బాబు కొత్త సమస్యలు ఆహ్వానించుకొంటున్నారా?

  విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు ఏపీఎండీసీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ, ప్రజా సంఘాలు, వామ పక్షాలు నేడు ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కి పిలుపునిచ్చాయి. స్థానిక గిరిజనులు, మావోయిస్టులు కూడా బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కనుక వారు కూడా ఈ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.   బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అయినా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నారో తెలియదు. రాజధాని రాయలసీమలో త్వరలో సరికొత్త సమస్యలు ఎదుర్కోవలసిన తరుణంలో ప్రభుత్వ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో కూడా ఈ కారణంగా సమస్యలు స్వయంగా ఆహ్వానించుకొన్నట్లు అవుతుంది. కనుక బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం పునరాలోచించుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు.

వరంగల్ ఉప ఎన్నికలలో జగన్ ప్రచారం!!!

  రాజకీయ పార్టీలు వివిధ సమస్యలపై పోరాడటం, ఎన్నికలలో పోటీ చేయడం, గెలిస్తే అధికారం చెప్పట్టడం అన్నీ చాలా సర్వసాధారణమయిన విషయాలు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉంటారు. సమైక్యాంద్ర కోసం పోరాడినా అనుమానించారు.. ఆ తరువాత భూసేకరణ, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసినా అనుమానంగా చూస్తారు. చివరికి ఎన్నికలలో పోటీ చేస్తున్నా అనుమానమే చాలా మందికి. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యలపైనే పోరాడుతున్నప్పటికీ ఆయన పోరాటంలో ఎప్పుడూ రెండవ కోణం కనిపిస్తుంటుంది. అందుకే ఆయన చిత్తశుద్ధిని చాలా మంది శంకిస్తుంటారు.   పేరుకి ఓదార్పు యాత్రలు చేసేవారు కానీ అవి నూటికి నూరు శాతం అచ్చమయిన రాజకీయ యాత్రలే. భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన పోరాటం మొదలుపెట్టినప్పుడు, ఆయన తన పోరాటాలతో ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయకుండా నిలువరించగలిగి ఉండి ఉంటే, రాష్ట్రంలో యావత్ రైతాంగం ఆయనకు జేజేలు పలికి ఉండేది. కానీ రెండు రోజులు ధర్నా చేసి “భూములు పోయాయని మీరేమీ కంగారు పడకండి. నేను ముఖ్యమంత్రి అయిన తరువాత వాటిని తిరిగి ఇచ్చేస్తాను,”అని చెప్పి తన పోరాటం యొక్క పరమార్ధం ఏమిటో ఆయనే స్వయంగా చెప్పుకొని అభాసుపాలయ్యారు.   అలాగే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నప్పుడు ఆయన లక్ష్యం కేంద్రప్రభుత్వం మీద ఉండాలి కానీ ఆయన తన బద్ధ శత్రువయిన చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని పోరాడటంతో ఆయన పోరాటం ప్రత్యేక హోదా కోసం కాదని చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టి రాజకీయంగా దెబ్బ తీయడానికేనని ప్రజలు కూడా గుర్తించేలా వ్యవహరించారు. అంత ఉదృతంగా మొదలుపెట్టిన ఆ పోరాటం అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేసి దాని ఊసే ఎత్తడంలేదిప్పుడు.ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు.   ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించగానే “తెలంగాణాలో ఉనికే చాటుకోవడానికి ఇష్టపడనప్పుడు ఇంకా ఎందుకు పోటీ చేస్తున్నట్లో...?” అని అందరూ ఆశ్చరయం వ్యక్తం చేసారు. కానీ ఎందుకు పోటీ చేస్తోందో అందరికీ తెలుసు కనుక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.   తాజా సమాచారం ఏమిటంటే వైకాపా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నల్లా సూర్యప్రకాష్ తరపున ఈనెల 16వ తేదీ నుండి 20 వరకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రచారం చేయబోతున్నారు. జగన్ మళ్ళీ చాలా రోజుల తరువాత తెలంగాణా జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఇంతకాలంగా తెరాసకు ఇబ్బంది కలిగించకూడదనే తెలంగాణాలో వైకాపాను ఒక డమ్మీ రాజకీయ పార్టీగా నడిపిస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో ఉంటున్నా ఏనాడు తెలంగాణా జిల్లాలో అడుగుపెట్టలేదు. పరామర్శ యాత్రలకి తన చెల్లెలు షర్మిలను పంపినా ఆమె కూడా తెరాస ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని విమర్శించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడి తిరిగి వచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంటే తెరాస ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను విమర్శించవలసి ఉంటుంది. మరి జగన్ ఆ పని చేస్తారా?   విమర్శిస్తే దాని అర్ధం ఏమిటి? ఆయన చంద్రబాబు నాయుడుకి దగ్గరయినందుకు విమర్శిస్తున్నట్లా లేకపోతే ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు తెదేపా-బీజేపీ అభ్యర్ధికి పడకుండా తనవైపు తిప్పుకొని తద్వారా ఓట్లు చీల్చి తెరాసకు పరోక్షంగా సహాయ పడేందుకా? చాలా అనుమానాలున్నాయి. ఇంతకీ ఆయన వెళతారో లేకపోతే కొత్త సమస్యలను ఆహ్వానించడం దేనికని ఆఖరు నిమిషంలో తన సోదరి షర్మిలను పంపిస్తారో?చూడాలి.

