టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం

  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఇప్పటి వరకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని, పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఎన్నికల పర్యవేక్షకుడిగా వ్యవహరించిన మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేసీఆర్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని నాయిని తెలిపారు. దీంతో కేసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నాయిని వివరించారు.

క్రికెటర్ అంకిత్ కేసరి దుర్మరణం

  క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ ఆ క్రికెట్ వల్లే క్రీడాకారులు ప్రాణాలను కోల్పోతున్నారు. గతంలో ఆస్ట్రేలియా క్రీడాకారుడు హ్యూస్ బ్యాటింగ్ చేస్తూ బంతి తగలడంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ క్లబ్ క్రికెటర్ అంకిత్ కేసరి మరణించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సీనియర్ నాకౌట్ పోటీల్లో భాగంగా సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భవానీపూర్ క్లబ్ ఆటగాడు కొట్టిన బంతిని అంకిత్, మరో ఆటగాడు క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి ఒకరికొకరు గట్టిగా ఢీ కొట్టుకోవడంతో అంకిత్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

నేనున్నా.. లేకున్నా... కేసీఆర్...

  ఆదివారం నాడు హైదరాబాద్‌లోని మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన తెలంగాణ కళాకారుల సమ్మేళనంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు కళాకారులందరితోపాటు, టీఆర్ఎస్ వర్గాల్లో ఆవేదన కలిగించింది. ఆయన ఈ తరహా మాటలు మాట్లాడకుండా వుంటే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ పోరాటంలో కళాకారుల పాత్ర ఎంతో వుందని అన్నారు. తాను వున్నా, లేకున్నా తెలంగాణను మీరే కాపాడాలని అన్నారు. ఈ ఒక్క మాట అందరి మనసులలో ఆవేదన కలిగించింది. తెలంగాణ పోరాటాన్ని విజయంతంగా పూర్తిచేసి, ఇప్పడు బంగారు తెలంగాణను సాధించడానికి కృషి చేస్తున్న కేసీఆర్ నోటి వెంట ‘‘నేనున్నా.. లేకున్నా’’ అనే మాట రావడాన్ని కళాకారులు, టీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలాంటి అశుభమైన మాటలు ఆయన నోటివెంట రావడం తమకు ఎంతో బాధ కలిగిస్తోందని వారు అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని, ఇలాంటి సమయంలో కేసీఆర్ నోటి వెంట అలాంటి మాటలు రావడాన్ని తాము భరించలేకపోతున్నామని వారు అంటున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలని తామందరం కోరుకుంటున్నామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల కేసీఆర్ భవిష్యత్తులో ఇలాంటి అశుభపు మాటలు మాట్లాడవద్దని వారు ప్రార్థిస్తున్నారు.

చావుబతుకుల్లో జాయింట్ కలెక్టర్

  ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుకుల్లో వున్నారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నిర్మల్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్‌కి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అబ్నార్ పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌కి తరలించారు.

నేటి నుంచి లోక్‌సభ

  బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. భూసేకరణకు సంబధించిన ఆర్డినెన్స్‌ను సోమవారం నాడే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాలు వాడిగా, వేడిగా జరుగుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆమధ్య జరిగిన సమావేశాలకు హాజరు కాకుండా లీవ్ తీసుకుని ఎటో వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరు అవుతున్నారు. ఆయన తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ సమావేశాల్లో హడావిడి చేసే అవకాశం వుందని అనుకుంటున్నారు. ఈ సమావేశంలో పలు బిల్లులను ఆమోదిస్తారు. మే 13 తేదీతో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు పూర్తవుతాయి.

ఘనంగా చంద్రబాబు బర్త్ డే

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 66వ పుట్టినరోజు వేడుకలు సోమవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగాయి. పార్టీ కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కేక్ కట్ చేసి, అందరి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని అన్నారు. అందరి త్యాగాల ఫలితం కారణంగానే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న స్థాయికి ఎదిగిందని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ‘‘నా జీవితం తెలుగు జాతికి అంకితం. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటున్నాను. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాను’’ అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన వేద పండితులు ఆశీస్సులు అందించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేత్ర, దంత వైద్య శిబిరాలతోపాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంధులకు బ్రెయిలీ ల్యాప్‌టాప్‌లను అందజేశారు.

