కోదండరామ్ పై గీతా రెడ్డి ఫైర్

    తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పైన మంత్రి గీతా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోదండరాం అగ్రుకుల దురహంకారంతో అలా మాట్లాడారని మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తనకు ఎలాంటి నష్టం లేదని, కోదండరంకే మచ్చ అన్నారు. ఆయన మాటల తీరును చూసి అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. పవిత్రమైన ప్రొఫెసర్ వృత్తిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. తన గురించి తన తల్లి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. ఆయనది ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ అని, పెత్తందారీ వ్యవస్థ కోసమే ఆయన పని చేస్తున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణవాదులు ఎవరూ తనను వ్యతిరేకించడం లేదన్నారు. అందర్నీ రాజీనామాలు అడగడం కాదు, ముందు ఆయన తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి అని ధ్వజమెత్తారు. కోదండరాం చేసిన తప్పు క్షమాపణలతో పోయేది కాదన్నారు. తన తల్లి తెలంగాణ కోసం జైలుకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారన్నారు. ఆమె తెలంగాణ కోసం రాష్ట్రం కోసం ఎంతగానో చేశారన్నారు. నేను ఒక అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు పరిమితులు ఉంటాయి. అన్ని పరిమితులున్నా నేరుగా అధిష్టానం మీద ఒత్తిడి తేవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశాం. మా వాదన, మా స్వరం సోనియా గాంధీకి, కేంద్ర ప్రభుత్వానికి వినిపించాం అని ఆమె స్పష్టంచేశారు. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పోలీసు స్టేషన్‌లో కోదండరామ్ పై కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

కిరణ్ మార్పు ఊహాగానాలే : ఆజాద్

  గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు పై వస్తున్న వుహగానాలకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాష్ట్రంలో జరిగిన రాజీకీయ పరిణామాలపై సుదీర్ఘ అంతర్మధనం జరిపిన ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. మర్రి శశిధర్ రెడ్డిని కూర్చుండబెడతారనే వార్తలు వచ్చాయి. కిరణ్ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆజాద్ స్పందిస్తూ.. మార్పు కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేశారు.   రాష్ట్రంలో సీఎం, పిసీసీ మార్పు లేదని అన్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరణకు దారితీసిన పరిణామాలపై అసదుద్దీన్ తో ఫోనులో మాట్లాడినట్లు చెప్పారు. తదుపరి చర్చలు పార్లమెంట్ సమావేశాల టైం లో ఉంటాయని వెల్లడించారు. కిరణ్ పై ఒవైసీ చేసిన విమర్శలను ఆజాద్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవ్వరూ ఒక మతానికి కొమ్ముకాయరాని, తమది లౌకిక పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రిపై మతతత్వవాది ముద్రవేయడటం వుహతీతమని పేర్కొన్నారు. మరోవైపు ఎంఐఎం ఆరోపణల నేపధ్యంలో కిరణ్కుమార్ రెడ్డిని మార్చితే ఆ ఆరోపణలకు బలం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే ఆజాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. సీఎం మార్పు ప్రచారాన్ని కొట్టివేయకపోతే అసదుద్దీన్ ఒత్తిడికి కాంగ్రెస్ లొగిందన్న అపవాదు వస్తుందని ఆజాద్ వ్యూహాత్మకంగా మాట్లాడి ఉండొచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విశ్లేషిస్తున్నారు.        

దౌత్యం ఫలిస్తుందా.. లేదా..

    రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో తీరుగా మారిపోతున్నాయ్. ఎవరు ఎప్పుటడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీని పరిస్థితి. ఎన్నికలు దగ్గరికొస్తున్నకొద్దీ కుల సమీకరణాలు, వర్గ సమీకరణాలు, మత సమీకరణాలు ఎక్కువైపోతున్నాయ్. ఎటువైపు లాభముంటే అటువైపు దూకడానికి పార్టీలు, నేతలు ఏమాత్రం మొహమాటపడడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సాఆర్ పార్టీలోకి అన్ని పార్టీలనుంచీ వలసలు ఎక్కువైపోయాయ్. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం కూడా గుడ్డకాల్చి కాంగ్రెస్ నెత్తిమీదేసి తనదారి తనుచూసుకోవడం అధిష్ఠానానికి ఓ రకంగా షాక్. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఇలాంటి పరిణామాల్ని ముందరినుంచీ ఊహిస్తూనే ఉంది. అందితే జట్టూ అందకపోతే కాళ్లూ పట్టుకునే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా అబ్బిన విద్యేమీ కాదు. జనం అంతా అనుకున్నట్టుగా ఈ సమస్యని సాల్వ్ చేయడానికి సోనియా పెద్దగా కష్టపడాల్సిన విషయం కూడా ఏం లేదు.   యువరాజు రాహుల్ గాంధీ ఆల్రెడీ రంగంలోకి దిగారు. తానే నేరుగా అసదుద్దీన్ ఓవైసీతో ఫోన్ లో మాట్లాడారు. త్వరలోనే రాజీ కుదుర్చుకునేందుకు ఎంఐఎంని తిరిగి తన గూటిలోకి తెచ్చుకునేందుకు ప్రత్యేకంగా ఓ దూతని రాష్ట్రానికి పంపించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయ్.   ఏం కావాలన్నా ఇచ్చి అసదుద్దీన్ ని బుజ్జగించే ప్రయత్నం చేయాలన్నది యువరాజు రాహుల్ ఆలోచన. చిన్న పామునైనా  పెద్ద కర్రతో కొట్టాలన్న ఫార్ములాని ఎంఐఎం విషయంలో అవలంబించాలని రాహుల్ గట్టి నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం.   దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీల్ని తనవైపు తిప్పుకుని జాతీయ స్థాయిలో అఖండ శక్తిగా ఎదగాలన్న ఎంఐఎం ప్రయత్నేం పారితే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ మైనారిటీలు దూరమైపోతారు. హిందుత్వ కార్డ్ ని అడ్డంపెట్టుకుని బిజెపి కొన్ని ఓట్లు కొల్లగొడుతుంది. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది.     అందుకే రాహుల్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. పరిస్థితి ఇంతవరకూ వచ్చేదాకా ఏం చేస్తున్నారంటూ అధిష్ఠానం పెద్దలు కిరణ్ కుమార్ కి తలంటినట్టుకూడా సమాచారం. ఈ దెబ్బతో కిరణ్ కుర్చీ ఖాళీ అవుతుందని ప్రత్యర్ధులు పండగకూడా చేసుకుంటున్నారు.  

రాజీనామాకు కట్టుబడే ఉన్నా: కావూరి

  కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనని నిర్లక్ష్యం చేసినందుకు అలిగి రాజీనామా చేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావ్ ఏమాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడంలేదు. రాజీనామా విషయమై కావూరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కావూరితో భేటీ అయిన ప్రథాని ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కావూరి మాట వినలేదు. ప్రథాని మన్మోహన్ దగ్గర తన మనస్తాపాన్ని ఆయన పూర్తిగా బైటపెట్టారని పార్టీవర్గాలు చెబుతున్నాయ్. ప్రథానితో సమావేశానికి సంబంధించిన వివరాల్ని తాను బైటికి చెప్పలేనంటూ కావూరి మాట దాటేశారు.

