జి.హెచ్.యం.సి. ఎన్నికలు అందుకే ఆలస్యం అవుతున్నాయా?

    ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.   జి.హెచ్.యం.సి. పరిధిలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, మజ్లీస్ పార్టీలకి ఉన్నంత పట్టు తెరాసకు లేకపోవడంతో ఈ పునర్విభజన ద్వారా తన పట్టు పెంచు కోవాలని ప్రయత్నిస్తోందని వారి వాదన. ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన వార్డుల పునర్విభజన ప్రణాళికను చూసినట్లయితే ఆ సంగతి స్పష్టం అవుతుందని వారు వాదిస్తున్నారు. తెరాస ఎమ్మేల్యేలు సి. కనక రెడ్డి, టి.పద్మారావు గౌడ్ మరియు ఎం.సుదీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరీ, మేడ్చల్, సికింద్రాబాద్ నియోజక వర్గాల క్రిందకు వచ్చే ప్రాంతాలలో వార్డుల సంఖ్యను పెంచడం ద్వారా అక్కడ అదనపు స్థానాలు సంపాదించవచ్చని తెరాస ఎత్తు వేసిందని వారు అభిప్రాయపడుతున్నారు.   అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట, జి.హెచ్.యం.సి పరిధిలో బీజేపీ మరియు ఇతర పార్టీలకి బాగా పట్టున్న ప్రాంతాలలో వార్డులను కుదించడం ద్వారా వారికి అడ్డు కట్ట వేయాలని చూస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసారు. వార్డుల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరపాలి కానీ పార్టీల బలాబలాల ప్రాతిపదికన కాదని వారు వాదిస్తున్నారు. ఈ కూడికలు తీసివేతల కారణంగానే వార్డుల పునర్విభజన ప్రక్రియలో ఆలాసం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

బీహార్ లో బీజేపీ చేతిలో ఏడు పార్టీలు చిత్తు!

  ఈ ఏడాది చివర్లో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి తన సత్తా చాటుకోవాలని బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. అందుకు ఇప్పటి నుండే గట్టిగా కృషి చేస్తోంది కూడా. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకొని ఎలాగయినా తన అధికారం నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. అందుకోసమే ఆయన ఆరు పార్టీలు కలిపి ఏర్పాటు చేసుకొన్నజనతా పరివార్ తో చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడా తనంతట తాను పోటీ చేసే గెలిచే పరిస్థితుల్లో లేదు కనుక అది కూడా జనతా పరివార్ పడవెక్కింది. అన్ని పార్టీలు ఒక వైపుంటే బీజేపీ ఒక్కటే మరోవైపు నిలబడి విధానసభ ఎన్నికలలో తలపడ్డాయి.   అవకాశం దొరికితే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలే సత్తా తమకుందని భావిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జెడి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ వంటి హేమాహేమీలున్న జనతా పరివార్ ఇటీవల జరిగిన విధాన సభ ఎన్నికలలో బీజేపీని డ్డీకొన్నారు. కానీ హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్లుగా వారందరూ అమిత్ షా వ్యూహాలకి చిత్తయిపోయారు. మొత్తం 24 సీట్లలో బీజేపీ ఏకంగా 12 సీట్లు కైవసం చేసుకోగా, అధికార జేడీయు పార్టీకి 5 సీట్లు, ఆర్.జేడికి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కించుకోగలిగాయి.   విధాన సభ ఎన్నికలలోనే జనతా పరివార్ చతికిల పడినప్పుడు ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఎలా గెలుస్తుంది? అనే సందేహం వారికీ కలిగే ఉండాలి. జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనను నిలబెట్టకపోతే తాను ఆ కూటమితో కలవనని తెగేసి చెప్పి మరీ తన పంతం నెగ్గించుకొన్న నితీష్ కుమార్ ని ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్న అడుగవచ్చును. లేదా ఆయన బదులు ఏ లాలూనో లేక ములాయమో మరొకరో నిలబడతామని పట్టుబట్టినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే కప్పల తక్కెడ వంటి జనతా పరివార్ లో నుండి ఇప్పుడే కొందరు బయటకి దూకేసినా ఆశ్చర్యం లేదు.

గవర్నర్ బదిలీపై చంద్రబాబు భిన్నాభిప్రాయం?

  ఇంతకు ముందు గవర్నర్ నరసింహన్ పై తెదేపా నేతలు, మంత్రులు నిప్పులు కక్కడం, అందుకు కారణాలు కూడా అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో కేంద్రం గవర్నర్ ని మార్చబోతోందని, కాదు..ఆయనే రాజినామాకు సిద్దపడ్డారని వార్తలు వినిపించాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు, రాజకీయ పరిస్థితుల గురించి మంచి అవగాహన ఉన్న కారణంగా కేంద్రం ఆయననే కొనసాగించదలచుకొన్నట్లు ఆ తరువాత స్పష్టమయింది.   బహుశః అదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న కలిసినప్పుడు స్పష్టం చేసారో ఏమో తెలియదు కానీ ఆయన తరువాత మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ మార్పుతో సమస్యలన్నీ పరిష్కారంకావని అన్నారు. కానీ సెక్షన్: 8 అమలు చేయాలని అలాగే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలు వివాదాల పరిష్కారానికి ఆయన మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. కొన్ని రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసరంగా డిల్లీకి పిలిపించుకొని ఆయనతో సమావేశమయినప్పుడు, వారు సెక్షన్: 8 అమలు గురించే చర్చించారని వార్తలు వచ్చేయి. కానీ ఆయన డిల్లీ నుండి తిరిగి వచ్చిచాలా రోజులే అయినప్పటికీ సెక్షన్: 8 అమలు గురించి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. తెరాస నేతలెవరూ కూడా ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడకపోవడం గమనిస్తే దానిని ఆయన అమలు చేయబోవడం లేదనే విషయం అర్ధమవుతోంది. కనుక చంద్రబాబు నాయుడు దాని గురించి ఆయనని ఒత్తిడి చేసినా ఎటువంటి ప్రయోజనము ఉండకపోవచ్చును. కానీ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిని ఆయన పట్టించుకోకుండా ఉండలేరు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు...

