మోడీ దౌత్య రీతి.. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన నిస్సందేహంగా మోడీ దౌత్య విజయంలో ఒకటిగా చెప్పవచ్చు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన అనగానే ఉక్రోషంతోనో, ఆందోళన వల్లో తెలియదు కానీ.. అమెరికా అధ్యక్షుడు కంగారు పడుతున్నారు.  పుతిన్ భారత పర్యటన ఈ సమయంలో అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  రష్యా నుంచి భారత్‌  తన అభీష్ఠానికీ, ఆదేశాలకూ విరుద్ధంగా చమురు దిగుమతి చేసుకుంటున్నదన్న ఒకే ఒక్క కారణంతో ట్రంప్ భారత్ పై టాక్స్ వార్.. సుంకాల యుద్ధానికి దిగారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది.   భారతీయులను అమెరికాకు రాకుండా చేసేందుకు వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను ఆదేశించారు. వీసా ఫీజును భారీగా పెంచారు. ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు పెట్టేలా మారాయి. రష్యా, చైనాలతో భారత దోస్తీ గట్టిపడింది.     పుతిన్‌ భారత పర్యటనలో భాగంగా  కుదిరే అవకాశం ఉన్న ఒప్పందాల కారణంగా అమెరికా మరిన్ని ఆర్థిక చిక్కుల్లో పడే అవాకశం ఉంది.   ట్రంప్‌ రష్యా చమురు దిగుమతిని ఆపమని భారత్ ను ఆదేశిస్తే.. అది కొనసాగిస్తూనే ఇప్పుడు తాజాగా రష్యాతో  ఆయుధ కొనుగోళ్లఒప్పందానికి రెడీ అయ్యింది.   ఇది కచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా మళ్లీ సుంకాలతో, విసాలపై మరిన్ని కఠిన ఆంక్షలతో ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే వాటిని లెక్కచేయడానికీ, అమెరికా హెచ్చరికలు, ఆంక్షలకుభయపడే పరిస్థితి నుంచి భారత్ ఎప్పుడో బయటపడింది. ఇదంతా మోడీ దౌత్య  విధానాల కారణంగానే సాధ్యమైందన్నది అంతర్జాతీయ సమాజం చెబుతున్నమాట.  మొత్తంగా ట్రంప్ అరాచక, అహేతుక విధానాలనుంచి భారత్ ను బయటపడేయడమే కాకుండా.. ఏక ధృవ ప్రపంచం అన్న భ్రాంతి నుంచి ట్రంప్ బయటపడక తప్పని పరిస్థితిని క్రియోట్ చేసే దిశగా ప్రధాని మోడీ దౌత్యపరంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దేవతలారా దీవించండి!

ఈ మధ్య కాలంలో   దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో   చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.  బేసిగ్గా రేవంత్ రెడ్డికి ఆంజనేయస్వామివారంటే చాలాచాలా భక్తి. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఒక పురాతన ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూజ చేసి మరీ తన నామినేషన్  వేయడం ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఆచారం.  ఇప్పటికీ ఆ సెంటిమెంటు కొనసాగుతూనే ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి పొరబాటున వివిధ విభాగాల అధిదేవతలైన హిందూ దేవతలకూ, కాంగ్రెస్ లోని మల్టిపుల్ లీడర్షిప్ కి  పోలిక తెస్తూ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మచారులకు, పెళ్లయిన వారికి, ఇద్దరు భార్యలు కలవారికీ.. ఇలా హిందూ సంప్రదాయంలో  దేవుళ్లు ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి. ముఖ్యంగా హిందూ వాదులు బీజేపీ లీడర్లు రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇలా ఈ ఒక్క అంశం మాత్రమే కాదు పలు అంశాల్లో  కాషాయవాదులు, కమలనాథులు  పెద్ద ఎత్తున తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు తెలియ చేస్తున్నారు. ఇంతకు ముందు శివజ్యోతి అనే  యాంకర్ వెంకన్న సన్నిథిలో తాము రిచ్చెస్ట్ బిచ్చగాళ్లమంటూ చేసిన వ్యాఖ్యలతో భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురయ్యారామె. ఇక ఒక స్వామి మాల వేసిన ఎస్సై వివాదం సంగతి సరే సరి. ఈ విషయంపై బీజేవైఎం నాయకులు ఏకంగా డీజీపీ ఆఫీసునే ముట్టడించి నానా యాగీ చేశారు. డిపార్టుమెంటుగానీ ఆయనకిచ్చిన మెమో వెనక్కు తీస్కోకుంటే మా తడాఖా చూస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు.  అలాగే దర్శక ధీరుడు రాజమౌళి  తనకు దేవుడిపై నమ్మకాలు లేవని అనడం కూడా పెద్ద రాద్ధాంతమై  కూర్చుకుంది. మాధవీ లత, చికోటి ప్రవీణ్ తో సహా అందరూ రాజమౌళిపై విరుచుకుపడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాజమౌళిపై విరుచుకు పడ్డ వారి లిస్టు కొండవీటి చాంతాడంత. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ దేవీ దేవతలకు మరీ ఇంత సెక్యూరిటీయా? ఈగ వాలనీయడం లేదెవరూ? అనిపించకమానదు. సీఎం రేవంత్  హిందూ. గతంలో ఆయన ఏబీవీపీ కార్యకర్త. ఆర్ఎస్ఎస్ భావజాలం తెలియని వారు కాదు. అలాంటి రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండి సీఎం అయ్యారని చెప్పి ఆయనేమీ హిందూ కాకుండా పోరు. ఒక ఇన్ స్పిరేషన్ కోసం పోలిక తెచ్చి జనానికి అవగాహన పెంచడానికి అన్నమాటలను పట్టుకుని దానిని వివాదాస్పదం చేయడం ఎంత వరకూ సమంజసం అని పరిశీలకులు అంటున్నారు.  అదే విధంగా దేవుడిపై నమ్మకం ఉండటం, ఉండకపోవడం అన్నది ఎవరికి వారికి వ్యక్తిగత విషయం. దూషణ లేనంత వరకూ అటువంటి విషయాలను వివాదం చేయడం తగదంటున్నారు. ఇలా వివాదాలు సృష్టిస్తున్నవారు హేతు వాదాన్ని, హేతువాదులనూ బతకనిచ్చేలా లేరన్న మాట కూడా వినిపిస్తుంది. తెలుగువారు గర్వించదగ్గ నటులలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పలు సందర్భాలలో తనకు దేవుడిపై భక్తి లేదని ప్రకటించారు. అటువంటి ఆయన అద్భుతమైన భక్తిరస చిత్రాలలో అత్యద్భుతంగా నటించి మెప్పించారు. అందుకే రేవంత్ కానీ, రాజమౌళి కానీ చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం సమజసం కాదంటున్నారు పరిశీలకులు. 

పవన్ పై కాంగ్రెస్ విమర్శల దాడి.. ఏ ప్రయోజనం కోసం?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇందుకు కారణం కోనసీమలో కొబ్బరి దిగుబడి తగ్గిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందనే అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనం సీరియస్ గా తీసుకోలేదు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ఆ విమర్శల తీవ్రత గత రెండు రోజులుగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ సినిమాలను తెలంగాణ థియోటర్లలో ఆడనివ్వం అంటూ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు పరిశీలకులు వ్యక్తం చేస్తున్న సందేహాలు ఏమిటంటే.. కాంగ్రెస్ ఇప్పుడు, ఈ సమయంలో ఈ స్థాయి విమర్శలకు దిగడం పూర్తిగా నిరర్ధకం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ కానీ, ఆయన జనసేన పార్టీ కానీ పూర్తిగా ఇర్రెలవెంట్. అయితే ఈ విమర్శల వల్ల తెలంగాణలో ఏమైనా జరగడమంటూ జరిగితే.. అది తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి రావడమే. అలా తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వస్తే కాంగ్రెస్ కు రాజకీయంగా ఇసుమంతైనా ఉపయోగం ఉండదు. ఆ సెంటిమెంట్  వల్ల ప్రయోజనం అంటూ ఉంటే.. అది బీఆర్ఎస్ కు మాత్రమే. అంటే కాంగ్రెస్ నేతలు, మంత్రులు పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేస్తున్న విమర్శల వల్ల బీఆర్ఎస్ మాత్రమే లబ్ధిపొందుతుంది. ఆ పని కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నదంటూ రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు.  అన్నిటికీ మించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లబోతోంది. అలాగే తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఓ వైపు ఇంత సందడి, హడావుడీ పెట్టుకుని కూడా కాంగ్రెస్ నేతలూ, మంత్రులూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిచడం, ఆయనపై విమర్శలు గుప్పించడం వినా తమకు వేరే పనేంలేదనేలా చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కాంగ్రెస్ పొలిటికల్ స్టాండర్డ్స్ పై అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదపడుతున్నాయి.   మీడియా పెద్దగా పట్టిచుకోవడం మానేసిన నేతలు, మంత్రులే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారనీ, కనీసం ఆ రకంగానైనా మీడియా దృష్టిలో పడి ఎంతో కొంత పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీకి డుమ్మా.. పార్లమెంటుకు హాజరు.. జగన్ ద్వంద్వ నీతి