కులరాజకీయాల పాచికలాట

        ఎన్నికలు దగ్గరికొచ్చేస్తున్నాయ్.. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి పాతా కొత్తా పార్టీలన్నీ రకరకాల పాచికల్ని ప్రయోగిస్తున్నాయ్. ప్రాంతీయ తత్వాలు, వర్గ పోరాటాలు ఒరగబెట్టే లాభం చాలా తక్కువగా ఉంటుందన్న నిజాన్ని గ్రహించాక అన్ని పార్టీలూ ఇప్పుడు కులసమీకరణాలమీద పడ్డాయ్.   పల్నాటి రెడ్లని, మాలల్ని, కన్వర్టెడ్ క్రిస్టియన్లని పూర్తిగా ఆకట్టుకోవడంలో సఫలత సాధించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైనంత ఎక్కువగా కాపుల్నికూడా పోగేసే ప్రయత్నం చేస్తోంది. ఇంకా వీలైతే మైనారిటీల్నికూడా గట్టిగాలం వేసి లాగాలనే ప్రయత్నాలుకూడా ముమ్మరంగా సాగుతున్నాయ్.   వైకాపా మాలల్ని పోగేయడాన్ని చూసిన తెలుగుదేశం మాదిగల్ని భుజానికెత్తుకుంది. వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబు పూర్తిగా బీసీ, ఎస్టీల జపం చేస్తున్నారు. అధికారంలోకొస్తే మాదిగల రుణం తీర్చుకుంటానంటూ చంద్రబాబు హామీలివ్వడం, మందకృష్ణ ఆయన పాదయాత్రకి మద్దతుని ప్రకటించడం లాంటివన్నీ టిడిపి కొత్త సమీకరణాల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అటు రెడ్లనీ, ఇటు ఇతర వర్గాల్నీ కూడగట్టేట్టు లేదన్న నిజాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కాపుల్ని పోగేసే పనిలోపడింది. నిన్న మొన్నటిదాకా చంద్రబాబుని అస్సలు పట్టించుకోని సొంత సామాజిక వర్గం ఇప్పుడు బాబుకి ఆరునూరైనా అన్నివిధాలుగా బాసటగా నిలుస్తామని ప్రామిస్ చేసి మాటని నిలబెట్టుకుంటోంది.   గుంటూరు, బెజవాడ లాంటి స్థానాల్లో మైనారిటీల ఓట్లుకూడా కీలకం. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లోకూడా కాస్తో కూస్తో పట్టుసాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎంఐఎం. వీలైనంతగా మూడోనాలుగో ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగితే కష్టకాలంలో పార్టీలకు అడ్డంపటడేందుకు బేరం బాగా కుదుర్చుకోవచ్చన్నది ఆ పార్టీ వ్యూహం.   బీజేపీ ప్రయోగించిన తెలంగాణ అస్త్రం పేలని టపాసులా తుస్సుమంది. మరోదారి చూసుకోక తప్పని పరిస్థితి. ఎంఐఎం ఎలాగూ దూసుకుపోతూ మైనారిటీల ఓట్లని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది కాబట్టి హిందుత్వ కార్డ్ ని మళ్లీ తెరమీదికి తెస్తే సరిపోతుందని ఆ పార్టీ భావిస్తోంది. హిందుత్వ కార్డ్ వల్ల యాంటీ ముస్లిం ఓటన్నీ తమకే వస్తాయన్న ఆశతో ఆ పార్టీ ఉంది.   వెలమలంతా కెసిఆర్ వెనకుంటే, రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా కోదండరామ్ పక్షాన చేరిందన్న ప్రచారం నిజంగా నిజమైతే ఇక టిఆర్ ఎస్ కుల సమీకరణాలపై పెద్దగా ఆశలుపెట్టుకోకుండా కేవలం ప్రాంతీయతత్వం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నాలు ఎంత వరకూ సఫలమౌతాయో చెప్పలేని స్థితి.    