తెలంగాణ ఏసీబీ ఈమధ్య ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టు రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత బలమైన నాయకుడు కాని సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేశారనేది చాలామందికి అర్థం కాలేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం వుంది. రేవంత్ రెడ్డి చూపిస్తున్న దూకుడు తనకు ఎప్పటికైనా ఇబ్బందిగా మారే ప్రమాదం వుందని కేసీఆర్ భావించారు. అందుకే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే చాలా చిన్న నాయకుడు సండ్రను టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమి వచ్చిందా అనే సందేహం చాలామందికి కలిగింది. కేసీఆర్ సండ్రను అరెస్టు చేయించడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం  ప్రయోగించినట్టుగా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సండ్రను అరెస్టు చేయడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం కాదని... ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని పడగొట్టే వ్యూహం దీని వెనుక వుందని ఈ అంశం గురించి లోతుగా అధ్యయనం చేసిన రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల జరిగే సందర్భంలో, టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలవకపోతే అసెంబ్లీని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెలుసుకున్న కేసీఆర్ ఈ బెదిరింపు ప్రకటన చేశారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టయితే, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళి మంత్రి పదవి పొందిన తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీగా ఓడిపోవడం ఖాయం అయ్యేదే. దాంతో తుమ్మల ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దాంతో అలెర్ట్ అయిపోయిన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ‘అసెంబ్లీ రద్దు’  హెచ్చరిక జారీ చేశారని భోగట్టా. అయితే కేసీఆర్ చేసిన ఈ ప్రకటన చూసి తెలంగాణ తెలుగుదేశం నాయకులు కేసీఆర్ టీడీపీని చూసి భయపడిపోతున్నారని భ్రమించడమే కాకుండా, కేసీఆర్ వ్యూహాలను తక్కువ అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నిన వ్యూహంలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య చిక్కుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద కేసీఆర్ పన్నిన వ్యూహంలో సండ్ర కూడా ఇరుక్కున్నారు. అయితే ఈ వ్యవహారం సండ్రతో ఆగే అవకాశం కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సండ్ర తుమ్మల నాగేశ్వరరావుకు ప్రియ శిష్యుడు. తుమ్మల టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లో చేరినప్పుడు సండ్ర తన గురువును అనుసరించలేదు. ఈ విషయంలో తుమ్మలకు సండ్ర మీద కోపం వుందని, అందుకే ఓటుకు నోటు వ్యవహారంలో తన మాజీ శిష్యుడని కూడా చూడకుండా సండ్రను ఇరికించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రాజకీయంగా తన చిరకాల ప్రత్యర్థి అయిన ఓ మాజీ ఎంపీని కూడా సండ్ర ద్వారా ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సూత్రం ఇక్కడ వర్తించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సరే, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు ఎలా వున్నా... ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో వుంది. గౌరవనీయమైన న్యాయస్థానాలే ఈ విషయంలో నిజానిజాలను నిగ్గు తేలుస్తాయి. అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తాయి. అప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలను గమనించడమే మన పని!

బాబాయ్ తో సినిమా చేస్తా: రామ్ చరణ్ తేజ్

  ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ ఈ రోజు హైదరాబాద్ లో తను భాగస్వామిగా ఉన్న ట్రూ జెట్ విమాన సర్వీసులను ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14 నుండి ప్రారంభం అయ్యే పుష్కరాలకు ట్రూ జెట్ ప్రత్యెక సర్వీసులు నడిపిస్తుందని తెలిపారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడిచే ఈ విమాన సర్వీసులు మొదటి దశలో చెన్నై, ఔరంగాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, మంగుళూరు మొదలయిన ప్రాంతాలకు ఆరంభిస్తామని తరువాత క్రమంగా దేశంలో ప్రధమ, ద్వితీయ స్థాయి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఆయన చెప్పారు.   తన తండ్రి చిరంజీవి చేయబోయే 150వ చిత్రం గురించి కూడా విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ఆ సినిమాని తనే నిర్మించబోతున్నానని దానికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని అందులో ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. ఇంతవరకు ఆ సినిమా ఫస్ట్-ఆఫ్ పై కధా చర్చలు పూర్తయ్యాయని సెకండ్ ఆఫ్ పై చర్చిస్తున్నారని తెలిపారు. ఇక మరో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే గబ్బర్ సింగ్-2 షూటింగ్ పూర్తయిన తరువాత, తను బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.   పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన్నప్పటి నుండి చిరంజీవి-పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది. మళ్ళీ చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేసేందుకు అంగీకరించడం చూస్తే మళ్ళీ మెగా కుటుంబం దగ్గరవుతున్నట్లుంది. అదే నిజమయితే అందరి కంటే ఎక్కువగా వారి అభిమానులే సంతోషిస్తారని చెప్పవచ్చును.

రాజకీయ కారణాలతోనే మెహబూబ్ నగర్ బంద్?

