అమరావతి దెయ్యాల పట్టణంగా మారుతోందా? ఇంటర్నేషనల్ మీడియా ఏమంటోంది?

  అమరావతి... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని... హైదరాబాద్ ను తలదన్నేలా, వరల్డ్ టాప్-5 సిటీస్ లో ఒక్కటిగా, ప్రపంచస్థాయి మహాపట్టణం నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. రైతులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర విభజనతో కోల్పోయిన హైదరాబాద్ ను మించిన ప్రపంచశ్రేణి పట్టణం నిర్మాణం కావాలని ఆంధ్రులు ఆకాంక్షించారు. అయితే, అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... తన తెలివి తేటలతో వరల్డ్ క్లాస్ డిజైన్స్ తో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. పునాదులు సైతం పడ్డాయి. అంతలోనే ఎన్నికలు రావడం, టీడీపీ పరాజయం పాలవడంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, అమరావతి నిర్మాణానికి గండిపడింది. పనులు ఆగిపోయాయి, కార్మికులు వెళ్లిపోయారు. యంత్ర సామగ్రి తరలిపోయింది. దాంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమరావతిపై సీత కన్నేసిన జగన్ ప్రభుత్వం... తొలి బడ్జెట్ లో కేవలం ఐదొందల కోట్లిచ్చి చేతులు దులుపుకుంది. అదేసమయంలో అమరావతికి భారీ రుణం ఇస్తామన్న వరల్డ్ బ్యాంకు వెనక్కివెళ్లిపోయింది. అలాగే మరో ఇంటర్నేషనల్ బ్యాంకైన ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్‌ సైతం అమరావతి నుంచి పక్కకు తప్పుకుంది... దాంతో అమరావతికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రెండు బ్యాంకులు వైదొలగడానికి టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని జగన్ సర్కారు ఆరోపిస్తున్నా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి రాజకీయ, ఆర్ధిక మద్దతు దొరకడం లేదనేది వాస్తవం. పైగా రాజధాని భూములపై జగన్ విచారణకు ఆదేశించడం కూడా అమరావతికి అవరోధంగా మారిందనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా, అమరావతిపై జగన్ ప్రభుత్వానికి అనురాగం లేదని, అందుకే పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నా చూసీచూడనట్లు వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు మేజర్ బ్యాంకులు తప్పుకోవడం, రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకోవడంతో... భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి భవిష్యత్ అంధకారంలో పడిందని, తమ త్యాగం వృథా అవుతోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వరల్డ్ క్లాస్ సిటీ లెవల్ నుంచి... దెయ్యాలు తిరిగే పట్టణంగా అమరావతి రూపాంతరం చెందుతుందంటూ ఇంటర్నేషనల్ మీడియా అంచనా వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తుపాను... జగన్ పై ఊహించనిస్థాయిలో జనాగ్రహం

  దాదాపు 50శాతం ఓట్లు... 151మంది ఎమ్మెల్యేలు... 22మంది ఎంపీలు... ఇది మామూలు విజయం కానేకాదు... ఒకవిధంగా చెప్పాలంటే అసాధారణ గెలుపు... ఒకవైపు యువకుడు... మరోవైపు కొత్త పార్టీ... పైగా పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఈ స్థాయిలో విజయాన్ని కట్టబెట్టారంటే... ప్రజలు అతని మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అది అలాంటిఇలాంటి నమ్మకం కాదు... జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించారు. తమ జీవితాలను ఉద్దరిస్తాడని నమ్మారు. తమ బతుకులు బాగుపడాయని విశ్వసించారు. ఇంకా ఏవోవో అద్భుతాలు జరుగుతాయని ఊహించుకున్నారు. కానీ ప్రజల నమ్మకం వమ్ముకావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొత్త ప్రభుత్వం రాకతో ఇసుక ఆగిపోయింది. దాంతో నిర్మాణరంగం మొత్తం కుదేలైంది. ఇసుకతో సంబంధమున్న అనేక విభాగాలకు అసలు పనే లేకుండా పోయింది. దాంతో ఇసుక కార్మికుడి నుంచి ఇంజనీర్ వరకు లక్షలాది మంది రోడ్డునపడ్డారు. ఏ రోజుకారోజు పనిచేస్తేనే కానీ పూట గడవని కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పుడు వీళ్లంతా జగన్ ని తిట్టిపోస్తున్నారు. తామేదో ఊహించుకుని ఓట్లేసి గెలిపించుకున్నామని, కానీ తమ బతుకులు ఇలా రోడ్డునపడతాయనుకోలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ కు ఓటేసినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనంటూ వాళ్లను వాళ్లే తిట్టుకుంటున్నారు. ఇది వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించువచ్చు, కానీ గ్రౌండ్ రియాల్టీ ఇలాగే ఉంది. విప్లవాత్మక నిర్ణయాలంటూ మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 20 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇసుక పాలసీని మాత్రం డిలే చేయడంలో ఆంతర్యమేంటో అర్ధంకావడం లేదు. పోనీ కొత్త పాలసీ తెచ్చేవరకు పాత విధానం కొనసాగిస్తే పెద్దగా జరిగే నష్టమేంటో తెలియడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇసుక తుపాను చెలరేగి విజృంభిస్తోంది. జనాగ్రహం రీడింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇది వైసీపీ ప్రభుత్వం ఊహించనిస్థాయికి చేరుకుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో ఫలితాలు రావడం ఖాయం.

ఏపీ రాజధానిని మార్చే కుట్ర.. అందుకే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదు!!

  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది." "ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

టీడీపీ కీలక మీటింగ్ లో బద్దలైన అగ్నిపర్వతాలు... షాకైన చంద్రబాబు

  చంద్రబాబుతో మీటింగ్ అంటే, సాధారణంగా ఆయనే మాట్లాడారు. ఆయనే చెబుతారు. ఎంత పెద్ద లీడరైనా, బాబు కంటే సీనియర్ అయినాసరే సెలైంట్ గా వినాల్సిందే. అలాంటింది పార్టీ ఘోర ఓటమి తర్వాత జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తమ ముందున్నది పార్టీ అధినేత అనే సంగతి మర్చిపోయి లావా లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. రొటీన్‌కు భిన్నంగా హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో హాట్‌హాట్‌గా సాగిన మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు నిప్పులు చెరిగారు. తమ గుండెల్లో దాగున్న బాధనంతా వెళ్లగక్కారు. ఎన్నడూ అధినేత మాటకు ఎదురుచెప్పని లీడర్లు కళ్లెర్ర చేశారు. ఇదేనా పార్టీలో క్రమశిక్షణ, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు, అప్పుడే విమర్శలేంటంటూ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తంచేశారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇద్దాం, తప్పులు చేయనిద్దాం, ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్లేవరకు ఆగుదాం, ఆ తర్వాతే ప్రజల తరపున రోడ్డెక్కుదామంటూ తన వాదనను కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే విమర్శలుచేస్తే టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయంటూ చంద్రబాబు ముందు గట్టిగానే వాదించారట. అయినా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి... అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని, ముందే పెడితే ప్రజలకు అర్ధంకాదంటూ అయ్యన్న చెలరేగి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను చెప్పే నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చంటూనే, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమాపై విరుచుకుపడినట్లు తెలిసింది. ప్రతి విషయానికీ ట్విట్టర్లోనో, లేదంటే తిట్ల దండకాలో ఎందుకంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు మొహమాటపడకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు. ఇక టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడరైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా, గట్టిగానే మాట్లాడారు. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టు కాదన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని, లాయలిస్టులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ముందే గుండెల్లో బాధను గోరంట్ల బయటపెట్టారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని, ఇకనైనా అలాంటి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని కోరారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే తన టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. అయితే, బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించే గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  అయితే, ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధనంతా వెళ్లగక్కుతుంటే, వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుందా అంటూ చంద్రబాబు షాకైనట్లు తెలుస్తోంది. ఒకానొక టైమ్ లో అయ్యన్న సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. అయితే వెనక్కి తగ్గని అయ్యన్న... నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలనేదే తన ఉద్దేశమని, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం జరిగితే ఉపయోగం ఉండదని రివర్స్ అయ్యారట. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, నేతల మాటలను సావధానంగా విన్న అధినేత, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని నేతలకు హామీ ఇచ్చారట.

