. ఆమె తన మనసులో మాట బయటపెట్టిన తరువాత బీజేపీ సానుకూలంగా స్పందించి ఉండి ఉంటే ప్రతిపక్షాలు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా బాధ ఉండేది కాదు. కానీ బీజేపీ నేత మురళీధరరావు ఆమెను కేంద్రమంత్రిగా చేర్చుకొనే ఉద్దేశ్యమేమీ తమకు లేదని చెప్పడంతో ఆమె అనవసరంగా తన మనసులో మాటను బయటపెట్టుకొని ప్రతిపక్షాలు వాదనకు బలం చేకూర్చినట్లయింది. తెలంగాణాలో తమ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటునప్పుడు, తెరాసను ప్రత్యర్ధ పార్టీగానే పరిగణిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.   రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఇచ్చినట్లయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంత కాళ్ళావేళ్ళా పడినా ఆయన ఆ పార్టీతో కనీసం పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు, కానీ తెదేపాతో పొత్తులు పెట్టుకొన్న బీజేపీతో పొత్తులకి ప్రయత్నించి భంగపడ్డారు. బహుశః ఆ అక్రోశంతోనే కొంతకాలం ఎన్డీయే ప్రభుత్వంపై కత్తులు దూసి ఉండవచ్చును. కానీ కేంద్రంతో కత్తులు దూయడం వలన రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం ఉండదనే జ్ఞానోదయం కలిగినందునో లేక ప్రతిపక్షాల విమర్శల వల్లనో మళ్ళీ కేంద్రానికి చేరువయ్యారు. మోడీ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించడంతో బహుశః ఆయన తెరాస ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం, తద్వారా తన కుమార్తె కవితకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఆశించారేమో? కానీ తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చుకొనే ఆలోచన ఉన్నట్లు బీజేపీ అధిష్టానం ఏనాడు సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. మరి అటువంటప్పుడు తెరాసకు ఇటువంటి ఆలోచన ఎందుకు కలిగిందో తెలియదు.   అయితే రాజకీయాలలో శాశ్విత మిత్రులు కానీ శాశ్విత శత్రువులు గానీ ఉండరు కనుక తెరాస తొందరపడి బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల మీద యుద్ధం ప్రకటించకుండా ఉంటేనే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జూపూడి అనుభవంతో ఆంధ్రా నేతలకు కనువిప్పు

  తెలుగు దేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావుకి యం.యల్సీ.సీటు చేతికి అందినట్లే అంది తప్పిపోయింది. ఆంద్రప్రదేశ్ రాష్ర్టంలో జరిగే యం.యల్సీ. ఎన్నికలలో అయనకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసినప్పటికీ, ఆయనకు రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోవడంతో ఒక మంచి అవకాశం కోల్పోయారు. ప్రజాప్రనిధుల చట్టం, 1951లో సెక్షన్స్ 5 మరియు 6 ప్రకారం, ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్న ఏ వ్యక్తికయినా తప్పనిసరిగా సంబంధిత నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలనే నియమం ఉంది. జూపూడి ప్రకాశం జిల్లాకు చెందినవారయినప్పటికీ, ఆయన చాలా కాలంగా హైదరాబాద్ లోనే స్థిరపడి ఉండటం వలన అక్కడే తన పేరును ఓటరుగా నమోదు చేయించుకొన్నారు. ఇంత కాలం హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధానిగా ఉండేది కనుక ఆయనకు కానీ మరెవరికీ గానీ ఇటువంటి వింత సమస్య ఎదురవలేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ తెలంగాణాకి దక్కడంతో అక్కడ ఓటర్లుగా నమోదు చేయించుకొన్నవారందరూ ఆంధ్రాలో ఓటు హక్కు కోల్పోయారు.   నేటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుండటం, అక్కడి నుండే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సాగుతుండటంతో హైదరాబాద్ లో ఓటర్లుగా నమోదు చేయించుకొన్న రాజకీయనేతలకు, తమ ఓటు హక్కును ఆంద్రప్రదేశ్ కి మార్పించుకోవాలనే విషయం మరిచిపోయినట్లున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి చెందిన అనేక మంది మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నేటికీ హైదరాబాద్ లోనే ఓటర్లుగా కొనసాగుతున్నారు. జూపూడికి ఎదురయిన ఈ చేదు అనుభవంతో వారు అందరూ తమ వోటు హక్కును ఆంద్రప్రదేశ్ మార్పించుకోక తప్పదని స్పష్టమయింది. వారందరికీ ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా వచ్చే ఎన్నికల నాటికి వారందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మార్పించుకోక తప్పదు. దానితోబాటే తమ శాశ్విత నివాసం కూడా.

మంగళగిరిలోనే సమర దీక్ష ఎందుకంటే?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 3, 4 తేదీలలో రెండు రోజులపాటు రాజధాని ప్రాంతంలో మంగళగిరిని వేదికగా ‘సమర దీక్ష’ చేయబోతున్నట్లు ఆ పార్టీ నేత కె. పార్ధసారధి ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జగన్ దీక్ష చేయబోతున్నట్లు వైకాపా చెప్పుకొంటున్నప్పటికీ, అందుకోసం ఆ పార్టీ ఎంచుకొన్న సమయం, స్థలం రెంటినీ గమనిస్తే అది ప్రజల కోసం చేస్తున్న పోరాటంలా కాక తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నట్లుంది.   జూన్ 2న రాష్ట్రావతరణ దినం సందర్భంగా ఆరోజు నుండి ప్రభుత్వం వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. జూన్ 6వ తేదీన రాజధానికి శంఖుస్థాపన చేసేందుకు సిద్దమవుతోంది. జూన్ 8న ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని భావిస్తోంది. ఏడాది పాలనలో రాష్ట్రాభివృద్ధికి, వివిధ సంక్షేమ పధకాల అమలుకి, ఎన్నికల హామీల అమలుకి రాష్ట్ర ప్రభుత్వం చేప్పట్టిన చర్యలు వాటి ఫలితాల గురించి ఈ సభలో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని భావిస్తోంది.   రాష్ట్ర ప్రభుత్వం తన ఈ కార్యక్రమాల గురించి ప్రకటించగానే వైకాపా కూడా తన వ్యూహాలతో సిద్దమయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ‘నవ నిర్మాణ దీక్ష’ గురించి ప్రకటన చేయగానే దానికి పోటీగా వైకాపా ‘సమర దీక్ష’ చేయబోతున్నట్లు ప్రకటించింది. రాజధాని నిర్మించబోయే తుళ్ళూరు, మంగళగిరి మండలాలలో మంగళగిరి ప్రాంతంలోనే కొంతమంది రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే వైకాపా మంగళగిరిని వేదికాగా ఎంచుకొన్నట్లు అర్ధమవుతోంది. తద్వారా జగన్ దీక్షకు వారి మద్దతు పొందడమే కాకుండా వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పురిగొల్పవచ్చని వైకాపా భావిస్తున్నట్లుంది.   అదే జరిగితే జూన్ 6న రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలనుకొంటున్న ప్రభుత్వానికి రైతుల నుండి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే వైకాపా తన సమర దీక్షకు చాలా వ్యూహాత్మకంగా జూన్ 3,4 తేదీలను, వేదికగా మంగళగిరిని ఎంచుకోన్నట్లు అర్ధమవుతోంది. కానీ అధికార తెదేపాతో వైకాపాకున్న రాజకీయ విభేదాలు, వైషమ్యాల కారణంగా ఈవిధంగా రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించడం ఎవరూ హర్షించరనే సంగతి ఆ పార్టీ గ్రహిస్తే బాగుంటుంది.

రాజీవ్ గాంధీకి మోడీ నివాళులు!

  ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఒకవేళ దేశంలో కానీ రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మంత్రులందరూ, మంత్రి పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నవారు అందరూ ఆయనకు ఘన నివాళులు అర్పించే మిషతో చాలా హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, మరి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు డిల్లీలో ఆయన సమాధి వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు. బహుశః దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఏవో కార్యక్రమాలు చేసే ఉండవచ్చును. కానీ ఇతర రాజకీయ పార్టీలు మాత్రం దానితో తమకు ఎటువంటి సంబంధమూ లేనట్లు, రాజీవ్ గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగానే చూసారు తప్ప దేశానికి మాజీ ప్రధానమంత్రిగా సేవలు అందించిన వ్యక్తిగా చూడలేదు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆయనకు ట్వీటర్ ద్వారా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆయన 1991 సం.లో తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు శ్రీపెరుంబుదూర్ లోఎల్టీటీఈ ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో మరణించారు.

తెలంగాణా యం.యల్సీ ఎన్నికలలో ఏడవ కృష్ణుడు!

  సాధారణంగా ఎవరికయినా ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంట కలగడం సహజం కానీ ఎవరెవరు నామినేషన్లు వేయబోతున్నరనే దానిపై కూడా ఉత్కంట ఏర్పడటం ఈ యం.యల్సీ. ఎన్నికలలోనే చూస్తున్నాము. తెలంగాణాలో ఉన్న ఆరు స్థానాలలో నాలుగు అధికార తెరాసకు ఒకటి కాంగ్రెస్ పార్టీకి పోతే మిగిలిన ఆ ఒక్క స్థానానికి ఏ పార్టీకి చెందిన నేత నామినేషన్ వేస్తారనే ఉత్కంట ఈరోజు మధ్యాహ్నం 3గంటలకి నామినేషన్ల వేసే గడువు ముగిసేవరకు కొనసాగింది.   అందుకు కారణం తెదేపా, బీజేపీ కూటమికి తగినంత మంది యం.యల్యేలు లేకపోవడం, వారి ఆ బలహీనతను సొమ్ము చేసుకొందామనే ఆలోచనతో తెరాస పార్టీ ఐదవ అభ్యర్ధిని కూడా నిలబెట్టాలనుకోవడమే. ఒక్కో యం.యల్సీ.కి కనీసం 18మంది యం.యల్యేల మద్దతు అవసరం. కానీ తెదేపా-బీజేపీ కూటమికి కేవలం 16 మందే ఉన్నారు. తెరాసకున్న మొత్తం 75మంది యం.యల్యేల మద్దతుతో నలుగురిని మాత్రమే గెలిపించుకోగలదు. కానీ ఐదవ అభ్యర్ధిని కూడా నిలబెట్టింది. తెదేపా-బీజేపీ కూటమి తమ అభ్యర్ధిని ప్రకటించిన తరువాతనే తమ అభ్యర్ధి పేరు బయటపెట్టాలని తెరాస భావించడంతో చివరి నిమిషం వరకు ఉత్కంట సాగింది.   తెదేపా-బీజేపీ కూటమి తరపున వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, తెరాస తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, యాదవ్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత నామినేషన్ వేశారు. మొత్తం ఆరు స్థానాలకి ఏడుగురు పోటీ చేస్తున్నారఋ. అంటే తెరాస ఐదవ అభ్యర్ధిగా నిలబెట్టిన బి.వెంకటేశ్వర్లు గెలవాలంటే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన యం.యల్యేలు క్రాస్ ఓటింగ్ చేయవలసి ఉంటుందన్న మాట.   అయితే తాము ఎవరితోనూ బేరసారాలు చేయబోమని ప్రతిపక్షాలకు చెందిన కొందరు యం.యల్యేలే తమకు మద్దతు తెలుపుతారనే బలమయిన నమ్మకంతోనే తాము ఐదవ అభ్యర్ధిని నిలబెట్టామని తెలంగాణా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాతో అన్నారు. కానీ బేరసారాలు చేయకుండా, ఎటువంటి పదవులు ఆశజూపకుండా ఈరోజుల్లో ప్రత్యర్ధ పార్టీలకు చెందిన యం.యల్యేల ఓట్లు ఆశించడం సాధ్యమేనా అంటే జవాబు అందరికీ తెలుసు. కనుక నామినేషన్ల ఉపసంహరణ తరువాత కూడా ఏడవ కృష్ణుడు బరిలో ఉంటాడా లేదా? అనే దానిని బట్టి ‘డీల్’ కుదిరిందో లేదో తేలిపోతుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకూ అగ్నిపరీక్షే

