సినీ ఇండస్ట్రీపై రివ్యూల ఎఫెక్ట్ !
ఓ సినిమా హిట్ అవ్వాలన్నా.. ఫట్ అవ్వాలన్నా.. దానిని డిసైడ్ చేసేది పబ్లిక్ టాకే. అయితే.. ఇప్పుడు రివ్యూలు కూడా సినిమా ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుండటమే ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడుతుందోనే చర్చ జరుగుతోంది. వెబ్‌సైట్స్, మీమ్స్, ట్రోల్స్, హ్యాష్ ట్యాగ్స్.. ఇలా ప్రతీది సినిమా రిజల్ట్‌పై ఎంతో కొంత ఇంపాక్ట్ చూపుతున్నాయ్. వాస్తవానికి, ఒకప్పటితో పోలిస్తే.. ఆరేడు ఏళ్ల నుంచే.. ఈ రివ్యూ ట్రెండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో.. సినిమా రివ్యూలు అంటే.. జస్ట్ ఓవర్సీస్ మార్కెట్ వరకే పరిమితమయ్యేవి. కానీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూవీ రివ్యూలు, వెబ్‌సైట్లు, ట్రోలింగ్స్, మీమ్స్.. ఇలా అన్నీ ఓ మాఫియాలా క్రియేట్ చేయబడ్డాయి.
కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ రివ్యూయర్లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్, మీమ్ పేజీలు.. ఇలా అంతా బ్లాక్ మెయిల్ చేసేదాకా వచ్చాయ్ పరిస్థితులు. వీళ్లలో.. కొందరిపై.. ఒకరిద్దరు నిర్మాతలు పోలీసు కేసులు కూడా పెట్టారు. నిజం చెప్పాలంటే, ఇండస్ట్రీలో పక్క సినిమాలను తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అపవాదు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రతివారం 4 నుంచి 6 సినిమాలు రిలీజవుతుంటాయ్. కొందరు ప్రొడ్యూసర్లు, హీరోలు.. తమ సొంత డిజిటల్ పీఆర్ సిస్టమ్‌తో.. ట్రైలర్లకు నెగటివ్ కామెంట్లు, డిస్ లైక్స్, ఐఎంబీడీలో రేటింగ్స్, బుక్ మై షో యాప్‌లో లైక్స్, రేటింగ్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా నెగటివ్ క్యాంపెయిన్, పెయిడ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లాంటివాటన్నింటికీ, డబ్బులిచ్చి మరీ పక్క సినిమాని తొక్కడం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కామన్ అయిపోయిందనే చర్చ జరుగుతోంది.
అంతే కాదు.. కొందరైతే ఫేక్ కలెక్షన్ పోస్టర్లు కూడా వేసి.. హీరో ఫ్యాన్స్‌ని, ప్రొడ్యూసర్లని, మూవీ టీమ్‌ని.. అయోమయానికి గురిచేస్తున్నారు. ఇదంతా కొన్ని పీఆర్ టీమ్‌లు ఆడుతున్న గేమే అనే టాక్ వినిపిస్తోంది. కావాలనే.. ఇదంతా చేయిస్తున్నారని ప్రొడ్యూసర్లు అంటున్నారు. తమ సినిమాతో పాటు ఒకే వారం రిలీజయ్యే సినిమాని రేసులో లేకుండా చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. గతంలో నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు ఈ విషయాన్ని బాహాటంగానే మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈ రకమైన పీఆర్ సిస్టమ్‌తో హీరోలు, ప్రొడ్యూసర్లను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇక సినిమా రిలీజ్‌కు ముందు కనిపిస్తున్న హంగామా, ప్రమోషన్లు.. సినిమా రిలీజయ్యాక అస్సలు కనిపించట్లేదు. సినిమా రిలీజ్ తర్వాత జరిగే ప్రమోషన్లపైనా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ సినిమాకూ కూడా రిలీజ్ తర్వాత పెద్దగా ప్రమోషన్ ఉండటం లేదు. కొన్ని వెబ్‌సైట్లు యాడ్స్‌తో పాటు ఆర్టికల్‌కు ఇంత, రివ్యూకు ఇంత అని తీసుకోవడం కూడా పరిపాటి