స్టీఫెన్‌సన్ తిక్క కుదిరింది

అందరూ ఊహించినట్టే జరిగింది. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ తిక్క కుదిరింది.  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కుట్ర పూరితంగా స్టింగ్ ఆపరేషన్‌ చేయడంలో విజయం సాధించిన స్టీఫెన్‌సన్ ఆ తర్వాత తనను తాను హీరోగా అభివర్ణించుకోవడం ప్రారంభించారు. తాను నీతి, నిజాయితీలకు ప్రతిరూపంలా బిల్డప్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఒక తాత్కాలిక విజయం దక్కగానే అహంకారం తలకు ఎక్కిన ఆయన తనకు ఇక తిరుగు లేదని భావిస్తూ వచ్చారు. అయితే ఆ మత్తు తలకు బాగా ఎక్కిన ఆయనకు, తాను చేయించిన స్టింగ్ ఆపరేషన్‌కి న్యాయస్థానం ముందు విలువ లేదని, తాను చంద్రబాబుతో మాట్లాడినట్టుగా ప్రచారంలో వున్న టేపులకు అంత సీను లేదని అర్థం కాలేదు. అందుకే తానేదో సాధించినట్టు ఫీలైపోతున్నారు. అందుకే, న్యాయమూర్తినే అవమానించే విధంగా ప్రవర్తించి ఇప్పుడు కోర్టు ధిక్కార నేరాన్ని నెత్తి మీదకు తెచ్చుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఒక ముద్దాయిలా భావిస్తు్న్న మత్తయ్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ని ఫలానా న్యాయమూర్తి విచారించబోతున్నారని, ఆయన మీద తనకు నమ్మకం లేదని, అర్జెంటుగా న్యాయమూర్తిని మార్చేయాలని స్టీఫెన్‌సన్ తలాతోకా లేని పిటిషన్‌ని కోర్టులో దాఖలు చేసినప్పుడే ఇదేదో తోక కత్తిరించుకునే వ్యవహారంలా వుందే అని కాస్తంత పరిజ్ఞానం వున్న అందరూ భావించారు. స్టింగ్ ఆపరేషన్ చేసేంత తెలివితేటలు వున్న స్టీఫెన్‌సన్‌కి ఈ విషయంలో అంత తెలివితేటలు లేకుండా పోయాయి. ఈయనేదో తెలిసీ తెలియక న్యాయమూర్తి మీద నమ్మకం లేదంటూ పిటిషన్ దాఖలు చేస్తే, దానికి తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ కూడా వత్తాసు పలికారు. సాక్షాత్తూ  సదరు న్యాయమూర్తి దగ్గరకే వెళ్ళి ఈ కేసు నుంచి తప్పుకోండి అంటూ సూచించారు. నిజంగా ఈ చర్యలను చూస్తుంటే వీళ్ళకు అసలు న్యాయస్థానాల గురించి కొద్దిగా అయినా తెలుసా అనే సందేహం చాలామందికి వచ్చింది. ఇప్పుడు స్టీఫెన్‌సన్ తదితరులు చేసిన ఓవర్ యాక్షన్‌కి సరైన  రియాక్షన్ వచ్చింది. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మత్తయ్య క్వాష్‌ పిటిషన్‌ను వేరేబెంచ్‌కు తరలించాలన్న స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. స్టీఫెన్‌సన్‌ తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీఫెన్‌సన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన స్టీఫెన్‌సన్‌ మీద కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తిక్క కుదరడం అంటే ఇదే.

తెలంగాణా పోలీస్ వాహనాల కొనుగోలులో కుంభకోణం?

  కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన తరువాత చిన్న పిల్లలకు బొమ్మకార్లు కొనిపెట్టినట్లుగా హైదరాబాద్ లో పోలీసులకు కొన్ని వందల ఇన్నోవా కార్లు, హీరో మోటార్ సైకిల్స్ కొనిపెట్టేయడంతో పోలీసులే కాదు ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. కమీషన్లకి కక్కుర్తిపడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు మళ్ళీ ఇన్నాళ్ళకి మెరుపువేగంతో పనిచేసే ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. ఇంతకు ముందు డొక్కుజీపులు వేసుకొని తిరిగే పోలీసులు ఇప్పుడు ఇన్నోవా కార్లలో వస్తుంటే మన పోలీసులకి కూడా ఇప్పుడు “ఫారిన్ కంట్రీ పోలీస్ లుక్” వచ్చేసిందని ప్రజలు చాలా సంబరపడ్డారు. కానీ ఒక ప్రముఖ జాతీయ ఛానల్ ఈ వాహనాల కొనుగోలు వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని శనివారం బయటపెట్టింది.   కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్ నాయుడుకి టయోటా కార్ల డీలర్ షిప్, అదేవిధంగా కేసీఆర్ కుమారుడు కే.టి.ఆర్. కి హీరో హోండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందని వారిరువురికి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణా ప్రభుత్వం ఎటువంటి టెండర్లు పిలవకుండా రూ.271 కోట్లు వ్యయం చేసి ఒకేసారి 3,883 ఇన్నోవా కార్లు, 2000 హీరో హోండా మోటార్ సైకిల్స్ కొందని సదరు న్యూస్ ఛానల్ బయటపెట్టింది. వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్ నాయుడికి టయోటా కార్ల డీలర్ షిప్ ఉన్న మాట వాస్తవమే. కానీ మంత్రి కే.టి.ఆర్. తనకు హీరో హోండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందన్న వార్తలను, దానికి తమ ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్న సదరు న్యూస్ ఛానల్ చేసిన ఆరోపణలను ఖండించారు. అది పూర్తి నిరాధారమయిన ఆరోపణలని ఆయన అన్నారు.   ఇక ఈ విషయంపై తెలంగాణా డి.జి.పి. అనురాగ్ శర్మ స్పందిస్తూ, “నిజానికి తెలంగాణా ప్రభుత్వం కార్లు, మోటార్ సైకిల్స్ అన్నిటికి కలిపి కేవలం రూ. 206 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. భారత ప్రభుత్వం ఇచ్చిన డి.జి. మరియు డి. రేట్ కాంట్రాక్ట్ మార్గదర్శకాలు, నిర్ణయించిన ధరల ప్రకారం ఆ వాహనాలను నేరుగా ఉత్పత్తిదారుల నుండి కొన్నిటిని, మరి కొన్నిటిని వారి అధీకృత డీలర్స్ వద్ద నుండి తెలంగాణా ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్ణయించిన నిర్దిష్ట ధరల ప్రకారం ఆ వాహనాలను ఓపెన్ టెండర్ విధానంలో ఈ-ప్రోక్యూర్ మెంట్ పద్దతిలో కొనడం జరిగింది. కనుక టెండర్లు పిలవలేదనే ఆరోపణలు అవాస్తవం,” అని అన్నారు.   తెలంగాణా రాష్ట్ర ఐ.జి. సంజయ్ కుమార్ జైన్ మీడియాలో వస్తున్న ఈ ఆరోపణలపై స్పందిస్తూ, “తెలంగాణా ప్రభుత్వం 3,883 ఇన్నోవా కార్లు కొందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 696 ఇన్నోవా వాహనాలను మాత్రమే కొంది. అవి కాకుండా టాటా, మహేంద్ర తదితర కంపెనీలకు చెందిన మరికొన్ని వాహనాలను ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానంలో కొంది. ఇటువంటి అవాస్తవాలను ప్రసారం చేసినందుకు సదరు న్యూస్ ఛానల్ పై పోలీసు శాఖ పరువునష్టం దావా వేయాబోతోంది,” అని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌కి మెలకువ వచ్చింది

