కడప కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు .ఐ ఎం ఎం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ కార్యకర్తల తో ఏఐసీసీ సభ్యులు సుంకర పద్మశ్రీ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. షర్మిల జిందాబాద్ పద్మశ్రీ డౌన్ డౌన్ టు నినాదాలు చేశారు. కడప జిల్లా పర్యటనలో షర్మిలపై సుంకర పద్మశ్రీ ఆరోపణలు చేశారు . సుంకర పద్మశ్రీ ఏర్పాటు చేసిన సమావేశంలో షర్మిల వర్గం ఆమెను ప్రశ్నించడం జరిగింది. దీంతో రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పడ్డారు. సుంకర పద్మశ్రీ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీరాములు, నజీర్ అహ్మద్ పాల్గొనగా షర్మిలకు మద్దతుగా జిల్లా డిసిసి అధ్యక్షురాలు విజయ జ్యోతి, పులివెందుల, పొద్దుటూరు, నియోజకవర్గాల అధ్యక్షులు ధ్రువ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ భాషాలు పాల్గొన్నారు

తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు

  జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపుబోర్డు లోగో ఆవిష్కరణలో కూడా అమిత్‌షా పాల్గొంటారని సమాచారం. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తెలంగా ణ ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి వాస్తు దోషం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ కార్యాలయం వృథాగానే పడి ఉంది. పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా.. అంగీకరించారు. 

మహిళలు నిరసన తెలుపుతుంటే సంకరజాతి అంటారా?.. లోకేశ్ ఫైర్

  రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని  మండిపడ్డారు. "ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?" అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన, జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని తరిమేసిన అమానవీయ తీరును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని నారా లోకేశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అలాంటి వారిని కించపరిచేలా మాట్లాడటం సహించరానిదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సజ్జల వ్యాఖ్యల వీడియోను లోకేశ్ పంచుకున్నారు. ఇటీవల సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.

అఖిల ప్రియకు అస్వస్థత.. వడదెబ్బ అన్న వైద్యులు

తెలుగుదేశం నాయకురాలు,  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో  జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెకు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించిన అనంతరం కోలుకున్నారు.  రెండు రోజులుగా అఖిలప్రియ జాతరకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక సోమవారం (జూన్ 10)  పూజల సందర్భంగా ఉపవాస దీక్ష పాటించారు. అసలే ఎండలు, ఉక్కపోత ఉండటం, ఉపవాసదీక్షలో ఉండటంతో నీరసించి సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. 

కావాలనే చర్చలో అమరావతి ప్రస్తావన : ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌

  ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఇలా మాట్లాడినట్లు తెలుస్తోందన్నారు. చర్చలో ఆ సందర్బానికి జోడించారో వివరణ ఇవ్వాలని కోరారు. రాజకీయ నేతలు నడిపించే మీడియా వద్దు అనే చర్చ ప్రారంభం కావాలన్నారు.  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరినీ క్షమాపణ కోరలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో కొందరికి బాధ కలిగి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఛానల్‌ను నడుపుతున్న యాజమాన్యం ఎవరో అందరికీ తెలుసు. ఇంత చౌకబారు జర్నలిజం ఎందుకు వచ్చిందో అలోచించాలని ఆయన ప్రశ్నించారు.  వారి పార్టీ అజెండా కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. ఆంగ్లపత్రిక కథనంలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. చర్చలో ఆ సందర్భాన్ని ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. రాజకీయాలు జోడించాల్సిన అవసరం ఎవరికీ లేదు.’’ అని ఆలపాటి పేర్కొన్నారు.

కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ .. ఎందుకంటే?

  బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు  భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్‌కు ఆయన వివరించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ విచారణలో ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు దారితీసిన పరిస్థితులు, బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పలు కీలక అంశాలపై హరీశ్ రావు కమిషన్‌కు తన వాదనలు వినిపించారు. ప్రాజెక్టు లేఅవుట్‌ను చూపిస్తూ ఆయన వివరణ ఇచ్చారు.  

బ‌స్‌పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ

  తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల  ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రూ. 1150 ఉన్న ఆర్డిన‌రీ పాస్ ధ‌ర రూ. 1400కు పెంపు, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీల‌క్స్ పాస్ రూ. 1800కు పెంచారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.  ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని ప్రజలు వాపోతున్నారు.  గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. సాధార‌ణ ఛార్జీల‌తో పాటు బ‌స్ పాస్ ఛార్జీలను పెంచ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై పురుష ప్ర‌యాణికులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మ‌హిళ‌ల‌కు ఫ్రీ జ‌ర్నీ సౌక‌ర్యం క‌ల్పించి, మ‌గాళ్ల‌పై ఛార్జీల బాదుడు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

నైతిక విలువలకు తిలోదకాలు.. జర్నలిజం ముసుగులో అమానుష వ్యాఖ్యలు!

వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదా? అంటే అవున‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల ప‌ట్ల ఉండాల్సిన  నిబద్ధ‌త మ‌రచి మ‌రీ జ‌గ‌న్ అనుంగు మీడియా వ్య‌వ‌హ‌రించ‌డం చేటు తెస్తుందా? అంటే అదే నిజ‌మ‌ని తెలుస్తోంది. బేసిగ్గా పొలిటీషియ‌న్లు నోటి మాట అదుపు త‌ప్పిన‌పుడు దాన్నొక రాజ‌కీయ ఆరోప‌ణ కింద లైట్ తీస్కునే వెస‌లుబాటు ఉంటుంది. వెన‌కుండి ఎవ‌రో న‌డిపించి ఉంటార్లెమ్మ‌ని జ‌నం అర్ధం చేసుకుంటారు. ఈ మ‌ధ్య అలాక్కూడా ఎవ్వ‌రూ అర్ధం చేసుకోవ‌డం లేదు. చంద్రబాబు సతీమణి భువ‌నేశ్వ‌రిపై వ‌ల్ల‌భ‌నేని వంశీ అన్న మాట‌లు.. వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లీడ‌ర్ల సంస్కారం ఏపాటిదో ఎత్తి చూపించాయి. ఈ విష‌యంలో సాక్షాత్ ఆ పార్టీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ చేసిన కామెంట్లే ఉదాహ‌ర‌ణ‌. త‌మ ఘోర ఓట‌మికి ఇలాంటి కామెంట్లే కార‌ణ‌మ‌ని  ఆయన ఎలాంటి శషబిషలూ లేకుండా అంగీకరించారు.   తాము అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తినే రాజ‌ధానిగా అంగీక‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. మాములుగా రాజ‌కీయ‌నాయ‌కులు ప్రేలాప‌ల‌న‌ల‌కు పాల్ప‌డితే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త స‌గ‌టు జ‌ర్న‌లిస్టుల‌కు ఉంటుంది. బేసిగ్గా జ‌ర్న‌లిజంలో పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్ధులు, ప్రాంతీయ క‌ల‌హాలు, కుల,మ‌త, వ‌ర్గ, వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొట్టేలాంటి వ్య‌వ‌హార శైలి క‌న‌బ‌ర‌చ‌కూడ‌దు.  డూస్ అండ్ డోంట్స్ లో ఇవ‌న్నీ ఒక పాఠంగా చెబుతారు. కానీ  కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన ఓ చానెల్ లో  నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు  అటువంటి కనీస ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు.  అమ‌రావ‌తిపై వేశ్య‌ల రాజ‌ధాని అన్న ముద్ర వేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. వారి వ్యాఖ్యలపై అమరావతి  ప్రాంత మ‌హిళ‌లు చాలా చాలా సీరియ‌స్ అయ్యారు. వారిపై ఫిర్యాదులు చేయడంతో పాటు వారి దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టారు.   ఇంత‌కీ ఇదెలా వెలుగులోకి వ‌చ్చిందోన‌ని చూస్తే.. ప్ర‌పంచ అత్య‌ధిక జ‌నాభా గ‌లిగిన దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న భార‌త్.. హెచ్ఐవీ బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ సంఖ్య త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు పాటు ప‌డుతున్నాయి.  ఏయే రాష్ట్రాల్లో సెక్స్ వ‌ర్క‌ర్ల సంఖ్య ఎలా ఉందో  పీఎంపీఎస్ఈ సంస్థ ఒక స‌ర్వే చేసింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేష‌న్ సైజ్ ఎస్టిమేష‌న్ అనే ఈ సంస్థ  నిర్వ‌హించిన స‌ర్వేలో దేశం మొత్తం మీద  9, 95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేసింది. భార‌త్ లో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే టాప్‌లో ఉన్నట్టు తేల్చింది.  దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15.4 శాతం మంది కర్ణాటకలో ఉండ‌గా.. ఏపీలో 12 శాతం మంది ఉన్నార‌నీ.. ఇక‌ తెలంగాణలో 7.6 శాతం ఉన్నట్టు లెక్క‌లు రాసుకొచ్చిందీ సంస్థ‌. అంటే దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో సుమారు 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అన్న‌ది ఈ స‌ర్వే రిపోర్ట్ సారాంశం.  దీన్ని ఒక అప్ర‌ధాన్య‌త‌కు సంబంధించిన వార్త‌గా ప్ర‌చురించాలి స‌హ‌జంగా అయితే.  కానీ దాన్ని అమ‌రావ‌తి అనే రాజ‌ధానికి లింకు పెట్టి.. ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే ఆ వేశ్య‌లంతా ఉన్నార‌ని చెప్ప‌డం అర్ధ‌ర‌హితం, అమానుషం, అనైతికం.  ఇది జ‌ర్న‌లిస్టిక్ విలువ‌ల‌ను స‌మూలంగా తుంగ‌లో తొక్క‌డంతో స‌మానం.  పొట్టకూటి కోసంఆ వృత్తిలో ఉన్న‌వారి రీహాబిలిటేష‌న్ జరగాలి. జర్నలిజం, జర్నలిస్టులు అందుకోసం వార్తలు రాయాలి. విశ్లేషణలు చేయాలి. గతంలో తెలంగాణలోని యాద‌గిరి గుట్టలో కూడా అదే జరిగింది. అప్పట్లో మీడియా యాదాద్రికి వేశ్య ముద్ర వేసి అప‌ఖ్యాతి పాలు చేయ‌లేదు. బాధ్యతగా వ్యవహరించింది. అది క‌నీస సంస్కారం, విజ్ఞ‌త‌తో కూడిన జర్న‌లిజం.   కానీ ఇప్పుడు కొమ్మినేని, కృష్ణంరాజు   జ‌ర్న‌లిజం ముసుగులో అసహ్యమైన, అమానుషమైన, అనైతిక ప్రచారానికి ఒడిగట్టారు.  కొద్ది కాలం కిందట  వైఎస్ సతీమణి భార‌తీరెడ్డిపై తెలుగుదేశం మద్దతుదారు అయిన కిర‌ణ్ చేబ్రోలు అనే వ్య‌క్తి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుగానూ వెంట‌నే అలెర్ట్ అయిన కూట‌మి ప్ర‌భుత్వం అతనిని అరెస్టు చేసి  జైల్లో పెట్టింది.  ప‌రిణితి ప్ర‌ద‌ర్శించింది. కానీ వైసీపీలో మాత్రం అటువంటి పరిణితి ఇసుమంతైనా కనిపించడం లేదు.  ఇదే వైఖరిని వైసీపీ కొనసాగిస్తే ముందుముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆ చానెల్ లైసెన్స్ రద్దు చేయాలి.. ఏపీ మహిళా కమిషన్

