ఆత్మహత్య ముందు ప్రత్యూష బెనర్జీ గర్భవతే..

  చిన్నారి పెళ్లికూతురు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య వ్యవహారం కూడా డైలీ సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంది. ఈ ఆత్మహత్యపై ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఆత్మహత్యముందు ప్రత్యూష బెనర్జీ రెండు నెలల గర్భవతి అయివుంటుందన్న ఆరోపణలు తలెత్తాయి. ఇప్పుడు ఆవార్తలు నిజమే అని తేలింది. ముంబైలోని జేజే ఆసుపత్రి వైద్యులు ప్రత్యూష బెనర్జీ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను పోలీసులకు అందజేయగా అందులో వైద్యులు ప్రత్యూష గర్భవతి అయిందన్న విషయాన్ని తేల్చి చెప్పారు. అయితే ఆమె ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందే అబార్షన్ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే మాట్లాడుతూ ప్రత్యూష శరీరంలో చనిపోయిన పిండానికి సంబంధించిన కణాలు లభించాయని.. వాటి ద్వారా ఆమె గర్భవతి అయిన విషయం తెలిసిందని.. అయితే దీనికి కారణం ఎవరో అన్న విషయం చెప్పడం మాత్రం చాలా కష్టమైన పని అని చెప్పారు. ఇంకా ఇంతకు మించి ఎక్కువ వివరాలు చెప్పలేం.. మిగిలిన విషయాలు పోలీసులు తెలుపుతారు అని లహానే అన్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

కారు బాంబు దాడి.. 24 మంది మృతి

అప్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కారులో శక్తివంతమైన బాంబులు ఉంచడంతో అవి పేలి 24 మంది చనిపోయారు. వివరాల ప్రకారం.. నగరంలోని నాటో బలగాల ప్రధాన కార్యాలయం, అమెరికా రాయబార కార్యాలయం, అఫ్ఘన్ భద్రతా బలగాలకు చెందిన ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని కారులో బాంబులు పెట్టి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 24 మంది చనిపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఉగ్రవాదులు కూడా తమ దుశ్చర్యను అడ్డుకునేందుకు వచ్చిన భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. దీంతో అక్కడి ప్రాంతం కాల్పులతో దద్దరిల్లిపోయింది.

లోకేశ్ మంత్రి పదవిపై చంద్రబాబు.. "ఇప్పుడే కాదు తరువాత చూద్దాం"

    టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ మంత్రి పదవిపై గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీ క్యాబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో ఈసారి లోకేశ్ ను క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు కూడా అనుకుంటున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. అంతేకాదు లోకేశ్ కోసం తమ పదవులు సైతం త్యాగం చేస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముందుకొచ్చారు. అయితే ప్రసుత్త పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే చంద్రబాబు లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన లేనట్టు కనిపిస్తోంది. నిన్నజరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. లోకేశ్ పదవిపై ఆయన మాట్లాడుతూ.. "ఇప్పుడే కాదు తరువాత చూద్దాం" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో లోకేశ్ కేబినెట్ స్థానంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. మరి లోకేశ్ కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందో లేదో తెలియాలంటే మంత్రివర్గ విస్తరణ దాకా వెయిట్ చేయాల్సిందే.

చంద్రబాబుకి జగన్ సవాల్..

  ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అవ్వడంపై ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రిగారు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో పడ్డారు.. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు దిగాలని సవాల్ విసిరారు. విశాఖలో రైల్వేజోన్ కోసం అమర్ నాథ్ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జగన్ అక్కడికి వెళ్లి అతనికి నిమ్మరసం తాగించి.. దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు. రైల్వేజోన్‌ కోసం పోరాటం చేస్తున్న వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు, మహిళలకు రుణమాఫీ వంటి హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబుకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ గురించి కేంద్రాన్ని అడిగే నాథుడే కరువయ్యాడని, పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.