  సినిమాల పరంగా, వ్యక్తిగత జీవిత పరంగా ‘ఖుషీ’గా వున్న పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు రాజకీయ రంగం మీద కూడా ఓ లుక్కేసి మళ్ళీ, తన సినీ, వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోతూ వుంటారు. ఒక విధంగా చెప్పాలంటే, ఇలాంటి ఆర్టిస్టులు రాజకీయాల్లో ‘గెస్ట్ ఆర్టిస్టు’లుగానే వుంటేనే దేశానికి మంచింది. అప్పుడెప్పుడో ఏపీ రాజధాని భూములున్న గ్రామాలకు వెళ్ళి ఏవేవో ప్రగల్భాలు పలికి, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాలుక్కరుచుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించింది లేదు. రాజధాని రైతులకు అన్యాయం జరిగితే తాను రంగంలోకి దిగి పోరాటం చేస్తానని పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చారాయన. అయితే రాజధాని గ్రామాల్లోని రైతులకు ఎలాంటి అన్యాయం జరగలేదు కాబట్టి ఆయన పోరాటం చేయాల్సిన అవసరం రాలేదు అది వేరే సంగతి. అయితే పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా ఎక్కడికో వెళ్ళిపోవాలన్న కోరిక మనసులో బలంగా వుంది. తన ‘అన్నయ్య’ చిరంజీవి సాధించలేకపోయిన ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక కూడా ఉంది. అయితే రాజకీయాల్లో చురుగ్గా, నిర్విరామంగా పనిచేసే తీరిక మాత్రం లేదు అదే పెద్ద మైనస్సు. పార్టీ పెట్టినప్పటికీ దాన్ని ముందుకు నడిపే సీన్ ఆయనకు లేకుండా పోయింది. అందుకే ‘జనసేన’ పార్టీ ఇప్పటికీ ఏకసభ్య పార్టీగా కొనసాగుతోంది. ఇదిలా వుంటే, ఆయన ఇప్పుడు మళ్ళీ జనాల ముందుకు వచ్చారు. రాజకీయ కామెంట్లు చేశారు. అది కూడా ప్రత్యక్షంగా కాదు.. ట్విట్టర్ మాధ్యమం ద్వారా. నేటి తరం నేతలు అందరూ దక్షిణాఫ్రియా జాతిపిత నెల్సన్ మండేలాని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తన అమృత వాక్కులను ట్విట్టర్లో  పెట్టారు. పాపం పవన్ కళ్యాణ్ గారికి మన భారతీయ నాయకులెవరూ ఆదర్శంగా కనిపించలేదో ఏంటో. అయినా పవన్ కళ్యాణ్ లాంటి మహా మేధావులకు ఇండియాలో నాయకులెందుకు నచ్చుతారు... ఏ నెల్సన్ మండేలానో, ఏ చేగువేరానో అయితేనే బాగా నచ్చుతారు.. వారే ఆదర్శమంటారు.. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరికీ ఆదర్శంగా వుండరు. ఎందుకంటే ఇలాంటి గెస్ట్ ఆర్టిస్టును ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం  ఎవరికీ లేదు. రాజకీయంగా భారీ లక్ష్యాలు వున్నప్పుడు జనంలోకి వచ్చి పోరాటం చేయాలి. అంతేగానీ, ఆర్నెల్లకోసారి నిద్ర మేలుకుని ట్విట్టర్లో దర్శనమివ్వడం ఏమిటి? ఇలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడ్డం, రాజకీయ నాయకులు ఎవర్ని ఆదర్శంగా తీసుకోవాలో చెప్పడం మరీ ఎటకారంగా అనిపిస్తోంది.

ఈ బెదిరింపు సెక్షనేంటో!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సెక్షన్ 8, సెక్షన్ 10 గురించి తీవ్రంగా డిస్కషన్ జరుగుతోంది. ఈ రెండు సెక్షన్లూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నిప్పుల కుంపటిని మరింతగా రాజేస్తున్నాయి. ఈ రెండు సెక్షన్ల గొడవ ఇలా వుంటే, మరో సెక్షన్ కూడా ఇప్పుడు జనాన్ని అయోమయానికి గురి చేస్తోంది. జనం సంగతి అలా వుంచితే, సాక్షాత్తూ గవర్నర్ గారినే అయోమయానికి గురి చేస్తోంది. అందుకే ఆయన ఈ విషయంలో ఏం చేయాలి చెప్మా అని కేంద్రం తలుపు తట్టారు. ఇంతకీ ఆ సెక్షన్ ఏమిటంటే, ‘బెదిరింపు సెక్షన్’. ఈ సెక్షన్‌ని అమలు చేస్తోంది మరెవరో కాదు... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ బెదిరింపు ఏమిటనుకుంటున్నారు... తమకు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తాననే బెదిరింపు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఈ బెదిరింపుతో అందర్నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన గవర్నర్ నరసింహన్ ఇదే విషయాన్ని ఆయనతో చెప్పి ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదన్నట్టుగా మాట్లాడారన్న వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి పారేస్తానని కేసీఆర్ బెదిరించారట. కేసీఆర్ గారికి ఇలా బెదిరించాలన్న ఐడియా ఎలా వస్తోందో ఏంటో. ఇలా బెదిరిస్తే పనులు అయిపోతాయని అనుకోవడం ఎంతవరకు న్యాయమో ఆయనే ఆలోచించుకోవాలి. గతంలో ఓసారి ఆయన ఈ బెదిరింపు సెక్షన్‌ అమలు చేసేసరికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది దారిలోకి వచ్చినట్టున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలవకపోతే అసెంబ్లీనే రద్దు చేస్తానని కేసీఆర్ బెదిరించారు. ఆ బెదిరింపు కారణంగానే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిక్కురుమనకుండా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో తన బెదిరింపు సెక్షన్ వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు సెక్షన్ 8 విషయంలో కూడా అదే బెదిరింపు సెక్షన్ని అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు.

ఆంధ్రా,తెలంగాణా ప్రభుత్వాలు యుద్ద విరమణ చేసినట్లేనా?