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసినందుకు నిరసనగా ఈరోజు మెహబూబ్ నగర్ జిల్లాలో అధికార తెరాస బంద్ నిర్వహిస్తోంది. తెరాస ఎమ్మేల్యేలు శ్రీనివాస్ గౌడ్, మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ వ్రాసినంత మాత్రాన్నే బంద్ నిర్వహించడం చూస్తే, ప్రజల దృష్టిలో తమ పార్టీని దోషిగా నిలబెట్టి అప్రదిష్టపాలు చేసేందుకేనని తెదేపా నేతలు భావిస్తున్నారు.   ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి పిర్యాదులు చేసుకొంటూ, అనేక అంశాల మీద అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి ఇంతవరకు అనేక లేఖలు వ్రాసుకొన్నాయి. కానీ వాటిని సాకుగా చూపి ఈవిధంగా ఎన్నడూ బందులు నిర్వహించలేదు. కానీ చంద్రబాబు కేంద్రానికి లేఖ వ్రాసారనే సాకుతో అధికారంలో ఉన్న తెరాసయే బంద్ నిర్వహించడం రాజకీయ దురుదేశ్యంతో చేస్తున్నదే తప్ప మరొకటి కాదని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీ త రాజకీయ ప్రత్యర్ధిని దెబ్బ తీసేందుకు ఈవిధంగా ఊహాజనితమయిన సమస్యలను సాకుగా చూపుతూ బంద్ నిర్వహించడం కేవలం బాధ్యతారాహిత్యమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నట్లయితే తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ వ్రాసి తన అభిప్రాయాలు తెలుపవచ్చును. కానీ ఆ పని చేయడం మాని అధికార పార్టీయే స్వయంగా బంద్ కి పిలుపునీయడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

కవ్విస్తూ నిందించడం ఆయనకే చెల్లు!

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఒక వివాదం సమసిపోక ముందే మరొకటి మొదలవడం సర్వసాధారణం అయిపోయింది. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తుతున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోగా ఆయనే తెలంగాణాకు సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణా ట్రాన్స్ కో నుండి ఏకపక్షంగా 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను తొలగించడం, రెవెన్యూ శాఖలో చేస్తున్న35మంది ఆంధ్రా ఉద్యోగులను తొలగించడం, రెండు రాష్ట్రాలకు చెందాల్సిన సెక్షన్: 10 క్రిందకు వచ్చే 142 సంస్థలన్నిటినీ ఏకపక్షంగా స్వాధీనం చేసుకొని అందులో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను బయటకి పంపాలనుకోవడం వంటి కవ్వింపు చర్యలకి పాల్పడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడుని నిందించడం విచిత్రం. రాజకీయ నాయకులని పదవులు కోల్పోయినా, తొలగించబడినా వారు మళ్ళీ ఏదో విధంగా అధికారం సంపాదించుకోగలరు. కానీ ఉద్యోగులకు అటువంటి అవకాశం ఉండదు. గత రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను ఇలాగ అర్ధంతరంగా తొలగిస్తే వారి పరిస్థితి, వారి మీదే ఆధారపడిన వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రా ప్రజల కాలిలో ముల్లు దిగితే తన నాలికతో తీస్తానన్న పెద్దమనిషి ఇప్పుడు ఏకంగా వారిని రోడ్డున పడేస్తే వారు తమ ఘోడు ఎవరికి మొరపెట్టుకోవాలి?      ఉద్యమ సమయంలో ఇటువంటి దూకుడు వల్ల ఆశించిన ఫలితాలు వచ్చి ఉండవచ్చును. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే దూకుడు ప్రదర్శించడం వలన ప్రభుత్వాల మధ్య, చివరికి ప్రజల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడేందుకే అది దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలున్నాయి. కనుక రెండు ప్రభుత్వాలు వాటిపైనే తమ దృష్టి లగ్నం చేసి పనిచేయాలి తప్ప ఇటువంటి రాజకీయాలతో కాదని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు.

వ్యాపంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం, మరొకరు మృతి

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం (మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణం, దానిలో వరుసగా జరుగుతున్న అనుమాన స్పద మరణాలపై దాఖలయిన అనేక పిటిషన్లను ఈరోజు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, దానిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈకేసులో కేంద్ర ప్రభుత్వానికి, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి నాలుగు వారాలలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. పిటిషనర్ల తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది (మాజీ కేంద్రమంత్రి) కపిల్ సిబాల్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ ని తక్షణమే పదవిలో నుండి తొలగించవలసిందిగా కేంద్రాన్ని ఆదేశించామని కోరారు. కానీ ఆయనకి కూడా దీనిపై స్పందించేందుకు సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఇకపై ఈ కేసు పురోగతిని తామే స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.యల్. దత్తు ప్రకటించారు.   ఒకవైపు సుప్రీంకోర్టులో ఈకేసుపై విచారణ జరుగుతుంటే, ఈ కేసులో సాక్షిగా పేర్కొనబడిన సంజయ్ యాదవ్ అనే పోలీస్ కానిస్టేబిల్ ఈరోజే అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. ఇంతవరకు ఈ కేసుతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సంబంధం ఉన్న48మంది వ్యక్తులు అనుమాన స్పద స్థిలో మరణించారు. ఈరోజు వారి సంఖ్యా 49కి చేరింది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్ కూడా కొన్ని నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.

తెదేపాతో తెరాస మైండ్ గేమ్ ఆడుతోందా?

