మళ్ళీ 'ప్ర.సా.దు'లను మొదలుపెడుతున్న జగన్ సర్కార్....ప్రయత్నం మంచిదే కానీ ?
గత ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఈ పధకం నచ్చి ఆడపడుచులు వోట్లు వేశారో లేదో ? తెలీదు కానీ, ఆ పధకం అమలు చేయకుంటే ప్రతిపక్షాల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెబుత్నున్నారు. అందులో భాగంగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుందట.
దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు వీలుగా చట్ట సవరణ కూడా చేయాలని భావిస్జోంది. ఆ ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది. మరో రెండు రోజుల్లో ఈ బిల్లు ఉభయ సభలకు రానుందని అంటున్నారు. చట్ట సవరణ తరువాత అక్టోబర్ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు మద్యం దుకాణాల స్ధానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు అవుతాయి. తొలి దశలో 1,095 మద్యం దుకాణాలు రద్దు చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉండగా, వీటిలో 25 శాతం అంటే 1,095 దుకాణాలు రద్దుచేయాలని తీర్మానించింది. దీంతో ఇప్పటి దాకా బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి, మద్యం లైసెన్సుదారులకు విక్రయించటానికే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. ఇక మద్యం ధరలను కూడా పెంచడం ద్వారా ఎక్సైజ్ సుంకం ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. ధర అధికంగా ఉంటే, తాగేవారి సంఖ్య తగ్గుతుందన్నది ఎక్సైజ్ వర్గాల లాజిక్. అయితే మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. కానీ, అదే సమయంలో లైసెన్సుదారులకు ప్రభుత్వం చెల్లించే కమీషన్ మొత్తం మిగులుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి ఆంధ్రలో 1937లో మొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పాటయిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల మద్యనిషేధాన్ని అమలు చేసింది.
అయితే 1969లో మద్య నిషేధం తొలగిపోయి ఆంధ్రప్రదేశ్ అంతా సారా సామ్రాజ్యంగా ఏర్పడింది. టార్గెట్లు పెట్టి ప్రజల చేత ఎక్కువ తాగించి పన్నులు వసూళ్లు చేసుకునే స్థితికి ఎక్సైజ్ శాఖ చేరుకుంది. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించి పన్నుల బదులు, లాభాలు సంపాదించవచ్చుననే ఆలోచనతో వారుణివాహిని అనే సారా తయారుచేసి ప్రభుత్వ సారా దుకాణాల్లో (ప్రసాదు) అమ్మించడం ప్రారంభించింది.
దీంతో కొన్నాళ్ళకి సారా అమ్మకాలు బంద్ చేయాలని 1990లలో ఉద్యమం మొదలైంది. సారా దుకాణాలను తగులబెట్టడం, సారా పారబోయడం వంటి క్రియాశీల పోరాట రూపాలు మొదలయ్యాయి. అప్పుడు ప్రభుత్వం స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో సారా అమ్మించడం కూడా చేసింది అంటే ఆలోచించండి. అది ఎంతలా జనాన్ని ప్రాభావితం చేసింది అంటే 1993లో నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ నాయకత్వాన ప్రారంభమైన మద్యపాన నిషేధం చరిత్రాత్మక పోరాటంగా మారింది.
అదే 1994 ఎన్నికలలో నాటి ఎన్టీఆర్ తెలుగుదేశం నినాదంగా కూడ మారి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మద్యనిషేధం ప్రకటించవలసి వచ్చింది. కానీ ఆదాయ వనరులు సరిపోక చంద్రబాబు నాయుడు 1997 లో ఆ నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుంచీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో సారా ఏరులై పారింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏడాదికేడాదికీ ఎక్కువ ఆదాయ లక్ష్యాలు నిర్ణయించి ప్రజలచేత మరింతగా తాగించడానికి పూనుకుంది. ఆ ఎక్సైజ్ విధానాలనే ఆ తర్వాత రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కొనసాగించాయి.
కానీ ఇప్పటి జగన్ సర్కార్ ఆదాయం వద్దు, ప్రజల సుఖ సంతోషాలే ముద్దు అని ఆలోచించడం బాగానే ఉంది, కానీ ఆనాటిలా ఇప్పుడు కూడా స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో మద్యం అమ్మిస్తే ఏమిటో పరిస్థితి. ఆదాయం చాలదు అనుకున్నప్పుడు అసలు ఇలాంటి హామీలు ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ ఇప్పుడు పాతిక వంతున దుకాణాలను రద్దు చేస్తే ఆజనం అంతా మిగతా షాపుల మీద పడతారు. తద్వారా సమయాభావం ఏర్పడి అక్కడే తోపులాటలు కొట్లాటలు వంటి సమస్యలు ఏర్పడినా ఏర్పడవచ్చు. చూద్దాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో ?