మంత్రుల విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరంలేదు: సిబిఐ
posted on Jan 1, 2013 @ 9:55AM
జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంభందించిన కేసులో నిందితులుగా ఉన్న రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావులఫై ఉన్న అభియోగాలను అవినీతి నిరోధక చట్టం కింద విచారణ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదించింది.
2004 లో శాసన సభ్యులుగా ఉండి వీరిద్దరూ మంత్రులుగా పని చేసారని అయితే, 2009 లో ఆ అసెంబ్లీ రద్దవడంతో వారికి ప్రజా సేవకుల హోదా వర్తించదని సిబిఐ కోర్టులో వాదించింది. వారి ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని అందువల్ల వారిఫై ఉన్న అభియోగాలఫై అవినీతి నిరోధక చట్టం లోని కొన్ని సెక్షన్ల ప్రకారం విచారణకు స్వీకరించాలని సిబిఐ ప్రత్యెక కోర్టును కోరింది.
గతంలో సుప్రీం కోర్టు ఆభాయ్ సింగ్ చౌతాలా కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రస్తుతం వీరి ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది.
వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 4 వ తేదీకి వాయిదా వేసారు. అదే రోజు కోర్టుకు హాజరవ్వాలని కూడా న్యాయమూర్తి ధర్మాన, మోపిదేవిలను ఆదేశించారు.