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ   ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై  వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి  శైలజ  తీవ్రస్థాయిలో స్పందించారు.  సోమవారం(జూన్ 9)   విజయవాడలో మీడియాతో  మాట్లాడిన ఆమె  రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా ఆ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై   పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు.  జర్నలిస్టు, ఎనలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడతారా?  అని ధ్వజమొత్తారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో  నోటికొచ్చినట్ల మాట్లాడితే కుదరదన్నారు. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని నిలదీశారు. ఆ చానెల్ లో ప్రసారం చేసిన డిబేట్ కు సంబంధించి మహిళా కమిషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న రాయపాటి శైలజ.. రాజకీయ కారణాలతో ఒక ప్రాంతంపై నీచమైన ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. అమరావతి ప్రాంత మహిళలు త్యాగం చేసి... గత ఐదేళ్లుగా అనేక కష్టాలు, నష్టాలు పడ్డారన్నారు.  ప్రభుత్వం మారిన తరువాత అమ రావతి అభివృద్ధి చెందుతోందనీ,  ఇది చూసి ఓర్వలేక అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.  అటువంటి వ్యాఖ్యలు చేసిన వారు, చేయించిన వారు అందరూ శిక్షార్హులేనన్నారు.  రాజకీయ ముసుగులో నడిపే అటువంటి చానల్స్ ను రద్దు చేయాలన్నారు.  జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్‌కు లేఖ రాసి ఆ ఛానల్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మహిళా కమిషన్‌కు ఉన్న అధికార పరిధిలో తమ‌వంతు చర్యలు ఉంటాయని రాయపాటి శైలజ స్పష్టం చేశారు  

జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా..మహిళా కమిషన్ సీరియస్

  అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు. మహిళల ఆత్మాభిమానాల‌పై దాడి చేయడం గత వైసీపీ ఐదేళ్లుగా సాధారణం అయ్యిందని, మహిళలను రాజకీయ ముసుగులో కొన్ని‌ మీడియా ఛానళ్లు తిట్టిస్తున్నాయని, ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు. జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా ఆమె ప్రశ్నించారు.  జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయ కోణంలో, అనుకూల ఛానెల్ ఉందని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. గుంటూరులో 150 యూనివర్సిటీల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారని వాస్తవాలు తెలియకుండా ఎలా మాట్లాడుతారని ఛైర్ పర్సన్ ప్రశ్నించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తలో ఎక్కడా కూడా ప్రాంతం పేరు లేదు, అలాంటిది జర్నలిస్టు అయ్యుండి ఒక ప్రాంత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడం సరికాదని ఆమె హెచ్చరించారు. చదువుకున్న జర్నలిస్టుగా మహిళలను అవమానించడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు

ఇక అంతా ఢిల్లీ నుంచే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి  ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పడు ఎట్ట కేలకు  ఆ క్రతువు  సగం పూర్తయింది.  మిగిలిన సగం ఎప్పుడన్నది పక్కన పెడితే..  ఇప్పడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది  మాత్రం అందుకోసం కాదు.  మంత్రి పదవులు ఇచ్చిన ముగ్గురు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు గురించి  అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు అందుకు అదనంగా.. మంత్రివర విస్తరణ బృహత్ ప్రణాళికకు సమాంతరంగా సాగు తూ వస్తున్న  హాఫ్ ఫినిష్ డ్ పీసీసీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు చెపుతున్నారు. అలాగే.. పనిలో పనిగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఏర్పాటు చేయ తలపెట్టిన బహిరంగ సభల విషయం ఆదిస్థానంతో చర్చించి, సభలు ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో నిర్ణయించేందు కోసమూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లు చెపుతున్నారు.   ఎందుకోసం అయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు 46 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. మరో నాలుగు రౌండ్లు కొట్టి వస్తే, హాఫ్ సెంచరీకి చేరు కుంటారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రావడం పెద్ద విషయం విశేషం కాదు. అలాగే..  కొన్ని కీలక విషయాల్లో అధిష్టానంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొత్త విషయం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కోట్ల, వైఎస్సార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి రావడం, ఢిల్లీ కనుసన్నల్లో పని చేయడం, తరచూ ఢిల్లీ చక్కర్లు కొట్టడం ఉన్నదే. అయితే ఇప్పడు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది. గతంలో ముఖ్యమంత్రులు రెండు మూడు నెలలకు ఒప్కసారి ఢిల్లీ వెళ్లి వస్తే..  ఇప్పడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలోనే రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. అదలా ఉంటే..  ముందు ముందు ఈ  జోరు ఇంకా పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి, దేశం మొత్తంలో పూర్వ వైభవ స్థితిని పొందే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ముందు ముందు  రాష్ట్ర పార్టీ వ్యవహరాల్లోనే కాకుండా  పాలనా వ్యవహారాల్లోనూ మరింత క్రియాశీల పాత్రను పోషించ వచ్చని అంటున్నారు. ఇప్పటికే  రాహుల్ గాంధీ పలు సందర్భాలలో, పలు వేదికల నుంచి, కులగణన ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా పేర్కొంటున్నారు.చివరకు.. ఈ మధ్యనే మొదలు పెట్టిన  బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ  కులగణనకు తెలంగాణ  మోడల్ ను ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అందుకే.. మంత్రి వర్గ విస్తరణలో, రాష్ట్రంలో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న  రెడ్డి సామాజిక వర్గాన్ని  పూర్తిగా పక్కన పెట్టి, బీసీ, ఎస్సీ లకు మాత్రమే అవకాశం కల్పించారని అంటున్నారు.ఈ పరిణామాలను గమనిస్తే, ప్రభుత్వం రోజు వారీ వ్యవహారాల్లోనూ  ఢిల్లీ పెత్తనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.   నిజానికి  ఇప్పటికే  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల  ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పరిపాలన వ్యవరాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం విషయంలో ఆమె నేరుగా సెక్రటేరియట్ కు వెళ్లి, మంత్రులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పమైంది. అలాగే.. యూనివర్సిటీ ఉపాధ్యయ, విద్యార్ధి సంఘాలతో చర్చలు జరపడాన్ని కూడా  విపక్షాలు తప్పు పట్టాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. విపక్షాలు విమర్శించడమే కాదు..  స్వపక్షంలోనూ లుకలుకలు వినిపించాయి. మీనాక్షి గీత దాతుతున్నారని అధికార పార్టీ నేతలు గుసగుసలు పోయారు.   అలాగే..  తాజా మంత్రివర్గ విస్తరణలోనూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు,ఇతర నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. చివరకు.. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి మీనాక్షి స్వయంగా  నిర్వహించిన సమీక్షల అదారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగిందని అంటున్నారు. అలాగే..  ముఖ్య మంత్రి సహా రాష్ట్ర నాయకులు చేసిన  సి ..ఫార్సులను బుట్ట దాఖలు చేసి,   రాహుల్ గాంధీ కోటాలో ఒకరికి, ఖర్గే ఖాతాలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినట్లు చెపుతున్నారు. తద్వారా ఇక అంతా ఢిల్లీ నుంచే అన్న సంకేతాలు  అధిష్టానం  ఇచ్చిందంటున్నారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణలో బెర్త దక్కని,ఆశావహులను బుజ్జగించి, దారిలోకి తెచ్చే విషయంలోనూ మీనాక్షి నటరాజన్ క్రియాశీల పాత్రను పోషించారు. ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రుల ప్రమేయం లేకుండా వ్యవహరాన్ని చక్క బెట్టారు. తద్వారా  అధిష్టానం దూతగా అధిష్టానం ఆశీస్సులతో ఆమె రాష్ట్ర పార్టీలోనే కాదు..  ప్రభుత్వంలోనూ, మరో పవర్ సెంటర్, (అధికార కేంద్రం) గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే  గతంలో విపక్షాలు చేసిన రబ్బర్ స్టాంప్  ఆరోపణకు బలం చేకురుతోందని అంటున్నారు.

సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళన

  అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.  గేటుకు తాళం వేయడంతో, గేటు ఎక్కి మహిళలు  నిరసన తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో  దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. డిబేట్‌లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.   తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ డిబేట్‌లో అసభ్య పదాలు వాడినప్పటికీ  క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చ గొట్టే విధంగా డిబేట్‌ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఉద్యమాలు మొదలయ్యాయి. ఆపై మహిళలు కోడిగుడ్లను విసిరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

క‌న్న‌ప్పా.. పిల‌క- గిల‌క వివాద‌మేంటి!?