  వచ్చే నెల 1వ తేదీన తెలంగాణాలో ఆరు యం.యల్సి. స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒక్కో యం.యల్సి. అభ్యర్ధి గెలిచేందుకు కనీసం 18మంది యం.యల్యే.ల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెరాసకు (కాంగ్రెస్, తెదేపా, వైకాపాల నుండి వచ్చిన యం.యల్యే.లతో కలుపుకొని) మొత్తం 75మంది సభ్యులు ఉన్నారు. అంటే 72మంది సభ్యుల మద్దతుతో నలుగురు యం.యల్సీ.లను అవలీలగా గెలిపించుకొన్న తరువాత కూడా ఇంకా ఆ పార్టీకి మరో ముగ్గురు యం.యల్యేలు మిగిలే ఉంటారన్న మాట. అందుకే, తనకు మిత్రపక్షాలుగా ఉన్న మజ్లీస్ (7మంది) వామ పక్షాలు (ఇద్దరు), వైకాపా (ఒక్కరు) మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అయితే తెరాస నిలబెట్టాలని చూస్తున్న 5వ అభ్యర్ధికి తమ మద్దతు కోరే బదులు తమ పార్టీ అభ్యర్ధికే తెరాస మద్దతు ఇవ్వాలని మజ్లిస్ పార్టీ కోరినట్లు సమాచారం. కనుక ఒకవేళ తెరాస కనుక తన 5వ అభ్యర్ధికి మద్దతు కూడగట్టుకోలేకపోయినట్లయితే, మజ్లీస్ అభ్యర్ధికే మద్దతు ఇచ్చినా ఇవ్వవచ్చును.   తెరాసలో కొత్తగా మంత్రులుగా చేరిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావులకు శాసనసభలో కానీ శాసనమండలిలో గానీ సభ్యత్వం లేకపోవడంతో వారిరువురికీ చెరో యం.యల్సీ. సీటును ఖాయం చేసారు. మిగిలిన రెండు సీట్లకు అమోస్, బి. వెంకటేశ్వరులు, యన్. లక్ష్మణ్ రావు, యాదవ్ రెడ్డి, విద్యాసాగర్ రావు తదితర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.   ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం 17 మంది యం.యల్యేలున్నారు. కనుక ఇతర పార్టీల నుండి కనీసం మరొక్క యం.యల్యే. మద్దతు చాలా అవసరం. సీటు ఆశిస్తున్న వారు అందరూ బయట నుండి ఒక్క యం.యల్యే మద్దతు తప్పకుండా కూడగట్టుకోగలమనే గట్టి నమ్మకంతో ఉన్నారు. కనుక ఆ ఒక్క సీటుకోసం టీ-కాంగ్రెస్ లో చాలా తీవ్రమయిన పోటీ నెలకొని ఉంది.   తెదేపా (11), బీజేపీ (5) కూటమికి మొత్తం 16 మంది యం.యల్యేలున్నారు. కనుక వారి అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు వారికి కూడా బయట నుండి మరొక ఇద్దరు యం.యల్యేల మద్దతు అవసరం ఉంటుంది. వారు కూడా వామపక్షాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమయినప్పటికీ నామినేషన్లు వేయడానికి ఈ నెల 21వ ఆఖరు రోజు. కనుక ఆలోగానే అన్ని పార్టీలు ఈ కూడికలు, తీసివేతలు పూర్తి చేసుకోక తప్పదు.