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కాదు కాదు దిశా నిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర సమస్యలపై గళమెత్తడానికి బోలెడంత అవకాశం ఉన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టి పార్లమెంటులో ఎంపీలను నోరెత్తి ప్రశ్నించాలని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ ప్రారంభమైంది. కేవలం తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఉన్న అవకాశాలను తోసిపుచ్చి, తానే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేల చేత సైతం శాసనసభను భహిష్కరింప చేస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలంటూ ఎలా చెప్పగలరని పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పోషిస్తున్న పాత్ర గురించి ఆ పార్టీ నేతలకు సైతం ఎలాంటి క్లారిటీ లేదని భావించాల్సి వస్తున్నదని విశ్లేషిస్తున్నారు.   2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు,   కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.   ప్రజలివ్వని హోదా కోసం మంకు పట్టు పడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత జగన్ తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు.   తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేశామని చెబుతున్న వైసీపీ అధినేత జగన్..   ప్రజా సమస్యల పై గళమెత్తడానికి అసెంబ్లీకే వెళ్లాలా? అన్న వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ప్రెస్ మీట్లలోనే ప్రభుత్వ విధానాలను ఎండగడతానంటున్నారు.  మరి ఇప్పుడు  పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర హక్కులు, సమస్యలపై గళమెత్తాలని  ఎంపీలను ఎలా ఆదేశిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర, హక్కులు, సమస్యలపై గళమెత్తడానికి అసెంబ్లీ కంటే, పార్లమెంటు ఎలా మెరుగైన వేదిక అవుతుందో జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టరు కానీ, ఆయన అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్ కు ఆయన పార్టీకీ రాష్ట్ర సమస్యలు పట్టవా? అని నిలదీస్తున్నారు. పొలిటికల్ గా ఆయన అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను దుయ్యబడుతున్నారు. గత ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా, తమకు 40శాతం ఓట్లు వచ్చాయంటున్న జగన్.. మరి వైసీపీకి ఓటు వేసిన 40శాతం మంది ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ విధానాలను నిలదీయాల్సి ఉంది కదా? ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా పోరాడాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ ఏం జవాబు చెబుతారో చూడాల్సింది. 

‘వేలం’ వెర్రి తలలు!?

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లను ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చుకు తీస్కెళ్లిన అభ్య‌ర్ధి ఇర‌వై వేల రూపాయ‌ల‌ను ఇంటికి తెచ్చారంటే నమ్మశక్యంగా లేదు కదూ!  కానీ అది నిజం. లాలాగే..   ఓ అభ్య‌ర్ధి    ఎన్నార్సీ కేసుల‌పైన పోరాటం చేసి జైలుకు వెడితే.. ఆయ‌న త‌రఫున ఆయన భార్య‌, త‌ల్లి ఎలాంటి  ఖ‌ర్చు లేకుండా  ప్ర‌చారం  చేశారు. ఆ ఎన్నికలో ఆయన విజయం సాధించారు.   ఇక ఇటీవల ఇటీవల బీహార్ ఎన్నిక‌ల్లో అలీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం  నుంచి గాయిని మైథిలీ ఠాగూర్ విజయం  కూడా దాదాపు ఇలాంటిదే.   ఉత్త‌రాదిలో ఎన్నిక‌లంటే ఎమంత ఆస‌క్తిక‌రం కాదు. ఆపై అదేమంత కాస్ట్లీ  ఇష్యూ కూడా కాదు. ఖ‌ర్చు అస‌లే  ఉండ‌ద‌ని అంటాయి అక్కడి వారు.  అయితే దక్షిణాదిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి పరిస్థితులు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి  కూడా భారీ ఎత్తున  ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక  పంచయతీలో  స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.  ఔను  మహబూబ్​నగర్​ జిల్లా, హన్వాడ మండలం, టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం  కోటి వెచ్చిస్తానని ఒక వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.  కోటి రూపాయ‌ల‌కు స‌ర్పంచ్ ప‌ద‌వి అంటూ సోష‌ల్ మీడియాలో ఈ ఊరి  పేరు తెగ  మార్మోగిపోయింది.  అయితే వాస్తవమేంటంటే.. ఎన్నిక‌ల్లో వృధా ఖ‌ర్చు పెట్ట‌డం బ‌దులు ఊళ్లోని ఆంజేయస్వామి వారి ఆల‌యాన్ని  ఎవ‌రైతే పూర్తి చేస్తారో వారినే గ్రామ  స‌ర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.  ఆ ఒక్క ఆల‌యానికే సుమారు 60, డెబ్బై ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు అవుతుంద‌ని తేలడంతో.. ఆల‌య ఖ‌ర్చుల‌తో పాటు ఊరిలోని ఇత‌ర‌త్రా ప‌నుల లెక్క కూడా వేసి కోటి రూపాయ‌ల ని తేల్చారు.  అది పక్కన పెడితే సర్పంచ్ పదవుల వేలం తెలంగాణలో ఒక వెర్రిలా మారిపోయింది.  జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్​ ఆర్గనైజర్​  రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్​దొడ్డిలో రూ.57 లక్షలకు,  లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.  ఇంకా  గద్వాల మండలం, కొండపల్లిలో రూ.60 లక్షలకు నల్లదేవునిపల్లిలో.. రూ.45 లక్షలకు వేలం పాట ద్వారా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.  అదే విధంగా మల్దకల్​ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవి వేలంలో  రూ.42 లక్షలు పలికిందంటున్నారు. వీరాపురంలో రూ.50 లక్షలు,   ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, జోగ్గూడెం రూ.20 లక్షలకు సర్పంచ్ పదవులను వేలంపాటలో దక్కించుకున్నారు.  పదవుల మోజే ఈ ‘వేలం వెర్రి’కి కారణమంటున్నారు. అంత వరకూ కష్టపడి సంపాదించుకున్నది మొత్తం ధారపోసి మరీ పదవులు దక్కించుకోవడానికి పడుతున్న పోటీ విస్మయం గొలపక మనదు. వాస్తవంగా చూస్తే సర్పంచ్ పదవి పెద్ద పవర్ ఉన్న పదవి కూడా కాదు. అయితే దాని కోసం ఇంత హంగామా, తాపత్రేయం, పోటీ ఎందుకు అని ప్రశ్నించే వారూ ఉన్నారు.   స‌ర్పంచ్ ప‌ద‌వుల విష‌యంలోనే  ఇంత వేలం వెర్రి ఉంటే.. ఇక కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవులకు ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుందోఅన్న చర్చ జరుగుతోంది.  ఈ వేలం ‘వెర్రి’ చూస్తుంటే రాజకీయాలు అవినీతి మయంగా మారడానికి కారణమేమిటో ఇట్టే అవగతమౌతుందంటున్నారు పరిశీలకులు.  

కాళేశ్వరంతో కాంట్రాక్టర్లే బాగుపడ్డారు.. కవిత నోట కాంగ్రెస్ మాట

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తన విమర్శల స్వరం పెంచింది. ఇప్పటి వరకూ కేవలం హరీష్ రావు, సంతోష్ లన టార్గెట్ చేసుకుంటూ తన విమర్శల వాణి వినిపించిన కవిత.. ఇప్పుడు తండ్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపైనా తన విమర్శలను సంధించారు. నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు. ఇప్పటి వరకూ కాళేశ్వరం నిరుపయోగం అనీ, అవినీతి సొమ్మలు వెనకేయడానికి మాత్రమే బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టు చేపట్టి అంచనాలు పెంచుకుంటూ పోయి సొమ్ములు దండుకుందన్న విమర్శలు కాంగ్రెస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా అదే వాణి, అదే బాణితో తన విమర్శలకు పదును పెట్టారు.   తాజాగా శుక్రవారం కామారెడ్డిలో మాట్లాడిన కవిత కాళేశ్వరంతో కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడలకు చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్టర్లు బాగుపడటానికే తప్ప రైతులకు, రాష్ట్ర వ్యవసాయానికీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టేశారు.    కాళేశ్వరం ప్రాజెక్టు కంటే జ‌మానాలో క‌ట్టించిన నిజాం సాగ‌రే ఎంతో నయమన్నారు. అయితే ఇప్పుడు అది మట్టి కూరుకుకోయి ఉందనీ, దానిని పూడిక తీయించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.  గ‌తంలో నిజాంసాగ‌ర్ ప‌ర్యాట‌కంగానూ ఎంతోబాగుండేద‌ని ఆ దిశగా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తానిప్పుడు కాళేశ్వ‌రంపై చేసిన ఈ వ్యాఖ్యలపై ఇక బీఆర్ఎస్ నేతలు  నోరేసుకుని ప‌డిపోతార‌న్న కవిత.. చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ పంచ్ డైలాగ్ తో చురక వేశారు.  ఇప్పుడు తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలకూ, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన కవిత కాంగ్రెస్ రంగుల చీరకట్టడానికీ ముడి పెడుతూ పరిశీలకులు విశ్లేషణలకు పని చేప్పారు. ఆమె కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారనడానికి కవిత తాజా వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు.  కాళేశ్వరంపై కాంగ్రెస్  విమర్శలనే బాజాప్తుగా తాజాగా కవిత కూడా చేశారు.   ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితిని కవిత తన వ్యాఖ్యలతో కల్పిస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇక కవిత విమర్శలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్, హరీష్, కేసీఆర్ లను నిలదీస్తే పరిపోతుందంటున్నారు.  పరిస్థితి చూస్తుంటే.. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గూటికి చేరడానికి అట్టే సమయంపట్టేలా లేదని కూడా చెబుతున్నారు.  