ఎంఐఎం తలాఖ్ వెనక అసలు కథ

        చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వ్యవహారంలో కిరణ్ సర్కారుపై అలిగిన ఎంఐఎం కాంగ్రెస్ ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి తలాఖ్ చెప్పేసింది. మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలన్న తలంపుతోనే తాము దశాబ్దంనుంచి కాంగ్రెస్ కి మద్దతిస్తున్నామని, ఇప్పుడు నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పడంలేదని చెప్పుకొచ్చింది.   పైకి అసదుద్దీన్ ఇలాగే చెబుతున్నా.. లోపల మాత్రం అసలు విషయం వైఎస్ఆర్ సిపితో మ్యాచ్ ఫిక్సింగేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.. ఉపఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్ని ఆకట్టుకోవడంలో ఓ మేరకు విజయం సాధించిందనే చెప్పొచ్చు. అలాంటప్పుడు ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటే లాభపడొచ్చన్నది ఎంఐఎం వ్యూహమని సీనియర్ల అంచనా..   చిరంజీవి రాజ్యసభకి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఎంఐఎం నేతలెవరూ హాజరుకాకపోవడం, ఆ పార్టీ అగ్రనేతలు చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ తో ములాఖత్ అవ్వడం ఇలాంటి ఆలోచనలకు, అంచనాలకు ఊతమిచ్చే ఘటనలు. జగన్ కి అసదుద్దీన్ కి మధ్య రాజకీయబంధం ఏర్పడిందని, త్వరలోనే అది కాంగ్రెస్ కి మద్దతుపై ప్రభావం చూపించబోతోందనీ అప్పట్లోనే చాలామంది అనుకున్నారు.   రాబోయే రోజుల్లో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది అన్న దాని మీదే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజానిజాలు తేలే అవకాశం ఉందన్నది అసలు నిజం. ఒకవేళ అంతా అనుకున్నట్టుగా అసదుద్దీన్ జగన్ పార్టీకి మద్దతిస్తే రాబోయే ఎన్నికలకోసం ఇప్పట్నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టే లెక్కని రాజకీయ వర్గాల అంచనా.  

కేసీఆర్ – చంద్రబాబు బస్తీమే సవాల్

        తెలంగాణపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ టిఆర్ఎస్ నేతలు, టిడిపి నేతలు సవాల్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ కేసీఆర్ చేస్తున్న వాదనల్ని కొట్టిపారేసేందుకు టిడిపి నేతలు కొంతకాలంగా తీవ్రస్థాయిలో తిరుగు సమాధానాలిస్తున్నారు.   చంద్రబాబు చర్చకి సిద్ధమేనా అంటూ టిఆర్ఎస్ నేత హరీష్ రావ్ చేసిన సవాల్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న టిడిపి నేత కడియం శ్రీహరి.. కెసీఆర్, హరీష్ రావ్ ల స్థాయికి చంద్రబాబు అవసరం లేదని తాను బహిరంగ చర్చకి సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు.   అటు హరీష్ రావ్ కూడా ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు స్థాయికి, కడియం స్థాయికి తాను సరిపోతానని, బహిరంగ చర్చకి కేసీఆర్ అంత పెద్దమనిషి అవసరం లేదని వ్యాఖ్యానించారు. మొత్తంమీద ఇరువర్గాలమధ్య సవాల్ , ప్రతి సవాల్ పర్వం ఘాటుగా సాగుతోంది.  

కేజ్రీవాల్ కీ రాఖీసావంత్ కీ లింకు

  ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్త కేజ్రీవాల్ కి, ఐటెం గర్ల్ రాఖీ సావంత్ కీ లింకు పెట్టేశారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. రాఖీ ఎప్పటికప్పుడు తన పేరు హైలైట్ అయ్యేలా తనకి తానుగా వివాదాలు సృష్టించుకుని ఎప్పుడూ వార్తల్లో నిలబడే ప్రయత్నం చేస్తుందని, ప్రస్తుతం కేజ్రీవాల్ వ్యవహారం కూడా అలాగే ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు.   కేవలం ప్రచారం కోసం కేజ్రీవాల్ రాజకీయ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్ప, ఆయన ఆరోపణల్లో పస లేనేలేదని దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేస్తున్నారు. రాఖీ సావంత్ కూడా అచ్చం ఇలాగే ప్రచారంకోసం పాకులాడుతుందని, ఇద్దరిమధ్యా చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలవల్ల రాఖీ హర్టయితే తనకి ఏకిపారేస్తుందన్న ఆలోచన వచ్చిందేమో మళ్లీ దిగ్విజయ్ సింగ్ తాను చేసిన వ్యాఖ్యలపై నాలిక్కరుచుకున్నారు. కేజ్రీని రాఖీతో పోల్చాల్సి రావడం దురదృష్టకరమంటూ ఆమెకి క్షమాపణకూడా చెప్పారు. రాఖీకి నేను వీరాభిమానిని అంటూ 65ఏళ్ల వయసున్న దిగ్విజయ్ ట్వీట్ చేయడం మరో విచిత్రం.   దిగ్విజయ్ తనపై అనవసరంగా కామెంట్ చేశారని, అసలు తనకి కేజ్రీవాల్ కి దిగ్విజయ్ కి సంబంధం ఏంటో చెప్పాలని రాఖీసావంత్ మండిపడింది. దిగ్విజయ్ కోసం ఇప్పుడు కొత్తగా తనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ రీ ట్వీట్ చేసి రిటార్డ్ ఇచ్చింది.

