కన్నాకు క్లాస్ పడాల్సిందేనా..?
posted on Jan 5, 2016 @ 11:49AM
టీడీపీ, బీజేపీలు మిత్రపక్షమని అందరికీ తెలిసిన విషయమే. కానీ మిత్రపక్షమైనప్పటికీ బీజేపీ నేతలు మాత్రం అప్పుడప్పుడు టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీ నేతలు చేసిన విమర్శలను టీడీపీ నేతలు మొదట పట్టించుకోకపోయినా.. ఆతరువాత మాత్రం వారి విమర్సలకు ధీటుగానే సమాధానం చెపుతూ వచ్చారు. మొన్నటి వరకూ రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు వంటి నేతలు టీడీపీ నేతలపై విరుచుకుపడేవారు.. అయితే ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్న బీజేపీ ఆయనకు ఫుల్లు క్లాస్ తీసుకొని వదిలిపెట్టింది. ఇక అప్పటినుండి సోము వీర్రాజు ఆయన నోటికి పని చెప్పడం తగ్గించారు. ఇప్పుడు సోము వీర్రాజు లాగానే.. బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీ నేతలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటున్నా ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం సరికాదని.. రాజకీయ పబ్బంగడుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై లేనిపోని అబాండాలు మోపాలని చూస్తే ఊరుకునేదిలేదని కాస్త ఘాటుగానే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎప్పటికప్పుడు సహాయపడుతూనే ఉందని.. అన్నీ ఆలోచించుకోవాలని అన్నారు. ఇక ఇప్పుడు కన్నా చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నా నోరు అదుపులో పెట్టుకోవాలని.. అతనికి కూడా క్లాస్ పడితే కాని సైలెంట్ గా ఉండడని అంటున్నారు. మరి కన్నా వ్యాఖ్యలకు బీజేపీ అతనికి క్లాస్ పీకుతుందో.. లేదో చూడాలి.