  ఓటుకి నోటు కేసులో విషయంలో మొదట ఉరుకులు పరుగుల మీద పనిచేసిన ఎసిబి అధికారులు ఇప్పుడు చాలా నిదానంగా పనిచేయడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ కేసు విషయంలో వారు దూకుడుగా ముందుకు వెళ్ళినట్లయితే అటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అదే దూకుడు ప్రదర్శిస్తే తాము కూడా నష్టపోతామనే సంగతి గ్రహించినందునే తెరాస ప్రభుత్వం ఎసిబి దర్యాప్తుని మందగింప జేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన తరువాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇక ఆ బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని ప్రగల్భాలు పలికిన తెరాస నేతలు ఇప్పుడు గట్టిగా ఆ మాట అనలేకపోవడం, ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పడికట్టు పదాలు పదాలు పలుకుతుండటం గమనిస్తే వారు వెనక్కి తగ్గినట్లే కనబడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.   కానీ నేటికీ ఈ కేసు మెల్లగా ముందుకు సాగనీయడం, తెదేపా నేతలకు ఒకరి తరువాత మరొకరికి తాపీగా ఎసిబి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేయడం, తరువాత వారు బెయిల్ పై విడుదలవడం గమనించినట్లయితే, తెరాస తెదేపాతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు అనుమానం కలుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈవిధంగా చేస్తుండటం వలన తెదేపాను నిరంతరంగా తీవ్ర ఆందోళనకు గురిచేయడమే కాకుండా, తెలంగాణా ప్రజలలో తెదేపా పట్ల వ్యతిరేకతను కల్పించవచ్చును. ఇదేవిధంగా ఈ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేస్తూ ఈ కేసును మరికొంత కాలం సాగదీసినట్లయితే, తెలంగాణాలో తెదేపా నేతల, ప్రజా ప్రతినిధుల ఆత్మస్థయిర్యం దెబ్బ తీయవచ్చునని తెరాస భావిస్తోందేమో? ఈ విధంగా తెదేపాలో కనీసం ఒకరిద్దరు బలమయిన నేతలను లొంగదీయగలిగినా ఇక తెలంగాణాలో ఆ పార్టీ ఎన్నటికీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయవచ్చునని తెరాస భావిస్తోందేమో? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి తెరాసకు గట్టి పోటీ ఇస్తామని చెపుతున్న తెదేపా మరి తెరాస తమతో ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ని ఏవిధంగా ఎదుర్కొని నిలుస్తుందో వేచి చూడాలి.

తెరాసకు మద్దతు ఇచ్చేక మళ్ళీ కోర్టులో కేసేందుకో?

  తెలంగాణాలో తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల నుండి చాలా మంది ఎమ్మేల్యేలు తెరాసలోకి మారారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా తమ పార్టీల ద్వారా సంపాదించిన ఎమ్మేల్యే పదవులకి రాజీనామా చేయలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో శాసనసభ కార్యదర్శి విడుదల చేసిన ఎమ్మేల్యేల జాబితాలో ఆ విషయం స్పష్టంగా పేర్కొనబడింది. వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలు స్పీకర్ మధుసూదనాచారిని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన కూడా వాటిని పట్టించుకోకపోవడంతో ఆ మూడు పార్టీల నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేసారు. వారి పిటిషన్లని నిన్న హైకోర్టు విచారణకు చేప్పట్టింది. కానీ దీనిపై సమాధానం తెలిపేందుకు మరికొంత సమయం కావాలని తెలంగాణా అడ్వోకేట్ జనరల్ కే.రామకృష్ణా రెడ్డి కోరడంతో హైకోర్టు ధర్మాసనం ఈ కేసును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.   ఒక పార్టీకి చెందిన ఎమ్మేల్యేలు మరొక పార్టీకి చెందిన ప్రభుత్వంలో కొనసాగడం రాజ్యంగ విరుద్దం. ఒకవేళ వారు వేరే పార్టీలో జేరదలిస్తే ముందు తమ ఎమ్మేల్యే పదవులకి రాజీనామా చేసిఉన్నట్లయితే ఎటువంటి సమస్య ఉండేది కాదు. కానీ తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మేల్యేలు తెరాసలో చేరినప్పటికీ తమ ఎమ్మేల్యే పదవులను వదులుకోలేదు. పైగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిలలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలు జరీ చేసిన విప్ ని దిక్కరించి తెరాస సభ్యుడికి ఓటేశారు. కనుక వారిని అనర్హులుగా ప్రకటించాలని తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కోరుతున్నాయి.   కానీ వైకాపా కూడా వారితో కలిసి కోర్టులో పిటిషన్ వేయడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మేల్యలో ఇద్దరు తెరాసలోకి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఏమీ నోరుమెదపలేదు. పైగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిలలో మళ్ళీ తెరాస అభ్యర్ధికే వైకాపా మద్దతు ఇచ్చింది. తెరాసకు మద్దతు ఇవ్వడాన్ని తెదేపా నేతలు విమర్శించినప్పుడు “తమ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చుకొంటే వారికెందుకు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు కూడా. తెరాసకు మద్దతు ఇస్తున్నప్పుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ ఎందుకు వేసినట్లో వైకాపాకే తెలియాలి.

