ఈసారి ఎవరిది పైచేయి అవుతుంది? రేవంత్ దా? కేసీఆర్ దా?

అందరిలా రుచీపచీ లేకుండా విమర్శలు చేయడు, పాత చింతకాయ పచ్చడిలా అసలే మాట్లాడడు, సెన్షేషనల్ కామెంట్స్ చేస్తాడు, అవసరమైతే బూతులు జోడిస్తాడు, కేసీఆర్ స్టైల్లోనే సన్నాసులు, వెధవలు అంటూ ఘాటుగా సమాధానమిస్తాడు, పంచ్ డైలాగ్ లతో అటు మీడియాని, ఇటు జనాన్ని తనవైపు తిప్పుకుంటాడు, ప్రత్యర్ధుల గుండెల్లో మంట పుట్టిస్తాడు, అందుకే ఇప్పుడు మరోసారి అసెంబ్లీలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాడు.   అనుమల రేవంత్ రెడ్డి, కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కంట్లో నలుసులా మారిన ఫైర్ బ్రాండ్ లీడర్, ఒక్క కేసీఆర్ కే కాదు...రేవంత్ మాట్లాడితే ప్రత్యర్ధుల్లో ఎవరి గుండెల్లోనైనా మంటపుడుతుంది. ప్రతి విషయాన్నీ చాలా తెలివిగా లాజిక్ గా మాట్లాడతాడు, అతని మాటల్లోని ఆవేశం కసి లేవనెత్తే అంశాలు అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేస్తాయి, అందుకే అసెంబ్లీ అయినా బయటైనా ప్రత్యర్ధులకు అతనే టార్గెట్ అవుతాడు. గత అసెంబ్లీ సమావేశాల్లో సభ జరిగినన్ని రోజులూ రేవంత్ ను సస్పెండ్ చేశారంటే అధికార పార్టీ ఎంతగా భయపడుతుందో అర్థమవుతుంది. కేసీఆర్ కూతురు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దీనికి ముందు సమావేశాల్లోనూ రేవంత్ ను సభ నుంచి సస్పెండ్ చేశారు, అంటే ఏదోఒక వంకతో రేవంత్ ను సభలో లేకుండా చేస్తున్నారనేది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం, ప్రత్యర్ధులకు సింహస్వప్నంలా మారే ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఇబ్బంది పెడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంతే, అందుకే తెలివిగా ఓటుకు నోటు కేసులో ఇరికించారు, రేవంత్ దూకుడును తగ్గించాలని భావించారు, కానీ రేవంత్ దూకుడు డబుల్ చేశాడు, మునుపటి కంటే ఘాటుగా విరుచుకుపడుతున్నారు, అందుకే ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సెషన్స్ లో అందరి దష్టి రేవంత్ పై పడింది.ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడతాడు, ఓటుకు నోటు కేసు ఇష్యూని ఏవిధంగా ఎదుర్కొంటాడనే దానిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేల్లోనూ చర్చ జరుగుతోంది. రైతు ఆత్మహత్యలు, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో తెలంగాణకు 13వ ర్యాంకు, ఏడాదిన్నరలో 51వేలకోట్ల కొత్త అప్పులు ఇలా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ఏకిపారేసుందుకు రేవంత్ మిస్సైల్ లా రెడీగా ఉన్నాడు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో విపక్షాల మధ్య పెద్దగా సఖ్యత లేకపోవడం ప్రభుత్వానికి కలిసిరాగా, ఈసారి అలాంటి పప్పులుడవంటున్నారు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఈసారి మూకుమ్మడిగా దాడి చేసే అవకాశముందని, అది రేవంత్ కి కలిసొస్తుందని చెబుతున్నారు, ఒకవేళ విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, రేవంత్ కి అండ దొరికితే రేవంత్ రెచ్చిపోవడం ఖాయమంటున్నారు. అయితే ఓటుకు నోటు కేసు ఇష్యూతో రేవంత్ నోరు మూయించాలని టీఆర్ఎస్ వ్యూహం సిద్ధంచేసుకుంది. ఏదోవిధంగా రేవంత్ ను రెచ్చగొట్టి అసెంబ్లీ నుంచి బయటకు పంపాలని స్కెచ్ గీసుకుంది.  మరి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

