జగన్ శల్యసారధ్యంలో అగమ్యంగా సాగుతున్న వైకాపా

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు, వ్యూహాలకు అనుగుణంగానే ముందుకు సాగుతోంది తప్ప పార్టీలో సీనియర్ల సలహాలు, సూచనలతో సమిష్టి నిర్ణయం జరుగుతున్నట్లు లేదు. ఆ కారణంగానే వైకాపాకి అనేకసార్లు భంగపాటు తప్పలేదు. ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయిందని చెప్పవచ్చును. రాహుల్ గాంధీ వచ్చి హెచ్చరిస్తే తప్ప ప్రత్యేక హోదాపై తమ పార్టీ పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే వెనకబడి ఉందనే సంగతి గ్రహించలేకపోవడం అందుకు చక్కని ఉదాహరణ. ఆ తరువాతే ఆయన మనం (నేను) మారాల్సిన అవసరం ఉందని పార్టీ సమావేశంలో అంగీకరించారు.   తెలంగాణాలో పార్టీని నడిపించడం విషయంలోను ఆయన ఇంకా చాలా అయోమయంలో ఉన్నట్లే కనబడుతోంది. అప్పుడప్పుడు ఆయన సోదరి షర్మిల పరామర్శయాత్రాలే అందుకు నిదర్శనం. తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకోనేందుకు ఆపార్టీ ప్రజల తరపున నిలబడి ఎటువంటి పోరాటాలు చేయడం లేదు. అసలు తెలంగాణాలో వైకాపా ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. అటువంటప్పుడు మూడ్నేల్లకో ఆర్నేల్లకో ఓసారి షర్మిల చేసే పరామార్శ యాత్రల వలన పార్టీ ఏవిధంగా బలపడుతుందో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి.   తను చేసే పరామర్శ యాత్రలకు ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవనే ఆమె వాదనను నమ్మినా సుమారు ఆరేళ్ళ తరువాత తాపీగా వచ్చి ఎప్పుడో చనిపోయిన వాళ్ళని గుర్తుచేసి మరీ ఓదార్చడం ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. తన యాత్రలకి రాజకీయాలు ఆపాదిన్చావద్దని ఆమె చెపుతుంటారు. కానీ అదే సమయంలో ఆమె యాత్రకి వైకాపా నేతలు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆపార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పి. వెంకటేశ్వరులు పిలుపునివ్వడం గమనిస్తే అది రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్న యాత్రేనని అర్ధం అవుతోంది.   జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ఈవిధంగా అగమ్యంగా ముందుకు సాగిపోతోంది. పార్టీలో ఆయనకంటే చాలా అపార రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లు చాలా మందే ఉన్నారు. సమిష్టి నిర్ణయాలు తీసుకోనేందుకు జగన్ సిద్దపడి వారికి మాట్లాడేందుకు తగినంత స్వేచ్చ ఇచ్చినట్లయితే వారు ఆయనకి చాలా మంచి సలహాలు, వ్యూహాలు ఇవ్వగలరు. కానీ తనకు తోచినట్లే పార్టీని నడిపించాలనుకొంటే ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చును.

వైకాపా నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు: నారాయణ

  ఏపీ రాజధాని కోసం దాదాపు 98శాతం భూసమీకరణ పూర్తయింది. కానీ మరో 2 శాతం భూమి మాత్రమే సమీకరించవలసి ఉంది. మంత్రి నారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములు సేకరించబోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి తుళ్ళూరు మండలంలో చాలా మంది రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. వారికి ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. కానీ వైకాపా నేతలు తమకు పట్టున్న గ్రామాలలో తిరుగుతూ రైతులను భూములు ఇవ్వవద్దని రెచ్చగొడుతున్నారు. అందుకే కొద్ది మంది రైతులు మాత్రం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కానీ గత రెండు రోజుల్లో తుళ్ళూరులో సుమారు 50 ఎకరాలను రైతులు ల్యాండ్ పూలింగ్ పద్దతిలో ప్రభుత్వానికి ఇచ్చేరు. గ్రామ కంఠం భూముల సమస్యని పరిష్కరిస్తే మరో 265 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. కనుక ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకొని ముందు వెళుతుంది తప్ప రైతులను బాధ పెట్టి ముందుకు వెళ్ళాలనుకోవడం లేదు. నేటికీ చాలా మంది రైతులు తమ భూములను ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నందున భూసేకరణ కోసం నోటీసులు ఇవ్వకుండా నిలిపివేశాము. కానీ వైకాపా నేతలు రైతులను రెచ్చగొట్టి సమస్యను సృష్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చే ప్రతీ రైతుకి ఎటువంటి నష్టం కలగకుండా, వారి కుటుంబాలకు ఆర్ధిక భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కనుక రైతులు వైకాపా నేతల మాటలు నమ్మి ఈ ఆఖరి అవకాశాన్ని జారవిడుచుకోవద్దని” ఆయన రైతులకు విజ్ఞప్తి చేసారు.

