జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం : సీఎం చంద్రబాబు

  జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలలోనే అమలు చేస్తామని సీఎం క్లారీటీ ఇచ్చారు.  పంద్రాస్ట్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని.. వీటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. 2027కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరువుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని.. ఈ క్రమంలోనే విశాఖ స్టేల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతోందని చంద్రబాబు పార్టీ శ్రేణులకు తెలిపారు.  

స్థానికం కోసమే నా? మంత్రివర్గ విస్త‘రణం’!

చివరాఖరికి  కాంగ్రెస్ అధిష్టానం  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.  ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది. ఆదివారం (జూన్ 8) మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా లేక ‘పీస్ మీల్’ లెక్కన ఉంటుదా అనే విషయంలో  మాత్రం స్పష్టత లేకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు, ఈసారికి పీస్ మీలే అంటున్నారు. ఈసారికి ఫిఫ్టీ పెర్సెంట్ ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయిత అరుకు ఆరు ఒకేసారి భర్తీ చేస్తే  ఎదురయ్యే ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కష్టమనే.. ముందు చూపుతో కాంగ్రెస్ అధిష్టానం  ప్రస్తుతానికి ముగ్గురితో సరి పెట్టాలని చూస్తోందని అంటున్నారు.  అయితే.. ఈ సంఖ్య ఇంకొకటి పెరిగినా పెరగ వచ్చని అంటున్నారు. ఇంత వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి మాత్రమే చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు..  ఈ విస్తరణలో  రెడ్డి సామజిక వర్గానికి బెర్త్ దక్కే ఛాన్స్ లేదనీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ప్రస్తుత విస్తరణలో  బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ కోటాలో ఎవరిని అదృష్టం వరిస్తుందనే విషయంలోనూ ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అయితే.. మంత్రివర్గంలో స్థానం కోసం నేరుగా ఢిల్లీ తో డీల్ చేస్తున్న విజయశాంతి, ముఖ్యమంత్రి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముచ్చట పడుతున్న అద్దంకి దయాకర్ కు ప్రస్తుత విస్తరణలోనే స్థానం దక్కవచ్చని అంటున్నారు.     అయితే నిజానికి మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు  సామాజిక వర్గాలు, సీనియారిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండా  ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది. నిజనికి  గాంధీ భవన్  లో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి ప్రతి ఇద్దరు ఎమ్మెలేలలో ఒకరు వంతున మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరి కార్డ్ వారు ప్లే  చేస్తున్నారు. ముఖ్యంగా..  ఎస్సీ,  రెడ్డి సామాజిక వర్గం నేతల నుంచి వత్తిడి ఎక్కువగా  ఉందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగా రెడ్డి, బహిరంగంగానే బరిలో దిగిన విషయం తెలిసిందే.   అలాగే,ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా వచ్చిన తర్వాత  ఆశావాహులంతా   ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ సామాజికవర్గానికి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదు. ముదిరాజ్‌‌లకు కచ్చితంగా అవకాశం ఇస్తానని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి  రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు లభించ లేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  చివరకు..  అనే నేను..అనే వరకు ఏమి జరుగుతుంది. ఎన్ని ఖాళీలు భర్తీ అవుతాయి.. ఎవరిని, మంత్రి పదవి వరిస్తుంది అనేది చెప్పడం  క్షేమం కాదు అంటున్నారు. అయితే..  ప్రస్తుత విస్తరణ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అనే మాట కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు, ఉద్వాసనలతో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి అస్వస్థత

  కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీలోని సర్ గాంగారమ్ ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు. కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జీ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.  

ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

  ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందిస్తున్నాని ఆయన అన్నారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు, ధర్మల్ పవర్‌తో పాటు పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని ఆలోచిస్తున్నామని అందుకోసమే, తెలంగాణ ప్రభుత్వం 2015 న్యూ ఎనర్జీ పాలసీ తెచ్చిందని  భట్టి తెలిపారు. తెలంగాణలో 2029-30 నాటికల్లా కనీసం 20 వేల మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. దేశ వ్యాప్తంగా పవర్ కన్జంక్షన్,పొల్యూషన్ విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు.  పాణ్యం మండలం పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి కరెంట్ ఉత్పత్తికి సిద్దంగా ఉందని, రానున్న రోజుల్లో పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు.. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించానని భట్టి తెలిపారు. పవర్ స్టోరేజ్ కోసం గ్రీన్ కో ప్రాజెక్టు వాడే టెక్నాలజీ అద్బుతంగా ఉందని, 4 వేల మెగా వాట్స్ సోలార్ పవర్, ఒక వెయ్యి మెగా వాట్స్ విండ్ పవర్, 1680 మెగా వాట్స్ జల విద్యుత్ ఉత్పత్తి చేసి పీక్ అవర్‌లో ఇతర రాష్ట్రాలకు సప్లై చేసేందుకు గ్రీన్ కో ప్రాజెక్టు సంసిద్దంగా ఉందని భట్టి అన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టులు దేశంలో ఇంకా రావాలని, వీటివల్ల దేశ జీడీపీ పెరుగుతుందని భట్టి స్పష్టం చేశారు.  

ఆ వివాదంలో నన్ను లాగద్దు.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

  కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.  ఈ వివాదంలో తనను లాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవదూరంగా ఉన్నాయన్నారు.  ఈటల సబ్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని ఈ సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి అనుమతులు ఇచ్చాక 15 రోజులకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెండిగ్ ప్రాజెక్టులు ఎస్టిమేషన్ రేట్లకే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేస్తారా? పనులు చేస్తే ఏం చేయాలి? చేయకుంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలని అనే అంశంపై సబ్ కమిటీ వేశారని చెప్పారు. సబ్ కమిటీ  నిర్ణయాలన్నీ తానే కమిషన్ ముందుకు సుమోటోగా తీసుకెళ్తానని పేర్కొన్నారు.  

మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం : లోకేష్

  వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియాలో అవమానించవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు.  ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి లోకేష్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అని లోకేష్ తెలిపారు. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని  ముఖ్యమంత్రి చంద్రబాబు  పదేపదే హెచ్చరిస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని లోకేష్ హెచ్చరించారు.  మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్   బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్‌ పనిపడుతుందని లోకేష్ తెలిపారు.

కొమ్మినేని, కృష్ణంరాజుపై డీజీపీకి రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.  ఒక న్యూస్ చానెల్ లో శుక్రవారం సాయంత్రం ప్రసారమైన ఒక కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజారాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ, మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనీ రఘురామకృష్ణం రాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  అమరావతిని దేవతల రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడాన్ని అపహాస్యం చేస్తూ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, అవమానకరం అని పేర్కొన్నారు. ఇటువంటి అసహ్యకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ఆ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న యాంకర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహరించారనీ రఘురామకృష్ణం రాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  శాసనసభ సభ్యునిగా, డిప్యూటీ స్పీకర్ గా ఈ ఇరువురిపై తక్షణం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాననీ రఘురామకృష్ణం రాజు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.  వీరిరువురిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డీజీపీని కోరారు. రాజధాని గౌరవం, మహిళల ఆత్మాభిమానం విషయంలో రాజీపడే ప్రశక్తే లేదన్న బలమైన సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందనీ, అందుకే వీరిరువురిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో డీజీపీని కోరారు. 

హైదరాబాద్‌లో వర్షం..ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

  హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో  నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌లో వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు నల్గొండ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కాగా, ఇవాళ రాత్రి వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.  

విషమంగానే మాగంటి ఆరోగ్యం...పరామర్శించిన కేటీఆర్‌

  తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  పరామర్శించారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న కేటీఆర్‌. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి పొందుతున్న ఎమ్మెల్యే మాగంటిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కాగా, గత గురువారం సాయంత్రం మాగంటి గోపీనాథ్‌ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు.  కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. మాగంటి గోపీనాథ్ గతంలో కూడా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి చికిత్స తీసుకున్నారు. గత ఐదు నెలలుగా ఆయన పలు అవయవాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా అనారోగ్యం ఆయన పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.  

