బ్రహ్మానంద రెడ్డి ప్రాసిక్యూషన్ కు అనుమతి !

        జగన్ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అధికారులను విచారించాలన్న సిబిఐ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ సంఘటన జరిగిన సమయంలో రాష్ట్ర మౌళిక వసతుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి ని విచారించడానికి కేంద్రం అనుమతి లభించింది.   దీనితో ఈ కేసు వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ కేసులో ఆయన నాలుగో నిందితునిగా ఉన్నారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న ఆయన వాన్ పిక్ భూ కేటాయింపుల్లో కొందరికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.   ఇప్పటి వరకూ ఎవరికీ లభించని ప్రాసిక్యూషన్ అనుమతి బ్రహ్మానంద రెడ్డికి మాత్రమే లభించింది. ఆయన రైల్వే అధికారి కావడంతో ఈ విషయంలో రైల్వే శాఖ తన వంతు ప్రయత్నాలు చేసింది. బ్రహ్మానంద రెడ్డి వైఎస్ రాజ శేఖర రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో డిప్యుటేషన్ ఫై పెట్టుబడుల శాఖలో కార్యదర్శిగా పని చేశారు.

1 న షిర్డీ ఆలయాన్ని పెల్చేస్తామని హెచ్చరిక

      నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే షిర్డీ సాయిబాబా ఆలయాన్ని జనవరి 1 వ తేదీన పేల్చివేస్తామనే ఓ హెచ్చరికతో కూడిన లేఖ ఆలయ సిబ్బందికి అందింది. దీనితో కంగారు పడిన ఆలయ డిఇఓ యశ్వంత్ ఆ లేఖను పోలీసుల చేతికి అందించాడు.   ఆ లేఖ ఫై బుల్దానా జిల్లా పోస్టల్ కార్యాలయం ముద్ర ఉంది. ఈ బెదిరింపు లేఖ ఫై అంకుష్ భూసే, బాస్కర్ కదం, బాలు లహుడ్కర్ అనే వ్యక్తుల సంతకాలు ఉన్నాయి. ఇక్కడ బాంబులు పెట్టేందుకు ఒప్పందం కూడా జరిగిపోయిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తాము రూ. 350 కోట్లు తీసుకున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.   ఈ లేఖతో ఆలయ సిబ్బంది లో టెన్షన్ ప్రారంభం అయింది. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వ్యవస్తను మరింత పెంచారు. దీనితో పోలీసులు ఆ లేఖలో సంతకాలు చేసిన వ్యక్తుల గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇది ఆకతాయిల పనే అని మరో వాదన కూడా ఉంది.

వైఎస్ జగన్ పార్టీలోకి వసంత నాగేశ్వరరావు

        కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ఆయన జగన్ గూటిలో చేరారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ ఉదయ భాను పార్టీ కండువా కప్పి వసంతను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, వై ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని అన్నారు.   తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో రాజ శేఖర రెడ్డి తనకు కేడిసిసి బ్యాంకు అధ్యక్ష పదవి కట్టబెట్టారని ఆయన అన్నారు. ఆలాంటి నేత ఋణం తీర్చుకోవడానికే తాను ప్రస్తుతం ఆయన కుమారుడి పార్టీలో చేరుతున్నానని అన్నారు. కొత్త పార్టీలో తాను ఓ సామాన్య కార్యకర్తగా కొనసాగాలని భావిస్తున్నాని వసంత అన్నారు. వసంత గతంలో నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు.

‘28’ తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో సంక్షోభం?

          ఈ నెల 28 న ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశం తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో తీవ్ర పరిణామాలు చోటు చోసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయం ఉండకపోవచ్చని ఈ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు భావిస్తూ ఉండటమే ఇందుకు కారణం.   కనీసం నలుగురు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఈ వలసలు ఉండే అవకాశం లేదు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవ రావు ను తన పార్టీలో చేర్చుకొనేందుకు టిఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను ముందుగా చేర్చుకోగలిగితే, ఇక మిగిలిన వారిని చేర్చుకోవడం పెద్ద కష్టం కాదని కేసిఆర్ అంచనా.   కే.కే.ను వచ్చే 2019 ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ నుండి బరిలోకి దింపాలని కూడా టిఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని సమాచారం. ఆయన తన పార్టీలో ఉంటే, ఢిల్లీ లో రాజకీయాలు నడపటం తేలిక అవుతుందని కేసిఆర్ భావిస్తున్నారు.   అఖిల పక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం లేని పక్షంలో, తెలంగాణా ప్రజల దృష్టిలో తాము దోషిగా నిలబడాల్సి వస్తుందని, ఎన్నికల సమయంలో తాము ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. ప్రత్యెక రాష్ట్రం ఇస్తే, తెలంగాణా లో నక్సల్స్ సమస్య తీవ్రతరం అవడంతో పాటు, కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ సర్కారుకు 'ధర్మ' సంకటం : మంత్రి డీఎల్ చెప్పినా.. !