ఏపీలో మంత్రులకు వచ్చిన ర్యాంకులు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, పార్టీని కార్పోరేట్ స్టైల్లో నడుపుతారని తెలిసిందే. దీనిలో భాగంగానే ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరు..ఎమ్మెల్యేల పని తీరు..పార్టీ నేతల పనితీరు మీద సర్వేలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా లేటెస్ట్‌గా మంత్రుల పనితీరుపై ఆయన సర్వే చేయించి ర్యాంకులు ప్రకటించారు. దీనిలో పీతల సుజాత ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవగా..పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చివరి స్థానంలో నిలిచారు. సీఎం మంత్రులకు ఇచ్చిన ర్యాంకులు ఇవే. 1.       పీతల సుజాత 2.       దేవినేని ఉమామహేశ్వరరావు 3.      పత్తిపాటి పుల్లారావు 4.      కామినేని శ్రీనివాసరావు 5.      పరిటాల సునీత 6.      రావెల కిశోర్ బాబు 7.      అచ్చెన్నాయుడు 8.      గంటా శ్రీనివాసరావు 9.      కొల్లు రవీంద్ర 10.     చింతకాయల అయ్యన్నపాత్రుడు 11.     పల్లె రఘునాథ రెడ్డి 12.     మాణిక్యాలరావు 13.     కిమిడి మృణాళిని 14.     యనమల రామకృష్ణుడు 15.     పైడికొండల మాణిక్యాల రావు 16.     కేఈ కృష్ణమూర్తి 17.     నారాయణ

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదుల.. అమ్మాయిలదే హవా

  ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకేసారి ప్రథమ, ద్వితియ సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్లో 68. 08ఉత్తీర్ణత, సెకండియర్లో  73.78 ఉత్తీర్ణత పొందినట్టు మంత్రిగారు తెలిపారు. ఫస్టియర్లో అమ్మాయిల్లో 72.09 శాతం, అబ్బాయిల్లో 64.20 ఉత్తీర్ణత పొందగా.. సెకండ్ ఇయర్లో అమ్మాయిల్లో 76.43 శాతం, అబ్బాయిల్లో 71.12 శాతం ఉత్తీర్ణత పొందారు. కాగా ఈసారి పరీక్షల్లో అమ్మాయిలదే హవా.   ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,67,747 మంది జనరల్ కేటగిరీలో హాజరవగా, ఒకేషనల్ కి 32,655 మంది విద్యార్థులు హాజరైనట్లు మంత్రి తెలిపారు. జనరల్ విభాగంలో 1,85,538 మంది (58.29 శాతం) ఏ గ్రేడులో పాసయ్యారని, 82,109 మంది (25.85 శాతం) బీ గ్రేడ్ లో, 35,592 మంది (11.18 శాతం) సీ గ్రేడ్ లో, 15,061 మంది (4.73 శాతం) డీ గ్రేడ్ లో పాసయ్యారని వివరించారు.   రెండవ సంవత్సరం పరీక్షలకు 4,11,941 మంది జనరల్ కేటగిరీలో హాజరవగా, ఒకేషనల్ కి 32,655 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. జనరల్ విభాగంలో 1,74,649 మంది (57.46 శాతం) ఏ గ్రేడులో పాసయ్యారని, 84,407 మంది (27.77 శాతం) బీ గ్రేడ్ లో, 33,864 మంది (11.14 శాతం) సీ గ్రేడ్ లో, 11,014 మంది (3.62 శాతం) డీ గ్రేడ్ లో పాసయ్యారని వివరించారు.