మీరసలు జర్నలిస్టులేనా? కొమ్మినేని, కృష్ణం రాజులపై బాలకోటయ్య ఫైర్.. రాష్ట్రబహిష్కరణకు డిమాండ్

అమరావతి  దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్నారంటూ'  జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వివిఆర్ కృష్ణంరాజు అమరావతి ప్రాంత మహిళలను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది.  అలాగే అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య యాంకర్ కొమ్మినేని, అనలిస్ట్ కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.   ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్ కే బాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జీ.రఘురాం, నాగ మల్లేశ్వర రావులు ఒక సంయుక్తలో ఖండించారు.  ఒక పత్రికకు ఎడిటర్ గా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పాత్రికేయ సమాజానికి తలవొంపులు తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని మహిళలపై  విషం కక్కిన కృష్ణం రాజు   తక్షణమే అమరావతి ప్రాంత మహిళలకు, రాష్ట్ర ప్రజలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య అయితే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  పిచ్చి కుక్కల్ని, ఊర పందుల్ని, కాటేసే పాముల్ని వన్య ప్రాణుల సంరక్షణ పేరిట అలా వదిలేస్తే  ప్రమాదకరమని, పిచ్చి కుక్కల్ని తాళ్ళతో కట్టెయాలని, ఊరపందుల్ని ఊళ్ళ నుంచి తరిమేయాలని, బుసలు కొట్టే పాములను  కోరలు పీకి బుట్టల్లో బంధించాలని పేర్కొన్నారు.  ఈ మేరకు ఆయన శనివారం (జూన్ 8) విడుదల చేసిన ప్రకటనలో యాంకర్ గా  కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణంరాజు ప్రజా రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొనడం క్షమించరాని నేరమన్నారు. ఆ వ్యాఖ్యలపై  ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  రాజధానిపై ఇప్పటివరకు వైకాపా నాయకులు చేసిన అశుద్దపు ప్రచారాలకు ఇది పరాకాష్ట అన్న బాలకోటయ్య.. పురాణాల్లో దేవతల రాజధాని అమరావతి అని, ఆంధ్రప్రదేశ్ లో రైతుల భాగస్వామ్యం కలిగిన ప్రజా రాజధాని కూడా అలాంటిదేనన్నారు.  అటువంటి ప్రజారాజధానిపై  ఇష్టారీతిగా దూషణలు చేయటం పాత్రికేయ వృత్తికే కళంకం అని పేర్కొన్నారు.  రాజధాని పొడ గిట్టని  ఇలాంటి వారిని  రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రభుత్వం స్పందించి 24 గుంటల్లోగా కొమ్మినేని, కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలను కించపరుస్తూ, రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ కొమ్మినేని, కృష్ణంరాజుల వ్యాఖ్యలపై తాను  స్వయంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయనున్నట్లు  తెలిపారు.  

గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి బయటకు పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో రోగులు, పేషెంట్ బంధువులు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు.  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది.ఏఐజీ ఆస్పత్రికి నిత్యం రోగులు వస్తుంటారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన రాజకీయ నేతలు ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

  తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది. కొత్తగా మంత్రి వర్గంలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. . ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు  సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రి‌వర్గ విస్తరణపై రాజ్‌భవన్  నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.   అయితే, భర్తీ చేయబోయే మూడు మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజికవర్గానికి దక్కనుంది.ఇప్పటికే మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకట స్వామి‌, దేవరకొండ ఎమ్మెల్యే బాలు‌ నాయక్‌, ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఉన్నారు.  

టీడీపీలో చేరికలపై పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

  తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు.  టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత పార్టీ అనుమతితోనే వారిని తీసుకోవాలని సూచించారు. టీడీపీలో వివిధ హొదాల్లో ఉన్న నాయకులంతా ఈ సూచన పాటించాలని పల్లా తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఇతరులను చేర్చుకునే ముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలన్నారు. పార్టీలోకి వస్తామనే వారిపై పూర్తిగా విచారణ చేశాకే ఆహ్వానించాలని చెప్పారు. 

ది అమెరికా పార్టీ.. మస్క్ కొత్త పార్టీ పేరు అదేనా?

ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌స్క్ పొలిటిక‌ల్ ఎంట్రీ ద్వారా జ‌రిగిన ప‌రిణామ క్రమం వేరు. 2024 ఎన్నిక‌ల్లో సుమారు 30 కోట్ల డాల‌ర్లు.. (ఇండియ‌న్ క‌రెన్సీలో 2500 కోట్లు) విరాళం ఇచ్చి మ‌రీ రాజ‌కీయాల్లోకి దిగిన మ‌స్క్ కి జ‌రిగిన శాస్తి ఏంటంటే.. ఆయ‌న టెస్లా అమ్మ‌కాలు భారీగా ప‌డిపోవ‌డం, షేర్ ధ‌ర‌లు యాభై శాతం డౌన్ కావ‌డం, వంద బిలియ‌న్ డాల‌ర్ల మేర త‌న సంప‌ద ఆవిరి కావ‌డం.  అంతేనా ఆయ‌న డోజ్ ప్ర‌ధాన స‌ల‌హాదారుగా ఉండి కూడా అమెరిక‌న్ల నుంచి భారీ ఎత్తున చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకున్నారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి లాభానికి బ‌దులు న‌ష్టం వాటిల్ల‌డం కూడా ఆయ‌న చ‌వి చూశారు. అంతేనా త‌న ఫ్రెండ్ ఐజాక్ మాన్ ని నాసాకు చీఫ్ చేయాల‌న్న క‌ల‌లు కూడా క‌ల్ల‌ల‌య్యాయి. ఇలా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చాక మ‌స్క్ కి ఎదురు దెబ్బ‌లే త‌గిలాయి త‌ప్ప‌.. ఎలాంటి  ప్రయోజనం చేకూరింది లేదు. పైపెచ్చు తాను ద‌గ్గ‌రుండి ప్ర‌చారం చేసి అధికారంలోకి తెచ్చిన ట్రంప్ పాల‌న కారణంగా  ఆయ‌న టెస్లా అమ్మ‌కాలు భారీగా ప‌డిపోయి..   1. 2 బిలియ‌న్ డాల‌ర్ల‌ నష్టం వాటిల్లింది. ఒక ర‌కంగా చెబితే ఎలాన్ మ‌స్క్ కి రాజ‌కీయాలు అంత‌గా క‌ల‌సి  రాలేదు స‌రిక‌దా..   బ్యాడ్ బాయ్ గా ముద్ర అయితే బలంగా పడింది. మ‌స్క్ వ‌ల్ల‌ మా ఉద్యోగాలు పోయాయంటూ.. కొంద‌రు ఆయ‌న టెస్లా షోరూములపైనా దాడులకు పాల్ప‌డ్డారు.  ఒక‌టి కాదు లెక్క‌లేన‌న్ని న‌ష్టాలు. విరాళాల రూపంలో వేల కోట్ల రూపాయ‌లు న‌ష్టం. ఆ త‌ర్వాత డోజ్ అధికార‌క ప‌ద‌వి ద్వారా త‌న వ్యాపారానికి భారీ ఎత్తున న‌ష్టాలు. అనుకున్న ప‌నులు సాదించారా అంటే అదీ లేదు. పైపెచ్చు ప్ర‌భుత్వంతో ఉన్న కాంట్రాక్టులు కూడా పోయేలా ఉన్నాయ్. అంతేనా ఆయ‌న ప్ర‌స్తుతం న్యూరాలింక్ అనే కొత్త ప్రాజెక్ట్ లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఒక గేమ్ ఛేంజ‌ర్ గా చెబుతున్నారు. ఎందుకంటే దీని ద్వారా వెన్నుముక విరిగిన వారు న‌డ‌వ‌గ‌ల‌రు. కంటి చూపు లేని వారు చూడ‌గ‌ల‌రు. ఇలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాల‌తో