అసలు తప్పు ఎక్కడ జరిగింది?, వైఫ్యలం ఎవరిది?...బందరు పోర్టుపై ఎక్స్ క్లూజివ్ స్టోరీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33వేల ఎకరాలకు పైగా భూములు సమీకరించిన(ల్యాండ్ ఫూలింగ్) ప్రభుత్వానికి బందరు పోర్టు విషయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది, ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని కోసం సమీకరించగలిగిన ప్రభుత్వం, మచిలీపట్నం పోర్టు విషయంలో విఫలమైంది, అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రభుత్వ యంత్రాంగం లోపమా? లేక ప్రజలను ఒప్పించడంలో మంత్రులు, మచిలీపట్నం ఎంపీ విఫలమయ్యారా?, ముందు 30వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత 14వేల ఎకరాలే చాలు, పైగా భూసేకరణ కాదు, సమీకరణే అనడంలో అర్థమేమిటి? ప్రభుత్వం గందరగోళంలో ఉందా? ఎలాంటి కసరత్తు లేకుండానే గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటుందా?... చదవండి ఎక్స్ క్లూజివ్ స్టోరీ   పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, వేలాది మందికి పని దొరుకుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ప్రజల జీవనశైలి మెరుగవుతుంది, అయితే ఇవన్నీ జరగాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే వాటికి అనువైన చోట భూములు ఇవ్వాలి(ఎక్కడో అడవుల్లో ఇస్తానంటే పారిశ్రామికవేత్తలు ముందుకురారు), భూములు ఇవ్వాలంటే...రైతులు ఒప్పుకోవాలి, ఇక్కడే బ్రేకులు పడుతున్నాయి, భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు, భూములనే నమ్మకుని బతుకుతున్నాం, భూములు ఇచ్చేస్తే తామెలా బతకాలంటూ బోరుమంటున్నారు, సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ వైఫల్యమూ కనిపిస్తుంది, భూములిచ్చే రైతులకు నమ్మకం కలిగించడంలో విఫలమవుతోంది, మేమున్నామంటూ భరోసా ఇవ్వడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. మచిలీపట్నం పోర్టు భూసేకరణ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించడానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ ప్రజాప్రతినిధులపై గ్రామస్తులు తిరుగుబాటు చేశారంటే, దానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే, రైతులకు భరోసా కల్పించకపోవడంలో అమాత్యులు ఘోరంగా విఫలమయ్యారు, పోర్టు అనుబంధ పరిశ్రమలతో ఎలాంటి మేళ్లు జరుగుతాయో వివరించలేకపోవడం, ఆ ప్రాంతం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పలేకపోవడం, ముఖ్యంగా భూములు కోల్పోయే రైతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై నమ్మకం కలిగించలేకపోవడం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యంగానే చెప్పుకోవాలి. పోర్టు అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టులు, టాన్స్ పోర్టేషన్...ఇలా అనుబంధ పనులన్నీ రైతులు, వాళ్ల కుటుంబ సభ్యులకే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే భూములు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చంటున్నారు. రైతుల ఆవేదనలోనూ అర్థముంది,భూములిస్తే తామెలా బతకాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం పరిష్కారం చూపగలిగితే సమస్య తీరినట్లే, పైగా అక్కడ ఎలాంటి పరిశ్రమలు వస్తాయనే దాని మీద క్లారిటీ లేదు, పోర్టు నుంచి ఎక్కువగా ఎగుమతులు జరిగితే స్థానికులకు ఉద్యోగాలు,ఉపాధి దొరుకుతాయి, మరి బందరు పోర్టు నుంచి ఎక్స్ పోర్ట్ చేయడానికి ఆ ప్రాంతంలో ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బందరు పోర్టు నుంచి పెద్దఎత్తున ఎగుమతులు జరిగే పరిస్థితి లేకపోతే, అనుబంధ పరిశ్రమలు వచ్చేదీ అనుమానమేని అంటున్నారు, ఈ అనుమానాలన్నింటినీ నివత్తి చేస్తేనే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొస్తారు.అయితే ‘తెలుగువన్‘ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బందరు పోర్టుకు అనుబంధంగా ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలు రానున్నాయని తెలుస్తోంది, నాగాయలంక పరిసర ప్రాంతాల్లో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు ఓఎన్జీసీ సెర్చింగ్ లో తేలినట్లు తెలుస్తోంది, అందుకే ఓఎన్జీసీ ఇండియా సౌత్ హెడ్ ఆఫీస్ ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట, అదే నిజమైతే కనుక బందరు పోర్టు నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతికి అవకాశముందని అంటున్నారు. అయితే రైతుల నుంచి తీసుకునే భూమికి తగినట్లుగా ఆయా పరిశ్రమల్లో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, అనుబంధ పనులు మొదలైనవాటిని అప్పగిస్తామనే నమ్మకం కలిగించాలని, అవసరమైతే చట్టం తేవాలని, అప్పుడే భూములు ఇవ్వడానికి రైతులు ముందుకొస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఇండియాలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం కలిగిన ఆంధప్రదేశ్ లో ఇప్పటికే అనేక పోర్టులు ఉండగా కార్యకలాపాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలుస్తోంది. ప్రధాన పోర్టులైన విశాఖ, కాకినాడ నుంచి మోస్తరు స్థాయిలో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నా, మిగతా పోర్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆపరేషన్స్ జరగడం లేదని అంటున్నారు. గతంలో ఏపీ నుంచి ఐరన్ ఓర్ అధికంగా ఎగుమతి అయ్యేదని, కానీ ఇఫ్పుడా పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.వైఎస్ హయాంలోనే ఐరన్ ఓర్ మొత్తం ఊడ్చేశారని, ప్రస్తుతం గ్రానైట్ మాత్రమే ఎగుమతి అవుతోందని చెబుతున్నారు, కాకినాడ పోర్ట్ నుంచి ఎరువులు, కళింగపట్నం నుంచి గ్రానైట్ ఎగుమతి అవుతుండగా, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు పోర్టుల్లో పెద్దగా కార్యకలాపాలు లేవంటున్నారు, ఇవే ఇలాగుంటే కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపూర్, నిజాంపట్నం, వాడరేవు, ముత్యాలమ్మపాలెం, నక్కపల్లి, మేఘవరం పోర్టులు ఎలా మనుగడ సాగిస్తాయని అంటున్నారు.పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున జరగకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఇదంతా పక్కనబెడితే బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం 30వేల ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత నాలుక్కరుచుకుంది, రైతుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోబోతోంది, మొదట్లో చెప్పినట్లుగా 30వేల ఎకరాలు కాకుండా 14వేల ఎకరాలను మాత్రమే భూసమీకరణ కింద తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు, ఇదే విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా ప్రకటించారు, అయితే ముందు 30వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత 14వేల ఎకరాలే చాలనడం...అదీ భూసమీకరణ చేస్తామనడం చూస్తుంటే...ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటుందోమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపక్షాల ఐఖ్యత చూసి తెరాస ప్రభుత్వం భయం పడుతోందా?

  ఈరోజు నుండి తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. మొదట మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కొన్ని రోజుల క్రితం మరణించిన ఎమ్మెల్యే కృష్ణా రెడ్డికి శ్రద్దాంజలి ఘటించిన తరువాత ఉభయసభలకి ఐదురోజులు శలవు తీసుకొంటాయి. మళ్ళీ 29వ తేదీ నుండి సమావేశాలు మొదలవుతాయి. ఈరోజు మధ్యాహ్నం బి.ఏ.సి. సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయం ఖరారు అవుతుంది.   ఈసారి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల వద్ద అవసరమయిన ‘సబ్జెక్ట్’ ఏమీ లేదని, అయినప్పటికీ శాసనసభ్యులు అందరూ తమతమ నియోజక వర్గాలలో సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం సేకరించుకొని సభకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల వద్ద ‘సబ్జెక్ట్’ ఏదీ లేదని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే ప్రతిపక్షాలను చూసి భయపడవద్దని ఆయన తన సభ్యులకు దైర్యం చెపుతున్నట్లుంది. ఎందుకంటే, రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి.   అదేవిధంగా జి.హెచ్.యం.సి. పరిధిలో సుమారు 25లక్షల ఓట్లను తొలగించడంపై కూడా అన్ని పార్టీలు ఏకమయ్యాయి. మావోయిస్ట్ అజెండాని అమలుచేస్తున్నామని చెప్పుకొంటున్న తెరాస ప్రభుత్వం వరంగల్లో భూటకపు ఎన్కౌంటర్ చేయడం వంటి అనేక అంశాలపై అన్ని పార్టీలు ఏకమై పోరాటాలు చేస్తున్నాయి. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా ఆక్టివ్ అయింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఇదివరకులా శాసనసభలో మెత్తగా వ్యవహరించే అవకాశాలు లేవు.   ఓటుకి నోటు కేసులో నెలరోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ఆయన కూడా తెరాస ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయడం తధ్యం. కనుక శాసనసభలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం తెరాస ప్రభుత్వానికి ఈసారి చాలా కష్టం అవ్వవచ్చును. బహుశః అందుకే కేసీఆర్ తన ఎమ్మెల్యేలని భయపడవద్దని చెపుతున్నట్లుంది తప్ప నిజంగా ప్రతిపక్షాల వద్ద సబ్జెక్ట్ లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నితీష్ కుమార్ X ములాయం సింగ్

