తెలంగాణా సెంటిమెంటు-సర్వ రోగ నివారిణి?
posted on Jan 2, 2015 @ 3:45PM
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాకు మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ నిత్యం అది డబ్బుకి కటకటలాడుతూనే ఉంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాణిజ్య పన్నుల విభాగం ఆంధ్రాకు చెందిన అధికారులు, ఉద్యోగులతో నిండి ఉండటమేనని తెలంగాణా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కీలకమయిన పదవులలో ఉన్న ఆంద్ర అధికారులు ప్రాంతీయ భేదభావం చేత, పన్నుల వసూళ్ళలో అశ్రద్ధ చూపుతున్నారని, ఆ కారణంగానే గత ఏడాది ఇదే సమయానికి 28,000 కోట్లు వసూలు కాగా, ఈ సారి కేవలం రూ 14,000 కోట్లు మాత్రమే వసూలు అయ్యిందని, మరొక మూడు నెలలలో మిగియనున్న ఈ ఆర్ధిక సం.లో ఆ లక్ష్యాన్ని అధిగమించడం మాటెలాఉన్నా, దానిని చేరుకోవడం చాలా కష్టమని ఆ శాఖలో గల తెలంగాణా అధికారులు భావిస్తున్నారు.
డిపార్టుమెంటులో ఆంద్ర అధికారుల అశ్రద్దను అలుసుగా తీసుకొని వ్యాపారస్తులు కూడా పన్ను ఎగవేస్తున్నారని, కనుక ఆంద్ర అధికారుల స్థానంలో వీలయినంత త్వరగా తెలంగాణాకు చెందిన అధికారులను నియమించాలని, ఆ శాఖకు చెందిన టీ-జేయేసి సభ్యులు కొత్తగా వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా నియమితులయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణాలో మొత్తం 12 రెవెన్యూ డివిజన్లు ఉండగా వాటిలో 10 డివిజన్లకు ఆంధ్రాకు చెందినవారే డిప్యూటీ కమీషనర్లుగా ఉన్నారు. వాటిలో అత్యంత కీలకమయిన హైదరాబాద్ పరిధిలో ఏడు డివిజన్లు ఉండగా వాటిలో ఆరింటికి ఆంద్ర డిప్యూటీ కమీషనర్లుగా ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 92 మంది వాణిజ్య పన్ను అధికారులలో అధిక శాతం మంది ఆంధ్రాకు చెందిన వారే. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరు అయిన హైదరాబాదులో 57 మంది వాణిజ్య పన్ను అధికారులుంటే వారిలో ఆంధ్రాకు చెందినవారు 24 మంది ఉన్నారు.
ఈ ఆంధ్రాకు చెందిన అధికారులు ప్రాంతీయ భేదభావం కారణంగా పన్నుల వసూళ్ళలో అశ్రద్ధ చూపడం వలననే ఆదాయం తగ్గిందని తెలంగాణా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ యస్. దేవీప్రసాద్, ఆ శాఖకు చెందిన టీ-జేయేసి చైర్మన్ వెంకటేష్ తదితరులు ఆరోపిస్తున్నారు. వారు మంత్రి తలసాని యాదవ్ ని కలిసి తక్షణమే ఆంద్ర అధికారుల స్థానంలో తెలంగాణా అధికారులను నియమించాలని కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అంతమందిని నియమించడం అసాధ్యం కనుక పదోన్నతి కల్పించడం ద్వారా ఆ స్థానాలలో తెలంగాణా అధికారులని నియమించాలని వారు మంత్రిని కోరారు.
ప్రభుత్వం కమలనాధన్ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నందున వారి ప్రతిపాదన అమలు చేయడం సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు. అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చని ఆయన వారికి సూచించారు.
తెలంగాణా అధికారులు సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఆంద్ర అధికారుల అశ్రద్ధ కారణంగానే ఇంత భారీ ఆదాయం నష్టపోయినట్లయితే, అందుకు భాధ్యులయినవారిని ప్రభుత్వం ఉపేక్షించనవసరం లేదు. ఎందుకంటే వారికి తెలంగాణా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. తన క్రింద పనిచేస్తున్న ఉద్యోగులు ఏ ప్రాంతానికి చెందినవారయినా వారిని ప్రభుత్వం సంజాయిషీ కోరవచ్చును. అలసత్వం ప్రదర్శించారని నిరూపితమయితే వారిపై కటిన చర్యలు కూడా చేప్పట్టవచ్చును.
మంత్రిని కలిసిన తెలంగాణా సంఘ ప్రతినిధులు, అధికారులు ఆదాయం తగ్గినందుకు సదరు ఆంధ్రా అధికారులను పిలిపించి వారి సంజాయిషీ కోరమనకుండా, తమకు పదోన్నతులు కల్పించమని కోరడంలో మర్మమేమిటి? తెలంగాణా సెంటిమెంటుతో రాష్ట్ర విభజన జరిగింది. అనేక శాఖల విభజన కూడా జరిగింది. చివరికి పదోన్నతుల కోసం కూడా తెలంగాణా సెంటిమెంటునే సర్వరోగనివారిణిలాగ ఉపయోగించుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే మంత్రి వారికి కలిసిపనిచేయమని సూచించారేమో?