బోలెడెంత వ్యాపారం చేసి.. మ‌రింత మందికి ఉపాధి అవ‌కాశాల‌ను ఇవ్వ‌గ‌ల‌రు మ‌స్క్. త‌న తండ్రి ఎరోన్ మ‌స్క్ కూడా నీకింకా ఏమంత వ‌య‌సు ఐపోలేదు. ఇప్పటికి 53 ఏళ్లు మాత్ర‌మే. నీకు రాజ‌కీయాల‌క‌న్నా మాన‌సిక ప్ర‌శాంత‌త అవ‌స‌రం. కాబ‌ట్టి భార‌త్ వ‌చ్చి ఇక్క‌డి ఆల‌యాల్లో ఆధ్యాత్మిక ప్ర‌శాంత‌త పొందు అంటూ సూచించారు కూడా. కానీ అత‌డు మ‌స్క్ క‌దా? ఎక్క‌డ పోగొట్టుకున్నారో అక్క‌డే రాబ‌ట్టుకునే బాప‌తు. ఇటు ట్రంప్ ర‌హ‌స్యాల‌న్నీ బ‌ట్టబ‌య‌లు చేస్తూనే అటు.. తానే ఒక రాజ‌కీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ మూడో ప్ర‌త్యామ్నయం దిశ‌గా థింక్ చేశారు మస్క్. ఎక్స్ లో త‌న 22 కోట్ల ఫాలోయ‌ర్ల ముందు త‌న ప్ర‌తిపాద‌న ఉంచాడు.. 80 శాతం మంది సానుకూలంగా స్పందించారు. దీంతో మ‌స్క్ మ‌స్త్ కుషీ కావ‌డ‌మే కాకుండా.. ద అమెరిక‌న్ పార్టీ అంటూ కూడా త‌న ఎక్స్ పోస్ట్ లో మ‌రో కామెంట్ చేయ‌డంతో ఇప్పుడు మ‌స్క్.. కొత్త పార్టీ పెడుతున్నారా? అన్న‌దొక చ‌ర్చ‌గా మారింది. ఒక వేళ పెడితే రిప‌బ్లిక‌న్ల‌కు, డెమొక్రాట్ల‌కు దీటుగా ఈ పార్టీ ప‌ని చేస్తుందా? ఆయా పార్టీల అనుభ‌వం ముందు మ‌స్క్ లాంటి వ్య‌క్తి ఎక్స్ పీరియ‌న్స్ స‌రిపోతుందా? వ్యాపారం వేరు, రాజ‌కీయాలు వేరు. ఇక్క‌డ రైట్ అక్క‌డ రాంగ్ అంటూ ఎన్నో ఈక్వేష‌న్లుంటాయి. వ్యాపారంలో లాభం చూడాలి. రాజ‌కీయాల్లో న‌ష్టాల‌ను చ‌వి చూడ్డ‌మే ఒక లాభం. ఈ విష‌యంపై మ‌స్త్ కి క‌నీస అవ‌గాహ‌న ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. అంత ఖ‌రాకండిగా ఎలా చెప్ప‌గ‌ల‌రు? అంటే మ‌స్క్ అస‌లు ట్రంప్ మీద ఇంత వ్య‌తిరేక‌త నూరిపోయ‌డానికి గ‌ల కార‌ణ‌మేంటి?. త‌న‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక  ఎదురైన‌ వ‌రుస న‌ష్టాలు. అలాంటి న‌ష్టాల‌ను ఎలాగోలా త‌ట్టుకుని నిల‌బ‌డ్డారా? అంటే వెంట‌నే బ‌య‌ట‌కొచ్చాడు. ట్రంప్ మీద ఆరోప‌ణ‌లు గుప్పించాడు. ఆపై కొత్త పార్టీ అంటున్నారు. ఇది క‌రెక్టేనా? ఏ రాజ‌కీయ పాల‌నా అనుభ‌వం ఉంద‌ని మ‌స్క్ ని ఎలా న‌మ్మాలి? మ‌స్క్ పోల్ పెట్టినంత ఈజీగా పార్టీ పెట్టేస్తారా? పెట్టి నెగ్గుకొస్తారా?   అన్న చర్చ మొదలైంది. మ‌రి చూడాలి ఎలా నెగ్గుకొస్తారో?