నేడో రేపో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశం

  ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి వారివద్ద నుండి బలవంతంగా భూములు సేకరణ చేయవద్దని పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ట్వీట్ మెసేజులు పెడుతున్నారు. వాటికి రాష్ట్ర మంత్రులు చాలా గట్టిగా జవాబు చెపుతుండటంతో తెదేపా-పవన్ కళ్యాణ్ ల మధ్య ఈ వ్యవహారంలో కొంత ఉద్రిక్తత నెలకొని ఉంది. కనుక ఈ భూసేకరణ వ్యవహారం గురించి ముఖ్యమంత్రితోనే నేరుగా చర్చించి దానిపై ఆయన అభిప్రాయాలు తెలుసుకొన్న తరువాత రాజధాని ప్రాంతంలో గ్రామాలలో పర్యటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ముఖ్యమంత్రితో సమావేశం తరువాత రాజధాని గ్రామాలలో పర్యటించడం కోసం పవన్ కళ్యాణ్ రేపటి తన సినిమా షూటింగుని వాయిదా వేసుకొన్నట్లు సమాచారం. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి చేస్తారో చూడాలి.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజి మాత్రమేనా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర హామీల అమలు గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించేందుకు ఈనెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళబోతున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 పేజీలతో కూడిన ఒక నివేదిక సిద్దం చేసుకొంది. దానిని ప్రధానికి సమర్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ అవసరమని చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పబోతున్నారు. కానీ ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎదురవుతున్న సమస్యలను, అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి కేవలం ఆర్ధిక ప్యాకేజి మాత్రమే ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజీకి సమానంగా లేదా అంతకంటే కొంచెం ఎక్కువగానే ఆర్ధిక ప్యాకేజీని ఆర్ధిక శాఖ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మోడీ సమావేశం అయిన తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రజలను ఒప్పించడానికి, ప్రతి పక్షాల విమర్శలు, పోరాటాలను ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సిద్దపడవలసి ఉంటుంది.

వారంలో ఒకరోజు జగన్ కేసుల విచారణకే కేటాయింపు

  అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి తదితరులపై సీబీఐ విచారణ నత్తనడకన సాగుతోందని, వాటిని వేగవంతం చేయామని కోరుతూ విజయవాడకు చెందిన వేదవ్యాస్ అనే న్యాయవాది వేసిన ప్రజాహిత పిటిషన్ పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే, జస్టిస్ యస్.వి భట్ లతో కూడిన ద్విసభ్య బెంచి సానుకూలంగా స్పందిస్తూ సీబీఐ కోర్టుకి ఆగస్ట్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జగన్ అక్రమాస్తులకు సంబంధించిన అన్ని కేసులను విచారించేందుకు వారంలో ఒకరోజు కేటాయించింది. సీబీఐ కోర్టు ప్రతీ శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసులను మాత్రమే విచారిస్తుంది.   ఈ కేసులలో నిందితులుగా ఉన్న అనేకమంది తమకు జగన్ అక్రమాస్తుల కేసులతో ఎటువంటి సంబందమూ లేదని కనుక తమకు ఈ కేసుల నుండి విముక్తి కల్పించాలని కోరుతూకోర్తులో డిశ్చార్జ్ పిటిషన్లను వేశారు. వాటిని కూడా శుక్రవారం నాడే సీబీఐ కోర్టు విచారిస్తుంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ చాలా లోతుగా దర్యాప్తు చేసి జగన్ తదితరులపై పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో 11 చార్జ్ షీట్లు నమోదు చేసారు. కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా ఆయన మహారాష్ట్రకి బదిలీ అయిపోవడం, కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డిత్ సహా ఈ కేసుల్లో అరెస్టయిన వారందరూ బెయిలు పొంది జైలు నుండి బయటకి రావడం జరిగింది. అప్పటి నుండి సీబీఐ విచారణ నత్తనడకలు నడవడం మొదలయింది. వాటి పురోగతి ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు వారంలో ఒకరోజు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకే సీబీఐ కోర్టు పనిచేయడం మొదలుపెడితే పురోగతి కనిపించవచ్చును.

వెళ్లి పోరాడకుండా మెసేజులు ఎందుకు? పవన్ కళ్యాణ్ కి వి.హెచ్. ప్రశ్న

  ఏపీ రాజధాని భూసేకరణ విషయంలో తెలంగాణాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావుకి ఎటువంటి సంబందమూ లేదు. కానీ దాని గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్ మెసేజులు చూసి ఆయన కూడా విసిగిపోయినట్లున్నారు. అందుకే ఆయన “ఇంట్లో కూర్చొని ట్వీట్ మెసేజులు పెట్టడం కాదు. తుళ్ళూరు వెళ్లి రైతుల తరపున నిలబడి పోరాడు. ఇటువంటి సమయంలో కూడా పోరాడకపోతే ఇంకెప్పుడు పోరాడుతావు?” అని పవన్ కళ్యాణ్ న్ని వి.హెచ్. ప్రశ్నించారు. ఇంతవరకు తెదేపా మంత్రులతోనే పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వారికి వి.హెచ్. కూడా తోడయ్యారు. ఆయన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ తప్పక జవాబు చెప్పవచ్చును. ఎందుకంటే క్రిందటి సారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు, తనపై విహెచ్ చేసిన విమర్శల గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