అయిపోయింది. ఓ వెబ్‌సైట్‌లో సినిమా యాడ్ డిస్ ప్లే కావాలంటే 60 వేలు, సినిమా ప్రమోషన్ ఆర్టికల్ రాస్తే 20 వేలు, ప్రీమియర్ షోలకు వెళ్లి.. స్పెషల్ రివ్యూ రాస్తే.. లక్ష దాకా సమర్పించుకోవాలని చెబుతున్నారు నిర్మాతలు. సోషల్ మీడియాలో సినిమా రివ్యూ పోస్ట్ చేసేందుకు కూడా పాతిక వేలు తీసుకుంటున్నారట. ఫస్ట్ హాఫ్ రివ్యూకు 20 వేలు, సెకండాఫ్ రివ్యూ కాస్త ఆలస్యంగా ఇచ్చేందుకు 30 వేలు ఇస్తున్నారట. ఇవన్నీ కాకుండా.. ఆ వెబ్‌సైట్ యాజమాన్యానికి.. సినిమా నిర్మాత లక్ష రూపాయల కవర్ పంపించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అయితే, ప్రొడ్యూసర్లు కూడా ఈ ట్రెండ్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. రివ్యూలు చెప్పేవాళ్లు, రాసేవాళ్లు డిమాండ్ చేసినంత డబ్బులు ఇస్తున్నారు.
ప్రతి ప్రొడ్యూసర్ తన సినిమా జనాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో సొంతంగా ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. దీనిని అదునుగా చేసుకొని ప్రమోషన్ల పేరిట పీఆర్ టీమ్‌లు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తున్నాయనే చర్చ ఉంది. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఏమీ ఆలోచించడం లేదు. సొంతంగా నిర్ణయం తీసుకొని లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ.. రిజల్ట్ చూశాక దెబ్బ గట్టిగా పడుతోంది. దాంతో.. ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇండస్ట్రీలోని నిర్మాతలంతా ఒకే తాటి మీదకు వచ్చి ఓ నిర్ణయం తీసుకుంటే రివ్యూయర్లను కట్టడి చేయొచ్చం టున్నారు. గ
తంలో 3 రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలని.. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించినప్పటికీ అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాంతో కోట్లు ఖర్చు పెట్టి.. ఏళ్లు కష్టపడి ఓ సినిమా తీస్తే, 3 గంటల సినిమా చూసి, 3 నిమిషాల్లో రివ్యూ రాసేసి.. సినిమాను చంపేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పోనీ, ఈ రివ్యూ రాసేవాళ్లకేమైనా సినిమా తీసేంత టాలెంట్ ఉంటుందా? అంటే అదీ లేదు. కేవలం.. తన అభిప్రాయాన్ని ప్రేక్షకుల అభిప్రాయంగా మార్చి చెప్పి సినిమాల కలెక్షన్లను తగ్గిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఓ వైపు పైరసీ వెబ్ సైట్లు సవాళ్లు విసురుతున్న క్రమంలో, మరోవైపు వెబ్ సైట్లు కూడా నిర్మాతలకు తలనొప్పిగా మారాయ్.
ఎన్ని నెగటివ్ రివ్యూలు ఇచ్చినా, సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ ప్రచారం చేసినా, కంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వరూ ఆపలేరు. కంటెంట్ లేని సినిమాని ఏం చేసినా లేపలేరు. ఇదే వాస్తవం. సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ మాత్రమే కింగ్. దానిని నమ్మితే చాలు. అయినా మౌత్ టాక్‌ని మించిన రివ్యూ మరొకటి లేదు. ఇది ఎవడో, ఎక్కడో కూర్చొని డిసైడ్ చేసేది కాదు. ఆడియెన్స్ ఒరిజినల్ ఫీలింగ్. ప్రేక్షకులకు గనక సినిమా నచ్చితే కచ్చితంగా ఆదరిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇది.. ఎన్నోసార్లు రుజువైంది. ఇక ముందు కూడా అదే జరుగుతుందని బలంగా చెబుతున్నారు.