  నిన్న మొన్నటి వరకు కూడా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన జనతా పరివార్ కు గుడ్ బై చెప్పేసి బయటకి వెళ్ళిపోయినా తరువాత ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీతో రహస్య అవగాహన కుదుర్చుకొన్నందునే ఆయన జనతా పరివార్ ని విడిచిపెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. ములాయం సింగ్ కూడా నితీష్ పై బాణాలు వేయడం మొదలుపెట్టారు.   ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నితీష్ కుమార్ లో నుంచి ఒక సరికొత్త ‘సెక్యులర్ నితీష్’ పుట్టుకొస్తున్నాడని ఆయన ఎద్దేవా చేసారు. ఎందుకంటే అంతకు ముందు నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలో ఉండేవారు. బీజేపీ మద్దతుతో బీహార్ లో ప్రభుత్వం నడిపారు. కానీ ఎన్డీయే నుండి బయటకు వచ్చేసిన తరువాత నుండి బీజేపీకి దూరం అయ్యారు. ఇంతకు ముందు ఏ బీజేపీతో అంతకాగేరో ఇప్పుడు అదే బీజేపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. అందుకే సెక్యులర్ నితీష్ పుట్టుకొచ్చాడని ములాయం సింగ్ ఎద్దేవా చేసారు. దానికి నితీష్ కూడా అంతే దీటుగా బదులిచ్చారు.   ములాయం సింగ్ తనేమయినా సెక్యులర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సిలర్ గా భావిస్తున్నారేమో కానీ మేము మాత్రం ఆ యూనివర్సిటీలో రీసర్చ్ స్కాలర్స్ కామని ఆయన గ్రహిస్తే బాగుంటుంది. రెండేళ్ళ క్రితమే నేను బీజేపీతో సంబంధాలు తెంపుకొన్నాను. కనుక ఎన్నికల కోసం నేను సెక్యులర్ వేషాలు కట్టనవసరం లేదు. జనతా పరివార్ ని ఎదుర్కోవడానికి ఆయన సెక్యులర్ వేషం కదతారేమో చూద్దాం,” అని చురకలు వేశారు.   ఇంతకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కూడా ఇలాగే చాలా ఘాటుగా విమర్శలు చేసుకొనే వారు. కానీ అకస్మాత్తుగా బంధుత్వాలు కూడా కలుపుకొని ప్రాణ స్నేహితుల్లాగా మసులుతున్నారిప్పుడు. కనుక ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి ములాయం సింగ్ తో దోస్తీ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ ఎన్నికలు పూర్తయ్యేవరకు బీహార్ ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ పార్టీలన్నీ బద్ద శత్రువులలాగే నటించకా తప్పదు...ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోకా తప్పదు.

బి.సి.సి.ఐ.లో డర్టీ గేమ్స్

  జగ్మోహన్ దాల్మియా మరణించడంతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ పై పట్టు సాధించేందుకు అప్పుడే రాజకీయపార్టీలు పావులు కదపడం మొదలుపెట్టాయి. అనారోగ్య కారణంగా దాల్మియా చాలా రోజులుగా తన విధులకు హాజరుకానప్పుడు బీజేపీ ఎంపీ మరియు బి.సి.సి.ఐ. కార్యదర్శి అనురాగ్ టాకూర్ ఆ బాధ్యతలను నిర్వహించేవారు. కనుక ఇప్పుడు ఆయన బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవికి రేసులో పోటీ పడుతున్నారు. అధికార పార్టీకి చెందినవారు కావడం ఆయనకు కలిసివచ్చే అంశం.   వృదాప్యం, అనారోగ్య కారణాలుగా రాజకీయాల నుండి రిటైర్ అవ్వాలనుకొంటున్న ఎన్సీపి అధినేత శరద్ పవార్ కూడా బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవి చేప్పట్టాలని తహతహలాడుతున్నారు. రాజకీయాలతో బాటు క్రికెట్ బోర్డుపై కూడా చాలా కాలంగా పెత్తనం చేస్తున్న ఆయన తనకున్న పరిచయాలు, పరపతిని ఉపయోగించుకొని అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారు. చాలా కాలంగా బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నసీనియర్ కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా కూడా ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.   మరో రెండు వారాల్లోగా బి.సి.సి.ఐ. జనరల్ బాడీ సమావేశం నిర్వహించబడుతుంది. అందులో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. కానీ ఆలోగా తెరవెనుక పావులు కదిపి బోర్డు సభ్యులు అందరినీ ఎవరు తమ వైపు త్రిప్పుకోగలరో వారే అధ్యక్షులుగా ఎన్నుకోబడుతారు. అందుకే ముగ్గురూ ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టేశారు. క్రికెట్ ఆటకి ‘జెంటిల్ మెన్స్ గేమ్’ గా పేరుంది. కానీ ప్రస్తుతం బి.సి.సి.ఐ. బోర్డులో రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, తెర వెనుక రహస్య మంతనాలతో ఒక డర్టీ గేమ్ సాగుతోంది.

రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకమేనా?

ఓబీసీల్లో చేర్చాలంటూ గుజరాత్ లో పటేళ్లు ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఎవరికివాళ్లు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? అనే అంశాలపై కమిటీ వేయాలంటూ ప్రధాని మోడీకి ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో రిజర్వేషన్లపై అన్ని పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది, ప్రతి ఒక్కరూ బహిరంగంగా తమ నోరు విప్పుతున్నారు, నిర్దిష్ట కాలపరిమితి వరకే రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు కూడా సూచించారనే గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రిజర్వేషన్ల విధానంపై స్పందిస్తున్నారు, ఎన్నాళ్లీ రిజర్వేషన్లు అంటూ ప్రశ్నిస్తున్నారు, 21వ శతాబ్దంలోనూ రిజర్వేషన్లు ఉండాలా? ఒకవేళ ఉంటే...ఏవిధంగా ఉండాలనేదానిపై సమీక్ష అవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దన్న తివారీ...దారిద్ర్యం, ఆర్ధిక వెనుకబాటు ఆధారంగా మాత్రమే కోటా అమలు చేయాలన్నారు. వర్గం, కులం, మతాలకు అతీతంగా...ఆర్ధికంగా వెనుకబడిన వారందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేతలు జితిన్ ప్రసాద్, జనార్దన్ ద్వివేది కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తంచేశారు, రిజర్వేషన్లతో అగ్రవర్ణాల్లోని పేదలు ఇబ్బందులు పడుతున్నారని, తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే భావన, ఆందోళన, ఆక్రోశం పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని, అయితే తాను కుల రిజర్వేషన్లు తొలగించాలని కోరడం లేదని, అవసరం లేనివారికి కోటా రద్దు చేయాలని మాత్రమే కోరుతున్నానన్నారు ద్వివేది. అయితే మనీశ్, జితిన్, ద్వివేది అభిప్రాయాలు...వ్యక్తిగతమంతూ కాంగ్రెస్ అధిష్టానం తేల్చేసింది, దాంతో కాంగ్రెస్ స్టాండ్ ఏంటో క్లారిటీ లేకపోయినప్పటికీ, ఇన్ డైరెక్ట్ గా అగ్రవర్ణాలను తమవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే వాళ్లతో ఈ వ్యాఖ్యలు చేయించిందనే టాక్ వినిపిస్తుంది. అయితే మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ,ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తున్నాయని ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, ఎంఐఎం లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి.  

