టిఆర్ఎస్ లోకి కోమటి రెడ్డి ?

 

 

 

తెలంగాణా రాష్ట్రం కోసం తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. ఒక వేళ పార్టీ మారాల్సి వస్తే, ప్రత్యెక రాష్ట్రం కోసం పని చేసే తెలంగాణా రాష్ట్ర సమితి వంటి పార్టీల్లోకి వెళ్తాను తప్ప జగన్ పార్టీలో మాత్రం చేరానని ఆయన అన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం ఇంత వరకూ జరిగేది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, అవి జగన్ పార్టీలోకి చేరడానికేననే ప్రచారాలు కూడా జరిగేవి. ఆయనకు వైఎస్ రాజ శేఖర రెడ్డి తో సంభందాలు బలంగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. ఆయన మృతి తర్వాత కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాను జగన్ పార్టీలోకి వెళ్లనని ఆయన చాలాసార్లు చెప్పినా ఆ ప్రచారం మాత్రం ఆగలేదు.

 

అయితే, తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశం తర్వాత కోమటి రెడ్డి తన అభిప్రాయాన్ని మార్చుకొన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం కోసమే తాను రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత, తెలంగాణా వాదులు నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న జగన్ పార్టీలో చేరితే ప్రజలు హర్షించరనే కారణంతోనే ఆయన టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఈ తాజా ప్రకటనతో జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.