చెప్పి మరీ ట్రాఫిల్ రూల్స్ ఉల్లంఘించిన ఎంపీ.. 2 వేలు జరిమానా

ఢిల్లీలో వాతావరణ కాలుష్య నివారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం సరి-బేసి విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 15 నుండి మలిదశ అమలు చేయగా.. నిబంధనను ఉల్లంఘించి ఆరోజే 5 గంటల వ్యవధిలో 500 వాహనాదారులు జరిమానా కట్టాల్సి వచ్చింది. అయితే వారు తెలియక నిబంధనలు ఉల్లంఘించామని.. ఇంకొందరు అత్యవసర పరిస్థితి ఉన్నందున రావాల్సి వచ్చిందని పలు కారాణాలు తెలిపారు. కానీ ఇక్కడ ఓ ఎంపీ గారు మాత్రం కావాలనే నిబంధనలు ఉల్లంఘించి జరిమానా కట్టాల్సివచ్చింది. బీజేపీ ఎంపీ విజయ్ గోయల్‌ ఆప్‌ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసమే బేసి-సరి విధానం అమలు చేస్తోందంటూ మండిపడ్డారు. అంతేకాదు ఆ నిబంధనను ఉల్లంఘిస్తానని చెప్పి ఒకరోజు ముందే ప్రకటించారు. దీనిలోభాగంగానే ఆ తర్వాత పార్లమెంటుకు వెళుతుండగా రైసినా రోడ్డు వద్ద ఆయనకు రూ.2 వేల అపరాధ చలానా రాశారు. అలాగే అనుమతి లేకుండా నడపడం, వాహన బీమా లేకపోవడంతో మరో రూ.1500 కూడా విధించారు.   మరోవైపు.. రాజకీయ ప్రయజనాల కోసం ఆప్‌ ప్రభుత్వం ఈ విధానంపై ప్రకటనలకు భారీగా ఖర్చు చేస్తున్నందుకు నిరసనగానే తాను నిబంధనలను ఉల్లంఘించాననీ, అలాగే, చోదక అనుమతి, బీమా పత్రాలు తన చోదకుల వద్ద ఉన్నాయనీ, అత్యల్ప ప్రయత్నం పథకానికి తాను విజయవంతంగా నిరసన తెలపగలిగినట్లు బీజేపీ ఎంపీ ట్వీట్ చేయడం గమనార్హం.

నీళ్లకు బదులు బీర్లు తాగడం సంస్కృతి కాదు.. శివసేన

  మహారాష్ట్ర ప్రస్తుతం నీటి కొరతతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నీటి కొరత వల్ల మహారాష్ట్రలో జరగాల్సిన ఐపిఎల్ మ్యాచులను కూడా రద్దు చేశారు. అయితే ఇప్పుడు ఈ నీటి ఎద్దడిపై శివసేన కూడా స్పందించింది. రాష్ట్రంలో నీటి కొరత చాలా ఉన్నందున మద్యం ఉత్పత్తి కంపెనీలకు నీటి సరఫరా నిలిపి వేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే అన్నారు. నీళ్లకు బదులుగా బీర్లు తాగడం సంస్కృతి కాద‌ని.. ప్రజలు తాగునీటి బాటిళ్లను కొనలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. మనుషులను కాపాడేందుకు మాత్రమే నీటిని వినియోగించాలని ప్ర‌భుత్వానికి సూచించింది. కాగా ఇప్ప‌టికే అక్క‌డి మ‌ద్యం ఉత్ప‌త్తి కంపెనీలకు 20 శాతం నీటి సరఫరాను నిలిపేశారు.

సుష్మా స్వరాజ్ ఇరానీ లుక్ పై వివాదం..

  భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల ఇరాన్ పర్యటన చేసిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఆ పర్యటన సంగతేమో కానీ.. ఆ పర్యటనలో ఆమె వేసుకున్న డ్రస్ మాత్రం వివాదాస్పదమైంది. సుష్మా టెహ్రాన్ లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె.. పింక్ కలర్ శారీ.. పింక్ శాల్వాతో ముస్లిం తరహాలో డ్రెస్స్ చేసుకున్నారు. అంతే దీంతో నెటిజన్లు ఆమెపై విమర్సలు చేస్తున్నారు. తలను వస్త్రంతో కప్పుకొని ఉండటం హిందూ సంప్రదాయం కాదంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు.. సుష్మా స్వరాజ్ చీర ధరించి, హిందూ సంప్రదాయబద్ధంగా తలపై కప్పుకుని ఉంటే బాగుండేదని ఒకరంటే.. ఇరానీలు లేదా సౌదీ అరేబియా డిప్లమాట్స్ హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటిపై కుంకుమ పెట్టుకుంటారా? అని మరొకరు, ముస్లిం మహిళల తరహాలో సుష్మా స్వరాజ్ డ్రెస్సు ధరించడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఇంకొకరు... ఇలా పలు ట్వీట్లలో ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.

మహా సీఎం సైజు తగ్గారు..

భారీ ఊబకాయంతో బాధపడుతూ వచ్చిన రిలయన్స్ ఇండస్టీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇప్పుడు ఎంతో మందిలో స్పూర్తి నింపుతున్నాడు. అలా స్పూర్తి పోందిన వారిలో సామాన్యులే కాదు ప్రముఖులు కూడా ఉన్నారు. భారీగా లేకున్నా కాస్త బొద్దుగా కనిపించే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం స్లిమ్ అవ్వాలనుకున్నారు. అంతే గడచిన మూడు నెలల వ్యవధిలో ఏకంగా 18 కిలోలు తగ్గారు. మరి దేశాన్ని ముఖ్యమంత్రులు శాసిస్తున్నఈ రోజుల్లో వారిని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఫడ్నవిస్‌ స్లిమ్‌నెస్‌ను స్పూర్తిగా తీసుకుంటే..రాజకీయ నేతలంతా స్లిమ్ అవ్వడం ఖాయం. అసలే ఇండియాలో రాజకీయ నాయకులంటే భారీ ఖాయాలు కాబట్టి త్వరలోనే మన నేతల పొట్టలు కరగబోతున్నాయన్న మాట.

హెచ్సీయూ వీసీ పై వీహెచ్ పిటిషన్.. బయటకి పంపించిన కోర్టు

  హెచ్సీయూ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ అప్పారావు నియామకంపై ఎప్పటి నుండో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా కోర్టుకు వెళ్లారు. వీసీని తొలగించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏ చట్టం ప్రకారం వీసీని సస్పెండ్ చేయాలో తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆరు వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారంటూ కోర్టు పోడియంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో కోర్టు వీహెచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు బయటకి పంపించింది. తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది.

20 నెలల పోరాటం.. 25 వేలమంది ఉగ్రవాదులు హతం.. బ్రిటన్

ఐసిస్ కేంద్రంగా ఉగ్రవాదులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిని నాశనం చేసే దిశగా బ్రిటన్.. దానితో పాటు అనేక దేశాలు పోరాటం చేస్తున్నాయి. అయితే గత 20 నెలలుగా సాగిస్తున్న ఈ పోరాటంలో ఇప్పటి వరకూ 25 వేల మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఓ అధికారి తెలిపారు. దీంతో ఇస్లామిక్ స్టేట్ అధీనంలో ఉన్న‌ సిరియా, ఇరాక్‌ లలోని ప‌లు ప్రాంతాల్లో ఉగ్ర‌వాదుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని చెప్పారు. ఉగ్ర‌వాదాన్ని అంత‌మొందించే దిశ‌గా ఐఎస్ఐఎస్ పై జ‌రుపుతోన్న పోరాటంలో ఉగ్ర‌వాదులు తేరుకోలేని దెబ్బ‌తిన్నార‌ని పేర్కొన్నారు.