    “అది మన ప్రభుత్వానికి ఎంతమాత్రం ఆరోగ్యకరమయిన విషయం కాదు” అని ఆరోగ్యా శాఖామాత్యులు డి.యల్. రవీంద్రరెడ్డిగారు ఎంతగా మొత్తుకొంటున్నా వినకుండా, అతని హెచ్చరికలు పెడచెవినపెట్టి అధర్మం అని తెలిసికూడా సిబీఐ చార్జ్ షీట్లో పేరువేసుకొన్న తనమంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుగారిని వెనకేసుకొస్తూ, ఆయనపై సిబీఐ ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి నిరాకరిస్తూ కాబినెట్ లో నిర్నయించేసి, ‘మేము సంతకాలు పెట్టేసాక గవర్నర్ సంతకం చేయక చస్తాడా?’ అనుకొంటూ నిర్భయంగా ఆ ఫైలును ఆయన ఆమోదం కోసం పంపించేరు విజ్ఞులయిన మన ముఖ్యమంత్రి గారు.   ఆ ఫైలు ఆయన చేతిలో పడినప్పటినుండీ ఆయనకు రాహుకాలం మొదలయినట్లయింది. ఆయన హైదరాబాదులో ఉంటె విపక్షాలు మరియు తెలంగాణా వాదులూ, డిల్లీ వెళ్తే అక్కడ మీడియా వాళ్ళు ‘మీరలా ఆ ఫైలుని కోడి గుడ్లు పొదిగినట్లు పొదుగుతూ ఎన్ని రోజులు కూర్చోంటారంటూ’ ఆయనపై దాడిచేస్తుంటే ఆబాధ బరిన్చలేకో మరేమో గానీ, దానిని మళ్ళీ కిరణ్ సర్కారుకే తిప్పి పంపేసారు “మీ తిప్పలు మీరు పడండి’ అంటూ. "మళ్ళీ మీరు నాకా ఫైలు పంపేముందు కనీసం ఈసారయినా న్యాయనిపుణుల సలహా తీసుకోమని" ఒక నోట్ (ఉచిత సలహా) కూడా దానిపైన బరబారా వ్రాసేసి చేతులుదులుపుకొని ‘హమ్మయ్యా!’ అని ఊపిరితీసుకొన్న గవర్నర్ గారు మళ్ళీ సోనియమ్మ పిలపందుకొని హడావుడిగా డిల్లీ బయలుదేరిపోయారు.   గోడకోట్టిన బంతిలా వెనక్కొచ్చిన ఆ ఫైలుని చూసి కిరణ్ కుమార్ రెడ్డి తలపట్టుకొంటే, వెనకనుండి “చూసారా... నేను ఆ రోజే మరీమరీ చెప్పినా వినకుండా పంపేరు..” అంటూ మన డి.యల్. రవీంద్ర రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కతూ ముసిముసి నవ్వులు చిందిస్తూ కనిపించేరు.   మరో గంటో గడియలోనో అయన ‘ధర్మాన ఫైలు మరియు న్యాయసూత్రాలు’ అనే అంశంపై చర్చించేందుకు మన టీవీ తెరలపైకి రాబోతున్నారు.

గుజరాత్ ఎన్నికల్లో మోడీ హాట్రిక్

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడో సారి మోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 116 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 60 స్థానాలు, జీపీపీ రెండు, ఇతరులు నాలుగు స్థానాలను గెలుచుకున్నారు. గురువారం ఉదయం రాష్ట్రంలోని 33 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 1,666 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మణినగర్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 85వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో మోడీ విజయం సాధించారు. ఆయన కుడి భుజంగా చెప్పుకునే మాజీ హోంమంత్రి అమిత్ షా నరన్‌పూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. మరోవైపు బీజేపీ నుంచి విడిపోయి బీపీపీ పార్టీ స్థాపించిన కేశుభాయ్ పటేల్ విశవదర్‌లో గెలుపొందారు. తనను గెలిపించి గుజరాత్ ప్రజలు ఉజ్వల భవిష్యత్తుకు మరోసారి పట్టం గట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. విజయం సాధించిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మరోసారి పట్టం గట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ఉజ్వల భవిష్యత్తుకు తాను కృషి చేస్తానని వాగ్ధానం చేశారు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని మోడీ తల్లి హీరాబెన్ అన్నారు. ఇవాళ ఆమె మోడీ విజయం సాధించిన సందర్భంగా మాట్లాడారు. తన కొడుకు పీఎం అవుతారన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీ దేశానికి చేయాల్సింది చాలా ఉంది అని వ్యాఖ్యానించారు. కాగా, మోడీ ప్రధాని కావాలని చాలా మంది కోరుకుంటున్నారని మోడీ సోదరుడు పంకజ్ మోడీ తెలిపారు.  