మోహ‌న్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయ‌న శ్రీ విద్యానికేత‌న్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల‌తో పాటు వాటి ఉప ఆల‌యాలు వెర‌సీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం కానీ ఈ సామాజిక వ‌ర్గం ప‌ట్ల గౌర‌వాభిమానాలు గానీ ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే ఒకింత‌ ఎక్కువ‌గానే ఉంటాయ్. తిరుమ‌లలాంటి ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంత‌టి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైందంటే అందుకు కార‌ణం ఈ బ్రాహ్మ‌ణుల నిష్టాగ‌రిష్ట‌త‌లే కార‌ణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.  కానీ..  ఈ ప్రాంతంలో తాను పుట్ట‌డం మాత్ర‌మే కాకుండా, ఇక్క‌డే త‌న విద్యా వ్య‌వ‌స్థ‌ను సైతం స్థాపించి, ఇంకా ఈ ప్రాంతంతో త‌న అనుబంధం పెంచుకుంటూ వ‌స్తున్నారు మోహ‌న్ బాబు. అంటే ఈ ప్రాంత న‌మ్మ‌కాలపై ఆయ‌న‌కుగానీ ఆయ‌న కుటుంబానికి గానీ ఈ సామాజిక వ‌ర్గంపై ఒక మ‌ర్యాద ఉండే ఉంటుంది. కానీ ఇందుకు రివ‌ర్స్ లో వెళ్తోంది మోహ‌న్ బాబు ఫ్యామిలీ. దేనికైనా రెడీ విష‌యంలోనూ స‌రిగ్గా ఇలాంటి వ్య‌వ‌హార‌మే న‌డిచింది. అప్ప‌ట్లో అదో పెద్ద గొడ‌వ‌.  ఫిలింన‌గ‌ర్ లో ఆయ‌న నివాసం ముందు ఆందోళనలూ నడిచాయి.   తాజాగా క‌న్న‌ప్ప లో పిల‌క‌- గిల‌క వ్య‌వ‌హారం మరో సారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో పిల‌క- గిల‌క అంటూ ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేసింది టీమ్ క‌న్న‌ప్ప‌. మొన్న‌టికి మొన్న శివ‌రాత్రి స‌మ‌యంలో సాక్షాత్ ఆ శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రుడి ముందు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టీజ‌ర్ రిలీజ్ చేశారన్న‌ది ఒక వివాదం కాగా.. హార్డ్ డిస్కులు పోయాన్న‌ది మ‌రో వివాదం. తాజాగా ఈ పిల‌క- గిల‌క పోస్ట‌ర్ క‌ల‌క‌లం.  ఈ పిల‌క- గిల‌క పాత్ర‌ల‌ ద్వారా  బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవహేళన చేశారంటూ ఆ సమాజికవర్గాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   క‌న్న‌ప్ప సినిమాలో ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ పాత్ర‌ల‌ను పెట్టార‌ని బ్రాహ్మణ సంఘాలు  విరుచుకుప‌డుతున్నాయి. ఇది బ్రాహ్మ‌ణుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌డంతో స‌మాన‌మన్న‌ది అంటున్నాయి. దీంతో క‌న్న‌ప్ప ప్రీ- రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామ‌ని హెచ్చరిస్తున్నాయి.  నిజానికి క‌న్న‌ప్ప అనే పాత  సినిమాని బ‌ట్టి చూస్తే కాళ‌హ‌స్తీశ్వ‌ర ఆల‌య పూజారి (రావుగోపాల‌రావు పోషించిన పాత్ర‌)   క‌న్న‌ప్ప‌ను నిజంగానే ఇబ్బందుల పాలు చేసిన‌ట్టు క‌నిపిస్తుంది.  మ‌రి అప్పుడిదే బ్రాహ్మ‌ణ  సంఘాలు ఎందుకింత‌గా వ్య‌తిరేకించ‌లేద‌న్న‌ది ఒక వాద‌న కాగా.. రెండోది ఏంటంటే మోహ‌న్ బాబు కుటుంబానికి బ్రాహ్మ‌ణుల‌తో పెట్టుకుంటే బాగా క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది మ‌రో కామెంట్ గా తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌న్న‌ప్ప బ‌డ్జెట్ 100 కోట్ల రూపాయ‌లుగా చెబుతున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్ స్టార్స్ ఇందులో ఉన్నా.. అంతా టాక్ ని బ‌ట్టే రిక‌వ‌రీ అవుతుంది. అందుకంటూ ఒక బూస్టింగ్ అవ‌స‌రం. అలా జ‌ర‌గాలంటే సినిమా ఏదో ఒక ర‌కంగా   వార్త‌ల్లో ఉండాలి. ఇప్ప‌టికే చాలా చాలా ట్రై చేసిన మంచు వారి బృందం..  తాజాగా బ్రాహ్మ‌ణుల‌కు సంబంధించిన వివాదాల తుట్టె కూడా క‌దిపిన‌ట్లు కనిపిస్తోంది. దీంతో త‌మ సినిమా డెఫినెట్ గా వార్త‌ల్లో ఉండ‌ట‌మే కాక‌.. ప్రేక్ష‌క జ‌నం దృష్టిని సైతం ఆక‌ర్షించ‌డం ఖాయ‌ మ‌న్న‌ట్టుగా.. భావిస్తున్నారు. మ‌రి చూడాలి ఏమౌతుందో?