ఆ విషయంలో ఇద్దరు వ్యూహాలూ ఒక్కటే

నీళ్లు పుష్కలంగా దొరికితేనే ఏ ప్రాంతమైనా సస్యశ్యామలం అవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది, కరువు కనుమరుగవుతుంది, పాడిపంటలతో గ్రామాలు కళకళలాడతాయి, రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటారు, అందుకే బ్రిటీష్ హయాంలోనూ వ్యవసాయానికి పెద్దపీట వేశారు, ఆనకట్టులు కట్టారు, ప్రజలకు తాగుసాగు నీరు అందేలా చేశారు కాబట్టే బ్రిటీష్ పాలన అంతరించి దాదాపు డెబ్బై ఏళ్లు కావొస్తున్నా గోదావరిపై ఆనకట్ట కట్టిన కాటన్ ను ఈనాటికీ తమ గుండెల్లో పెట్టుకున్నారు ప్రజలు. అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాగుతాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తున్నారు. ఇంటింటికీ నీళ్లిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతాం...ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్, సేమ్ టు సేమ్ అలాంటిదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్రై చేస్తున్నారు, పట్టిసీమ సక్సెస్ తో తొలి విజయాన్ని అందుకున్న చంద్రబాబు, అదే ఊపులో పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ముందుకు కదులుతున్నారు, 2018 నాటికి పోలవరం చేయగలిగితే, ఆ పేరుతో 2019లో ఓట్లు అడగాలని చంద్రబాబు ఇప్పట్నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు, అందుకే ఆరునూరైనా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరాలని నిర్ణయించుకున్నారట, పోలవరం పూర్తయితే ఇటు కృష్ణాడెల్టాకు, అటు ఉత్తరాంధ్రకు పుష్కలంగా నీరు ఇవ్వొచ్చని, దాంతో శ్రీశైలం నీటిని పూర్తిగా  రాయలసీమకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నట్లుగా పోలవరం పూర్తయితే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కూడా పనికొస్తుంది అటు తెలంగాణలోనూ కేసీఆర్ ఇలాంటి వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు, తాగుసాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, 2019 ఎన్నికల్లోపే పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు, అందుకే ఇంటింటికీ నీళ్లిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతామంటూ శపథం చేసి మరీ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ ఇద్దరు  అనుకున్నట్లు తాగుసాగునీటి ప్రాజెక్టులను గడువులో పూర్తి చేయగలిగితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.

చంద్రబాబు పైపైకి... కేసీఆర్ కిందికి...

రాష్ట్ర విభజనతో కష్టాలు, మరోపక్క తీవ్ర ఆర్ధిక లోటు... ఇంకోవైపు కేంద్రం నుంచి నాన్ కోఆపరేషన్...వీటికితోడు ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, పుష్కరాల్లో తొక్కిసలాట...ఇలా అనేక సమస్యలతో ఊపిరి పీల్చుకోలేనంతగా ఇబ్బందిపడ్డ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఇప్పుడు మెల్లగా కుదురుకుంటున్నారు, ఒకవైపు వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ ఇచ్చిన బూస్టింగ్, మరోవైపు పట్టిసీమ సక్సెస్...ఈ రెండు నాయుడులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అయితే తెలంగాణలో సీన్ రివర్సైంది, మొన్నటివరకు ఏపీ సీఎం చంద్రబాబుపై పైచేయి సాధించినట్లు కనిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కష్టాల్లో పడ్డారు, ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా,మరోవైపు విపక్షాలన్నీ కలిసి దండయాత్ర మొదలుపెట్టాయి, ఇక వరంగల్ ఎన్ కౌంటర్ తో కొత్త శత్రువులను కొనితెచ్చుకున్న కేసీఆర్... మావోయిస్టుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోంటున్నారు. పైగా వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 13వ స్థానంలో నిలవడం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోంది, మొన్నటివరకూ దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమని సంబరపడ్డా, ప్రపంచ బ్యాంక్ నివేదికతో నీరుగారిపోవాల్సి వచ్చిందని బాధపడుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 51వేలకోట్లు అప్పు చేశారని ఆర్టీఐ తేల్చిచెప్పడంతో ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఇక రైతు ఆత్మహత్యల్లో అయితే తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే సెకండ్ ప్లేస్ లో ఉండటం టీఆర్ఎస్ సర్కార్ ను కలవరపెడుతోంది, ఇవన్నీ కేవలం నెలరోజుల్లోనే వెంటవెంటనే మీదపడటంతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.

సుప్రీం తరువాత హైకోర్టు చేత మొట్టికాయలు

  శెట్టి బలిజ కులస్తులకు రిజర్వేషన్ వర్తింపజేయనందుకు సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకొన్న తెలంగాణా ప్రభుత్వం, తరువాత హైకోర్టు నుండి కూడా హెచ్చరికలతో కూడిన నోటీసులు అందుకొంది. పార్టీ నేతలకు ఉపాధి కల్పించేందుకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి వారికి క్యాబినెట్ హోదా కల్పించడాన్ని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు నెలల క్రితం తెలంగాణా ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కానీ తెలంగాణా ప్రభుత్వం కౌంటర్ వేయడంలో అశ్రద్ధ చూపడంతో హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్ళీ వాయిదాలోగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే ఈసారి ప్రభుత్వానికి జరిమానా విధించవలసి వస్తుందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తరచుగా సుప్రీం కోర్టు, హైకోర్టుల చేత అక్షింతలు వేయించుకోవడం విచిత్రమే. బహుశః ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఏదో ఒకరోజు గిన్నిస్ రికార్డుకి ఎక్కుతుందేమో!

కేఈతోపాటు ఐదుగురు మంత్రులకు డేంజర్ సిగ్నల్స్

అవినీతిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు పంపడంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో అవినీతి డబుల్ డిజిట్ కి చేరిందంటూ బాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఇది మంత్రులందరికీ హెచ్చరికేనంటున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న చంద్రబాబు, లోపాలు కనిపిస్తే మాత్రం అక్కడికక్కడే కడిగిపారేస్తున్నారు, దాంతో అమాత్యులందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది, దీనికి రెవెన్యూమంత్రి కేఈ వ్యవహారమే రుజువుగా చెబుతున్నారు. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందంటూ కలెక్టర్స్ మీట్ లో సర్వే రిపోర్ట్స్ ను బయటపెట్టిన చంద్రబాబు, మూలాల నుంచి ప్రక్షాళన చేయాలని చెప్పారట. ముందుగా డిప్యూటీ సీఎం ఈ కృష్ణమూర్తిని రెవెన్యూశాఖ నుంచి తప్పిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినబడుతోంది. డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్స్, ఆర్డీవోల బదిలీల్లో పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు రావడంతో ట్రాన్స్ ఫర్స్ ను రద్దుచేసిన చంద్రబాబు, చివరికి ఆ శాఖ నుంచి కేఈనే తప్పించాలని నిర్ణయానికి వచ్చారట. దీనికితోడు కేఈ సచివాలయానికి రాకుండా ఇంట్లోనే ఉంటూ ఫైళ్లు పరిశీలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, అంతేకాకుండా తన శాఖ పట్ల కేఈ పట్టుసాధించలేకపోతున్నారని, ఎప్పటికప్పుడు సమీక్షలు చేయలేకపోతున్నారని అంటున్నారు, దాంతో కీలకమైన రెవెన్యూశాఖ నుంచి కేఈని తప్పించి, ఏదైనా చిన్నశాఖను అప్పగించాలని భావిస్తున్నారట, అయితే రెవెన్యూశాఖలో బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి కేఈ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల సూచన మేరకే తాను బదిలీలు చేశానని, ఎలాంటి నిబంధనలూ ఉల్లంఘించలేదని చెప్పారట. అయితే కొందరు ఎమ్మార్వోలు, వీఆర్వోలు ప్రజలను పీక్కుతింటున్నారని, వారి వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని డిప్యూటీ సీఎం కేఈ అంటున్నారు, చంద్రబాబుపై తనకు నమ్మకముందని, సీఎంతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వ్యాఖ్యానిస్తున్నారు. బదిలీల వ్యవహారంలోనూ టీడీపీ నేతల ఎలాంటి విభేదాలు లేవంటున్న కేఈ...కర్నూలు జిల్లాలో జరిగిన28మంది తహశీల్దార్లు, 20మంది డిప్యూటీ తహశీల్దార్లు, 14మంది సీనియర్ అసిస్టెంట్లు, 8మంది జూనియర్ అసిస్టెంట్లు, 9మంది రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల బదిలీలన్నీ కార్యకర్తల ఇష్టప్రకారమే జరిగాయంటున్నారు. అయితే తాను రెండంకెల ప్రగతి కోసం నానా అగచాట్లు పడుతుంటే, కొందరు మంత్రులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాబు సీరియస్ గా ఉన్నారట, అందుకే పలువురికి ఉద్వాసన పలకడంతోపాటు కొందరికి శాఖల మార్పు చేయాలని యోచిస్తున్నారట, అందుకే కేఈతోపాటు మరో ఐదుగురు మంత్రులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్ లో మహిళాశిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పంచాయితీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  

