అభివృద్ధికి అడ్డంకిగా భూసేక"రణం"
posted on Jul 11, 2016 @ 7:43PM
ఎక్కడబడితే అక్కడ భూసేకరణ..నిన్న రాజధాని కోసం అన్నారు..ఇప్పుడు పవర్‌ప్లాంట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్ట్‌ల కోసం అంటున్నారు. భూములను బతకనివ్వరా..? ఇది ఏపీలో భూసేకరణ జరుగుతున్న వివిధ ప్రాంతాల్లోని రైతుల అక్రందన. భోగాపురం, కొవ్వాడ, పొలాకి, బందరు ఇలా ప్రాంతమేదైనా..ప్రాబ్లమ్ మాత్రం ఒక్కటే..వినిపించేది భూములు ఇచ్చేది లేదన్న మాటే. అందుకు కారణం ఒక్కటే..ఇన్నాళ్లూ భూమికి రేటు లేదు. రెండు పంటలు పండనీ..అసలు పండకపోయినా ఎకరం పది లక్షలు పలికితే గొప్పే..ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్న తరువాత..ఇప్పటికే ఎకరం 40, 50 లక్షలు పలుకుతోంది..ఇలాంటి సమయంలో భూములు లాక్కుంటానంటే రైతులకు మంటే..?
కోనేరు సెంటర్ టు హుస్సేన్‌పాలెం..కోనేరు సెంటర్ టూ చిలకలపూడి ఈ పేర్లు చెప్పగానే కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం గుర్తొస్తుంది కదూ. బ్రిటీష్ హయాంలో ఒక ప్రముఖ పట్టణంగా వెలుగొందిన మచిలీపట్నం..ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా ఉంది..ఎన్నాళ్లు తిరగని..ఎన్నేళ్లు గడవనీ..ఇప్పటికే అదే పరిస్థితి పావలా మార్పు కూడా లేదు. ఇక్కడ పోర్ట్ నిర్మిద్దామని ప్రభుత్వం అలా అనుకుందో లేదో..పోర్ట్‌కు మేం వ్యతిరేకం..మా భూముల జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటాం అంటూ అక్కడి ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. బందరు పోర్ట్ వస్తే ఇన్‌ఫ్రా డెవలప్ అవుతుంది. మంచి రోడ్లు, పరిశ్రమలు, రాకపోకలు వాటికి తగ్గట్టే ఏరియా రూపురేఖలే మారిపోతాయి.
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు అవుతున్నా ఉత్తరాంధ్ర వెనుకబడే ఉంది. పొట్టచేత పట్టుకొని నిత్యం సుదూర ప్రాంతాలకు వలసలు పోవడం ఉత్తరాంధ్ర దౌర్భాగ్యం. నిరక్షరాస్యత, రక్షిత మంచినీరు, వైద్య సేవలు ఇలా అన్నింటా వెనుకబాటే. ఆఖరికి డయేరియా, మలేరియా వంటి చిన్న వ్యాధులతో అక్కడి వారు మరణిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చి ఉత్తరాంధ్ర తలెత్తుకునేలా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. అందుకే థర్మల్ విద్యుత్ ప్లాంట్, అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించదలచారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు నేరుగా ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
చెప్పుడు మాటల ప్రభావమో..లేక మరే కారణమో తెలియదు కానీ ఆ ప్రాంతపు రైతులు ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. అమరావతిలో అమలు చేసిన ల్యాండ్‌పూలింగ్ అమలు చేసి అన్యాయం జరగకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చినప్పటికి వారి వైఖరిలో మార్పు లేదు. ఈ విధానం వల్ల మీరు నష్టపోతారని..అలా కాకుండా భూసేకరణ చట్టం అమలు చేస్తే నాలుగు రెట్ల నష్టపరిహారం లభిస్తుందని కొన్ని శక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ప్రచారం కూడా రైతుల మదిలో బలంగా నాటుకుపోయింది. ఇది అసలుకే మోసం తెచ్చి అభివృద్దిని అడ్డుకుంటోంది. ఒత్తి రగిలితేనే వెలుతురు..నూనె ఇంకితేనే వెలుతురు..ప్రమిద కాలితేనే వెలుతురు లేదంటే మిగిలేది చీకటే..!