ఆ సత్తా విజయకాంత్ కు లేదు.. రాధిక

  సినీ నటి రాధిక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ప్రశంసలు కురిపించారు. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాధిక తిరుచ్చెందూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలి జయలలిత అని అన్నారు. అంతేకాదు డీఎండీకే అధినేత విజయకాంత్ గురించి ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా అవతరించే సత్తా విజయకాంత్‌కు లేవని ఆమె జోస్యం చెప్పారు. ఇక డీఎంకే కుటుంబ రాజకీయాలపై ఇప్పటికే ప్రజలు కోపంగా ఉన్నారు.. వారు ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అవే తన భర్త శరత్‌కుమార్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా తిరుచ్చెందూరు నియోజకవర్గం నుండి శరత్ కుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

'స్వచ్ఛ భారత్' ప్రేరణ.. మరుగుదొడ్డి లేదని పెళ్లి రద్దు

  పెళ్లికి ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని పెళ్లినే తిరస్కరించింది ఓ యువతి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. అసలు సంగతేంటంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో ఓ స్వచ్చంధ సంస్థ సామూహిక వివాహాలు నిర్వహించింది. దీనిలో భాగంగానే నేహా అనే యువతి కూడా ఈ వివాహా కార్యక్రమాల్లో పెళ్లికి సిద్దమయింది. అయితే పెళ్లికి ముందు వరుడు మరుగుదొడ్డి కట్టిస్తానని నేహాకు హామి ఇచ్చాడు. కానీ అతడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. దీంతో నేహా పెళ్లి మండపంలోనే అతనిని వివాహం చేసుకోనని తేల్చిచెప్పేయడంతో పెళ్లి రద్దయింది. ఆ వెంటనే మరో యువకుడు నేహాను పెళ్లాడటానికి ముందుకు రాగ అతనితో విహహం జరిపించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ సందర్భంగా నేహా మాట్లాడుతూ.. ఇంట్లో మరుగుదొడ్డి అనేది కనీస అవసరమని..  ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ భారత్' నుంచి ప్రేరణ పొందాలని ఆమె సూచించింది.

వచ్చే ఏడాదినుండి అన్ని సెట్లు ఆన్‌లైన్‌లోనే.. గంటా

మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్లతో నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 29న ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తామని.. వచ్చేనెల 9న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణలోనూ ఎంసెట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసే సెంటర్లలో భద్రత, ఇతర అంశాలపై అక్కడి డీజీపీ, సీఎస్‌తో మాట్లాడతామని చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌తోపాటు అన్ని సెట్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌లు హాజరయ్యారు.

కోహినూర్ వజ్రంపై చేతులెత్తేసిన కేంద్రం..

  కోహినూర్ వజ్రాన్ని మన దేశానికి తీసుకురాలేమని కేంద్ర సాంస్కృతిక శాఖ సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పేసింది.  కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తీసుకురాలేమని.. ఆ విలువైన వజ్రం చోరీ కాలేదని.. నాటి రాజులు ఈస్టిండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని చెప్పింది. ఆల్ హ్యుమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్‌కు చెందిన ఓ వ్యక్తి కోహినూర్ ను ఇండియాకి తెప్పించడంపై కేంద్రం స్పందన ఏంటో తెలుసుకుందామని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం.. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించారా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనికి స్పందించిన కేంద్రం పైవిధంగా సుప్రీంకు తేల్చి చెప్పేసింది.

రోడ్డు ప్రమాదంలో 25 మంది కళాకారులు మృతి

  ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. ఒడిశాలోని రెంటా ప్రాంతం నుండి 40 మంది కళాకారులతో బస్సు దేవ్ ఘఢ్ కు బయలుదేరింది. అయితే జిల్లాలోని జార్జ్ వ్యాలీ సమీపానికి రాగానే బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతున్న లోయలోపడింది. ఈ ప్రమాదంలో 25 మంది కళాకారులు అక్కడికక్కడే చనిపోగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మరణించిన వారందరూ భారతి నాట్య సమితికి చెందిన వారని పోలీసులు తెలుపుతున్నారు. బస్సువేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించాడని పోలీసులు చెప్పారు.