రాణి పద్మావతి కల్పితమా? రాజ్ పుత్ ల ఆక్రోశం అనవసరమా?
posted on Jan 31, 2017 @ 5:12PM
రాణి పద్మావతి... ఇప్పుడు దేశంలో ఈ పేరు బాగా వినిపిస్తోంది. కారణం పద్మావతి గురించి సినిమా తీస్తోన్న సంజయ్ లీలా బన్సాలీపై దాడి జరగటమే. ఆమె ముస్లిమ్ రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీతో శృంగారం జరిపినట్టు బాన్సాలీ సినిమాలో చూపబోతున్నాడని రాజ్ పుత్ లు ఆరోపిస్తున్నారు. అంతే కాదు, షూటింగ్ స్పాట్ లో దర్శకుడిపై దాడికి కూడా పాల్పడ్డారు...
బన్సాలీపై దాడి , బాలీవుడ్ వాళ్ల రియాక్షన్ ఎలా వున్నా అసలు పద్మావతి అనే రాజ్ పుత్ రాణి ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మందికి కలుగుతోంది! ఆమె గురించి సినిమా అనగానే రాజ్ పుత్ జాతి మొత్తం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందుంటే ఆమెతో వారికి ఎంతో ఎమోషనల్ అటాచ్ మెంట్ వుండాలి. అందుకే, ఆమె రొమాంటిక్ సీన్స్ తెరపై కనిపించబోతున్నాయన్నా అనుమానాన్ని కూడా సహించలేకపోయారు!
దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశం ముస్లిమ్ రాజుల నుంచి ఎక్కువ దాడులు ఎదుర్కొంది. బాబార్లు, గజినీలు, ఘోరీలు ఉత్తరాది మీదే దండెత్తారు. దోచుకున్నారు. తమ సామ్రాజ్యాలు స్థాపించారు. ఆ క్రమంలో వార్ని ఎదుర్కొన్న రాజ వంశాల్లో రాజ్ పుత్ లే చాలా ముఖ్యం. కొందరు చరిత్రకారులు రాజ్ పుత్ లు ఇస్లామిక్ దండయాత్రలకి లొంగిపోయారని రాసినప్పటికీ రాజ్ పుత్ ల ప్రతిఘటన వల్లే చాలా కాలం విదేశీ ముస్లిమ్ రాజులు ముందుకు సాగలేకపోయారు. వందల ఏళ్ల పాటూ చేసిన ప్రయత్నం తరువాత ఔరంగజేబు నాటికి అత్యధిక భారతదేశం వారి చేతుల్లోకి వచ్చింది. మళ్లీ బ్రిటీష్ కాలంలో ఢిల్లీ సింహాసనం ముస్లిమ్ ల చేతుల నుంచి పోయింది.
బయట నుంచి దండెత్తిన వచ్చిన ముస్లిమ్ రాజులతో జరిగిన సంఘర్షణ ఉత్తరాది జనంలో కథలు కథలుగా ప్రచారంలో వుంది. అలాంటి ఒక కథే రాణి పద్మావతి కథ కూడా! అందుకే, చాలా మంది చరిత్రకారులు రాణి పద్మావతి ఒక నిజమైన చారిత్రక పాత్ర కాదంటారు. ఆమె కేవలం కల్పితం అని వాదిస్తారు. వారు చెప్పే దాని ప్రకారం 13, 14 శతాబ్దాల మధ్య కాలంలో రాజస్థాన్ లోని చిత్తోర్ ఘడ్ సంస్థానంలో జీవించిన రాణి పద్మావతి... 1540లో మాలిక్ మహ్మద్ జయాసీ రచించిన ఒక కల్పిత ప్రేమ కావ్యంలో ప్రధాన పాత్ర. ఆ గ్రంథం పేరు పద్మావత్. అవధీ భాషలో రాయబడింది. అప్పట్నుంచీ ఇప్పటి దాకా అనేక సార్లు అనేక మంది రచయితలు ఈ కథనే మళ్లీ మళ్లీ చెప్పారు!
పద్మావత్ అనే గ్రంథం ప్రకారం సింగాల్ రాజ్యం, అంటే, నేటి శ్రీలంకకు చెందిన అపురూప సౌందర్యవతి పద్మావతి. ఆమెను దైర్య, సాహసాలు ప్రదర్శించి పెళ్లాడతాడు రాజ్ పుత్ రాజు రతన్ సేన్. తరువాత రతన్ సేన్ రాజ్యమైన చిత్తోర్ పైకి దండెత్తి వచ్చిన అల్లా వుద్దీన్ ఖిల్జీ మహారాణి అందం చూసి మోహిస్తాడు. ఆమెను స్వంతం చేసుకోవాలనుకుంటాడు. యుద్ధంలో భర్త రతన్ సేన్ కూడా చచ్చిపోవటంతో రాణి పద్మావతి ఖిల్జీ చేతికి చిక్కకుండా తన వందలాది మంది పరివారంతో కలిసి మంటల్లో దూకుతుంది. సతీ సహగమనం లాంటి ఈ సంప్రదాయాన్ని జౌహర్ అంటారు రాజ్ పుత్ లు.
ప్రచారంలో వున్న రాణి పద్మావతి కథ ప్రకారం ఆమె ఖిల్జీని చూడను కూడా చూడలేదు. అలాగే ఆమెను మోహించిన ఖిల్జీ కూడా తను బతికుండగా చూడలేదు. కాని, బన్సాలీ డ్రీమ్ సీక్వెన్సెలలో ఖిల్జీ, పద్మావతీలపై పాటలు చిత్రీకరిస్తున్నారని రాజ్ పుత్ లు ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. అలాంటివేవీ లేవని సంజయ్ చెబుతున్నాడు. నిజం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని జనం ముందుకు వస్తేనే తెలిసేది!
రాణి పద్మావతి నిజమని చెప్పే చారిత్రక ఆధారాలు వున్నా లేకున్నా ఆమె పట్ల రాజ్ పుత్ ల ప్రేమ, గౌరవం, అభిమానం తీక్షణమైన నిజాలు. వాట్ని దెబ్బతీయకుండా సినిమాను తీయటం బాన్సాలీ బాధ్యత!