క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికే క్లాసులు!

నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టీ పీసీసీ  క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన తరువాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరయ్యారు . అదే కార్యక్రమానికి  అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు అటెండ్ అయ్యారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మల్లు రవితో విజయుడు  గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో భేటి కావడంతో పాటు ఆయనతో కలిసి గద్వాల కాంగ్రెస్ ఇంచార్జీ సరిత నివాసంలో తేనీటి విందులో పాల్గొన్నారు .  అయితే  ఎంపి మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు భేటీ కావడం, ఆయనతో పాటు సరిత నివాసానికి వెళ్లిన విజయుడుని శాలువా, బొకేలతో సత్కరించడం  కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి . ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్‌లో చేరేందుకే  మల్లు రవి తో భేటీ అయ్యారని , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆదేశాలతోనే విజయుడు కాంగ్రెస్ ఎంపీతో మంతనాలు సాగించారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. మరో పక్క  ఎంపీ మల్లు రవి  గద్వాల ఎమ్మెల్యే ఇంటికి, జడ్పీ మాజీ చైర్మన్ సరిత ఇంటికి విజయుడిని వెంటబెట్టుకుని తన వాహనంలో తీసుకుపోవడంపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పరాజయం పాలైన సంపత్ వర్గం గుర్రుగా ఉన్నారు . కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లురవిపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడంటూ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్  మీనాక్షి నటరాజన్ కు అలంపూర్ కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వెంట తిప్పుకోవడాన్ని అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు పడుతున్నారు .  ఆ క్రమంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై ఆ పార్టీ నేత అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అలంపూర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించానన్నారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు. ఎంపీగా మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో అఫీషియల్‌గా మీటింగ్ పెడితే బాగుండేదని, కానీ అన్ అఫిషియల్‌గా బీఆర్ఎస్ నాయకులతో మీటింగ్ పెట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పూల బొకేలు, శాలువలతో సత్కరించడం, ఎమ్మెల్యే విజేయుడు ఎప్పటికైనా కాంగ్రెస్‌లోకి వచ్చే వ్యక్తి అని కామెంట్స్ చేయడం బాధ అనిపించిందన్నారు సంపత్ కుమార్.  ఆయన్ను ఎంపీగా గెలిపించడం కోసం రక్తం దార పోశానని, ఇప్పుడు ఆయనకు అవేమీ గుర్తులేకుండా పోయాయని సంపత్ కుమార్ అవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఇష్యూకు తొందరగా పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలని, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమని, అయితే వాటిని అధిగమించి, పరిష్కరిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. మరి ఈ వ్యవహారం ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి.

అఖండ గోదావరి ప్రాజెక్టుకు 19న శంకుస్థాపన.. పర్యాటకానికి కొత్త సొబగు

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 19న  ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేయనున్నారు.  ఈ ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.  చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో   ప్రతిష్ఠాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం ద్వారా మంజూరైన రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయి. పుష్కరాల లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 

