కవితను నియంత్రిస్తేనే కేసీఆర్ ఎంట్రీ క్లిక్!?
posted on Dec 20, 2025 @ 1:33PM
తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం వినా తమ పార్టీ పుంజుకోవడానికి మరో మార్గం లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. అది కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రియాశీలంగా మారి.. గతంలోలా తన మాటల మాయాజాలం ప్రయోగిస్తేనే పార్టీ ఉనికి, భవిష్యత్ ఉంటాయనీ, లేకుంటే నానానిటీ తీసికట్టు అన్నట్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దిగజారడం ఖాయమన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. అంతే కాదు కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కావడానికి ఇదే మంచి తరుణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అయినా కూడా పరిశీలకులలో కేసీఆర్ గతంలోలా తన మాటలతో మాయ చేయగలరా? ఆయన ప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందా? అన్న సంశయాలను వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమంటూ జరిగితే.. ఆయన తొలుత తన విమర్శల గళమెత్తాల్సింది తన తనయ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితపైనే. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత కల్వకుంట్ల కవిత.. ప్రణాళికా బద్ధంగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లను లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరంభించిన విమర్శల దాడి క్రమక్రమంగా విస్తరిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో అవినీతిపై ఆమె చేస్తున్న విమర్శలకు జనం నుంచి స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఒకరిద్దరు నేతలు కవితపై ప్రతి విమర్శలు చేస్తున్నప్పటికీ కల్వకుంట్ల కుటుంబం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి.
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ వెనుకబడటంతో కేసీఆర్ రంగంలోకి దిగక తప్పని అనివార్య పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. అయితే కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె విమర్శలకు దీటుగా సమాధానం చెప్పకుండా నీటి సమస్యలు, సెంటిమెంట్ అంటూ మాట్లాడితే జనం వినే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా ఆమె కవిత విమర్శల ధాటిని ఆపగలిగేలా విమర్శనాస్త్రాలు సంధించాల్సి ఉంటుంది. అది కేసీఆర్ చేస్తారా? సొంత కుమార్తెపైనే మాటల దాడికి దిగుతారా అన్నది వేచి చూడాల్సిందే.