కిరణ్ సర్కారుపై అసదుద్దీన్ ఆగ్రహం

  హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం వ్యవహారంపై ఎంఐఎం అలిగింది. కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తామంటూ అల్టిమేటమ్ జారీ చేసింది. ఎంఐఎం పార్టీకి 7గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. వీళ్లతో కలిపి ప్రస్తుతం కాంగ్రెస్ బలం 158. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 151కి పడిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ 148. వాస్తవానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరిస్తే కాంగ్రెస్ కి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు.. కానీ.. పార్టీల బలాబలాల్లో తేడాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్. మారిన సమీకరణాలను బట్టి ఎవరైనా జగన్ పార్టీలోకి దూకడమో లేక మరే ఇతర ప్రయత్నం చేయడమో చేస్తే కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్ల ఎవరికీ ఏలాభం లేదు కాబట్టి ఎవరూ దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి లేకపోయినా ఓ విధంగా చూస్తే కాంగ్రెస్ బలం ఎంఐఎం మద్దతు ఉపసంహరణవల్ల తగ్గినట్టే. అసలే చిక్కుల సుడిగుండలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఇది మరో దెబ్బ. అసలు పరిస్థితి ఇంతవరకూ ఎలా వచ్చిందని అధిష్ఠానం నిలదీసే పరిస్థితి..

కుంభకోణాలకు అడ్డగా హైదరాబాద్: చంద్రబాబు

    హైదరాబాద్ ప్రస్తుతం కుంభకోణాలకు రాజధానిగా మారిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పేదల పేరును అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ధనాన్ని అడ్డంగా దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. జన౦ అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని బాబు అన్నారు. మోసం ఎప్పటికీ దాగదని, జనాల్ని మోసం చేసిన వాళ్ళు ఎప్పటికైనా తప్పించుకోలేరనిని చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. ఇప్పటికే జనాన్ని మోసం చేసిన వాళ్ళు జైళ్లో వూచలు లెక్కబెడుతున్నారని, కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. అవీనీతి ప్రభుత్వానీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.         కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని, ధరలు తగ్గాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యత్ ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోతే పట్టించుకొనే నాధుడే లేడన్నారు. కనీసం తాగునీటి బోర్లు కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులను 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు.   

బాల్ ఠాక్రే పరిస్థితి విషమం

  శివసేన అధినేత బాల్ ఠాక్రే పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. బాల్ ఠాక్రే ఊపిరితిత్తులు, క్లోమగ్రంథి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బాంద్రాలోని ఠాక్రే ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ సమయంలో ఆమెతో పాటు శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఉన్నారు. బాల్ ఠాక్రే ఆరోగ్యం బాగు పడాలంటూ ఆయన మేనల్లుడు రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన కార్యకర్తలు పలు దేవాలయాల్లో పూజలు చేశారు.   దసరా వేడుకల్లో బాల్ ఠాక్రే పాల్గొనకపోవడంతో అప్పటి నుంచే ఆయన ఆరోగ్యంపై సందేహాలు తలెత్తడం ప్రారంభించాయి.  ఆయన ఉద్ధవ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలంటూ పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు తెలిసింది.  ఆయన అనారోగ్య కారణాలతో జూలైలో ఆసుపత్రిలో చేరారు.

ఎమ్మెల్యే కుమారుడి కీచక పర్వం...!

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ శాసనసభ్యుడి తనయుడు కామంతో కళ్ళు మూసుకుపోయి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే కొడుకు తన అనుచరులతో కలిసి పదిహేడేళ్ల బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితారాలి ఫిర్యాదు మేరకు ముజఫర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బిఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్ అహ్మద్ కొడుకు నయీమ్, ఎమ్మెల్యే బావమరిది నామన్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బసారియా గ్రామం నుంచి ఆ మైనర్‌ను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. విషయం బయటపెడితే చంపేస్తామని నిందితులు బాధితురాలని హెచ్చరించారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అహ్మద్ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.

నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తు౦ది: కేజ్రీవాల్

  వారానికి ఒకరిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ మరో అవినీతి బాగోతాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దేశంలో నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని ఆయన విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై చర్చ జరుతోందిగానీ, ఆ మొత్తాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయడంలేదని ఆయన ధ్వజమెత్తారు. స్విస్ బ్యాంక్‌లో 700 మంది భారతీయులకు ఎకౌంట్లు ఉన్నాయని చెప్పారు. వారికి రూ. 6000 కోట్లు విలువచేసే ఖాతాలు ఉన్నాయని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ పని తీరు చాలా దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 25 లక్షల కోట్లు విదేశీ బ్యాంక్‌లో మూలుగుతున్నాయని, ఓ సీబీఐ మాజీ అధికారి చెప్పారని అన్నారు. ఆ రూ. 25 లక్షల కోట్లలో ఆరువేల కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందంటూ, అందుకు సంబంధించిన ప్రతాలను కేజ్రీవాల్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.   ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు స్విస్ బ్యాంక్‌లో చెరో వంద కోట్లు జమచేశారని, వారి తల్లి కోకిలా బెన్‌కు కూడా స్విస్ బ్యాంక్‌లో ఎకౌంట్ ఉందని కేజ్రీవాల్ తెలిపారు. మరి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాళ్ళ నివాసాల్లో ఎందుకు సోదాలు చేయరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందని, అందుకు హెచ్.ఎస్.బీ.సీ. అధికారులే సూత్రధారులని ఆయన మండిపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంవాద్ బైఠక్ అను మేథోమథనం

    కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఏపీకి పెద్దపీట వేశామనిపించుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఇక రాష్ట్రం విషయాన్ని పెద్దగా పట్టించుకునే సూచనలు కనిపించడం లేదు. సూరజ్ కుండ్ లో జరిగిన మేధోమథనంలో దీనికి సంబంధించి స్పష్టమైన సూచనలు కనిపించాయి. రాష్ట్రంలో రగులుతున్న తెలంగాణ అంశంగురించి ఈ మేధోమథన సదస్సులో నామమాత్రమైనా చర్చ జరగనే లేదు. అసలు అదో పెద్ద విషయంకూడా కాదన్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం ధోరణి కనపడింది.   సూరజ్ కుండ్ లో పార్టీ కాన్ సన్ ట్రేషన్ పూర్తిగా 2014 ఎన్నికలమీదే కనిపించింది. మిగిలిఉన్న సమయం చాలా కీలకమని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలని సోనియా చెప్పారు. ఈ సదస్సులో యువనేత రాహుల్ కి కీలక బాధ్యతలు అప్పజెబుతారంటూ వినిపించిన వార్తల్లో మాత్రం వాస్తవం కనిపించలేదు.   ధరల పెరుగుదలని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సోనియా ఈ సదస్సులో గట్టిగా కోరారు. సబ్సిడీ సిలిండర్ల ధరని 6 నుంచి 12 కి పెంచాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. కేంద్ర క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితులకు మాత్రమే ఆహ్వానం అందడంవల్ల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లలేదు. పిసిసి చీఫ్ బొత్సకూడా ఇదే కారణంవల్ల దూరంగా ఉన్నారు. లండన్ పర్యటననుంచి వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈ సదస్సుకి హాజరుకాలేకపోయారు.  