  రేవంత్ రెడ్డి అరెస్టయినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా చాలా ఆందోళనగా కనిపించిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మూడు నాలుగు రోజులుగా మళ్ళీ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మళ్ళీ తన అధికార విధులలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ఆయన ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించిన ఏపీ రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు? తెలంగాణా ప్రభుత్వం వైపు నుండి కూడా విమర్శల జోరు దాదాపు నిలిచిపోయింది.   విశాఖ పోలీసులు టీ-న్యూస్, సాక్షి న్యూస్ ఛానల్స్ కి ఇచ్చిన మూడు రోజుల గడువు ఎప్పుడో ముగిసింది. కానీ ఇంతవరకు పోలీసులు కానీ సదరు న్యూస్ చానల్స్ వారు గానీ మళ్ళీ ఆ ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఓటుకి నోటు కేసులో నాల్గవ ముద్దాయిగా పేర్కొనబడ్డ జెరూసలేం మత్తయ్యలను కస్టడీ కోసం ఎసిబి అధికారులు గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. ఆంధ్రా, తెలంగాణా మంత్రులిప్పుడు “చట్టం తనపని తాను చేసుకుపోతుంది...అందులో తాము కలుగజేసుకోమని..” కోరస్ పాడుతున్నారు. ఇదంతా గమనిస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేంద్రం రాజీ కుదిర్చిందా? అనే అనుమానం కలుగుతోంది. కానీ హైదరాబాద్ లో ఎసిబి, విజయవాడలో సి.ఐ.డి. పోలీసులు తమ పని తాము చేసుకుపోతుండటం గమనిస్తే మంత్రులు చెపుతున్నట్లు చట్టం తన పని చేసుకుపోతున్నట్లే ఉంది. కానీ ‘జబ్ మియా బీబీ రాజీ హైతో ఖ్యా కారేగా ఖాజీ’ అన్నట్లు రెండు ప్రభుత్వాలు రాజీపడినట్లయితే ఇక చట్టం ఎంత వరకు పనిచేసుకుపోతుందో అందరికీ తెలుసు.

గవర్నర్ తరువాత కేటీఆర్ డిల్లీ పయనం దేనికి?

  గవర్నర్ నరసింహన్ నిన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి యల్.సి.గోయల్ తదితరులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న పరిస్థితులు, తదనంతర పరిణామాలపై లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ వారు ఈ సమావేశంలో ఏమేమి నిర్ణయాలు తీసుకొన్నారనే విషయం బయటకి పొక్కనీయలేదు. కనుక పరిస్థితులను చక్కదిద్దవలసిన బాధ్యత గవర్నర్ దే నని హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ గవర్నర్ నరసింహన్ కి ఆయన బాధ్యతల గురించి కేంద్రం కొత్తగా గుర్తు చేయనవసరంలేదని అందరికీ తెలుసు. అదే మాట చెప్పదలిస్తే ఆయనని అంత అత్యవసరంగా డిల్లీకి పిలిపించనవసరం లేదు. ఆ ముక్కేదో ఆయనకు ఫోన్లోనే చెప్పవచ్చును. కనుక వారి సమావేశంలో అంతకంటే ముఖ్యమయిన నిర్ణయాలే తీసుకొని ఉండవచ్చని భావించవచ్చును.   ఆయన హైదరాబాద్ తిరిగి రాగానే నేడు మళ్ళీ తెలంగాణా ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు డిల్లీ బయలుదేరబోతున్నారు. ఆయనతోపాటు తెలంగాణా ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు కూడా డిల్లీ వెళ్లి ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నారు. వారు డిల్లీ వెళ్ళడానికి వేరే ఇతర కారణాలు చెప్పవచ్చును. హోంమంత్రికి బదులు ఆర్ధికమంత్రిని కలవవచ్చును. కానీ నిన్న గవర్నర్, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ల మధ్య జరిగిన కీలక సమావేశంలో ఇరురాష్ట్రాల మధ్య తలెత్తిన సంక్షోభం నివారణకు తీసుకొన్న నిర్ణయాలను అమలు చేసే ప్రక్రియలో భాగంగానే వారిని డిల్లీకి పిలిపించి ఉండవచ్చును.   ఇదివరకు కూడా మంత్రి కేటీఆర్ డిల్లీ వెళ్ళివచ్చిన తరువాత ఓటుకి నోటు కేసులో ఎసిబి జోరు కొంచెం తగ్గిన సంగతి గమనిస్తే అది అర్ధమవుతుంది. ఈ కేసు విషయంలో తెలంగాణా ప్రభుత్వం బహుశః గవర్నర్ మాటను వినేట్లులేదు కనుకనే కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ తో మాట్లాడేందుకు డిల్లీకి పిలిపించి ఉండవచ్చును. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రతినిధిగా భావింపబడే ఆయన కుమారుడు కేటీఆర్ తో కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే, గవర్నర్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేయవచ్చును. రానున్న రెండు మూడు రోజుల్లో ఉభయ రాష్ట్రాలలో జరుగబోయే పరిణామాలను బట్టి డిల్లీలో ఏమి జరిగిందనే విషయంపై కొంత స్పష్టత వస్తుంది.

ఈ టెన్షన్ తట్టుకోలేం దేవుడా

తెలుగు రాజకీయాలను గమనిస్తూ వుండేవారు రాష్ట్ర విభజన జరక్కముందు చాలా ఉత్కంఠకు, టెన్షన్‌కి గురయ్యేవారు. రాష్ట్ర విభజన విషయంలో ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందా అని ఉక్కరిబిక్కిరి అయ్యేవారు. అప్పట్లో గవర్నర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా, ఆయన పర్యటన వెనుక వున్న అసలు రహస్యం ఏమిటో... రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వుంటుందా, లేక రాష్ట్ర విభజనకు అనుకూలంగా వుంటుందా అనే టెన్షన్ రెండు వర్గాల వారిలోనూ వుండేది. మొత్తానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ టెన్షన్, ఉత్కంఠ తగ్గిపోయింది. గవర్నర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా అది ఆయన మీడియాకు చెప్పినట్టుగానే ‘రొటీన్’ పర్యటన అనుకునేవారు. అయితే ఇటీవలి కాలంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కడంతో ఇప్పుడు మళ్ళీ గవర్నర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆయన అక్కడ ఏ నివేదిక ఇవ్వడానికి వెళ్ళారో, ఈయన పర్యటన సందర్భంగా కేంద్రం ఏదైనా సంచలనాత్మక ప్రకటన చేస్తుందా అని ఎదురు చూడటం మామూలైపోయింది. ఓటుకు నోటు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్ 8 అంశం తెరమీదకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి వెళ్ళడం రెండు రాష్ట్రాల వారిలో టెన్షన్ని కలిగిస్తోంది. ఆయన పర్యటన తమకు అనుకూలంగా వుందా, వ్యతిరేకంగా వుందా.. ఆయన హోంశాఖ మంత్రిని, హోంశాఖ కార్యదర్శిని కలసి, గంటలు గంటలు చర్చించారంటే ఏదైనా కీలక నిర్ణయాన్ని ప్రకటించడానికేనా అనే టెన్షన్ తెలుగు జనాల్లో పుడుతోంది. అంచేత గవర్నర్ గారు ఇంకా టెన్షన్ పెట్టకుండా ఏదో ఒక ‘కీలక’ నిర్ణయాన్ని ప్రకటించి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ధన్యుల్ని చేయాలని విజ్ఞప్తి.