ఇది టీడీపీకి కాపులను దూరం చేసే కుట్రా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గమైన కాపులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో వున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి కాపు జన సంఖ్యకు వుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా వున్న కాపులు ఆ తర్వాత  తమ సామాజికవర్గానికి చెందిన చిరంజీవిని చూసి లేనిపోని ఉత్సాహం తెచ్చుకున్నారు. తమ నుంచి ఒక నంబర్ వన్ స్థానంలో నిలిచే నాయకుడు వచ్చాడని అనుకున్నారు. అయితే ఆ తర్వాత చిరంజీవి వాళ్ళ ఉత్సాహం మీద చన్నీళ్ళు చల్లి ఎంచక్కా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. ప్రస్తుతమయితే చిరంజీవి తన 150 (151?) సినిమా మీద తప్ప రాజకీయాల మీద ధ్యాస చూపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కాపులు చేరువవుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా పార్టీలో, ప్రభుత్వంలో కాపులకు ప్రాధాన్యమిస్తూ తమ మధ్య వున్న అంతరాన్ని చెరిపే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి కాపులను దూరం చేసే కుట్రలు ప్రారంభమయ్యాయని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. కాపు నాయకుడు రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందంటూ హరిరామ జోగయ్య తన ఆత్మకథలో పేర్కొనడాన్ని ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. హరిరామ జోగయ్య రాజకీయ జీవితం మొత్తం వివాదాలమయం. రాష్ట్రంలో ఆయన చేరని పార్టీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలు మారే ఆయన పార్టీ మారగానే అప్పటి వరకూ తాను పనిచేసే పార్టీని నోటికొచ్చినట్టు తిట్టడంలో సమర్థుడు. అలాగే వివాదాస్పద కామెంట్లు చేసి వార్తల్లో వుండే విషయంలో కూడా ఆయన ఘనాపాటి. ఇప్పుడు వయసు అయిపోయి, రాజకీయ నిరుద్యోగంలో వున్న ఆయన తన ఆత్మకథలో వివాదాస్పద కామెంట్లు చేయడం తెలుగుదేశం పార్టీని కాపులకు దూరం చేసే కుట్రలో భాగమేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అయితే హరిరామ జోగయ్య మాటలకు ప్రజల్లోను, రాజకీయ వర్గాలలోను ఎంతమాత్రం విలువ వుండదని, అయినప్పటికి  తెలుగుదేశం మీద కక్షకట్టిన కొన్ని వర్గాలు జోగయ్య మాటలకు విలువ ఇచ్చి, అధిక ప్రచారం చేయడం ఆ వర్గాల రాజకీయ దిగజారుడు తనానికి, టీడీపీకి సన్నిహితమవుతున్న కాపులను దూరం చేసే ప్రయత్నాలకు  నిదర్శనాలుగా నిలుస్తాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

బీహార్లో బీజేపీ డౌటేనా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం నాడు చివరి దశ పోలింగ్ పూర్తయ్యే వరకూ రాజకీయ పరిశీలకుల అంచనాలు కొద్ది రోజులు అటూ ఇటూ మారాయి. కొద్ది రోజులపాటు పరిస్థితి ఎన్డీయే కూటమికి కూటమికి అనుకూలంగా వున్నట్టు పరిశీలకులు భావించారు. ఆ తర్వాత పరిస్థితి నితీష్ కుమార్ నాయకత్వంలోని లౌకిక కూటమికి అనుకూలంగా మారుతున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్డీయే హవా నడవబోతోందని అనుకున్నారు. అయితే గురువారం చిట్టచివరి విడత పోలింగ్ పూర్తయిన తర్వాత పరిస్థితి గమనిస్తే బీహార్లో మళ్ళీ నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చే అవకాశాలున్నాయన్న సూచనలు కనిపిస్తు్న్నాయని అంటున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నాయి. మొత్తం ఏడు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఐదు సంస్థలు మళ్ళీ నితీష్ గవర్నమెంట్ రానుందని చెబితే, రెండు సంస్థలు మాత్రం ఎన్డీయే అధికారంలో కావచ్చన్నట్టుగా ఫలితాలను వెల్లడించాయి. అయితే బీహార్లో ప్రస్తుతం నెలకొన్న ‘హవా’ని గమనిస్తే మాత్రం నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నితీష్ కుమార్‌కి వున్న క్లీన్ ఇమేజ్ ఆయన విజయానికి దోహదం చేయనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదట లౌకిక కూటమితో జతకట్టిన ములాయం సింగ్ యాదవ్ ఆ తర్వాత దూరమైనా, అవినీతిపరుడిగా ముద్ర వున్న లాలూ ప్రసాద్ యాదవ్ లౌకిక కూటమిలో వున్నప్పటికీ ప్రజలు నితీష్‌ వైపే మొగ్గు చూపించారని భావిస్తున్నారు. ఈ ఎన్నికలలో తన నాయకత్వంలో వున్న ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవి విషయంలో నితీష్ కుమార్‌తో పోటీ పడబోనని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించడం కూడా ఒక శుభ పరిణామమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్లో బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బీజేపీ నాయకులు అంగీకరించకపోయినప్పటికీ, వారి మనసులలో ఇప్పటికే గుబులు బయల్దేరిందని చెప్పవచ్చు.

సీమ పోరాటానికి ఆజ్యం పోస్తున్న వారు సీమ కోసం ఏమి చేసారు?