బోటు మునిగి 700 మంది గల్లంతు

  లిబియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిబియా నుంచి జర్మనీకి వలస వెళ్తున్న ఏడు వందల మంది శరణార్థులు మరణించారు. లిబియా అధ్యక్షుడు గడాఫీని అక్కడ జనం దారుణంగా చంపేసిన తర్వాత తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. ఎక్కడ చూసినా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అనేకమంది లిబియా నుంచి జర్మనీకి సముద్ర మార్గం ద్వారా వలస వెళ్తున్నారు. ఇలా వలస వెళ్ళే వారి పడవలు మునిగి ఇప్పటి వరకు మూడు వందల మంది మరణించారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఏడు వందల మంది గల్లంతయ్యారు. లిబియా తీరం నుంచి ఇటలీలోని లాంపేడ్యూసాకి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ శరణార్థులు ప్రయాణిస్తున్న బోటుకు మరో పెద్ద వ్యాపార నౌక ఎదురు వచ్చింది. ఈ బోటులో ప్రయాణించడం కంటే ఆ నౌకలో ప్రయాణించడం మంచిదని దాంట్లోవారు భావించారు. ఆ నౌక పక్కనే బోటును ఆపి అందరూ అందులో ఎక్కడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో అందరూ బోటుకు ఒకే వైపుకు రావడంతో బోటు ఒరిగిపోయి నీటిలో మునిగిపోయింది. దాంతో 700 మంది గల్లంతయ్యారు. వీరిలో 24 మందిని కాపాడారు. 28 మంది ఈదుతూ బతికిపోయారు. మిగతావారంతా నీటిలో మునిగి మరణించి వుంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన పట్ల అటు జర్మనీలో, ఇటు లిబియాలో ప్రభుత్వ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పోప్ ఫ్రాన్సిస్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నారాయణా! వారానికోసారి సింగపూర్ వెళ్లివస్తారుట!

  రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇస్తున్న సింగపూర్ ప్రభుత్వానికి అవసరమయిన సహాయసహకారాలు అందించేందుకు మునిసిపల్ మంత్రి నారాయణ నలుగురు అధికారులతో కలిసి ప్రతీ ఆదివారం సింగపూర్ వెళ్లి వస్తానని ప్రకటించారు. రాజధానికి మైక్రో లెవెల్ ప్లానింగ్ సిద్ధమయ్యే వరకు తాను పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి గిరిధర్, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, సి.ఆర్.డి.ఏ.కి చెందిన మరో ఇద్దరు అధికారులు ప్రతీ ఆదివారం సింగపూర్ వెళ్లి వస్తామని మంత్రి నారాయణ మీడియాకు తెలియజేసారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకువచ్చేందుకు సింగపూర్, జపాన్ దేశాలు పర్యటిస్తేనే ఆయన ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చుపెట్టేస్తున్నారంటూ నానాయాగీ చేసిన వైకాపా మంత్రిగారి బృందం వారం వారం సింగపూర్ యాత్రల గురించి ఏవిధంగా స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగపూర్ ప్రభుత్వం రాజధానికి మాస్టర్ ప్లాన్ అందజేసే బాధ్యతలు తీసుకొన్నప్పుడు, అవసరమయినప్పుడు వారే క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరమయిన వివరాలు సేకరిస్తే సమంజసంగా ఉంటుంది గానీ ఈవిధంగా మంత్రిగారు తన బృందాన్ని వెంటబెట్టుకొని సింగపూర్ బయలుదేరుతానని చెప్పడం విమర్శలకు తావిచ్చేదిగా ఉంది.