త్వరలో బ్యాంకుల సంస్కరణలకు మోడీ ప్రభుత్వం సిద్దం

  దేశంలో అన్ని బ్యాంకులను కామన్ గా పట్టిపీడిస్తున్న సమస్య రుణాల ఎగవేత కారణంగా పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులు. చట్టపరంగా ఉన్న కొన్ని అవరోధాలు, అనేక ఇతర కారణాల వలన అన్ని బ్యాంకులలో ఈ నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోవడంతో బ్యాంకుల ఉనికికే ప్రశ్నార్ధకంగా మార్చుతున్నాయి. ఇది కొత్తగా ఏర్పడిన సమస్య కాదు. అనేక దశాబ్దాలుగా అన్ని బ్యాంకులను పట్టి పీడిస్తున్న సమస్య. కానీ ఇంతవరకు పాలించిన యూపీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దానికి తాత్కాలిక నివారణోపాయాలతో కాలక్షేపం చేసిందే తప్ప దీనికి శాశ్విత పరిష్కారం చూపలేదు. కానీ మోడీ ప్రభుత్వం దీనికి శాశ్విత పరిష్కారం కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు ఆర్హిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.    ఈరోజు ఇండియన్ బ్యాంక్ యొక్క 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ బ్యాంక్ యొక్క 109వ శాఖను ఆర్ధికమంత్రి అర్జున్ జైట్లీ డిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దానితో బాటే ఆ బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన “బంచ్ నోట్ యాక్సప్టర్స్” (నోట్ల కట్టలను యదాతధంగా పరిశీలించి స్వీకరించే) యంత్రాన్ని కూడా ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బ్యాంకులలో నిరర్ధక ఆస్తులు చాలా ఆందోళనకరమయిన స్థాయికి పేరుకుపోతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణాలు రుణాలు ఇచ్చేటప్పుడు విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయడం, రుణాల మంజూరు, వసూలులో తీవ్ర అశ్రద్ద, అలసత్వం చూపడం, కొన్ని వ్యవస్థలలో ఎదురవుతున్న ఆర్ధిక సవాళ్లు వంటి అనేక కారణాల చేత ఈ నిరర్ధక ఆస్తులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వం చేప్పట్టిన దిద్దుబాటు చర్యల కారణంగా గత డిశంబర్ నాటికి 5.63 శాతం ఉన్న ఈ నిరర్ధక ఆస్తులు మొన్న మార్చి ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 5.20 శాతానికి దిగివచ్చాయి. ప్రభుత్వం చేపడుతున్న కటిన చర్యల వలన మున్ముందు ఇది ఇంకా దిగివస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను," అని అన్నారు.   "మేము ప్రవేశపెట్టబోయే కొన్ని కొత్త విధానాలు ఈ నిరర్ధక ఆస్తులను వదిలించుకోవడానికి, మళ్ళీ కొత్తగా పోగుపడకుండా ఉండటానికి బ్యాంకులకు చాలా సహాయపడతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. అప్పుడు బ్యాంకులే ఈ సవాలును సులువుగా ఎదుర్కొనే శక్తిసామర్ధ్యాలను సమకూర్చుకోగలవు. రానున్న నాలుగేళ్ళలో జాతీయ బ్యాంకులన్నిటికీ కేంద్రప్రభుత్వం భారీగా మూలధనం సమకూర్చేందుకు  ప్రణాళికలు సిద్దం చేసుకొంటోంది. ఆ నిధులు కూడా వచ్చి జేరితే జాతీయ బ్యాంకులన్నీ ఆర్ధికంగా మరింత శక్తివంతం అవడమే కాకుండా ఈ రుణాలు, నిరర్ధక ఆస్తుల సమస్యలను ధీటుగా ఎదుర్కోగలవని చెప్పగలను,” అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

రామ్ చరణ్ తేజ్ ఎలాగో పవన్ కళ్యాణ్ కూడా అలాగేనట!

  రేపు మెగాస్టార్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తనకు తన కొడుకు రామ్ చరణ్ తేజ్ ఎలాగో తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అలాగేనని అన్నారు.వారిద్దరూ తనకి రెండు కళ్ళ వంటివారని అన్నారు. రాజకీయంగా తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దాని వలన తమ మధ్య అభిమానం, బంధుత్వంపై ఎటువంటి ప్రభావం చూపబోదని అన్నారు. కానీ తామిద్దరం ఒకే రాజకీయ వేదికపై పనిచేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాలు తనకు చాలా ఖరీదయిన అనుభవమని తెలిపారు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత తను చాలా పాఠాలు నేర్చుకొన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తను కూడా ఒక సభ్యుడిని మాత్రమే కనుక తనకు నచ్చినట్లు పార్టీ నడవదని, పార్టీ సిద్దాంతాల ప్రకారమే తను నడుచుకొంటున్నాని అన్నారు.   పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయాలలో పనిచేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేయడం ద్వారా ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు తెర దించినట్లయింది. కొడుకు రామ్ చరణ్ తేజ్ ఎలాగో తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అలాగేనని చెప్పడం చూస్తే బహుశః పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లుంది. కానీ అందరికీ ‘మనం’ సినిమా దొరకడం కష్టమని ఆయనే చెప్పారు. ఒకవేళ అటువంటి కధ దొరికితే మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఒకే సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లే భావించవచ్చును.   చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య రాజకీయలపై భిన్నాభిప్రాయాలు కలిగిఉంటారు. కానీ వారందరూ సామాన్య ప్రజలు కనుక వారి అభిప్రాయలు వారివరకే పరిమితమవుతాయి. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పెద్ద సినిమా హీరోలు కావడం, ఇద్దరూ పరస్పర విరుద్దమయిన రాజకీయ వేదికలను ఎంచుకోవడం వలన అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ తాము కూడా అందరిలాగే కలిసి మెలిసి ఉంటున్నామని, అవి తమ ప్రేమాభిమానాల మీద, బండుత్వాల మీద ఎటువంటి ప్రభావం చూపడం లేదని చిరంజీవి స్పశాతం చేసారు. ఎన్నికల సమయంలో చిరంజీవిని డ్డీ కొంటున్న సమయంలోనే తనకు అన్నయ్య తండ్రితో సమానమని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాలకి అతీతంగా మెగా బ్రదర్స్ అందరూ కలిసి ఉంటామంటే అభిమానులకీ, అందరికీ సంతోషమే కదా.