బెంగళూరు తొక్కిసలాట.. కింగ్ కోహ్లీపై ఫిర్యాదు

ఆర్సీబీ విజయంతో బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. తొక్కిసలాటకు సంబంధించి ఆర్సీబీ కీలక ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై   హెచ్‌ఎం వెంకటేష్‌ అనే సామాజిక కార్యకర్త  ఫిర్యాదు చేశారు. కాగా కోహ్లీపై ఫిర్యాదు అందిందని ధృవీకరించిన పోలీసులు ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగానే పరిగణించి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా బెంగళూరు తొక్కిసలాటకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంకర్, కో:ాధికారి జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. తొక్కిసలాట ఘటనలో తన పాత్ర, ప్రమేయం లేకపోయినా నైతిక బాధ్యత వహించిన రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  ఇక పోతే  తొక్కిసలాటకు సంబంధించి కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో ఉత్పత్తులు.. టీటీడీ లీగల్ నోటీసులు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక హక్కులను ఉల్లంఘిస్తున్న పుష్ మై కార్ట్ సంస్థ కు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఒక్క పుష్ మై కర్డ్ సంస్థకే కాకుండా ఇలా లడ్డూ ప్రసాదం పేరును, పవిత్రతను అనధికారికంగా ఉపయోగించుకుంటున్న పలు ఇతర సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమై లీగల్ నోటీసులు జారీ చేసింది.   కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాదం పేరుతో వ్యాపారం చేస్తున్నపుష్ మై కార్ట్ సహా పలు సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.  తిరుమల శ్రీవారి లడ్డూకు 2009 సెప్టెంబరులోనే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ ద్వారా పేటెంట్ హక్కులు లభించాయి.  అంతకుముందే 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద టీటీడీ ఈ హక్కులను పొందింది.  అయితే పలు మిఠాయి దుకాణాలు, ఆన్‌లైన్ సంస్థలు 'శ్రీవారి లడ్డూ పేరుతో  ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు టీటీడీ కన్నెర్ర చేసింది.  ఇలా శ్రీవారి లడ్డూ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తున్న పుష్‌ మై కార్ట్, ట్రాన్సాక్ట్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఇండియా స్వీట్‌ హౌస్‌ వంటి సంస్థలకు టీటీడీ గత నెల 31న లీగల్ నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులకు పుష్‌ మై కార్ట్‌ సంస్థ  స్పందించి తమ ఉత్పత్తుల జాబితా నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును తొలగించింది. ఈ మేరకు టీటీడీకి సమాచారం అందించింది.  దీనిపై టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోట్లాది మంది భక్తుల విశ్వాసం అని పేర్కొన్నారు. అలాంటి విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చుకునేందుకు ఎంత మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.  భక్తుల మనోభావాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  లడ్డూ పవిత్రతను, ప్రాశస్థ్యాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుబడి ఉందని శ్యామలరావు అన్నారు.  

ట్రంప్ పై మస్క్ పేల్చిన ఎప్ స్టీన్ బాంబు.. అధ్యక్ష పీఠానికి ఎసరేనా?