వ్యాపం...మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది

  వ్యాపం కాదు నాగుపాము: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం (మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షా బోర్డు) కుంభకోణంలో నానాటికీ అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ కుంభకోణం గురించి ఆరా తీయాలని ప్రయత్నించిన వాళ్ళు లేదా అందుకు సహకరించిన వారు ఒకరొకరుగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. ఇంతవరకు ఈ కుంభకోణంలో 45మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో దేశంలో పెద్ద సంచలనం కలిగిస్తోంది.   వ్యాపం అంటే ఏమిటి? వ్యాపం ద్వారా రాష్ట్రంలో ఉపాద్యాయులు, కానిస్టేబుల్స్, మెడికల్ ఆఫీసర్లు, అటవీశాఖ గార్డులు తదితర అనేక ఉద్యోగాల భర్తీకి, ఉన్నత వృత్తి విద్యాసంస్థలలో ప్రవేశాలకి ఈ బోర్డు అద్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయి.   ఈ భాగోతం ఎప్పడు మొదలయిందంటే... ప్రభుత్వోద్యోగాలలో నియామకాలు కాబట్టి సహజంగానే లక్షల కోట్లు లంచాలు పంచుకొనే అనేకమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, దళారులు ఈ వ్యాపం బోర్డుని తెరవెనుక నుండి శాశిస్తున్నారు. ఈ వ్యాపం బోర్డులో చాలా అవక తవకలు జరుగుతున్నాయని 1990 సం.లోనే పిర్యాదులు వచ్చేయి. కానీ 2000 సం.లో వరకు వాటిపై ఎటువంటి విచారణ కానీ కేసు నమోదు చేయడం గానీ జరగలేదు.   కమిటీలు విచారణలు: మొట్టమొదటిసారిగా2000 సం.లో యఫ్.ఐ.ఆర్ నమోదు అయింది. కానీ 2009సం. వరకు కూడా ఆ కేసులో పెద్దగా కదలిక కనబడలేదంటే, తెర వెనుక ఎన్ని పెద్ద తలకాయలు పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. 2009సం.లో వ్యాపం బోర్డు నిర్వహించిన ప్రీ-మెడికల్ టెస్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేయగా అదే సుమారు రెండేళ్ళ పాటు అధ్యయనం చేసి 2011సం.లో తన నివేదికని సమర్పించింది.   లంచావతారాలు ఎన్నో! ఆ నివేదిక ఆధారంగా సుమారు 100 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ 2012సం.లో దీనిపై ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేశారు. అది ఒక ఏడాది అద్యయనం చేసిన తరువాత వ్యాపం బోర్డులో జరుగుతున్న అవకతవకలలో గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, ఆయన కుమారుడు శైలేష్ యాదవ్, గవర్నర్ వద్ద పనిచేసే ఆఫీసర్-ఆన్-స్పెషల్ డ్యూటీ ధనరాజ్ యాదవ్, రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మి కాంత్ శర్మ తదితరులతో సహా అనేకమంది రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల, వ్యాపారుల ప్రమేయం ఉందని తెలియజేస్తూ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అది చేతికి అందిన మూడు సం.ల తరువాత ఈ వ్యాపం కుంభకోణం తో సంబంధం ఉందని భావిస్తున్న ధనరాజ్ యాదవ్ తో సహా మొత్తం 2000 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వారిలో 100 మందికి పైగా రాజకీయ నాయకులున్నారు.   అరెస్టయిన వారిలో అనేకమంది బడా వ్యాపారవేత్తలు చివరికి విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కూడా ఉండటం గమనిస్తే వ్యాపం బోర్డులో అవకతవకలు ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చును. అప్పుడు గవర్నర్ తో సహా వారందరి మీద కేసులు నమోదు చేయబడగా గవర్నర్ మాత్రం తనకున్న రాజ్యాంగ రక్షణ కవచం ఉపయోగించుకొని బయటపడ్డారు. కానీ ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. కానీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో గవర్నర్ పదవీ విరమణ చేసిన వెంటనే మళ్ళీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణ మొదలు పెడతామని సిట్ అధికారులు స్పష్టం చేసారు.   మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది! ఈ కుంభకోణంలో అరెస్టులు ఏ స్థాయిలో ఉన్నాయో అనుమానాస్పద మరణాలు అదే విధంగా ఉన్నాయి. ఈ కుంభకోణంలో ఇంతవరకు మొత్తం 45మంది చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు.ఈ వ్యవహారం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సూత్రధారులను కనుగొనేందుకు కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్ హైకోర్టు ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) ఏర్పాటు చేసింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుంటే మరొకవైపు అనుమానాస్పద మరణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.   ఈ వ్యవహారం రాన్రాను విషమిస్తుండటంతో సుప్రీంకోర్టులో దానిపై కొందరు న్యాయవాదులు, ఆమాద్మీ పార్టీ నేతలు మరికొందరు ఇతర వ్యక్తులు పిటిషన్లు వేసారు. వాటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి హెచ్.యల్. దత్తు, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర మరియు జస్టిస్ అమితావ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును 9వ తేదీన విచారణకు చేప్పట్టబోతోంది. కానీ వ్యాపం మరణ మృదంగం మారుమ్రోగుతూనే ఉంది.   మొట్టమొదట 2009సం.నుండి 2014సం.వరకు మొత్తం 14మంది బ్రోకర్లు, ఆరుగురు విద్యార్ధులు, ముగ్గురు విద్యార్ధుల తండ్రులు, ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక జర్నలిస్ట్ (అజ్ తక్ హిందీ న్యూస్ ఛానల్ విలేఖరి), జబల్ పూరులో యన్.యస్. మెడికల్ క్లాలేజి డీన్ అరుణ్ శర్మ తో సహా అనేకమంది అనుమానాస్పద స్థితిలో మరణించారు.   ఈ దారుణపరిస్థితి చూసి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ “ఈ వ్యాపం వ్యవహారంలో నాపైన కూడా యఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడి ఉంది కనుక ఏదో ఒకరోజు నేను కూడా చనిపోతానేమో?”అని భయం వ్యక్తం చేసారంటే పరిస్థితి ఎంత తీవ్రత అర్ధమవుతుంది.   దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీతో సహా అనేకమంది కోరుతున్నారు.

టీడీపీ గ్రహస్థితి బాగుండాలంటే...

  తెలుగుదేశం పార్టీ గ్రహస్థితి ఇప్పుడు చాలా బాగుంది. అన్ని గ్రహాలూ అనుకూలించాయి... పార్టీలోని నాయకులు, కార్యకర్తలు శ్రమించారు. తెలుగుదేశం పార్టీకి పదేళ్ళ తర్వాత అధికారం దక్కేలా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళే పనిలో నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో కొంతమంది దృష్టి తెలుగుదేశం పార్టీ మీద పడుతోంది. వాళ్ళు ఎవరో కాదు... గతంలో తెలుగుదేశం పార్టీ కారణంగా రాజకీయాల్లో రాణించి, అనేక పదవులు అనుభవించి, పార్టీలో హవా నడిపించి... చివరికి పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు పార్టీని వదిలిపెట్టి పోయినవారు... శత్రు శిబిరాల్లో చేరి, కన్నతల్లి లాంటి పార్టీనే, పార్టీ నాయకుడినే నానారకాల మాటలతో ‘దాడి’ చేసినవారు.... ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పచ్చగా వుండేసరికి అలాంటి నాయకులకు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద కన్నుపడింది. మళ్ళీ ఈ పార్టీలో స్థానం సంపాదించి అందాలలకు ఎక్కాలని ఉవ్విళ్ళూరుతున్నారు. చంద్రబాబు పిలిస్తే పార్టీలో చేరతామని ఎందుకూ పనికిరాని ఆఫర్లు ఇస్తున్నారు. గ్రహస్థితి బాగాలేకపోవడం వల్లే గతంలో తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్ళామని, ఇతర పార్టీలో వుండి తెలుగుదేశం పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టానని పశ్చాత్తాపపడుతున్నారు. తిరిగి తమను పార్టీలోకి తీసుకుంటే పార్టీ సేవలో తరిస్తామని అతి వినయంగా చెబుతున్నారు. గ్రహస్థితి బాగాలేక తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన వారిని ఇప్పుడు తిరిగి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ గ్రహస్థితి ఇప్పుడు చాలా బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వదిలి వెళ్ళిపోయిన దుష్టగ్రహాలను పార్టీలో చేర్చుకోకుండా వుండాలని పలువురు కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ గ్రహస్థితి బాగుంటుందని అంటున్నారు.

