హస్తినలో గవర్నర్ కీలక మంతనాలు

రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయ్. ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఓ పక్క జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు రక్షణ కల్పించాలి. మరో పక్క తెలంగాణ మార్చ్ గొడవ. ఇంకోవైపు గణేష్ నిమజ్జనోత్సవాలు. ప్రభుత్వం కోదండరామ్ ని గెడ్డం పట్టుకుని బతిమిలాడినా మార్చ్ ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం గడగడలాడుతోంది. ఏం జరిగినా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనుక భద్రత విషయంలో కాంప్రమైజ్ కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రిసహా మంత్రులందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నరసింహన్.. రాష్ట్రపతి ప్రణబ్, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం లను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెలంగాణ విషయంలో ఓ ప్రకటన చేస్తేనే తప్ప మార్చ్ ని విరమించుకునేది లేదని తెలంగాణ వాదులు భీష్మించుక్కూర్చున్న విషయాన్నికూడా నరసింహన్ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనికితోడు ఘనత వహించిన ఓ వలసదొరకూడా తన మనుగడకోసం హస్తినలో మకాం వేసి ఏదో ఒక ప్రకటన చేయమని కాంగ్రెస్ అధిష్టానాన్ని బతిమిలాడుకుంటున్నారన్న వార్తలుకూడా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలో ఓ ప్రకటన చేయబోతోందన్న ఆశలకు ప్రాణం పోస్తున్నాయి.