తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలన విషయాలు

 

తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యికి సంబంధించి కల్తీ ఆరోపణల కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు లంచాలు తీసుకున్నట్టు టీటీడీ డైరీ ఎగ్జిక్యూటివ్ విజయ భాస్కర్ రెడ్డి అంగీకరించినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆయనను A-34గా పేర్కొన్నారు.

ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ  కోర్టులో విజయ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా వాటిని సమర్థిస్తూ బెయిల్‌ను తిరస్కరించింది. సిట్ వివరాల ప్రకారం 2023లో భోలే బాబా కంపెనీ నుంచి రూ.75 లక్షల లంచం, ప్రీమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు, ఆల్ఫా డైరీ నుంచి ఎనిమిది గ్రాముల బంగారం లంచంగా స్వీకరించినట్టు బయటపడింది. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు. 

ఇవన్నీ హవాలా మార్గంలో స్వీకరించినట్టు సిట్ గుర్తించింది. 2019 నుంచి 2024 వరకు సంబంధిత కంపెనీల పనితీరు సరైన విధంగా లేకపోయినా, నెయ్యి క్వాలిటీ బాగుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన కారణంగా టిటిడికి సుమారు రూ.118 కోట్ల మేర నష్టం జరిగినట్టు విచారణలో తేలింది. ఇప్పటికే విజయ భాస్కర్ రెడ్డి నుండి సిట్ రూ.34 లక్షలను సీజ్ చేసింది. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్‌ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌‌ను చేసింది. 

స్పోర్ట్స్ హాస్టల్‌లో ఇద్దరు బాలికలు సుసైడ్

  కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు మైనర్ ట్రైనీ బాలికలు (17, 15 ఏళ్లు) ఇవాళ ఉదయం తమ గదిలో ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోజికోడ్‌, తిరువనంతపురానికి చెందిన వీరు ఒకరు అథ్లెటిక్స్, మరొకరు కబడ్డీ క్రీడాకారిణి.  మార్నింగ్ ట్రైనింగ్ సెషన్‌కు ఆ ఇద్దరు బాలికలు హాజరు కాకపోవడంతో ఇతర విద్యార్థినులకు అనుమానం వచ్చింది. ఆ బాలికల రూమ్‌కు వెళ్లి పదేపదే తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో హాస్టల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు తలుపు పగలగొట్టి చూశారు. గదిలో ఇద్దరు బాలికలు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె పదో తరగతి చదువుతోంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజ్‌కోట్‌లో రికార్డు సృష్టించిన యువ బ్యాటర్ రాహుల్

  అంతర్జాతీయ క్రికెట్లో భారత్ యువ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్(112*) సెంచరీతో అజేయంగా నిలిచాడు. అయితే రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.  దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో శతక్కొట్టి.. అరుదైన ఘనతను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56), కేఎల్ రాహుల్(112*) అజేయ శతకంతో చెలరేగి ఆడారు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చారు. 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ ఆఖరి వరకు పోరాడాడు. దీంతో భారత జట్టు ఆ మోస్తరు స్కోరు అయినా చేయగలిగింది.  ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 96 వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రాహుల్‌కి ఇది వన్డేల్లో 8వ సెంచరీ. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు కూడా ఇతడిదే. ఈ క్రమంలో అతను 11 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2015లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మైదానంలో 108 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇదే హయ్యెస్ట్ వన్డే వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్ దీన్ని అధిగమించాడు. ఈ మైదానంలో కేఎల్ రాహుల్(112 నాటౌట్), క్వింటన్ డికాక్(108), స్టీవ్ స్మిత్(98), శిఖర్ ధావన్(96), మిచెల్ మార్ష్(96) టాప్-5 స్కోరర్లుగా కొనసాగుతున్నారు

నారావారిపల్లిలో ఘనంగా సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ కులదైవం నాగాలమ్మకు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తండ్రి ఖర్జూరనాయుడు, తమ్ముడు రామ్మూర్తి సమాధుల వద్ద నివాళులు అర్పించారు.అలానే ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించనున్నారు. వారిరి స్మరించుకున్నారు. గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేశారు.  పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి, వినతులు ఇవ్వడానికి పెద్దఎత్తున ప్రజలు నారావారిపల్లికు చేరుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్, భువనేశ్వరి, నారా రోహిత్, నందమూరి రామకృష్ణ, ఎంపీ భరత్  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఉండవల్లికి చేరుకుంటారు.