వాళ్ళెందుకు స్పందించలేదు చెప్మా?

  జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయిన తర్వాత తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి బహిరంగంగా మాట్లాడిన మాటలు టీఆర్ఎస్ నాయకులకు పుండు మీద కారం జల్లినట్టుగా అయింది. రేవంత్ రెడ్డికి బెయిల్ దొరకడమే టీఆర్ఎస్ నాయకులు ఊహించని, ఆశించని, సహించని విషయం. అలాంటిది కోర్టు నుంచి బయటకి వచ్చిన తర్వాత కేసీఆర్ని నానా తిట్లూ తిడుతూ రేవంత్ మాట్లాడిన తీరు సంచలనం సృష్టించింది. టీఆర్ఎస్ నాయకులు అంగీకరించకపోవచ్చుగానీ, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ తర్వాత అంతటి స్థాయిలో ప్రజాదరణ వున్న వ్యక్తిగా మారారు. ఆయన్ని అలా మార్చింది మరెవరో కాదు.. అక్షరాలా టీఆర్ఎస్ నాయకులే... అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారే. మరి కేసీఆర్‌కి సరిసమానమైన స్థాయిలో వున్న వ్యక్తి, కేసీఆర్‌ భాషతో సరిపోయే విధంగా మాట్లాడితే... దానికి స్పందించిన వ్యక్తులు మాత్రం కేసీఆర్ స్థాయి వ్యక్తులు కాదు. కనీసం పార్టీలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వున్న కేసీఆర్ రక్తసంబంధీకులు కూడా కాదు. పార్టీలో వున్న ముగ్గురు నలుగురు నాయకులు మాత్రమే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు కూడా ఏదో తూతూ మంత్రంగా మాట్లాడినట్టున్నాయే తప్ప, రేవంత్ రెడ్డి విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చేలా మాత్రం లేవు. ఇలాంటి సందర్భాలలో రేవంత్ రెడ్డి మీద కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి మాటకారి నాయకులు మాటల దాడికి దిగితే ఒక పద్ధతిగా వుండేది. అయితే వీళ్ళెవరూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించలేదు. ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ని ఈ విషయంలో ప్రశ్నించినా ఆ పిచ్చివాడి టాపిక్ వదిలేయండి అంటూ మాట మార్చారు. మరి ‘ఆ నలుగురు’ స్పందిస్తే రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ఎదురుదాడి చేసే అవకాశం వుందని మిన్నకున్నారా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించి అతని స్థాయిని మరింత పెంచడం ఎందుకని అనుకున్నారా? అయినా రేవంత్ స్థాయిని ఇప్పుడు ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు.. ఆల్రెడీ పెరిగిపోయింది.

తెలంగాణకూ కంటితుడుపులు వున్నాయేమో!

  తెలంగాణ ముఖ్యమంత్రి చాలాసార్లు కావాలని అంటారో, తెలియక అంటారోగానీ ఆయన మాటలు చాలా వివాదాస్పదమై కూర్చుంటాయి. అలా ఆయన మాట్లాడిన మాటలు ఎంత వివాదాస్పదమైనప్పటికీ, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన ఎంతమాత్రం పశ్చాత్తాపపడిన దాఖలాలు మాత్రం కనిపించవు. ఆయన అనాలోచితంగానో, ఉద్దేశపూర్వకంగానో చేసే వ్యాఖ్యలు ఆయనను అనుసరించేవారికి వేదవాక్యాల్లా అనిపిస్తూ వుంటాయి. వారు కూడా ఆయన చెప్పిన మాటలను వల్లెవేస్తూ వుంటారు. ఆ మాటల కారణంగా వచ్చే పరిణామాలను వారు ఎంతమాత్రం ఊహించరు. విభజనచట్టంలో వున్న సెక్షన్ 8 విషయంలో కేసీఆర్ చేసిన ఒక వ్యాఖ్య నిజంగా విభజన చట్టాన్నే అవమానించే విధంగా వుంది. సెక్షన్ 8 ఆంధ్రావాళ్ళకు కంటితుడుపుగా పెట్టినదేనట... దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదట. హైకోర్టు విభజన విభజన చట్టంలో వుందని, దానిని అమలు చేయకుండా ప్రధాని మోడీ తాత్సారం చేస్తున్నారని, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వున్నారని ఈమధ్య టీఆర్ఎస్ నాయకులు మాటల దాడికి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంటితుడుపుగా సెక్షన్ 8 పెట్టారని టీఆర్ఎస్ నేతలు అంటున్నట్టేగానే, తెలంగాణ ప్రజలకు కంటితుడుపుగానే విభజన చట్టంలో హైకోర్టు విభజన అంశాన్ని పెట్టారేమో అని టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైనా ఆలోచించారా? విభజన చట్టంలో ఏపీకి కంటితుడుపులు ఉన్నట్టయితే తెలంగాణకూ కంటి తుడుపులు వుంటాయి కదా.

లేనిపోని తలనొప్పులు ఎందుకో?