రివర్స్‌తో రిస్కే.... జగన్ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ

  జగన్ ఆలోచనలకు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీని కార్నర్ చేయాలనో... లేక చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనో... తెలియదు కానీ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అటు కేంద్రం... ఇటు ప్రజలు తప్పుబడుతున్నా... తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్ర జీవనాడైన పోలవరంపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రం తప్పుబట్టగా, ఇఫ్పుడు స్వయంగా పోలవరం అథారిటీయే షాకిచ్చింది. పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం అత్యంత బాధాకరమంటూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరులశాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు వ్యయం పెరగడంతోపాటు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ దాదాపు చేతులెత్తేశారు. సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్సే చేసింది పోలవరం అథారిటీ. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందని, వ్యయం భారీగా పెరుగుతుందని, చివరికి పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలవరం టెండర్ల రద్దు, ప్రీ-క్లోజర్ పై నాలుగైదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అథారిటీ... రివర్స్ టెండరింగ్ తో రిస్కేనని తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అలాంటప్పుడు టెండర్లు రద్దు చేయడం ఎందుకుని అభిప్రాయపడింది. ఏదేమైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరికాదన్న పోలవరం అథారిటీ... పునరాలోచించుకోవాలంటూ జగన్ సర్కారు సూచించింది. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలవరం అథారిటీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంతోపాటు సంచలనంగా మారింది. మరి పోలవరం అథారిటీ కామెంట్స్ పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

జనసేన ఎమ్మెల్యే రూట్ మార్చారు.. పవన్ డైరెక్షనేనా?

  జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూట్ మారినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆయనకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. దీంతో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అసెంబ్లీలో పవన్ గొంతుకై వినిపిస్తారు, పవన్ గొంతుకై ప్రశ్నిస్తారు అని భావించారంతా. కానీ రాపాక మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో జన సైనికులే కాదు, సాధారణ జనాలు కూడా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రాపాక రూట్ మార్చారు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాపాక విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాపాక పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, దేశంలోనే ఏపీ చాలా వెనకబడి ఉందని రాపాక తెలిపారు. ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతకాలం జగన్ ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాపాక పవన్ ఇచ్చిన సూచనలతోనే తన పంధా మార్చుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. ఇటీవల రాపాకతో సమావేశం అయిన పవన్ రాపాక కు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అందుకే రాపాక రూట్ మార్చి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది.

సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.కోట్ల చెల్లింపులు!!

  ఏపీ ప్రభుత్వం సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు సాక్షి పే రోల్స్‌లో ఉన్న 8 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల పేరుతో జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జీతాలు కూడా లక్షల్లో ఉండటం, అదే స్థాయిలో అలవెన్స్‌లు కూడా మంజూరు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఇప్పటికే 8 మందిని ఇలా తీసుకున్నారని.. మరికొంత మందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ బంధువు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజాసంబంధాల సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. తర్వాత పూర్తిగా వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనకు సాక్షి నుంచి జీతం అందేది. ఇప్పుడు ప్రజాసంబంధాల సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈయన జీతం రూ. మూడు లక్షలకుపైనే. 8 మంది వరకూ సిబ్బందిని నియమించునే అవకాశం, కారు, ఫోన్, ఇంటి అద్దె ఇలా అన్ని రకాల అలవెన్సులు కలిపి.. నెలకు రూ. 10 లక్షలకు పైగానే అవుతుంది. అంటే ఏడాదికి 1 కోటి 20 లక్షలు.. ఐదేళ్లలో ఇది 6 కోట్లు పైనే.. ఇలా ఒక్క సాక్షి ఉద్యోగికి ఏపీ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. జగన్ సభలలో మాట్లాడే స్పీచ్‌లు ఈయనే రాసేవారని సమాచారం. రెండు నెలల క్రితం వరకూ సాక్షి తరపునే జీతం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి జీవీడీ క్రిష్ణమోహన్ కి ఏడాది 1 కోటి 20 లక్షలకు పైనే.. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనున్నారని తెలుస్తోంది. సీపీఆర్వోగా పూడి శ్రీహరి అనే సాక్షి ఉద్యోగిని నియమించుకున్నారు. సాక్షిలో.. రూ. 50 వేలలోపే జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెంట ఉంటూ మీడియా వ్యవహారాలు చూసుకున్నారని తెలుస్తోంది. ఈయనను ఇప్పుడు సీపీఆర్వోగా నియమించారు. ఈయన జీతం కూడా.. సీనియర్ సలహాదారుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. అన్నీ కలిపి నెలకు.. రూ. 10 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీరు మాత్రమే కాదు.. సాక్షి పేరోల్స్‌లో కాస్త ఎక్కువ జీతం అనుకున్న మరో ఐదుగురికి కూడా.. ఇదే తరహాలో సలహాదారుల పోస్టులు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇలా నియమించుకుంటున్న సలహాదారులకు.. కావాల్సిన సిబ్బంది కూడా సాక్షి గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులేనని చర్చ నడుస్తోంది. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తాను నెలకు ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించిన సీఎం జగన్.. దయనీయస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం తన ముందున్న ప్రథమకర్తవ్యం అని ప్రకటించారు. తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే తాగడం వల్ల ఖజానాకు రోజుకు 80 నుంచి 120 రూపాయలు మిగిల్చుతానని చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించిన జగన్.. ఇలా సలహాదారులు, వారి సహాయకుల కోసం.. కోట్లకు కోట్లు జీతభత్యాలు వెచ్చించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి అవసరం అయి తీసుకుంటే పర్వాలేదు కానీ.. తమ సొంత సంస్థలో జీతాలు తీసుకునేవారిని ఇలా నియమిస్తూండటంతో.. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారత్ పాక్ యుద్ధం...తప్పదా ?