లోకం మెచ్చిన లోకేష్.. పెంపకం అంటే ఇదీ!

లోకేష్ ఎంత సంస్కార వంతుడో,  వ్యక్తిత్వ ఔన్నత్యం ఎంతటిదో ఇటీవలి కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.  విద్యా మంత్రిగా నారా లోకేష్ ఆ శాఖను సుసంపన్నం చేస్తూ వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులలో విద్య పట్ల ఆసక్తిని, అనుకర్తినీ పెంచుతూనే.. తల్లిదండ్రులు తనకు నేర్పిన   స‌భ్య‌త సంస్కారాల‌ు మరింత ఇనుమడింప చేసే లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  అపకారికి ఉపకారం అన్నట్లుగా.. లోకేష్ జ‌గ‌న్ వంటి ప్ర‌త్య‌ర్ధుల ప‌ట్ల కూడా స‌హృద‌య‌త చాటుకుంటుంటూ జనం మన్ననలు పొందుతున్నారు. దీంతో లోకేష్ ద లీడ‌ర్ ఆఫ్ మాసెస్ గా జనహృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటున్నారు.  బేసిగ్గా లోకేష్   త‌ల్లిచాటు బిడ్డ‌గా  ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా  చాలా  చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు  భువ‌నేశ్వ‌రి  అని చెప్ప‌డానికి  ఎన్నో నిద‌ర్శ‌నాలు. ఆయ‌న ఇటీవ‌ల చేస్తున్న మంచి ప‌నులు  అంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయ్. త‌న పెద్ద‌మ్మ పురంధేశ్వ‌రి  కాళ్ల‌కు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యానికి తెలుగు త‌మ్ముళ్లు పులకించి పోయారు. అలాగే  ప్రవచన కారుడు చాగంటి కోటేశ్వ‌ర‌రావు కు ఇటీవల లోకేష్ పాదాభివంద‌నం చేయ‌డం కూడా ప్రజలను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఆపై పిల్ల‌ల్ని ఫ్లైట్ లో ఢిల్లీ వ‌ర‌కూ తీసుకెళ్లిన ఘ‌న‌త లోకేష్ దే. ఇటీవ‌ల రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా  ఏపీలో విద్యార్ధుల‌తో జ‌రిగిన మాక్ అసెంబ్లీపై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక విద్యా మంత్రిగా  లోకేష్ ఈ ప్రతిపాదనను అసెంబ్లీలో నే చేసి అనుమతి పొందారు. ఇక విద్యార్థులతో అసెంబ్లీ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న 45 వేల స్కూళ్ల  నుంచి మెరిక‌ల్లాంటి  విద్యార్ధుల‌ను ఎంపిక చేసి వారి ద్వారా జూనియ‌ర్స్ అసెంబ్లీని  అత్యద్భుతంగా నిర్వహించి భళా అనిపించింది.  ఈ విష‌యంలోనూ లోకేష్ కి మంచి మార్కులు ప‌డ్డాయి. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా  తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టు ఒకరు   అత్యుత్సాహం కొద్దీ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కోసం బాబు, లోకేష్‌, ప‌వ‌న్ కాళ్ల వేళ్లా  ప‌డి బ‌తిమిలాడుతున్నట్లుగా ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.  అయితే ఆ వీడియోను వెంటనే తీసేయాలనీ,  జ‌గ‌న్ మ‌న‌కు ఎంత  ప్ర‌త్య‌ర్ధి అయినా స‌రే వ్య‌క్తిగ‌తంగా   కించ ప‌రచడం సరికాదనీ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు హితవు చెప్పారు.  దీంతో  ఇంతటి సంస్కారం, ఔన్నత్యం, ఉదాత్త గుణాలను పెంపొందేలా లోకేష్ పేరెంట్స్ ఆయనను పెంచిన విధానం ఎంత గొప్పదో కదా అంటూ పలువురు చంద్రబాబు, భువనేశ్వరిలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.  గ‌తంలో బాబు కూడా.. జగన్ కు అర్హత లేకపోకయినా అసెంబ్లీలోకి నేరుగా కారులో రావడానికి అనుమతి ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   వైసీపీకి చెందిన వంశీ, కొడాలి వంటి నేతలు అసెంబ్లీలో లోకేష్ త‌ల్లి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ క‌నీసం ఖండించలేదు సరికదా..  మ‌రింత నవ్వుతూ , వారిని మరింత ప్రోత్సహించి, రెచ్చ‌గొట్టే ధోర‌ణితో వ్యవహరించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లోకేష్ కీ జ‌గ‌న్ కీ  ఇంత తేడా ఉండటానికి వారి వారి పెంపకాలలో ఉన్న తేడాయే కారణమని పరిశీలకులు సోదాహ రణంగా విశ్లేషిస్తున్నారు.  

హేతురహిత వ్యాఖ్యలతో పిచ్చెక్కిస్తున్న పవన్ కల్యాణ్?!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నాయి. హేతు రహితంగా  చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నారు.  మొన్నా మ‌ధ్య ఎర్ర‌చంద‌నం చెట్ల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు వివాదానికి సైతం తావిచ్చాయి.  ఎర్ర‌చంద‌నం  చెట్ల‌కూ వెంక‌టేశ్వ‌ర‌స్వామికి అయిన గాయానికీ సంబంధం లేదు. వెంక‌న్న ర‌క్తంతో త‌డవ‌డం వ‌ల్లనే  ఎర్ర‌చంద‌నం చెట్ల‌కు ఆ ఎర్ర‌ద‌నం వచ్చిందన్నట్లుగా చేసిన ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ శాస్త్రీయ కరాణాలను వివరించారు కొందరు హేతువాదులు. ఇక తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.    ఉప ముఖ్య‌మంత్రి  స్థానంలో ఉండి  హేతురహితంగా ఆయన వ్యాఖ్యలు చేయడం సరికాదన్న మాట జనసైనికుల నుంచే వస్తున్నది. పవన్ కల్యాణ్ ఇటువంటి కామెంట్లు చేయడమేంటన్న విస్మయం రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.  అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజా మన్ననలు అందుకునేలా వ్యవహరిస్తున్న ఆయన.. ఎర్రచందనానికి వేంకటేశ్వరస్వామి గాయానికీ ముడిపెట్టడం.. అలాగే కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి పొరుగురాష్ట్రం దిష్టి తగలడమే కారణమని అర్ధం వచ్చేలా మాట్లాడటం ఆయన స్థాయికి తగినట్లుగా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  

కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం క‌విత‌క్క‌?

