వీళ్లు లేకపోతే కేసీఆర్ వల్లకాదు..!
ఎన్నో పోరాటాలు, మరేన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు తొలి సారథ్య బాధ్యతలు స్వీకరించింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు పాలన పరాయి వారిది కాదు.. మనవారిది ఇప్పుడు పనులు జరగడం లేదని చెప్పడానికి వీల్లేదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రతి పనిని చేయాలని మంత్రులకు, అధికారులకు క్లాసులు పీకారు. పేరుకు క్యాబినెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మొత్తం 18 మంది ఉన్నారు. ఇందులో నలుగురైదుగురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, తుమ్మల, కడియం, తలసాని ఈ ఆరుగురు తెలంగాణ పాలనకు ఆరు ప్రాణాలు.
తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్..పాలనపై నెమ్మదిగా పట్టు సాధించారు. తనదైన శైలిలో స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు శాఖపై పట్టుసాధించారు. జలవివాదాలు, ప్రాజెక్ట్‌ల పురోగతి, మహారాష్ట్రతో ఒప్పందాలు ఇలా అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ తనయుడు గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సీఎం తరువాత నెంబర్-2గా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఐటీ పాలసీలు, పెట్టుబడుల ఆకర్షణ ఇలా తన శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని భావించిన కేసీఆర్..విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరిని నియమించారు. ఆయన కూడా ఆ దిశగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక తుమ్మల విషయానికి వస్తే రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విధంగా రోడ్ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దుతున్నారు. నిన్న మొన్నటి వరకు వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించిన తలసాని ఆ శాఖను పరుగులు పెట్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పన్ను వసూలు చేయించి సీఎం మెప్పు పొందారు.
వీరు ముగ్గురు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కలవారు. పైగా అప్పుడు ఏ శాఖలు నిర్వహించారో అవే శాఖల్ని కేసీఆర్ కేటాయించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు పని చేసుకుపోతున్నారు. ఇక మిగిలిన 12 మంది వచ్చామా..? వెళ్లామా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఇంకా శాఖలపై పట్టుబిగించకపోవడంతో సీఎం వీరిపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని..వీరి స్థానంలో సమర్థులైన వారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.