ట్రేడింగ్ పేరుతో సినీ దర్శకుడి కుమారుడికి భారీ మోసం

  హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్‌ తేజను అధిక లాభాల ఆశ చూపి హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు నిలువునా ముంచేసి ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని నమ్మించి మొత్తం రూ.63 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు చేస్తూ దంపతులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమితవ్‌ తేజ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.  గత ఏడాది 2025 ఏప్రిల్‌లో మోతీ నగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్‌ దంపతులతో అమితవ్‌ తేజకు పరిచయం ఏర్ప డింది. ఆ పరిచయాన్ని అవకాశంగా మలుచుకున్న దంపతులు ట్రేడింగ్‌లో పెట్టు బడి పెడితే భారీ లాభాలు వస్తాయని, ఒకవేళ నష్టం వస్తే తాముంటున్న అపార్ట్‌ మెంట్‌ ఫ్లాట్‌ను అప్పగిస్తా మని హామీ ఇచ్చారు. దంపతుల మాటలు నిజమని నమ్మిన అమితవ్‌ తేజ తొలుత కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టారు. వారం రోజులకే రూ.9 లక్షలు లాభం వచ్చిందంటూ నిందితులు కొన్ని నకిలీ పత్రాలు, స్టేట్‌ మెంట్లు చూపించి అమితవ్‌ తేజ నమ్మించారు.  వాటిని చూసి నిజమని భావించిన అమితవ్‌ తేజ క్రమంగా విడతల వారీగా మరిన్ని పెట్టుబడులు పెట్టాడు.ఇలా మొత్తం రూ.63 లక్షలు దంపతులకు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి లాభాలు రావడంతో పాటు పెట్టిన అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది.. దంపతులను ప్రశ్నించగా మాట తప్పించ డంతో మోసపోయినట్టు గ్రహించిన అమితవ్‌ తేజ చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రేడింగ్ పేరుతో నకిలీ పత్రాలు చూపించి డబ్బులు కాజేసిన ఘటనపై సైబర్ కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశముందని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడుల పేరుతో ఉపయోగించిన ఖాతాలు, ఇతర బాధితులు ఉన్నారా అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం...ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద ఆఫర్లు వస్తే ముందుగా పూర్తిగా పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.  

నారావారిపల్లెలో చంద్ర‘క్రాంతి’.. జనంలో, జనంతో బాబు కుటుంబం వేడుకలు

రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ చంద్ర‌బాబు అత్యంత ప్ర‌ముఖుడు. సంప్రదాయాలను ఆచరించడంలో, ప్రజలలో మమేకం కావడంలో, అందులో కుటుంబాన్ని భాగస్వామ్యం చేయడంలో ఆయన స్టైలే వేరు. ప్రతి సంక్రాంతి పండుగను స్వస్థలంలో ప్రజల మధ్య జరుపుకుంటారు. ఆయ‌న స్వ‌స్థలం నారావారిప‌ల్లె. ఈ ప‌ల్లె అదృష్టం ఎలాంటిదంటే ప్ర‌తి సంక్రాంతి స‌మ‌యంలో ఈ ప‌ల్లె పేరు మారు మోగుతుంది. అంతే కాదు.. నారావారి పల్లెలో జ‌రిపే సంక్రాంతి వేడుక‌ల్లో నారా, నంద‌మూరి కుటుంబసభ్యులందరూ క‌ల‌సి  పాల్గొంటారు. దీంతో ఈ ఊరు క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. ఊరు ఊరంతా  జాత‌రలాంటి వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా   ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు త‌రాల‌ వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది. ఔను నారాచంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, వారి వారసుడు దేవాన్ష్ లు సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో  చేసే సందడే సందడి. గ్రామస్తులతో మమేకమై పండుగ జరుపుకుంటారు. దీంతో తాతా, తండ్రి, మనవడు ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో ఒకే సారి కనిపించే అరుదైన, అపురూపమైన దృశ్యం నారావారి పల్లె వాసులకు దక్కుతుంది.   ఇక ఈ ఏడాది నారావారి పల్లె సంక్రాంతి సంబరాల్లో  నారా దేవాంశ్ ఆట పాట‌ల‌తో దేవాన్ష్ తల్లిదండ్రులు, తాతా నానమ్మలు మురిసిపోయారు. వారి మురిపెం చూసి నారావారిపల్లె పులకరించిపోయింది. అదలా ఉంటే  వైయ‌స్ స్వ‌స్త‌లం  పులివెందుల‌, ఇక కేసీఆర్ స్వ‌స్థలం చింత‌ మ‌డ‌క ఇంకా ఎంద‌రో నాయ‌కుల స్వ‌స్థలాలు ఉన్నాయి. అయితే అక్కడెక్కడా కనిపించని సంక్రాంతి సందడి, శోభ  ఒక్క నారావారి ప‌ల్లెలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. దీంతో ఈ ఊరి భాగ్య‌మే భాగ్యం క‌దా? అనిపిస్తుంది. ఈ ఏడాది నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ రాలేదు కానీ,  కానీ ఆయ‌న స‌తీమ‌ణి, కుమార్తె తెజస్విని, అల్లుడు, ఎంపీ శ్రీభరత్ వచ్చారు.   ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటంటే.. నారావారి పల్లెలో చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం అధికారంలో ఉన్న‌పుడు మాత్ర‌మే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా జరుపుకుంటారు. స్వగ్రామంలో ప్రజలలో మమేకమై పండుగ జరుపుకోవడం ఆయన ఎప్పటి నుంచో పాటిస్తున్న ఆచారం. ఆనవాయితీ.     జ‌ననీ జ‌న్మ‌భూమిశ్చ స్వ‌ర్గాద‌పీ గ‌రీయ‌సీ   అంటారు.  అలా సొంతూరికి ఇంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకురావ‌డం కూడా ఒక ఘ‌న‌తే. అలాంటి ఘ‌న‌త సాధించిన చంద్ర‌బాబు  స్వ‌స్థ‌లం నారావారిప‌ల్లె అదృష్ట‌మే అదృష్టం క‌దా? అన్న మాట వినిపిస్తోంది.

శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బుధవారం ( జనవరి 14) సాయంత్రం మకరజ్యోతి దర్శనం కనువిందు చేసంది. అశేష భక్తజన సందోహం మధ్య అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శన మిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు.  అంతకుముందు.. పందళం రాజప్రాసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి  అలంకరించారు. అనంతరం, ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక దీపా రాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోయాయి. అయ్యప్ప భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.  మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం  బోర్డు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.  

పండుగ వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆనందహేల

సంక్రాంతి పండుగ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డబుల్ ఆనందం తీసుకువచ్చింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వోద్యుగులు, పెన్షనర్స డీఏ, డీఆర్ బకాయిలను వారి ఖాతాలో జమ చేసింది. వీరితో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించింది. ఇందు కోసం 26 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వారి వారి ఖాతాలలో జమచేయడం వల్ల ఒక్కొక్కరి ఖాతాలో 30 నుంచి 60 వేల వరకూ జమ అయ్యాయి. ప్రభుత్వం ఈ బకాయిలను సరిగ్గా భోగి పండుగ రోజున విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలలో  సంక్రాంతి సంతోషం రెట్టింపైంది.   దాదాపు ఆరేళ్ల తరువాత ఈ బకాయిలు విడుదలయ్యాయి.    అలాగే పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. న  పండగ పూట బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

మహిళలను కించపరచడం అమానుషం : సీపీ సజ్జనార్

  ప్రజా జీవితంలో మహిళలను కించపరచడం అమానుషమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు సమాజ పురోగతికి గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం అని ఎక్స్ వేదికగా సీపీ పేర్కొన్నారు.  టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు ఖండించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని తెలిపారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుందని పేర్కొన్నారు. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించమని సజ్జనార్ హెచ్చరించారు.  మన పురాతన ధర్మం "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" (ఎక్కడ మహిళలు పూజించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అని చెబుతోంది. కానీ నేటి కాలంలో మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం  మన నాగరికతనే ప్రశ్నిస్తోందన్నారు. ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్ అని భవిష్యత్ అంతా మహిళలదే అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఐఏఎస్ అధికారిణిపై అవాస్తవాలను ప్రచారం చేసిన కేసులో తెలంగాణలో వరుస అరెస్టులు జరగడం సంచలనంగా మారింది.

ములుగు జిల్లా రద్దు కాదు...మంత్రి సీతక్క క్లారిటీ

  జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. జిల్లా కోసం పోరాడి ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తామన్నారు. కొత్త జిల్లాలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని, శాస్త్రీయ పద్దతిలో స్వల్ప మార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రజలు ఆందోళన పడొద్దని సీతక్క సూచించారు.  పలు యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లేందుకే ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లాలో ఒక మండలం ఉంటుంది.. అందులోని ఐదు గ్రామాలు పక్కన భూపాలపల్లి జిల్లాలో ఉంటాయిని మంత్రి తెలిపారు. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయి... రెవిన్యూ, పోలీసు సరిహద్దులు ఒకే లాగా ఉండాలని తెలిపారు. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది .అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పారని ఆమె తెలిపారు.