కల్వకుంట్ల క‌విత వ‌ల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎంత చేటు వ‌చ్చిందంటే.. ఆమె ఎక్క‌డ పర్యటిస్తే.. అక్కడి కారు పార్టీ లీడ‌ర్ల‌కు గుండె దడ పెరిగిపోతోంది. మొన్న వ‌న‌ప‌ర్తికి వెళ్లిన కవిత అక్కడ,  నిరంజ‌న్ రెడ్డిని ఉతికి ఆరేశారు. వీరిద్ద‌రి మ‌ధ్యకు వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ద‌మ్ముంటే కేటీఆర్, నిరంజ‌న్ రెడ్డి.. క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. అన‌వ‌స‌రంగా లేని పోని గొడ‌వ‌ల‌కు క‌విత తావిస్తున్నారంటూ..  ఏం చేయాలో పాలు పోక త‌ల ప‌ట్టుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. క‌విత తాను చేసిన యాత్ర‌ల‌కు సంబంధించిన  ఏర్పాట్లు చేసుకోవాల్సింది  పోయి.. ఇర‌వై నాలుగ్గంట‌లూ బీఆర్ఎస్  లీడ‌ర్ల‌ను ఆడిపోసుకోవ‌డం, వారి అవినీతి బాగోతాలు బ‌య‌ట  పెడ‌తాన‌ని హెచ్చరించడమేంటి?   కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.   క‌విత ప్ర‌ధాన‌మైన ల‌క్ష్యం   బీఆర్ఎస్ లో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటోన్న వారి బారి నుంచి తన తండ్రి కేసీఆర్ ని ఎలాగైనా  త‌ప్పించాల‌న్నది కవిత లక్ష్యంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో అవినీతిపరులకు హ‌రీష్ రావు అండ‌దండ‌లున్నాయ‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ, త‌న తండ్రి కేసీఆర్ కి ఇందులో ఎంత మాత్రం సంబంధం లేద‌ని నిరూపించాల‌ని కవిత లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇక్క‌డే ప్ర‌కాశ్ వంటి మాజీ నేత‌లు.. క‌విత చేస్తోన్న ఈ వింత ప్ర‌యోగం బెడిసికొడుతోంద‌ని అంటున్నారు. ఎందుకంటే హ‌రీష్, కేసీఆర్ ఇద్దరూ వేరు వేరు కాదు. పైపెచ్చు పార్టీలో కృష్ణార్జ‌నులుగా గుర్తింపు పొందారు. ఇద్ద‌రూ ఒక్క తాను ముక్క‌లే. హ‌రీష్ చేసే ప‌ని ఏదైనా స‌రే కేసీఆర్ కి తెలిసే జ‌రుగుతుంది. ఒక వేళ హ‌రీష్‌ ఏదైనా తెలియ‌క చేసినా కూడా అదంతా కూడా కేసీఆర్ కే త‌గిలి తీరుతుంది. ఈ విష‌యం కవితకు  తెలియంది కాదంటారు వీరు.  కాళేశ్వ‌రం విష‌యంలో క‌విత చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ హ‌రీష్ రావు మీద‌. ఈ ప్రాజెక్టు విష‌యంలో జ‌రిగిన అవినీతి మొత్తం హ‌రీష్ రావు ప‌నేనంటారామె. అయితే కేసీఆర్ కి తెలీకుండా ఇదంతా జ‌రుగుతుందా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. ఇది స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కేసీఆర్ కి తెలీకుండా హ‌రీష్ అలాంటి ప‌నులు చేయ‌గ‌ల‌రా? అంటూ నేష‌న‌ల్ మీడియా సైతం ప్ర‌శ్నిస్తోంది. ఇప్పుడీ విష‌యంలో క‌విత‌కు కూడా కౌంట‌ర్లు భారీగానే ప‌డుతున్నాయ్. ఆయా ప్రాంతాల‌కు క‌విత వ‌చ్చి నిరంజ‌న్ రెడ్డి వంటి వారి అవినీతిని  బ‌ట్ట‌బ‌య‌లు చేస్తుంటే.. వారు కూడా   రివ‌ర్స్ లో ఆమెకు కౌంట‌ర్లు వేస్తున్నారు. ఆమె ఇర‌వై ల‌క్ష‌ల వాచీ, ఆపై బంజారాహిల్స్ లో విలాస‌వంత‌మైన బంగ‌ళాల గురించి లేవనెత్తుతున్నారు.   ఇక ఢిల్లీ లిక్క‌ర్ క్వీన్ గా క‌విత తెచ్చిన చెడ్డ పేరే పార్టీని నిలువునా ముంచింద‌నీ తీవ్ర స్థాయిలో  విరుచుకుప‌డుతున్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్ర‌ధాన  ప్ర‌తిప‌క్ష‌మో కాదో అటుంచితే, బీఆర్ఎస్ కి మాత్రం క‌విత రూపంలో అతి పెద్ద ప్ర‌తిప‌క్షం త‌యారైందనడంలో సందేహం లేదు. దీంతో  ఇప్పుడు కారు పార్టీ లీడ‌ర్ల చూపు క‌విత‌పైకి మ‌ళ్లింది. వీళ్లూ వీళ్లూ కొట్టాడుకుంటుంటే కాంగ్రెస్ చేష్ట‌లుడిగి  చోద్యం చూస్తోంది. ఇది టాపిక్ డైవ‌ర్ష‌నా? లేక క‌విత మార్క్ పాలిటిక్సా,   లేదంటే..  కేసీఆర్ ఆడిస్తోన్న వింత  నాట‌కమా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

క‌విత అస‌లు వ్యూహం అదేనా?

ఇంటిగుట్టు వ్యాధి ర‌ట్టు అంటారు.  తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత  బీఆర్ఎస్ ఇంటి  పార్టీ  గుట్టు మొత్తం బ‌య‌ట  పెట్టేస్తూ.. ఆ పార్టీ ప్ర‌త్య‌ర్ధుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా  చేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ జ‌గ‌దీశ్ రెడ్డితో క‌య్యానికి కాలుదువ్విన క‌విత తాజాగా నిరంజ‌న్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.   అయితే ఆమె ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కారణాలేంటి? వ్యూహంమేంటి? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. క మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు టార్గెట్ గా చేస్తున్న కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలపై హరీష్ రావు పెద్దగా స్పందించకున్నా.. కవిత విమర్శలకు కౌంటర్ ఇస్తున్న  జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి రెండవ శ్రేణి నాయకులపై కూడా ఆమె  విరుచుకుపడుతున్నారు. దీనిని బట్టి చూస్తుంటే.. హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.   ఇంత‌కీ మాజీ మంత్రి  నిరంజ‌న్ రెడ్డి ఏమ‌న్నారో చూస్తే.. కవితకు స‌భ్య‌త సంస్కారాలు లేవ‌ని కామెంట్ చేశారాయ‌న‌. ఎవ‌రి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారంటూ ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు వాస్తవమైతే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు.  నిరంజన్ రెడ్డిపై కవిత ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి ఇదీ కారణమంటున్నారు పరిశీలకులు.   అంగ‌డి స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన  నిరంజ‌న్ మూడు ఫామ్ హౌస్ ల‌ను క‌ట్టుకున్నారనీ,  ఆయ‌న అవినీతిని హ‌రీష్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చారనీ, ఈ వ్యవహారాన్నంతా మీడియా ద్వారా పెద్ద సార్ దృష్టికి తీసుకెడతానని హెచ్చరించారు కవిత. ఇదంతా చూస్తుంటే.. కవిత వ్యూహాత్మకంగానే నిరంజన్ రెడ్డిపై విమర్శల దాడికి దిగినట్లుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.  ఇప్ప‌టి వ‌ర‌కూ  వీరంద‌రూ అవినీతి చేస్తున్నా.. పెద్ద సారు కేసీఆర్ కి తెలీకుండా హరీష్  అడ్డుగోడ‌లా నిలిచాడ‌నీ.. వీరి మ‌ధ్య ఉన్న అవినీతి ఐక్యతా రాగం హ‌రీష్ కి త‌ప్ప  కేసీఆర్ కి తెలీద‌న్న‌ట్టుగా  మాట్లాడుతున్నారు. దీని ద్వారా తెలుస్తున్న దేంటంటే కేసీఆర్ కి తెలీకుండా వీరంతా అవినీతి చేశారు కాబ‌ట్టి  ఒక దెబ్బతో హరీష్ ను పార్టీకి దూరం చేయడం, కేసీఆర్ ను  పులుక‌డిగిన ముత్యంగా ఎస్టాబ్లిష్ చేయ‌డం కవిత వ్యూహం అంటున్నారు. 

ఫార్ములా ఈ రేస్ తో పాటు.. కాళేశ్వ‌రం కేసులోనూ కదలిక?

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్, బీజేపీలపై గుప్పించిన ఆరోపణల్లో ప్రధానమైంది ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించడం లేదన్నదే. దానితో పాటు కాళేశ్వరం అక్రమాల కేసును సీబీఐకి అప్పగించినా ఫలితంల లేకపోయిందని కూడా రేవంత్ ఆరోపణలకు గుప్పించారు. ఈ విధంగా రేవంత్  బీజేపీ బీఆర్ఎస్ నేతలకు అండగా నిలుస్తోందన్న విమర్శలు చేశారు.  అయితే ఇప్పుడు గవర్నర్  కేసీఆర్ ప్రాసిక్యేషన్ కు అనుమతి ఇవ్వడంతో.. కాళేశ్వరం కేసు విషయంలో కూడా కదలిక వస్తుందా అన్న చర్చకు తెరలేచింది.    ఈ కార్ రేస్ వ్య‌వ‌హారంలో అవినీతి జ‌రిగిందని దర్యాప్తులో తెలిందని అధికారులు చెబుతుంటే.. కేటీఆర్ మాత్రం ఇది ఒక లొట్టపీసు కేసు అంటే కొట్టిపారేశారు.  ఇక ఇప్పుడు విషయమేంటంటే.. విచారణలో కూడా కేటీఆర్ ఇదే చెబుతారా? ఆ విషయం పక్కన పెడితే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు.  ఇప్ప‌టికే వ‌రుస  ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.  కేటీఆర్  లొట్ట‌పీసు కేసుగా కొట్టిపారేస్తున్న ఫార్ములా ఈకార్ కేసులోనే కదలిక ప్రారంభమైందంటే..  కాళేశ్వ‌రం  కేసు ప‌రిస్థితి ఏంటి? దీనిపైనా సీబీఐ ఎంక్వ‌యిరీ మొద‌ల‌వుతుందా?  అంటూ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారంలో సాధార‌ణ ఈఈలే అందిన కాడికి దోచుకుని వంద‌ల వేల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన విధం క‌ళ్ల‌కు క‌ట్టింది. వీరు ఏసీబీ వ‌ల‌లో చిక్కిన అతి పెద్ద తిమింగ‌ళాలుగా వార్త‌ల‌కెక్కారు. ఇప్పుడు సీబీఐ ఎంక్వ‌యిరీ మొద‌లైతే.. ఆ తిమింగ‌ళాల‌కే గాడ్ ఫాద‌ర్లు ఎంత తిన్నార‌న్న విష‌యాలు కూడా వెలుగులోకి వ‌స్తాయంటున్నారు.  గ‌తంలో క‌విత‌ను అరెస్టు చేయ‌కుంటే బీజేపీని తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌రు అన్న కోణంలో కొండా విశ్వేశ్వ‌రెడ్డి చేసిన‌ కామెంట్లు.. త‌ర్వాతి కాలంలో ఫ‌లితాల రూపంలో రుజువ‌య్యాయి. అప్పటి వరకూ రెండో స్థానంలో ఉన్న బీజేపీ కాస్తా.. మూడో స్థానానికి ప‌డి పోయింది. నాటి అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఈ విష‌యం  కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఇక ఇప్పడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌చారంలో రేవంత్ కూడా  కేంద్రంలోని  క‌మ‌లం  పార్టీకి బీఆర్ఎస్ కి బీటీమ్ అంటూ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం.. ఈ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడంతో.. కమలనాథులలో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే  జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కేటీఆర్ విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించింద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక కాళేశ్వరం దర్యాప్తును సీబీఐ చేపట్టేందుకు కూడా ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని చెబతున్నారు. 

