కేబినెట్ పెరిగింది..కోటీశ్వరులు పెరిగారు..
posted on Jul 9, 2016 @ 4:09PM
ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందించేందుకు వీలుగా ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 19 మంది కొత్త మంత్రులను చేర్చుకుని, ఐదుగురికి ఉద్వాసన పలికారు. దీంతో కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 78కి చేరింది. ఈ మంత్రుల నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అధ్యయం చేసింది. వీరిలో 24 మందిపైనా, కొత్త వారిలో ఏడుగురిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. అలాగే కొత్తగా కేబినెట్‌లో చేరిన మంత్రుల ఆస్తులు సగటున రూ.8.73 కోట్లు కాగా, మొత్తం మంత్రివర్గ సభ్యుల సగటు ఆస్తుల విలువ రూ.12.94 కోట్లకు చేరింది.
నూతన మంత్రుల్లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంజే అక్బర్ అత్యధికంగా రూ.44.09 కోట్ల ఆస్తులు కలిగి నెంబర్‌వన్‌గా నిలిచారు. రాజస్థాన్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పీపీ చౌదరి రూ.35.35 కోట్లు, విజయ్‌గోయల్ రూ.29.97 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది. కొత్త మంత్రులు రమేశ్‌జిగాజీనాగి, పురుషోత్తం ఖొడాభాయి రూపాలా, అనుప్రియాసింగ్ పటేల్, మహేంద్రనాథ్, ఫగ్గన్‌సింగ్ కులస్తే, రాజెన్ గొహైన్, ఎస్‌ఎస్ అహ్లువాలియా, అర్జున్‌రాం మేఘ్వాల్, సీఆర్ చౌదరి, ఎంఎల్ మాండవీయ, కృష్ణరాజ్ ఆస్తులు రూ. కోటి పైనే ఉంటాయి.
రూ.113 కోట్ల ఆస్తులతో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ కేంద్ర కేబినెట్‌లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అయితే 2016 ఆర్థిక సం.రానికి గాను జైట్లీ ఆస్తుల విలువ (8.9 శాతం) 6 కోట్లకు క్షీణించిందని తెలిపింది. 2014-15లో రూ 67. 01 కోట్లుగా ఉన్న జైట్లీ వ్యక్తిగత సంపద , 2015-16 లో రూ 60.99 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఆయన చర, స్థిర ఆస్తుల డేటా వివరాలను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో అధికారికంగా వెల్లడించారు. జైట్లీకి, ఆయన భార్యకు ఉమ్మడి ఆస్తిగా ఆరు(ఢిల్లీ, గుర్గావ్, హర్యానా పంజాబ్ లోని అమృతసర్, గుజరాత్ లోని గాంధీనగర్) రెసిడెన్షియల్ ఆస్తులు ఉన్నాయి. జైట్లీ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హరిసిమ్రత్‌కౌర్ బాదల్ రూ.108 కోట్లు, విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్ వేద్‌ప్రకాశ్ రూ.95 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. కొత్త మంత్రుల్లో ఆరుగురు మాత్రం తమ ఆస్తుల విలువ రూ. కోటి లోపేనని ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడైన పర్యావరణశాఖ మంత్రి అనిల్‌మాధవ్‌దవే తన ఆస్తి కేవలం రూ.60.97 లక్షలని ప్రకటించారు.