  తెలంగాణ ప్రభుత్వ సైకాలజీ మీద పరిశోధనలు జరిపి డాక్టరేట్ పొందడానికి ఎవరైనా పరిశోధకులు ప్రయత్నం చేయొచ్చు. అయితే వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, వారు ఎంతవరకు తెలంగాణ ప్రభుత్వ సైకాలజీని అర్థం చేసుకుంటారన్నది చెప్పడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ సైకాలజీ అంత సంక్లి్ష్టంగా వుంది మరి. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, అనేక విషయాలలో తెలంగాణ సర్కారుకు ఎదురు దెబ్బలు తగలటం, మొట్టికాయలు పడటం మామూలైపోయింది. కొన్ని విషయాలలో తాము విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో వున్నవాటిలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇరుకున పడిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో వున్నాయి. లేటెస్టుగా సెక్షన్ 10లో వున్న సంస్థల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి దెబ్బలు తగులుతున్నాయి. ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా ప్రవేశాలు ఇవ్వాలంటే గవర్నర్ నరసింహన్ లేఖ రాశారు. ఇలా ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ, తల బొప్పి కడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో అనవసరంగా వివాదాలు పెట్టుకోవడం మానుకోవడం లేదు. దీనికి తాజా ఉదాహరణ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో టీ సర్కార్ కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయడం. ఈ పరిణామం రెండు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తున్నవారికి మింగుడు పడని విధంగా వుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంలో ఒక పద్ధతి వుంది. అయితే పట్టిసీమ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం మాత్రం విచిత్రంగా వుంది. సముద్రంలో కలసిపోయే నీటిని కాపాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు కడుతుంటే, దానికి తెలంగాణకు అభ్యంతరం ఏమిటో, కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం. ఇలాంటి విచిత్రమైన ఫిర్యాదులు చేయడం వల్ల భవిష్యత్తులో మరో ఎదురుదెబ్బ తినడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టే భావించాల్సి వుంటుంది.

పదవి ఆశించట్లేదా? ఎలాగూ ఇవ్వర్లెండి

  పదవులు కావాలని అనుకుంటున్న వారికి, అధికారం లేక అల్లాడిపోతున్నవారికి, అధికారంలో వున్న చేతిలో డబ్బు ఆడని వాళ్ళకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్వర్గధామంలా కనిపిస్తోంది. ఆ పార్టీలో చేరిపోతేచాలు తమ ఆశయాలన్నీ నెరవేరతాయని ఆశిస్తున్నారు. అందుకూ ఇతర పార్టీల్లో పదవుల్లో వున్న పెద్దమనుషులు టీఆర్ఎస్ బాట పడుతూ వచ్చారు. ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారంలో వున్నవారు టీఆర్ఎస్ బాట పట్టడం తగ్గింది. ఇప్పుడు ఎలాంటి పదవీ లేకుండా రాజకీయ నిరుద్యోగులుగా వున్న వాళ్ళు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వారిలో ఒక పెద్ద తలకాయ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్. మొన్నటి వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వున్న ఆయన తనను కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎమ్మెల్సీ చేయలేదని అలిగారు. దాంతో పార్టీ మారిపోతున్నారు. కొంతమంది పార్టీలు మారితే పోనీలెండి అనిపిస్తుంది. మరికొందరు పార్టీ మారితే  కడుపులో దేవినట్టు అనిపిస్తుంది. చివరికి ఈ పెద్దమనిషి కూడా పార్టీ మారాడా అని రాజకీయ వ్యవస్థ మీదే అసహ్యం పుట్టుకొస్తుంది. ఇప్పుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని మారడం కూడా అలాంటి ఫీలింగ్స్‌నే కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు దర్జాగా వెలగబెట్టిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఆరిపోయి వున్న పరిస్థితిలో ఆ పార్టీని విడిచిపెట్టడం అనేది ఘోరమైన విషయం. ఆయన పార్టీ మారుతున్నది పదవి ఇవ్వనందుకే అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, తాను పార్టీ మారుతున్నది పదవుల కోసం కాదని చెబుతూ డి.శ్రీనివాస్ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాను టీఆర్ఎస్‌లో చేరాక ఎలాంటి పదవి ఆశించడం లేదని చెబుతున్నారు. అయితే ఆయన పదవి ఆశించినా, ఆశించకపోయినా ఆయనకు ఇవ్వడానికి అక్కడ ప్రస్తుతం పదవులేవీ లేవు. ఒకవేళ వున్నా, పార్టీ కోసం ఎప్పటినుంచో ‘సేవ’ చేస్తున్నవారు వాటి కోసం కాసుకుని కూర్చుని వున్నారు. అంచేత డి.శ్రీనివాస్‌కి పదవి వచ్చే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కాలంటారు.. పాపం డి.శ్రీనివాస్‌కి పార్టీ మారినా ప్రతిఫలం దక్కదన్నమాట.

ఈ చిత్రపటాల రాజకీయం మండిపోను!