హిడ్మా ఏపీకి ఎలా వచ్చాడు?.. ఎలా చిక్కాడు?

హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత.. రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒకటే. ఇన్నాళ్లూ దొరకని వ్యక్తి.. ఇప్పుడెలా దొరికాడు? దాదాపు 26 సార్లు భద్రతా దళాలపై దాడులు చేసినోడు.. ఒక్కసారి కూడా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నోడు.. ఇప్పుడెలా దొరికాడు? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. మావోయిస్ట్ పార్టీలో కీలకమైన వ్యూహకర్తగా ఉన్న హిడ్మా.. ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అయితే.. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత.. మావోయిస్టులకు గడ్డుకాలం మొదలైంది. అడవిలో సీన్ మారింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఎంతోమంది మావోయిస్టులు.. ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. కానీ.. వాటన్నింటిలో హిడ్మా ఎన్‌కౌంటరే అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఎందుకంటే.. హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. అంతకుమించి.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్‌కి.. కమాండర్. సుమారు రెండు దశాబ్దాలుగా.. భద్రతా బలగాలకు చిక్కకుండా.. అరణ్యంలో అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. దాదాపు పట్టుబడ్డాడు అనుకున్న ప్రతిసారీ.. అదృశ్యమయ్యాడు. అలాంటి హిడ్మా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. దేశంలో మావోయిజాన్ని రూపుమాపేందుకు.. భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ క్రమంలో.. వందల మంది పోలీసులు, కేంద్ర బలగాల ప్రాణాలు తీసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడన్న వార్త.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించినప్పటికీ.. ఒక్క హిడ్మా మరణమే ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. మావోయిస్ట్ పార్టీలో అతనికి ఉన్న ట్రాక్ రికార్డే. పార్టీలో అతని హోదా, హిడ్మా చేపట్టిన గెరిల్లా దాడులు, ఇన్నాళ్లూ భద్రతా బలగాలకు దొరకకుండా తప్పించుకున్న చరిత్రే.. హిడ్మాపై ఇంత చర్చ జరిగేలా చేస్తోంది. అయితే.. హిడ్మాని రౌండప్ చేయడానికి దారితీసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయ్. అతను భద్రతా దళాలకు చిక్కకుండా ఇన్నేళ్లూ తప్పించుకోగలిగాడంటే అందుకు ప్రధాన కారణం.. అతని చుట్టూ ఉన్న మూడంచెల భద్రతా వ్యవస్థే! స్థానిక గిరిజనుల సహకారం, అడవులపై అతనికి ఉన్న తిరుగులేని పట్టు, చుట్టూ ఉండే సెక్యూరిటీ రింగ్ వల్లే.. హిడ్మా ఇన్నాళ్లూ సేఫ్‌గా ఉన్నాడు. అయితే.. కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన వ్యూహాత్మక ఆపరేషన్ల కారణంగా.. హిడ్మా ట్రాప్‌లో పడ్డాడనే వాదన వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో.. భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయ్. దశాబ్దాలుగా మావోయిస్టులను పట్టుకోవడంలో ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు.. భద్రతా బలగాలు లేటెస్ట్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాయి. డ్రోన్‌లు, శాటిలైట్ మ్యాపింగ్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కదలికలను నిరంతరం ట్రాక్ చేయగలిగారు. దాంతో.. హిడ్మా ఆపరేషనల్ పాయింట్ అయిన దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలు కష్టమయ్యాయి. అన్ని వైపుల నుంచి నిర్బంధం పెరగడంతో.. హిడ్మా తన భార్య మడకం రాజే సహా కీలక రక్షణ దళ సభ్యులతో కలిసి.. షెల్టర్ జోన్ కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే.. హిడ్మా బృందం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లోకి ప్రవేశించింది. ఈ ప్రాంతం ఎప్పటి నుంచో మావోయిస్టులకు ఓ షెల్టర్‌జోన్‌గా ఉండేది. అలా.. ఈసారి కూడా ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకు, కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండేందుకు.. మారేడుమిల్లికి వచ్చినట్లు సమాచారం. అయితే.. హిడ్మా కదలికలపై ఏపీ ఇంటలిజెన్స్ బ్రాంచ్‌కి, తెలంగాణ ఇంటలిజెన్స్‌కి కచ్చితమైన సమాచారం అందింది. అలా హిడ్మా బృందం మారేడుమిల్లి అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయ్. మావోయిస్టుల అంతర్గత సమాచారాన్ని ఛేదించడమే.. ఈ ఆపరేషన్‌కు కీలకంగా మారింది. హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే నిఘా సమాచారం అందిన వెంటనే.. ఏపీ గ్రేహౌండ్స్ దళాలు, జిల్లా పోలీసు బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ ప్రారంభించాయ్. కూంబింగ్ మొదలుపెట్టి.. పక్కాగా ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆరున్నర నుంచి 7 గంటల మధ్య.. హిడ్మా బృందం అటవీప్రాంతంలో హిడ్మా బృందం భద్రతా బలగాలకు ఎదురుపడింది. దాదాపు అరగంట నుంచి గంట పాటు పోలీసులు, హిడ్మా దళం మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మా తన రక్షణ దళంతో పోరాడినా.. చివరికి పోలీసు బలగాల వ్యూహానికి చిక్కక తప్పలేదు. ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటు అతని భార్య  సహా మొత్తం ఆరుగురు కీలక మావోయిస్టులు మరణించారు. వారంతా.. హిడ్మా రక్షణదళంలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే అనేక ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీకి.. హిడ్మా ఎన్‌కౌంటర్ కోలుకోలేని దెబ్బగా మారింది. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మావోయిస్టుల నివాసాల వివరాలు, సంప్రదింపుల కోడ్‌లు, ఆయుధాల డంప్‌ల గురించి తెలుసుకున్నారు. దాంతో.. నాలుగు రాష్ట్రాల్లో ఆయుధాల డంప్‌లని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. హిడ్మా మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగానే కాదు.. పీఎల్‌జీఏ బెటాలియన్ నెంబర్ వన్‌కి కమాండర్ కూడా. ఇది.. మావోయిస్ట్ పార్టీలో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన దళం. హిడ్మా జరిపిన అనేక దాడుల్లో.. ఎంతోమంది పోలీసులు, భద్రతా దళాల సిబ్బంది మరణించారు. మావోయిస్ట్ అగ్రనేతల్లో ఎక్కువమంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు కాగా.. హిడ్మా బస్తర్ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీకి ఎంపికైన.. ఏకైక గిరిజన నాయకుడు. ఇది.. అతని ప్రభావాన్ని, స్థానికంగా ఉన్న పట్టుని సూచిస్తుంది. హిడ్మా మరణం.. మావోయిస్ట్ పార్టీ సామర్థ్యం, అంతర్గత వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు. యువతని రిక్రూట్‌ చేయడంలోనూ, దండకారణ్యంలో దాడులను సమన్వయం చేయడంలో హిడ్మాకు తిరుగులేదు. అలాంటి వ్యక్తి ఎన్‌కౌంటర్.. మావోయిస్ట్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా, భద్రతా బలగాలకు చరిత్రాత్మకమైన విజయంగా విశ్లేషిస్తున్నారు.

క్యా సీన్ హై?