నాకేలా ఇన్ని కష్టాలు...!

      వై.ఎస్. విజయమ్మ తన బిడ్డ షర్మిలను కలుసుకొని మాట్లాడుతున్న సందర్భంలో బోరున విలపించారు. 'ప్రభువా! నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావ్ ...' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ పాదయాత్రికురాలు షర్మిల తన అన్నాను కలిసేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన సంఘటన ఇది. మొదటినుంచి వైఎస్ కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం ప్రారంభించాలన్న దైవ ప్రార్దనతోనే మొదలయ్యే సంప్రదాయం నెలకొని ఉంది. గత రెండు దశాబ్దాలుగా పులివెందుల చర్చి పాస్టర్ సాల్మన్ ప్రభుతులు వైఎస్ కుటుబం చేపట్టే ఏ కార్యక్రమాన్ని అయినా ప్రార్థనతో మొదలుపెట్టి 20 నిముషాల పాటు ప్రభువుకు నివేదిస్తారు. ఆ తరువాత వారికి ప్రభువును వచ్చే సంకేతాలను బట్టి ఆయా కార్యక్రమాలను కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకొనే ఆనవాయితీ నెలకొని ఉంది.  ఆ ప్రకారమే యథావిధిగా షర్మిల తన అన్నను కలిసేందుకు జైలుకు వెళ్ళే ముందు యథావిధిగా పులివెందుల సీఎస్ ఐ చర్చి ఫాస్టర్ ప్రార్థన నిర్వహించారట. ఆ ప్రార్థనలో షర్మిల జైలుకు వెళ్ళే విషయమై ప్రభువునుంచి అనుకూల సంకేతాలు రాకపోవడంతో విజయమ్మ షర్మిలను ఆపే ప్రయత్నం చేశారట. కానీ అప్పటికే షర్మిల తీసుకున్న నిర్ణయం ప్రకారం జగన్ ను కలిసేందుకే మొగ్గుచూపడంతో తీవ్ర నిరాశకు గురైన విజయమ్మ బోరున విలపిస్తూ నా కుటుంబానికే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు ప్రభువా అని కన్నీటిపర్యంతం అయ్యారట.  అక్కడే ఉన్న ఫాస్టర్లతొ ఆమె తన దుఃఖాన్ని పంచుకుంటూ గతంలో తన భర్త కూడా ప్రభువు నిర్ణయానికి వ్యతిరేకంగా హెలికాఫ్టర్ ప్రయాణం చేయడంతో అకస్మాత్తుగా మరణానికి గురయ్యారనే విషయాన్ని గుర్తుకు తెస్తూ మళ్ళీ ప్రభువు నిర్ణయానికి వ్యతిరేకంగా షర్మిల ఈ రోజు జైలుకు వెళ్ళడం ఉదంతాన్ని ఆమె ఆ ఫాస్టర్లతొ మొరపెట్టుకున్నారట. నా కొడుకు, భర్త మరణం తరువాత పట్టుమని పదిరోజులు కూడా మాతో గడపలేదు. ఓదార్పు యాత్రలంటూ ఎప్పుడు ప్రజల్లోనే తిరిగేవాడు. మధ్యలో అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళాడు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో ఉండలేకపోతున్నారు. కూతురు కూడా పాదయాత్ర చేపట్టి కాలికి దెబ్బ తగిలించుకుంది. ఇప్పుడేమో కోడలిని పాదయాత్రను కొనసాగించమంటున్నారు. అసలు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని ఆమె బోరున విలపించారట.

నా కుమారుడు ప్రధాని అవుతాడు: నరేంద్ర మోడి తల్లి

      గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ప్రత్యర్ధి శ్వేతా భట్ పై 85 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మోడీకి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా, ఓ పోలీసు అధికారి భార్య అయిన శ్వేతా భట్ ను పోటీకి నిలమెట్టినా మోడీ విజయాన్ని, మెజార్టీని నిలువరించలేకపోయారు. ”నా కుమారుడు ఖచ్చితంగా ప్రధాని అవుతాడు” అని నరేంద్ర మోడి తల్లి హీరా బెన్ మీడియాతో అన్నారు. గుజరాత్ ఫలితాలు వెలువడుతుండగానే అహ్మదాబాద్ లోని మోడీ ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఇక పోరుబందరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన గుజరాత్ పీసీసీ ఛీఫ్ అర్జున్ మోడ్వాడియా ఓటమి పాలయ్యారు. గుజరాత్ లోని 182 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలలో గెలిచిన బీజేపీ 3 స్థానాల్లో అధిక్యంలో ఉంది. 52 స్థానాల్లో గెలిచన కాంగ్రెస్  3 స్థానాలలో అధిక్యంలో ఉంది. రెండు స్థానాలలో జీపీపీ విజయం సాధించగా, నాలుగు స్థానాలలో ఇతరులు గెలిచారు.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ దే..!

      హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్రసింగ్ తీరిగి సీఎం కూర్చీని ఎక్కనున్నారు. ఓట్ల లెక్కింపులో మొదటిలో కాంగ్రెస్, బిజెపి హోరాహోరిగా పోటి పడినప్పటికీ...తరువాతీ రౌండ్లలో కాంగ్రెస్ ముందుకు దూసుకుపోయింది. మొత్తం 63 స్థానాల్లో కాంగ్రెస్ 34 స్థానాలు గెలిచి 2 చోట్ల ఆధిక్యంలో ఉంది, బిజెపి 24 స్థానాలలో గెలిచి 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. తమ ఓటమని అంగీకరిస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం బిజెపి నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ అన్నారు. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేస్తామన్నారు. హమీర్ పూర్ నుంచి పోటిచేసిన ధుమాల్ తన సమీప ప్రత్యర్ధి సరెంధర్ పై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వీరభద్రసింగ్ గెలుపు పై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం సొనియాదేనన్నారు.  

మణినగర్‌లో మోడి విక్టరీ

      మణినగర్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోడి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్‌పై 85 వేల ఓట్ల మెజార్టీతో నరేంద్రమోడి గెలుపొందారు. మరోవైపు గుజరాత్‌లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్‌లో స్పందించారు. ఇక అంతా ముందు చూపేనని.. వెనుక చూపు లేదని ట్వీట్ చేశారు. గుజరాత్ లో 112 స్థానాలలో బీజేపీ, 64 స్ధానాలలో కాంగ్రెస్ , 4 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 26 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 6 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు.  

గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడిదే హవా

    గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి పదవిని అధిష్టించేందుకు ముఖ్యమంత్రి నరేంద్రమోడి స్పష్టమయిన అధిక్యతను దక్కించుకున్నాడు. మొదట పోలింగ్ సరళి ఈ సారి బీజేపీ కొన్ని స్థానాలు నష్టపోతున్నట్లు కనిపించినా చివరకు వచ్చేసరికి పుంజుకుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన మాదిరిగానే మోడి గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే దిశగా సాగుతున్నారు. గుజరాత్ లో 111 స్థానాలలో బీజేపీ, 58 స్ధానాలలో కాంగ్రెస్ , 3 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 24 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 5 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. గుజరాత్ లో 13 స్థానాలలో,  హిమాచల్ ప్రదేశ్ లో 3 స్థానాలలో ఫలితాలు రావాల్సి ఉంది.

గుజరాత్ లో వికసిస్తున్న కమలం

  కొద్ది నెలల క్రితం జరిగిన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలపట్లగానీ, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంతో బాటు ఎన్నికలకివెళ్ళిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఫలితాలగురించి గానీ పెద్దగా ఆసక్తి చూపని దేశవాసులు ముందుగానే ఊహించిన ఫలితాలకోసం గుజరాత్ వైపు ఆసక్తిగా చూస్తున్నారంటే అందుకు కారణం ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీయేనని చెప్పక తప్పదు.   అభివృద్ధి మంత్రం జపిస్తున్న మోడీని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అతని చేతిలో ఘోరపరాభవం తప్పదనీ తెలిసికూడా గుజరాత్ లో అతనిని డ్డీ కొనక తప్పలేదు. డ్డీ కొన్నపుడయినా తన స్వంత మేనిఫెస్టో గురించి చెప్పుకొనే బదులు, అతను రాష్ట్రంలో సాదించిన అభివృద్ధి గురించే తన ఎన్నికల సభల్లోనూ ప్రస్తావించక తప్పక పోవడం కాంగ్రేసుకి మింగుడుపడని మరో విషయం. సాక్షాత్ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ సైతం రాష్ట్రంలో కొన్నిచోట్ల అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవడం మోడీ యొక్క తొలివిజయంగా చెప్పవచ్చును. అందుకే ఫలితాలు కూడా అందుకు అనుకూలంగానే వెలువడుతున్నాయిప్పుడు.   ఇప్పుడే అందిన తాజా వార్తల ప్రకారం గుజరాత్ లో బీజేపీకి ౧౧౪ స్థానాలలొ ఆదిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో ఆదిక్యతలో ఉంది. మోడీని ఇబ్బందిపెట్టగల సమర్థుడు, అతని ఓట్లను చీల్చి కాంగ్రేసు తో ప్రభుత్వం ఏర్పరచగల ఒకే ఒక్కనేత అని భావించిన కేషుభాయి పటేల్ యొక్క గుజరాత్ పరివర్తన్ పార్టీ కేవలం అంచనాలకు పూర్తీ విరుద్దంగా కేవలం 82 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 3 స్థానాలలో మాత్రమే ఆదిక్యతలో ఉండటం కూడా మోడీ ఎఫెక్టేనని చెప్పక తప్పదు. గానీ,   కాంగ్రెస్ పార్టీ ముందే ఊహించినట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం ముందంజలో ఉంది. అక్కడ ఆ పార్టీకి 39 స్థానాలలో ఆదిక్యం ఉండగా, బీజీపీ మాత్రం కేవలం 22 స్థానాలలో ఆదిక్యత కనబరుస్తూ వెనక బడిపోయింది.