కాంగ్రెస్, తెదేపాలది అపవిత్ర కలయిక: తలసాని

  మంత్రి పదవి కోసం పార్టీని మార్చి నేటికీ తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నైతిక విలువల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లను వివిధ కారణాలతో తెరాస ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మొట్టమొదట తెదేపా, బీజేపీలు, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేసాయి. అయినా ఎటువంటి ఫలితం కనబడకపోవడంతో రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నాయి. తెరాస ప్రభుత్వం సుమారు 25లక్షల ఆంధ్రా ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించిందని తెలంగాణా రాష్ట్ర పీ.సి.సి. అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలన్నీ పోరాటం ఆరంభించడంతో తెరాస ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది.   ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆందోళనపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆవిధంగా అవి కలిసి పోరాటం చేయడం చాలా అనైతికమని అన్నారు. బద్ద విరోధులయిన కాంగ్రెస్, తెదేపాలు కలిసి పోరాటాలు చేయడం చాలా అపవిత్ర కలయికగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసరమయిన రాద్దాంతం చేస్తూ ప్రజలను త్రప్పు ద్రోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆంద్ర ప్రజలు ఎక్కువగా ఉన్న జి.హెచ్.యం.సి. పరిధిలో తెరాస పోటీ చేసినా ఎన్నికలలో గెలవలేదని తెరాసకు కూడా తెలుసు. అందుకే వార్డుల పునర్విభజన సాకుతో ఆంద్ర ఓటర్లను ఏరిపడేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారు చేస్తున్న ఈ ఆరోపణలకి తలసాని నేరుగా సమాధానం చెప్పకుండా, కాంగ్రెస్, తెదేపాలు కలిసి పనిచేయడాన్ని తప్పు పడుతున్నారు.   ఒకవేళ తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలు కలిసి పనిచేయడం అపవిత్రమయితే తెరాసకు అదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో తెరాస నేతలకంటే కాంగ్రెస్, తెదేపాల నుండి వచ్చి చేరిన వారే ఎక్కువగా ఉన్నారు. వారే అన్ని కీలక పదవులను ఆక్రమించేశారు. తెదేపా నుండి తలసాని, తీగల, తుమ్మల, కడియం, గంగుల వంటి అనేక మంది నేతలు తెరాసలో కే.కేశవ్ రావు, డి.శ్రీనివాస్ వంటి కాంగ్రెస్ నేతలతో భుజం భుజం రాసుకొని పనిచేస్తున్నారిప్పుడు. కనుక రాజకీయ నాయకులు పవిత్రత, నైతిక విలువల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.

తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎవరవుతారో?

  తెలుగుదేశం తెలంగాణా శాఖకి ప్రస్తుతం ఎల్. రమణ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగుస్తున్నందున ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని అధ్యక్షుడు నియమించాలనే విషయంలో పార్టీ నేతల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. ఐ.వి.ఆర్.యస్. పద్దతిలో అధ్యక్షుడుని ఎన్నుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించినప్పటికీ, తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగించినట్లయితే వచ్చే తెరాస చేతిలో పార్టీ విచ్చినం అయిపోకుండా కాపాడుకొంటూ పార్టీని బలపరుస్తారని కొందరు నేతలు భావిస్తున్నారు.   పార్టీలో సీనియర్ నేత అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఎల్. రమణ కూడా తనే ఆ పదవిలో కొనసాగాలనుకొంటున్నారని సమాచారం. అనేకసార్లు టికెట్లు పదవులు ఆశించి భంగపడిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా ఈ రేసులో ఉన్నారు. దళితుడినయిన తనకే అధ్యక్ష పదవిని ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలలో తుది నిర్ణయం తీసుకొనే చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ నేతలనే చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావాలని కోరడంతో వారందరూ నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో సమావేశమయ్యారు. కానీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కనుక త్వరలోనే అందరూ మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయించుకొన్నారు.   తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీల నేతలకు పదవులు ఎర వేయడం ద్వారా వారిని తెరాసలోకి ఆకర్షించి ప్రతిపక్షాలను బలహీనపరిచాలని తెరాస ప్రయత్నిస్తున్నందున, పార్టీని బలోపేతం చేసి తెరాసను డ్డీకొనే విధంగా తయారు చేయడానికి మంచి సమర్దుడయిన నాయకుడు చాలా అవసరం ఉంది. రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ, పార్టీ నేతలను, వర్కర్లను అందరినీ ఏకత్రాటిపై నడిపించగల తెలివి తేటలు కూడా చాలా అవసరం. ఎర్రబెల్లి తదితరులు రేవంత్ రెడ్డి అంత దూకుడుగా వెళ్లడాన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. దాని వలన ఆయన వ్యక్తిగతంగా ప్రజలలో, పార్టీ అధిష్టానం వద్ద మంచిపేరు సంపాదించుకోవచ్చును కానీ పార్టీకి ఊహించని సమస్యలు కూడా తెచ్చిపెట్టె అవకాశం కూడా ఉందని వారు భావిస్తున్నారు.

చంద్రబాబు నిర్ణయంతో జగన్ కు తిప్పలు

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం కలిగించో, అంతే స్థాయిలో ఏపీ ప్రభుత్వంలో పెను కదిలిక తెచ్చింది, ట్యాపింగ్ ఎపిసోడ్ తో ఉలిక్కిపడిన చంద్రబాబు, ఇదంతా హైదరాబాద్ లో ఉండటం వల్లే జరిగిందని నిర్ధారణకు వచ్చారు, ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి పదేళ్లపాటు పాలన సాగించేందుకు ఏపీకి అధికారులున్నా, ఏదో తెలియని భయాందోళనలను టీడీపీ నేతల్లో నింపింది. అదే సొంత రాష్ట్రం నుంచే పాలన జరుగుతూ ఉంటే,  ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉండేది కాదని, టెక్నికల్ గానూ అది సాధ్యపడకపోయేదని గుర్తించారు. పైగా ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలంటే, విజయవాడ ప్రాంతానికి త్వరగా తరలివెళ్లడమే మంచిదని భావించిన చంద్రబాబు...ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని అధికారంలోకి వచ్చిన మూడ్నెళ్లలోనే నిర్ణయం తీసుకున్నా, అనేక కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు, కానీ ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ దెబ్బతో తరలింపు ప్రక్రియను స్పీడప్ చేశారు, అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వారంలో నాలుగైదు రోజులు విజయవాడలో ఉంటూ పాలన సాగిస్తూ, సమీక్ష నిర్వహిస్తుండటంతో, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ నుంచి బెజవాడకు షిఫ్ట్ అవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. దాంతో జగన్ కూడా తన కార్యకలాపాలను విజయవాడ లేదా అమరావతి సమీప ప్రాంతం నుంచి సాగించాలని డిసైడ్ అయ్యారట. ఈలోపు చంద్రబాబు మాదిరిగా వారంలో మూడు నాలుగు రోజులు ఏదో ఒక అంశంపై ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నా, అమరావతి ఏరియాకి షిఫ్ట్ అయితేనే ప్రభుత్వ వైఫల్యాలను మరింత సమర్ధంగా పోరాడొచ్చని భావిస్తున్నారట. అందుకే, విజయవాడ, అమరావతి పరిసరాల్లో మంచి ఇల్లు కోసం జగన్ అన్వేషిస్తున్నారని, అన్నీ కుదిరితే సంక్రాంతి నాటికే మకాం మార్చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.   అయితే ఏదోరోజు విజయవాడ ప్రాంతానికి దుకాణం మార్చాల్సి ఉన్నా, ఇంత అర్జెంట్ గా నిర్ణయం తీసుకోవడానికి మాత్రం చంద్రబాబే కారణమట, బాబు ఎక్కువగా బెజవాడలోనే ఉంటుండటంతో ప్రతిపక్ష నేత జగన్ కూడా షిఫ్ట్ కావాల్సిన అనివార్యత ఏర్పడిందని, ఆ విధంగా జగన్... బాబు ఉచ్చులో పడ్డారని అంటున్నారు. అయితే సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్... తరుచుగా కోర్టులకు హాజరుకావాల్సి ఉండటంతో...విజయవాడకు షిఫ్ట్ అవడం ఇబ్బందికర పరిస్థితేనంటున్నారు. చంద్రబాబుకైనా, జగన్ కైనా హైదరాబాద్ ను పూర్తిగా వదిలివెళ్లాలంటే కొంచెం కష్టమేనేమో

పదవే పరమావధి... ఏ గడ్డి తినడానికైనా రెడీ!

అప్పటివరకూ అధికార పార్టీపై ఒంటికాలిపై లేస్తారు, తీవ్ర విమర్శలు చేస్తారు, ఆ తర్వాతి రోజే, ఏ పార్టీనైతే తిట్టారో అదే పార్టీలో చేరిపోతారు. ఇదీ ఇప్పటి రాజకీయ నేతల నైతిక విలువలు, ఒక విధానం ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు, పదవే పరమావధిగా ఏ గడ్డి తినడానికైనా రెడీగా ఉంటారు. విలువలు కలిగిన నేతలు ఈరోజుల్లో కరువై పోయారు, భూతద్దంతో వెదికినా నికార్సైన నాయకులు దొరకని రోజులివి. ఇలా పార్టీల మారిన నేతలు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు, ఒక్కరేమిటి...దాదాపు చాలామంది ఆ బాపతే, అయితే సిద్ధాంతాలను విభేదించి పార్టీలు మారేవాళ్లు తక్కువగా ఉంటారు, పదవి దక్కలేదనో, తన మాట నెగ్గలేదనో పార్టీలు మారే వారే ఎక్కువ. ఎక్కడో అక్కడక్కడా చుక్కుల్లో చంద్రుల్లా కొందరు కనిపించినా, ప్రజలు మాత్రం వాళ్లని ఆదరించరు, ఏ టైమ్ కి ఆ గడ్డి తినే వాళ్లనే అభిమానిస్తారు, గెలిస్తారు. పైగా ఇలాంటి వాళ్లనే పదవులు కూడా వరిస్తుంటాయ్. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, ఎందరికో బీ-ఫారాలు అందజేసిన డీఎస్ లాంటి నేతలు కూడా పార్టీలు మారిపోయారంటే, పొలిటికల్ లీడర్స్ కి పదవులు ఎంతో ముఖ్యమో చెప్పొచ్చు ఇప్పుడు అదే బాటలో మరో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు పయనిస్తున్నట్లు తెలుస్తోంది, నిన్నమొన్నటివరకూ కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా తీవ్ర విమర్శలు చేసిన ఆ గ్రేటర్ లీడర్... అదే పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. రెండు మూడ్రోజుల్లో టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే ఈ నాయకుడు, గతంలో టికెట్ ఇవ్వలేదని, ప్రత్యర్ధి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి,  రెండు మూడు నెలలకే మళ్లీ అధికార పార్టీలోకి దూకేసిన లీడర్. ఆ తర్వాత రెండు పర్యాయములు మంత్రి పదవి కూడా వెలగబెట్టిన ఈయన... మరోసారి అధికార పార్టీలోకి జంప్ చేయబోతున్నారు.  

ఇసుక తుఫాన్... టీడీపీని ముంచేస్తుందా?

ఉల్లి దెబ్బకు ప్రభుత్వాలే తారుమారైనట్లుగా, ఇసుక దెబ్బకు ఏపీలో టీడీపీ చావుదెబ్బ తినే పరిస్థితులు చాపకింద నీరులా సాగుతున్నాయి. నిన్నమొన్నటివరకూ మూడు నాలుగు వేలకే దొరికే లారీ ఇసుక, కొత్త విధానంతో పది నుంచి 20వేల రూపాయలు పలుకుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఐరన్, సిమెంట్ లాగే ఇసుక ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో పేదవాడికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. అయితే ఉచితంగా దొరికే ఇసుకను కూడా సామాన్యులకు అందని ద్రాక్షగా మార్చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇసుకను కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడటంతో ఓ పాలసీని తీసుకొచ్చింది. ఇసుక ర్యాంపులను డ్వాక్రా మహిళలకు కేటాయించి వాళ్లు పైకి రావాలని ఆకాంక్షించింది. అయితే ఇసుక వ్యాపారంలో లాభాలను రుచి మరిగిన పొలిటికల్ లీడర్స్...డ్వాక్రా సంఘాల పేరుతో కబ్జా చేసుకుని మాఫియాగా ఏర్పడ్డారు.  దాంతో వాళ్లాడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. ఇష్టమొచ్చినట్లు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ అతి తక్కువ టైమ్ లో కోట్లు గడిస్తున్నారు. సాయంత్రం వరకే ఇసుక తవ్వాల్సి ఉండగా, రాత్రీపగలనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. పట్టిసీమ పేరుతో కూడా ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేశారని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఓ పత్రిక కథనం ప్రకారం ఏపీలో నలుగురు మంత్రులు, 38మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇసుక మాఫియాలో భాగస్వామ్యులుగా ఉన్నారని, కిందిస్థాయి నేతలైతే వేలల్లో ఉంటారని తెలిపింది. ఉభయగోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ, వైసీపీ నేతలు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారని రాసుకొచ్చింది. ఒక్కో ఎమ్మెల్యే నెలకు మూడు కోట్లు సంపాదిస్తున్నారని, ఏడాదికి సగటున 30కోట్లు వెనకేస్తున్నారని లెక్కగట్టారు. ఇప్పటివరకూ 2వేలకోట్ల రూపాయలకు పైగా దోచేశారని, ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇసుక మాఫియాను అరికట్టలేకపోతున్నామని వ్యాఖ్యానించారంటే... ఏ రేంజ్ లో వాళ్ల నెట్ వర్క్ ఉందో అర్థమవుతుంది. మరి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండాల్సిన ఇసుక అందకుండా పోతే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఇసుకు తుఫానులో కొట్టుకోవడం ఖాయమని, చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు మేలైన విధానం తీసుకురావల్సిన అవసరముందని అంటున్నారు. లేదంటే ఉల్లి దెబ్బలాగా, ఇసుక తుఫాన్ తప్పదేమో.  