రాజీలే.. నామాలు లేవు!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, చివరాఖరుకు జరగనే జరిగింది. ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. మారో మూడు ఖాళీలు ఆశావహుల కోసం రిజర్వులో ఉంచారు. అయినా..  మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు సహజంగానే భగ్గుమన్నారు. రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే.. ప్రస్తుత్తానికి  అలాంటి ముప్పేమీ లేదని బుజ్జగింపులతో అంతా సర్దుకుందని  పార్టీ వర్గాల సమాచారం. అలాగే.. ఇంకా చిన్న చిన్న పొరపొచ్చాలు మిగిలి ఉన్నా..  అధిష్టానం జోక్యంతో అన్నీ సర్డుకుంటాయని మంత్రివర్గ విస్త’రణం’ సృష్టించిన సంక్షోభం టీ కప్పులో తుపానులe సమసి పోతుందని కాంగ్రెస్ పెద్దలు విశ్వాసంతో ఉన్నారు.  అయితే..  ఇతరుల విషయం ఎలా ఉన్నా, మంత్రి పదవి కోసమే ఇటు నుంచి అటు,  అటు నుంచి ఇటూ  కాంగ్రెస్, బీజేపీ గోడలు దూకిన కోమటి రెడ్డి,  మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని, హైదరాబాద్ రంగా రెడ్డి జిల్లాల ప్రాతినిధ్యం కోసం చాలా కాలంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మల్ రెడ్డి రంగా రెడ్డి, అలాగే..  నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి  సుదర్శన్ రెడ్డి  కొంచెం గట్టిగానే అసంతృప్తిని వ్యక్త పరిచారు.  ముగ్గురికి ముగ్గురూ రాజీనామా ఆస్త్రాన్ని సందించారు. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవ హారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఒకరిద్దరు  మంత్రులు రంగంలోకి దిగి, ఎవరికి చెప్పాల్సిన మాట వారికి చెప్పి బుజ్జగించారు. ఆ విధంగా ప్రస్తుతానికి అయితే.. ఆల్ ఈజ్ వెల్  అన్నట్లు అంతా బాగుందనే  పిక్చర్ ఇచ్చారు.  అయితే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా..  మంత్రి వర్గ విస్తరణ సృష్టించిన సంక్షోభం నిజంగానే టీ కప్పులో తుపానులా సమసి పోయిందా? పోతుందా? అంటే..  లేదు.  నిజానికి, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అంత సులభంగా చల్లారదు. నిత్యాగ్ని హోత్రంలా  నిత్యం  రగులుతూనే ఉంటుందని పార్టీ పుట్టు పూర్వోత్తరాలు అవపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. ముఖ్యంగా..  రాహుల్ గాంధీ కులగణన జెండా ఎత్తిన నేపధ్యంలో  పార్టీలో క్యాస్ట్ ఈక్వేషన్స్  ముందు ముందు మరింతగా మారి పోవచ్చని అంటున్నారు. ఇంత వరకు పార్టీలో కొనసాగుతున్న అగ్రకుల ఆధిపత్యానికి గండి పడే సంకేతాలు కనిపిస్తున్న నేపధ్యంలో..  రెడ్డి, వెలమ ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి అంత తేలిగ్గాచల్లారక పోవచ్చని  అంటున్నారు. మరోవంక త్వరలో చేపట్టే క్యాబినెట్‌ విస్తరణలో మరో మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. అందులో ఒకటి రాష్ట్ర జనభాలోనే 40 శాతం పైగా ఉన్న,  రాష్ట్ర ఆదాయంలో ఇంచుమించుగా సగం  వాటా  ఇస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు కన్ఫర్మ్ చేస్తు న్నట్లు చెప్పారు.  అయితే.. పీసీసీ చీఫ్  త్వరలోనే మరో మంత్రి వర్గ విస్తరణని హామీ ఇస్తున్నా..   సంవత్సరంన్నరగా సాగుతున్న. విస్తరణ ప్రహసనం,  ప్రస్తుత అనుభవాల దృష్ట్యా..  ఇప్పట్లో మరో విస్తరణ ఉండక పోవచ్చని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి.  అదీ గాక.. ఒక వేళ పీసీసీ చీఫ్ చెప్పినట్లుగానే త్వరలో’  మంత్రి వర్గ విస్తరణ ఉన్నా..  సీరియస్ గా మంత్రి పదవి ఆశిస్తున్న  ముగ్గురూ, సుదర్శన్ రెడ్డి, రాజ గోపాల రెడ్డి, మల్రెడ్డి రంగా రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో..  ముగ్గురిలో ఇద్దరికి మొండి చేయి తప్పదని అంటున్నారు. ఈ నేపధ్యంలో, భంగపాటుకు గురైన వారిలో  ఎవరేమి చేస్తారు, ముఖ్యంగా హోం మంత్రి కావాలని కలలు కన్న రాజగోపాల రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.   అదలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ  ఆశావహులనే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కొందరు  ముఖ్య  నాయకులకు కూడా రుచించలేదని,  అంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక్కొక కులం నుంచి ఒక్కొకరు చొప్పున ప్రతిపాదించిన ఆరేడు పేర్లలో ఒక్కరికీ బెర్త దక్కలేదని అంటున్నారు. ముఖ్యంగా, సుదర్శన్ రెడ్డి ఒక్కరికన్నా అవకాశం ఇవ్వాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి క్షణం వరకు గట్టి ప్రయత్నాలు చేశారని, అయినా అధిష్టానం నో చెప్పిందంటున్నారు. అందుకే  ప్రస్తుతానికి, ఆశావహులతో పాటుగా, ముఖ్య నేతలు  రాజీ పడినా, భవిష్యత్ లో పరిస్థితులు ఎలా మారాతాయో చెప్పలేమని అంటున్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం (జూన్ 9) ఉదయం అరెస్టు చేశారు. ఒక చానెల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయనను తుళ్లూరు తరలిస్తున్నారు. ఒక చానెల్ లో కొన్ని రోజుల కిందట కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమం ప్రసారమైంది.   ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణం రాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.   ఇలా ఉండగా తెలుగుమహిళలు కొమ్మినేని, కృష్ణం రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం (జూన్ 9)అరెస్టు చేశారు. ఆయనను విజయవాడ తరలిస్తున్నారు.  