  కాశ్మీర్ అంశంలో మోడీ సర్కార్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సిద్దమవుతుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ నిన్న కీలక నిర్ణయాలను తీసుకుంది. భారత్ దౌత్య సంబంధాలను తెంచేసుకోవాలని నిర్ణయించుకున్న పాక్ యుద్దానికి వెనుకాడొద్దని సైన్యానికి పరోక్ష అలర్ట్స్ పంపింది. లాహోర్-ఢిల్లీ మధ్య బస్సు సర్వీసును కూడా నిలిపివేసిన పాకిస్తాన్ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని ఆదేశించింది.  ఆగష్టు 15ను బ్లాక్ డేగా నిర్వహించాలని, భారత్ హై కమిషన్ ను వెనక్కు పంపాలని, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ను వెనక్కు రావాలని ఆదేశాలిచ్చింది. ద్వైపాక్షిక  ఒప్పందాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని.. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన విషయంలోనే యుద్ధం వస్తుందని భావించినా పాక్ తేలు కుట్టిన దొంగలా ఉండిపోవడం వలన అది సద్దుమణిగింది.  అయితే ఆర్టికల్‌-370ని మోదీ సర్కారు నిర్వీర్యం చేయడం భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీయొచ్చని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్‌లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని, కశ్మీరీలను ఎంత అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే, తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారని ఆయన హెచ్చరించారు.  కశ్మీరీలకు సాయం చేసేందుకు ఎంతదాకైనా వెళతామని, ఇందుకు తమ బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా కూడా ప్రకటించారి. తాజాగా కమాండర్లతో సమావేశం నిర్వహించారు. కశ్మీరీలకు చివరి క్షణం వరకూ పాక్‌ సైన్యం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ చౌదరి యుద్ధానికి వెనుకాడొద్దని, యుద్ధమంటే గెలుపోటముల కోసం చేసేది కాదని, గౌరవం కోసం, పరువు, ప్రతిష్ఠల కోసం చేసేదని చెప్పుకొచ్చారు.  ఈ నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని భార‌త్‌, పాక్ ప్ర‌జ‌లు ఆసక్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌ధానంగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని ఒక‌సారి గ‌మ‌నిస్తే.. ఇరుదేశాల మ‌ద్య యుద్ధం త‌ప్ప‌దేమోన‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.  చూద్దాం ఏమవుతుందో ?

జగన్ ఢిల్లీ టూర్...కాకా పట్టేందుకేనా ?

  ఇజ్రాయిల్ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈరోజు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయ‌న స‌మావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఆయ‌న వారితో చ‌ర్చించ‌నున్నారని అంటున్నారు. ఎన్నికల నాడు బాగానే ఉన్న జగన్ బీజీపీలు ఇప్పుడు కొంచెం ఎడముఖం పెడ ముఖంగా ఉంటున్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాలకు కేంద్రం మోకాల‌డ్డుతోంది. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను కేంద్రం వ్య‌తిరేకిస్తోంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. ఈక్రమంలో జగన్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు పీపీఏలపై సమీక్ష, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాలపై వారితో చర్చించనున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హోం మంత్రి అమిత్‌ షాతో, సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, వాటిని బ‌య‌ట‌పెట్టాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గానూ జ‌గన్ గుర్తించిన అస్త్రాలు పీపీఏ, పోల‌వం టెండ‌ర్లు. ఈ రెండింటిలో ఎక్కువ అవినీతికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పాల్ప‌డింద‌ని, పీపీఏల‌ను పున‌స‌మీక్షించి, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండరింగ్‌కు వెళ్ల‌డం ద్వారా చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాలని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, కేంద్రం జ‌గ‌న్‌ను అడ్డుకుంటోంది. పీపీఏల‌పై పున‌స‌మీక్ష వ‌ద్ద‌ని కేంద్రం జ‌గ‌న్‌కు ఉత్త‌రాల మీద ఉత్త‌రాలు రాస్తోంది. ఈ విష‌యాన్ని న‌రేంద్ర మోడీ తిరుప‌తి వచ్చిన‌ప్పుడు జ‌గ‌న్ ఆయ‌న దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. అలాగే పోల‌వరంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. స్వ‌యంగా పార్ల‌మెంటులో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్ప‌డం వైసీపీకి మింగుడు ప‌డ‌టం లేదు. అయినా వెన‌క‌డుగు వేయ‌ని జ‌గ‌న్ తాను నియ‌మించిన నిపుణుల క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు పోల‌వ‌రం కాంట్రాక్ట‌రు న‌వ‌యుగ‌ను త‌ప్పించారు. ఈ నిర్ణ‌యాన్ని కూడా కేంద్రం త‌ప్పుప‌ట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలన్నీ వారితో చర్చించేందుకే ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు మరి ఏమేరకు ఈ విషయాలలో జగన్ కేంద్రాన్ని ప్రభావితం చేస్తారో వేచి చూడాలి మరి.

ఒకప్పటి శారదాదేశమే కాశ్మీర్.... కశ్మీర్‌ పండిట్లు ఏమయ్యారు ?

  భారత దేశ భూతల స్వర్గంగా జమ్మూ కశ్మీర్ ను పిలుస్తారు. ఎంతో అందమైన పేరుతో పిలుచుకునే కశ్మీర్ కు చాలా చరిత్రే ఉంది. కశ్మీర్ అసలు మూల నామము శారదాదేశము. ఎంతో హిందూ సంస్కృతితో విరాజిల్లే కశ్మీర్ కు చిట్టచివరి రాజు కూడా మహారాజా హరిసింగ్. ఆయన కూడా హిందువే అందుకే అతడు దేశ విభజన జరిగినప్పుడు కశ్మీర్ ను భారత్ లో విలీనం చేశారు, ఓకవేళ అ రాజు ముస్లిం అయ్యుంటే ఆయన దానిని పాకిస్తాన్ లో కలిపి ఉండేవాదేమో ? విచిత్రం ఏంటంటే ఏడు దశాబ్దాలు పాటు మనదేశంలోనే ఉంటూ ఎంతో స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న కశ్మీర్ నిన్న శ్రవాణ మాసం శుద్ధ పంచమీ, కశ్యప మహర్షి జయంతి రోజే ఆ ప్రతిపత్తి కోల్పోయింది.  కశ్యప మహర్షి పేరుమీదుగా ఈ కశ్మీర్ ఏర్పడిందని చెబుతారు, నిన్న ఆయన జయంతి రోజున కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోవడం అనేది యాదృచ్చికమే.  ఇప్పటకీ కశ్మీర్ లోని అనేక నగరాలు ప్రదేశాల పేర్లు మన హిందూ పురాణాలను బేస్ చేసుకునే ఉంటాయని అంటూ ఉంటారు. అందులో కొన్నిటిని చూస్తే వరాహమూల అనే పట్టణం బారాముల్లాగా రూపాంతరం చెందింది. అలాగే జంబూదేశమనే పేరే  జమ్ముగా రూపాంతరం చెందింది. ఇక కర్ణరాజ పురం అనే పేరు పీర్ పంజల్ గా, సూర్య పుర అనే పేరు సోపుర్ గా, అవంతీపురమనే పేరు పుల్వామాగా, జయపురమనే పేరు సంబల్ పూర్ గా మారాయి.  భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరు ప్రపంచంలోనే ఎక్కడాలేని ప్రత్యేకతను కలిగి ఉంది. ఎత్తయిన కొండలు కోనలు నదులు అడవులు, మంచు పర్వతాలు కశ్మీర్ సొంతం. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిపోయిన కశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఇప్పుడు నిజమైన భూతల స్వర్గంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కాశ్మీరులో ఐదు లక్షలకన్న ఎక్కువ మంది ఉన్న కాశ్మీర పండితులు ఈ నాడు రెండు వేల కన్నా ఎక్కువ లేరు. కశ్మీరీ పండిట్ల సమాజం ముఖ్యంగా మూడు వర్గాలు.  వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది బన్మాసీల గురించి. కశ్మీర్‌ లోయ ముస్లిం రాజుల పాలనలో ఉన్నప్పుడు వీరంతా వ్యాలీని వదిలేసి వెళ్లిపోయి కొన్నేళ్లకు తిరిగి వచ్చారు. ఇక రెండో కేటగిరీ మల్మాసీ. లోయలో జరుగుతున్న అన్ని కష్టనష్టాలను తట్టుకొని అక్కడే స్థిరపడ్డారు. మూడో కేటగిరీ బుహ్రీస్‌. వ్యాపార వ్యవహరాలు సాగించే పండిట్లంతా ఈ కేటగిరీ వారే. అయితే 1989లో పండిట్ల భారీ వలసలతో వీరి మధ్య వ్యత్యాసాలు చాలా తగ్గిపోయాయి. 1846 నుంచి 1947 వరకు డోగ్రా రాజవంశ పాలనలో ముస్లింల సంఖ్య మెజారిటీగానే ఉన్నప్పటికీ కశ్మీరీ పండిట్ల హవా సాగింది.  ఈ కాలంలో లోయలో అధికంగా ఉన్న ముస్లింలతో సఖ్యతగానే ఉంటూ పండిట్లు జీవనం సాగించారు. అయితే 1950 భూ సంస్కరణ నిర్ణయాల ఫలితంగా 20 శాతం పండిట్లు కశ్మీర్‌ లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1981 నాటికి లోయలో పండిట్ల జనాభా కేవలం 5 శాతం. కొన్ని ఆధారాల కథనాల ప్రకారం 1990లో సుమారు 1,40,000 మంది పండిట్ల జనాభా ఉందని అంచనా వేయగా వారిలో లక్ష మంది కశ్మీర్‌ను వదిలేశారు. వలస వెళ్లిన వారిలో అధికంగా జమ్మూ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