  వైకాపా సీనియర్ నేత ఎం.వి. మైసూరా రెడ్డి ఈ నెల 20న పార్టీకి రాజీనామా చేసి, 21వ తేదీన రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధన సమితి’ ని స్థాపించబోతున్నట్లు వార్తలు వచ్చేయి. దాని కోసం సీమకు చెందిన కాంగ్రెస్, వైకాపా నేతలు ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. మళ్ళీ త్వరలో తిరుపతిలో మరోమారు సమావేశం కాబోతున్నట్లు మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రా రెడ్డి చెప్పారు. మళ్ళీ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూనే, ప్రత్యేక రాష్ట్రం కోసం తాము చేయబోయే ఉద్యమానికి రాయలసీమ వాసులయిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మద్దతు ఈయాలని కోరడం విశేషం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తారని ఆయన ఏవిధంగా ఆశిస్తున్నారో తెలియదు.   ఈ ఉద్యమానికి వైకాపా నేత మైసూరా రెడ్డి నాయకత్వం వహించడం నిజమయితే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అనుమానించక తప్పదు. తనపై అనుమానం కలుగకూడదనే ఆలోచనతోనే మైసూరా రెడ్డి చేత పార్టీకి రాజీనామా చేయిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకి జగన్మోహన్ రెడ్డి వెనుక నుండి ప్రోత్సహిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.   తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.   గత అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండా సున్నితమయిన ఈ సమస్యపై వైకాపా అనాలోచితంగా, దుందుడుకుగా వ్యవహరిస్తే రాష్ట్రం మళ్ళీ అగ్ని గుండంగా మారే ప్రమాదం ఉంది. రాయలసీమ ప్రాంతం చాలా దశాబ్దాలుగా పాలకుల నిరాదరణకు గురయింది. విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని ఏలినవారిలో చాలా మంది సీమకు చెందినవారే అయ్యి ఉండటం. పాలకులు, ప్రజా ప్రతినిధులకు తమతమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల ఉంటే, అందుకు అవసరమయిన కృషి చేసినట్లయితే దేశంలో ఏ ప్రాంతము కూడా వెనుకబడి ఉండదు. కానీ చాలా మంది నేతలు తమ రాజకీయ ప్రయోజనాలు, పదవులు, అధికారం, కాంట్రాక్టులు, అక్రమార్జనలపై ఉన్నంత ఆసక్తి తమతమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవడంపై చూపకపోవడం వలననే దేశంలో చాలా రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు.   ఇప్పుడు రాయలసీమ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్నవారిలో ఎంతమంది నేతలు తమ తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకొన్నారు? తమ చేతిలో ఉన్న అధికారం లేదా పలుకుబడితో తమ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయించారు? ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు? అసలు ప్రజల కోసం ఏమి చేయగలిగారు?అని వారిని సమర్దిస్తున్నవారు ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. అటువంటి స్వార్ధ రాజకీయ నాయకులను నమ్ముకోవడం కంటే, సీమ ప్రజలే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు కావలసినవన్నీ సాధించుకోవడం మంచిది.

కేసీఆర్‌కి డుమ్మాలు అలవాటైపోయింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, ఆయన వ్యవహార శైలి మీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఆయన ఎంతమాత్రం మారరు. అదే ఆయన శైలి. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా తాను చేయాలనునకున్నది చేసేయడం ఆయన తత్వం. ఎంతైనా దొర కదా! ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హాజరు కావలసిన కార్యక్రమాలకు కూడా తన కుమారుడు కేటీఆర్నో, మరొకరినో పంపించి తాను మాత్రం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ని ఫామ్ హౌస్ సీఎం అని ప్రతిపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఆయన తన ధోరణిని మార్చుకోవడం లేదు. పలువురు ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడం పట్ల ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులు చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఏ జ్వరమో జలుబో వస్తే కార్యక్రమాలకు హాజరు కాకపోతే పర్లేదు... అంతా బాగున్నా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడమేంటో అర్థం కావడం లేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. తాజాగా జరిగిన ఇలాంటి ఒక కార్యక్రమాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గురువారం నాడు టాటా సంస్థల మాజీ అధినేత హైదరాబాద్‌లో జరిగిన ఒక కీలకమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఐఐటీలో ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో రూపొందిన అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథితిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాల్సిన కార్యక్రమం ఇది. అయితే ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రమే పాల్గొన్నారు. ఎక్కడో ముంబైలో వున్న తాను వచ్చినప్పటికీ, ఇక్కడే వున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం పట్ల రతన్ టాటా చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య ఆయన ఆంధ్రప్రదేశ్‌‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రతన్ టాటాతో భేటీ అయ్యారు. రతన్ టాటా ఆ సందర్భంగా ఏపీలోని 264 గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు. రతన్ టాటా లాంటి వ్యక్తం వచ్చినప్పుడు ఆయనను సముచిత రీతిన గౌరవించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోరాల్సింది బదులు.. అసలు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ ఇలా డుమ్మా కొట్టడం బాగా అలవాటు చేసుకున్నారని విమర్శిస్తున్నాయి.

ఈ అనుకోని అతిథులేంట్రా దేవుడా!

మన దేశానికి అనుకోని అతిథులు ఎక్కువైపోతున్నారు. మొన్నటి వరకూ కసబ్ అనే అనుకోని అతిథిని జైల్లో కూర్చోపెట్టి మేపడానికి మన ప్రజల సొమ్ము ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టారో గుర్తుండే వుంటుంది. అలాంటి ఖరీదైన క్రిమినల్ అతిథులు రెస్టు తీసుకోవడానికి మన దేశం అన్ని విధాలుగా అనుకూలంగా వున్నట్టుంది. ఇప్పటికీ మన జైళ్ళలో కసబ్ లాంటి ఖరీదైన అతిథులు చాలామంది హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కోర్టుల్లో ఇప్పుడప్పుడే తేలని కేసుల పుణ్యమా అని సదరు అతిథులు ఎంత ఘోరమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ మన జైళ్ళలో మహారాజ భోగాలను అనుభవిస్తున్నారు. అలా రెస్టు తీసుకోవడానికి మరో మహారాజు ఛోటా రాజన్ ఇండియాకి వచ్చాడు. ఇండోనేసియాలో అరెస్టైన ఛోటా రాజన్ సకల భద్రతా ఏర్పాట్లతో ఢిల్లీలో దిగాడు. ఇక ఆయన అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం చేసిన నేరాల విచారణ ఎన్ని దశాబ్దాలపాటు జరుగుతుందో ఆ దేవుడికే ఎరుక. అసలు ఇప్పుడు చాలామందికి వచ్చిన సందేహం ఏమంటంటే, అసలు ఛోటారాజన్‌ని ఇండోనేసియా పోలీసులు పట్టుకున్నారా... లేక ఇండియా జైళ్ళలో భద్రతా ఏర్పాట్ల మధ్య రాజభోగాలు అనుభవించవచ్చని ఆయనగారే ఒక పథకం ప్రకారం దొరికిపోయాడా? ఏమో.. క్రిమినల్ బ్రెయిన్ అలా కూడా ఆలోచించి వుండొచ్చు. ఎలాగూ దావూద్ గ్యాంగ్ నుంచి ఆయనకి ప్రాణభయం వుంది. అలాంటి వ్యక్తికి ఇండియా జైళ్ళకు మించిన సేఫ్ ప్లేస్ మరోటి వుంటుందా? పైగా వయసు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ జైళ్ళలో వుండటమే మంచిదని భావించి దొరికిపోయాడేమో! ఛోటారాజన్ ఢిల్లీకి వచ్చీ రావడంతోనే దావూద్ ఇబ్రహీం మీద పగ తీర్చుకుంటానని, అతని అంతు చూస్తానని స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. భారతదేశానికి ప్రధాన శత్రువైన దావూద్ ఇబ్రహీం శత్రువు అంటే మనకి, మన రాజకీయ నాయకులకి మిత్రుడే కదా. మన జైళ్ళలో శత్రువులకే రాజభోగాలు అందుతాయి. మరి మన మిత్రుడికి ఎలాంటి భోగాలు అందనున్నాయో ఊహించుకోవచ్చు. దావూద్ గుట్టుమట్లు తెలుసుకోవాలంటే ఛోటా రాజన్‌ని జైల్లో మర్యాదలకు ఎంతమాత్రం లోటు రాకూడదు. ఏం చేస్తాం...