ఇరుకున పడిన కాంగ్రెస్

ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ లండన్ నుంచి పోర్చుగల్ వెళ్ళడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అనుమతి ఇచ్చారన్న ఆరోపణలు ఒకవైపు, దీనికి వసుంధరా రాజే సహకరించారన్న ఆరోపణలు మరోవైపు చేస్తూ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. మానవతా దృక్పథంతో చేసిన ఒక  సాయానికి రాజకీయ రంగు పులిమి, దీని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న  ఉద్దేశంలో కాంగ్రెస్ వుంది. ఎప్పుడు ఏ అంశాన్ని రాజకీయం చేద్దామా అని ఆశగా ఎదురుచూసే కాంగ్రెస్ ఈ అవకాశాన్ని వదలకుండా తన శాయశక్తులా విమర్శలు చేస్తోంది. మన దేశంలో ఆర్థిక నేరాల్లో చిక్కుకుని విదేశాలకు వెళ్ళిపోయిన లలిత్ మోడీకి సుష్మా, వసుంధర సహకరించడం నేరం, ఘోరం అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అర్జెంటుగా వారిద్దరూ రాజీనామా చేస్తే తప్ప తమకు మనశ్శాంతి వుండదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే కోడల్ని తిట్టి అత్త మూకుడు నాకిందన్న సామెత చందంగా కాంగ్రెస్ పార్టీ గుట్టు ఒకటి బయటపడింది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేలా చేసింది. ఏ లలిత్ మోడీకి మానవతా దృక్పథంతో సహాయం చేయడం ఘోరమని అంటున్న కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలైన ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వధేరా ఎంచక్కా లండన్‌లో లలిత్ మోడీని కలిశారట. ఒక రెస్టారెంట్‌లో ఈ ముగ్గురూ ఎంచక్కా కబుర్లు చెప్పుకున్నారట. ఈ విషయాన్ని లలిత్ మోడీ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేసింది. అసలు వీళ్ళిద్దరికి లండన్ వెళ్ళి లలిత్ మోడీని కలవాల్సిన అవసరమేంటనే ప్రశ్నకు కాంగ్రెస్ వర్గాల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దిగ్విజయ్ సింగ్ లాంటి భజనపరులు ప్రియాంకని, రాబర్ట్ వధేరాని వెనకేసుకు రావడానికి ప్రయత్నించినప్పటికీ అంతగా ప్రయోజనం వుండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీకి ఇది మంచి అవకాశంలా దొరికింది. ఈ ఒక్క పాయింట్ చూపించి కాంగ్రెస్‌ని తిప్పికొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

రేవంత్‌రెడ్డికి బెయిల్ ఖాయమా?

  ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డికి రెండుసార్లు రిమాండ్ విధించారు. ఆయనకు రిమాండ్ కొనసాగించేలా చేయాలన్న ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం వుంది. ఈమేరకు రేవంత్ రెడ్డిని ఇంకా విచారించాల్సి వుందని, దానితోపాటు రేవంత్ రెడ్డి బయటకి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం వుందని చెబుతూ వస్తోంది. శుక్రవారం నాడు కోర్టు ముందుకు విచారణకు వచ్చిన ఈ కేసులో వాదోపవాదాలు, న్యాయమూర్తులు చేసిన కామెంట్లను చూస్తుంటే రేవంత్ రెడ్డికి బెయిల్ లభించడం ఖాయమని అనిపిస్తోంది. రెండు పక్షాల వారి వాదనలను విన్న తర్వాత న్యాయమూర్తి ఈ కేసును మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం నాడు ఆయనకు నూటికి నూరుశాతం బెయిల్ లభించడం ఖాయమని తెలుస్తోంది. ఈ నమ్మకాన్నే రేవంత్ రెడ్డి న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల ఆయన ఈ కేసును ప్రభావితం చేస్తారని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి ఆయన కేసు మీద ఎలా ప్రభావాన్ని చూపుతారని ప్రశ్నించారు. నెల రోజులుగా పోలీసుల అదుపులోవున్న రేవంత్ రెడ్డిని ఇప్పటి వరకు ఏమి విచారించారు? ఇంకా జైలులో వుంచి ఏమి విచారించబోతున్నారన్న ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వ లాయర్ల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యేని ఇంతకాలం రిమాండ్‌లో వుంచడం భావ్యంకాదని, బెయిల్ దొరకనివ్వకుండా అడ్డు పడటం న్యాయం కాదని ఆయన తరఫు న్యాయవాదులు సమర్థంగా వాదించినట్టు తెలుస్తోంది. ఈ వాదనల అనంతరం కేసు మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం నాడు న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తారని తెలుస్తోంది.

ఫోరెన్సిక్ నివేదిక కాపీ ఎసిబికి ఇవ్వలేము: కోర్టు

  రేవంత్ రెడ్డిపై ఎసిబి అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో రికార్డు చేసిన ఆడియో, వీడియోలపై సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్స్ తయారుచేసిన నివేదికను రెండు రోజుల క్రితం ఎసిబి కోర్టుకి అందజేయబడింది. దాని కాపీ ఒకటి తమకు ఇమ్మని కోరుతూ ఎసిబి అధికారులు కోర్టులో ఒక మేమో దాఖలు చేసారు. సీల్డ్ కవరులో అందజేసిన ఆ నివేదికను ఈరోజు తెరిచిచూసిన ఎసిబి కోర్టు, దాని కాపీని ఎసిబి అధికారులు ఇచ్చేందుకు నిరాకరించింది.   అది అత్యంత రహస్యమయిన, కీలకమయిన ఆ ప్రాధమిక నివేదిక అని, కనుక దానిపై తమ తుది నివేదిక సమర్పించేవరకు ఎవరికీ దాని కాపీలు ఈయవద్దని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు తమ నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ కారణంగానే ఎసిబి కోర్టు ఆ నివేదిక కాపీని ఎసిబి అధికారులకు ఇచ్చేందుకు నిరాకరించిందని సమాచారం. కానీ ఎసిబి అధికారులు ఆ నివేదికను కోర్టులో జడ్జి సమక్షంలో చూసేందుకు మాత్రం అనుమతించింది. దాని కోసం మళ్ళీ మరొక మెమో దాఖలు చేయమని కోర్టు ఆదేశించడంతో మధ్యాహ్నం భోజన విరామ సమయం తరువాత ఎసిబి అధికారులు కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.   అయితే రెండు రోజుల క్రితం హైకోర్టు రేవంత్ రెడ్డి బెయిలు పిటిషన్ని విచారణకు స్వీకరించినప్పుడు, ఎసిబి తరపున వాదించిన న్యాయవాదులు ఈ కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తమకు కొన్ని బలమయిన ఆధారాలు లభ్యమయ్యాయని కనుక తమకు సోమవారం వరకు గడువు ఇస్తే ఆ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని అంతవరకు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని కోరడంతో హైకోర్టు వారికి శుక్రవారం వరకు సమయం ఇచ్చింది. కానీ వారు ఊహించని విధంగా ఎసిబి కోర్టు ఫోరెన్సిక్ నివేదిక కాపీని ఇచ్చేందుకు నిరాకరించడంతో హైకోర్టుకి ఆధారాలు సమర్పించే అవకాశం కనబడటం లేదు. కనుక హైకోర్టు ఒకవేళ రేవంత్ రెడ్డి తరపున వాదిస్తున్న న్యాయవాదుల వాదనలతో ఏకీభవించినట్లయితే ఆయనకు ఆయనతో బాటుఅరెస్ట్ అయిన సెబాస్టియన్, ఉదయ సింహాలకు ఈరోజు బెయిలు మంజూరు చేసే అవకాశం ఉంది.