ఎప్ స్టీన్ మామూలోడు కాడు. ఇటు బిల్ క్లింట‌న్ లాంటి ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌నాల్టీస్.. అటు హాలీవుడ్ హీరోస్ తో క‌స్ట‌మైజ్డ్ ప్రైవేట్ జెట్స్ లో ఆఫ్రికా ప‌ర్య‌ట‌న చేసికొచ్చిన ర‌కం. దీన్నిబ‌ట్టే అర్ధం చేసుకోవ‌చ్చు.. ఎప్ స్టీన్ ఎలాంటివాడో. అంతే కాదు.. ఎప్ స్టీన్ కి ఏకంగా ఒక మైన‌ర్ బాలిక తో ఎఫైర్ ఉన్న‌ట్టు ఆరోపణలు ఉన్నాయి. అత‌డి పామ్ బీచ్ హౌస్ నిండా ఆమె ఫోటోలున్న‌ట్టు గుర్తించారు పోలీసులు.  మైన‌ర్ అమ్మాయిల‌ను స‌ర‌ఫ‌రా చేసే బ్రోక‌ర్.  ఇత‌డు ఇంగ్లాండ్ రాజ‌కుమారుడితో దిగిన ఫోటో ఒక సంచ‌ల‌నం. అంతేనా ఇత‌డిపై న్యూయార్క్ లో ఒక కేసుంది. ఆ కేసు ప్ర‌కారం ఇత‌డు మైన‌ర్ బాలిక‌ల‌తో సెక్స్ రాకెట్ న‌డిపిన‌ట్టుగా చెబుతున్నాయి రికార్డులు. ఇత‌డికీ ట్రంప్ కి 1994 నుంచి సంబంధాలున్నాయి. ఇద్ద‌రూ క‌ల‌సి  పార్టీల‌కు వెళ్లిన దాఖ‌లాలున్నాయి. అంతే కాదు..  ఎప్ స్టీన్ తన‌కు అత్యంత స‌న్నిహిత‌మైన మిత్రుడ‌ని న్యూయార్క్ మేగ‌జైన్ కి 2002లో  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్వయంగా చెప్పారు.  ఆ టైంలో ట్రంప్ చేసిన మ‌రో కామెంట్ ఏంటంటే.. అత‌డికి నాకులాగా అంద‌మైన అమ్మాయిలంటే ఇష్టం. అది కూడా   చిన్న వ‌య‌సు వారు కావ‌డం విశేష‌మంటూ అప్ప‌ట్లోనే ఓపెన్ అయ్యారు మిస్ట‌ర్ ట్రంప్. ఇక ట్రంప్ గురించి  .. క్రాసింగ్ ద లైన్.. ట్రంప్ విత్ విమ‌న్ ఇన్ ప్రైవేట్ టైం.. అంటూ న్యూయార్క్ టైమ్స్ మేగజైన్    ప్రచురించిన .. కథనంలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు బ‌య‌ట ప‌డ్డాయి. ఏ రొమాంటిక్ హాలీవుడ్ మూవీకి తీసిపోన‌నంత రొమాంటిక్ లైఫ్ ను ట్రంప్ అనుభవించిన‌ట్టు చెబుతుందీ క‌థ‌నం. ట్రంప్ కి 1970 నుంచి పాతిక మంది వ‌ర‌కూ మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాలున్న‌ట్టు పేర్కొంది. మోడ‌లింగ్ చేసే టైంలో, అందాల పోటీల స‌మ‌యంలో, ఇత‌ర ప‌ని ప్ర‌దేశాల్లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించేవాడ‌ని. ఆ కథనం పేర్కొంది. అయితే ట్రంప్ మీద ఇప్పటి వరకూ ఏ ఒక్క  మ‌హిళ ఫిర్యాదు చేయలేదు.   అయితే 2016లో ఓ మహిళ ట్రంప్ పై మూడు సార్లు దావా వేసి ఉపసంహరించుకుంది.  ఇందుకు బెదరింపులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటికి ఆధారాలు లేవు. అందుకే ట్రంప్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను వై విమెన్ నాట్ రిపోర్ట్?  అంటూ క్యాంపెయిన్ చేసి గ‌ట్టెక్కారు. వారంతా త‌న‌పై డ‌బ్బుకోస‌మో, పేరు కోస‌మో ఇలా చేస్తారంటూ తిప్పి కొడ‌తారు.  ఇక పోతే ట్రంప్ కుటుంబం   ఆయన్ని గట్టిగా వెనకేసుకు వస్తున్నది.  ఆయ‌న ఆడియో టేపులు బ‌య‌ట ప‌డడాన్ని ఒక కుట్ర‌గా అభివర్ణించారు ఆయన కుమార్తె  ఇవాంక ట్రంప్. ఇక ఆయ‌న స‌తీమ‌ణి మెలానియా అయితే మా ఆయ‌న జెంటిల్ మెన్ అన్నారు. ఆయ‌న ఎదుగుద‌ల ఓర్చుకోలేక‌ గిట్ఇటని వారే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు.   ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే ప్ర‌స్తుతం మ‌స్క్ వెలికి తీసిన ఎప్ స్టీన్ 2019లో అరెస్టు కాగా అత‌డ్ని న్యూయార్క్ జైల్లో ఉంచారు. అయితే అత‌డు అనుమానాస్ప‌దస్థితిలో మ‌ర‌ణించారు. ఈ విష‌యంలోనూ ఎన్నో అనుమానాలున్నాయి.. వీట‌న్నిటి దృష్ట్యా మ‌స్క్ ట్రంప్ పై ఈ బాంబు వేశారు.  ఇదిప్పుడు ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే.. ట్రంప్ ని అధ్య‌క్ష పీఠం నుంచి తొల‌గించి.. ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ తో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌న్న డిమాండ్ జోరందుకుం టోంది. ఇప్పుడు సిట్యువేష‌న్ ఎలా త‌యారైందంటే.. ఎవ‌రైనా ఎనిమీతో పెట్ట‌ుకున్నా బ‌తికి బాగు ప‌డతారామోగానీ.. ఒక ఫ్రెండ్ ఎనిమీ అయితే మాత్రం ఇదిగో ట్రంప్ వ‌ర్సెస్ మ‌స్క్ లా త‌యార‌వుతుంద‌న్న మాట వినిపిస్తోంది.