సంగీత దర్శకుడు శ్రీ మృతి

  గత ఏడాది కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ నటులు, సంగీత దర్శకులు, నిర్మాతలు అకాల మరణం చెందుతుండటంతో తెలుగు ప్రజలు, సినీ పరిశ్రమలో వ్యక్తులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ దోష నివారణ కోసం సినీ పరిశ్రమలో వారు మాహా మృత్యుంజయ హోమం కూడా చేసారు. అయినప్పటికీ సినీ పరిశ్రమను మృత్యుదేవత నీడలా వెంటాడుతూనే ఉంది. గత కొంత కాలంగా అస్వస్థతో ఉన్న ప్రముఖ యువ దర్శకుడు శ్రీ (49) శనివారం సాయంత్రం హైదరాబాద్, కొండాపూర్ లోని తన స్వగృహంలో మరణించారు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు. ఆయన పూర్తి పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. సినీ పరిశ్రమలోకి రాకూడదనుకొంటూనే ఆయన ‘పోలీస్ బ్రదర్స్’ సినిమాతో సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మనీ మనీ, సింధూరం, అనగనగా ఒకరోజు, ఆవిడా మా ఆవిడే, గాయం, అమ్మోరు తాడిత సినిమాలు ఆయనకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన తన ప్రతిభను నిరూపించుకొన్నప్పటికీ సినీ పరిశ్రమలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పలేదు.   ఆయన మంచి నేపద్య గాయకుడు కూడా. చక్రం, గాయం, అమ్మోరు సింధూరం సినిమాలలో ఆయన పాడిన పాటలు ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ముఖ్యమగా చక్రం సినిమాలో ‘జగమంత కుటుంబం నాది’ అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆయన నేపద్య గాయని స్మితతో కలిసి ‘హాయ్ రబ్బా’ అనే ప్రైవేట్ ఆల్బం కూడా రూపొందించారు. ఆయన కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. సాయిరామ్ శంకర్ నటించిన 143సినిమాలో సాయిరామ్ కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. సినీ పరిశ్రమలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నప్పటికీ సినీ పరిశ్రమలో ఆయన ఇమడలేకపోయేవారు. జగమంత సినీపరిశ్రమలోతను ఎప్పుడూ ఏకాకిగానే ఉన్నట్లు అనుభూతి చెందేవాదినని ఆయనే స్వయంగా అనేకసార్లు చెప్పుకొన్నారు.   ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా తండ్రికి తీసిపోని తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పిచ్చికుక్కల సీజన్ మొదలైంది...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పిచ్చికుక్కల సీజన్ మళ్ళీ మొదలైంది. రెండేళ్ళ క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పిచ్చికుక్కలు రెచ్చిపోయి స్వైర విహారం చేసి వందలాది మంది మృతికి కారణం అయ్యాయి. వాటి ధాటికి మనుషులు కుక్కలను చూస్తేనే భయంతో వణికిపోయే పరిస్థితికి చేరుకున్నారు. ఏ ఆస్పత్రిలో బెడ్లు చూసినా పిచ్చికుక్కలు కరిచిన పేషెంట్లతో నిడిపోయి వుండేవి. ప్రతిరోజూ కనీసం ఇద్దరు ముగ్గురైనా పిచ్చికుక్కల బారిన పడి మరణించేవారు. పిచ్చికుక్కలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం పెద్ద గుణపాఠం నేర్చుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రం విభజన కావడం వల్లనో, మతిమరుపు వల్లనోగానీ, అధికారులు అప్పుడు నేర్చుకున్న గుణపాఠాన్ని మరచిపోయినట్టున్నారు. అందుకే మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పిచ్చికుక్కల సీజన్ మొదలైంది. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా కాకుమానులో పిచ్చికుక్కలన్నీ ఒక ఆరేళ్ళ పసిపాప మీద మూకుమ్మడిగా దాడి చేసి ఆ చిన్నారి పాప ప్రాణాలు తీసేశాయి. మా ఊళ్ళో పిచ్చికుక్కలు పెరిగిపోయాయి మహాప్రభో అని అంతకుముందు ఎన్నో రోజుల నుంచి ఆ గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. అధికారుల ఈ నిర్లక్ష్యానికి ఫలితం... ముక్కుపచ్చలారని పసిపాప... ఎంతో భవిష్యత్తు వున్న ఒక బాలిక తన ప్రాణాలను కోల్పోయింది. పసిపాప మీద కుక్కలు దాడి చేసి చంపిన ఈ ఘటన ప్రభుత్వ అధికారుల వైఫల్యానికి దారుణమైన నిదర్శనం. ఈ ఘటన తర్వాత అయినా మేలుకుని కుక్కలను అదుపు చేయాల్సిన అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. దాంతో శనివారం నాడు కూడా ఆ కుక్కల మంద మరోసారి తమ ప్రతాపం చూపించాయి. అయితే ఈసారి మనుషుల మీద కాకుండా పశువుల మీద చూపించాయి. కుక్కలు జరిపిన దాడిలో ఒక లేగదూడ మరణించింది. మరో లేగదూడ తీవ్రంగా గాయపడింది. ఈ లేగదూడల స్థానంలో మనుషులు వుంటే ఆ దారుణాన్ని ఊహించలేం. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి మొదలైంది. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం గౌసాబాద్ గ్రామంలో శనివారం నాడే పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. ఊళ్ళో జనం మీద పడి విచక్షణా రహితంగా కరిచేశాయి. ఈ పిచ్చికుక్కల బారిన పడి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి మరీ దారుణంగా వున్నట్టు తెలుస్తోంది. అలాగే శనివారం నాడే కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లిలో పిచ్చికుక్కలు 10 మందిని దారుణంగా కరిచేశాయి. కుక్కలకు పిచ్చిపట్టడం, జనం మీద పడి కరవడం సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతూ వుంటుంది. ఇది అధికారులకు తెలిసిన విషయమే. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎండాకాలం ప్రారంభమైంది. ముందు ముందు ఎండలు పెరిగేకొద్దీ కుక్కల్లో ప్రకోపం పెరిగే ప్రమాదం కూడా వుంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు ఈ దిశగా ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే సదరు అధికారులు కూడా ఈ కుక్కల బారిన పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదీ విషయం... రెండేళ్ళ క్రితం వచ్చిన పరిస్థితి మళ్ళీ రాకుండా చేసే శక్తి అధికారులకే వుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే.... పిచ్చిపట్టిన కుక్కలకంటే అధికారులే మరింత ప్రమాదకరమైన వారిగా భావించాల్సి వుంటుంది.