జి.హెచ్.యం.సి. పరిధిలో 27,12,468 ఓట్లు రద్దు?

  పెరిగిన జనాభాకి అనుగుణంగా వార్డుల పునర్విభజన చేయడం కోసమే జి.హెచ్.యం.సి. ఎన్నికలు వాయిదా వేశామని తెలంగాణా ప్రభుత్వం పదేపదే చెపుతోంది. కానీ అది చేస్తున్న పని మాత్రం జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం. అది ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లో ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన కూకట్ పల్లి సర్కిల్ లోనే ఏకంగా 1,21,085ఓట్లను తొలగించారు. ఆ తరువాత ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిల్స్ లో అత్యధికంగా ఓట్లను తొలగించారు.   తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిరసనలు చేపట్టి దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పిర్యాదు చేసాయి. తెలంగాణా ప్రభుత్వం సుమారు 17 లక్షల ఓట్లు తొలగిస్తోందని అవి పిర్యాదు చేసాయి. కానీ మొత్తం 27,12,468 ఓట్లను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల జాబితాలో రెండు చోట్ల పేరున్నవారు, అధికారులు వచ్చినప్పుడు ఇంటికి తాళాలు వేసున్నవారివి, చిరునామా మారినవారివి తదితర కారణాలతో ఓట్లను తొలగిస్తున్నారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకే అనర్హులుగా భావించినవారి పేర్లను తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ అన్నారు. అర్హులయినవారు స్థానికంగా ఉంటున్నట్లు ఆధారాలు చూపిస్తే మళ్ళీ వారి పేర్లను జాబితాలో చేర్చుతామని చెప్పారు.   ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. కనుక తక్షణమే ఆధార్-ఓటర్ కార్డుల లింక్ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ జి.హెచ్.యం.సి. పరిధిలో మాత్రం స్థానికంగా ఉంటున్నట్లు ఆధారాలు చూపించలేకపోతే ఓటర్ల జాబితాలో నుండి పేర్లను తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ చెప్పడం విశేషం. బోగస్ ఓటర్లను ఏరివేయడం అత్యవసరమే. కానీ ఆ పేరుతో జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడం అన్యాయమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంలో వెనకడుగువేసే ఆలోచనలో లేదు. చివరికి ఈ వ్యవహారం కూడా హైకోర్టుకో సుప్రీం కోర్టుకో చేరుతుందేమో.

మళ్లీ ‘నెంబర్ వన్‘ సీఎం రేసులో చంద్రబాబు

నారా చంద్రబాబునాయుడు, పదేళ్ల క్రితం ఈ పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మారుమోగిపోయేది, ఒక్క ఏపీలోనే కాదు, దేశం మొత్తంమీదే ఆయనో సంచలనం, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి సైతం ఆయన పేరు సుపరిచితమే, అంతలా తన ఇమేజ్ పెంచుకున్నారు చంద్రబాబు. ఆయన పనితీరు మెచ్చుకోనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు, రాజకీయ ప్రత్యర్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆయన డైనమిజాన్ని పొగిడినవాళ్లే, పాలనను కొత్త పుంతలు తొక్కించి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఘనత చంద్రబాబుది, నేను నిద్రపోను-మిమ్మల్ని నిద్రపోనివ్వనంటూ అహర్నిశలూ ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కోసం పరితపించిన ముఖ్యమంత్రి.   ఇప్పుడంటే మోడీ పేరు దేశంలో మారుమోగిపోతుంది గానీ, పన్నెండేళ్ల క్రితం చంద్రబాబు నామస్మరణ కనిపించేది,ఆనాటి ఎన్టీఏ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పిన చంద్రబాబు, రాక్ స్టార్ సీఎంగా వెలిగిపోయారు. తన డైనమిజంతో దేశాన్నే తనవైపు తిప్పుకున్నారు, పరిపాలన అంటే ఇలాగుండానే విధంగా చేసిచూపించారు, ఒక స్టేట్ డెవలప్ కావడానికి ఏం చేయాలో అన్ని చేశారు, అలుపెరగకుండా 24గంటలూ కష్టపడ్డారు, ఐటీని అందిపుచ్చుకుని ప్రపంచాన్నే హైదరాబాద్ కి రప్పించారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు, లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు లభించేలా చేశారు, విజన్ 2020 పేరుతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లిన స్వాప్నికుడు చంద్రబాబు. అయితే 2004లో అధికారం పోయాక పదేళ్ల సుదీర్ఘమైన గ్యాప్, ఇంతలోనే రాష్ట్ర విభజన, కట్టుబట్టలతో వెళ్లిపోయినట్లుగా నవ్యాంధ్ర పరిస్థితి, అందుకే మళ్లీ చంద్రబాబుకి పగ్గాలు అప్పగించారు ఆంధ్రా ప్రజానీకం, రాష్ట్ర విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రను గట్టెక్కించే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందనే నమ్మకంతో అధికారం కట్టబెట్టారు. అందుకే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా చంద్రబాబు నవ్యాంధ్ర పునర్ నిర్మాణానికి నడుం బిగించారు, కేంద్రం నుంచి అనుకున్నంత సహకారం అందకపోయినా ఛాలెంజ్ గా తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కష్టాలొచ్చినప్పుడే ఎవరి సత్తా ఏంటో బయటపడుతుందంటారు, తన సత్తా ఏంటో పదేళ్ల క్రితమే దేశానికి తెలియజేసిన చంద్రబాబు, ఇప్పుడు మరోసారి రుచి చూపించేందుకు కష్టపడుతున్నారు.   అయితే పట్టిసీమతో చంద్రబాబుకు తొలి విజయం దక్కిందనే చెప్పాలి, దేశంలోనే తొలిసారి నదుల అనుసంధానం చేపట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న చంద్రబాబు, నవ్యాంధ్ర డెవలప్ మెంట్ కు భారీ లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. ఒకవైపు ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తూనే, దేశీయ, విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. చంద్రబాబు ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంక్ కూడా కితాబివ్వడమే రుజువు, రాష్ట్రం విడిపోయినా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అంటూ సెకండ్ ర్యాంక్ ఇవ్వడం బాబు పనితీరుకు నిదర్శనం. ఇదే దూకుడుతో ముందుకెళ్తే ఏపీ మళ్లీ ఫస్ట్ ప్లేస్ కి రావడం, చంద్రబాబు నెంబన్ సీఎం కావడం కష్టమేమీ కాదేమో.