ముందు అది స్వర్గమో కాదో తేలితే...పవన్ కళ్యాణ్ రిప్లై

  రాజధాని భూసేకరణ గురించి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలపై రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చాలా ఘాటుగా జవాబిచ్చారు. రాజధాని ప్రాంతంలో మధ్యలో ఉన్న భూములను తీసుకోకుండా గాలిలో రాజధానిని నిర్మించడానికి అదేమీ త్రిశంఖు స్వర్గం కాదని, తాము విశ్వామిత్రులంకామని జవాబిచ్చారు. దానిపై పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఆయన ఈరోజు పోస్ట్ చేసిన ట్వీట్ మెసేజ్ చూస్తే అర్ధమవుతుంది.   “ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు..సినిమా పరిశ్రమకి హైదరాబాద్ లో ఇచ్చినివి కొండలు..బహుళ పంటలు పండే పొలాలు కాదు ,ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంట. పైగా..హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ నాకైతే స్టూడియోలు లేవు. నేను ఎంతోబాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందిచడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చెయ్యడం వారికే చెల్లింది. నేను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నది పరివాహక గ్రామాల రైతులిని కలుస్తాను,” అని మెసేజ్ పెట్టారు.   మరి దీనికి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ తెదేపాకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు ఈ సమస్య గురించి ఈవిధంగా నలుగురిలో చర్చించడం కంటే స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉండేది.

కబుర్లు వద్దు, పని మొదలుపెట్టండి: పొన్నాల

  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరువాత కోటి ఆశలతో ప్రజలు తెరాసకు పట్టం కట్టారు. కానీ అధికారం చేప్పట్టినప్పతి నుండి నేటి వరకు పొరుగు రాష్ట్రమయినా ఆంద్రాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ప్రతిపక్ష పార్టీలని బలహీన పరిచేందుకు ఆ పార్టీలలో నేతలను ఆకర్షించడం, హైకోర్టు చేత నిత్యం మొట్టికాయలు వేయించుకోవడం, ఏదో ఒక వివాదస్పద నిర్ణయాలు ప్రకటిస్తూ దానిపై వాదోపవాదాలు చేస్తూ కాలక్షేపం చేయడం తప్ప ఏడాదిన్నర కావస్తున్నా పరిపాలనపై సరిగ్గా దృష్టి పెట్టడం లేదని తెలంగాణా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పధకాలను అర్హులకు అందించడానికే అంటూ ఏడాది క్రితం ఆర్భాటంగా తెలంగాణా సమగ్ర సర్వే జరిపించి దానితో ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం చేతకాకనే ప్రజల, ప్రతిపక్షాల దృష్టిని మళ్ళించేందుకు ఏదో ఒక వివాదాస్పద నిర్ణయాలు ప్రకటిస్తూ కేసీఆర్ రోజులు దొర్లించేస్తున్నారని పొన్నాల విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మళ్ళీ కొత్త ప్రాజెక్టులను కడతామని చెపుతూ ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని పొన్నాల విమర్శించారు. ఇప్పటికే ఏడాదిన్నర సమయం గడిచిపోయిందని ఇకనుండయినా పరిపాలనపై దృష్టిపెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెడితే బాగుంటుందని పొన్నాల కేసీఆర్ కి సూచించారు.   కానీ తమ తెరాస ప్రభుత్వం ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా చాలా వేగంగా, అద్భుతంగా రాష్ట్రాభివృద్ధి చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులందరూ గట్టిగా వాదిస్తున్నారు. తమ ప్రభుత్వం చురుకుగా పనిచేస్తున్న తీరుచూసి కాంగ్రెస్ పార్టీ నేతలు తమ భవిష్యత్ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నందునే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని తెరాస నేతల వాదన. వారి వాదోపవాదాలు ఎలాగా ఉన్నప్పటికీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి వాదనలు సరయినవో ప్రజలే ఎలాగూ తీర్పు చెపుతారు.

మల్లాది విష్ణు త్వరలో వైకాపాలోకి జంప్

  ప్రత్యేక హోదా అంశం పట్టుకొని ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రాణం పోయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎంతగా ఉద్యమిస్తున్నా “పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదు...భవిష్యత్ అంధకారంగా కనబడుతోంది...మునుగుతున్న ఆ కాంగ్రెస్ టైటానిక్ షిప్పుతో బాటు మేమూ ములిగేందుకు సిద్దంగా లేము,” అంటూ కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా బయటకు దూకేసి వేరే పార్టీలలోకి వెళ్లిపోతూనే ఉన్నారు. ఆ మధ్య ఎప్పుడో రాహుల్ గాంధీ వచ్చి అనంతపురంలో కాస్త హడావుడి చేసి వెళ్లిపోయాక పార్టీ నేతల్లో మళ్ళీ కొంచెం హుషారు వచ్చినట్లు కనబడింది. కానీ ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొత్తిగా పట్టించుకోవడం మానేశారని అటువంటి పార్టీలో ఇంకా కొనసాగి ఏమి ప్రయోజనం అనుకొంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసేందుకు విజయవాడ అర్బన్ అధ్యక్షుడు మల్లాది విష్ణు సిద్దం అయిపోయారు.   మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరే ముందు ఇదే మాట అన్నారు. మళ్ళీ ఇప్పుడు మల్లాది కూడా అదే ముక్క చెప్పడం చూస్తుంటే రాహుల్ వచ్చి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పేమీ కనబడలేదని స్పష్టం అవుతోంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా చాలా రోజుల క్రితమే వైకాపాలోకి జంప్ అయిపోవాలనుకొన్నారు. కానీ గురువుగారు రాయపాటి బ్రేక్ వేయడంతో ఆగిపోయారు. ఆయన తెదేపాలో చేర్పించేందుకు రాయపాటి ప్రయతిస్తున్నట్లు సమాచారం. మల్లాది విష్ణుకి అలాగా బ్రేకులు వేసేవారెవరూ లేరు కనుక ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్-బై చెప్పేసి వైకాపాలోకి వెళ్లిపోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. మల్లాది తరువాత ఇంకా ఎవరెవరు జంప్ అవుతారో?

