ఊరికే మాటలు కాదు... ఊరికి ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు!
posted on Feb 1, 2017 @ 1:58PM
భారతదేశం అంటే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నైలు కాదు. బెంగుళూరు, హైద్రాబాద్, పూణేలు కూడా కాదు. అసలు నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే భారతదేశం అంటే నగరాలు, పట్టణాలు కానే కాదు. అసలు సిసలు భారతమంతా లక్షల గ్రామాల్లోనే దాగి వుంది. అందుకే, ఈ సారి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఊళ్లపైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మోదీ, జైట్లీ కింద నుంచీ మార్పుని తెచ్చే ప్రయత్నం చేశారు...
బడ్జెట్ 2017-18లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి భారీగా వరాలు ఇచ్చారు. అందులో మొదటిది 50వేల గ్రామ పంచాయితీల్లో పేదరిక నిర్మూలన. మన ఊళ్లలో ఎంతగా పేదరికం వుందో తెలిసిందే. అందుకే, 2019లోగా 50వేల పంచాయితీల్లో పేదరికం నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏడాదికి మూడు లక్షల కోట్లు వెచ్చించనుంది.
మన దేశంలో మధ్య తరగతి వారికే కాదు పేదలకి కూడా స్వంత ఇల్లు జీవిత కాల స్వప్నమే. అందుకే, పేదల కోసం ప్రభుత్వమే కోటి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. 2019లోగానే ఇది కూడా పూర్తి చేస్తారు. ఇక ఊళ్లలోని వారికి అత్యంత ప్రధానమైంది వ్యవసాయం. దీని అభివృద్ధికి ఈ సంవత్సరం లక్షా ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై అయిదు కోట్లు వెచ్చించనున్నారు. అలాగే, ఇప్పటికీ మన దేశంలో చాలా ఊళ్లు విద్యుత్ లేక చీకట్లో మగ్గుతున్నాయి. 2018లోగా కరెంట్ లేని ఇల్లు వుండదని జైట్లీ అన్నారు. ఈ ఆర్దిక సంవత్సరంలో నాలుగే వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు గ్రామీణ విద్యుదీకరణకు ఖర్చు చేయనున్నారు.
పంటతో పాటూ గ్రామాలకు పాడి కూడా చాలా ప్రధానమైంది. అందుకే, డెయిరీ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నారు. 80వేల కోట్లు కేటాయించారు బడ్జెట్లో. కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ల్యాబ్స్ ఏర్పాటు చేయటం ద్వారా కూడా గ్రామాల్లో ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తోంది మోదీ సర్కార్.
బడ్జెట్ లో ఇచ్చిన హామీలతో మనకు గ్రామ స్వరాజ్యం వచ్చేస్తుందని భావించాల్సిన పనిలేదు. అయితే, గతంలో కంటే ఎంతో కొంత అభివృద్ధి చెంది గ్రామీణ భారతీయుల వలసలు తగ్గితే అది దేశానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది!