రాహుల్‌ అంతర్జాతీయనేత..! సోనియా విశ్వమాత...!

ఎవరి గొప్ప వారు చెప్పుకోవడంలో ఎవరికెవరూ తీసిపోరని మోడీ. రాహుల్‌ స్థాయిల విషయంలో చోటు చేసుకున్న మాటల యుద్ధం రసపట్టుగా మారింది! వ్యక్తి పూజకే అగ్రతాంబూల మిచ్చే కాంగ్రెస్‌లో పొగడ్తలు శృతి మించిపోతున్నాయ్‌! బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మన్మోహన్‌ రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటును స్తంభింపజేసిన బి.జె.పి అంటే కాంగ్రెస్‌ నేతలు గుర్రుగానే ఉన్నారన్నది నిజం! తమ నాయకుల మనసులో చెలరేగిపోతున్న అలజడిని గమనించిన కొందరు కార్యకర్తలు ఆ కచ్చను గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్ర మోడిపై వెళ్ళగక్కడానికి ప్రయత్నిస్తూ తమ నేత రాహుల్‌ గాంధీ జాతీయ నాయకుడైతే, మోడీ కేవలం ప్రాంతీయ నాయకుడంటూ తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు! అందుకు మోడీ స్పందిస్తూ `తాను నిజంగానే ప్రాంతీయ నాయకుడినేనని ఒప్పేసుకుంటూ రాహుల్‌ గాంధీ మాత్రం అంతర్జాతీయ నాయకుడనీ, ఆయన ప్రపంచంలో ఎక్కడినుంచైనా పోటీ చేస్తారనీ, అవసరమైతే ఇటు భారత్‌, అటు ఇటలీ ఎన్నికల్లోనూ పోటీ చేసెయ్యగల రంటూ సెటైర్‌ విసిరారు! ఆ వ్యాఖ్యకు ఎలాస్పందించాలో ఆర్థం కాక తల నెరసిన పెద్ద నాయకులు తలలు పట్టుకుకూర్చుంటే `ఛోటా నాయకులు మాత్రం మోడీ వ్యాఖ్యలపై స్పందించకపోతే తమ పరువేంగావాలనుకున్నారో ఏమో గానీ `రాహుల్‌ గాంధీ ప్రపంచ దేశాలను ప్రభావితం చెయ్యగల అంతర్జాతీయ నాయకుడేనని చెప్పేస్తున్నారు! ఇంతటితో వీళ్ళు ఊరుకుంటారా...? లేక మరో అడుగు ముందుకేసి సోనియమ్మ విశ్వమాతంటూ కితాబిచ్చి `ఆమె ఏ గ్రహంలోనైనా పోటీ చేసేస్తారంటూ చెప్పేస్తారో వేచిచూడాల్సిందే!  ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు మోడీపై చెళుకు లెయ్యాలని ప్రయత్నిస్తే సోనియా విదేశీయత వివాదం మరోసారి తెరమీదికి తెస్తున్నట్లవుతోంది కదూ...!