అంబ పలికె...రాంబాబు పలికె...

  వై.యస్సార్. కాంగ్రేసు పార్టీలో నోరున్న పెద్దమనుషుల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. అసలు నోరున్డటమే ఈరోజుల్లో రాజకీయాలకి ఒక ప్రధానార్హత కూడా గనుక అంబటి తిరుగులేని రాజకీయ నాయకుడుగానే చెప్పుకోవచ్చును.   అదేదో సినిమాలో హీరోకి నోటి దూల ఎక్కువ ఉండటమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు, మన రాంబాబుగారికీ ‘బూతుల పంచాంగ స్పెషలిస్టు’గా మంచి పేరున్నసంగతి, తన ప్రావీణ్యాన్ని పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర విరివిగా ఉపయోగిస్తారని మీడియాకి ఎవరో గిట్టని వాళ్ళు ఉప్పందిన్చినప్పుడు, అయన మీడియాలో కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగేరు. అప్పుడు కొంచెం తగ్గినా మళ్ళీ ఇప్పుడిపుడే ఆయన పున్జుకొంటూ మళ్ళీ మీడియాలో నిత్యం కనిపించడం ప్రారంబించేరు.   మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారు ఇందిరమ్మని తలచుకొంటూ వైజాగ్ బాట పట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకోస్తున్నవనే ప్రతిపక్షాల నీలపనిందలు భరించలేక, ఆ కోపంలో జగన్ని ఓ దులుపు దులిపపేసారాయన. “అతను అనేక అక్రమాలకి పాల్పడాడు గాబట్టే జైల్లో పడ్డాడు. అతనిపట్ల మనం జాలి చూపనవసరం లేదు. అతనేమయిన జైల్లో ఉన్న స్వతంత్ర సమరయోదుడా గౌరవించడానికి?” అంటూ దులిపోదిలి పెట్టారాయన.   అప్పుడు జగన్ ఉప్పు తింటున్న కారణంగా అంబటి కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నోరు చేసుకోవలసి వచ్చింది. అంబ పలికే...రాంబాబు పలికే....అంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఏ విదంగా ఉండబోతోందో అయన జాతకం వేసి చెప్పేసాడు.   “ఒకప్పుడు కేవలం 26 సీట్లు మాత్రమే గెలుచుకొని రాష్ట్ర రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పిన మీ కాంగ్రెస్ పార్టీ, రేపు రాబోయే ఎన్నికలలో కేవలం 16 సీట్లు మాత్రమె గెలిచి మీ పాత రికార్డుని మీరే బద్దలు కొట్టుదురు గాక....” అంటూ పిల్లిశాపాలు పెట్టినట్లు కిరణ్ కుమార్ రెడ్డిని శపించి పడేసాడాయన.   అంతేగాకుండా తమ నేత కాంగ్రేసులో ఉన్నపుడు లక్ష తొంబై వేల ఓట్లు సాదిస్తే, కాంగ్రేసు నుండి బయటకి వచ్చేసిన తరువాత జరిగిన ఎన్నికలలో 5.4 లక్షల ఓట్లు సాదించేడని మీడియా ముఖంగా కిరణ్ కుమార్ రెడ్డికి అయన తెలియజేసారు.   సోనియమ్మని ఆయన ఎదిరించినందుకే ఇప్పుడ జైల్లో మగ్గ వలసి వస్తోందే తప్ప అక్రమార్జన వల్లమాత్రం కాదని కిరణ్ కుమార్రెడ్డి గారికి ఆయన జ్ఞాపోదేశం కూడా చేసేరు.   మొత్తం మీద అంబటి వారు వేసిన కాంగ్రెస్ జాతక చక్రంలో మరి జగన్ పేరుందో లేదో అయన చెప్పలేదు. ఎందుకంటే, రాహుల్ బాబు ‘మళ్ళీ మనం జగన్నివాటేసుకొంటే జనం నవ్వుతారా లేదా? ఏమనుకొంటారు? అని రాష్ట్ర నేతలని అడిగినట్లు సమాచారం. మరటువంటప్పుడు కాంగ్రేసుకి కేవలం 16 సీట్లు మాత్రమే వస్తే తనకీ ఇబ్బందే కదా?