చదువు తర్వాత... మనోధైర్యం పెంచండి...

తల్లిదండ్రులకు తమ పిల్లలే కంటి దీపాలు. ఆ దీపాలను కంటికి రెప్పల్లాగా కాపాడుకుంటూ వుంటారు. వారిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూ వుంటారు. అయితే ఇటీవలి కాలంలో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులను కలతకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు చదువులు చెప్పించే విషయం తర్వాత... ముందు వారిలో మనో ధైర్యం పెంచే విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతూ వుండటం బాధను కలిగిస్తోంది. మార్కులు సరిగా రాలేదనో, ఎవరో ఏదో అన్నారనో, ప్రేమ విఫలమైందనో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కారణాలను చూస్తుంటే ఇలాంటి కారణాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతారా అనిపిస్తూ వుంటుంది. ప్రస్తుతం తల్లిదండ్రులుగానీ, విద్యా సంస్థలు గానీ విద్యార్థులను బాగా చదవండి.. బాగా చదవండి అని ఒత్తిడికి గురి చేస్తూ వుంటారు. వారిని బాగా చదివించే విషయాన్ని తర్వాత ఆలోచించవచ్చు... ముందు విద్యార్థులలో మనోధైర్యం పెరిగేలా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు కృషి చేయాల్సిన అవసరం వుంది. ఉజ్వల భవిష్యత్తు వున్న యువతీ యువకులు చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడటం ఇకపై జరగకూడదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వాలూ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వుంది.

‘అసహన’ ఉద్యమంపై భిన్నస్వరాలు

  గత కొద్ది రోజులుగా దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు తమకు గతంలో వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ అందించిన అవార్డులను వెక్కి ఇచ్చేస్తున్నారు. దేశంలో మత అసహనం పెరిగిపోవడానికి ప్రస్తుతం అధికారంలో వున్న బిజేపీయే కారణమని చాలామంది ఆరోపిస్తున్నారు. అధికారంలో వున్న బీజేపీ ముస్లింల మీద దాడులకు ప్రోత్సహిస్తోందని వారు అంటున్నారు. ఈ అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుంటే, అధికార బీజేపీ నాయకులు మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఈ అంశాన్ని లేవనెత్తి ఒక పథకం ప్రకారం  అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారని అంటున్నారు. ఒక మతం వారి మీద మరొక మతం వారు దాడి చేయడం లాంటి సంఘటనలు దేశంలో అడపా దడపా జరుగుతూనే వున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో గో మాంసానికి సంబంధించిన అంశంలో దాడులు జరిగాయి. అయితే ఆ దాడులను ప్రభుత్వానికి ఆపాదించడం మాత్రం సరైనది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రచయితలు తమకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేయడం అనేది తమను తామే అవమానించుకున్నట్టు అవుతుందని పలువురు అంటున్నారు. బాలీవుడ్‌లో ఒక వర్గం మత అసహనం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే, అంతకు పదింతల మంది ఈ అంశాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. సహనం ఇదిలా వుంటే, సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన 80 మంది రచయితలో ఇప్పటి వరకు 36 మంది మాత్రమే తమ అవార్డులను వెనక్కి ఇచ్చారట. వారిలో 24 మంది మాత్రమే తమకు అందిన నగదు బహుమతిని కూడా వెనక్కి ఇచ్చారట. ఈ వివరాలను సాహిత్య అకాడమీ అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ సాహిత్య అకాడమీ ఎంతో గౌరవంగా ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వడం భావ్యం కాదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విజయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ప్రతిపక్ష పార్టీల మీద ప్రభుత్వ ఆధిక్యమే ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి అనేక సందర్భాలలో న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు అయితే పడ్డాయిగానీ, ప్రతిపక్షాల నుంచి చెప్పకోదగ్గ ప్రతిఘటన ఎదురు కాలేదు. ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వ ధాటికి నిలబడలేక గందరగోళంలో పడిపోయాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విజయం సాధించే విషయం అటుంచితే, అసలు ప్రతిపక్షాల ఉనికికే టీఆర్ఎస్ పార్టీ గండి కొట్టే ప్రయత్నాలు చేసింది. ‘ఆపరేషన్ ఆకర్ష’ ద్వారా ప్రతిపక్షాలకు అధికార పార్టీ చెక్ పెట్టింది. ఈ ‘ఆపరేషన్ ఆకర్ష’ నుంచి తప్పించుకోవడానికే వీలు కాక ప్రతిపక్షాలు అల్లాడిపోయాయి. ఇక ప్రభుత్వం మీద విజయం సాధించడం కూడానా! అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు... భూమి గుండ్రంగా వుందనే సామెత వుండనే వుంది. ఇంతకాలం ప్రభుత్వం ధాటికి బెంబేలెత్తిపోయిన ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వం మీద విజయం సాధించాయి. కలసికట్టుగా పనిచేసి చాలా కాలం తర్వాత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఉమ్మడిగా పోరాటం చేశాయి. ప్రతిపక్షాల పోరాట ఫలితంగా కేంద్ర ఎన్నికల సంఘం కదిలింది. హైదరాబాద్‌కి బృందాన్ని పంపి పరిస్థితిని గమనించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం  జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పునఃపరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం  ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రతిపక్షాల పోరాటం వల్లనే సాధ్యమైంది. మొత్తానికి చాలాకాలం తర్వాత ప్రభుత్వం మీద ఒక విజయం సాధించిన తెలంగాణ ప్రతిపక్షాలకు అభినందనలు.