ఉన్నవి ఆరు ఖాళీలు.. 18 నెలల తర్వాత సగం భర్తీ!

మిగిలిన మూడూ ఎప్పడు.. స్ట్రాటజీ ఏంటి? ఇది ఎవరి మార్క్ రాజకీయం నటరాజా!!!  కాబోయే హోం మంత్రి నేనే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  నాలుగు సార్లు.. ఎమ్మెల్యే డెఫినెట్ గా బెర్త్ కన్ ఫర్మ్ అంటూ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ మారుమూల నుంచొచ్చా.. కేబినెట్ లో సీటు ఖాయం అంటూ ప్రేమ్ సాగర్ రావ్,  ఉమ్మడి రంగా రెడ్డికి పదవిలేదని మల్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆశావహుల ఆశలన్నీ ఆశలుగానే.. కలలు కల్లలుగానే.. మిగిలాయ్! ఇక ఎమ్మెల్సీలు దయాకర్ రావు, విజయశాంతి.. సంగతి సరేసరి. కట్ చేస్తే వివేక్, వాకిట, అడ్లూరితో భర్తీకి ఫుల్ స్టాప్ పెట్టకుండా,  కామా పెట్టడంలో అర్ధమేంటన్నది  ఇప్పుడందరినీ తొలిచేస్తోన్న ప్రశ్న.  అందరిలోకీ ఒకింత ఆశ్చర్యకరమైన ఎన్నిక వివేక్ దే. ఒక పక్క దళిత సంపన్న నేత. మరొక పక్క మీడియా అధినేత. అన్నింటికన్నా మించి బీజేపీ నుంచి వచ్చినా మేనేజ్ చేయగలిగిన సత్తా. ఇటు కుమారుడు వంశీ చూస్తే మొన్నటి పుష్కరాలపుడు యాంటీ గవర్నమెంట్ యాగీ.  అయినా సరే..  బెర్త్ కొట్టడమంటే మామూలు విషయం కాదు.  అంతా తావీజ్ మహిమ!  అంటున్నారు కొందరు. ఇక వాకిట శ్రీహరి మహబూబ్ నగర్ వాసి. సీఎం కూడా సేమ్ జిల్లా. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించినట్టు భోగట్టా. ఇదిలా ఉంచితే అడ్లూరి. కవ్వంపల్లిని ఊరించి ఊరించి లాస్ట్ కి అడ్లూరి నోట్లో లడ్డూ పెట్టింది అధిష్టానం. అదేమంటే ఎప్పటి నుంచో లాయల్ కదా? అంటున్నారు.   ఇప్పుడు వీరి సంగతి కాదు కానీ.. రాజగోపాల్, ప్రేమ్ సాగర్, సుదర్శన్.. వీరి పయనమెటు? ఆల్రెడీ హోంత్రి  ఖాయం అంటూ తన అనుచరులకు, కార్యకర్తలకు చెప్పుకు తిరిగిన  కోమటిరెడ్డి బ్రదర్. అంతేనా.. చామలను బోన్ గిరి ఎంపీగా గెలిపిస్తే.. నీకు మంత్రిత్వం ఖాయమంటూ సీఎం నుంచే హామీ ఉన్నా ఏం ఫాయిదా?  దీంతో చిలుకూరు ఫామ్ హౌస్ లో అలకపాన్పు ఎక్కారు. ఇక ప్రేమ్ సాగర్ రావు.. ఎక్కడో మారు మూలండీ బాబూ.. ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి లేకుంటే ఎట్టా? అన్నదాయన ఆవేదన.  సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ అంటే మరీ అంత లోకువా అంటున్నారు. ఇక మైనార్టీల నుంచి మంత్రి లేకనే పోయె. ఇప్పటి వరకూ మంత్రివర్గంలో పాటించిన సామాజిక న్యాయమేపాటి? అని చూస్తే.. రెడ్లు- 4, బీసీలు-3, ఎస్సీ మాల-3, ఎస్సీ మాదిగ-2, ఎస్టీ కోయ-1, ఎస్టీ లంబాడ-1, బ్రాహ్మణ-1, కమ్మ- 1, వెలమ-1 గా ఉంది. ఇదీ కాంగ్రెస్ మార్క్.. సామాజిక న్యాయం కథ, కమామిషు. మొన్నంటే మొన్న మాదిగలంతా కలసి..  ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను, పీసీసీ చీఫ్‌మహేష్ ని వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ ని కలిసి మొరపెట్టుకున్నందుకు అడ్లూరి రూపంలో ఒక పదవైతే దక్కింది.  డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ కూడా హ్యాపీయే. మిగిలిన సామాజిక వర్గాల్లో అసంతృప్తులు అధికంగా ఎవరున్నారయా అంటే వాళ్లలో కూడా రెడ్లే ఎక్కువ. అయితే ఈ మూడింటిని భర్తీ చేసే మూడ్ ఎప్పుడన్నది ఒక హాట్ టాపిక్. ఎంతైనా ఇది కాంగ్రెస్ పార్టీ బాసూ..  ఆ మాత్రం వెయింటింగ్ తప్పదు. ఇచ్చిన వాళ్లతోనే కాదు ఇవ్వని వాళ్లను కూడా వాడుకుని ఎలాగోలా నెగ్గుకు రావల్సి ఉంటుంది. అవునుగానీ ఇంతకీ ఈ మూడు మిగుల్చుడు- నాన్చుడు స్ట్రాటజీ ఎవరిదన్నది ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో కొత్త చర్చ.  అయితే ఇదంతా   మీనాక్షి దేవి మహిమగా భావన. కారణమేంటంటే.. మీరేం ఖంగారు పడకండి ఖర్గేగారూ! నాదగ్గరో ఫార్ములా ఉందని తొలుత మీనాక్షి నటరాజనే కామెంట్ చేశారట.  ఇదెలాగంటే.. విస్తరణకంటూ ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తే.. కొందరి అసంతృప్తుల నుంచి వచ్చే జ్వాల  రాబోయే స్తానిక ఎన్నికలను తగలబెట్టినా పెట్టేస్తుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చూశాంగా. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మీనాక్షమ్మ.. సగమిచ్చి సగం వదులుదాం. ఎందుకంటే మన దగ్గరున్నవే ఆరు. వాటిలో ఆరింటికి ఆరిచ్చేసినా.. అరవై ముంది ఆశావహుల్లో ఆ అసంతృప్తిని ఎలాగూ చల్లార్చలేం. అదే సగం ఇచ్చి సగం దాచాం అనుకోండి. ఆ సగంలోని మూడింటి కోసం రేపటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు.. ముప్పై మంది వరకూ కష్టపడతారు. మేం ఇంత కష్టపడ్డాం  కాబట్టి మాకూ మంత్రి పదవి ఇవ్వమని అడగటానికి బాగుంటుంది. కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటారని.. మీనాక్షి వేసిన నటరాజ్ మార్క్ స్కెచ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు.  మరి చూడాలి..  ఈ అసంతృప్త నేతలలో  మీనాక్షమ్మ బుజ్జగింపులకు ఎంత మంది తలొగ్గుతారో.  మిగిలిన ఆశావహులు ఈ స్ట్రాటజీకి లోబడి ఎంతగా పని చేస్తారో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ గురూ! సముద్రం. ఈ సముద్రంలో ఎన్ని పదవుల పన్నీరు పోసినా.. ఆ సముద్ర ఉప్పు అంత తేలిగ్గా తగ్గేది కాదన్నది ఫైనల్ టాక్. ఏమంటారు!