సీనియర్లను టెక్నాలజీతో దారిలోకి తెచ్చుకున్న చంద్రబాబు

టెక్నాలజీని వాడుకోవడంలో రాజకీయ పార్టీలు ఆరితేరిపోయాయి, ఈ ట్రెండ్ విదేశాల్లో పదేళ్ల క్రితమే మొదలైనా, ఇండియాలో మాత్రం 2014 ఎన్నికల టైమ్ నుంచే ఎక్కువగా కనిపించింది, సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో మోడీ అందరి కంటే ముందున్నట్లు కనిపించినా, టెక్నాలజీని వాడుకోవడంలో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటారు ఆయన గురించి తెలిసివాళ్లు. అందుకే నైన్టీస్ లో ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా... ముందుచూపుతో ఐటీకి పెద్దపీట వేశారని, అదే ఇప్పుడు తెలంగాణకు పెద్ద ఆదాయ వనరుగా మారిందంటారు. పదేళ్ల క్రితమే హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు... టెక్నాలజీని ఏ అవసరానికి ఎలా వాడుకోవాలో తెలుసు, అందుకే అభ్యర్ధుల ఎంపిక దగ్గర్నుంచి పార్టీ సభ్యత్వం వరకూ అన్నింటిలోనూ హైటెక్ విధానాన్నే ఫాలో అయ్యారు.పార్టీపరంగానూ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కారు, 2014 ఎన్నికల సమయంలో ఐవీఆర్ఎస్ స్టిస్టంను ప్రవేశపెట్టి, పాలిటిక్స్ ను కొత్త పుంతలు తొక్కించిన చంద్రబాబు... మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్ధులను ఎంపిక చేసుకుని ఘనవిజయం సాధించారు. ఇప్పుడదే విధానాన్ని తెలంగాణ టీడీపీలోనూ ప్రయోగించారు చంద్రబాబు. టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికలో సీనియర్ల నుంచి చిక్కులు ఎదురవడంతో సరికొత్త ఎత్తువేసిన బాబు, ఎవరికీ నొప్పి కలుగకుండా టెక్నాలజీని ఆశ్రయించారు, ముఖ్యంగా రేవంత్, ఎర్రబెల్లి నువ్వానేనా అన్నట్లు పోటీపడటం, రేవంత్ పై సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం ద్వారా మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు టీటీడీపీ అధ్యక్షుడ్ని డిసైడ్ చేస్తానని బాబు చెప్పడం అంతా సైలెంటైపోయారు. అయితే తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లగలితే సత్తా, సమర్ధత రేవంత్ కే ఉందని, కార్యకర్తలు కూడా రేవంత్ వైపే మొగ్గుచూపుతున్నారని చంద్రబాబుకు తెలిసినా, సీనియర్లను నొప్పించకూడదని తెలివిగా ఐవీఆర్ఎస్ ను వాడుకున్నారు అయితే ఐవీఆర్ఎస్ స్టిస్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని చంద్రబాబు… టీటీడీపీ నేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి 4లక్షల మంది కార్యకర్తలుండగా, 50శాతానికి పైగా… రేవంత్ రెడ్డి పేరునే ప్రతిపాదించారట, కేవలం 20శాతం మాత్రమే ఎర్రబెల్లి వైపు మొగ్గుచూపగా, మిగతా 20-30శాతం కార్యకర్తలు వివిధ నేతల పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దాంతో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు రేవంత్ కే పగ్గాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది కార్యకర్తల అభిప్రాయం కనుక సీనియర్లు కూడా వ్యతిరేకించడానికి వీలుండదని బాబు వేసిన ఎత్తు ఫలించింది. అలా సీనియర్లకు చెక్ చెప్పిన చంద్రబాబు, తన మనోభీష్టం మేరకు రేవంత్ కు పగ్గాలు అప్పగించేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు.

బదిలీల వ్యవహారమే కొంపముంచిందా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కేఈ మధ్య అంతరం రోజురోజుకీ పెరుగుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అటు చంద్రబాబును, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న కేఈని ఇంటికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ప్రతి సమీక్షా సమావేశంలోనూ అవసరం ఉన్నా లేకున్నా రెవెన్యూశాఖ ప్రస్తావన తీసుకొచ్చి, అవినీతి పెరిగిపోయిందంటూ కేఈకి డేంజర్ సిగ్నల్స్ పంపిస్తున్నారని అంటున్నారు. మరోవైపు కేఈని అటు మంత్రిగా, ఇటు శాఖాపరంగా డమ్మీని చేసేశారని, ఇక సాగనంపడమే మిగులుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి ఊతమిచ్చేలా చంద్రబాబు చర్యలున్నాయని, అందుకే రెవెన్యూ వ్యవహారాలన్నీ మంత్రి నారాయణ చక్కబెట్టేస్తున్నారని, దాంతో కేఈ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు. అయితే దీనంతటికి డిప్యూటీ కలెక్టర్ల బదిలీల వ్యవహారమే కారణమంటున్నారు పార్టీ నేతలు, కేఈ తీసుకున్న నిర్ణయం చినబాబుకు నచ్చలేదని, పైగా లోకేష్ చెప్పినా వినకపోవడంతో తేడాలొచ్చాయని, అది చివరికి కేఈ పదవికే ఎసరు తెచ్చిపెట్టే పరిస్థితికి వచ్చిందంటున్నారు. అయితే కేఈ వాదన మరోలా ఉంది, తాను రూల్స్ ప్రకారమే వ్యవహరించానని, ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లను బదిలీ చేశానని, అక్కడక్కడా పార్టీ నేతలు సూచించినట్లు వ్యవహరించానని వివరణ ఇచ్చారట. కానీ ఆ లిస్ట్ లో టీడీపీ సానుభూతిపరులు కూడా ఉన్నారని, వాళ్లను ట్రాన్స్ ఫర్ చేయడానికి వీల్లేదని కొందరు నేతలు చినబాబుకు ఫిర్యాదు చేయడంతోనే కథ అడ్డంతిరిగిందంటున్నారు. దాంతో బదిలీలపై కేఈ నాలుగు జీవోలు ఇష్యూ చేస్తే, ప్రధాన కార్యదర్శితో చెప్పి ఒకే ఒక్క జీవోతో వాటిని ఆపేశారు చంద్రబాబు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేది ఒక్క కేఈ మాత్రమేనని, అందుకే సీఎంకు కూడా చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. పైగా మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలపైనా అనేకసార్లు కేఈ విమర్శలు చేయడం కూడా చంద్రబాబుకి నచ్చలేదని, అనేకసార్లు హెచ్చరించినా కేఈ వైఖరి మారలేదని, ఇక సాగనంపడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.