చేటూ పాటూ లేనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందనేది సామెత. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇలాగే తయారైంది. మొన్నటి వరకూ అధికారం వెలగబెట్టి అటు దేశాన్ని, ఇటు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు సర్వనాశనం చేశారు. అధికారంలో వున్నప్పుడు ఒకర్నొకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు అధికారం, పదవులు పోయినా బుద్ధి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో అధికారం చెలాయించిన  డి.శ్రీనివాస్ ఇప్పుడు తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఎక్స్‌టెన్షన్ చేయలేదన్న కోపంతో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో  వున్నందువల్ల లాభం లేదు... టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోవడం వల్ల నష్టం లేదు. కాకపోతే ఆయనగారు పార్టీ మారుతున్న సందర్భంగా జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటేనే చిరాకు పుడుతోంది. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన  కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ, డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వదిలపెట్టేశారు కాబట్టి వారి ఫొటోలు గాంధీభవన్లో వుండకూడదని మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఫీలయ్యారు. అక్కడితో ఆగకుండా గాంధీ భవన్లో వున్న పై ముగ్గురి చిత్రపటాలను తీసి అవతల పారేశారు. వారి చిత్రపటాలయితే తీసిపారేశారుగానీ, వారు కాంగ్రెస్ పార్టీకి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని మాత్రం తొలగించగలరా? ఇదిలా వుంటే, తన చిత్రపటం గాంధీభవన్లోంచి తీసిపారేయడం పట్ల డి.శ్రీనివాస్ తెగ ఫీలయ్యారు. తన చిత్రపటాన్ని తీసిపారేసిన వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నానని సెలవిచ్చారు. ఈయనగారికి కాంగ్రెస్ పార్టీ అక్కర్లేదుగానీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాత్రం ఆయన ఫొటో మాత్రం వుండాలి. ఆశ దోశ అప్పడం వడ. కాంగ్రెస్ పార్టీని నిర్దాక్షిణ్యంగా దెబ్బకొట్టేసి టీఆర్ఎస్‌లోకి వెళ్తున్న డి.శ్రీనివాస్ మదర్ సెంటిమెంట్‌ని పుష్కలంగా పండిస్తున్నారు. గాంధీ భవన్లోంచి తన చిత్రపటాన్ని తీసేసినప్పటికీ, తాను మాత్రం తన ఇంట్లోంచి సోనియా గాంధీ చిత్రపటాన్ని మాత్రం తీసేయనని అంటున్నారు. ఈ కాకాలేంటో, కాంగ్రెస్ రాజకీయాలేంటో!

రంగంలోకి దిగిన నరసింహన్

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని సరిదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తాజాగా జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూలులో వున్న సంస్థల మీద తెలంగాణ ప్రభుత్వం గుత్తాధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోందన్న విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. మిగతా సంస్థల విషయం అలా వుంచితే, తెలుగు విశ్వవిద్యాలయం, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరీ అడ్వాన్స్ అయిపోయింది. ఈ రెండు యూనివర్సిటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించడం మాత్రమే కాకుండా, ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా ఇవ్వలేదు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను కూడా ఏపీ విద్యార్థులవి ప్రకటించలేదు. దాంతో వేలాదిమంది ఏపీ విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా తెలంగాణ ప్రభుత్వం మెట్టు దిగలేదు. తమకు డబ్బులు చెల్లించి ఏపీ విద్యార్థులకు అడ్మిషన్లు పొందాలని తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గవర్నర్‌కి ఫిర్యాదు చేసింది. మిగతా విషయాల్లో ఎలా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో విశ్వవిద్యాలయాల విషయంలో గవర్నర్ వెంటనే స్పందించారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ప్రవేశాలు గతంలో మాదిరిగానే నిర్వహించాలని తెలంగాణ సీఎస్‌కి లేఖ రాశారు. ఇది అందరూ హర్షించదగ్గ పరిణామం. దీనినిబట్టి ఇక రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి గవర్నర్ రంగంలోకి దిగినట్టుగా భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు.

గ్రహస్థితి బాగోలేకనే వైకాపాలోకి వెళ్లారుట!

  పార్టీలు మారడానికి ముహూర్తాలు పెట్టుకొన్న రాజకీయ నాయకులని చూసాము కానీ గ్రహస్థితి బాగాలేక పొరపాటున పార్టీ మారామని చెప్పిన వారిని ఎన్నడూ చూసి ఉండము. మాజీ తెదేపా వ్యవస్థాపక సభ్యుడు దాడి వీరభద్ర రావు మాత్రం గ్రహాలు ప్రతికూలంగా ఉన్నందునే తప్పుడు నిర్ణయం తీసుకొని వైకాపాలోకి వెళ్లానని చెప్పడం విశేషం. గ్రహాలూ అనుకూలించకపోతే ఎంతవారయినా తప్పులు చేయడం అందుకు ఫలితం అనుభవించడం సహజమేనని తనేమి అందుకు అతీతుడని కాదని చెప్పుకొచ్చారు. తెదేపా ఆవిర్భావం నుండి సుమారు మూడు దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేసానని, మళ్ళీ తనను పార్టీలో చేర్చుకొనేందుకు అంగీకరిస్తే జీవితాంతం పార్టీకి సేవ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన అనుచరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన రాజకీయ స్నేహితులు అందరూ కూడా మళ్ళీ తెదేపాలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని కనుక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను మళ్ళీ పార్టీలో చేర్చుకొనేందుకు అంగీకరిస్తే తను కూడా అందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.   తెదేపాతో తనకు మూడు దశాబ్దాల అనుబందం ఉందని ఇప్పుడు గుర్తు చేసుకొంటున్న ఆయన తనకు రెండవసారి ఎమ్మెల్సీ పదవి ఈయలేదనే కుంటి సాకుతో పార్టీని వీడి ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. కానీ అసలు కారణం ఏమిటంటే వైకాపా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఆయన అంచనా వేసి ఆ పార్టీలోకి దూకేశారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఎన్నికలలో వైకాపా ఓడిపోయింది, ఆయన విడిచిపెట్టేసిన తెదేపా అధికారంలోకి వచ్చింది. దానితో కంగుతిన్న ఆయన తక్షణమే వైకాపాని వదిలిపెట్టి తెదేపాలోకి తిరిగి వచ్చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ తెదేపా ఆయనని తిరిగి పార్టీలో చేర్చుకొనేందుకు ఇష్టపడటం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.   అధికార దాహంతో పార్టీలు మారిన ఆయన ఆ తప్పును గ్రహాల మీదకు తోసేయడం ఒక వింతయితే, అసలు తెదేపా ఆయనను చేర్చుకోనేందుకే సిద్దపడనప్పుడు ఆయన తన అనుచరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు అందరూ మళ్ళీ తనను తెదేపాలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకోవడం మరీ వింతగా ఉంది.