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీట్ విచారణకు ఏ1 ప్రభాకరరావు

తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సోమవారం (జూన్ 9) సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత 15 నెలలుగా అంటే ఈ కేసు నమోదు కావడానికి కొద్ది రోజుల ముందు నుంచీ ఆయన అమెరికాలోనే ఉన్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పటు చేసుకోవడానికి గ్రీన్ కార్డ్ కూడా తీసుకున్నారు. చికిత్స పేరుతో అక్కడకు వెళ్లిన ప్రభాకరరావు.. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు చేయగలిగినంతా చేశారు. అయితే ఆయనను ప్రకటిత నేరస్థుడిగా గుర్తించే పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి. ఆ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్ తిరిగి వచ్చారు.  మాజీ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగు చూసిన వెంటనే ముందు జాగ్రత్త పడ్డారు. విచారణను తప్పించుకునేందుకు అమెరికా చెక్కేశారు. అక్కడే  ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలం కావడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.   బీఆర్ఎస్  హయాంలో విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు అప్పట్లో కలకలం రేపిన సంగతి విదితగమే.  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్  ప్రభాకర్ రావు ద్వారా ఆ పని చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు కూడా బీఆర్ఎస్ చెప్పినట్లుగా నడుచుకున్నారనీ, ఆయనకు ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు   సహకరించారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును సిట్ విచారించింది. ఆ విచారణలో రాబట్టిన అంశాల ఆధారంగా ప్రభాకరరావు ప్రమేయాన్ని నిర్ధారించుకుందని తెలుస్తోంది.   తనకు పొలిటికల్ అస్సైలమ్ ఇవ్వాలంటూ ప్రభాకరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ప్రభాకరరావు అనివార్యంగా హైదరాబాద్ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమిరేట్స్ విమానంలో దుబాయి మీదుగా ఆయన హైదరాబాద్ కు ఆదివారం (జూన్ 8) చేరుకున్నారు.   సోమవారం (జూన్ 9) జూబ్లీహిల్స్ లోని సిట్  కార్యాలయంలో  విచారణకు హాజరు కానున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు సిట్ విచారణలో  ఏం చెబుతారన్న దానిపై ఇప్పడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన నోరు విప్పితే బీఆర్ఎస్ అగ్రనాయకులకు గడ్డు కాలం తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

మహిళల వ్యక్తిత్వంపై దాడి.. చంద్రబాబు ఫైర్

రాజకీయం, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వారి వ్యక్తిత్వంపై దెబ్బ తీసే వారిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మీడియా డిబేట్ అంటూ ఓ  చానల్ లో రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆడబిడ్డలను గౌరవించడం మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం, మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని చంద్రబాబు పేర్కొన్నారు. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదన్నారు.  తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన  వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడమన్నారు.  మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.