మహిళా వివక్ష

మహిళలు దూసుకుపోతున్నారు....అన్నిరంగాల్లో  మగాళ్లతో పోటీ పడుతున్నారు...కాదుకాదు మగాళ్లను మించిపోతున్నారు..... ఈ మధ్య కాలంలో ఎక్కడ చదివినా విన్నా ఈ మాటలే. కానీ ఎంత అభివృద్ధి చెందితే ఏంటి? ఏ స్థాయికి చేరితే ఏంటి? అమ్మాయిపై వివక్ష లేకుండా పోయిందా? అంతెందుకు నిత్యం ఎక్కడోదగ్గర అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కరూ స్పందించరు. తెలిసిన వెంటనే అయ్యో పాపం అనేసి వదిలేస్తారు. అదే నూటికో కోటికో  భర్తను హత్య చేసిన భార్య.....అనే వార్త చదవగానే పురషాధిక్య సమాజం నిద్రలేస్తుంది. అమ్మో ఆడాళ్లు అని తెగ గందరగోళం చేసేస్తారు. తప్పు ఎవరు చేసినా తప్పే అయినప్పుడు ఎందుకీవివక్ష?   మిగిలిన అన్ని రంగాలు పక్కనపెడతాం....జనాలకు బాగా తెలిసిన సినిమా రంగాన్నే తీసుకుందాం. ఈ రంగంలో ఉన్న మహిళా వివక్ష ఇంకెక్కడైనా ఉందా?  హీరోయిన్ గాఛాన్స్ దక్కించుకోవాలన్న దగ్గరనుంచి స్టార్ స్టేటస్ తెచ్చుకునే వరకూ ఎన్ని కష్టాలు పడాలో.....ఎందరు చెప్పినట్టు వినాలో అందరకీ తెలిసిందే! కోటి ఆశలతో ముఖానికి రంగేసుకుందాం అని వచ్చి రకరకాల మనుషుల్ని-మనస్తత్వాల్ని ఎదుర్కోవాలి. తెరవెనుక రాజకీయాల్లో మునిగితేలి...దేనికైనా సిద్ధం అనే స్థాయికి చేరుతున్నారు.   అయితే....అమ్మాయి తప్పుచేస్తే బహిరంగంగా విమర్శించే వ్యక్తులు, మీడియా....అందులో సెలబ్రెటీలు ఉన్నప్పుడు మాత్రం ఎందుకు నోరుమూసుకుంటోంది?   ఈ మధ్యే శ్వేతాబసు ప్రసాద్ అనే తార...వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని ఎంతో హడావుడి చేశారు. కొత్తబంగారు లోకంలో ఈ అమ్మాయిని చూసి కెరీర్లో మంచి స్థాయికి  వెళుతుందని ఊహించిన వారంతా ఈ విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని...ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసిందని వార్తలు ప్రసారమయ్యాయి. అప్పటి వరకూ చాలామందికి తెలియన శ్వేతా బసు ప్రసాద్ ఫొటో చుట్టూ మార్క్ వేసి పదే పదే చూపించి గోలగోల చేశారు.   అయితే శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం చేస్తోందని అన్నవారంతా.....ఆమెతో పాటూఉన్న విటుల గురించి మాట్లాడరేం? ఆమె వల్లో పెద్ద చేపలే ఉన్నాయని చెబుతున్నారే కానీ....వాళ్లెవరో తెలీదా? తెలిసినా వలవేసే సాహసం చేయరా?  సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అని మాత్రం రాస్తారు. అటు పోలీసులు కూడా  శ్వేతా చాలా పేర్లు చెప్పిందని చెప్పారే కానీ.....ఒక్కపేరు కూడా ఎందుకు  బయటపెట్టలేదు?  ఏ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు?   అంతకు ముందు నటి కిన్నెరపై ఓ ప్రైవేట్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేసింది. రిపోర్టర్ చాలా రిస్క్ చేసింది కూడా. ఆమె ఇంటికి వెళ్లి...కిన్నెర రిసీవింగ్, మాటతీరు, ఎలా వలవేస్తోంది....ఎక్కడెక్కడకు తీసుకెళుతోంది అనే విషయాలన్నింటినీ బాగా సేకరించారు. మర్నాడు ఓ ప్రముఖుని ఇంటికి తీసుకెళ్లిన కిన్నెరను అడ్డంగా బుక్ చేశారు. అయితే ఆ సమయంలో కూడా సదరు ఛానెల్ కిన్నెర గురించి ఊదరగొట్టిందే కానీ.....ఆ కోణంలో ఆమెను ఉపయోగించుకుంటున్న పెద్దమనుషులెవరనేది బయట పెట్టలేదు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంటికి తీసుకెళ్లింది అని రాశారే కానీ ఆ కేంద్రమంత్రి ఎవరో వాళ్లకి తెలియదా? ఓ ఆడపిల్లను బయట పెట్టినంత సులువుగా వాళ్లనెందుకు నిలదీయడంలేదు? సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల పేర్లు బయటపెట్టే దమ్ము లేదా? తప్పు చేసినా వాళ్లకి గొడుగుపడుతూనే ఉంటారా? లేదా  సదరు ఛానెల్ నిర్వహకులు వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నాక కిమ్మనకుండా ఉండిపోయారా? ఏం జరిగింది?   అంతెందుకు పోలీసులు సైతం... నేరస్తులను మీడియా ముందు ప్రవేశ పెట్టాలంటే వాళ్లకి ముసుగులు వేసి తీసుకొస్తారు. చేతులు కట్టేసినా....కనీసం కెమెరా ముందు కూడా మసుగు తీయరు. కానీ వ్యభిచారం  కేసులో ఎక్కడైనా అమ్మాయిలు పట్టుబడితే చాలు....బహిరంగంగా తీసుకెళతారు. వాళ్ల ఫొటోలు, వివరాలతో సహా  మీడియాకు సమాచారం ఇస్తారు. మీడియా కూడా అంతే ఉత్సాహంగా...ఎక్కడైనా ఇలాంటి కేసులుంటే కెమెరా ఫోకస్ మొత్తం అమ్మాయిలపై పెడతారే కానీ....అక్కడున్న బడాబాబులవైపు ఒక్కసారి ఫోకస్ చేయరు. ఇండస్ట్రీ లోనే కాదు మీడియా లోనూ కెమెరా ఫోకస్ కేవలం అమ్మాయిలపైనేనా?   కొన్ని కేసుల్లో  అమ్మాయి ఒంటిమీద బట్టలేసుకునే సమయంలో కూడా కెమెరా పక్కకు తిప్పాలనే సంస్కారం ఉండడం లేదు. పైగా వాళ్లు అలా ఉండగా లేనిది మేం తీస్తే తప్పా అంటారు? వాళ్ల లాగే మీరూ గడ్డితింటారా?   కేవలం శ్వేతాబసు ప్రసాద్, కిన్నెర మాత్రమే కాదు  భువనేశ్వరి, దివ్యశ్రీ సహా  పలువురు బుల్లి తెర నటులు...ఇంకా బయటపడిన, బయటపడని ఇలాంటి వాళ్లెందరో. కారణాలేవైనా నిజంగా వాళ్లు అదే దార్లో ఉన్నట్టైతే  వాళ్లు చేస్తున్నది తప్పే. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. ఎవ్వర్నీ మేం సమర్థించడం లేదు. కానీ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించినప్పుడు....వాళ్లతో ఎంజాయ్ చేసే వ్యక్తులు పేర్లుసైతం బయటపెట్టాలనేదే మా వాదన.   ఎప్పుడూ తమ ఛానెల్స్ కు రేటింగ్ రావాలనే తాపత్రయమే తప్ప...ఎదుటి వ్యక్తి జీవితంతో ఆడుకుంటున్నామమే స్పృహ ఉండదా?   రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం అని ఊదరగొట్టే పోలీసులు..ఆమెతో  ఎవరెవరున్నారు అని అడిగితే....నీళ్లు నములుతారు. ఈ బాగోతం వెనుక సినీ, రాజకీయ ప్రముఖులున్నారు అంటారు. కానీ ఎన్నిసార్లు అడిగినా వాళ్ల పేర్లు మాత్రం బయటపడకుండా జాగ్ర్తత్తలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ ని కొందరు సేవ్ చేస్తున్నారంటే....వాళ్ల పేర్లు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో మాత్రమే.   మీడియా, పోలీసుల ప్రతాపం మామూలు వాళ్లపైనేనా? గట్టిగా అడిగే దిక్కులేనివారందర్నీ బజారు కీడ్చడానికేనా?   ఎంకరేజ్ చేసే వాళ్లున్నంత వరకూ ఇలాంటి తెరవెనుక వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. తీరా బయటపడ్డాక బడా బాబులు ముసుగేసుకుని దొరికిన అమ్మాయిలకు ముసుగు తీసేస్తున్నారు.   మేం అమ్మాయిలని సమర్థించడం లేదు....తప్పుని ఒప్పు అని సమర్ధించడం లేదు. సమన్యాయం ఉండాలని కోరుకుంటున్నాం. వ్యభిచార ముఠా గుట్టు రట్టు అని చెప్పినప్పుడు మొత్తం ఎంతమంది దొరికితే అందర్నీ పట్టుకోండి. వారి వెనుకున్న పెద్దచేపలను బయటకు లాగండి. ఉన్నతాధి కారుల నుంచి, పెద్దవారినుంచి పోలీసులకు ఒత్తిడిలు  ఉన్నప్పటికీ తప్పుని సమర్థించని రోజు....ఈ వృత్తిలోకి దిగేవాళ్లు, వాళ్లని ఎంకరేజ్ చేసేవాళ్లు, పెద్దమనుషులుగా చెలామణి అవుతూ బాగోతాలు నడిపేవాళ్లు భయపడతారు.   ఎప్పటికైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందనే ఆశించవచ్చా....?