కేంద్రం అధీనంలోకి జమ్మూ కాశ్మీర్...అసలు ఏమి జరుగుతోంది ?

  జమ్మూ కశ్మీర్‌లో క్షణ క్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. నిన్న అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశారు. వారు గడప దాటి బయటకు రావద్దని ఆదేశించి పోలీసులను కాపలా ఉంచారు. రాష్ట్రమంతా 144 సెక్షన్ విధిస్తూ బహిరంగ సభలు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరిస్తున్నారు.  పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. కిష్టావర్‌, రాజౌరి, రాంబస్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌తో పాటు జమ్మూ, రెశాయ్‌, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. విద్యాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జమ్మూ విశ్వవిద్యాలయం పరిధిలో ఈరోజు జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశారు. కాశ్మీర్‌ లోయలోని విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.  దీంతో అక్కడి పరిస్థితినంతా కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చుకున్నట్టయింది. ఇక ఇంత ఉద్రిక్త పరిస్థితుల నడమ ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లతో పాటు పలువురు హాజరయ్యారు. కాశ్మీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.  దీంతో  ఆర్టికల్‌ 35 ఏ, ఆర్టికల్‌ 370లను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అక్కడితో ఆగక దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పలుచోట్ల ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఏమి జరగనుందో అనే టెన్షన్ కేవలం జమ్మూ కాశ్మీర్ వరకే కాక భారత్ మొత్తం నెలకొని ఉంది. 

దేవినేని అవినాష్ వ్యూహం ఏంటి ?....బెదిరిస్తున్నారా ? బలవుతున్నారా ?

  "ఏపీ టీడీపీకి మరో భారీ షాక్‌. తెలుగుయువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు, గత ఎన్నికల్లో గుడివాడ నుండి కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిన దేవినేని అవినాశ్ టీడీపీని వీడనున్నారు, అవినాశ్ నాయక‌త్వంలో  కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవినేని నెహ్రూ అనుచ‌రులు..అభిమాను లు టీడీపీని వీడి వైసీపీలో చేర‌నున్నారు" ఇదీ రెండ్రోజుల నుండి జరుగుతున్న ప్రచారం. నిజానికి ఈ ప్రచారంలో పెద్ద వింతేమీ లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు రావడం షరా మామూలు విషయమే.  అయితే ఈ విషయం మీద దేవినేని అవినాష్ స్పందించకపోవడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. నిజానికి గుడివాడ నియోజకవర్గ టికెట్ దేవినేనికి అప్ప చెప్పడం అప్పట్లోనే గుడివాడ పార్టీ నేతలకు నచ్చలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలో పని చేశారు. కానీ ఎన్నికలు పూర్తయి రెండు నెలలు కూడా కాకముందే ఆయన పార్టీ మారతారు అని ప్రచారం జరగడం దానికి ఎటువంటి ఖండన అవినాష్ నుండి రాకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.   మొన్న జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటమి పాలయ్యింది. ఎవరూ ఊహించని రీతిలో ఫలితాలు వెలువడ్డ రోజు నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పై దాడులు మొదలు అయ్యాయి. నిజానికి ఈ షాక్ కి సీనియర్ నేతలు , రాష్ట్ర నాయకత్వం బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయింది. కానీ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయేలా అవినాష్ దాడి జరిగిన వారి ఇళ్ళకి వెళ్లి తెలుగుదేశం కార్యకర్తలకు అండగా తాను ఉంటానని ప్రకటించాడు.  అయితే అలా ప్రకటించడమే పార్టీలో అంతర్గత విభేదాలకి కారణం అయ్యిందని విశ్లేషకుల అంచనా. అదేంటంటే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు రాష్ట్రంలో కార్యకర్తలు అందరి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి ? అని కొందరు సీనియర్ నేతలు అధిష్టానం వద్దకు విషయం తీసుకువెళ్ళారట. అయితే అలా చేయడం కరెక్ట్ కాదనే అర్ధం వచ్చేలాగా అధిష్టానానికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లారని టాక్.  ఎక్కడ ఎదిగిపోయి జిల్లా నాయకత్వంలో పోటీతో పాటు రాష్ట్ర నాయకుడిగా ఎదిగిపోతాడేమో అనే భయంతో తమ అనుకూల మీడియా వర్గాలతో కొందరు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారని ఒక ప్రచారం కూడా దేవినేని అనుచరులు మొదలుపెట్టారు. పార్టీ వీడే వార్తల మీద స్పందించిన ఆయన అనుచరులు ఈ వార్తల్లో నిజం లేదని కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.  అవినాష్‌కు పార్టీ మారే ఉద్దేశం లేదని మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దంటున్నారు. ‘దేవినేని అవినాష్ గారు వైసీపీ లోకి వెళుతున్నారు... వెళ్లిపోయారు అని వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆయన పార్టీ మారలేదు, మారబోరు కూడా !. విశ్వసనీయ వర్గం నుంచి సమాచరం వచ్చింది కాబట్టి ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. తప్పుడు ప్రచారాలు చేసి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు’అంటూ గుడివాడ తెలుగు దేశం పార్టీ ఫేస్‌బుక్‌ పేజీలో క్లారిటీ ఇచ్చింది.  అయితే ఈ వ్యవహారంలో అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా లోకేష్ వలెనే అవినాష్ పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. నిజానికి ఎన్నికల సమయం నుండే లోకేష్ తనను అవమానించేలా ప్రవర్తిస్తున్నాడు అని అవినాష్ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. ఎప్పుడు లోకేష్, చంద్రబాబులు ఎయిర్ పోర్ట్ కి వచ్చినా రిసీవ్ చేసుకోడానికి అవినాష్ వెళుతున్నారట.  కానీ అప్పుడు అంత ప్రాధాన్యం ఇవ్వకపోగా బుద్ధాని వెంటపెట్టుకుని లోకేష్, చంద్రబాబులు వెళ్ళిపోతున్నారని సమాచారం. అదీ కాక విజయవాడ కార్పోరేషన్ పరిధిలో అవినాష్ కొన్ని కార్పొరేటర్ సీట్లు అడిగితే చంద్రబాబు లేదు పోమ్మన్నారని, అక్కడ అంతా గద్దె రామ్మోహన్ మాటే ఫైనల్ అని అన్నారని, ఇలా అన్ని చోట్లా అవమానాలు ఎదురు కావడంతో అవినాష్ తట్టుకోలేక పోతున్నారని సమాచారం.  అందుకే పార్టీ మారుతున్నట్టు అవినాషే ప్రచారం చేయిస్తున్నారని కొన్ని వర్గాల నుండి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారని ఈ భేటీలో తనకు పెనమలూరు నియోజకవర్గ బాద్యతలు ఇమ్మని అడిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ నుండి నేతల జంపింగ్ లతో విసిగి ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరి.  