తెదేపా-బీజేపీలు పోరాడవలసింది పరస్పరం కాదు కేంద్రంతో

  తెదేపా-బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో మీడియాకు పని కల్పిస్తున్నారు. వారి యుద్దాలకి ఎవరి కారణాలు వారికి ఉండవచ్చును. ఆ రెండు పార్టీల అధిష్టానాలు కూడా వాటిని నివారించేందుకు గట్టి ప్రయాత్నాలు ఏవీ చేస్తున్నట్లు కనబడటం లేదు. బహుశః దానికీ ఎవరి కారణాలు వారికి ఉండి ఉండవచ్చును. అవి చేస్తున్న యుద్దాల కంటే, వాటి గురించి మీడియాలో అనేక కోణాలలో వస్తున్న రాజకీయ విశ్లేషణల వలన ఆ రెండు పార్టీలకు ఇంకా నష్టం జరిగే అవకాశం ఉందని గ్రహిస్తే వారు ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి పరస్పరం కత్తులు దూసుకోరు.   ఆ రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధి చేస్తాయనే ఆలోచనతోనే ప్రజలు వాటికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చిన దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధి చేస్తాయనే ఆలోచనతోనే పోటీ చేయకుండా తప్పుకొని వాటికి మద్దతు ఇచ్చేరు. ఆయన ఎన్డీయే అభ్యర్ధుల తరపున చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలతో కలిసి చేసిన ప్రచారం ఆ రెండు పార్టీల విజయానికి ఎంతో దోహదపడింది. కనుక పరస్పరం కత్తులు దూసుకొంటున్న తెదేపా-బీజేపీలు తమ తరపున ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను, భరోసాను నిలబెట్టు కోవలసిన బాధ్యత ఉంది.   ఏదో ఒక లోపం..లేదా కారణం చూపిస్తూ పరస్పరం విమర్శలు చేసుకోవడం కంటే, రెండు పార్టీల నేతలు కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, అమలుకావలసిన హామీల గురించి కేంద్రంపై ఒత్తిడి తేగలిగితే వాళ్ళకీ, ప్రజలకీ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. అలా కాక ఆ రెండు పార్టీల మధ్య సాగుతున్న ఈ యుద్ధాల వలన రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయినట్లయితే, అందుకు ఆ రెండు పార్టీలే చివరికి మూల్యం చెల్లించుకోవలసి రావచ్చునని గ్రహిస్తే మంచిది..

తెరాస వ్యూహానికి తెదేపా చెక్!

  ఇంతకు ముందు తెదేపాలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తెరాస ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు తన రాజీనామాను స్పీకర్ చేత ఆమోదింపజేసుకోకపోవడం చేత ఆయనే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సనత్ నగర్ నియోజక వర్గంలో ఆంధ్రాకు చెందిన ప్రజలు చాలా మంది స్థిరపడున్నారు. ఇదివరకు తలసాని తెదేపాలో ఉన్న కారణంగా వారు ఆయనకు ఓటు వేసి గెలిపించారు. కానీ ఆయన తెదేపాలో ఉంటారని భావించి ఓట్లు వేసి గెలిపిస్తే, తమ అభీష్టానికి విరుద్దంగా ఆయన తెరాసలో చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక ఆయన మళ్ళీ సనత్ నగర్ నుంచి పోటీ చేస్తే వాళ్ళ ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉండకపోవచ్చును. బహుశః ఆ భయంతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇంతవరకు ఆమోదింపజేసుకోలేదని భావించవచ్చును. కానీ ఏదో ఒకనాడు అదే సనత్ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయక తప్పదు. ఆయన తెదేపాను వీడి తెరాసలో జేరినప్పుడు ఆయనతో బాటు ఆయన అనుచరులు కూడా తెరాసలో చేరారు. అయితే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గంలో తెదేపా చాలా బలంగానే ఉంది. కనుక ఈ పరిస్థితిలో తెదేపాను బలహీనపడితే తప్ప అక్కడ తలసాని విజయం సాధించడం అసంభవం. అందుకే సనత్ నగర్ నియోజక వర్గానికి తెదేపా ఇన్-చార్జ్ గా వ్యవహరిస్తున్న కూన వెంకటేష్ గౌడ్ ని తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి. వెంకటేష్ గౌడ్ తెదేపాకు గుడ్ బై చెప్పి తెరాసలోకి వెళ్లిపోబోతున్నారని ఆ మధ్యన మీడియాలో వార్తలు వచ్చేయి.   తెదేపా కూడా దీనికి విరుగుడుగా ఒక వ్యూహం అమలు చేస్తోంది. సనత్ నగర్ నియోజక వర్గానికి జరుగబోయే ఉప ఎన్నికలలో తెదేపా అభ్యర్ధిగా కూన వెంకటేష్ గౌడ్ నే నిలబెట్టాలని నిశ్చయించుకొంది. దానితో తెరాస వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. ఎవరిని తమ పార్టీలోకి ఆకర్షించాలని అనుకొందో వారితోనే తలపడాల్సిన పరిస్థితి ఎదురయింది.   అసలు ఆయన గత ఎన్నికలలోనే సనత్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సీటును తలసానికి ఇవ్వవలసి వచ్చింది. కానీ ఆయన తెదేపాకు హ్యాండిచ్చి తెరాసలోకి వెళ్ళిపోయారు. తనకు దక్కవలసిన సీటును తలసాని దొంగిలించుకొని పారిపోయారని వెంకటేష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఈసారి తనకే సనత్ నగర్ నుండి పోటీ చేసే అవకాశం ఇస్తామని తెదేపా అధిష్టానం స్పష్టమయిన హామీ ఇవ్వడంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు.   గత శుక్రవారం బేగంపేటలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు నేతల సమావేశంలో కూన వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ “నేను పార్టీని వీడుతానని మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. నా చివరి శ్వాస వరకు తెదేపాలోనే కొనసాగుతాను. పార్టీ కోసం పనిచేతూనే ఉంటాను. ఆదరించిన పార్టీని మోసం చేసి తెరాసలో వెళ్ళిన వారందరికీ ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలి. తెలంగాణాలో, మన నియోజక వర్గంలో తెదేపాను పటిష్టపరిచేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి,” అని కోరారు.