మళ్ళీ పవన్ కళ్యాణ్ ట్వీట్ పడింది

  ఈనెల 20, అంటే రేపటి నుండి రాజధాని ప్రాంతంలో మిగిలిన భూములను సేకరించేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంటే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ట్వీట్స్ లో వేడి, వేగం కూడా పెంచుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన మళ్ళీ ఒక ట్వీట్ మెసేజ్ పెట్టారు. ఈసారి ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేరిటే నేరుగా ట్వీట్ చేసారు.   ఆయన తన ట్వీట్ మెసేజ్ లో ఏమని వ్రాసారంటే “ఏ దేశంలో ఎవరు పరిపాలిస్తున్నప్పటికీ ఒక ప్రాంతం లేదా ఒక సమూహం అభివృద్ధి చెందుతున్నప్పుడు కొంత పర్యావరణ నష్టం, అక్కడి ప్రజలు నిర్వాసితులవడం ఆకారణంగా వారు వ్యతిరేకత చూపడం నాగరికత అభివృద్ధిలో సహజమే. కానీ ఎంత తక్కువ నష్టంలో అభివృద్ధి సాదంచామనేది పరిపాలకుల తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఉండవల్లి, పెనుమాక, బేతంపల్లి మరియు నదీ పరివాహక గ్రామాలు చాలా సారవంతమయినవి. వాటి కోసం భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ మెసేజ్ చేసారు.   కానీ ఇటువంటి సలహాలు ఈయడం కంటే ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించవచ్చో పవన్ కళ్యాణ్ చెపితే బాగుంటుందని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని ప్రాంతానికి సరిగ్గా మధ్యలో ఉన్న ఆ గ్రామాలను విడిచి పెట్టి రాజధాని నిర్మాణం ఏవిధంగా చేయాలో చెపితే బాగుంటుందని అన్నారు. వాటిని విడిచిపెట్టి రాజధానిని గాలిలో నిర్మించలేమని, అలా నిర్మించేందుకు తామేమీ విశ్వామిత్ర మహర్షులంకామని, యనమల కాస్త ఘాటుగానే జవాబిచ్చారు.

బీహార్ ఆర్ధిక ప్యాకేజితో కొత్త తిప్పలు

  ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటించడంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. నవంబరులో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆయన అంత భారీ ప్యాకేజ్ ప్రకటించారని అధికార జేడీయు, ఆర్.జేడీ, వాటితో జతకట్టిన కాంగ్రెస్ పార్టీలు మోడీని విమర్శిస్తున్నాయి. ఆ ప్యాకేజి వివరాలను, ఎప్పటిలోగా దేని కోసం ఎన్నినిధులు విడుదల చేస్తారో ప్రకటించాలని లాలూ ప్రసాద్ మోడీకి సవాలు విసిరారు. దానిని బీజేపీ నేతలు తేలికగా కొట్టిపడేయవచ్చును కానీ లాలూ విసిరిన ఆ సవాలుకి బీజేపీ తప్పక జవాబు చెప్పవలసి ఉంటుంది. లేకుంటే బీహార్ ప్రజలను మభ్యపెట్టేందుకే మోడీ ఆ ప్రకటన చేసారని ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేసుకొనే అవకాశం కలుగుతుంది. కనుక కేంద్రప్రభుత్వం ప్యాకేజి విషయంలో తక్షణమే స్పష్థత ఇవ్వవలసి ఉంటుంది.   కానీ బీహార్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఇంతవరకు సుమారు రూ.40, 000 కోట్ల వరకు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెపుతున్నారు. కనుక బీహార్ రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ కూడా ఆ నిధులను దేనికోసం ఖర్చుచేసారో, ఆనిధులతో రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసారో ప్రకటించవలసి ఉంటుంది. కానీ అలాగా ప్రకటిస్తే మోడీ ప్రభుత్వం ఇప్పుడే కాదు మొదటి నుండి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూనే ఉందని అంగీకరించినట్లవుతుంది. అంతేకాదు తన ప్రభుత్వం చేప్పట్టిన ఆ అభివృద్ధి కార్యక్రమాల క్రెడిట్ అంతా మోడీ ప్రభుత్వానిదేనని అంగీకరించినట్లవుతుంది. పోనీ చెప్పకుండా మౌనం వహిద్దామంటే బీజేపీ ఆ నిధులు ఏమి చేసారని ప్రశ్నిస్తుంది. జవాబు చెప్పకపోతే కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను నితీష్ ప్రభుత్వం బొక్కేస్తోందని ప్రచారం చేసుకొనే సౌలభ్యం ఏర్పడుతుంది. ఈ విధంగా బీజేపీ, జేడీయు దాని మిత్రపక్షాలకు ఈ ప్యాకేజిపై సరికొత్త యుద్ధం ఆరంభించే అవకాశం కలిగింది.

తెదేపా మెతక వైఖరే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందా?