గర్భవతి అనే జాలి కూడా లేకుండా...

  రాజస్టాన్ లో ఓ దారుణమైన ఘటన జరిగింది. ప్రియుడే గర్బవతైన ప్రియురాలును చంపే ప్రయత్నం చేశాడు. రాజస్ఠాన్ జైపూర్ లో నరేంద్రకుమార్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేసేవాడు. అతను బ్యూటీ పార్లర్ లో పనిచేసే అమ్మాయితో పరిచయం పెంచుకొని పేమించాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఫలితం ఆ అమ్మాయి గర్భం దాల్చింది. విషయం తెలిసిన అతను అబార్షన్ చేయించుకోమని చెప్పగా ఆమె లేదు వివాహం చేసుకుందామని అతనిని కోరింది. కాని అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలనుకొని పథకం ప్రకారం ఆమెను కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ముఖం పై రాయితో మోది కొండ మీద నుండి తోసేశాడు. దాదాపు 12 గంటల తరువాత స్పృహలోకి వచ్చిన ఆమె సహాయం కోసం అరవడంతో అరుపులు విన్నవారు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.

ఉచిత వైఫై పొందాలంటే

  ట్యాక్ బండ్ చుట్టూ పదికిలోమీటర్ల మేర ఉచిత వైఫై సేవలు పొందాలంటే ఎలా అనుకుంటున్నారా మొదటగా వైపై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి తరువాత వైపై లిస్ట్‌లో క్యూఫై/ బీఎస్‌ఎస్‌ఎల్ అని డిస్‌ప్లే అవుతుంది. * అక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి. * ఎంటర్‌చేసిన మొబైల్ నెంబర్‌కు ఎంఎస్‌ఎంస్ ద్వారా వైఫై పాస్‌వర్డ్ వస్తుంది * ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే వైఫై అందుబాటులోకి వస్తుంది. ఈ వైఫై సేవలను మొదటి 30 నిమిషాల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, తరునాత నుంచి ఛార్జ్ పడుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఛార్జీలు కూడా మిగతా సర్వీసులతో పోలిస్తే నామామాత్రంగానే ఉంటాయని అన్నారు.

ఎస్ఐ పై నైజీరియన్ల దాడి

  ఈమధ్య నగరంలో నైజీరియన్ల ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడి నుండో చదువు పేరుతో వచ్చిన వీళ్లు మన వాళ్లపైనే దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారు. కొంతమంది వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా ఉంటూ పలు మోసాలు చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గతంలో వీళ్లు పోలీసుల పై దాడి చేశారు. మళ్లీ ఇప్పుడు శుక్రవారం రాత్రి ఎస్ఐ పై దాడి చేశారు. లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతలో అటుగా కారులో వెళ్తున్న ముగ్గురు నైజీరియన్లు కారు ఆపమన్నందుకు పోలీసు అధికారిపై దాడి చేశారు. తరువాత ఆ ముగ్గురు పారిపోయారు. పోలీసులు వెంబడించగా ఇద్దరు తప్పించుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లని నైజీరియన్ చట్టాల ప్రకారం విచారించాల్సి రావడంతో పోలీసులు కూడా కఠినంగా శిక్షించలేకపోతున్నారు.