మైసూరాకి అంత సీనుందా?

వైసీపీ నాయకుడు మైసూరారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి ‘రాయలసీమ సాధన సమితి’ అనే ఉద్యమ సంస్థ ద్వారా ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్యమం చేసే విషయంలో మైసూరారెడ్డికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వున్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులు మద్దతుగా నిలవబోతున్నారని సమాచారం. ప్రత్యేక రాయలసీమ రావాలని ఏనాటి నుంచో పెద్ద గొంతుకతో నినదించే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇప్పుడు చప్పుడు చేయడంలేదు. ఇప్పుడు ఆ చప్పుడు చేసే బాధ్యతను మైసూరారెడ్డి అండ్ టీమ్ తీసుకున్నందుకు అభినందనలు. అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపే శక్తి మైసూరారెడ్డికి లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు కాబట్టి ఈ ఉద్యమానికి, జగన్ పార్టీకి ఎంతమాత్రం సంబంధం లేదని అనుకోవడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిగానీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ ఎంతమాత్రం మనశ్శాంతిగా వుంచకూడదని కంకణం కట్టుకున్న జగన్ గారు పన్నిన సరికొత్త వ్యూహమిదని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు. వైసీపీ జెండా కింద రాయలసీమ ఉద్యమం చేసినట్టయితే కోస్తాంధ్రలో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది కాబట్టి మైసూరాని రంగంలోకి దించారన్నది బహిరంగ రహస్యమే. అయితే మైసూరాకి ఉద్యమాలు నడిపే శక్తి లేదని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు. ఆయన మీటింగ్ పెడితే వందల్లో తప్ప జనాలు రాని పరిస్థితులు వున్నాయి. పైగా ప్రత్యేక రాయలసీమ ఉత్సాహం రాజకీయ నాయకులకే వుంది తప్ప అక్కడి  ప్రజలకు లేదు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాయలసీమకు లభిస్తున్న ప్రాధాన్యాన్ని అక్కడి ప్రజలు గమనిస్తూనే వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైసూరా చేపట్టిన ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తుస్సుమనడం ఖాయమన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్‌లో విజయానికి కడియం సహకరిస్తారా?

వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వేడి పెరుగుతోంది. ప్రారంభ ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. టీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్, టీడీపీ-బీజేపీ అభ్యర్థిగా దేవయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా చివరి నిమిషంలో జరిగిన మార్పులతో సర్వే సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేసి రంగంలో నిలిచారు. ఆటలో అరటిపండులాగా వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కూడా రంగంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి పదవీ స్వీకారం చేయడం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది. కడియం శ్రీహరి రాజీనామా కారణంగా ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ స్థానం నుంచి తిరిగి టిఆర్ఎస్ అభ్యర్థి గెలవటానికి మాజీ ఎంపీ కడియం శ్రీహరి ఎంతవరకు సహకరిస్తారనేది ఇప్పుడు సందేహాస్పదంగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాను రాజీనామా చేసిన స్థానం కాబట్టి ఈ స్థానం నుంచి తన కుమార్తెకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కడియం శ్రీహరి పార్టీ అధినేత కేసీఆర్‌కి ఎంత విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యక్తి... ఈ వ్యక్తి అని నాలుగైదు ఆప్షన్లు పరిశీలించి, ఒక వ్యక్తిని అభ్యర్థిగా ఖాయం చేసి చివరికి పసునూరి దయాకర్‌ని అభ్యర్థిగా ఎంపిక చేశారు. తన కుమార్తెను కాదని, తన దగ్గర వినయంగా వుండని పసునూరి దయాకర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల కడియం హర్టయినట్టు తెలుస్తోంది. దానికితోడు వరంగల్ జిల్లాలో తన పార్టీలో వున్న రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకి పసునూరి దయాకర్ సన్నిహితుడు. రాజయ్యకి, కడియం శ్రీహరికి మొదటి నుంచీ పడదు. దానికితోడు తన ఉప ముఖ్యమంత్రి సీటును లాగేసి దాన్ని కడియానికి ఇవ్వడంతో వారిమధ్య దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రాజయ్య మద్దతు ఇస్తున్న పసునూరి దయాకర్‌ విజయానికి కడియం మనస్పూర్తిగా సహకరించడం సందేహమేనని పరిశీలకులు అంటున్నారు.

