జూబ్లీ బైపోల్.. గెలుపోటములతో పాటు.. పోలింగ్ శాతంపైనా చర్చ!
posted on Nov 7, 2025 9:28AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. విమర్శల ఘాటు తీవ్రమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో జూబ్లీపైపోల్ లో ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న చర్చ జోరందుకుంది. అయితే దీనిని మించి అసలు జూబ్లీలో పోలింగ్ శాతం ఎంత నమోదౌతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. తప్పకుండా డిబేట్ జరిగే పాయింట్ ఇది. తక్కువ పోలింగ్ శాతం.. ఇక్కడి ఎన్నికని ప్రభావితం చేసే మేజర్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. పోలింగ్ భారీగా నమోదవుతుందా? లేక.. ఎప్పటిలాగే 50 శాతం లోపే ఉంటుందా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఒకవేళ.. తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఎవరికి నష్టం జరుగుతుంది? ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఏ పార్టీకి ప్లస్ అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. దానివల్లే, ఈ ఉపఎన్నికలోనైనా జూబ్లీహిల్స్ ఓటర్లు గడప దాటి, పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. మెజారిటీ ఓటర్లు.. ఎప్పటిలాగే.. ఎవరైతే ఏముంది? మాకొచ్చేదా? పోయేదా? అని లైట్ తీసుకొని.. రిలాక్స్ అవుతారా? అన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది.
ఒక్కసారి జూబ్లీహిల్స్ పోలింగ్ హిస్టరీని చూస్తే.. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి జూబ్లీలో పోలింగ్ ట్రెండ్ ను ఓ సారి పరిశీలిస్తే.. 2014లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే అత్యధికంగా నమోదైన పోలింగ్ రికార్డ్. అంటే అంతకు ముందు ఇక్కడ భారీ పోలింగ్ జరిగిందని కాదు. మరీ గతంలోకి పోకుండా.. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి మాత్రమే మన పరిశీలనకు తీసుకుందాం. సరే 2014లో జూబ్లీ నియోజకవర్గంలో 50.1శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరిగిందని చెప్పుకున్నాం కదా.. 2018 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి 5 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. అప్పుడు కేవలం.. 45.5 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. మళ్లీ 5 శాతం పోలింగ్ పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన పోలింగ్ కేవలం 39.8 శాతం మాత్రమే. గత గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇక్కడ పోలింగ్ 50శాతం దాటలేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 47.5 శాతం ఓటింగ్ నమోదైంది. 2014 ఎన్నికల తర్వాత ఇదే హయ్యెస్ట్. అయితే.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నాటికి పోలింగ్ శాతం మళ్లీ రెండు శాతం తగ్గి 45.5 శాతం మాత్రమే నమోదైంది. అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నడూ 50శాతం పోలింగ్ నమోదు కాలేదు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ ఏరియాలున్నాయ్. ఓ వైపున సంపన్నులుంటే.. మరోవైపు సాధారణ ప్రజలు ఉంటారు. ఇక్కడ ఎన్నికలొస్తే.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు.. స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాలు కూడా ఎక్కువే ఉన్నాయ్. ఇక్కడి ఓటర్లే.. ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే.. తెలంగాణ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌కు తొలిసారి ఉప ఎన్నిక వచ్చింది. మరి.. ఈ బైపోల్ విషయంలోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? లేక.. ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఈ ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో.. పోలింగ్ శాతంపై కూడా అంతే డిబేట్ నడుస్తోంది. ఈ ఉపఎన్నికలో.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. గట్టిపోటీ ఉన్నప్పుడు, ఒక్క బైపోల్.. మొత్తం స్టేట్ రాజకీయాన్నే మార్చేస్తుందని నమ్ముతున్నప్పుడు.. తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని.. అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తాయ్. ఓటర్లను పోలింగ్ కేంద్రాల దాకా రప్పించేందుకు ఎంతో ప్రయత్నిస్తాయి. అందువల్ల.. జూబ్లీహిల్స్ బరిలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులంతా.. ఓటర్లని పోలింగ్ స్టేషన్ల దాకా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా.. మాస్ ఏరియాల్లో బీసీ, ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను.. పోలింగ్‌కు రప్పించడానికి పార్టీలు మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది. క్లాస్ ఏరియాల్లో నివసించే వారు.. పోలింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు.. పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఇప్పటికే పర్సనల్ అప్పీల్స్ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి.. వారు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ.. వాళ్లంతా పోలింగ్ కేంద్రాల దాకా వస్తారా? లేదా? అనేదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.
జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో నమోదైన మొత్తం ఓటర్లలో.. దాదాపు 22 శాతం మంది 29 ఏళ్ల లోపు యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా.. ఉద్యోగాలు, విద్య, మౌళిక వసతుల లాంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీరి టర్నౌట్ గనక పెరిగితే.. పోలింగ్ శాతం తప్పకుండా పెరుగుతుందనే అంచనాలున్నాయ్. గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే.. ఇక్క 50 శాతం పోలింగ్ టచ్ కావడం కాస్త కష్టమే అయినప్పటికీ.. పార్టీల మధ్య నెలకొన్న బలమైన పోటీ, యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, పార్టీల నేతలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు రప్పించడంలో చూపించే శ్రద్ధ మీదే ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరగడమా? తగ్గడమా? ఎప్పటిలాగే నమోదవడమా? అనేది ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.