మోడీ ఆహ్వానిస్తే కేంద్రమంత్రిగా చేరేందుకు రెడీ: కవిత

  నిన్న మొన్న దాక మోడీ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని...మోడీ గీడీ జాన్తానై...అంటూ హూంకరించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హటాత్తుగా తన పల్లవి మార్చేసి స్వచ్ఛ భారత్... స్వచ్చ తెలంగాణా...స్వచ్చ హైదరాబాద్...అంటూ మోడీ ప్రవేశపెట్టిన పధకాలన్నిటినీ భుజానికి ఎత్తుకోవడం ప్రజలకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నా, అదంతా తన కుమార్తె కవితమ్మకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకోనేందుకేనని ప్రతిపక్షాలు తేల్చిపడేశాయి. కానీ వారివన్నీ ఒట్టి ఊహాగానాలే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని నిన్న మొన్నటి వరకు వాదించిన కవితమ్మ ఇప్పుడు “మంత్రివర్గంలో చేరమని మోడీ ఆహ్వానిస్తే దాని గురించి ఆలోచిస్తామని” శాస్త్రోక్తంగా ప్రకటించేశారు. అంటే ప్రతిపక్షాలు చెప్పిందే నిజమేనని స్పష్టమవుతోంది.   అదే నిజమయితే త్వరలో తెరాస కూడా ఎన్డీయే కూటమిలో చేరడం ఖాయమని భావించాల్సి ఉంటుంది. లేకుంటే కవితమ్మను కేంద్రమంత్రిగా చేయవలసిన అవసరం ఎన్డీయేకి లేనేలేదు. కానీ, తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తే, ప్రస్తుతం తెరాస ప్రభుత్వంపై వీర పోరాటం చేస్తున్న తెలంగాణా బీజేపీ నేతలు అందుకు అంగీకరిస్తారా? వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు తెలంగాణా రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుదామని కలలు కంటున్న బీజేపీ, ఇప్పుడు కవితను ప్రభుత్వంలోను, తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చుకొన్నట్లయితే అప్పుడు రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఏమిటి? ఒకవేళ తెలంగాణలో తెరాసతో పొత్తులు పెట్టుకొంటే అప్పుడు తెదేపాతో తెగతెంపులు చేసుకొంటుందా? తెగ తెంపులు చేసుకొంటే తెలంగాణాలో తెదేపాను వ్యతిరేకిస్తూ, ఆంధ్రాలో దానితో పొత్తులు కొనసాగించడం సాధ్యమేనా? అనే ప్రశ్నలకు బీజేపీ అధిష్టానం సమాధానం ఆలోచించవలసి ఉంటుంది.