అందుకే సెక్షన్: 8పై వైకాపా పోరాడట్లేదుట!

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత నుండి నేటి వరకు రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఏర్పడ్డాయి. ఏర్పడుతూనే ఉన్నాయి. తెలంగాణాలో ఉన్న రాజకీయ పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుంటే ఆంద్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న వై.యస్సార్ పార్టీ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలకు భంగం కలుగుతున్నా నోరు మెదపకపోవడమే కాక రాష్ట్రంలో పొరుగు రాష్ట్ర ప్రతినిధిలా వ్యవహరిస్తూ, పొరుగు రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతూ, పొరుగు రాష్ట్ర నేతలతో కలిసి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికే ఎసరు పెట్టేయాలని ప్రయత్నించడం చాలా దురదృష్టకరం.   సెక్షన్: 8 అమలు విషయంలో తెలంగాణాలో అన్ని పార్టీలు ఒక్క త్రాటిపైకి తమ హక్కులను కాపాడుకొనేందుకు పోరాడుతుంటే, ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్, వైకాపాలు ఈ విషయంపై నోరు మెదపడం లేదు. పైగా సెక్షన్: 8 గురించి తెదేపా ప్రభుత్వం పట్టుబట్టడాన్ని రెండు పార్టీలు విమర్శిస్తున్నాయి. అలాగని దైర్యంగా తమ పార్టీలు సెక్షన్: 8ని వ్యతిరేకిస్తున్నాయని కూడా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ దానిని గట్టిగా వ్యతిరేకించకపోవడనికి రెండు కారణాలున్నాయి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వమే స్వహస్తాలతో విభజన చట్టం తయారుచేసి అందులో సెక్షన్: 8ని పెట్టడం చేత కాంగ్రెస్ నేతలు దానిని వ్యతిరేకించలేకపోవడం ఒక కారణమయితే, తెలంగాణాలో ఎంతో కొంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు సెక్షన్: 8ని వ్యతిరేకిస్తుంటే, తాము దానిని సమర్ధించడం వల్ల వారికి సమస్యలు ఎదురవుతాయనేది రెండవ కారణం.   కానీ తెలంగాణాలో ఏమాత్రం పట్టులేని వైకాపా కూడా సెక్షన్: 8ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? అంటే బహుశః తెరాస దానిని వ్యతిరేకిస్తోంది గనుకనే అని సమాధానం చెప్పుకోవలసివస్తుంది. కానీ తెరాసను మంచి చేసుకొనే ప్రయత్నంలో ఆ పార్టీ ఆంధ్రాలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంటోందనే విషయం మరిచిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సెక్షన్: 8పై ఆ పార్టీ అభిప్రాయం ఏమిటో ఆ పార్టీకి చెందిన మీడియాలో చూస్తే స్పష్టమవుతుంది. కానీ వైకపా నేతలు మాత్రం కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా సెక్షన్: 8 గురించి చాలా లౌక్యంగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర నాధ్ రెడ్డి దీనిపై ఇచ్చిన స్టేట్ మెంట్ గమనించినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది.   ఆయన మీడియాతో మాట్లాడుతూ “ అసలు సెక్షన్: 8 విభజన చట్టంలోని ఉంది. అంటే అది ఇప్పటికే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటప్పుడు మళ్ళీ దాని గురించి తెదేపా నేతలు పనిగట్టుకొని ఎందుకు పోరాటాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. గవర్నర్ నరసింహన్ విభజన చట్టంలో ఉన్న ఇటువంటి అంశాల గురించి తనకు సలహా ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారులను కూడా నియమించుకొన్నారు. కనుక తెదేపా నేతలు తమ సమస్యల నుండి బయటపడటానికి సెక్షన్: 8 గురించి పోరాటాలు చేయడం అర్ధరహితం,” అని అన్నారు.