అందుకే బాబు, మోడీ తెదేపా-బీజేపీ నేతల యుద్దంలో కలుగజేసుకోవడంలేదేమో?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా-బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకొంటోంది. బీజేపీ నేత సోము వీర్రాజు అవసరమయితే తెదేపా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి దానితో పోరాడుతామని హెచ్చరిస్తుంటే, ఆయనను అదుపులో ఉంచాలని బీజేపీ అధిష్టాన్ని కోరుతామని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.   తెదేపా ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిన కారణంగా ప్రజలలో దానిపట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని బీజేపీ నేత కావూరి సాంభశివరావు అంటే కావూరి,పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ అందరూ కూడా బీజేపీలో పనిచేస్తున్న సోనియాగాందీ ఏజెంట్లని, వారు రాష్ట్రంలో బీజేపీని అన్ని విధాల భ్రష్టు పట్టించేసి వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. తెదేపా-బీజేపీ నేతల మధ్య ఇంత తీవ్రంగా మాటల యుద్ధం జరుగుతున్నా కూడా తెదేపా-బీజేపీ అధిష్టానాలు వాటిని సీరియస్ గా తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కనుక వారి యుద్ధానికి బహుశః రెండు పార్టీల అధిష్టానాలు అనుమతి ఉన్నట్లేనని భావించవలసివస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపుడప్పుడు తన పార్టీ నేతలను హెచ్చరిస్తున్నప్పటికీ, బీజేపీతో వారి మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉందంటే, ఆయన అనుమతి ఉన్నట్లే భావించవచ్చును.   అయితే మిత్ర పక్షాలుగా ఉన్న ఆ రెండు పార్టీలు ఈవిధంగా ఎందుకు ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నాయని ఆలోచిస్తే దానికి ఎవరి కారణాలు వారికున్నట్లు కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలంటే, ప్రజలను దృష్టిని ఆకట్టుకోవడానికి ఆ మాత్రం ‘పవర్ పంచ్’లు ఉపయోగించక తప్పదు కనుకనే బీజేపీ అధిష్టానం వారి యుద్దాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని భావించవవలసి ఉంటుంది.   అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి అవసరమయిన సహాయ సహకారాలు కేంద్రం నుండి పొందాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. కానీ తమ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న తీవ్రమయిన ఆరోపణల వలన తెదేపా చాల నష్టపోయే ప్రమాదం ఉంది కనుక తమ పార్టీని కాపాడుకోవలసిన బాధ్యత, అవసరం తెదేపా నేతలకుంది. అందుకే వారు కూడా ఘాటుగా స్పందించక తప్పడం లేదు. రాష్ట్రస్థాయిలో తెదేపా, బీజేపీలు ఇంత తీవ్రంగా యుద్దాలు చేసుకొంటున్నప్పటికీ, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీల మధ్య బంధం చాల పటిష్టంగానే ఉంది. నరేంద్ర మోడీ అమరావతికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మెచ్చుకొంటూ మాట్లాడిన మాటలు, తెదేపాతో తమ స్నేహం ఎప్పటికీ బలంగా కొనసాగుతుందని ప్రకటించడం అందుకు చక్కని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.

వరంగల్‌లో వైసీపీ పోటీ ఎందుకుట?

బొంకరా బొంకరా పోలిగా అంటే... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాట్ట. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలాగే వుంది. తెలంగాణలో ఆ పార్టీకి అస్సలు ఉనికే లేదు. వైసీపీ అనే పార్టీని ఇక్కడ ఎవరూ పట్టించుకోనే పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు తమ పార్టీకి తెలంగాణలో బోలెడంత ఆదరణ వుందని చెప్పుకొస్తున్నారు. అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దంటూ వుండాలి కదా. అలాంటి హద్దులేవీ లేనట్టుగా వైసీపీ అబద్ధాలు చెబుతోంది. తనకు నిజంగా తెలంగాణలో ఉనికి ఉందని వైసీపీ నమ్ముతోందో లేక జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తోందో ఆ పార్టీ నాయకులకే ఎరుక. అదంతా అలా వుంటే, ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయడానికి వైసీపీ ముందుకు రావడం  చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఒకవైపు కేసీఆర్‌తో వైసీపీ నాయకుడు జగన్ సత్సంబంధాలను కొనసాగిస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవటానికి తన మద్దతు ప్రేమగా ఇస్తాడు. మెదక్ పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేస్తే వచ్చిన ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలపకుండా తన మిత్ర ధర్మాన్ని చాటాడు. తన పార్టీకి ఎలాగూ తెలంగాణలో సీన్ లేదు కాబట్టి టీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తూ నెట్టుకొస్తూ వున్న వైసీపీకి సడెన్‌గా వరంగల్‌లో పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో. టీఆర్ఎస్, వైసీపీల మధ్య ఏదైనా తేడా వచ్చిందన్న దాఖలాలు కూడా ఏవీ కనిపించడం లేదే. అలాంటప్పుడు వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం ఏమిటో! కాకపోతే, ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఓట్లను చీల్చి, తద్వారా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవటానికి పరోక్షంగా సహకరించే ఉద్దేశంతోనే జగన్ ఈ ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి శత్రువుగా కనిపిస్తూనే మేలు చేసే జగన్ లాంటి మంచి మిత్రుడు దొరికిన కేసీఆర్ అదృష్టవంతుడు.

మట్టి సత్యాగ్రహమా? సిగ్గుండాలి!

  ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టిలో కలిపేసినా ఆ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలిగినట్టులేదు... అందుకే ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధించాలన్న ఆశతో, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలన్న పథకంతో తంటాలు పడుతున్నారు. ఆ తంటాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ‘ఉప్పు సత్యాగ్రహం’ తరహాలో ‘మట్టి సత్యాగ్రహం’ చేయబోతోందని ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. అసలు ఇలాంటి పనీపాటాలేని సత్యాగ్రహాలు చేయడానికి ఎవరికైనా సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు వుందని రాష్ట్రంలో కొద్దిమంది అయినా భావిస్తూ వుంటారు. అయితే ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల ఆ కొద్దిమందికి కూడా తమ అభిప్రాయాలన్ని మార్చుకోవాలన్న ఆలోచన రావడం సహజం. గాంధీజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా  ఉప్పు సత్యాగ్రహం చేశారంటే ఒక అర్థం వుంది.  దాని స్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మట్టి సత్యాగ్రహం చేయబోతున్నారట. ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్రాన్ని కదిలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం వల్ల తాము మట్టి సత్యాగ్రహాన్ని చేపట్టనున్నామని రఘువీరారెడ్డి వారు సెలవిచ్చారు. అయితే మట్టి సత్యాగ్రహమో, మశానం సత్యాగ్రహమో చేపట్టేముందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అనే విషయం రఘువీరా గారు మరచిపోయినట్టున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, ఆంధ్రప్రదేశ్ చేతికి చిప్ప రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రఘువీరాగారు విస్మరించినట్టున్నారు. మరచిపోవడం, విస్మరించడం కాదు.. ఆయన జనాల జ్ఞాపక శక్తి మీద చాలా అపనమ్మకం పెట్టుకుని తెలివిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడినా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి కోలుకోవడం కలలోమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్ళలో మట్టి కొట్టిందే కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పార్టీ మట్టి సత్యాగ్రహం చేస్తామని అంటే మురిసి ముద్దులుపెట్టేవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ లేరు.

రాజయ్య కోడలు చనిపోయి సాధించిందా?

కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక ఆమె ముగ్గురు కుమారులు బుధవారం ఉదయం అగ్ని కీలలకు ఆహుతి అయిన  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య మీద, ఆయన కుమారుడి మీద సారిక చాలా సంవత్సరాలుగా చేస్తు్న్న న్యాయపోరాటం అర్ధంతరంగా ముగిసిపోయింది. కొంతమంది ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నారు. సారిక తరఫు బంధువులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు. ఈ మేరకు రాజయ్య మీద అతని భార్య, కుమారుడి మీద కేసు నమోదైంది. పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు. అయితే సారిక మరణం తర్వాత బయటి ప్రపంచానికి వెల్లడి అవుతున్న విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. రాజయ్య కుమారుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి సారిక రాజయ్య కుటుంబం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు మీడియాకు వివరిస్తున్నారు. అయితే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం వున్న సారిక ఇలా పిరికిదానిలా ఆత్మహత్య చేసుకుంటుందని తాము ఎంతమాత్రం ఊహించలేదని అంటున్నారు. అయితే సమస్యల ఒత్తిడిని తట్టుకోలేక, తన మామ రాజయ్యను రోడ్డుకు ఈడ్చడానికే సారిక ఇలాంటి పనికి ఒడిగట్టిందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎంపీ హోదాలో ఉన్న సమయంలో రాజయ్య తన కోడలిని అనేక రకాలుగా వేధించినట్టు సమాచారం. ఆ వేధింపులు తట్టుకోలేక సారిక రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిందట. రాజయ్య కుటుంబ సభ్యుల మీద గృహహింస చట్ట ప్రకారం కేసు కూడా పెట్టింది. రాజయ్యను బజారుకు ఈడ్చడానికి ఆమె అవిశ్రాంత యోధురాలిలా ప్రయత్నించేది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య టిక్‌ట్ ఆశిస్తున్న విషయం తెలుసుకుని సారిక కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు సమాచారం. రాజయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ ఇవ్వరాదని ఆమె ఆ లేఖలో కోరిందట. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజయ్యకే టిక్కెట్ ఇచ్చింది. బుధవారం నాడు ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాను చనిపోయి అయినా రాజయ్యను సాధించాలన్న ఉద్దేశంతోనే సారిక ఆత్మహత్య చేసుకుని వుండవచ్చని కొంతమంది అనుమానిస్తున్నారు. సారిక ఆ ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టయితే, ఆమె కోరుకున్నదే జరిగింది. రాజయ్య పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. రాజయ్య ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోయింది. అయితే దీన్ని సాధించడం కోసం తన ప్రాణాన్ని, ముగ్గురు చిన్నారుల ప్రాణాన్ని బలిచేయడం సారికకు తగదని పలువురు అంటున్నారు.

నరసింహన్ 69వ బర్త్ డే... కానీ...

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బుధవారం నాడు మామూలుగానే రాజ్‌భవన్లో జరిగే పుట్టినరోజు వేడుకల్లో గవర్నర్ కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. ఇంకా మామూలుగానే చాలామంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని, ఇంకా బోలెడన్ని పదవులు అధిష్ఠించాలని కోరుకుంటారు. పుట్టినరోజు సందర్భంగా వీలయితే గవర్నర్ గారు సతీ సమేతంగా ఏ దేవాలయానికో వెళ్ళి భగవద్దర్శనం చేసుకుంటారు. అంతా బాగానే వుందిగానీ... పాపం ఆయన మనసులో పుట్టినరోజు జరుపుకుంటున్నానన్న ఆనందం వుండి వుంటుందా అనేదే సందేహం.  ఎందుకంటే గవర్నర్‌గా ప్రతిష్ట బాగా మసకబారిపోయిన తర్వాత జరుపుకుంటున్న పుట్టినరోజు ఇది కాబట్టి. పోలీసు ఉద్యోగిగా ఉన్న సమయంలో సూపర్ ఆఫీసర్ అనిపించుకున్న ఆయన గవర్నర్‌గా అయిన తర్వాత మాత్రం సరైన పనితీరును ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలోగానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గవర్నర్‌గా విధి నిర్వహణలో ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన వివక్ష ధోరణి ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వున్నాయి.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ ప్రక్రియలకు సంబంధించి సంప్రదించడం తప్ప తప్ప ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా గౌరవం లభిస్తున్నదేమీ లేదు. ఒక రాష్ట్రం మొత్తానికీ మానసికంగా దూరమైపోయిన గవర్నర్‌గా ఆయన వున్నారు. ఇది ఏ గవర్నర్‌కయినా కొంత ఇబ్బంది కలిగించే విషయమే. నరసింహన్ కూడా దానికి అతీతుడేమీ కాదు... అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు హ్యాపీ బర్త్ డే.