  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీలను సాధించే విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదని, ప్రతిపక్షాలు మాత్రమే వాటి గురించి కేంద్రంతో పోరాడుతున్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొని మళ్ళీ బలపడేందుకే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొందని ప్రజలకి కూడా తెలుసు. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే, తాము చేతులు ముడుచుకొని కూర్చొని చూస్తుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే భయంతోనే ఇంతకాలం దాని గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఏకంగా డిల్లీలో దీక్ష చేసి వచ్చి తను కూడా ఈనెల 29న రాష్ట్ర బంద్ కి పిలుపు నిచ్చారు. వీటికి తోడూ సీపిఐ, నటుడు శివాజీ, ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా కోసం తమ ఉద్యమాలని తీవ్రతరం చేస్తున్నారు. వీటన్నిటినీ గమనిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఊరుకొంటే ప్రజలు కూడా అపార్ధం చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలు, వాటికి కారణాలు, కారకులు, వాటి పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తున్నారు.   నిన్న రాత్రి విజయవాడలో తన క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ, “ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని తన ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన తరువాత తలెత్తుతున్న సమస్యలన్నిటికీ మూలకారణం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలే. ఆస్తులన్నీ తెలంగాణాకి, అప్పులన్నీ ఆంధ్రాకి పంచిపెట్టి చేతులు దులుపుకొంది. కానీ ఇప్పుడు అదేపార్టీ మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. అది ఎందుకో అందరికీ తెలుసు. సోనియాగాంధీ తన ఇటలీ దేశ రిపబ్లిక్ డే రోజునే (జూన్ రెండు) రెండు రాష్ట్రాల ఆవిర్భావ దినంగా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులని మనం కూర్చొని సరిడదిద్దుకొందామని చెపుతున్నా తెలంగాణా ప్రభుత్వం అంగీకరించకుండా పదేపదే విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. విద్యుత్ సంస్థలలో నుండి ఒకేసారి 1250 మంది ఉద్యోగులను బయటకి గెంటేసింది. ఇంటర్ మీడియేట్ బోర్డు నిధులను స్తంభింపజేసింది. ఇరు రాష్ట్రాలకి చెందిన అనేక ఉమ్మడి సంస్థలని స్వాధీనం చేసుకొంటోంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులతో చాలా అవమానకరంగా వ్యవహరిస్తోంది. ఇంత జరుగుతున్నా గవర్నర్ సెక్షన్ : 8 అమలుకి ఇంకా వెనకాడుతున్నారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ సమస్యలన్నీ ఆయనకీ వివరించి రాష్ట్రానికి న్యాయం చేయమని గట్టిగా అడుగుతాను,” అని అన్నారు.   తెరాస ప్రభుత్వం ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారికే మద్దతు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్న ఈ సమస్యల గురించి, తెరాస ప్రభుత్వం ఆంధ్రాకి విసురుతున్న ఈ సవాళ్ళ గురించి ఆయన ఎన్నడూ పల్లెత్తు మాట పలకరు. ఏపీలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారిళ్ళకు వెళ్లి మరీ ఓదార్చివచ్చే జగన్మోహన్ రెడ్డి, తెరాస ప్రభుత్వం ఏకంగా 1250 మంది ఉద్యోగులను ఉద్యోగాలలో నుంచి పీకేస్తే పల్లెత్తు మాటనరు. అసలు ఆసంగతి తనకు తెలియనట్లే వ్యవహరిస్తుంటారు. పోనీ ఆ సమస్య తెలంగాణాదనుకొంటే అక్కడ కూడా వైకాపా ఉంది. అక్కడ వైకాప నేతలయినా ఉద్యోగుల కోసం తెరాస ప్రభుత్వంతో పోరాడవచ్చును. కానీ పోరాడరు.   ఓటుకి నోటు కేసుపై వైకాపా చూపిస్తున్న ఆసక్తి రోడ్డునపడ్డ ఉద్యోగుల విషయంలో ఎందుకు చూపించడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా, తెరాస ప్రభుత్వం విసురుతున్న ఈ సవాళ్ళ గురించి, సృష్టిస్తున్న ఈ సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం దెబ్బ తింటుందనే భయంతోనే కావచ్చును. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకొనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు డిల్లీ వెళ్లి మరీ పోరాడుతున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.   జగన్మోహన్ రెడ్డి తనకు, తన పార్టీకి అనుకూలమయినవి, రాజకీయ లబ్ది కలిగించేవి, అధికార తెదేపాను ఇరుకునపెట్టగలిగే ప్రత్యేక హోదా వంటి అంశాలను మాత్రమే అందిపుచ్చుకొని పోరాడుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తెస్తోందో, ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ అధికార పార్టీ నేతలు కాంగ్రెస్, వైకాపాలు ఆడుతున్న ఈ కపట నాటకాలను ఎండగట్టడంలో విఫలం అవుతున్నందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవిధంగా ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోవలసివస్తోందని భావించవచ్చును.

ఆంధ్రాలో జోనల్ వ్యవస్థ రద్దు?

  ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుండి ఇటు అనంతపురం వరకు గల జిల్లాల నుండి ప్రజలు హైదరాబాద్ మరియు తెలంగాణాలో ఉద్యోగాలకి పోటీ పడుతుండటంతో స్థానికులకి అన్యాయం జరగకూడదనే ఉద్దశ్యంతో ఆర్టికల్ 371(డి)ని అమలులోకి తెచ్చారు. కానీ ఇప్పుడు అదే ఆర్టికల్ హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ఉద్యోగులు అమరావతి తరలిరావడానికి అడ్డంకిగా మారింది. దీని ప్రకారం గత ఏడేళ్ళ కాలంలో వరుసగా నాలుగేళ్లపాటు ఎక్కడ నివసిస్తే వారు అక్కడ స్థానికులుగా గుర్తించబడతారు. అమరావతికి తరలివచ్చినట్లయితే తమ పిల్లలు స్థానికేతరులుగా పరిగణించబడుతారు కనుక వారికి ఉద్యోగావకాశాలు ఉండవని ప్రభుత్వోద్యోగులు భయపడుతున్నారు.   వారి ఆందోళన సహేతుకమయినదే కనుక ఈ ఆర్టికల్ 371 (డి)ని రద్దు చేయవలసిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడు ఆ చట్టం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఇళ్ళు, కార్యాలయాల కోసం విజయవాడ, గుంటూరు, నూజివీడు ప్రాంతాలలో భవనాల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు వీలయినంతలో అన్ని విధాల సౌకర్యాలు కల్పించి, వారికి వారి పిల్లల జీవితాలకి పూర్తి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. కానీ వీలయినంత త్వరలో రాష్ట్ర పరిపాలన అమరావతి నుండే చేయాలని మేము కోరుకొంటున్నామని తెలిపారు.   ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎప్పటికయినా ఆంద్రప్రదేశ్ కి తరలిపోక తప్పాడు కనుక ఉద్యోగులు అందరూ మానసికంగా సంసిద్దులయి ఉండటమే మంచిదని ఆయన అన్నారు. బహుశః రెండు మూడు నెలల్లోనే ఉద్యోగులు అందరూ హైదరాబాద్ నుండి విజయవాడకి తరలివెళ్లేందుకు సంసిద్దంగా ఉంటే మంచిదని ఆయన అన్నారు. కనుక ఉద్యోగులకు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకి అవసరమయిన భవనాలు సమకూరగానే ప్రభుత్వ పాలనా వ్యవస్థ తరలింపు మొదలవుతుందేమో?

ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ హెచ్చరికలు జారీ

  రాజధాని ప్రాంతంలో ఇంకా భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న కొద్ది మంది రైతుల నుండి భూసేకరణ చట్టం ద్వారా ఈనెల 20నుండి భూములు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, అక్టోబర్ నుండి రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నందున ఏదోవిధంగా భూసేకరణ చేయడం అనివార్యంగా మారింది. లేకుంటే రాజధాని నిర్మాణపనులు మొదలుపెట్టడం సాధ్యం కాదు. ఈ సంగతి నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై ట్వీట్ బాణాలు సందిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆయన నేటికీ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ నిన్న మరొకమారు ఇదే అంశంపై ట్వీట్ చేశారు. “రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించి ఏడాదికి మూడు పంటలు పండే భూములను స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్ చేసారు.   ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ఆయన ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులతో ఘర్షణపై వారిని నొప్పించి భూములు తీసుకోవాలనుకోవడం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చట్టం ఉపయోగించవలసి వస్తోంది. ఈ సంగతి కూడా పవన్ కళ్యాణ్ కి బాగానే తెలిసుండాలి. కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ప్రభుత్వానికి ఉచిత సలహా ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఏవిధంగా పరిష్కరించుకొవచ్చో చెపితే బాగుండేది. ఈ సమస్య పరిష్కారానికి స్వయంగా ఆయనే చొరవ తీసుకొని ప్రయత్నించినా అందరూ హర్షించేవారు. కానీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోమని సూచిస్తూ తనే స్వయంగా ప్రభుత్వానికి కొత్త సమస్య సృష్టిస్తూ సవాలు విసురుతున్నారు. మిత్రపక్షంగా ఉన్న తెదేపా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అండగా నిలబడటం లేదు. అలాగని రైతుల తరపునా నిలబడి పోరాడటం లేదు. ఈవిధంగా ట్వీట్ మెసేజులు పెడుతూ కాలక్షేపం చేసేబదులు ఈ సమస్యపై తన వైఖరి ఏమిటో, తను ఏమి చేయదలచుకొన్నారో స్పష్టంగా చెప్పగలిగితే బాగుంటుంది కదా?

భూసేకరణలో ఆఖరి ఘట్టం ఈనెల 20 నుండి మొదలు

  ఈనెల 20 నుండి రాజధాని ప్రాంతంలో భూసేకరణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొంది. ఈరోజు విజయవాడలో చంద్రబాబు నాయుడు అధక్షతన సుదీర్గంగా సాగిన సమావేశంలో సీ.ఆర్.డి.ఏ. ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు, కృష్ణ, గుంటూరు జిల్లా కలెక్టర్లు, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజధాని మొదటిదశ నిర్మాణం, నిధుల సమీకరణ వగైరా అంశాల గురించి సమావేశంలో చర్చించిన తరువాత ఈ నెల 20 నుండి భూసేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించారు.   ఈలోగా అధికారులు, ప్రజా ప్రతినిధులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులను మరొకమారు కలిసి ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తారు. అప్పటికీ అంగీకరించకపోతే ఇక 20 నుండి భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి భూసేకరణ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. రాజధాని నిర్మాణానికి సమయం దగ్గిర పడుతున్నందున భూసేకరణకు ఇకపై పొడిగింపులు ఇచ్చే అవకాశం లేదనే భావించవచ్చును.   అందరి కంటే ముందు పవన్ కళ్యాణ్ ఈ భూసేకరణను వ్యతిరేకించారు కనుక ఆయన ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగుతారో లేదో చూడాలి. కాంగ్రెస్, వైకాపా, వామపక్షాలు ప్రత్యేక హోదాపై తాము చేస్తున్న పోరాటాలని పక్కనబెట్టి మళ్ళీ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడతాయేమో? ప్రభుత్వం మొదలుపెట్టిన భూసమీకరణలో ఈ ఆఖరి ఘట్టంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రతిపక్షాలు, పవన్ కళ్యాణ్ తదితరులందరినీ ఒకేసారి ఎదుర్కొని పోరాడవలసిరావచ్చును. అంతే కాదు న్యాయపోరాటాలు కూడా తప్పకపోవచ్చును. ఈ అవరోధాలన్నిటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాల్సిందే.