తెదేపాకి వ్యతిరేకంగా మరో మైండ్ గేమ్ మొదలయిందా?

  ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తెదేపాను మానసికంగా మరింత దెబ్బ తీసేందుకు మీడియాలో ఒక వర్గం తెదేపాకు వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు త్వరలో పార్టీని వీడవబోతున్నారని మీడియాలో ప్రచారం మొదలయింది. ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించేందుకు కేంద్రంతో మాట్లాడి ఒప్పిస్తానని లేకుంటే రాజ్యసభ సభ్యత్వమయినా ఇప్పిస్తానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనకు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఆ హామీలను నిలబెట్టుకోకపోవడంతో మోత్కుపల్లి చాలా అసంతృప్తిగా ఉన్నారని అందుకే తెదేపాను వీడాలనుకొంటున్నట్లు మీడియాలో ప్రచారం మొదలయింది.   రాజకీయ పార్టీలు మైండ్ గేమ్స్ ఆడుకోవడం ఇప్పుడు సర్వసధారణమయిన విషయమే. కానీ వాటికి అనుబంధ మీడియా కూడా వంతపాడుతూ విస్త్రుత ప్రచారం చేస్తుండటంతో సామాన్య ప్రజలకు ఏది నిజమో ఏది కల్పితవార్తలో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. మోత్కుపల్లి నరసింహులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలను ఖండించకపోతే ప్రజలు అవే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది కనుక బహుశః ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలను ఖండిస్తూ ఒక ప్రకటన చేయవచ్చును.

రాజకీయ వర్గాలలో అగ్గి రాజేసిన సెక్షన్: 8

  భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ సలహా మేరకు కేంద్ర హోంశాఖ గవర్నర్ నరసింహన్ కు పునర్విభజన చట్టంలో సెక్షన్: 8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సర్వాధికారాలు చేప్పట్టేందుకు అనుమతించిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెక్షన్: 8లో మార్గదర్శకాలను వివరిస్తూ భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ గవర్నర్ కి వ్రాసిన లేఖ ప్రతిని ఒక ప్రముఖ తెలుగు మీడియా సంపాదించి అందులో వివరాలను బయటపెట్టింది. సెక్షన్: 8 అమలుని వ్యతిరేకిస్తూ నేటి నుండి తెలంగాణా వ్యాప్తంగా నిరసన దీక్షలు చేప్పట్టేందుకు ఉద్యోగ సంఘాలు, తెరాస శ్రేణులు సిద్దమవుతున్నాయి. అవసరమయితే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.   కానీ తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెరాస సెక్రెటరీ జనరల్ కె. కేశవ్ రావు ఇరువురూ కూడా కేంద్రం అటువంటి నిర్ణయమేమీ తీసుకోలేదని గట్టిగా వాదిస్తున్నారు. అటువంటప్పుడు ఊహాజనితమయిన వార్తలను చూసి తెరాస నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నారు? నిరసనలు తెలపాలని ఎందుకు అనుకొంటున్నారు? అని ప్రశ్నించుకొంటే ఆ వార్తలు నిజమని వారు కూడా నమ్ముతున్నందునేనని అర్ధమవుతుంది. కానీ నిన్న గవర్నర్ నరసింహన్ తో గంటసేపు సమావేశమయిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఈ వార్తలను స్వయంగా దృవీకరించలేదు...అలాగే ఖండించలేదు కూడా. గవర్నర్ కార్యాలయం నుండి కూడా దీనిపై ఎటువంటి నిర్దిష్ట ప్రకటన వెలువడలేదు. కనుక దీనిపై అధికారికంగా ఒక ప్రకటన వెలువడేవరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు కూడా కొనసాగుతూనే ఉంటాయి.   గవర్నర్ సెక్షన్: 8ని అమలుచేస్తారో లేదో తెలియదు కానీ ఈ అంశం మీద మొదలయిన రభస మరికొంత కాలం కొనసాగితే త్వరలో జరుగనున్న జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాసకు లబ్ది కలుగవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సెక్షన్: 8పై కూడా ద్వంద వైఖరేనా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అనేక అంశాల మీద ద్వంద వైఖరి అవలంభించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సెక్షన్: 8 అమలు చేయడంపై కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ “సెక్షన్‌-8కు తాము వ్యతిరేకం కాదని, దాన్ని అమలు చేయాలని కోరుతున్నామని,” అన్నారు. అంటే అదే వైకాపా వైఖరని నమ్మితే అమాయకత్వమే అవుతుంది.   ఆ పార్టీ స్వంత మీడియాలో అందుకు పూర్తి భిన్నమయిన చర్చలు జరుగుతున్నాయి. సెక్షన్: 8ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెరాస నేతలను, జీవన్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలను, అది తప్పని వాదించే న్యాయ నిపుణులను స్టూడియోకి ఆహ్వానించి దానిని అమలు చేయడం శుద్ధపొరపాటనే భావన ప్రచారం చేస్తోంది. అయితే దానర్ధం ఈ విషయంలో కూడా వైకాపా తెరాసకు మద్దతు తెలుపుతున్నట్లు కాదని చెప్పేందుకు, “తమ పార్టీ ఇద్దరు ముఖ్యమంత్రులకు సమాన దూరం పాటిస్తోందని” జ్యోతుల నెహ్రు చెప్పడం విశేషం.   ఒకవేళ జ్యోతుల నెహ్రూ చెపుతున్నట్లు వైకాపా గనుక సెక్షన్: 8ని అమలుచేయాలని కోరుకొంటున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలకు అద్దం పట్టే వారి మీడియా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. కానీ వైకపా నేతలొక మాట, వారి మీడియా మరొక రకమయిన భావనలు వ్యాపింప జేయాలని ప్రయత్నించడం గమనిస్తే, వారి మీడియా చెపుతున్నదే వైకాపా అసలు వైఖరి అని అర్ధమవుతుంది. కానీ ఆ మాట కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పినట్లయితే ‘వైకాపాకు తెరాసతో రహస్య సంబంధాలున్నాయని, ఆంద్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తోందని’ తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను బలపరిచినట్లవుతుంది. ఒకవేళ వైకాపా కూడా సెక్షన్: 8ని తెదేపా నేతలంత తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆ పార్టీకి తెరాసతో ఉన్న సంబందాలు చెడుతాయి కనుక వైకాపా నేతలు ఏదో మొక్కుబడిగా సెక్షన్: 8ని సమర్ధిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. కానీ వారి మీడియా ద్వారా తమ పార్టీ సెక్షన్: 8కి వ్యతిరేకమని చాలా స్పష్టమయిన సంకేతాలే అందిస్తున్నారు.   ఇదివరకు కూడా అనేక అంశాల మీద ఇటువంటి ద్వంద వైఖరి అవలంభించినందుకే వైకాపా అనేకసార్లు ఎదురుదెబ్బలు తింది. అయినా తన (ద్వంద) వైఖరిని మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ వర్గాలలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మోడీ ప్రభుత్వం చంద్రబాబుకే అండగా నిలబడిందా?

