టీ టీడీపీలో ఎవర్నీ నమ్మక్కర్లేదు
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న కూకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేస్తూ కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు టీఆర్ఎస్లోకి చేరిపోయారు. ఆయన పార్టీ మారడం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యేని కోల్పోవడంతోపాటు గెలవాల్సిన ఎమ్మెల్సీ సీటును కూడా కోల్పోయింది. ఆయన పార్టీ మారడం కారణంగానే మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపిన కేసులో చిక్కుకోవలసి వచ్చింది. పదవులకు రాజీనామా చేయకుండానే పార్టీ మారడం, పార్టీ మారిన వాళ్ళను పదవుల్లోంచి తొలగించే విషయంలో స్పీకర్ ఎంతమాత్రం పట్టించుకోకుండా వుండటం... విషయం కోర్టు వరకూ వెళ్ళడం, కోర్టు హెచ్చరికలు జారీ చేయడం... ఇవన్నీ చూస్తుంటే ఇవి భవిష్యత్ తరాలకు కొత్త రాజకీయ పాఠాలు నేర్పుతాయని అనిపిస్తూ వుంటుంది.
వెళ్ళినవాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు తెలంగాణ టీడీపీలోనే వున్నారు. ఇప్పుడు టీటీడీపీలో వున్న ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడితోనే తాము వుంటామని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని చెబుతూ వుంటారు. టీఆర్ఎస్ మీద నిప్పులు చిమ్ముతూ వుంటారు. అయితే ఇప్పటి వరకూ టీటీడీపిని విడిచిపెట్టి వెళ్ళినవాళ్ళందరూ గతంలో చంద్రబాబు నాయకత్వం మీద అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేసివారే. టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను అన్యాయంగా తమ పార్టీలోకి లాక్కుంటోందని మొత్తుకున్నవారే. చివరికి వారే పార్టీ మారిపోయారు. మరి ఇప్పుడు పార్టీలో వుండి, టీఆర్ఎస్ని విమర్శిస్తున్నవారు కూడా ఫ్యూచర్లో పార్టీ మారరన్న గ్యారెంటీ ఏమీ లేదు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బదీసే ఉద్యమం జరుగుతోంది. ఈరోజు టీఆర్ఎస్ని తీవ్రంగా విమర్శిస్తున్న వారు రేపు తెల్లవారేసరికి టీఆర్ఎస్ తీర్థం, ప్రసాదం పుచ్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫలానా ఎమ్మెల్యే నైతిక విలువలు వున్న వ్యక్తి, అతను పార్టీకి ద్రోహం చేయడు అనుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ మానసిక స్థితికి ప్రజలు ఏనాడో వచ్చేశారు. ఈ స్థితికి రావల్సింది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. ఆయన టీటీడీపీలో వున్న ఏ ఎమ్మెల్యేని నమ్మాల్సిన అవసరం లేని స్థితిని, ఫలానా ఎమ్మెల్యే పార్టీలోనే వుంటాడని భరోసాగా వుండాల్సిన పరిస్థితిని ఇప్పటి వరకు పార్టీని వీడిన ఎమ్మెల్యేలు తెచ్చారు.