రాహుల్ గాంధీ ఇంగ్లీష్ వింగ్లీష్

  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఇటలీ నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు. కనుక ఆమె మాట్లాడేందుకు కొంచెం ఇబ్బంది పడటం సహజమే. కనుక ఆమె తన హిందీ ప్రసంగ పాఠాలను తన మాతృబాష అయిన ఇటలీ బాషలోనో లేక ఇంగ్లీషు బాషలోనొ వ్రాసుకొని చదివితే ఆమెను తప్పు పట్టడానికి లేదు. విదేశీయురాలైనప్పటికీ ఆమె మన దేశ బాష నేర్చుకొని అంత చక్కగా మాట్లాడటం, ఏదో విధంగా రాజకీయ ప్రసంగాలు కూడా చేయడాన్ని మెచ్చుకోవలసిందే.   కానీ ఆమె కుమారుడు ఇక్కడే భారత్ లోనే పుట్టాడు. పైగా నెహ్రు వంశాకురం. దేశానికి ప్రధానికావాలని కలలు కంటున్న వ్యక్తి. కనుక అతను హిందీలో చాలా అనర్గళంగా ప్రసంగాలు చేస్తుంటారు. హిందీపై మంచి పట్టుకూడా ఉన్నట్లే కనబడుతారు. కానీ చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయన బహిరంగ సభలలో హిందీలో రాజకీయ ప్రసంగాలు చేయవలసి వస్తే దానిని ఆయన ఇంగ్లీషులో వ్రాసుకొని చదువుతున్న సంగతి ఈ మధ్యనే బయటపడింది. “లోగ్ మోడీకే రాయ్ జాన్నా చాహితే హై” అనే పదాలను ఆయన యధాతధంగా ఇంగ్లీషులో వ్రాసుకొని దానిని హిందీలో చదువుతారన్న మాట! ఇంగ్లీష్ మీడియం చదువుల కారణంగా ఇప్పటితరం పిల్లలలో చాలా మందికి తమ మాతృబాషలో మాట్లాడటం వచ్చినా చదవటం, వ్రాయడం రాదని అందరికీ తెలిసిందే. అందుకు రాహుల్ గాంధీ కూడా అతీతుడు కాదని రుజువయింది. అంతే!

బీహార్ ఎన్నికల ప్రచారంలో కొత్త ఐడియా

  నవంబర్లో జరగబోయే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలకి మూడు నెలల క్రితం నుండే అన్ని రాజకీయపార్టీలు కసరత్తు ప్రారంభించేసాయంటే అందులో విజయం సాధించదానికి ఎంత చెమటోడ్చాలో అర్ధం అవుతుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇదివరకు ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు ఆయన బీజేపీతో కలిసి లాలూ ప్రసాద్ యాదవ్ తో యుద్ధం చేసేవారు. కానీ బీజేపీ మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో, ఏనాటికయినా ప్రధానమంత్రి అవ్వాలని కలలుగన్న నితీష్ కుమార్, ఇంకా ఎన్డీయేలో కొనసాగడం వలన తన కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని ఎన్డీయే కూటమిలో నుండి బయటకు వచ్చేసారు.   అప్పటి నుండి మళ్ళీ ఆయన క్రమంగా లాలూకి దగ్గరవుతూ చివరికి ఇప్పుడు బావబావ అనుకోనేంత చుట్టరికాలు కలుపుకొన్నారు. మోడీని డ్డీ కొనాలంటే తామిద్దరం చేతులు కలపాలని అర్ధం చేసుకొని మరో నాలుగు ఇతర పార్టీలను కూడా కలిపి ‘జనతా పరివార్’ ఏర్పాటు చేసుకొన్నారు. కానీ ఎక్కడయినా బావ కాని పేకాట దగ్గర కాదన్నట్లు అంత చుట్టరికాలు కలుపుకొన్నా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తామే ఉండాలని ఇద్దరూ పోటీ పడ్డారు. చివరికి వారిద్దరికీ ఎలాగో సర్దిచెప్పిన తరువాత సీట్ల పంపకాలలో మళ్ళీ గొడవ మొదలయింది. బీహార్ శాసనసభలో ఉన్న మొత్తం 243 సీట్లలో చెరో వంద పంచుకొనేందుకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. తమకు తోక పార్టీలాగా తయారయిన కాంగ్రెస్ పార్టీకి వారు దయదలచి ఓ 40 సీట్లు విదిలించారు. మిగిలిన మూడు సీట్లని కాంగ్రెస్ పార్టీకి తోక వంటి యన్.సీ.పి.కి వదిలేశారు.   ఇంతవరకు ఎదోలాగ సర్దుకుపోయినా, మున్ముందు కూడా ఇలాగే సర్దుకుపోతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికీ వారు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మళ్ళీ కలిసినప్పుడు గట్టిగా వాటేసుకోవడం మానలేదు. వారి ఇదే బలహీనతను, అపనమ్మకాన్ని ఆధారంగా చేసుకొని బీహార్ ఎన్నికలలో విజయం సాధించాలని బీజేపీ అందుకు తగ్గ వ్యూహాలు సిద్దం చేసుకొంటోంది. తన ఎన్నికల ప్రచారంలో వారిద్దరూ ఒకరిపై మరొకరు చేసుకొన్న ఘాటయిన విమర్శల రికార్డులను వినిపిస్తూ అధికార దాహంతో చేతులు కలిపినా అటువంటి నేతల్లో బీహార్ రాష్ట్రాన్ని పెట్టవద్దని బీజేపీ ప్రచారం చేసేందుకు సన్నాహాలు మొదలుపెటింది. మోడీ మాటల మాయాజాలం, అమిత్ షా ఈ సరికొత్త ఎన్నికల వ్యూహాలు బీహార్ ప్రజలను బీజేపీ వైపు ఆకర్షిస్తాయో లేదో మున్ముందు తెలుస్తుంది.