వడ్డించేవాడు మనోడయితే

  వడ్డించేవాడు మనోడయితే మనం ఏమూల కూర్చొన్నా అందవలసినవి అన్నీసవ్యంగా అందిపోతాయని ఊరికే అనలేదు పెద్దలు.   ప్రజాసేవ అంటూ ముందు కొన్నిసేవాకార్యక్రమాలు చేప్పటడం, కొంచెం ప్రజలలో పాపులారిటీ పెరిగిన తరువాత మెల్లగా రాజకీయాలలోకి అడుగుపెట్టడం, ఆ తరువాత ఏరాజకీయ పార్టీనో ఆశ్రయించి మెల్లగా పార్టీటికెట్ దక్కించుకోవడం, ఆ తరువాత ఇక తన ‘స్వయంసేవ’ మొదలుపెట్టుకొని కోట్లుకూడవేసుకొంటూ, దొరికిన కాడికి భూములు పోగేసుకోవడం, మంత్రిపదవి కోసం లాబీయింగ్ చేసుకొని మరింత పై......కి ఎదగడం, ఇదే ప్రస్తుతo ప్రతీ రాజకీయనాయకుడి ఫార్మాట్. ఈ పద్దతిలో ముందుకు సాగిపోయిన వారు మాత్రమే ‘ప్రజాసేవ’లో ఆరితెరినవారుగా పరిగనించబడుతారు.   మిగిలిన వాళ్ళు సిద్దాంతాలు, ఆదర్శాలూ అంటూ ‘ఈల’ వేసుకొంటూ కాలక్షేపం చేయవలసిందే తప్ప మరో దారిలేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రం నిరాడంబర జీవితం గడుపుతూ ‘ప్రజలకు సేవ’ చేసుకొంటూ రాజకీయ అప్రయోజకులుగా మిగిలిపోతారు. అటువంటి వారిని పార్టీలూ పట్టించుకోవు, ప్రజలు కూడా పట్టించుకోరు.   ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఒక రాజకీయ నాయకుడు (ప్రజాసేవలో నిమగ్నమయినవాడు) ఎన్ని కోట్లు పోగేసుకొంటే అంత గొప్పనాయకుడు. ఎన్ని కుంభాకొణాలలో అతని పేరు కనబడితే అంత ‘ఫేమస్ పర్సనాలిటీ.’ జైలుకి కూడా వెళ్ళి వస్తే అదో ప్రత్యెక అర్హత కింద లెక్క. ఇందులో సిగ్గు పడేందుకు ఏమిలేదు. సిగ్గూలజ్జా అనుకోవలసిన అవసరం అంతకంటే లేదు. ఎటువంటి వారినయినా కుల ప్రతిపాదికనో లేక వేరే మరేదో ప్రాతిపదికనో నెత్తినపెట్టుకు మోసే ప్రజలకి మన దేశంలో కరువు లేదు.   విజయ చిహ్నంగా రెండు వ్రేళ్ళూ ఊపుతూ బహుఠీవిగా కోర్టులకీ, జైళ్ళకీ తిరుగుతూ కూడా నెగ్గుకు రావచ్చును. నిజం చెప్పాలంటే అప్పటినుండే ప్రజలు, మీడియా కూడా అతనిని అసలు సిసలయిన రాజకీయ నాయకుడిగా గుర్తించడం మొదలు పెడతారు. అప్పుడే అతనికి అటు రాజకీయ పార్టీలు, ప్రజలు వీలయినచోట ప్రభుత్వమూ కూడా అండగా నిలబడతారు. ఈ తర్కానికి మద్దతుగా ఇక్కడ ఒక మోటు సామెత చెప్పుకోక తప్పదు. తేనే తీసేవాడు చేయి నాకడా? అనట్లు, అధికారంలో ఉన్నవాడు కాకపొతే విపక్షం లో ఉన్నవాడు వెనకేసుకొంటాడా అనే లాజిక్ ని కూడా బాగా వంట బట్టిన్చుకొన్నారు ప్రజలు. అధికారంలో ఉన్న నాయకుడు తన పదవిని తనకోసం వాడుకోవడంలో తప్పేమిటో? అని గునిసే ప్రజలు మనకి చాలామందే ఉన్నారు. ఈ విదంగా పరిణతి చెందిన ప్రజలు మనకి ఉన్నపుడు ఇక ఏ రాజకీయనయకుడయినా ఆత్మాన్యునతతో ఎందుకు బాద పడాలి?   కమింగ్ టూ పాయింట్ ఈ సారి చర్చ మన గౌరవమంత్రివర్యులు శ్రీమాన్ గంట శ్రీనివాసరావు గారి వ్యాపార సంస్తలు, వాటి అభివృద్దికి ఆయన కష్టపడుతున్న తీరు గురించి. కొద్ది నెలల క్రితమే ఆయన విజయవాడ కృష్ణనది మద్యనున్న భవానీ ఐల్యాండ్ ని తన ‘ప్రత్యుషా కంపెనీ’ ద్వారా సొంతం (లీజు అని మరో పేరు పెట్టారు దానికి) చేసుకోవడాన్ని ప్రజలు ముక్కున వేలేసుకొని చూస్తూ ఉండిపోయారు.   మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటపట్టి విశాఖకి వచ్చినప్పుడు, ప్రతిపక్షాలు మంత్రిగారికి చెందిన ప్రత్యుషా కంపెనీకి నగరం నడిబొడ్డునఉన్న కోట్లువిలువ చేసే ప్రభుత్వ గ్రంధాలయం ౩౩సం.లు లీజుపై (స్వంతం చేసుకోవడాన్ని) ఇవ్వడాన్ని ఆపేక్షిస్తూ ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం ఇవ్వబోయారు. బి.ఓ.టి.(బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్) ప్రాతిపాదికన ప్రభుత్వమే అతనికి విలువయిన గ్రంధాలయభూమిని అప్పజేప్పడాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఈయబోయారు. ప్రజోపయోగమయిన అటువంటి విలువయిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఈవిదంగా ధారాదత్తం చేయడం మంచికాదని చెప్పబోయారు.   గానీ ముందే అనుకొనట్లు వడ్డించేవాడు మనోడయితే.....ప్రభుత్వభూములేమిటి పరిశ్రమల పేరిట పొలాలు, కొండలను కూడా బొంచేసేయవచ్చును అని గతంలోనే చాలామంది నిరూపించేరు గనుక ముఖ్యమంత్రి బహుశః దానినే ప్రాతిపదికగా తీసుకొంటున్నట్లు ‘దానికో ప్రత్యేక కమిటీ వేసాము కదా అదే ఈ వ్యవహారాలు చుసుకొంటుoది’ అని తేలికగా తీసి పడేసి పక్కన కూర్చొన్న గంటా వారిని ఆనందభరితుడ్ని చేసారు. అప్పుడు గంటావారు కూడా ఒట్టిపుణ్యానికే ప్రతిపక్షాలవారు ప్రతీచిన్నవిషయాన్ని(భూమి ఖరీదు రూ.50కోట్లు మాత్రమే గాబట్టి) రాజకీయం చేయాలని చూస్తున్నారని గట్టిగా ఖండించి ముసి ముసి నవ్వులు నవ్వుతూ తన ‘కాంగ్రెస్ హస్తం’ దులుపు కొన్నారు.

2014 లో లోకేష్ పోటీ చేయరా?

    చంద్ర బాబు నాయుడు తనయుడు లోకేష్ వచ్చే 2014 ఎన్నికల్లో పోటీ చేయక పోవచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతానికి తన తండ్రిని ఎలాగైనా తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని వారంటున్నారు. ఆయనే స్వయంగా బరిలోకి దిగితే, తెర వెనుక చేయవలసిన కసరత్తు, నేతల మధ్య సమన్వయం, పార్టీ యంత్రాంగ పర్యవేక్షణ వంటి బాధ్యతలు వంటివి చూసే సామర్ధ్యం ఉన్న నేతలు పార్టీలో లేని కారణంగా లోకేష్ ప్రస్తుతానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కీలక బాధ్యతలు చూస్తారని తెలుస్తోంది.   లోకేష్ నిరంతరం పార్టీలోని సీనియర్ల కుమారులతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఎన్నికలకు దూరంగా ఉండాలని, 2019 ఎన్నికల్లో మాత్రం మనమంతా కలిసి పోటీ చేద్దామని చెపుతున్నారని తెలుస్తోంది. ఆయన చాలా కాలం నుండి పార్టీ తెర వెనుక రాజకీయాల్లో కీలక పాత్రే పోషిస్తున్నారు. క్రితం ఎన్నికల్లో పార్టీ మానిఫెస్టో రూపకల్పనలో కూడా తన వంతు పాత్ర పోషించారు. అయితే, మీడియాలోని ఒక వర్గం లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఆయన ఓ నియోజక వర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని ప్రచారం చేస్తోంది. లోకేష్ ను కేవలం ఓ నియోజక వర్గానికి పరిమితం చేసి, ఆయన పాత్ర మరింత క్రియాశీలకంగా ఉండకుండా చేసే ఎత్తుగడలో ఈ ప్రచారం భాగమని లోకేష్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   అలాగే, చంద్ర బాబు కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి లోకేష్ సేవలను వినియోగించుకొనే ఆలోచనలో ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

పార్లమెంట్ ను కుదిపేసిన గ్యాంగ్ రేప్: బీజేపీ ధ్వజం

      ఢిల్లీలో మెడికల్ స్టూడెంట్ పై జరిగిన గ్యాంగ్ రేప్‌ పై పార్లమెంట్ ఉభయ సభల్లో గందగోళం నెలకొంది. రాజ్యసభలో ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసి, అత్యారారంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుపట్టారు. ప్రశ్నోత్తర సమయం అనంతరం అవకాశమిస్తామని ఛైర్మన్ చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా మరో అరగంట వాయిదా వేశారు.   మరోవైపు లోక్‌సభలోనూ ఇదే అంశం కుదిపేసింది. దీనిపై ఎంసీ జయాబచ్ఛన్ ఉద్వేగంతో ప్రసంగించారు. అత్మాచార ఘటనపై ప్రభుత్వం సమాధానం సరిగా లేదని విమర్శించారు. విద్యార్ధినిపై జరిగిన రేప్‌ను హత్యాయత్నం కేసుగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై మాట్లాడేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. దేశ రాజధానిలో నేరాలను అదుపుచేయలేకపోతున్నారని బీజేపీ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. ఈ ఘటన చాలా సీరియస్ అంశమని, ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బిజేపీ వ్యాఖ్యానించింది. కాగా ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని గుర్తించినట్లు సమాచారం.  

జగన్ ని కలిసిన షర్మిలా : రేపు ఆపరేషన్

      చంచల్ గూడ జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ని ఈ రోజు ఉదయం ఆయన సోదరి వైయస్ షర్మిలా కలిశారు. జగన్ తో మాట్లాడేందుకు షర్మిలా కు జైలు అధికారులు అరగంట సమయాన్ని ఇచ్చారు. షర్మిలా వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా జైలుకు వచ్చారు. మోకాలి గాయంతో బాధ పడుతున్న షర్మిలా జగన్ ను కలిసేందుకు వీల్ చైర్ లో జైలుకు వచ్చారు.   కాలి గాయంతో షర్మిలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె మోకాలుకు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. షర్మిలా చేస్తున్న పాద యాత్రకు మూడు వారాలు బ్రేక్ పడనుంది. పాద యాత్ర చేస్తున్న సమయంలో తన వాహనం ఫై నుండి పడటంతో ఆమె మోకాలికి గాయం అయింది. గత శని, ఆది వారాల్లో ఆమె పాద యాత్ర జరగలేదు. సోమ వారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే,మోకాలి నొప్పి కారణంగా అది సాధ్య పడలేదు. దీనితో, వైద్యులు జరిపిన ఎమ్మార్ స్కాన్ లో గాయం పెద్దదిగా ఉన్నట్లు తేలింది. బుధవారం ఆమెకు వైద్యులు కీ హోల్ ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు ఆమెకు తెలియచేశారు.

మంటల్లో కాలిపోయిన ముఖ్యమంత్రి హెలికాప్టర్

      బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఎయిర్ పోర్ట్ లో కొన్ని విమానాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ చేసే హ్యంగర్స్ కు మంటలు రేగాయి. అందులో ఇంధనం కూడా ఉండడంతో మంటలు మిగతా బాగాలకు వేగంగా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడి పేలుళ్లు జరగడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఇళ్ల నుండి బయటకు వచ్చారు.   ఈ ప్రమాదంలో రెండు ప్రభుత్వ, రెండు ప్రైవేటు విమానాలతో పాటు ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్ కూడా మంటల్లో కాలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం పూర్తయ్యాక ఇక్కడ నుండి ఎలాంటి రాకపోకలు లేవు. ప్రధాని, ముఖ్యమంత్రి లాంటి ప్రముఖులు రాకపోకలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక పలు విమానాలు, చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను ఇక్కడ నిలిపి ఉంచుతున్నారు.