లోకేష్ వర్సెస్ జగన్: వారసత్వపు పోటీ
posted on Dec 13, 2012 @ 12:25PM
రాష్ట్రంలో నేడు ఓ చిరస్మరణీయ వారసత్వపు పోటీ జరుగుతోంది.
నాడు చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర రెడ్డి లు ఇద్దరు దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రంలో ముఖ్య మంత్రి పదవులను చేపట్టారు. తమ పార్టీల్లో అధ్యక్ష పదవులను కూడా వారు చేపట్టారు. రాజేకీయాల్లో సమ ఉజ్జీలుగా కూడా నిలిచారు. ప్రస్తుతం వారి వారసులు లోకేష్, జగన్ ల మధ్య కూడా అదే రకపు పోటీ జరగనుందా అనే విషయంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడానికి ఈ యువ నేతలు పావులు కదుపుతున్నారు.
తరాలు మారినా, రాజకీయ పరిణామాలు మాత్రం పునరావృతం అవుతాయని అనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణగా మిగిలిపోనుందా ? ఒక వైపు జగన్ సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తుండగా, మరో వైపు లోకేష్ వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఆయన జగన్ ఫై చేసిన ఆరోపణలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వై ఎస్, బాబు ల మధ్య సాగిన రాజకీయ తరహా పోటీ ప్రస్తుతం వారి కుమారుల మధ్య కూడా సాగుతుందా అనేదానికి మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.