రంగంలోకి కేజ్రీవాల్ కూతురు

  ఈ సృష్టిలోని జీవులన్నిటికీ వుండే లక్షణం... తమ సంతానం బాగుండాలని కోరుకోవడం. తమ సంతానం అభివృద్ధి చెందాలని ఆశించడం. మనుషులు కూడా దీనికి అతీతులేమీ కాదు.. ఆ మాటకొస్తే మిగతా అన్ని జీవుల కంటే మనుషులకే ఈ తాపత్రయం ఎక్కువ. తమ వారసులు కూడా తమలాగే అభివృద్ధి చెందాలి. సినిమా ప్రముఖులు తమ వారసులను రంగంలోకి దించుతారు. వ్యాపారులు తమ వారసులను కూడా వ్యాపారంలో దించుతారు. లైమ్‌లైట్‌లో వుండే ఏ ఫీల్డులో రాణిస్తున్నవారైనా తమ సంతానం కూడా తమ బాటలోనే నడిచి రాణించాలని కోరుకుంటారు. రాజకీయ రంగంలో అయితే ఈ కోరిక చాలా ఎక్కువగా వుంటుంది. రాజకీయ నాయకుల పుత్రరత్నాలు, పుత్రికా రత్నాలు తమ తల్లిదండ్రుల బాటలో నడుస్తూ అధికారం, పదవులు ఆస్వాదించడం చూస్తూనే వున్నాం. ఇదే బాటలో ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నడుస్తున్నారు. తన కుమార్తె హర్షితా కేజ్రీవాల్‌ని తన రాజకీయ వారసురాలిగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తండ్రి ఆకాంక్షను నెరవేర్చేందుకు హర్షితా కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఢిల్లీ ప్రజల దృష్టిని మాత్రమే కాదు.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.   అసలేం జరిగిందంటే, అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ తనకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళారట. తన దగ్గర అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ అక్కడున్న అధికారితో తన దగ్గర ఒక పత్రం లేదని, లంచం ఇస్తానని అన్నారట. అయితే ఆ అధికారి లంచం తీసుకోవడానికి నిరాకరించడంతోపాటు ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించాడట. ఆ తర్వాత హర్షితా కేజ్రీవాల్ అన్ని పత్రాలనూ సమర్పించి డ్రైవింగ్ లైసెన్స్ పొందారట. ఇది ఒక సమావేశంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ తన కుమార్తె హర్షిత చేసిన ఘనకార్యం గురించి గర్వంగా చెప్పుకున్న తీరు. తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో అవినీతి బాగా తగ్గిందని చెప్పడం కోసం కేజ్రీవాల్ఈ ఉదంతాన్ని చెప్పుకున్నారు. అయితే దీని వెనుక ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో తన కుమార్తెని తన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దడం, ఆ విషయాన్ని అందరికీ తెలియజేసే ఆలోచన కూడా వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ఢిల్లీ ప్రజలకు చాలా సుపరిచితురాలు. గత ఎన్నికలలో ఆమె తండ్రితో కలసి ప్రచారం కూడా చేశారు. ఆమె ముఖం తెలియని వాళ్ళు ఢిల్లీలో చాలా తక్కువ. అలాంటిది ఒక ఆర్టీఏ అధికారికి ఆమె తెలియకుండా ఎలా వుంటారు? అందుకే సదరు అధికారి లంచం తీసుకోవడానికి నిరాకరించి వుండవచ్చు. అలాగే ఎంత పెద్ద లంచగొండి అయినా లంచం ఇస్తా తీసుకో అంటే పొరపాటున కూడా తీసుకోడు. హర్షిత లంచం ఇస్తానని అన్నప్పుడు అలాగే జరిగి వుండవచ్చు. లేదా అతను నిజాయితీపరుడు కూడా అయి వుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఉదంతాన్ని బయట పెట్టడం ద్వారా కేజ్రీవాల్ తన ప్రభుత్వం గురించి భజన చేసుకోవడంతోపాటు తన కుమార్తె తన రాజకీయ వారసురాలు అని ఢిల్లీ ప్రజలకు హింట్ కూడా ఇచ్చేశారు.

వెట్రివేల్ రాజీనామా జయలలిత కోసమేనా?

  అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించి, ఆమెకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను, రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేయడంతో ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు రంగం సిద్దమవుతోంది. కానీ దీనికి సంబంధించి ఏ.ఐ.ఏ.డి.ఎమ్.కె. పార్టీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. కానీ ఈ నెల 22న ఉదయం 8గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జయలలిత అధ్యక్షతన జరుగబోయే సమావేశానికి పార్టీ యం.యల్యేలు అందరూ విధిగా హాజరు కావాలని అందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. బహుశః ఆరోజు వారందరూ కలిసి ఆమెను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం ఆ తరువాత ఆమె ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం అంతా లాంచనప్రాయమేనని భావించవచ్చును.   కర్ణాటక హైకోర్టు ఆమె నిర్దోషిగా ప్రకటించిన వెంటనే ఆమెను కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పనీర్ సెల్వం ఆమె కోసం తను ముఖ్యమంత్రి కుర్చీని ఖాళీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ ఆమె మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఆరు నెలలులోగా శాసనసభకు ఎంపిక కావలసి ఉంటుంది. కనుక ఆమె తన నియోజక వర్గమయిన శ్రీరంగం నుండే పోటీ చేస్తారని అందరూ భావించారు. పార్టీకి చెందిన రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెట్రివేల్ హటాత్తుగా నిన్న తన పదవికి రాజీనామా చేయడం దానిని వెంటనే స్పీకర్ ఆమోదించడంతో ఆమె ఈసారి ఆ నియోజక వర్గం నుండి పోటీ చేయవచ్చని అందుకే ఆయన తన స్థానాన్ని జయలలిత కోసం ఖాళీ చేసారని అందరూ భావిస్తున్నారు. కానీ శాసనసభకు పోటీ చేసేందుకు ఆరు నెలల సమయం ఉండగా ఆమె ఇంకా అధికారం చేప్పట్టక ముందే ఆయన అంత హడావుడిగా రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటనే ప్రశ్న కూడా అనేక ఊహాగానాలకు తావిస్తోంది.   అధికార ఏ.ఐ.ఏ.డి.ఎమ్.కె. పార్టీలో తెర వెనుక ఇంత జరుగుతున్నా పైకి మాత్రం పార్టీలో ఎటువంటి హడావుడి కనబడటక పోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ "అసలు ఆ పార్టీలో తెర వెనుక ఏమి జరుగుతోందో అర్ధం కావడం లేదన్నారు." ప్రధాన ప్రతిపక్షమయిన డీ.యం.కె.పార్టీ కూడా అధికార పార్టీలో ఏమి జరుగబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

రాహుల్ గాంధీ నిప్పు రాజేశాడు

మొత్తానికి రాహుల్ గాంధీ భలేవాడే... తెలంగాణలో పాదయాత్ర చేశాడు... ఇక్కడ రాజకీయ నిప్పు పెట్టి వెళ్ళాడు. అయ్యగారు ఎక్కడ లెగ్గుపెట్టినా ఇంతేనేమో. రైతు పరామర్శ యాత్ర కోసం వచ్చిన ఆయన వచ్చిన పని చూసుకుని వెళ్ళకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేశాడు. ఆ చేసే విమర్శలు కూడా సూటిగా సుత్తిలేకుండా చేయకుండా కేంద్రంలో వున్న మోడీకి, రాష్ట్రంలో వున్న కేసీఆర్‌కి లింకుపెట్టి మరీ విమర్శలు చేశాడు. కేసీఆర్ని ఆయన ‘మినీ మోడీ’ అని విమర్శించి కొత్త పదాన్ని సృష్టించాడు. ఆ తర్వాత ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ నాయకులకు పౌరుషాన్ని తెప్పించాయి. అయితే మొట్టమొదట ఈ వ్యాఖ్యల మీద స్పందించిన పార్టీ ఏదో తెలిస్తే రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోతాడేమో. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కేసీఆర్‌తో మోడీని పోల్చడం పట్ల స్పందిస్తే ఎవరు స్పందించాలి? మా నాయకుడిని మోడీతో పోల్చుతావేంటంటూ టీఆర్ఎస్ వాళ్ళు స్పందించాలి. లేకపోతే కేసీఆర్‌కి, మోడీకి పోలిక ఏంటని బీజేపీ వాళ్ళు స్పందించాలి. ఈ ఇద్దరూ కాకుండా ఈ అంశం మీద తెలుగుదేశం నాయకులు స్పందించారు. అఫ్‌కోర్స్... రాహుల్ గాంధీని టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా వదిలిపెట్టరనుకోండీ... అయినప్పటికీ మొదట స్పందించిన క్రెడిట్ మాత్రం తెలంగాణ టీడీపీ సొంతం చేసుకుంది. కేసీఆన్ని మోడీతో పోల్చడం మీద టీటీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. నరేంద్రమోడీ గంగా నది లాంటివాడు అయితే, కేసీఆర్ మూసీ నది లాంటివాడని, ఆయనతో ఈయన్ని పోల్చడం ఏంటని వాళ్ళు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా టీటీడీపీ నాయకులు కేసీఆర్ని విమర్శల వర్షంతో తడిపేశారు. కేసీఆర్ పాలన మీద తమకున్న వ్యతిరేకత అంతా వ్యక్తం చేసేవారు. కేసీఆర్ పాలన మీద వాళ్ళకున్న ఆగ్రహం ఏ స్థాయిలో వుందో వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక టీటీడీపీ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వాళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళూ ఘాటు కామెంట్లు చేస్తారు... ఇక ఈ విమర్శల పర్వం ఈ అంశంమీద కొంతకాలం ఇలాగే కొనసాగుతుంది. ఈ గొడవకి కారణమైన రాహుల్ గాంధీ మాత్రం తాను తెలంగాణలో పర్యటించిన విషయాన్ని కూడా మరచిపోయి ఢిల్లీలో హాయిగా రెస్టు తీసుకుంటూ వుంటాడు. ఏంటో ఈ రాజకీయాలు.