స్విస్ అకౌంట్లు బయటపెట్టిన కేజ్రీవాల్

    వారానికి ఒకరిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ మరో అవినీతి బాగోతాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దేశంలో నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని ఆయన విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై చర్చ జరుతోందిగానీ, ఆ మొత్తాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయడంలేదని ఆయన ధ్వజమెత్తారు.   స్విస్ బ్యాంక్‌లో 700 మంది భారతీయులకు ఎకౌంట్లు ఉన్నాయని చెప్పారు. వారికి రూ. 6000 కోట్లు విలువచేసే ఖాతాలు ఉన్నాయని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ పని తీరు చాలా దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 25 లక్షల కోట్లు విదేశీ బ్యాంక్‌లో మూలుగుతున్నాయని, ఓ సీబీఐ మాజీ అధికారి చెప్పారని అన్నారు. ఆ రూ. 25 లక్షల కోట్లలో ఆరువేల కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందంటూ, అందుకు సంబంధించిన ప్రతాలను కేజ్రీవాల్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు స్విస్ బ్యాంక్‌లో చెరో వంద కోట్లు జమచేశారని, వారి తల్లి కోకిలా బెన్‌కు కూడా స్విస్ బ్యాంక్‌లో ఎకౌంట్ ఉందని కేజ్రీవాల్ తెలిపారు. మరి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాళ్ళ నివాసాల్లో ఎందుకు సోదాలు చేయరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందని, అందుకు హెచ్.ఎస్.బీ.సీ. అధికారులే సూత్రధారులని ఆయన మండిపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కనికరించు సత్తెన్నా..!

  ఆకాశమంత పందిరి, భూదేవంత పీట.. పెళ్లి మండపం తయారీ ఖర్చే దాదాపు రెండు కోట్ల రూపాయలు.. అతిరథమహారథులైన అతిథులు.. పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు కూతురు పెళ్లి ఇలా అంగరంగ వైభవంగా జరిగింది. పిలిచినవాళ్లూ, పిలవని వాళ్లూ, సత్తెన్న కూతురు పెళ్లి చూసొద్దామని వెళ్లొచ్చినోళ్లూ.. అంతా సంతోషించారు. వేడుకకూడా ముచ్చటగా పూర్తైంది.   కానీ.. పెళ్లి కోసం బలవంతంగా లాక్కున్న ప్రైవేట్ వాహనాల యజమానులు మాత్రం మా వాహనాలు మాకిప్పించు సత్తెన్నా అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. అద్దెమాట దేవుడెరుగు, ముందు ఆర్సీ పుస్తకాలతో సహా తమ వాహనాల్ని తమ చేతిలో పెడితే గిరాకీల్ని కాపాడుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుంటామని మొరపెట్టుకుంటున్నారు.   సత్తిబాబు కూతురు పెళ్లికోసం ఆర్టీయే అధికారులు ఆర్సీ పుస్తకాలతో సహా చాలామంది దగ్గర ప్రైవేట్ వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీయే అధికారులు రోజుకి చెల్లించే అద్దె వెయ్యిరూపాయలు, ఇండికాకైతే 3 0 లీటర్లు, ఇన్నోవాలాంటి పెద్ద వాహనాలకైతే 40 లీటర్లు డీజిల్ ఇస్తారు. డ్రైవర్ కి రోజుకి 200 రూపాయల బేటా.. ఇవన్నీ లెక్కేసుకుంటే అధికారుల అధీనంలో ఉన్న వాహనాలకు ఇప్పటికే దాదాపు లక్షన్నరకు పైగా అద్దె కట్టాల్సుంది.   పెళ్లిళ్ల సీజన్ లో బండ్లు లేక వాహనాల యజమానులు యమ యాతన పడుతున్నారు. ఇవ్వాల్సిన డబ్బు సంగతి తర్వాత చూసుకుందాం.. ముందు మా బళ్లు మాకిచ్చేస్తే పెళ్లిళ్ల సీజన్ లో నాలుగురాళ్లు సంపాదించుకుంటామంటూ వాహనాల యజమానులు కాళ్ల చెప్పులరిగేలా సత్తిబాబు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు.