ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

 

 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న  కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రేపే మేడారం మహా జాతర... భారీగా ఏర్పాట్లు

  మేడారం మహా జాతరకు తొలి ఘట్టం రేపు జరగనుంది. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి సంకేతంగా గుడిమెలిగే (శుద్ది పండుగ) క్రతువును పూజారులు నిర్వహించనున్నారు. పూజారులు తమ ఇళ్లతో పాటు మేడారంలోని వనదేవతల గద్దెలను శుద్ది చేస్తారు. అనంతరం అడవికి వెళ్లి గుట్ట,పుట్ట మట్టిని సేకరించి, గద్దెలకు చేరుకోని అలుకుపూతలు నిర్వహిస్తారు. దీంతో జాతర మొదలైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. మేడరం భక్తుల కోసం "MyMedaram" పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు.  7658912300 నంబర్‌కు మేసేజ్ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చును. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనంగా వసూలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. మరోవైపు  జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్  రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు.  తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు.     ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని సీతక్క వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.  

తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

  సంక్రాంతి సందర్బంగా గ్రామ పంచాయితీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్దిక శాఖ విడుదల చేసింది. ఈ సందర్బంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా రిలీజ్ చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానా : సుప్రీం కోర్టు

  వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. వీధి కుక్కల అంశంపై  సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  తాజాగా దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.  కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.  ఈ సందర్భంగా వీధికుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే.. అప్పుడు ఎవన్ని దానికి బాధ్యుల్ని చేయాలని ప్రశ్నించింది.  వీధికుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని, లేదంటే కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలపై తాము నిర్ధేశించే భారీ పరిహారాలను చెల్లించాని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  

మ్యాచ్‌ల వేదికలపై బీసీబీ వినతులకు ఐసీసీ నో

  బంగ్లాదేశ్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్‌ నుంచి తరలించాలనే బంగ్లా క్రికెట్‌ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ అంగీకరించే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని ఐసీసీ సూచన ప్రాయంగా వెల్లడించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భద్రతా నిపుణులతో ఐసీసీ రిస్క్‌ అంచనా విభాగం సర్వే చేయించింది. భారత్‌లో బంగ్లా మ్యాచ్‌లకు ముప్పు వాటిల్లే పరిస్థితి లేదని ఆ నిపుణులు తేల్చారని ఐసీసీ సోమవారం ప్రకటించింది. మొత్తంగా టీ20 వరల్డ్‌ కప్‌నకు భారత్‌లో రిస్క్‌ తక్కువగా, పరిమితంగా ఉందని నిపుణులు తేల్చారని, ప్రపంచ స్థాయి టోర్నీల భద్రత ప్రొఫైల్‌ ఇలాగే ఉంటుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.  భారత్‌లోని ఏ వేదిక వద్దా బంగ్లాదేశ్‌ అధికారులకు సైతం ఎలాంటి ముప్పు లేదని నిపుణులు నిర్ధారించినట్టు సమాచారం. ఐపీఎల్‌లో కేకే‌ఆర్ నుంచి  స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు తొలగించడం బంగ్లాదేశ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. భారత్‌లో బంగ్లాదేశ్ వ్యతిరేక భావనలు ఉన్నాయని, కాబట్టి తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరుతుంది

అగ్నిప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించండి : సీఎం చంద్రబాబు

  కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 26 గిరిజన గుడిసెలు పూర్తిగా కాలి బూడిద కాగా, 33 కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు ఒక్కసారిగా సర్వం కోల్పోయి తీవ్ర ఆందోళనలో మిగిలిపోయాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.25,000 చొప్పున నగదు అందించడంతో పాటు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం, అవసరమైన సాయాన్ని కల్పించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వపు పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ ఎస్.వి. నరేశ్ మాట్లాడుతూ, 33 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు సహాయం పంపిణీ చేసినట్టు తెలిపారు. బాధితులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఆహారం, నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

గ్రీన్‌లాండ్ విలీనానికి అమెరికా సెనెట్‌లో బిల్లు

  డెన్మార్క్ దేశంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లు ప్రవేశపెట్డాడు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకోవడానికి ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ అభిప్రాయపడ్డాడు.  అమెరికా విరోధులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అలా జరగనివ్వబోమ్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాలను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వ్యాఖ్యానించారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరకా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్ నుంచి దూరం చేయడానికి అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయడానికి ప్రయత్నించారని ప్రచారం జరిగింది.   అయితే యూఎస్ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్  స్పష్టం చేశారు. నాటో దేశాలు సైతం యూఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా వెనకడుగు వేయని ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనానికి పావులు కదుపుతూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.  

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది : ఆర్మీ చీఫ్ ద్వివేది

  పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత ఏడాది చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'  కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. 2026లో తొలిసారి ద్వివేది మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎలాంటి పొరపాట్లు చేసిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఆర్మీ మోహరించిన బలగాలు భూతల దాడులు చేసేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు.  జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా-రాజౌరి సెక్టార్‌లో తాజాగా పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సంచారాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ, ఈ అంశం మంగళవారం నాడు పాకిస్థాన్‌తో డీజీఎంఓ స్థాయిలో ప్రస్తావనకు వచ్చిందని, పాక్‌ను కంట్రోల్‌లో ఉండాల్సిందిగా చెప్పామని అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందన్నారు.  జమ్మూకశ్మీర్‌లో జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11,12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని చెప్పారు. అవి చాలా చిన్న డ్రోన్‌లని, లైట్లు వెలుగుతూ తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని, డిఫెన్సివ్ డ్రోన్‌లు కావచ్చని అన్నారు. పాక్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని,  వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయని ద్వివేదీ పేర్కొన్నారు.  ఎలాంటి కదలికలు కానీ శిక్షణా కార్యకలాపాలు కానీ ఉన్నట్టు గుర్తించినట్లయితే అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంమని స్పష్టం చేశారు. కవ్వింపు చర్చలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పాక్‌ను హెచ్చరించారు.

ఏపీలో బార్లు, వైన్ షాపుల్లో ఇకపై ఒకే ధరకు మద్యం

  ఏపీ ఎక్సైజ్ పాలసీలోరాష్ట్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు,  బార్ల వినియోగదారులకు ఊరటనిచ్చేలా బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక అలర్ట్‌నీ తొలగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం.. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల్లో ధరల కంటే బార్లలో ప్రతి క్వార్టర్ మందుపై రూ.50 నుంచి రూ.60 వరకు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేశారు. ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండవు. వైన్‌షాపుల్లో, బార్లలో ధరలు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్‌పై అదనపు పన్ను విధింపు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.   ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తూ, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు, బారులకు వెళ్లే మందుబాబులకు పెద్ద ఊరటగా మారనుంది. ఇలాంటి మార్పులతో బార్ల వ్యాపారులకు గణనీయంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.  డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, APSBCL అధికారులు ఈ మార్పుల అమలుకు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి (2026 జనవరి 13) నుంచి అమలులోకి వస్తాయి. గతంలో బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుండటం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తేది. ఇప్పుడు ధరల సమానత్వంతో బార్లకు బిగ్ రిలీఫ్‌ అనే చెప్పుకోవచ్చు.

మహిళా ఐఏఎస్ అధికారి లక్ష్యంగా అనుచిత పోస్టుల కేసు దర్యాప్తునకు సజ్జనార్ నాయకత్వంలో సిట్

మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని కొన్ని న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేడయం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడాయాలో పోస్టు చేసిన కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ రెండు కేసులనూ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో లోతైన దర్యాప్తునకు  డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన  సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహిస్తారు.   సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన  కావలి వెంకటేశ్‌ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేత గుళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు  నారాయణపేట జిల్లాలో కేసు నమోదైంది.   మరోవైపు, ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ  రెండు న్యూస్‌ చానళ్లతో పాటు పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో  ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్  ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.   ఈ రెండు కేసులనూ సిట్ దర్యాప్తు చేయనుంది. 

కాంగ్రెస్‌లో కల్వకుంట్ల కవితకు నో ఎంట్రీ : టీ పీసీసీ చీఫ్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తేల్చిచెప్పారు.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు.  మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్.. కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి ఒక జిల్లా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని మండిపడ్డారు.  శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయాలని కమిటీ వేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ను ఎవరు ముట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గాబరాపడుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలన్నారు. పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.