హైదరాబాద్ ప్రగతి, పురోగతిలో చంద్రబాబు ముద్ర చెరిపివేయలేనిదని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. అయితే రాజకీయ కారణాలతో ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి ఇష్టపడరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు దూరదృష్టితో చెప్పిన మాటలకు వక్రభాష్యం చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలన్న చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తనకు రెండు కళ్లు వంటివన్నారు. ఆ మాటలకు వక్రభాష్యం చెప్పి చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ ప్రచారం చేశారు.  రాష్ట్ర విభజన తరువాత కూడా  అవసరమైన, అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సెంటిమెంటును బయటకు తీసి.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.  అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమై రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకార భావన ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.    అయితే.. ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు, విభజన సమస్యల పరిష్కారం విషయాలు పూర్తిగా కొలిక్కిరాకపోవడంతో తెలంగాణ వాదం ఒక సెంటిమెంటుగా ఇంకా సజీవంగా ఉంది. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికీ అవకాశం ఉన్నా లేకున్నా.. ఆంధ్రా బూచి అంటూ తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ మనుగడ కాపాడుకోవాలనీ, ఉనికి చాటుకోవాలనీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశంతో జట్టు కట్టేందుకు ఆ పార్టీలు ఒకింత జంకుతున్న పరిస్థితి ఉంది. చివరాఖరికి బీజేపీ కూడా తెలంగాణలో తెలుగుదేశంతో చెట్టాపట్టాలేసుకు తిరగడం సంగతి అటుంచి.. అలాంటి పరిస్థితి ఉందన్న భావన కూడా తెలంగాణ ప్రాంతంలో కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం అత్యంత కీలక భాగస్వామి. అయినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తెలుగుదేశంకు దూరం మెయిన్ టైన్ చేస్తున్నది. అందుకు తాజా ఉదాహరణే ఇటీవలి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తెలుగుదేశం మద్దతు కోరకపోవడమే.  ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో వేదిక పంచుకోవడం, ఆయనతో కలివిడిగా మాట్లాడటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ ముచ్చట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  రామోజీ రావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.  దీంతో చంద్రబాబు గతంలో చెప్పినట్లు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారిగా కలిసి ఉందా. కలిసి రెండు రాష్ట్రాలనూ అభివృద్ధి చేసుకుందాం అన్న మాటల ఇప్పుడు మరో సార బలంగా రెండు రాష్ట్రాలలోనూ వినిపిస్తున్నాయి. ఆ దిశగా రెండు రాష్ట్రాలూ ముందుకు సాగుతాయన్న ఆశాభావాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలలో కలిగించాయి.  

కాంగ్రెస్ ఇక క‌నుమ‌రుగేనా?

అది కాంగ్రెస్ కాదు.. ఖాన్ గ్రెస్ అని  సంఘ్ ప‌రివార్ చేస్తున్న ప్ర‌చార‌ ప్ర‌భావ‌మో.. లేక  రాహుల్ చేత‌గాని త‌న‌మో, ఖ‌ర్గే శక్తికి  మించిన ప‌నిత‌న‌మో, మ‌రో మ‌న్మోహ‌న్ సింగ్ దొర‌క‌ని వైన‌మో.. తెలీదు కానీ ప్ర‌తి ఎన్నిక‌లోనూ కాంగ్రెస్ ఓటమి   ఎదుర్కొంటూనే  వ‌స్తోంది. తాజాగా బీహార్ లోనూ బొక్క బోర్లా  ప‌డింది కాంగ్రెస్ నాయ‌క‌త్వంలోని  మ‌హా ఘ‌ట్ బంధ‌న్. విచిత్ర‌మైన  విష‌య‌మేంటంటే  ఓట్ చోరీ అంటూ  పెద్ద ఎత్తున  ప్రెజంటేష‌న్లు ఇచ్చి, ఆపై పాద‌యాత్ర‌లు చేసి  అటు పిమ్మ‌ట  స‌ర్ అనే విధాన‌మే త‌ప్పుల  త‌డ‌క  అంటూ  టాంటాం చేస్తే  లాస్ట్ కి కాంగ్రెస్ సార‌ధ్యంలోని  మ‌హా ఘ‌ట్ బంధ‌న్ కే రాం  రాం చెప్పేశారు బీహారీ జనం. పైపెచ్చు త‌మ‌ను ఎప్ప‌టి నుంచో స‌జావుగా ప‌రిపాలిస్తున్న నితీష్ నాయ‌క‌త్వంలోని  ఎన్డీయే  కూట‌మికే జై కొట్టారు. ఇప్పుడు చూస్తే ద‌క్ష‌ణాదిలో తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో త‌ప్ప మ‌రెక్క‌డా  అజా  ప‌జా లేదు కాంగ్రెస్. ఊపూ  రూపు షేపు లేదు హ‌స్తం పార్టీకి. జ‌నానికి తాము హ్యాండిద్దామ‌ని చూస్తుంటే వాళ్లే రివ‌ర్స్ లో వ‌చ్చి హ్యాండ్ పార్టీ షేక‌య్యేలా చేస్తున్నారు. అలాంటి ఘోర ప‌రాజ‌యాలు త‌ర‌చూ ఎదుర‌వుతున్నాయి హ‌స్తం పార్టీకి. ఈ పార్టీ హ‌స్త‌రేఖ‌లు అంత‌గా తారుమారై పోయాయి. ఏ జ్యోతిష్కుడికి  చూపించి వీటిని స‌రి చేసుకోవాలో తెలీక తిక‌మ‌క ప‌డిపోతోంది కేడ‌ర్ మొత్తం.  ఇక్క‌డ తెలంగాణ‌లో ఉప  ఎన్నిక‌తో స‌హా విజ‌య దుందుభి  మోగించిన కాంగ్రెస్ అన్న వార్త విన‌డానికి కూడా మ‌న‌సు రావ‌డం లేదు.. రాహుల్ ప‌రిస్థితి అయోమ‌యం జ‌గ‌న్నాథంగా మారింది. ఇప్ప‌ట్లో ఆయన జాత‌కం పార్టీ భ‌విత‌వ్యం మారేలా  క‌నిపించడం లేదు. అంత‌గా డీలా ప‌డిపోతోంది పార్టీ మొత్తం. మాములుగా  ఎవ‌రైనా క‌ష్ట‌ప‌డితే ఫ‌లితాలు వాటంత‌ట అవే  వ‌స్తూ ఉంటాయి. అదే రాహుల్ గాంధీ క‌ష్ట‌ప‌డితే రావాల్సిన  రిజ‌ల్ట్స్ కూడా రాకుండా వెన‌క్కు వెళ్లిపోతున్నాయ్. అంత ఘోరంగా రివ‌ర్స్ లో తిరుగుతోంది కాంగ్రెస్ అదృష్ట చ‌క్రం. మొన్న‌టి వ‌ర‌కూ రాజ‌స్థాన్, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఉన్న‌ట్టు క‌నిపించిన కాంగ్రెస్ ఇప్పుడు చూస్తే వాటిలోనూ  గుండు సున్నా చుట్టేసి.. ఉత్త‌రాదిలో దాదాపు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా పోయింది. శూన్య హ‌స్తం మిగిలింది. ఒంట‌రిగా  పోటీ చేస్తే గెటాన్ కాలేక పోతున్నాం.. క‌నీసం  కూట‌మి  క‌ట్టి విజ‌యాల‌ను సాధిస్తామ‌ని భావిస్తే అక్క‌డా జీరో బ్యాలెన్సే చూపిస్తోంది పార్టీలోని సీట్ అకౌంట్. దీంతో ఏం చేయాల్రా కాంగ్రెస్ భ‌గ‌వంతుడా అని త‌ల ప‌ట్టుకోవ‌ల్సి వ‌స్తోంది  రాహుల్ గాంధీ. ఒక‌ప్పుడు దేశంలోని రాష్ట్రాల‌న్నిటినీ హ‌స్త‌గ‌తం చేసుకున్న  కాంగ్రెస్ నేడు చూస్తే, ఆ చేతుల‌ను ఎవ‌రో తీసేసిన‌ట్టు దారుణ ప‌రాభ‌వాల‌ను మూట‌గ‌ట్టుకుంటూ వెళ్తోంది. పార్టీ ఫెయిల్యూర్స్ లోనే స‌రికొత్త రికార్డుల‌ను న‌మోదు చేస్తూ వ‌స్తోంది. ఈ ప‌రాజ‌య  ప‌రంప‌ర  ఏ  తీరాల‌కు చేరేను? అన్న‌ట్టుగా  మారింది ప‌రిస్థితి. సమకాలీన రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమౌతోంది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలనే తపనతో మెజారిటీ వర్గాలకు దూరమవుతోంది. ముస్లిం, మైనార్టీలకు అండగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తోంది. ఒకప్పుడు యూపీ, బీహార్ లో ఠాకూర్ లు , రాజపుత్రులు కాంగ్రెస్ కు అండగా ఉండేవారు. ఇప్పుడు వారంతా బీజేపీ గూటికి చేరారు. మధ్యప్రదేశ్ లో రాజవంశాలు అన్నీ కాంగ్రెస్ కు దూరమయ్యాయి. రాజకీయాల్లో రాణించడానికి వ్యూహాలు బలంగా ఉండాలి. నేల విడిచి సాముచేస్తే విజయాలు రావు. పార్టీ లో సీనియర్లు అంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. చివరకు పార్టీ కూడా కనుమరుగు అవుతుందా అన్నట్లుగా తయారైంది పరిస్థితి.ఫ్యూచ‌ర్లో క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లోనూ ప్ర‌భుత్వాలు క‌నుమ‌రుగైతే.. ఇక కాంగ్రెస్ జీరో స్టేజీకి చేరి క‌మ్యూనిస్టు పార్టీల స‌ర‌స‌న కూర్చోడానికి పెద్ద‌గా  టైం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. చివ‌రాఖ‌రికి రాహుల్ గాంధీకి  త‌మిళ‌నాడు ఒక్క‌టే దిక్కుగా  క‌నిపిస్తోంది. ఇక్క‌డ స్టాలిన్ పార్టీతో జ‌త‌గ‌ట్టి  అధికారంలోకి రావాల‌ని తెగ ఉబ‌లాట ప‌డుతోంది. కానీ విజ‌య్ పార్టీ ఎఫెక్ట్ ఎలా  ఉంటుందో తెలీడం  లేదు. దీంతో ఈ రాష్ట్రంపైనా ఆశ‌లు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఒక వేళ ఇక్క‌డ డీఎంకే గెలిచినా అది కాంగ్రెస్ కి అధికార  యోగాన్నిచ్చేదేం కాదు. దీంతో రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలోనికాంగ్రెస్  ప‌రిస్థితికి నానాటికీ తీసికట్టు సామెతగా మారుతోంది. 

క‌విత‌క్క క‌ర్మ సిద్ధాంతం మతలబిదేనా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల‌పై తెలంగాణ జాగృతి క‌విత సింపుల్ గా   క‌ర్మ హిట్స్ బ్యాక్ అని చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యల అర్ధం ఏమిటి?  అని అంతా తలలుబాదుకుంటున్నారు. ఇక జూబ్లీ ఉప ఎన్నికలో ఓటమిని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత  కూడా ఏమంత సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.  మాగంటి సునీత   ఆమె   నైతిక విజ‌యం నాదే అంటూ ముక్తాయించేశారు. వాళ్లు రిగ్గింగ్ చేసి గెలిచార‌ని న‌వ్వుతూ చెప్పేసి  వెళ్లిపోయారు.  ఇక కేటీఆర్ అయితే ఈ ఫలితంపై ఎటువంటి సంచలన   కామెంట్లూ చేయ‌లేదు. అదేమంటే  అధికార పార్టీ అన్నాక, ఉప ఎన్నిక‌ల‌న్నాక గెల‌వ‌డం  ఖాయ‌మ‌న్న ప‌ర్మినెంట్ స్టేట్మెంట్ ఒక‌టి  ప‌డేశారు. మ‌రి  త‌మ జ‌మానాలో దుబ్బాక‌, హుజూరాబాద్  వంటి ఉప ఎన్నిక‌ల్ని  ఎందుకు ఓడారో ఆయ‌న చెప్పాల్సి ఉంది. ఇక  క‌ర్మ విష‌యానికి వ‌స్తే..  ఇప్ప‌టికే  గోపీనాథ్ మృతి ప‌ట్ల ఆయ‌న తల్లి  అనుమానాలు వ్య‌క్తం  చేశారు. ఈ విష‌యంపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజ‌య్ సైతం తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. గోపీనాథ్ కేటీఆర్ కి బినామీ అనీ.. అంటారు. ఈ ఆస్తుల పంప‌కాల్లో తేడాల కార‌ణంగా కేటీఆర్ తో కల‌సి త‌న వాటా  కోసం  సునీత కూడా కుట్ర  చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.   అస‌లీ టికెట్ ఇచ్చిందే  ఆ  లావాదేవీల్లో భాగం అంటున్నారు కొందరు.  ఓవ‌రాల్ గా  మాగంటి డెత్ మిస్ట‌రీ  అయితే ఇప్ప‌ట్లో వీడేలా లేదు. ప్ర‌త్యేకించి మాగంటి  త‌ల్లి  మ‌హానందినీ దేవి  ప‌ట్టుబ‌ట్టి మ‌రీ  పోలీసుల‌ను ఇందులో విచార‌ణ చేయ‌మ‌ని బ‌ల‌వంత పెడితే  త‌ప్ప‌. ఇది వ‌ర‌కే ఈ విష‌యంలో  సీఎం  రేవంత్  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి  సంజ‌య్ మాగంటి మృతి విషయంలో ఫిర్యాదు చేస్తే విచార‌ణ జరిపిస్తామని చెప్పేశారు కూడా. మ‌రి వీటి ప‌ర్యావ‌సానాలేంటి? ఇదంతా ఎన్నిక‌ల  ముందు వ‌ర‌కేనా? త‌ర్వాత ఎవ‌రికి  వారు ప్యాక్ అప్ చెప్పి  సైడ్ అవుతారా తేలాల్సి ఉంది. అయితే ఇందులోని అస‌లు నిజం ఎప్పుడు బ‌య‌ట ప‌డే అవ‌కాశ‌ముందంటే, ఇప్ప‌ట్లో ఇదంతా తేల‌కుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల పందేరం ద‌గ్గ‌ర మాత్రం ఇదొక సంచ‌ల‌నంగా మారే అవ‌కాశం లేక పోలేదు. ఎందుకంటే ఈ టికెట్ ని తిరిగి  సునీత‌కు ఇవ్వ‌కుంటే..   ఆమె దీనిపై ఏదైనా ఓపెన్ గా కేటిఆర్ సెంట్రిక్ గా  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే ఛాన్స‌యితే లేక  పోలేదు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కూ ఈ క‌ర్మ ఆగుతుందా? లేక మ‌ధ్య‌లోనే బ్లాస్ట్ అవుతుందా?  తేలాల్సి ఉంది.

అంచనాలకు భిన్నంగా బీహార్ ఎగ్జిట్ పోల్స్!

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడో ఒకప్పుడు తప్పుతుంటాయ్ తప్ప.. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జాక్ట్ పోల్స్‌కు దగ్గరగానే ఉంటాయి. బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికారం చేపట్టబోతోందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. అంతా అనుకున్న దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కనిపించడంతో.. బీహార్ ప్రజలు ఇంత కమిటెడ్‌గా తీర్పు ఇవ్వడమేంటనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అందరి ఫోకస్ ఇప్పుడు యువ నాయకుడు తేజస్వి యాదవ్ రాజకీయ భవిష్యత్ పైనే ఉంది. ఎన్నికల ప్రచారంలో  ఆయన చూపించిన దూకుడు, యువతను ఆకట్టుకోవడంలో సాధించిన సక్సెస్, ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమిని ముందుకు నడిపించిన తీరు.. తలపండిన రాజకీయ నేతలను, పరిశీలకులను సైతం విస్మయపరిచింది. కచ్చితంగా.. తేజస్వి నాయకత్వంలో.. బీహార్‌లో మహాఘట్‌బంధన్ అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తుందనుకున్నారంతా. కానీ, ఎగ్జిట్ పోల్స్ వచ్చాకే.. బీహార్‌లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో అందరికీ అర్థమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ.. దాదాపుగా ఎన్డీయేకే మొగ్గు చూపడంతో.. అంతా అవాక్కయ్యారు.  అయితే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు ఎగ్జిట్ పోల్స్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఫలితాలు వచ్చినప్పుడు ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే 125 సీట్లు గెలుచుకోగా, మహాకూటమి 110 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ  మాత్రం అత్యధికంగా 75 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, వాస్తవ ఫలితాలకు.. పెద్ద తేడా వచ్చింది. ఈసారి కూడా ఎన్నికలు హోరాహోరీగా సాగడంతో, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చనే ఆశ  మహా‌ఘట్‌బంధన్ క్యాంప్‌లో ఇప్పటికీ ఉంది. ఏదేమైనా, ఈ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఓ రైజింగ్ స్టార్‌గా నిలిచారు. ఆయన జీవితంలో.. 2025 బీహార్ ఎన్నికలు.. ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయ్. బీహార్‌ పాలిటిక్స్‌లో.. నితీశ్ కుమార్ తర్వాత అంతటి బలమైన, ప్రజలను ఆకట్టుకోగల నేతగా తేజస్వి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా.. యువతని ఆకట్టుకోవడంలో తేజస్వి సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి కల్పన అస్త్రంతో జనంలోకి వెళ్లారు. బీహార్ యువత, ముఖ్యంగా నిరుద్యోగులు భారీ ఎత్తున.. తేజస్వి యాదవ్ ప్రచారానికి తరలివచ్చారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. ఓ గేమ్ ఛేంజర్‌గా మారింది.  తేజస్వి యాదవ్.. మహాఘట్‌బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా  దాదాపు ఒంటరి పోరాటాన్ని నడిపించారు. నితీశ్ కుమార్, ప్రధాని మోడీ లాంటి అగ్ర నేతల ఉమ్మడి శక్తిని ఎదుర్కొని కూడా ప్రచారంలో బలంగా నిలబడ్డారు. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. ఆర్జేడీ అంటే కేవలం ముస్లిం-యాదవ్ ఓట్ బ్యాంక్ అన్న అపవాదును తొలగించడానికి తేజస్వి ప్రయత్నించారు. ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలకు పెద్దపీట వేసి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశారు. అయినప్పటికీ.. బీహార్ ప్రజలు ఎందుకు తేజస్వి యాదవ్‌కి మద్దతుగా నిలవలేకపోయారనే చర్చ మొదలైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై,  మహాఘట్‍‌బంధన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. మరో ఐదేళ్లు తేజస్వి అపొజిషన్‌కే పరిమితం అవుతారు. అధికారంలోకి వస్తామనే ఆశల నుంచి, మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవడం అనేది.. తేజస్వి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపే చాన్స్ కూడా ఉందంటున్నారు. అయితే.. ఆర్జేడీ మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశం ఉన్నందున తేజస్వి యాదవ్ బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషిస్తారా? అధికారం దక్కలేదని కుంగుబాటుకు గురవుతారా? అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. తేజస్వి యాదవ్ వయసు 40 ఏళ్ల లోపే ఉంది. రాజకీయంగా ఇది చాలా చిన్న వయసు. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు. నితీశ్ కుమార్ వయసు పెరుగుతోంది కాబట్టి.. రాబోయే రోజుల్లో తేజస్వికే ఎక్కువ అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