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి సెక్షన్: 8ని అమలుచేయాలని చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం మొదట సానుకూలంగా స్పందించకపోవడంతో తెరాస, కాంగ్రెస్, వైకాపాలు చాలా సంబరపడ్డాయి. అదేవిధంగా ఓటుకినోటు కేసులో కూడా కేంద్రం కలుగజేసుకోకుండా ఊరుకోవడంతో ఇక ‘చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని’ ఆ మూడు పార్టీలు తీర్మానించేసాయి. కానీ ముందు చాలా దూకుడుగా వ్యవహరించిన ఎసిబి అధికారులు గత వారం రోజులుగా చల్లబడిపోవడం గమనిస్తే వారు మరింత ముందుకు వెళ్ళకుండా కేంద్రప్రభుత్వమే తెలంగాణా ప్రభుత్వానికి బ్రేకులు వేసినట్లు అర్ధమవుతోంది. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెక్షన్: 8ని అమలుచేయడానికి సిద్దపడుతోందన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి పరోక్షంగా సహాయపడుతూనే ఆయన మాటకి కూడా చాలా విలువ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. లేకుంటే సెక్షన్: 8ని తెలంగాణా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందనే విషయం తెలిసిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం దానిని అమలుచేయాలని ప్రయత్నించేది కాదు. కానీ దానిని అమలుచేయాలని ప్రయత్నిస్తే తెరాస ప్రభుత్వం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అంతేకాక ఊహించని అనేక కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మరి వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి.

కాంగ్రెస్ పార్టీని వీడట్లేదు: జయసుధ

    కాంగ్రెస్ పార్టీని విడిచి తెరాసలో జేరబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను జయసుధ ఖండించారు. ఆమె తెరాసలో చేరాలనే ఆలోచనతో ఉన్నందునే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని భావించిన తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని భావించినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. అందుకే ఆమె ఈరోజు ఆయనను కలిసి వివరణ ఇచ్చుకొన్నారు. అటు సినిమాలతో, సేవా కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నందునే తను పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోనలేకపోతున్నానని, త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అవసరమయితే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు తను ఏవిధమయిన సేవలు అందించడానికయినా సిద్దమని తెలిపారు. తను కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టాలని ఎన్నడూ అనుకోలేదని స్పష్టం చేసారు.   కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె పనిచేయదలిస్తే తన సికిందరాబాద్ నియోజకవర్గం వరకయితే పరువాలేదు. కానీ ఆమె ఆంధ్రా మూలాల కారణంగా తెలంగాణాలో మరే ప్రాంతంలో ప్రజలను మెప్పించడం చాలా కష్టమే. ఇక ఆంధ్రా విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ అంతటి వాడు గత ఏడాది కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించలేకపోయానని చెప్పి దానికో నమస్కారం పెట్టేసి వైకాపాలో చేరిపోయారు. అటువంటప్పుడు జయసుధ వచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించగలరా?

చెడపకురా చెడేవు...వైకాపా కోసమేనేమో?

  ఓటుకు నోటు వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయక తప్పదని, ఆయనను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడని చాలా మంది జోస్యం చెప్పారు. కానీ ఆయన అంతకంటే తీవ్ర నేరమయిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితులు, బలాబలాల లెక్కలు అన్నీ మారిపోయాయి. ఈ యుద్దంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధించారనే విషయం పక్కనబెడితే, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి ట్విస్ట్ ఇవ్వడంతో అందరి కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నిరాశ చెంది ఉండవచ్చును. చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేస్తే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా తనకు అనుకూలంగా మారుతాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తే, అందుకు పూర్తి వ్యతిరేకంగా జరిగాయి.   ఈ వ్యవహారంలో రెండు ప్రభుత్వాలు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇరురువురికీ నష్టమే కనుక ఇక క్రమంగా వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశః త్వరలో రేవంత్ రెడ్డి తదితరులు కూడా బెయిలు మీద విడుదలయి బయటకు వచ్చేయవచ్చును. కనుక రెండు ప్రభుత్వాలు మళ్ళీ యధావిధిగా తమ పరిపాలనా కార్యక్రమాలలో బిజీ అయిపోవచ్చును. ఈవ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఆచితూచి వ్యవహరించినందున దానికి రెండు రాష్ట్రాలలో కొత్తగా ఎటువంటి నష్టమూ జరుగలేదనే చెప్పవచ్చును. కానీ ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్ర నేతలతో చేతులు కలిపి కుట్రలు పన్నారని తెదేపా చేసిన ఆరోపణల వలన వైకాపా పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడగా, ఆ కుట్రలను ఎదుర్కొని బయటపడినందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో ఎంతో కొంత సానుభూతి కూడా ఏర్పడిందనే చెప్పవచ్చును.   ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేద్దామని ప్రయత్నించి జగన్మోహన్ రెడ్డి భంగపడటమే కాదు తన పార్టీకి కూడా ఎంతో కొంత నష్టం కలిగించారు. అందుకే పెద్దలు చెడపకురా చెడేవు అనేవారు. ఆ మాట అక్షరాల వైకాపాకు సరిపోతుందని మరో మారు రుజువయింది.

చంద్రబాబు వాయిస్‌ టెస్ట్ ఛాన్సే లేదు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓటుకు నోటు వ్యవహారంలో వాయిస్ టెస్ట్ నిర్వహించే ఛాన్సే లేనట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడి మీద దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న రెండు మీడియా సంస్థలు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వబోతున్నారని, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వాయిస్ టెస్ట్ నిర్వహించబోతున్నారని ఊదరగొడుతున్నప్పటికీ అంత సీను లేనట్టు సమాచారం. చంద్రబాబు నాయుడికి ఎలాంటి వాయిస్ టెస్ట్ నిర్వహించరాదని, ఆయనకు నోటీసులు జారీ చేయడం లాంటి పనులు చేయొద్దని ఇప్పటికే ‘పైనుంచి’ స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి స్థానంలో వున్న చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం అది కొరివితో తల గోక్కున్నట్టు అవుతుందని హెచ్చరికలు తెలంగాణ ప్రభుత్వ వర్గాలకు వచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తీవ్ర మల్లగుల్లాలు, చర్చలు, సందేహాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు వాయిస్ అంటూ టేపులు బయటకు విడుదల చేయడమే తమ తలకు తాచుపాములా చుట్టుకున్న నేపథ్యంలో నోటీసులు కూడా ఇస్తే అది మరిన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం వుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అసలు వాయిస్ టెస్ట్ అనేది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదట. ఒక వ్యక్తి ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా మాట్లాడే అవకాశం వుంది. ఇప్పుడు టెస్టులు నిర్వహించి ‘‘ఇది చంద్రబాబు వాయిస్సే’’ అని స్పష్టంగా చెప్పే ఛాన్సు కూడా లేదట. అలాంటప్పుడు అనవసరంగా టెస్టులు నిర్వహించి లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కోవడం ఎందుకన్న ఉద్దేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వున్నాయట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు బలహీనమైపోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.