కృష్ణా జిల్లా టీడీపీ పుట్టి మునగడం ఖాయమా ?

  ఏపీ ఎన్నికల ముందు వరకూ బాగానే ఉన్న బెజవాడ తెలుగు తమ్ముళ్ళు ఎన్నికల ఫలితాల అనంతరం కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఎక్కడ చెడిందో తెలీదు కానీ విజయవాడ ఎంపీ కేశినేని ఆ పార్టీ ఎమ్మెల్సీ విజయవాడ టీడీపీ అధ్యక్ష్యుడు బుద్దా వెంకన్నలు ఒకరి మీద ఒకరు ట్విట్టర్ వేదికగా విమర్శించుకున్నారు. ఒకానొక సందర్భంలో వీరిద్దరూ చేసిన ట్వీట్‌లు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా తలనొప్పి తెప్పించాయి.  అయితే ఈ వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్‌ గా తీసుకోవడంతో వెనక్కి తగ్గినా బుద్దా వెంకన్న కేశినేని గురించి ట్వీట్స్ చేయడం పూర్తిగా మానేశారు. ఆ తర్వాత కేశినేని కొద్ది రోజులు డోస్ పెంచి మరీ ట్వీట్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఆపినా ఆ వివాదం పూర్తిగా చల్లబడని కారణంగా విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షునిగా వచ్చే టర్మ్ నుంచి ఉండబోనని బుద్దా వెంకన్న తేల్చిచెప్పేశారు.  ఈ రోజు కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ముఖ్యనేతలు కూడా డుమ్మా కొట్టారు. అయితే ఈ సమావేశానికి హాజరైన బుద్దా వెంకన్న మాత్రం దానిని అవమానంగా ఫీల్ అయ్యారో ఇంకేమన్నానో కానీ తనకి మళ్ళీ ఎటువంటి పదవులు వద్దని తేల్చేసి భవిష్యత్‌లో ఎవరికి ఆ పదవి వచ్చినా తాను అన్ని విధాలా సహకరిస్తానన్న అభిప్రాయాన్ని సమావేశంలో వెల్లడించి బుద్దా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు.  అయితే ఈ విషయం అలా ఉంచితే పార్టీలో కీలక నేతలు అయిన బొండా ఉమా, వంశీలు పార్టీ వీడుతున్నారు అని ప్రచారం మొదలయ్యింది. ఉమా పార్టీ మారుతున్నట్టు రెండ్రోజుల క్రితమే ప్రచారం మొదలయ్యిది. ఆయన అందుకే ఏమీ తగ్గకుండా న్యూజీల్యాండ్ లో ఎంజాయ్ చేస్తూ తన మీద వస్తున్న ఈ వార్తలను కూడా ఆస్వాదిస్తున్నారు. ఆయన పార్టీ వీడడం ఖాయమయినా అది వైసీపీనా, బీజేపీనా అనేది క్లారిటీ లేదు.  ఇక తాజా సమావేశానికి వల్లభనేని వంశీ కూడా డుమ్మా కొట్టడంతో ఆయన మీద కూడా వార్తా కధనాలు మొదలయ్యాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ అధికారంలోకి వస్తుంది వచ్చాక ఎమ్మెల్సీ అయినా ఇవ్వకపోతారా అనే ఆశతో పార్టీలో చేరిన దివంగత కాపు నేత రంగా కుమారుడు రాధా పరిస్థితి చుక్కాని లేని నావలా తయారయ్యింది. టీడీపీలో ఆయన పరిస్థితి మింగలేక కక్కలేక ఉన్నట్టుంది.  ఆయన టీడీపీలో చేరడం ఎంతో మంది వ్యతిరేకించినా ఆయన వచ్చి చేరారు. ఇప్పుడేమో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీని తద్వారా పార్టీలోని నేతల ఇమేజ్ ని దెబ్బ తీస్తోంది. ముందు ముందు అధినేత జిల్లా రాజకీయాల మీద ద్రుష్టి పెట్టకుంటే కంచుకోట అని చెప్పుకునే జిల్లా ఇప్పటికే ఒకసారి వైసీపీ పరం కాగా భవిష్యత్తులో కోలుకోలేని విధంగా దెబ్బ పడడం ఖాయం. ఇప్పటికే జిల్లా అధ్యక్ష్యుడుగా బచ్చుల అర్జునుడు ఉన్నా అధికారం మాత్రం దేవినేని చేతిలోనే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. మరి ఆయన అయినా ఈ విషయాన్ని పట్టించుకోకుంటే జిల్లాలో పార్టీ పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది.

పోలవరం రివర్స్ టెండరింగ్...కేంద్రానికి ఇష్టం లేదా ?