మదనపల్లిలో కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు

  అన్నమయ్య జిల్లా మదనపల్లిలో  కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. పట్టణంలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్‌ బయటకొచ్చింది. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  వైజాగ్‌కు చెందిన పద్మ అనే మహిళ.. మరో ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. వారికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించారు. ఆపరేషన్ తర్వాత యమున అనే మహిళ మృతిచెందింది.  అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రి వైద్యులను అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్‌లో కీలక నిందితుడు రాకేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్‌ డాక్టర్‌ ఆంజనేయులు కోడలు డాక్టర్‌ శాశ్వతి గ్లోబల్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నీ రాకెట్ వెనుక మదనపల్లె డయాలసిస్‌ కేంద్రం మేనేజర్‌ బాలు, పుంగనూరు డయాలసిస్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ నాయక్‌ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. డాక్టర్‌ శాశ్వతి ఈ ముఠాతో కలిసి కిడ్నీ మార్పిడులకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. డయాలసిస్‌ సెంటర్‌కు వచ్చే ధనవంతులను టార్గెట్‌ చేసి, కిడ్నీ అవసరమైన పేషెంట్లకు కొత్త కిడ్నీలు దొరుకుతాయని నమ్మబలికే ఈ రాకెట్‌ నడిపారు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేశ్‌ సంప్రదించారు. కిడ్నీ ఇస్తే రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. యమున కిడ్నీని మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రిలో సేకరించి, గోవాలోని ఒక వ్యక్తికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. నవంబర్‌ 9న ఆపరేషన్‌ జరుగుతుండగా, యమున మూర్చపడి మృతిచెందింది. ఈ ఘటనను గ్లోబల్‌ ఆసుపత్రి నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచి 112కి ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసుల సమాచారంతో మదనపల్లె టూ టౌన్‌ పోలీసులు గ్లోబల్‌ ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడే ఉన్న మేనేజర్లు బాలు, వెంకటేశ్‌ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వైజాగ్‌కు చెందిన బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

పవన్‌ తిరుపతి పర్యటనపై విమర్శలు... ఎమ్మెల్యేలను కలిసే భాగ్యం లేదా?

  డిప్యూటీ సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే స్థానిక నాయకులు కూడా ఇతర పర్యటనలు మానుకొని ఆయన్ను కలవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇటీవల పవన్‌ కల్యాణ్‌ తిరుపతి జిల్లా పర్యటనలో మాత్రం ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన.. నేరుగా మాముండూరు అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అక్కడ అధికారుల నుంచి వివరాలు సేకరించి, వాచ్ టవర్ నుంచి పరిసరాలను పరిశీలించారు.  అనంతరం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మాముండూరు అటవీ ప్రాంతం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ఉపముఖ్యమంత్రిని కలిసి పలు కీలక సమస్యలను ప్రస్తావించాలని సిద్ధమయ్యారు. ముఖ్యంగా రేణిగుంట, ఏర్పేడు అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న వన్యప్రాణుల దాడుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై అటవీ శాఖ నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలను ఆయన దృష్టికి తీసుకురావాలనుకున్నారు.  బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం కోసం అటవీ భూముల సేకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనే విషయాన్ని పవన్‌కు వివరిద్దామనుకున్నారట. అంతేకాదు.. శ్రీకాళహస్తి ఆలయం సమీపంలోని కొండలపై చెట్ల పెంపకానికి అటవీ శాఖ తీసుకోవాల్సిన చర్యలపైనా ఆయనతో డిస్కస్‌ చేద్దామని రెడీ అయ్యారట. అయితే పవన్‌ వ్యక్తిగత సిబ్బంది నుంచి ఆ టూర్‌కు ఎవరూ రావాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. దాంతో బొజ్జల సుధీర్‌ రెడ్డి పవన్‌ టూర్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.  ఇక తిరుపతిలో జరిగిన అటవీ శాఖ రివ్యూ సమావేశానికి సైతం స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించినప్పుడు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు హాజరై తమ నియోజకవర్గ సమస్యలను చెబుతుంటారు. కానీ, ఇక్కడ జనసేన తిరుపతి ఎమ్మెల్యేను సైతం సమావేశంలోకి రానివ్వలేదట. దీంతో ఆయన పక్క గదిలో ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్న అటవీ శాఖ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సిద్ధమైనా అది సాధ్యపడలేదు.  హాస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ హారి ప్రసాద్ కూడా ఎర్రచందనాన్ని హాస్తకళల కార్పొరేషన్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేసుకున్నారు. కానీ, ఆయన్ని కూడా కలవడానికి అవకాశం దక్కలేదనే టాక్ ఉంది. ఇక రెండవ రోజు పర్యటనలోనూ ఇదే పరిస్థితి ఎదురైందట. పలమనేరుకు వచ్చిన ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ వచ్చారు.  అయితే, రైతులతో సమావేశం అవుతారని ముందుగా చెప్పినా, డిప్యూటీ సీఎం నేరుగా మొసలిమడుగు ఏనుగుల క్యాంపుకు వచ్చి అధికారుల సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఏనుగుల దాడుల గురించి వివరించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదనే చర్చ నడుస్తోంది. ఏనుగుల దాడులతో అల్లాడిపోతున్న తమ మాటలు కనీసం అటవీ మంత్రిగా పవన్ కల్యాణ్ వింటారని ఆశించిన రైతులకు ఈ పర్యటన నిరాశనే మిగిల్చింది. ఏనుగుల బాధితులు ఏడాదిన్నర తర్వాత తమ కష్టాలు వినడానికి మంత్రి వస్తున్నారని ఆశగా వచ్చారు.  పంట నష్టం కొద్దిగా జరిగితే, పరిహారం అంతకంటే తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి ఒక్కోసారి రైతులు విద్యుత్ వైర్లను వేయడం, అటవీ జంతువులు చనిపోవడంతో రైతులపై కేసులు పెడుతున్నారని వారు వాపోతున్నారు. అటవీ శాఖ లెక్కల ప్రకారమే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు చెబుతున్నా, పరిహారం విషయంలో నిర్లక్ష్యం ఉందనే విమర్శలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో తమ గోడు చెప్పుకుందామని వచ్చిన రైతులకు ఉపముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉపముఖ్యమంత్రి సమక్షంలో అధికారులకు తమ సమస్యలు వినిపించుకుందామనుకున్న రైతులకు, అధికారులకు వార్నింగ్ ఇద్దామని భావించిన స్థానిక ప్రజా ప్రతినిధులకు నిరాశ మిగిలింది. ఈ పర్యటన స్థానిక జనసేన క్యాడర్‌కు సైతం నిరాశ కలిగించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు వ్యూహం.. జాతీయ నేతగా లోకేష్ అడుగులు!

రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ముందు ముందు జాతీయ స్థాయిలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించానున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే తన పనితీరుతో లోకేష్ రాష్ట్రంలో అన్ని వర్గాలకూ చేరువ అయ్యారు. గతంలో విమర్శలు చేసిన వారు కూడా ఇప్పుడు లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయంగా పరిణితి చెందారన్న అభిప్రాయమూ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ఇటు ప్రభుత్వంలోనూ, అటు తేలుగుదేశం పార్టీలోనూ తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. ఇక ప్రజలలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరో లెవల్ కు చేరింది.  ప్రజానాయకుడిగా జనం ఆయనను భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం భవిష్యత్ నాయకుడిగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.   ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకూ లోకేష్ అన్ని వర్గాల, అన్ని పార్టీల నుంచీ కూడా మంచి నేతగా గుర్తింపు పొందారు.  ఇక ఇప్పుడు ఆయనను జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హస్తిన, ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఆయనకు గుర్తింపు లభించేలా ఒకదాని వెంట  ఒకటిగా లోకేష్ వేస్తున్న అడుగుల వెనుక  చంద్రబాబు స్ట్రాటజీ ఉందని   పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ లోకేష్ అడగకుండానే అప్పాయింట్ మెంట్లు ఇస్తున్నారు. అలాగే కేంద్ర కేబినెట్ లోని పలువురు మంత్రులతో లోకేష్ కు మంచి పరిచయాలు, అనుబంధం, సాన్నిహిత్యం ఏర్పడింది. తరచుగా వారి సూచనలు, సలహాలూ తీసుకుంటూ వారికి చేరువ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా తాను వెళ్లకుండా లోకేష్ ను పంపించారు. అక్కడ ఆయన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.  బీహార్ ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సహా పలువరు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అంతటి కీలకమైన బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి   నారా లోకేష్ వెళ్లడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ ప్రచారం ఆయనకు జాతీయ నేతగా వస్తున్న గుర్తింపును మరో మెట్టు పైకి తీసుకువెడుతుందని అంటున్నారు.