  ఏపీ సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టిన జగన్ తనదైన మార్క్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ కంపెనీకి నోటీసులు జారీ చేసింది.  జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని అంటూ దానిని వెలికి తీస్తానని పేర్కొంటూ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం.  నిపుణుల కమిటీ నివేదిక మేరకు ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనాలను పెంచారని జగన్ సర్కారు భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ దిశగా అడుగులేస్తోంది. అయితే తాజాగా పోలవరం టెండర్లను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం పట్ల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు 2019’పై టీడీపీ ఎంపీ జయదేవ్ నిన్న పార్లమెంట్‌లో మాట్లాడారు.  పోలవరం ప్రాజెక్టుకు రూ.55 వేల కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని పేర్కోన్నారు. ఏపీ ప్రజలు పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు 150 ఏళ్ల క్రితం కట్టినవి. రాష్ట్రంలో ఉన్న మరో 50 డ్యామ్‌లు, రిజర్వాయర్లు పాతవని, ఈ డ్యామ్‌ల భద్రత గురించి ఏ చర్యలు తీసుకుంటున్నారని గల్లా జయదేవ్ కేంద్ర మంత్రిని ప్రశ్నించారు.  అయితే గల్లా జయదేవ్ ప్రశ్నల పట్ల స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు వ్యయం కచ్చితంగా పెరుగుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కచ్చితంగా చెప్పాలేని పరిస్థితులు ఏర్పడతాయని కూడా అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దీని వ్యయాన్ని కేంద్రమే భరిస్తోందని, అలా ఇప్పటి వరకూ కేంద్రం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని అందులో రూ.3 వేల కోట్లకు సంబంధించి ఆడిట్ పూర్తయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.  ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కొత్తగా టెండర్లను పిలవాలనుకోవడం ఈ పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బందిగా మారనుందని ఆయన పేర్కొన్నారు. అలా పిలవడం వలన ప్రాజెక్టు వ్యయం మళ్ళీ పెరుగుతుందని మంత్రి తెలిపారు. టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టు మీద పడుతుందని, ప్రాజెక్ట్ వ్యయం పెరగడంతో పాటు సమయం కూడా వృధా అవుతుందని అన్నారు.  అందుకే గత రాష్ట్ర ప్రభుత్వం అందుకే టెండర్లను రద్దు చేయకుండా ప్రాజెక్ట్ వేగాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించిందని ఆయన పేర్కోన్నారు. అయితే పోలవరం మీద కేంద్ర మంత్రి ఇలా స్పందించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిని బట్టి చూస్తే జగన్ చేస్తున్న పనిని కేంద్రం వ్యతిరేకిస్తోంది, మరి జగన్ ఏమని కవర్ చేసుకుంటారో చూడాలి మరి.

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంప ముంచిన గంటలకొద్దీ సమీక్షలు

  అధికారులు.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాలి. కానీ చంద్రబాబు.. సమీక్షల పేరుతో అధికారులను గంటల కొద్దీ బందీ చేసి.. ప్రజలకు అందుబాటులో లేకుండా చేసారు. చివరకు ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు అందుబాటులో లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించి ప్రజలకు దూరమయ్యారు. పాలన తీరు గురించి, ప్రజల బాగు గురించి సమీక్షలు నిర్వహించడం మంచిదే. కానీ అదే పనిగా సమీక్షలు చేస్తూ.. అధికారులను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయకూడదు. బాబు అమరావతిలో ఉంటే చాలు.. సమీక్షలు అంటూ, టెలీకాన్ఫెరెన్స్ లు అంటూ పొద్దున నుండి సాయంత్రం వరకు అధికారులను గదులకు పరిమితం చేసేవారు. దీంతో ఈ గంటల గంటలు సమీక్షలు ఏంట్రా బాబు అంటూ అటు అధికారుల్లో అసహనం పెరిగింది, అలాగే ఇటు ప్రజల్లోనూ అధికారులు అందుబాటులో లేకుండా పోయారన్న అసంతృప్తి వ్యక్తమైంది. ఇలా బాబు సమీక్షల చాదస్తం టీడీపీకి పెద్ద నష్టం చేసింది.

సిద్ధార్ధను దేశమే చంపేసిందా?

  దేశీయ కాఫీ రుచిని విశ్వ వ్యాప్తం చేసిన కాఫీ బ్రాండ్ అంబాసిడర్ 'కేఫ్ కాఫీ డే' ఫౌండర్ దుర్మరణం ఒక వ్యవస్థీకృత హత్య అనేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఆయన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంత తీవ్ర చర్యకు నెట్టివేయబడడానికి కారణాలు ఏమిటి ? ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఆయన రాసినట్టుగా భావించబడుతున్న లేఖ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. దేశ వ్యాప్తంగా అనంతమైన ఆవేదనను అంతులేని ప్రశ్నలను మిగిల్చిన సిద్దార్ధ మరణం దేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అనేక సమాధానం దొరకని జీవన్మరణ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రధానంగా ఈ లేఖలో ప్రైవేట్ పెట్టుబడి ప్రదాతలు మరియు ఆదాయ పన్ను అధికారుల వేధింపులు కారణాలుగా కనబడుతున్నాయి. ఈ ప్రైవేటు పెట్టుబడి ప్రదాతలు వారికిచ్చిన వాటాలను తిరిగి కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం ఒక వ్యవస్థీకృత సమస్య. భారత దేశ కార్పొరేట్ రుణ మార్కెట్ ఒక పనికి మాలిన, పనికి రాని పేలవమైన వ్యవస్థ. షేరు విలువ అప్పు తనఖా కంటే తగ్గిపోయినప్పుడు పారిశ్రామికవేత్తలను అకాల మరణానికి నెట్టివేసే మన దేశం యొక్క చట్టపరమైన రుణ మార్కెట్ ఇన్ఫరాస్ట్రక్చర్ ఒక దివాళాకోరు స్థితిలో ఉంది.  కాఫీ డే మన దేశంలో ఒక సుప్రసిద్దమైన విజయవంతమైన బ్రాండ్. కాఫీ డే అనే పదం నవ భారత పాప్ సంస్కృతిలో, అలాగే యువత జీవన శైలిలో భాగం అయ్యింది. భారత నగరాలూ, పట్టణాలలో యువత హ్యాంగౌట్ స్పాట్ గా స్టార్ట్అప్స్ కి, సమావేశాలకు ఎన్నో ప్రణయ ప్రేమ బంధాలకు వేదికయ్యింది. ఈ బ్రాండ్ నిర్మాత అయిన సిద్దార్ధ.. ఏ అమెరికా లాంటి ఫంక్షనల్ రుణ మార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉండి ఉంటే.. అతనికి డబ్బు కానీ ఋణం కానీ సమకూరడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ మన దేశంలో సిద్దార్థ లాంటి పారిశ్రామిక వేత్తలు.. బంధువులు నుండో, మిత్రుల నుండో పీఈ ప్రొవైడర్స్ నుండో డబ్బు తీసుకోవాల్సి వస్తుంది. పీఈ నిధుల కోసం అయ్యే ఫైనాన్సింగ్ ఖర్చు చాలా ఆధికం. వివిధ కార్పోరేట్ ఆస్తులను తనఖాగా ఇవ్వడానికి తగిన న్యాయపరమైన ఆమోదం లేక పోవడం వలన పీఈ నిధులు ఖరీదు గానూ, ప్రమాదంగానూ మారుతున్నాయి.  చాలా సందర్భాల్లో పీఈ పెట్టుబడులను దోపిడీగానే అనుకోవాలి. ఈ సందర్భంలో పీఈ సంస్థలను నిందించి ప్రయోజనం లేదు. మన దేశంలో ఒక శక్తివంతమైన రుణ మార్కెట్ ని అధివృద్ది చేయాల్సిన అవసరాన్ని సిద్దార్ధ మరణం ముందుకు తెస్తోంది. మంచి పరపతి గల కంపెనీలకి, ట్రిపుల్ ఏ రేటెడ్ పేపర్లతో జంక్ బాండ్ లను జారీ చేయగల రుణ మార్కెట్ ని భారత్ అభివృద్ధి చేయాలి. ఋణం, వడ్డీ, కరెన్సీ వంటి అన్ని రకాల రిస్కులను నిరోధించడంతో పాటు సమర్ధవంతమైన, వేగవంతమైన, చట్టపరమైన రుణ మార్కెట్ కల్పన నేటి తక్షణ అవసరం. అలాగే అధికారులు పన్ను చెల్లింపు దారుల మధ్య సహృద్భావమైన సంప్రదింపులు, సంబంధాలు మరింత మెరుగుపడాలి. పారిశ్రామిక వేత్తలు దోపిడీ దారులు అనే వామపక్ష దురభిప్రాయ సంస్కృతి నుండి దూరం కావాలి. వామపక్ష భావజాలంతో ప్రభావమైన మీడియా.. పారిశ్రామికవేత్తలను దొంగలుగా చిత్రీకరించే ఒక దురలవాటును వదులుకోవాలి. దేశ ఆర్ధిక అభివృద్ధిలో కీలక భూమిక పోషించే వ్యాపారవేత్తలు దేశ నిర్మాతలనే స్పృహతో వ్యవహరించాలి. ఎన్నో ఆర్ధిక, కుటుంబ, సామాజిక ఒత్తిడులను, రిస్కులను తీసుకుంటూ పెళ్ళాం పుస్తెలు, మిత్రుల నుండి అప్పులు చేసి పలువురికి ఉపాధి కలిపిస్తూ.. ప్రత్యక్ష-పరోక్ష పన్నులు చెల్లిస్తూ మరింత మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తూ.. ఇతర అనుబంధ పరిశ్రమలకి వ్యాపారాన్ని ఇస్తూ, సంపద సృష్టిస్తూ, చందాలు, సామజిక కార్యక్రమాలకి నిధులు ఇస్తూ సమాజం యొక్క నిర్దయకు నిష్టూరానికి, నష్టానికి, కష్టాలకి గురి అవుతూ అంతర్ధానం అయ్యే ఎందరో పారిశ్రామిక వేత్తలకు సిద్దార్ధ ప్రాయోపవేశం ఒక ఉదాహరణ.

రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి ? పోలవరానికి లాభమా ? నష్టమా ?

  ఆంద్రరాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినవచ్చే మొదటి మాట రివర్స్ టెండరింగ్. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కాంట్రాక్టర్ అయిన నవయుగ సంస్థను తొలగించడంతో ఈ చర్చ మరింత ముందుకువచ్చింది. ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ప్రభుత్వ ప్రాజెక్ట్ లను రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా చేపడతామని కొత్త ప్రభుత్వం చెబుతోంది. జ్యుడీషియల్ కమిషన్ యొక్క పర్యవేక్షణలో న్యాయమూర్తులు నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ ని ఆంద్రప్రదేష్ లో మొదటి రివర్స్ టెండరింగ్ ప్రాజెక్ట్ గా పోలవరం ప్రాజెక్ట్ నిలుస్తోంది.  బాబు పాలనలో జరిగిన అవకతవకలను అవినీతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ పోలవరం ప్రాజెక్ట్ ని తోలి రివర్స్ టెండరింగ్ ప్రాజెక్ట్ గా సూచిస్తూ  తన రిపోర్ట్ ని గత వారం అందించింది. కావాలనే నిర్మాణంలో తాత్సారం చేసినప్పటికీ ఎటువంటి జరిమానా లేకుండా అప్పటి ప్రభుత్వ అనేక సార్లు  వారికి సమయాన్ని పొడిగించినట్టుగా ప్యానెల్ కనుగొంది. అప్పటి అధికార యంత్రాంగం ఈ తాత్సారానికి జరిగిన నష్టానికి ఎటువంటి జరిమానా కానీ పరిహారం కానీ విధించక పోవడం ప్రభుత్వ యంత్రాంగంలోని సామర్ధ్య లోపంగా ప్యానెల్ పేర్కొంది. కాంట్రాక్ట్ నిభందనలకు అనుగుణంగా ఒప్పందకాల పరిమితులలో కాంట్రాక్టర్ లకి కేటాయించిన పనులను వారు పూర్తి చేయలేదని నిపుణుల ప్యానెల్ అభిప్రాయపడింది. అంతేకాకుండా వారు కావాలనే పనిని తాత్సారం చేసి అధిక రేట్ల సవరణను డిమాండ్ చేసినట్టు పేర్కొంది.   మొత్తం ఎనిమిది మంది కాంట్రాక్టర్లు  ఒప్పంద తేదీ నుండి ఇరవై నాలుగు నెలలలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది, కానీ నిర్మాణాలు పూర్తి కాక పోయినా ప్రభుత్వాన్ని నిర్మాణ వ్యయాన్ని పెంచమని కోరడం ప్రభుత్వం అంగీకరించడం ఆ విధంగా కాంట్రాక్టర్ లకి దాదాపు 3800కోట్ల మేర రేట్లు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, తిరిగి టెండర్ చేయడానికి ఒక బిల్లును ఆమోదించింది.  వంద కోట్ల పైగా వ్యయం అయ్యే ఏవైనా పెద్ద ప్రాజెక్టులలో అవినీతి అవకతవకలు  ధర పెరుగుదల కనిపిస్తే వాటిని తాజా బిడ్డింగ్ ద్వారా రివర్స్  టెండరింగ్ నిర్వహించాలని భావిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. ప్రభుత్వం  రివర్స్ టెండరింగ్ ద్వారా మరొక్కసారి బిడ్డింగ్ కి వెళ్లి ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ కోట్ చేసిన వారికి ఈ నిర్మాణ పనులని ఇవ్వాలని నవంబర్ పదకొండు నుండి ప్రాజెక్ట్ పనులు మళ్ళీ ప్రారంభించాలని భావిస్తోంది. రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి ? అనే విషయంలోకి వెళితే, ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధమైన మారు వేలం, దీనిలో కాంట్రాక్టర్ లు ప్రభుత్వాల పాత్రలు తారుమారు అవుతాయి. దీనిలో ప్రభుత్వం ఒక వైపు కాంట్రాక్టార్ లు అందరూ మరో వైపు పాల్గొంటారు. మామూలు వేలంలో కొనుగోలు దారులు తమకు కావాల్సిన వస్తువు అధిక ధరతో పొందడానికి పోటీ పడతారు.  దీనికి విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వం కాంట్రాకర్ ల వద్ద నుండి అధిక మొత్తంలో నిర్మాణ వ్యయాన్ని ఆదా చేసుకోడానికి వారి మధ్య పోటీ పెంచుతుంది. కాంట్రాక్టర్ లు ఒకరి మీద ఒకరు పోటీగా తాము తక్కువ ధరకు చేస్తామంటే తాము తక్కువ ధరకు చేస్తామని నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తారు. రివర్స్ టెండరింగ్ వేలం పాట లాగే ఉంటుంది. కానీ ఈ రివర్స్ టెండరింగ్ విధానం సాఫ్ట్వేర్ ఆధారంగా నడిచే ఆన్ లైన్ లో జరిగే ఆక్షన్ వ్యవస్థ. ఈ ఆన్ లైన్ వేలంలో ఒకరి ధర మరొకరు చూసుకుని తమ కోట్ ను తెలియచేస్తారు.  ఇది అత్యంత పారదర్శకంగా వేగవంతంగా నూతన సాంకేతిక విధానంలో జరగడం వలన ప్రాజెక్ట్ వ్యయంలో గణనీయమైన ఆదా చేయడం సాధ్యం అవుతుంది. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ప్రభుత్వ సంస్థల కొనుగోళ్లు ఈ విధానంలో నిర్వహిస్తున్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విధానానికి నాంది పలుకుతోంది. ఇక్కడొక కొసమెరుపు ఏంటంటే దేశంలో ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఈ ప్రొక్యూర్మెంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ కార్యాచరణలో ఆవిష్కరించిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడికి చెందుతుంది.   

అడ్డా కూలీల కడుపు కొడుతున్న ఇసుక కొరత !

  భవన నిర్మాణంలో ముడి సరుకయిన ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన నియంత్రణ, దాదాపు నలభై లక్షల పైగానే ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆ రంగం పై ఆధార పడ్డ ఉపాధి వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇసుక నిషేదం, నిరోధము, నియంత్రణ అన్నీ కలగలిసి గందరగోళం ఏర్పడుతోంది. భవన నిర్మాణంలో ఇసుక కేవలం ఒక ముడి పదార్దమే కాదు ఇంకా ఎక్కువనే చెప్పాలి.  నిజానికి ఇసుక సరఫరా ఆగిపోవడం తో రాష్ట్రము లోని పలు ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగ పరిశ్రమలో తీవ్ర ప్రభావం పడింది. భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్ డీలర్లు, ఐరన్, చిప్స్ వ్యాపారస్తులు, రవాణా రంగానికి చెందిన రిక్షా, ఆటో కార్మికులు, తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగి మేస్త్రీలు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర వృత్తుల వారు గత కొన్నాళ్లుగా ఉపాధి లేక విలవిలల్లాడుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ప్రకటించడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం రద్దయినట్టయ్యింది. అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుక దొంగ వ్యాపారం, స్మగ్లింగ్ వంటి సమస్యల వలన ఈ కొత్త విధానం అవసరం అయ్యిందని జగన్ ప్రభుత్వం చెబుతోంది. పదిహేను రోజుల్లోనే ఈ విధానం అమలులోకి వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం దాదాపుగా నెలా పదిహేను రోజులు అయినప్పటికీ ఇంకా ఈ నిషేదం కొనసాగించడం భవన నిర్మాణ రంగం మీద ఆధార పడ్డవారికి తీవ్ర ఇబ్బందులు కలగ చేస్తోంది.  ప్రభుత్వ చర్యలు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాల్సినవి పోయి లేని కొత్త సమస్యలను సృష్టించేవి కావడం శోచనీయం. దీంతో ఇసుక ధర ఆకాశాన్ని అంటుతోంది, అధికార యంత్రాంగం ఇతర జిల్లాల నుంచి ఇసుక సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది.  ఒక్క గుంటూరు జిల్లాలోనే దాదాపుగా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉండడంతో అధికారులు ఈ కొరతను తీర్చడానికి గోదావరి జిల్లాల నుండి ఇసుకని తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ కొరత వలన బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఇసుక ధరను అమాంతం ఆకాశానికి ఎత్తేసారు. సాధారణంగా నాలుగువేల రూపాయలుగా ఉండే ట్రక్ లోడు ఇసుక ధర అమాంతంగా ఇరవై వేలకి చేరింది. ఈ కొత్త ఇసుక విధానంలో ఇసుక రీచ్ లలో జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంటాయి, ఇసుకను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన సరఫరా చేస్తారు, స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో కావాల్సిన ఇసుక కోసం అప్ప్లై చేసుకుని రసీదు తీసుకుని సంబంధిత ఇసుక రీచ్ నుండి ఇసుకను పొందాల్సి ఉంటుంది.  ప్రభుత్వం నిర్మిస్తున్న గృహనిర్మాణ  ప్రాజెక్ట్ లకి తోలి ప్రాధాన్యత గానూ, వ్యక్తిగత గృహ నిర్మాణాలకు ఇతర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకి రెండవ ప్రాధాన్యతగానూ, అపార్ట్మెంట్ లకి మూడవ ప్రాధాన్యతగానూ ఈ విధానం రూపొందించబడింది. ప్రస్తుత ధర ప్రకారం ట్రక్ ఇసుక రేటు మూడు వందలగానూ ముప్పై రూపాయల లోడింగ్ ఛార్జ్ గాను ఉన్నది. ఈ ఇసుక కొరత వలన సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజల స్వగృహ స్వప్నం ఆలస్యం అవుతోంది.   ప్రభుత్వ విధానాలు గతంలో జరిగిన తప్పులను సమీక్షిస్తూనే నిర్మాణ కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకోకుండా తీసుకున్న ఇటువంటి అనాలోచిత చర్య వలన రెక్కాడితే కానీ డొక్కాడని అసంఘటిత కార్మిక వర్గం రోడ్డున పడింది. రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు అయిన విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో నిర్మాణ పనులన్నీ నిలిచి పోయాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు ఆటకం లేకుండా, గత ప్రభుత్వం అవలంభించిన అవకతవక విధానాలను సమీక్షిస్తూనే నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది .

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రవీంద్ర...ఏపీ సీఎం సెక్యూరిటీ కోసమా ?

  ఏపీ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లీయర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతించింది. దీంతో రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్‌ను  తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ఆ తర్వాత స్టీఫెన్ ను ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారు.  నిజానికి స్టీఫెన్ రవీంద్ర తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ గల ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో మొదటగా వరంగల్ జిల్లా పరకాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2004లో ఆడిషనల్ ఎస్పీగా అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పని చేశారు. తర్వాత, వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. వరంగల్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీగా బదిలీ అయిన తర్వాత అక్కడి ఫ్యాక్షన్ ను కంట్రోల్ చేసి మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.  తరువాత అప్పటి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌‌గా పని చేయడంతో పాటు  వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయన మారారు. వైఎస్ మరణానంతరం 2009లో కరీంనగర్ ఎస్పీగా ఆయన భాద్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ డీసీపీగా భాద్యతలు చేపట్టారు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఓయూలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కట్టడి చేయగలిగారు. ఇక ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు. రెండు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు ఇప్పుడు ఆయన ప్లేస్ లోనే ఈయన ఛార్జ్ తీసుకోనున్నారని అంటున్నారు. నిజానికి గతంలో ఈ పదవిలో ఏబీ వెంకటేశ్వరరావు ఉండేవారు. చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తుండేవి.  పోలీసు అధికారిగా కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్‌ కేటాయించాలో ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ వెంకటేశ్వరరావు చెబితేనే సీఎం అమలు చేస్తాడని వైసీపీ ఆరోపించింది. అంతే కాక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏబీ కీలక పాత్ర పోషించారని కూడా విమర్శలున్నాయి. పోలీస్‌ అధికారిగా కాకుండా బాబు పార్టీ కార్యకర్తగా ఆయన పని చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మరి అలాంటి కీలక పదవిలో తమకి అనుకూలంగా సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న స్టీఫెన్ రవీంద్రని తెచ్చి పదవిని కట్టబెట్టడం ఎంతవరకు లాభిస్తుందో చూడాలి మరి.